ఆఫీసులోనే బతుకమ్మ చీరలు
చౌటుప్పల్ రూరల్ : మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పలు విభాగాలకు చెందిన ఏఈలకు కేటాయించిన చాంబర్‌లో కూర్చోడానికి స్థలం లేక బయటనుంచి విధులు నిర్వహిస్తున్నారు. గదిలో బతుకమ్మ చీరలు నిల్వ చేయడంతో ఏడాది కాలంగా ఈ దుస్థితి ఏర్పడింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏటా బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేసింది. అందులో భాగంగా 2023 అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో పూర్తిస్థాయిలో చీరల పంపిణీ జరగలేదు. వాటన్నంటినీ చౌటుప్పల్ ఎంపీడీఓ కార్యాలయానికి తరలించి పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలకు కేటాయించిన గదిలో నిల్వ చేశారు. అప్పటినుంచి గదిలోనే చీరలు మూలుగుతున్నాయి.
ఎంపీఓ చాంబర్, బయటనుంచి విధులు
ఏఈల గదిలో బతుకమ్మ చీరలు నిల్వ ఉంచడంతో వారు కూర్చోవడానికి స్థలం లేకుండాపోయింది. దీంతో ఏడాదిన్నర కాలంగా ఎంపీఓ చాంబర్, ఆరుబయట నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఏఈలు విధులకు హాజరవుతున్నారా.. లేదా తెలియని పరిస్థితి. నాలుగు నెలల క్రితం జెడ్పీ సీఈఓ మండల పర్యటనకు వచ్చిన సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఆ సమయంలో పీఆర్ ఏఈ లేకపోవడం, సీఈఓకు అసలు విషయం తెలియకపోవడంతో అతనికి మోమో జారీ చేశారు. అయినా బతుకమ్మ చీరలను ఖాళీ చేయకుండా చోద్యం చేస్తున్నారు. అదే విధంగా డీఎల్‌పీ, ఉపాధిహామీ, పంచాయతీరాజ్ వ్యవస్థ కొనసాగడానికి సరిపడా గదులు లేక అధికారులు ఇబ్బంది పడుతున్నారు.
ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం
బతుకమ్మ చీరలు నిల్వ ఉన్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా హ్యాండ్లూమ్ వారికి అప్పగించాలని ఆదేశాలు ఇచ్చారు. దండుమల్కాపురంలోని హ్యాండ్లూం గోదాం సిబ్బంది వచ్చి చీరలు తీసుకెళ్తామని చెప్పారు. ఇంకా తీసుకెళ్లలేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సామగ్రి ఉంచడానికి ఇబ్బంది అవుతుంది.
– ఊట్కూరి అంజిరెడ్డి, ఎంపీఓ
2023 అక్టోబర్ నుంచి పీఆర్,
ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈల గదిలో నిల్వ
కూర్చోవడానికి స్థలం లేక ఇబ్బందులు
Comments
Please login to add a commentAdd a comment