నల్లగొండ డీఈఓపై ఏఎస్పీకి ఫిర్యాదు
నల్లగొండ క్రైం: నల్లగొండ జిల్లా విద్యాధికారి బొల్లారం భిక్షపతిపై ఆయన మొదటి భార్య మాధవి మంగళవారం ఏఎస్పీ రాములునాయక్‌కు ఫిర్యాదు చేశారు. తనకు విడాకులు ఇవ్వకుండానే డీఈఓ భిక్షపతి సునీత అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ము గ్గురు పిల్లలను కన్నాడని, తనకు న్యాయం చేయాలని నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని, కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన టూటౌన్ ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని ఆమె ఏఎస్పీని కోరారు. ఎస్‌ఐ తన పైనే అక్రమంగా కేసు నమోదు చేశారని తెలిపారు. విడాకుల పిటిషన్ కోర్టులో ఉండగా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న డీఈఓ భిక్షపతిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
లైంగిక దాడిపై విచారణ
ఆత్మకూరు(ఎం): మండలంలోని రహీంఖాన్‌పేటలో సోమవారం బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటనపై సీఐ ఎన్. వెంకటేశ్వర్లు విచారణ చేపట్టారు. మంగళవారం ఆయన గ్రామాన్ని సందర్శించి ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆయన వెంట ఎస్‌ఐ ఎస్. కృష్ణయ్య ఉన్నారు.
అక్రమంగా తరలిస్తున్న ఆవుల పట్టివేత
ఫ ఇద్దరిపై కేసు నమోదు
చౌటుప్పల్ రూరల్: బొలేరోలో అక్రమంగా తరలిస్తున్న ఆవులను మంగళవారం చౌటుప్పల్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా తుని నుంచి హైదరాబాద్‌లోని కబేళాకు బొలేరో వాహనంలో ఆవులను తరలిస్తుండగా.. చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామ స్టేజీ వద్ద పోలీసులు పట్టుకున్నారు. వాహనంలో 11 ఆవులు, 4 ఎద్దులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాహనం డ్రైవర్ ఆకునూరి రాజు, యాజమాని రాజుపై కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. పట్టుబడిన ఆవులను హైదరాబాద్‌లోని జియాగూడ గోశాలకు తరలించినట్లు పేర్కొన్నారు.
రెండు ఇళ్లలో చోరీ
మేళ్లచెరువు: మండల కేంద్రంలోని చౌదరిబజార్‌లో నివాసముంటున్న బొగ్గవరపు శ్రీను, సతీష్ ఇళ్లలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పట్టపగలే ఇళ్ల తాళాలు పగులగొట్టి రూ.75వేల నగదు, ల్యాప్‌టాప్ ఎత్తుకెళ్లినట్లు బాధితులు పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైంది
సంస్థాన్ నారాయణపురం: ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని జనగామ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో గణిత ఉపాధ్యాయుడు నాగభూషణం ఉద్యోగ విరమణ కార్యక్రమానికి మంగళవారం ఆయన హాజరై నాగభూషణం, ఉమారాణి దంపతులను శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యా విధానంలో మార్పులు రావాలని ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చెందాలని దీనిపై ప్రభుత్వం తగిన విధంగా ఆలోచన చేయాలన్నారు. కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, ఎంఈఓ గోలి శ్రీనివాస్, పాఠశాల హెచ్‌ఎం కత్తుల ఉదయ, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మిర్యాల దామోదర్, ముక్కేర్ల యాదయ్య, రామకృష్ణారెడ్డి, చలపతిరెడ్డి, అనుముల శ్రీనివాస్, గాంధీ గుడి అర్చకుడు కూరెల్ల నరసింహచారి, కానుగుల వెంకటయ్య, మోటే సత్తయ్య, జంగయ్య, కిశోర్, మురళి, ఇంద్రసేనారెడ్డి తదితరలున్నారు.
సూర్యక్షేత్రంలో
కార్తీకమాస వేడుకలు
అర్వపల్లి : మండల పరిధిలోని తిమ్మాపురం సూర్యక్షేత్రంలో మంగళవారం కార్తీకమాస వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. అలాగే క్షేత్రంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకుడు, సూర్య ఆరాధకుడు జనార్దన్‌స్వామి, నరేష్, ఇంద్రారెడ్డి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment