గుట్ట చుట్టూ పర్యాటకం
యాదగిరి, స్వర్ణగిరి, భువనగిరి ఖిలా, కొలనుపాకతో టూరిజం సర్క్యూట్
సాక్షి, యాదాద్రి : జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు టూరిజం శాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా యాదగిరిగుట్టతో పాటు దాని చుట్టూ ఉన్న సందర్శనీయ స్థలాలను కలిపి టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయనుంది. ఇప్పటికే భువనగిరి కోట అభివృద్ధి పనులు కొనసాగుతుండగా.. మిగతా పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందిస్తోంది.
టూరిజం సర్క్యూట్‌లోకి ఈ ప్రాంతాలు..
హైదరాబాద్‌కు చేరువలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎన్నో సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ఆదాయ వనరులు పెరగనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా యాదగిరి క్షేత్రం కేంద్రంగా భువనగిరి ఖిలా, స్వర్ణగిరి, రాయగిరి చెరువు, నృసింహసాగర్ రిజర్వాయర్, కొలనుపాక వీరశైవ, జైన దేవాలయాలను టూరిజం సర్క్యూట్‌లోకి తేనుంది.
భువనగిరి ఖిలాకు రూ.100 కోట్లు మంజూరు
స్వదేశీ దర్శన్ పథకం కింద ఇప్పటికే కేంద్రం రూ.100 కోట్లు భువనగిరి ఖిలాకు కేటాయించింది. తొలి విడతలో విడుదల చేసిన రూ.56 కోట్ల పనులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిదశలో పర్యాటకులకు అవసరమైన మౌలిక వసతులను, అభివృద్ధి పనులను చేపడుతున్నారు. ఖిలాపైకి మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేస్తారు. తీగెలవంతెన రోప్‌వే, స్వాగత తోరణం, టికెట్ కౌంటర్, ఖిలాపై ఉన జైలును డిజిటల్ ప్రదర్శన శాలగా మార్చనున్నారు. అలాగే ఖిలా కింది భాగంలో అమ్మకుంట వరకు ఆరులైన్ల రోడ్డును నిర్మిస్తారు.రోడ్డుకు ఇరువైపులా సుందరీకణ చేపడుతారు. స్థానిక ప్రజలకు ఉపాఽధి అవకాశాలుకల్పించడానికి వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేస్తారు. ఈ పనులను నాలుగు ప్యాకేజీల్లో చేపడుతారు. ప్రస్తుతం మొదటి విడత ప్యాకేజీ పనులు టెండర్ల దశలో ఉన్నాయి.
ఫ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు
ఫ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..
ఆదాయ వనరుల పెంపే లక్ష్యం
గతంలోనే ప్రతిపాదనలు
జిల్లాలోని భువనగిరి ఖిలాతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బస్వాపూర్ రిజర్వాయర్ గతంలోనే పర్యాటక రంగం పరిఽధిలోకి తెచ్చారు. భువనగిరి నుంచి బస్వాపూర్ రిజర్వాయర్ మీదుగా యాదగిరిగుట్ట, కొలనుపాక వరకు టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా వైటీడీఏ అప్పట్లో ముసాయిదా రూపొందించింది. కొలనుపాక సోమేఽశ్వరాలయానికి రూ.200 కోట్లు కేటాయించి పునరుద్ధరణ పనులు చేపట్టారు. కొలనుపాకకు దేశం నలుమూలల నుంచి వీరశైవ, జైనభక్తులు నిత్వం వస్తుంటారు. హైదారాబాద్– వరంగల్ మార్గం మధ్యలో కొలనుపాక ఉంది. ఇటీవల భువనగిరి వద్ద నిర్మించిన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నర్సింహస్వామి క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నాయి. పర్యాటకపరంగా అన్ని హంగులు కలిగి ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో మౌలిక వసతులు కల్పించి, విస్త్రతంగా ప్రచారం చేయడం ద్వారా పర్యాటకంగా అభివృద్ధి చేసి, ఆదాయాన్ని పొందే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment