ఉక్కు ఫ్యాక్టరీపై కూటమి ప్రభుత్వం మౌనం వీడాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై మౌనం వీడాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ అన్నారు. శనివారం సీపీఎం 12వ జిల్లా మహాసభల సందర్భంగా జియోన్ కాలేజ్ నుంచి ఐటీఐ సర్కిల్ వరకు ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజించి పాలించు పద్ధతిలో ప్రజల మధ్య మత వైషమ్యాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటోందన్నారు. ప్రపంచాన్ని అదానీ అవినీతి కుదిపేస్తోందని, భారత ప్రతిష్టను అమెరికాలో తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రకృతి వనరులన్నీ అదానీకి తాకట్టు పెట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంలో మోదానీ పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ శిలాఫలకాలకే పరిమితమైందన్నారు. విభజన చట్టంలోని హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఉక్కు ఫ్యాక్టరీ కడప జిల్లాలో నిర్మిస్తామని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిందని కానీ ఇంతవరకు అతీగతి లేదన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని కూటమి సర్కార్ మౌనంగా ఉండడం సరి కాదన్నారు. జమిలి ఎన్నికల వల్ల ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని, ఖర్చులు, భారాలు ప్రజలపై పెరుగుతాయని తెలిపారు. స్మార్ట్ మీటర్లను పగలగొట్టండని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ పిలుపునిచ్చారని, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్లను ఎందుకు బిగిస్తున్నారని ప్రశ్నించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురవుతోందని జిల్లాలో రైతాంగం ఆత్మహత్యల పరంపరం కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు ఎ.రామ్మోహన్, బి.మనోహర్ శివకుమార్, ఐఎన్ సుబ్బమ్మ, జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరి రెడ్డి, అన్వేష్, శ్రీనివాసులరెడ్డి, శ్రీనివాసులు, చంద్రారెడ్డి, వెంకటసుబ్బయ్య, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్
Comments
Please login to add a commentAdd a comment