నేడు, రేపు సీపీఎం నిరసన కార్యక్రమాలు
భువనగిరిటౌన్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సోమ, మంగళవారం రెండు రోజుల పాటు సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ తెలిపారు. శనివారం భువనగిరిలోని సీపీఎం కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్, రాజ్యాంగం పట్ల అమిత్‌షాకు ఏమాత్రం గౌరవం ఉందో పార్లమెంట్ సాక్షిగా ఆయన చేసిన వ్యాఖ్యలతో బట్టబయలు అయిందన్నారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మార్చాలని, మనువాద సిద్ధాంతం తీసుకురావాలని కుట్ర చేస్తుందన్నారు. మండల, గ్రామీణ స్థాయిలో సీపీఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరిటౌన్ : మైనార్టీ మహిళలు స్వయం ఉపాధి పొందడానికి ఇందిరమ్మ మహిళాశక్తి పథకంలో భాగంగా కుట్టు మిషన్లు అందజేసేందుకు మైనారిటీ కార్పొరేషన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 5వ తరగతి చదివి, కుట్టుశిక్షణ పొంది, 18 నుంచి 55 ఏళ్లలోపు వయస్సుగల నిరుద్యోగ మైనారిటీ మహిళలు అర్హులని అధికారులు పేర్కొన్నారు. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణల్లో రూ.2 లక్షలు ఉండాలన్నారు. http://tgo bm-mrcff.gov.in/ ద్వారా డిసెంబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వ్యక్తిగత వివరాలతో పాటు ఆధార్, విద్య, జనన, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు టైలరింగ్ సర్టిఫికెట్ జతజేయాలని సూచించారు.
స్వర్ణతాపడానికి విరాళం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య విమానగోపురానికి ఎన్‌ఆర్‌ఐ అగ్గనూరు శివరామకృష్ణగౌడ్, స్వప్న దంపతులు లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. దేవస్థానం ఈఓ భాస్కర్‌రావును కలిసి చెక్కు అందజేశారు. అంతకుముందు వారు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఇక మిర్యాలగూడకు చెందిన సైదిరెడ్డి స్వామివారి నిత్యాన్నదాన పథకానికి 2 వేల కిలోల బియ్యం అందజేశారు.
పాస్‌పోర్టు సేవలను సద్వినియోగం చేసుకోవాలి
భువనగిరి : పట్టణంలోని పోస్టాఫీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాస్‌పోర్టు సేవలను సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ పాస్‌పోర్టు ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం ఆయన పాస్ పోర్టు కార్యాలయాన్నిసందర్శించారు. రోజూ 40 నుంచి 45 వరకు స్లాట్ బుకింగ్ జరుగుతున్నాయని, వీటి సంఖ్య 90కి పెంచే విధంగా పరిశీలిస్తామని తెలిపారు. కార్యాలయంలో అందజేస్తున్న సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ జోన్నలగడ్డ స్నేహజ, అధికారులు అనిల్‌కుమార్, హరికృష్ణ, పోస్ట్‌మాస్టర్ రమేష్, శ్యాం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment