సాక్షి, భీమవరం/ తణుకు అర్బన్: సంచలనం కలిగించిన ఎస్సై ఆత్మహత్య ఘటనలో బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధమైంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో, ఎస్సై సెల్‌ఫోన్‌లో లభ్యమైన సమాచారాన్ని బట్టి చర్యలకు ఉన్నతాధికారులు ఉపక్రమించినట్టు తెలుస్తోంది. తణుకు రూరల్ ఎస్సైగా పనిచేసి వీఆర్‌లో ఉన్న ఏజీఎస్ మూర్తి గతనెల 31న స్టేషన్‌కు వచ్చి తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆయన సెల్‌ఫోన్‌ను పై అధికారులు స్వాధీనం చేసుకోవడం వివాదాస్పదమైంది. తన ఆత్మహత్యకు బాధ్యుల వివరాలను ఎస్సై మూర్తి సెల్‌లో టైప్ చేశారని, ఆ సమాచారం బయటపెట్టాలని ఆయన సహచర ఎస్సైలు స్టేషన్ లోపల పైఅధికారులతో వాగ్వావాదానికి దిగడం బయట ఉన్న వారికి వినిపించింది. ఇదిలా ఉండగా ఎస్సై మూర్తి ఆత్మహత్యకు పాల్పడే ముందు తన స్నేహితునితో మాట్లాడినట్టుగా ఒక ఆడియో నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో తనను మోసం చేసిన వారంతా హ్యాపీగా ఉన్నారని, సీఐలు కృష్ణకుమార్, నాగేశ్వరరావు చేసిన పనికి ఈరోజు ఇలా అయిపోయానని, తనను ఇబ్బంది పెట్టవద్దని వారిని వేడుకున్నా.. లేదు లేదు ఎమ్మెల్యే గారు చెప్పారు కదా? అదీఇదీ అంటూ తన జీవితాన్ని నాశనం చేశారని మూర్తి కుమిలిపోతున్నట్టుగా ఉంది. రాజకీయ నాయకుల ఒత్తిళ్లు తాళలేక, తాను చేయని తప్పునకు బాధ్యుడిని చేసి ఇబ్బందులు పెడుతున్నారన్న బాధతో ఎస్సై మూర్తి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీస్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే కిందిస్థాయి సిబ్బందిలో అభద్రతా భావం పెరుగుతుందన్న ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో వచ్చిన ఆడియోలోని వివరాలతో పాటు సెల్‌ఫోన్‌లో సమాచారం ఆధారంగా ఉన్నతాధికారులు లోపాయికారీగా శాఖాపరమైన చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. కేసుకు సంబంధించి ఏ సమాచారం బయటకు రాకుండా పోలీసులు రహస్యంగా విచారణ జరిపిస్తున్నారు. ఒక సీఐ ఇప్పటికే వీఆర్‌లో ఉండగా, మరో సీఐను సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించినట్టు తెలుస్తోంది. సదరు సీఐ బుధవారం విధులకు హాజరుకాలేదని, మరికొందరిపైనా చర్యలు ఉంటాయని సమాచారం.
ఇప్పటికే వీఆర్‌లో ఒకరు, సెలవులోకి మరొకరు?
దిగువస్థాయి సిబ్బంది తీరుపైనా అనుమానాలు
ఎస్సై మూర్తి ఆత్మహత్య ఘటనలో తాజా పరిణామాలు
Comments
Please login to add a commentAdd a comment