సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల కట్టడి
రాయచోటి: నేరాల కట్టడికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని పోలీస్ యంత్రాంగాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశించారు. బుధవారం అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్‌ను డీఐజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నేరాలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీసు సిబ్బందికి ఆయన సూచించారు. ఫిర్యాదు దారులపట్ల స్నేహభావాన్ని పెంపొందించుకొని సత్ప్రవర్తనతో ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి చట్ట పరిధిలో బాధితులకు న్యాయం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల చర్యల పట్ల ఎప్పటికప్పుడు పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నామన్నారు. అసాంఘిక కార్యక్రమాలను ప్రేరేపించే వారిపట్ల ప్రత్యేక దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అపార్ట్‌మెంట్‌లు, షాపులు, ప్రధాన రహదారులు, పాఠశాలల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి వివరించి వాటిని అమర్చుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించామన్నారు. ప్రతివారం మహిళా పోలీసులతో కలిసి పాఠశాలల్లో, పబ్లిక్ ప్రదేశాల్లో మాదక ద్రవ్యాలు, బాల్య వివాహాలు, మహిళలపై జరిగే నేరాలు, ఆన్‌లైన్, సైబర్ మోసాలు, వైట్ కాలర్ నేరాలు తదితర విషయాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించామన్నారు. అంతకు ముందు రాయచోటి స్టేషన్ పరిధిలో పెండింగ్ కేసుల వివరాలు, రికార్డుల నిర్వహణ, శాంతి భద్రతల పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఐజీ పోలీసులకు తగు సూచనలు, సలహాలు చేశారు. డీఐజీ అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎం వెంకటాద్రి, రాయచోటి సీఐ ఎన్ వరప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ పి రాజా రమేష్, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ తులసీరామ్, రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐలు నరసింహారెడ్డి, అబ్దుల్ జహీర్, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్
రాయచోటి అర్బన్ స్టేషన్ తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment