Diseases
-
జలుబు, దగ్గు నుంచి బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి
వేసవికాలం ముగిసింది. వర్షాకాలం వచ్చేస్తోంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా దగ్గు, జలుబులు వంటివి సర్వసాధారణం. ఈ సమస్య అంత ప్రమాదకరమైనది కానప్పటికీ, ఇది ఒకరి నుంచి మరొకరి అంటుకునే అవకాశం ఉంటుంది. తరచుగా దగ్గు, జలుబు నుంచి వంటింటి చిట్కాలతో సత్వర ఉపశమనం పొందొచ్చు. తులసి ఆకుల రసంలో అంతే మొత్తంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. ఓ నాలుగైదు తమలపాకులను వెచ్చచేసి, వాటిని నూరి రసం తీసి, దానిలో అంతే మొత్తంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. ఓ రెండు చెంచాల నూనెను కాచి, ఒక పెద్ద చెంచాడు కర్పూరాన్ని పొడిచేసి నూనెలో కలిపి ఒక సీసాలో నిల్వ ఉంచాలి. దీనిని ఛాతీకి, గొంతుకకూ రాస్తే దగ్గు, జలుబు తగ్గుతాయి. గుప్పెడు జామాయిలు (యూకలిప్టస్ ) ఆకుల్ని రెండు గ్లాసుల నీళ్లల్లో పోసి అవి మరిగి ఒక గ్లాసు అయ్యేదాకా మరగబెట్టాలి. అనంతరం ఆ నీటిని వడగట్టి అందులో కొంచెం పంచదార కలిపి, రోజుకు మూడుసార్లు తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. -
ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం.. ప్రత్యేకం
జూన్ 8, ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం.. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా "ఒత్తిడిని తగ్గించుకోండి - మిమ్మల్ని మీరే కాపాడుకోండి" అనే థీమ్ తో ప్రపంచవ్యాప్తంగా ఈ ట్యూమర్లపై అవగాహన కల్పించడానికి మీ ముందుకొచ్చింది. బ్రెయిన్ ట్యూమర్.. అది ప్రమాదకరమైనది కావచ్చు, ప్రమాదం లేనిది కావచ్చు... మెదడులో ట్యూమర్ అంటూ వచ్చిందంటే ధృడమైన పుర్రె భాగం అడ్డుగా ఉంటుంది కాబట్టి అది లోపలి భాగాన్ని నొక్కి పెడుతూ దాని పరిమాణాన్ని పెంచుకుంటూ ఉంటుంది. దీని కారణంగా అనేక లక్షణాలు బయట పడుతూ ఉంటాయి. అసాధారణ లక్షణాల ఆధారంగా మెదడు పనితీరులో మార్పులను గమనించి వెంటనే అప్రమత్తమై డాక్టర్లను ఆశ్రయించి ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణహాని లేకుండా బయట పడవచ్చు. ఆలస్యం చేస్తే మాత్రం ట్యూమర్ కణాలు వాటి సంఖ్యను పెంచుకుంటూ పోతాయి. ఫలితంగా ట్యూమర్ సైజ్ పెరిగి ప్రమాదకరంగా మారుతుంది. అందుకే బ్రెయిన్ ట్యూమర్ అవగాహనలో భాగంగా ట్యూమర్లను తరచుగా తలనొప్పి రావడం, జ్వరం రావడం, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం, ఆకలి తగ్గిపోవడం, ఏమి తిన్నా వాంతులు అవ్వడం, అవయవాల పనితీరు దెబ్బతినడం వంటి చిన్న చిన్న లక్షణాల ఆధారంగా ముందుగానే గుర్తించమని చెబుతున్నారు ద్వారక HCMCT మణిపాల్ హాస్పిటల్ న్యూరో విభాగాధిపతి డా.అనురాగ్ సక్సేనా. బ్రెయిన్ ట్యూమర్లను తొందరగా గుర్తించడం వలన ప్రయోజనాలు: ట్యూమర్ సైజ్ నియంత్రించవచ్చు: ట్యూమర్ పెరిగేకొద్దీ మెదడు లోపలి భాగాన్ని బాగా నొక్కిపెడుతుంది కాబట్టి సరైన ట్రీట్మెంటును ఆశ్రయిస్తే ముందు దాని సైజ్ పెరగకుండా నియంత్రించవచ్చు. లక్షణాలను బట్టి నియంత్రిచవచ్చు: బ్రెయిన్లో ట్యూమర్ వచ్చినప్పుడు విపరీతంగా తలనొప్పు రావడం, కళ్ళు తిరుగుతుండటం, మూర్ఛపోవడం, ఇంద్రియాల పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. లక్షణాల ఆధారంగా ట్రీట్మెంట్ అందిస్తే పేషేంట్ తొందరగా కోలుకునే అవకాశముంటుంది. నరాల వ్యవస్థ దెబ్బతినకుండా కాపాడుకొవచ్చు: మెదడులో ఏర్పడిన ట్యూమర్లు చుట్టుపక్కల ఉన్న కణజాలాన్ని బాగా దెబ్బతీస్తుంది. ఫలితంగా నరాల వ్యవస్థ కూడా దెబ్బ తింటుంది. ముందుగా గుర్తించడం వలన నరాల వ్యవస్థ అస్తవ్యస్తం కాకుండా, కొన్ని దీర్ఘకాలిక సమస్యల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు. ట్యూమర్ గుర్తించే సమయాన్ని బట్టి ట్రీట్మెంట్: ముందుగానే వీటిని గుర్తిస్తే సర్జరీ ద్వారా తొలగించే అవకాశముంటుంది. మరికొన్ని సందర్భాల్లో కీమో థెరపీ, రేడియేషన్, ఇమ్యునో థెరపీ, టార్గెటెడ్ థెరపీ ఇలా అనేక రకాల ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మెరుగైన వైద్యంతో వీటినుండి తొందరగా ఉపశమనం పొందవచ్చు. ప్రాణహాని లేకుండా బయటపడవచ్చు: తొందరగా గుర్తించడం వలన డాక్టర్లు అవసరాన్ని బట్టి సర్జరీ చేసి ట్యూమర్ ను తొలగించే వీలుంటుంది. ఆలస్యం చేసేకొద్దీ ట్రీట్మెంట్ జటిలంగా మారుతూ ఉంటుంది. ఒక్కోసారి అవసరాన్ని బట్టి సర్జరీ తోపాటు కీమో థెరపీ, రేడియేషన్ ట్రీట్మెంట్లు కూడా చేయాల్సి ఉంటుంది. ఫలితంగా ట్యూమర్ల సమస్యను సులభంగా అధిగమించవచ్చు. -
World Digestive Health Day: తిన్నది అరక్కపోతే తిప్పలే!
గుంటూరు మెడికల్: ఆధునిక జీవన శైలి వల్ల ఎక్కువ మంది జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి ఏడాది డైజిస్టీవ్ సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రాథమిక దశలోనే వాటిని గుర్తించి అరికట్టకపోతే పెద్దపేగు క్యాన్సర్కు దారితీయవచ్చు. జీర్ణక్రియ సంబంధిత సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ 2004 నుంచి మే 29న వరల్డ్ డైజిస్టివ్ డే (జీర్ణ ఆరోగ్య దినోత్సవం) నిర్వహిస్తున్నారు. ఈఏడాది కొలొరెక్టల్ క్యాన్సర్ (పెద్దపేగు క్యాన్సర్)పై అవగాహన కల్పించాలని డైజిస్టివ్డే సందర్భంగా నిర్ణయించారు. ఈసందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. తిన్న ఆహారం అరగకపోతే సమస్యలు.. జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా మనం తీసుకునే ఆహారం సరైన పద్ధతిలో తీసుకోకపోవడం వల్ల వస్తున్నాయి. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అవకపోవడం కూడా వ్యాధులు రావడానికి కారణమవుతోంది. తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమైనప్పుడే శరీరంలోని వివిధ అవయవాలకు శక్తి లభిస్తోంది. జీర్ణవ్యవస్థ మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి అందులోని పోషకాలను రక్తంలోకి చేరుస్తోంది. రక్తం నుంచి కాలేయానికి అక్కడి నుంచి పోషకాలు శరీరంలోని వివిధ అవయవాలకు చేరడం ద్వారా మనిషికి శక్తి లభిస్తోంది. యాంత్రిక జీవనం వల్ల హడావుడిగా ఆహారం తీసుకోవడం, ఫాస్ట్ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, నిర్ణీత ఆహార వేళలు పాటించకుండా మసాలా దినుసులతో కూడిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి. జీవనశైలితో పెరుగుతున్న వ్యాధులు.. జీర్ణక్రియ సంబంధిత వ్యాధులు ఆధునిక జీవన శైలి వల్ల పెరుగుతున్నాయి. ఇంట్లో ఆహారం తయారు చేసుకుని తినకుండా ఎక్కువ శాతం హోటళ్లలో తినడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. ఉద్యోగరీత్యా, చదువులు, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలతో ఎక్కువగా ఒత్తిడికి లోనవడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పెద్దపేగు క్యాన్సర్కు దారి తీయొచ్చు... జీర్ణకోశ సంబంధిత సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేయకపోవడం ద్వారా అవి పెద్ద పేగు క్యాన్సర్కు దారి తీసే ప్రమాదం ఉంది. పెద్దపేగు క్యాన్సర్ సోకిన వారిలో ప్రాథమిక దశలో పొట్టకింద నొప్పి, పొట్టబిగపట్టడం, మలవిసర్జన సమయంలో నొప్పి, మలద్వారం నుంచి రక్తస్రావం అవడం, కొన్ని సార్లు ఎక్కువగా విరోచనాలు అవడం, బరువు తగ్గిపోవడం, అలసట, తదితర సమస్యలు కనిపిస్తాయి. జీజీహెచ్లో ఉచిత వైద్య సేవలు.. గుంటూరు జీజీహెచ్లో జీర్ణకోశ సంబంధిత సమస్యల బాధితులకు ఉచితంగా అత్యాధునిక వైద్య పరికరాలతో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందిస్తున్నారు. వారంలో మంగళవారం, శుక్రవారం గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య విభాగంలో వివిధ రకాల జీర్ణకోశ సంబంధిత సమస్యలతో బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. ప్రతిరోజూ 300 మంది వివిధ రకాల సమస్యలతో వైద్యం కోసం వస్తున్నారు. జీర్ణకోశ సంబంధిత సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేయవచ్చని గ్యాస్ట్రో ఎంట్రాలజీస్టులు తెలియజేస్తున్నారు. జీజీహెచ్లో ఈ సమస్యలకు అత్యాధునిక ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు మేలు.. ఆహారం తిన్నవెంటనే ఎట్టిపరిస్థితుల్లోనూ నిద్రకు ఉపక్రమించకూడదు. సాధ్యమైంత మేర రాత్రి వేళల్లో త్వరితగతిన 9 గంటల్లోపు భోజనం చేయాలి. భోజనం చేసిన అనంతరం కొంతసేపు నడవడం ద్వారా జీర్ణక్రియ మెరుగు పడుతోంది. ఒత్తిడి, ఆందోళన లేకుండా యోగా, నడక, కొద్దిపాటి వ్యాయామాలు చేయాలి. జీర్ణ వ్యవస్థకు హాని కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. – డాక్టర్ షేక్ నాగూర్బాషా, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, గుంటూరు జీజీహెచ్