ఏలూరు టౌన్: లంచం డిమాండ్ చేసిన ఏలూరు ఫుడ్‌సేఫ్టీ అధికారి, ఆఫీస్ అటెండర్‌ను ఏలూరు అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏలూరు అభివృద్ధి నిరోధక శాఖ డీఎస్పీ వి.సుబ్బరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు మండలం కాట్లంపూడి గ్రామానికి చెందిన సాయి సుందర్ గోకుల్ అదే ప్రాంతంలో ఊప్స్ గోలీ సోడా కంపెనీ పేరుతో గోలీ సోడాను తయారు చేస్తున్నాడు. గోలి సోడా తయారీలో అధికంగా రసాయనాలు వినియోగిస్తున్నట్లు గుర్తించామనీ ఏలూరు ఫుడ్‌సేఫ్టీ అధికారి దొండపూడి కావ్యరెడ్డి, కార్యాలయ అటెండర్ పుల్లారావు గోకుల్‌కు ఫోన్ చేసి చెప్పారు. విక్రయాలు సాఫీగా సాగాలంటే రూ.25 వేల లంచం డిమాండ్ చేశారు. ఎట్టకేలకు ఫుడ్‌సేఫ్టీ అధికారికి రూ.20 వేలు, సహాయకుడికి రూ.2 వేలు ఇచ్చేందుకు గోకుల్ సిద్ధపడ్డాడు. ఈ నేపథ్యంలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు డబ్బులు కోసం వేధించటంతో గోకుల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో లంచం సొమ్మును ఫుడ్‌సేఫ్టీ అధికారి డి.వెంకట కావ్య రెడ్డికి, అటెండర్ పులపా పుల్లారావుకు గోకుల్ కార్యాలయంలో అందించాడు. అప్పటికే అవినీతి నిరోధక శాఖ అధికారులు వల పన్ని ఉండటంతో వెంటనే వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఫుడ్‌సేఫ్టీ అధికారి కావ్యరెడ్డి, అటెండర్ పుల్లారావు నుంచి రూ.22 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫుడ్‌సేఫ్టీ అధికారి వినియోగిస్తున్న కారును తనిఖీ చేయగా లెక్కలు లేకుండా ఆరు కట్టలుగా కట్టి ఉన్న మరో రూ.87 వేల నగదును గుర్తించారు. మొత్తంగా రూ.లక్షా 9 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఫుడ్‌సేఫ్టీ అధికారి, అటెండర్ ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏలూరు ఏసీబీ డీఎస్పీ వీ.సుబ్బరాజు, సీఐలు ఎన్.బాలకృష్ణ, కే.శ్రీనివాస్, రాజమహేంద్రవరం ఏసీబీ అధికారి వాసుకృష్ణ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment