అల్పాహారానికి నిధులొచ్చాయి
భువనగిరి : ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు మార్గం సగమం కానుంది. ఈనెల 1నుంచి మార్చి 20వ తేదీ వరకు 38రోజుల పాటు అల్పాహారం అందించేందుకు నిధులు మంజూరయ్యాయి. ఉత్తీర్ణత శాతం పెంపే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా 163 ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు నవంబర్ నుంచి ప్రత్యేక తరగతులు, రివిజన్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక తరగతులు ముగిసిన అనంతరం సుదూర ప్రాంతాల విద్యార్థులు వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు రాత్రి సమయం 7 దాటుతుంది. మధ్యాహ్నం భోజనం చేసిన విద్యార్థులు రాత్రి వరకు ఉండలేకపోతున్నారు. వారిలో అలసట, నీరసం, చేరి చదువుపై దృష్టి సారించకపోతున్నారు. ఇలా రెండు నెలలు దాటింది. దీనిని గుర్తించిన ప్రభుత్వం అల్పాహారం అందించేందుకు ముందుకువచ్చింది.
ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 ఖర్చు
జిల్లా వ్యాప్తంగా 9 వేలకు పైగా పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. ఇందులో ప్రైవేట్, కస్తూర్బాలు, గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు మినహాయించి 4,494 మంది మంది విద్యార్థులున్నారు. వీరిలో ఒక్కో విద్యార్థికి ప్రతి రోజూ రూ.15ల చొప్పున అల్పాహారానికి ఖర్చు చేసేలా జిల్లాకు 38 రోజుల కు రూ.25,61,580 విడుదల అయ్యాయి. ఈ నిధులతో రోజూ సాయంత్రం ఉడికించిన శనగలు, బిస్కెట్లు, ఇతర అల్పాహారం అందించనున్నారు. కాగా అల్పాహారం మధ్యాహ్నా భోజన నిర్వహకులు అందించాలని సూచించారు. అల్పాహారం అందజేసినందుకు నిర్వాహకులకు పారితోషికం ఇస్తారా లేదా.. స్పష్టత ఇవ్వలేదు.
రూ.25,61,580 విడుదల
ఫ పదో తరగతి విద్యార్థులకు తీరనున్న ఆకలి
ఫ నేటినుంచి మార్చి 20వ తేదీ వరకు సాయంత్రం సమయంలో స్నాక్స్
ఫ మొత్తం 4,494 మంది విద్యార్థులు
పాఠశాలల ఖాతాల్లో జమ చేశాం
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో నవంబర్ నుంచే ప్రత్యేక తరగతులు ప్రారంభించాం. డిసెంబర్‌లో సిలబస్ పూర్తిచేసి జనవరి 1వ తేదీ నుంచి ఉదయం సాయంత్రం, సమయాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నా ఇప్పటి వరకు అల్పాహారం అందజేయడం లేదు. సాయంత్రం సమయంలో అల్పాహారం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వీటిని పాఠశాలల గ్రాంట్స్ కింద జమ చేశాం. ఒక్కో విద్యార్థికి రోజూ రూ. 15 చొప్పున ఖర్చు చేయనున్నాం. విద్యార్థులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలి.
–సత్యనారాయణ, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment