మోగిన నగారా | - | Sakshi
Sakshi News home page

మోగిన నగారా

Published Thu, Jan 30 2025 1:38 AM | Last Updated on Thu, Jan 30 2025 1:38 AM

మోగిన నగారా

మోగిన నగారా

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు
షెడ్యూల్‌ విడుదల చేసిన ఎన్నికల సంఘం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ప్రస్తుత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఆలోపే ఎన్నిక నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. 27న పోలింగ్‌ జరుగనుంది. మార్చి 3వ తేదీన కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించనున్నారు. మార్చి 8వ తేదీతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.

ముమ్మరం కానున్న ప్రచారం

ఉపాధ్యాయ సంఘాలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. ఇంకా కొన్ని సంఘాలు చేయాల్సి ఉంది. ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డినే యూటీఎఫ్‌ తమ అభ్యర్థిగా ప్రకటించింది. పీఆర్‌టీయూ–టీఎస్‌ అభ్యర్థిగా పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీజేపీ అనుబంధ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్‌) తరఫున పులి సరోత్తంరెడ్డి ఖరారయ్యారు. ఇక కాంగ్రెస్‌ నుంచి అధికారికంగా ఇంతవరకు ఎవరికి మద్దతు ప్రకటించలేదు. అయితే, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. ఆర్‌యూపీపీ, ఎస్‌ఎల్‌టీఏ తదితర ఉపాధ్యాయ సంఘాలు ఆయనకు మద్దతు ప్రకటించాయి. టీపీయూఎస్‌ అధ్యక్షునిగా పనిచేసిన సాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ కూడా పోటీ చేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వారంతా ఉపాధ్యాయులను, సంఘాల నేతలను కలుస్తూ మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. వరంగల్‌కు చెందిన సుందర్‌రావు కూడా పోటీచేయనున్నట్లు తెలిసింది.

పెరిగిన ఓటర్లు

ఈసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య పెరిగింది. గతంలో 22,554 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం అది 24,905కు చేరుకుంది. ఎన్నికల సంఘం గత సంవత్సరం డిసెంబరు 30న తుది ఓటరు జాబితాను ప్రకటించింది. మొత్తం అర్హులైన ఉపాధ్యాయ ఓటర్లు 24,905 మంది ఉండగా, అందులో మహిళ ఓటర్లు 9965 కాగా, పురుష ఓటర్లు 14,940 మంది ఉన్నారు.

అధికారిక ప్రారంభోత్సవాలకు బ్రేక్‌

కోడ్‌ అమల్లోకి రావడంతో అధికారిక ప్రారంభోత్సవాలకు బ్రేక్‌ పడనుంది. సాధారణ ఎన్నికలకు వర్తించే అన్ని రకాల నిబంధనలు ఈ ఎన్నికల్లోనూ అమల్లో ఉంటాయి. ఓటర్లను ప్రభావితం చేసేలా విధానపరమైన నిర్ణయాలు, ప్రాజెక్టులు, పథకాలు ప్రారంభించడానికి వీల్లేదు. బదిలీలు, నియామకాలు చేపట్టడానికి అవకాశం ఉండదు.

ఫ ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్‌

ఫ 27న పోలింగ్‌, మార్చి 3న కౌంటింగ్‌

ఫ మార్చి 29వ తేదీతో ముగియనున్న ప్రస్తుత ఎమ్మెల్సీ పదవీకాలం

ఫ ప్రధాన సంఘాల నుంచి ఇప్పటికే ఖరారైన అభ్యర్థులు

ఫ ఇక ముమ్మరంకానున్న ప్రచారం

జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు..

జిల్లా పోలింగ్‌ పురుషులు సీ్త్రలు మొత్తం

కేంద్రాలు

సిద్దిపేట 4 120 43 163

జనగామ 12 556 365 921 హన్మకొండ 15 2884 2214 5098

వరంగల్‌ 13 1381 844 2225

మహబూబాబాద్‌ 16 1083 535 1618

భూపాలపల్లి 7 211 112 323

ములుగు 9 394 218 612

భద్రాద్రి 23 1038 911 1949

ఖమ్మం 24 2300 1655 3955

భువనగిరి 17 595 326 921

సూర్యాపేట 23 1690 947 2637

నల్లగొండ 37 2688 1795 4483

మొత్తం 200 14940 9965 24905

రిటర్నింగ్‌ అధికారిగా నల్లగొండ కలెక్టర్‌

ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా (ఆర్‌వో) నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి వ్యవహరించనున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలోకి 12 జిల్లాలు వస్తున్నాయి. నల్లగొండ మినహా మిగతా 11 జిల్లాల్లో అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ (ఏఆర్‌వో) అధికారులు ఉంటారు. సాధారణంగా రిటర్నింగ్‌ అధికారి ఉన్న దగ్గరే నామినేషన్లను స్వీకరిస్తారు. అయితే ఈ ఎన్నికలు 12 జిల్లాల పరిధిలో ఉన్నందున ఆర్‌వో ఉండే నల్లగొండలో మాత్రమే స్వీకరిస్తారా? మిగితా జిల్లాల్లోని ఏఆర్‌వోల కార్యాలయాల్లో స్వీరించేందుకు అనుమతి ఇస్తారా? అన్నది ఎన్నికల నోటిఫికేషన్‌లో స్పష్టం చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement