కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : పెండింగ్‌లో ఉన్న విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు బడ్జెట్‌లో కేటాయించాలని, విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఈ నెల 18న ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో చేపట్టే మహాధర్నాను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యదర్శి ఎద్దు రాహుల్, వీరిపోగు రవి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాదీవెన, వసతిదీవన బకాయిలు రూ.3,480కోట్ల విడుదలకు ప్రభుత్వం తాత్సర్యం చేస్తుందన్నారు. ఇప్పటికే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పలుమార్లు విన్నవించిన ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ కేటాయింపులలో పెండింగ్ బకాయిల గురించి మాట్లాడకపోవడం హేయమైనచర్య అన్నారు. విద్యార్థులు ఫీజులు చెల్లించలేక పడరాని పాట్లు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్ధులకు రూ.12,600 కోట్లు అవసరం కాగా, రూ.5,387.03 కోట్లే మాత్రమే బడ్జెట్‌లో కేటాయించారన్నారు. దీనితో తల్లికి వందనంపై కూడా అనుమానాలు పెరిగాయనిన్నారు. జీఓ నెం:77ను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రద్దు చేస్తామని చెప్పి వాటి ఊసెత్తడంలేదన్నారు. ఎంతో అర్భాటంగా తీసుకొచ్చిన డిగ్రీ హానర్స్ విధానం విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిందని వెంటనే పున:ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐజిల్లా సహాయ కార్యదర్శి అజయ్, నాయకులు జెర్మియా, యశ్వంత్, చక్రవర్తి, గిరి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment