ఒంటిమిట్ట రామాలయానికి పోటెత్తిన భక్తులు
ఒంటిమిట్ట: ఆంధ్రా భద్రాద్రిగా పేరు గాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయానికి నూతన సంవత్సరం సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. భక్తుల కోసం తిరుమల–తిరుపతి దేవస్థానం వారు బాలాలయం వద్ద ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. రామాలయం లోపల ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడింది. తిరుమల–తిరుపతి దేవస్థానం వారు భక్తులకోసం రుచికరమైన నైవేద్య ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ ప్రసాదం కోసం భక్తులు పొడవాటి క్యూలైన్‌లో బారులు తీరారు. అలాగే రామాలయం ఎదురుగా ఉన్న అన్న ప్రసాద కేంద్రానికి భక్తులు పోటెత్తారు.
కళాశాల విద్య ఆర్‌జేడీగా నాగలింగారెడ్డి
వైవీయూ: కళాశాల విద్య (డిగ్రీ) కడప ప్రాంతీయ సంయుక్త సంచాలకులుగా డాక్టర్ డి. నాగలింగా రెడ్డి నియమితులయ్యారు. ఆర్‌జేడీగా పనిచేసిన డాక్టర్ డేవిడ్‌కుమార్‌స్వామి డిసెంబర్ 31న ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో నాగలింగారెడ్డిని నియమిస్తూ కళాశాల విద్య డైరెక్టర్ నారాయణ భరత్‌గుప్తా ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఆయన బుధవారం కడప నగరంలోని ఆర్‌జేడీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కాగా ఈయన అనంతపురం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉండగా, పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో కడప ఆర్‌జేడీగా బాధ్యతలు నిర్వహించనున్నారు.
3న వినతిపత్రాల స్వీకరణ
కడప రూరల్: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈనెల 3వ తేదీన ఏకసభ్య కమిషన్ వినతి పత్రాలను స్వీకరిస్తుందని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ తెలిపారు. షెడ్యూల్డ్ కులాల్లో ఉప వర్గీకరణపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను నియమించిందని పేర్కొన్నారు. ఈ కమిషన్ 3వ తేదీన జిల్లా పర్యటనలో భాగంగా ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్ లోని సభ భవన్ లో వివిధ కులాల సభ్యులు సంఘాల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారని తెలిపారు. తమ వినతి పత్రాలకు సంబంధించిన తగిన ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని పేర్కొన్నారు.
7 వరకు సామాజిక తనిఖీ అభ్యంతరాలకు అవకాశం
కడప రూరల్: షెడ్యూల్డ్ కులాల గణనకు సంబంధించి సామాజిక తనిఖీ అభ్యంతరాలను ఈనెల 7వ తేదీ వరకు స్వీకరిస్తామని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె. సరస్వతి తెలిపారు. కుల గణన వివరాలు గ్రామ, వార్డ్ సచివాలయ కార్యాలయాల్లో ప్రదర్శనగా ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యంతరాలు ఉంటే ఈ నెల ఏడవ తేది వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన ఉంటుందని తెలిపారు. తుది జాబితాను 17వ తేదీ సంబంధిత సచివాలయాల్లో ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను వీఆర్వోలు పరిశీలించి తహసీల్దార్ కు నివేదికను పంపుతారని పేర్కొన్నారు. అనంతరం తహసిల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, వీఆర్వోలు వివరాలను పరిశీలించి తుది ఆమోదం పొందిన వివరాలను భద్రపరుస్తామని వివరించారు.
దరఖాస్తుల గడువు పొడిగింపు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: జిల్లాలోని రెండు బార్లు, ఒక ప్రీమియం స్టోర్ ఏర్పాటుకు దరఖాస్తులను ఈనెల 7 వరకు పొడిగించినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవి కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో రెండు బార్లు, ఒక ప్రీమియం స్టోర్‌కు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. డిసెంబర్ 31 వరకు ఎవరూ దరఖాస్తు చేసుకోకపోవడంతో గడువును పొడిగించినట్లు తెలిపారు. ప్రీమియం స్టోర్‌కు దరఖాస్తుదారుడు నాన్ రిఫండబుల్‌గా రూ. 15 లక్షలు డీడీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆలాగే స్టోర్ దక్కించుకున్న వారు లైసెన్స్ కింద రూ. కోటి చెల్లించాలన్నారు. లైసెన్స్ వచ్చిన తరువాత 4 వేల చదరపు అడుగుల్లో స్టోర్ రూమ్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రీమియం స్టోర్‌లలో ఐఎంఎఫ్‌ఎల్ ధర రూ. 1200, బీరు ధర 400 మాత్రమే విక్రయాలు జరుగుతాయన్నారు. జిల్లాలో కేంద్రంలో ప్రీమియం లిక్కర్ స్టోర్‌తో పాటు ఒక బార్‌ను, ఎర్రగుంట్లలో మరో బార్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment