పండక్కు బస్సు సిద్ధం
కడప కోటిరెడ్డిసర్కిల్: తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతికి ప్రజలతో పాటు ఆర్టీసీ సంస్థ సిద్ధమవుతోంది. పట్టణాలు.. నగరాల్లో ఉండే వారిని పల్లె చెంతకు చేర్చేందుకు సమాయత్తమవుతోంది. సంక్రాంతికి పల్లె పండుగ అని పేరు. జిల్లాకు చెందిన చాలామంది హైదరాబాదు, బెంగుళూరు, చైన్నె ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్ రంగంలోనూ, వ్యాపారాల్లో స్థిరపడి ఉన్నారు. వీరంతా సంక్రాంతికి వస్తారు. వీరి ప్రయాణాల కోసం ఆర్టీసీ అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ప్రత్యేక సర్వీసులు
పండుగ నిమిత్తం వివిధ రాష్ట్రాల నుంచి జిల్లా వాసులను తీసుకు వచ్చేందుకు, తిరిగి వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు వైఎస్సార్ జిల్లా ఆర్టీసీ అధికారులు అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లాలోని కడప, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల డిపోల నుంచి జనవరి 9 నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే తిరిగి 16వ తేదినుంచి ఆయా నగరాలు, పట్టణాలకు వెళ్లేందుకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయనున్నా రు. ఇప్పటికే ఆన్‌లైన్ రిజర్వేషన్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచారు. కడప రీజియన్ పరిధిలో రెగ్యులర్ సర్వీసులతోపాటు హైదరాబా దుకు 111, బెంగుళూరుకు 81, చైన్నెకి 12, విజయవాడకు 30, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, అనంతపురానికి 60 బస్సులు చొప్పున మొత్తం 294 బస్సులు నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
సాధారణ చార్జీలతోనే....
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక సర్వీసులు నడపాలని ఆదేశించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వమూ అదే విధానాన్ని అనుసరిస్తుండడం విశేషం. కాగా అంతకుముందు టీడీపీ హయాంలో స్పెషల్ సర్వీసులకు చార్జీలు పెంచి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయడంతో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
సంక్రాంతి పండుగకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సర్వీసులు
జిల్లాలోని ఆరు డిపోల నుంచి వివిధ ప్రాంతాలకు 294 బస్సులు
అత్యధికంగా హైదరాబాదుకు 111, బెంగుళూరుకు 81 ప్రత్యేక సర్వీసులు
రాను, పోను టిక్కెట్ బుక్ చేసుకునే వారికి 10 శాతం ప్రత్యేక రాయితీ
ఇప్పటికే ప్రారంభమైన ఆన్‌లైన్ రిజర్వేషన్
రాయితీ సద్వినియోగం చేసుకోవాలి
సంక్రాంతి పండుగకు జిల్లాకు వచ్చే ప్రయాణికులకు రానుపోను ఒకేసారి టిక్కెట్లు రిజర్వు చేసుకుంటే 10 శాతం రాయితీ కల్పిస్తున్నాం. హైదరాబాదు, బెంగుళూరు, చైన్నె, విజయవాడ తదితర ప్రాంతాలకు వచ్చి పోయే ప్రయాణికులకు ఈ బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాం. డిమాండును బట్టి మరిన్ని సర్వీసులు నడుపుతాం. సురక్షిత ప్రయాణానికి ప్రజలు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. – పొలిమేర గోపాల్‌రెడ్డి,
జిల్లా ప్రజా రవాణాధికారి, కడప
Comments
Please login to add a commentAdd a comment