ఊపందుకున్న రబీ సాగు
కడప అగ్రికల్చర్ : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో ఐదు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రబీ సాగు ఊపందుకుంది. రబీ సీజన్‌కు సంబంధించి రైతులకు అవసరమైన శనగ విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీతో అందించింది. అలాగే వేరుశనగకాయలు అందించేందుకు సిద్ధం చేస్తున్నారు. అన్ని రకాల ఎరువులను రైతు సేవా కేంద్రాల్లో ఉంచారు. చాలా మండలాల్లో వర్షం కురవడంతో ఆరుతడి పంటల సాగు ఊపందుకుంది. శనగతోపాటు పెసర, మినుము, అలసంద సాగు చేస్తున్నారు. అలాగే ముందుగా వేసిన పలు పంటలు కళకళలాడుతున్నాయి.
పెరిగిన సాగు
జిల్లాలో ఐదు రోజుల నుంచి సాగు ఊపందుకుంది. ఈ నెల 11 నాటికి 23,810 హెక్టార్లలో వివిధ పంటలు సాగై 16.65 శాతంగా నమోదైంది. ఈ నెల 16కు 55764 హెక్టార్లకు చేరుకుని 38.99 శాతం మేర నమోదైంది. అంటే వర్షం వచ్చిన నాలుగైదు రోజుల్లోనే సాగు బాగా పెరిగింది. దాదాపు 31954 హెక్టార్ల సాగు పెరిగింది. అలాగే ఈ నెల 11 నాటికి శనగ 16704 హెక్టార్లలో సాగు కాగా 16 నాటికి 44258 హెక్టార్లకు చేరుకుంది. ఐదు రోజుల్లోనే 27554 హెక్టార్లలో సాగైంది.
ఈ వారంలో మరింత..
రబీ సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 1,42,988 హెక్టార్లు కాగా ఇప్పటికి 55,744 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో జొన్న 7917 హెక్టార్లకు గాను 1189 హెక్టార్లలో సాగైంది. మొక్క జొన్న 1440 హెక్టార్లు కాగా 650 హెక్టార్లలో, శనగ 82261 హెక్టార్లకు గాను 44258 హెక్టార్లు, పచ్చపెసలు 3182 హెక్టార్లకు గాను 584 హెక్టార్లు, మినుము 14731 హెక్టార్లకు గాను 7300 హెక్టార్లు, వేరుశనగ 6236 హెక్టార్లకు గాను 558 హెక్టార్లు, నువ్వు 5070 హెక్టార్లకు గాను 288 హెక్టార్లలో సాగయింది. ఈ వారంలో పంటల సాగు మరింత పెరగనుంది.
రెండు నెలల్లో..
అక్టోబర్, నవంబర్‌లో బాగా కురిసిన వర్షాలు రబీ సీజన్‌కు అనుకూలించాయి. రబీలో అక్టోబర్‌లో సాధారణ వర్షపాతం 132.1 మిల్లీమీటర్లు కాగా 153.7 మి.మీ నమోదైంది. నవంబర్‌లో 61.6 కాగా ఇప్పటికి 44.1 మి.మీ వర్షం కురిసింది.
ఐదు రోజులుగా వర్షాలు
ముమ్మరంగా వ్యవసాయ పనులు
కళకళలాడుతున్న పంటలు
ఆనందంలో అన్నదాతలు
లక్ష్యం చేరుకుంటాం
జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలలో ఆరుతడి పంటల సాగు ఊపందుకుంది. కానీ అక్కడక్కడా ముందుగా వేసిన వరికి కొంత ఇబ్బంది కలిగినా మిగతా ఆరుతడి పంటలకు మేలు జరిగింది. కొన్ని దీర్ఘకాలిక ఉద్యాన పంటలకు జీవం వచ్చింది. మరో పది రోజుల్లో సాగు మరింత పెరగనుంది. ఏదిఏమైనా రబీలో వంద శాతం సాగు లక్ష్యం చేరుకుంటాం.
– అయితా నాగేశ్వరావు, జిల్లా వ్యవసాయ అధికారి
Comments
Please login to add a commentAdd a comment