భూసార పరీక్షలు చేయించి ఎరువులు వేయాలి
పెన్‌పహాడ్: భూసార పరీక్ష ఫలితాల ఆధారంగానే మిరప పంటలో ఎరువుల యాజమాన్యం చేపట్టాలని కేవీకే శాస్త్రవేత్త ఎ. కిరణ్ తెలిపారు. బుధవారం పెన్‌పహాడ్ మండల పరిధిలోని గాజులమల్కాపురం గ్రామంలో నల్లబోతు వెంకటరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని కేవీకే శాస్త్రవేత్తలు సందర్శించారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్త ఎ. కిరణ్ మాట్లాడుతూ.. భూసారం పెంచడానికి వివిధ రకాల ఎరువులను మోతాదుకి మించి వాడడం వలన పోషకాల అసమతుల్యత ఏర్పడి పంట దిగుబడులు తగ్గుతున్నాయన్నారు. భూ భౌతిక స్థితులు దెబ్బతిని నేలలు చౌడు బారుతున్నాయి. ఈ సమస్యలను అదిధమించడానికి నేల స్థితిగతులను తెలుసుకొని సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు ఆదర్శ్, కిరణ్, రైతులు రణబోతు వీరారెడ్డి, నాతాల వెంకటరెడ్డి, బండి శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, బండి సత్యావతి, వ్యవసాయ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఎనిమిది బోరు
మోటార్లు చోరీ
రామన్నపేట: రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో మంగళవారం రాత్రి పలువురు రైతుల వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్లను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన పలువురు రైతులు తమ పొలాలకు నీరు పెట్టేందుకు గాను గ్రామంలోని పెద్దచెరువు సమీపంలో బోరు మోటార్లను ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎనిమిది మోటార్లను ఎత్తుకెళ్లారు. మరికొంత మంది రైతులకు చెందిన కేబుల్ వైర్లను కట్ చేసి తీసుకెళ్లారు. బాధిత రైతులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గతంలోనూ కూడా గ్రామ పరిధిలోని వ్యవసాయ మోటార్ల వైర్లను దొంగలు అపహరించుకుపోయారు. పోలీసులు గట్టి నిఘా ఏర్పాటుచేసి దొంగతనాలను నివారించాలని రైతులు కోరుతున్నారు.
ఆగి ఉన్న కంటెయినర్‌ను ఢీకొని వ్యక్తి దుర్మరణం
మోతె: ఆగి ఉన్న కంటెయినర్‌ను బైక్ వెళ్తున్న వ్యక్తి ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన మోతె మండలం మామిళ్లగూడెం టోల్‌గేట్ వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలంలోని కుడకుడ గ్రామానికి చెందిన ఎస్‌కే నజీర్ బాబా(40) మంగళవారం అర్ధరాత్రి ఖమ్మం నుంచి సూర్యాపేటకు బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో మోతె మండలం మామిళ్లగూడెం టోల్‌గేట్ వద్ద ఆగి ఉన్న కంటెయినర్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నజీర్ బాబా అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మోతె ఎస్‌ఐ యాదవేందర్‌రెడ్డి తెలిపారు.
మట్టపల్లిలో విశేషారాధనలు
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలోని శ్రీప్రహ్లాద యోగానంద శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి బుధవారం విశేషారాధనలు కొనసాగాయి. ఉదయం సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం, ప్రత్యేకార్చనలు చేశారు. అనంతరం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని నూతన వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం చేపట్టారు. ఆ తర్వాత కల్యాణ తంతును వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణి భూషణమంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment