ఆకాంక్షిత జిల్లా అభివృద్ధి పనుల పరిశీలన
కడప సెవెన్‌రోడ్స్: కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిత జిల్లాగా గుర్తించిన కడపలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ గురువారం నుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం రాత్రే ఆయన కడపకు చేరుకున్నారు. 2018లో నాటి ప్రభుత్వం దేశంలో 112 జిల్లాలను ఆకాంక్షిత జిల్లాలుగా గుర్తించింది. అందులో కడప కూడా ఉంది. సామాజిక, ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయాలన్నది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా జిల్లాల మధ్య పోటీ ఏర్పాటు చేసి ర్యాంకింగ్స్ జారీ చేస్తారు. ముఖ్యంగా వైద్యం, పౌష్టికాహారం, విద్య, వ్యవసాయం, జల వనరులు, ఆర్థికం, నైపుణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై కేంద్రీకరిస్తారు. యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగామ్ కింద జిల్లాలో జమ్మలమడుగు, చింతకొమ్మదిన్నె మండలాలు ఎంపికయ్యాయి. హెల్త్ ఇండికేటర్‌లో భాగంగా గర్భిణుల సమస్యలు, బాలింత తల్లుల పోషకాహార సమస్యలు, విద్యకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, సాయిల్ హెల్త్‌కార్డులు జారీ, స్వయం సహాయక బృందాలకు బ్యాంకు రుణాలు వంటి అంశాలపై ఈ మండలాల్లో కేంద్రీకరించి వంద శాతం లక్ష్యాలను సాధించాల్సి ఉంటుంది. నిర్ణీత వ్యవధిలో సంతృప్తికర స్థాయిలో లక్ష్యాలను సాధించాలన్నది సంపూర్ణత అభియాన్ ముఖ్య ఉద్దేశ్యం. కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ జిల్లా పర్యటనకు వస్తుండడంతో యంత్రాంగం అందుకు సంబంధించిన అన్ని ఏర్పాటు పూర్తి చేసింది.
నేటి పర్యటన: కేంద్ర మంత్రి గురువారం చింతకొమ్మదిన్నెమండలం నాగిరెడ్డిపల్లె గ్రామాన్ని సందర్శిస్తారు. అక్కడి విలేజ్ హెల్త్ క్లినిక్, అంగన్వాడీ కేంద్రం,వాటర్ కన్జర్వేషన్‌ప్లాంటు వంటివి పరిశీలిస్తారు.అనంతరం జమ్మలమడుగు మండలం మోరగుడి కి వెళ్లి స్వయం సహాయక సంఘాలతో సమావేశమవుతారు. రహదారులు, తాగునీర వంటి మౌలిక సదుపాయాల కల్పనను పరిశీలించి సమీక్ష నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment