చిరుత సంచారం.. ప్రజల్లో కలవరం
జమ్మలమడుగు: జమ్మలమడుగు–ముద్దనూరు మధ్యలో ఉన్న కొండ ప్రాంతంలో చిరుత సంచారం ప్రజల్ని కలవరపెడుతోంది. ఆదివారం చిరుత పులి కనిపించిందన్న వార్త దావానంలా వ్యాపించడంతో స్థానికులు హడలిపోతున్నారు. ముద్దనూరు పంచాయతీ పరిధిలో సేకరించిన చెత్తను ఊరి వెలుపల ఉన్న డంపింగ్ యార్డు లో వేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఆహా రం లభిస్తుందని కుక్కలు డంపింగ్ యార్డు వద్దకు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నాయి. ఈ కుక్కలను తినడం కోసం పులి ఆ ప్రాంతానికి వస్తున్నట్లు స్థానిక గొర్రెల కాపరులు పేర్కొంటున్నారు.
భయం..భయం..
సుమారు రెండేళ్ల కిందట గండికోటలో చిరుతపులి గొర్రెలపై ప్రతిరోజు దాడులు చేసేది. అసలే పర్యాటక కేంద్రం కావడంతో ప్రజల రద్దీ ఎక్కువగా ఉండేది. ఓ సారి పట్టపగలే గండికోట జుమ్మా మసీదు వెనుకవైపు రెండు చిరుతల్ని చూసి మహిళా పర్యాటకులు భయందోళనలతో పరుగుతీశారు. ఈ విషయం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు వెంటనే బోను ఏర్పాటు చేశారు. ఆ రోజు రాత్రికే ఆడ చిరుత బోనులో చిక్కింది. దీంతో మరో చిరుత, దాని పిల్లలు ఎటో వెళ్లిపోయినట్లు గండికోట వాసులు తెలు పుతున్నారు. ఆ తర్వాత ముద్దనూరు మండలంలోని శెట్టివారి పల్లె గాలేరు–నగరి కాలువ సమీపంలోనూ చిరుత సంచారం కనిపించింది. కొంత కాలం పాటు చిరుత అనవాళ్లు కనిపించకుండాపోయాయి. దీంతో చిరుత పులుల్లేనట్లేనని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా మళ్లీ చిరుత కనిపించడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది
స్కూటరిస్టులు బహుపరాక్ .. జమ్మలమడుగు–ముద్దనూరు రహదారిలో ప్రతి రోజు వందల సంఖ్యలో ప్రజలు బైక్‌ల మీద ముద్దనూరు నుంచి జమ్మలమడుగుకు వెళ్తుంటారు. వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రయాణించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒంటరిగా కాకుండా మరో వ్యక్తిని వాహనంలో ఉండేవిధంగా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఈ విషయమై ముద్దనూరు రేంజ్ అటవీ అధికారి అశోక్‌ను వివరణ కోరగా.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. పట్టుకునేందుకు తగినచర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment