బీసీలకు 60 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
మోత్కూరు: రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం బీసీలకు 60 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ విద్యార్థి యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గడ్డం నర్సింహ, బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 52 శాతం ఉన్న బీసీలను 45 శాతం వరకు తగ్గింపు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2014లో సమగ్ర కుటుంబ సర్వే 52 శాతం బీసీలు ఉన్నట్లు తేల్చితే పదకొండేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను 46 శాతం ఉన్నట్లు కుల గణన సర్వేలో వెల్లడైనట్లు చెప్పడం బీసీలను అవమానపరచడమేనన్నారు. బీసీ రిజర్వేషన్లకు ఊతం ఇస్తున్నట్లు గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నేడు గతంలో కంటే ఆరు శాతం తగ్గింపు చేయడమే కాకుండా అగ్ర కులాలకు మరో ఏడు శాతం పెంచడంలో ఆంతర్యం ఏంటో చెప్పాలన్నారు. రాష్ట్రంలో మళ్లీ కుల గణన చేసి బీసీలకు న్యాయబద్ధమైన వాటాను తేల్చిన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు కలిమెల నర్సయ్య, ఎడ్ల శ్రీను, దామరోజు సత్యనారాయణచారి, పులకరం మల్లేష్, గొలుసుల యాదగిరి, బోయిని ఉప్పలయ్య, వేముల నర్సయ్య, పసునూరి యాదయ్య, లక్ష్మణ్, భిక్షపతి పాల్గొన్నారు.
బీసీ విద్యార్థి యువజన సంఘం
జాతీయ అధ్యక్షుడు గడ్డం నర్సింహ
Comments
Please login to add a commentAdd a comment