జిల్లా ర్యాంకు.. అట్టడుగుకు
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో అభివృద్ధి పడకేసింది. ప్రాథమిక రంగాలు తిరోగమన దిశలో ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు స్థూల జిల్లా దేశీయోత్పత్తిలో మంచి స్థానంలో ఉన్న జిల్లా ప్రస్తుతం 11వ ర్యాంకుకు పడిపోయింది. తలసరి ఆదాయంలో మిగతా జిల్లాలతో పోలిస్తే 12వ స్థానంలోకి దిగజారింది. జీడీడీపీలో మొదటి మూడు స్థానాల్లో వరుసగా విశాఖపట్టణం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. కోస్తా జిల్లాలతోపోలిస్తే రాయలసీమ జిల్లాలు బాగా వెనకబడి ఉన్నాయి. ప్రాథమిక రంగాల్లో వృద్ధిరేటు పడిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిల్లా విజన్ డాక్యుమెంటు (2024–29)లో మరెన్నో విస్తుపోయే నిజాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్న వాటినే అమరావతికి తరలిస్తుండడం దారుణమని పలువురు విమర్శిస్తున్నారు.
జీడీడీపీని జిల్లా అభివృద్ధికి కొలమానంగా భావిస్తారు. ప్రాథమిక రంగాలైన వ్యవసాయం, పరిశ్రమ లు, సర్వీసు సెక్టార్లను పరిగణలోకి తీసుకుని జీడీడీపీని రూపొందిస్తారు. స్థూల జిల్లా దేశీయోత్పత్తి రూ. 51,715 కోట్లుగా నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా కేటాయించిన ర్యాంకింగ్‌లో కడప 11వ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. రాష్ట్ర జీడీపీలో జిల్లా వాటా 3.97 శాతంగా ఉంది.
ఆయా రంగాల్లో వాటాలిలా..
జీడీడీపీలో వ్యవసాయరంగ వాటా 16,817 కోట్ల రూపాయలు. రాష్ట్రంలో ఈ వాటా 11వ స్థానంలో ఉంది. అలాగే పారిశ్రామికరంగ వాటా 12,975 కోట్లు. ఇది రాష్ట్రంలో 10వ ర్యాంకులో ఉంది. ఇక సర్వీసు సెక్టార్ విషయానికొస్తే 38.63 శాతం ఉంది. జీడీడీపీలో సర్వీసు సెక్టారు వాటానే అధికంగా ఉండడం గమనార్హం. ఇక జిల్లా తలసరి ఆదాయాన్ని పరిశీలిస్తే 2,09,084 రూపాయలుగా నమోదైంది. తలసరి ఆదాయంలో మిగతా జిల్లాలతో పోలిస్తే కడప 12వ ర్యాంకులో ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ విజన్ డాక్యుమెంటును పరిశీలిస్తే జిల్లాలో అభివృద్ధి ఎలా ఉందో అర్థమవుతోంది. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే నిర్మాణమైన ప్రాజెక్టుల కింద డిస్ట్రిబ్యూటరీలు, పంట కాలువలు ఏర్పాటు చేస్తే ఈ రంగం నుంచి జీడీడీపీలో వాటా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అనకాపల్లి స్టీల్ ప్లాంటు ఏర్పాటుపై చూపుతున్న శ్రద్ధ విభజన హామీల్లో భాగమైన కడప ఉక్కు పరిశ్రమపై చూపలేదు. కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్కులో ఉన్న ఎంఎస్‌ఎంఈ టెక్నికల్ సెంటర్‌ను అమరావతికి తరలించింది. ఇలా జిల్లా పారిశ్రామికరంగ అభివృద్ధిపై ప్రభుత్వం కక్షగట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా కక్ష సాధింపు ధోరణిని మానుకుని జిల్లా వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధిపై దృష్టి సారిస్తే జీడీడీపీతోపాటు ప్రజల తలసరి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
స్థూల జిల్లా దేశీయోత్పత్తిలో 11వ ర్యాంకు
జీఎస్‌డీపీలో జిల్లా వాటా 3.97 శాతం
జిల్లా తలసరి ఆదాయం రూ. 2,09,084
రాష్ట్రంలో 12వ ర్యాంకు
Comments
Please login to add a commentAdd a comment