ఎర్రచందనం అక్రమ రవాణాపై నిఘా
టాస్క్‌ఫోర్స్ ఎస్పీ పి.శ్రీనివాస్
బద్వేలు అర్బన్ : ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని తిరుపతి టాస్క్‌ఫోర్స్ ఎస్పీ పి.శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఫారెస్టు కాంప్లెక్స్‌లో వివిధ రేంజ్‌ల ఎఫ్‌ఆర్‌ఓలు, సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎర్రచందనం పరిరక్షణకు అటవీ ప్రాంత సమీపంలోని ప్రజల సహకారం తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఎర్రచందనం స్మగ్లర్లు ప్రవేశిస్తున్న మార్గాలు, లోడింగ్, అన్‌లోడింగ్ పాయింట్లను గుర్తించి బేస్‌క్యాంపులు పటిష్టం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రభావిత గ్రామాల్లో ఇన్‌ఫార్మర్ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని కోరారు. ఎర్రచందనం అక్రమ రవాణా నేరానికి పదే పదే పాల్పడే వ్యక్తులపై పీడీ యాక్టులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే గతంలో ఎర్రచందనం కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై నిఘా ఉంచాలని సూచించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరంగా ఎదురయ్యే సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. అటవీ చెక్‌పోస్టులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో బద్వేలు, పోరుమామిళ్ల, వనిపెంట ఎఫ్‌ఆర్‌ఓలు నయీమ్‌అలీ, రఘునాథరెడ్డి, ప్రణీత్‌రావు, టాస్క్‌ఫోర్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment