![లారీ.. టిప్పర్ ఢీ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/31/30jmd301-170012_mr-1738265330-0.jpg.webp?itok=zso4s_er)
లారీ.. టిప్పర్ ఢీ
ముద్దనూరు : ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిలో గంగాదేవిపల్లె సమీపంలో గురువారం సాయంత్రం ఎదురెదురుగా ప్రయాణిస్తున్న లారీ, టిప్పర్ ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో వీరపునాయునిపల్లె మండలం అలిదిన గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ నాగసుబ్బారెడ్డి(36) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. ముద్దనూరు వైపు నుంచి తాడిపత్రికి నాపరాళ్లతో లారీ ప్రయాణిస్తోంది. ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీకొంది. ఈ ఘటనలో లారీ ముందు భాగం నుజ్జునుజ్జయింది. లారీ క్యాబిన్‌లోనే డ్రైవర్ ఇరుక్కుని మృతి చెందాడు. సుమారు గంటసేపు జేసీబీ సాయంతో లారీలో ఇరుక్కున్న డ్రైవర్ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ కిరణ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. 108 వాహనంలో క్షతగాత్రున్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ దస్తగిరి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూశారు.
లైంగిక వేధింపులపై కేసు నమోదు
కొండాపురం : మండల పరిధిలోని చౌటిపల్లె పునరావాస కాలనీ సమీపంలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ క్రిష్ణవేణి భర్త జి. ఓంకార్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అదే కళాశాలలో గతంలో పనిచేసిన పి.వెంకట నాగలక్ష్మిని వేధించారనే ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు కొండాపురం ఎస్‌ఐ విద్యాసాగర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ 2023 సంవత్సరంలో గురుకుల జూనియర్ కళాశాలలో సెక్యూరిటీ సూపర్ వైజర్‌గా పనిచేసే సమయంలో ప్రిన్సిపాల్ భర్త ఓంకార్ తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఆమె ఫిర్యాదు చేశారన్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ క్రిష్ణవేణిని వివరణ కోరగా వెంకట నాగలక్ష్మి అసత్య ఆరోపణలు చేయడం చాలా అన్యాయమన్నారు.
డ్రైవర్ దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment