సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మాధవిరెడ్డి, టీడీపీ నేతలు (ఫైల్)
మరుగున పడిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేనిఫెస్టో
ఆర్నెళ్లలో అభివృద్ధి అంటూ టీడీపీ ప్రత్యేక హామీలు
కడప ఎమ్మెల్యే మాట ఇచ్చి మర్చిపోయారంటున్న నగర వాసులు
సాక్షి ప్రతినిధి, కడప: కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాటల్లో చంద్రబాబును మించిపోయారు. శుష్క వాగ్ధానాలతో ప్రజలను మోసం చేసి గెలిచిన కూటమి ప్రభుత్వ బాటలోనే ఎమ్మెల్యే కూడా నడుస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకమైన మేనిఫెస్టో అంటూ హామీలిచ్చిన ఆమె, ఆ తర్వాత వాటి ఊసే మర్చిపోయారు. సొంత నిధులతో కడపలో ఎన్నెన్నో చేస్తానని ఇచ్చిన హామీలకు ఏడు నెలలు గడుస్తున్నా అతీగతీ లేకుండా పోయింది.
● ఎన్నికల్లో గెలవడానికి కూటమి ప్రభుత్వం అలవిగాని హామీలిచ్చింది. సూపర్ సిక్స్ పేరిట అనేక వాగ్దానాలు చేసింది. ఇక కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మరో అడుగు ముందుకు వేసి తన సొంత మేనిఫెస్టో అంటూ విడుదల చేసి ఇంటింటికీ పంచారు. కొన్ని పనులకై తే తమ సొంత నిధులను ఖర్చు చేస్తామని, అదీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేస్తామంటూ మాటలు కోటల్ని దాటించారు. ఏడు నెలలు గడుస్తున్నా హామీలు గడప దాటడం లేదు.
కడప గడప అభివృద్ధి వైఎస్ కుటుంబం చలువే
మున్సిపాలిటీగా ఉన్న కడపను కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేసి అభివృద్ధిని పరుగులు పెట్టించారు నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కడపలో కనిపిస్తున్న ప్రతి ఒక్క అభివృద్ధి పనులు ఆ తండ్రీ కొడుకులు చేసినవే. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మేయర్ సురేష్‌బాబు కోట్లాది రూపాయాల నిధులు తీసుకువచ్చి కడపను అభివృద్ధివైపునడిపారు.
డైవర్షన్ రాజకీయాలు..
ఎమ్మెల్యే మాధవీరెడ్డి తానిచ్చిన హామీలను పక్కనబెట్టి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపుతున్నారు. కడపలో తాగునీటి సమస్యకు పరిష్కారం లేదంటూ మాట్లాడుతూ కాలం గడుపుతున్నారు. బ్రహ్మంసాగర్ నుంచి కడపకు తాగునీటి ప్రాజెక్టును వైఎస్ జగన్ ప్రభుత్వం మంజూరు చేస్తే ఆ పనులనూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయించడం ఆమెకు చేతకాలేదనే విమర్శలు తెరపైకి వచ్చాయి. ఓ వైపు తానిచ్చిన వాగ్దా నాలను అమలు చేయకపోవడం, మరో వైపు వైఎస్ జగన్ సర్కార్ మంజూరు చేసిన పనులను కూడా కొనసాగించకపోవడంపై ప్రజలు తప్పు పడుతున్నారు.
సీసీ కెమెరా ఏర్పాటు హామీ ఏమైందో!
ప్రతి వీధిలో సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని మాధవి హామీ ఇచ్చారు. అందుకు రూ.50లక్షలు వెచ్చించనున్నట్లు ప్రకటించారు. 7నెలలు గడిచాయి.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానన్న మాటలు గాలిలో కలిశాయి. ప్రతి పేద కుటుంబానికి సొంత నిధులతో 5 లక్షల బీమా చేయిస్తానన్నారు. నగర వ్యాప్తంగా మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేస్తానన్న మాట ఒక మహిళగా ఆమెకు గుర్తులేదు. సొంత డబ్బులతో కడపలో యువతకు ఉపాధి శిక్షణ సంస్థ ఏర్పాటు చేసి ఐదేళ్లలో 10వేల మందికి ఉద్యోగాలన్నారు. ఆ శిక్షణ సంస్థ మాటే ఇప్పుడు ఆమె నోటివెంట రావడం లేదు. ఇలా ఎన్నో హామీలు ఇచ్చిన ఆమె వాటి గురించి మాట్లాడం లేదు. ఎంతసేపు కార్పొరేషన్ పాలకమండలి సమావేశంలో కుర్చీ వేయలేదని రాద్ధాంతం చేస్తున్నారని.. లేని ప్రొటోకాల్ కోసం పాకులాడుతున్నారని పరిశీలకులు విమర్శిస్తున్నారు.
షామీరియా మసీదు బ్రిడ్జి నిర్మాణం ఊసే లేదు
నగరం మధ్యలోంచి వెళ్లే బుగ్గవంకపై డాక్టర్ వైఎస్సార్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాలు ఆరు వంతెనలను నిర్మించాయి. మరో రెండు వంతెనలను కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం మంజూరు చేసింది. ఆపై కోడ్ రావడంతో పనులు ఆగిపోయాయి. ఆ పనులు పూర్తి చేయించే బాధ్యత తాను తీసుకుంటానని.. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో షామీరియా మసీదు వద్ద బ్రిడ్జి పూర్తి చేస్తామని మాధవిరెడ్డి ప్రకటించారు. అవసరమైతే సొంత నిధులు సైతం వెచ్చిస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ మాటే మరుగున పడింది. మాజీ సీఎం వైఎస్ జగన్ మంజూరు చేసిన నిధులు సైతం కూటమి ప్రభుత్వం నుంచి తీసుకురావడంలో వైఫల్యం చెందారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్యే ఒక్క హామీ నెరవేర్చలేదు
ఎన్నికలకు ముందు టీడీపీ మేనిఫెస్టోతోపాటు ఎమ్మెల్యే మాధవి ప్రత్యేకంగా తన సొంత మేనిఫెస్టో తయారు చేసి ప్రచారం చేశారు. ఏడు నెలలు కావస్తున్నా అందులో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. బుగ్గవంకపై రవీంద్రనగర్–నాగరాజుపేట బ్రిడ్జిలకు తాము రూ.20 కోట్లు మంజూరు చేయించి టెండర్లు పూర్తి చేసి భూమి పూజ చేశాం. కాంట్రాక్టర్ తండ్రి మృతి చెందడంతో ఆ పనులు ఆలస్యమయ్యాయి. ఆలోపు ఎన్నికల కోడ్ వచ్చి పనులు ఆగిపోయాయి. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఎమ్మెల్యే మాధవి ఆ పనులకు తిరిగి టెంకాయ కొట్టి ఆరు నెలల్లోపు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. కడపకు నీటి సమస్యను శాశ్వతంగా దూరం చేసేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బ్రహ్మంసాగర్‌లో 1.5 టీఎంసీల నీటిని కేటాయించి రూ.540 కోట్లతో పైపులైన్ నిర్మించేందుకు టెండర్లు పూర్తి చేసినా ఆ పనులు మొదలు పెట్టలేదు. మనసులో కక్ష పెట్టుకుని వైఎస్సార్‌సీపీ నాయకులను ప్రలోభాలకు గురిచేస్తూ సొంత అజెండా అమలు చేస్తున్నారు. – ఎస్‌బీ అంజాద్‌బాషా, మాజీ డిప్యూటీ సీఎం
ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి నిధులు తేలేదు
కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు పూర్తయింది. ఈనెల 4వ తేదికి ఏడు నెలలు పూర్తవుతాయి. ఈ ఏడు నెలల్లో కడప ఎమ్మెల్యే మాధవి నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి నిధులు తెచ్చిన పాపాన పోలేదు. ఎన్నికల ముందు ఏవేవో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు.
– కె.సురేష్‌బాబు, నగర మేయర్, కడప
Comments
Please login to add a commentAdd a comment