రేపు కడపలో ‘యాదే రఫీ’
కడప కల్చరల్: ప్రముఖ గాయకుడు, దివంగత మహమ్మద్ రఫీ శత జయంతి సందర్భంగా ఈనెల 4వ తేదిన యాదె రఫీ పేరుతో మ్యూజికల్ ట్రిబ్యూట్ నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. కడపనగరం అగాడిలోని సంఘం ఫంక్షన్ హాలులో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు అబ్దుల్ కలాం, షమీన్, రఫీక్, ఆరీఫ్‌లు తమ గాన మాధుర్యాన్ని ప్రేక్షకులకు వినిపిస్తారన్నారు. అమర గాయకుడు మహమ్మద్ రఫీని అభిమానించే ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
నేడు ఏకసభ్య కమిషన్ జిల్లాకు రాక
కడప సెవెన్‌రోడ్స్: షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ వర్గీకరణపై ఫిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ శుక్రవారం జిల్లాకు వస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వరనాయుడు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు జిల్లాకు చేరుకుంటారని తెలిపారు. ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు జిల్లా అధికార యంత్రాంగంతో సమావేశం నిర్వహించడంతోపాటు కలెక్టరేట్ సభా భవనంలో వివిధ ఉప కులాల సభ్యులు, సంఘాల వినతిపత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి నెల్లూరు జిల్లాకు వెళతారని వివరించారు.
స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
కడప రూరల్: వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య తెలిపారు. 150 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తు నమూనాను ిసీఎస్‌డబ్ల్యూ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసు కోవాలని తెలిపారు. భర్తీ చేసిన దరఖాస్తుతోపాటు నిర్దేశించిన రుసుము, సంబంధిత సర్టిఫికెట్లను జతపరిచి ఈనెల 3 నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కడప పాత రిమ్స్ లో గల వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు.
కొనసాగుతున్న
రెవెన్యూ సదస్సులు
కడప సెవెన్‌రోడ్స్: భూ సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో భాగంగా శుక్రవారం జిల్లాలోని 26 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. బద్వేలు రెవెన్యూ డివిజన్‌లోని ముత్తుకూరు,తంగెడుపల్లి, నాగిశెట్టిపల్లె,ఎగువ తంబళ్లపల్లె, అక్కంపేట, పోరుమామిళ్లలో సద్సులు జరగనున్నాయి. పులివెందుల రెవెన్యూ డివిజన్‌లోని చక్రాయపేట, భద్రంపల్లి, నరసింగరావు పల్లె, హిమకుంట, రాచుమర్రిపల్లిలో, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌లోని పర్లపాడు, రామేశ్వరం, నక్కవానిపల్లె, భూతమపురం, శివపురం, పొట్లదుర్తి, ఎస్.ఉప్పలపాడు, చిన్న దుద్యాల, పెద్దదుద్యాల, చిన్న సింగనపల్లె, వెదురూరులో సదస్సులు జరుగుతాయి. కడప రెవెన్యూ డివిజన్‌లోని పెద్దసరిపల్లె, సీకే దిన్నె మండలం బుగ్గలేటిపల్లి, పొడదుర్తి, కొక్కరాయపల్లితో కలిపి మొత్తం 26 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరుగనున్నాయని డీఆర్వో వివరించారు.
5న హాకీ బాలుర
జట్టు ఎంపికలు
పులివెందుల టౌన్ : జిల్లా బాలుర జూనియర్, సబ్ జూనియర్ హాకీ జట్ల ఎంపికలు ఈనెల 5వ తేదీన పులివెందులలోని వైఎస్‌ఆర్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీలో ఆదివారం ఉదయం 9గంటల నుంచి జరగనున్నట్లు హాకీ కడప జిల్లా సెక్రటరీ ఎం.శేఖర్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇక్కడ ఎంపికై న సబ్ జూనియర్ బాలుర జట్టు ఈనెల జనవరి 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మదనపల్లెలో జరిగే 14వ రాష్ట్రస్థాయి బాలుర సబ్ జూనియర్ చాంపియన్ షిప్‌లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు కచ్చితంగా 2009జనవరి 1వ తేదీ తర్వాత జన్మించిన వారై ఉండాలన్నారు. అదేవిధంగా జూనియర్ విభాగంలో ఎంపికై న బాలుర జట్టు ఈ నెల రెండవ వారంలో కాకినాడలో జకిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర చాంపియన్ షిప్‌లో పాల్గొంటారని, ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు కచ్చితంగా 2006 జనవరి 1వ తేదీ తర్వాత జన్మించిన వారై ఉండాలన్నారు. ఎంపికలలో పాల్గొనే జూనియర్, సబ్ జూనియర్ క్రీడాకారులు ఆధార్, బర్త్ సర్టిఫికెట్లను తీసుకుని రావాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment