కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలు మృతి
పెండ్లిమర్రి : పెండ్లిమర్రి మండలం పగడాలపల్లె గ్రామంలో ఆదివారం కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలు మృతి చెందాయి. పగడాలపల్లె గ్రామానికి చెందిన కొంచాని చంద్రయ్య అనే గొర్రెల కాపరికి సంబంధించిన గొర్రె పిల్లలపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. దాడిలో 15 పిల్లలు చనిపోయాయి. దాదాపు రూ. 1లక్ష నష్టం జరిగినట్లు బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.
పెన్నానదిలో పడి
వృద్ధురాలు..
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక మోడంపల్లెకు చెందిన బెల్లంకొండ దస్తగిరమ్మ (68) పోట్లదుర్తి సమీపంలోని పెన్నానదిలో పడి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మతిస్థిమితం సరిగా లేని దస్తగిరమ్మ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఈ నెల 2న టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆమె మృతదేహం పెన్నానదిలో కనిపించడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు.
నిజాయితీ చాటుకున్న మహిళా కండక్టర్
మదనపల్లె : బస్సులోని ప్రయాణికుడు పోగొట్టుకున్న బంగారు చైనును మహిళా కండక్టర్ నిజాయితీతో బాధితుడికి అప్పగించి నిజాయితీ చాటుకున్న ఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రంగంపేటకు చెందిన శివకుమార్ సొంత పనుల నిమిత్తం మదనపల్లెకు వచ్చారు. తిరిగి మదనపల్లెకు చెందిన ఆర్టీసీ బస్సులో రంగంపేటకు బయలుదేరి వెళ్లాడు. బస్సు దిగే క్రమంలో తన బ్యాగును బస్సులోనే మరచిపోయాడు. ఇంటికి వెళ్లాక బ్యాగు బస్సులో మరచిపోయినట్లు గుర్తించిన శివకుమార్ హుటాహుటిన తిరిగి మదనపల్లెకు వచ్చి టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పటికే బస్సులో శివకుమార్ మరచిపోయిన బ్యాగును గుర్తించిన ఆర్టీసీ కండక్టర్ గిరిజమ్మ, అధికారులకు సమాచారం తెలిపి, టూటౌన్ పోలీసులకు బ్యాగును అప్పగించింది. అందులో రూ.2.50 లక్షల విలువ చేసే బంగారు చైను ఉండటంతో పోలీసులు బాధితుడికి సమాచారం అందించి స్టేషన్‌కు పిలిపించి, బ్యాగు, చైనును కండక్టర్ గిరిజమ్మతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా పోలీసు, ఆర్టీసీ అధికారులు కండక్టర్ గిరిజమ్మ నిజాయితీని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment