పొలాలకెళ్లే రస్తా మధ్యలో కాలువ తీస్తే ఎలా ?
చాపాడు : ఇరువురు రైతుల మధ్య ఏర్పడిన సమస్య 100 ఎకరాల సాగు భూములకు చెందిన రైతులందరికీ సమస్యగా మారింది. సాగునీటి కోసమని ఏళ్ల తరబడి రైతులందరూ వెళ్లే పంట పొలాల రస్తా మధ్యలో పంట కాలువ తీయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు అధికారులందరూ సమస్యను పరిశీలించినప్పటికీ పరిష్కారం కాకపోవటంతో రస్తాలోనే జేసీబీతో కాలువ తీశారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కోసమని దారి మద్యలో పంట కాలువ తీస్తే పొలాలకు వెళ్లి వ్యవసాయ పనులు ఎలా చేసుకోవాలని మిగిలిన రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలిలా..
మండల పరిధిలోని నరహరిపురం క్రాస్ రోడ్డు వద్ద గల బ్రిటీషు మోరీ నుంచి పంట పొలాల్లోకి వెళ్లే రస్తా మధ్యలో గురువారం రాత్రి జేసీబీతో కాలువను తీశారు. గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి అనే రైతు 80 సెంట్ల పొలంలో సాగు చేసుకున్న పంటకు సాగునీటి సమస్య తలెత్తింది. దీంతో పంట కాలువ ఏర్పాటు చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. తహసీల్దారు రమాకుమారి, కేసీ కెనాల్ జేసీ గురుమోహన్‌రెడ్డి సమస్యను పరిశీలించారు. కాలువ నుంచి సాగునీరు తీసుకెళ్లేందుకు దారి ఇరువైపులా పట్టా భూములు కావటంతో తమ పొలాల్లో కాలువ తీసేందుకు సంబంధిత రైతులు ఒప్పుకోలేదు. అధికారులు సమస్యను పరిష్కరించలేక పోలీసుల బందోబస్తుతో జేసీబీ చేత కాలువ తీయించారు.
Comments
Please login to add a commentAdd a comment