Editorial
-
న్యాయాన్యాయాలు
న్యాయం చేయటమే కాదు... చేసినట్టు కూడా కనబడాలంటారు. శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రాను బహిష్కరిస్తూ లోక్‌సభ మూజువాణీ ఓటుతో తీర్మానం ఆమోదించిన తీరు ఈ మౌలిక సూత్రాన్ని విస్మరించింది. మొయిత్రాపై వచ్చిన ఆరోపణల్లోని నిజానిజాలేమిటి, వాటి తీవ్రత ఎంత... ఎథిక్స్ కమిటీ ఆ ఆరోపణలను పరిశీలించవచ్చునా లేదా వంటి సందేహాల వరకూ పోనవసరం లేదు. అసలు బహిష్కరణకు గురయ్యే సభ్యులు ఆ నిర్ణయంపై సభలో తమ స్వరం వినిపించటానికి అవకాశం ఇవ్వకపోవటం సబబేనా? మొన్న 4న మొదలైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 22వ తేదీ వరకూ సాగుతాయి. నివేదికపై శుక్రవారం అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం నడిచింది. ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ విపక్షం వాకౌట్‌చేసింది. ఎథిక్స్ కమిటీలో మొయిత్రాకు అవకాశమిచ్చామని, కానీ అడిగిన వాటికి జవాబులివ్వకుండా ఆమె దూషణలకు దిగారని కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్ సోంకార్, కమిటీలోని బీజేపీ సభ్యులు ఇప్పటికే ఆరోపించారు. ఫిర్యాదుకు సంబంధంలేని ప్రశ్నలతో వేధించారని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఆ ప్రశ్నలున్నాయని మొయిత్రా కూడా ప్రత్యారోపణ చేశారు. ఒకవేళ మొయిత్రా చేసిన ఆరోపణలన్నీ అబద్ధమే అనుకున్నా... అంతమాత్రాన సభలో తన వాదన వినిపించేందుకు ఆమె అనర్హురాలవుతారా? చట్టసభల్లో జరిగే చర్చలు, వాటి ప్రత్యక్ష ప్రసారాలు పాలక, విపక్ష సభ్యుల్లో ఎవరు ఎవరికంటే బాగా మాట్లాడుతున్నారో నిర్ణయించటానికి కాదు. తాము ఎన్నుకున్న సభ్యులు చర్చిస్తున్నదేమిటో, తీసుకుంటున్న నిర్ణయాలేమిటో, వాటిలోని మంచిచెడ్డలేమిటో తెలుసుకోవటం కోసం. మొయిత్రా కావొచ్చు...మరొకరు కావొచ్చు – చర్చ సందర్భంగా అప్రామాణికంగా లేదా అసంబద్ధంగా మాట్లాడితే వారి వాదనలోని డొల్లతనాన్ని ప్రజలే గ్రహిస్తారు. అది పాలకపక్షానికే మంచిది. సభలో అధికారపక్షానికి కావలసినంత మెజారిటీ వుంది. కనుక మొయిత్రాకు అవకాశమిచ్చినంత మాత్రాన కలిగే నష్టం ఏమీ లేదు. అసలు ఎథిక్స్ కమిటీ నివేదికను పార్లమెంటు శీతాకాల సమావేశ ప్రారంభం రోజైన ఈనెల 4నే ప్రవేశపెట్టాలి. కానీ పాలక పక్షం శుక్రవారానికి వాయిదా వేసింది. అయినా ఈ వ్యవహారం ఇలా ముగియటం మన పార్లమెంటరీ వ్యవస్థ లోపాన్ని తెలియజెబుతోంది. నివేదికను కమిటీలోని ఆరుగురు అంగీకరించగా, నలుగురు దాన్ని వ్యతిరేకించారు. ఎథిక్స్ కమిటీ నిర్ణయం సబబే కావొచ్చు... అది మెజారిటీ ప్రకారమే తీసుకుని వుండొచ్చు. కానీ సభలో మొయిత్రాకు అవకాశమీయటంవల్ల ఎంపీగా ఆమె ప్రవర్తనలోని గుణదోషాలను పౌరులు తెలుసుకునే అవకాశం వుంటుంది కదా! దాన్ని నిరాకరించటం ఏం సబబు? మొయిత్రాపై వున్న ఆరోపణల పూర్వాపరాలు పరిశీలిస్తే పార్లమెంటు సభ్యురాలిగా ఆమె తన పరిమితులు అతిక్రమించారా అన్న సందేహాలు కలుగుతాయి. సభలో వేయదల్చుకున్న ప్రశ్నలను సభ్యులు ఎక్కడి నుంచి అయినా ఎన్ఐసీలో లాగిన్ అయి, నేరుగా స్పీకర్‌కు చేరే విధంగా పోస్ట్ చేయొచ్చు. ఆ ప్రశ్నల అర్హతను స్పీకర్ నిర్ణయించాక అవి సంబంధిత మంత్రిత్వ శాఖలకు వెళ్తాయి. అనర్హ ప్రశ్నలను తొలగిస్తారు. ఇదంతా ఆమె నేరుగా చేసివుంటే ఇంత రచ్చయ్యేందుకు ఆస్కారం వుండేది కాదు. తన స్నేహితుడైన దుబాయ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి హీరానందానీకి తన పార్లమెంటు లాగిన్, పాస్వర్డ్ అందజేసి అందులో ప్రశ్నలు పోస్ట్ చేయించమని చెప్పారు. తన నియోజకవర్గ పనుల్లో తీరిక లేకుండా వున్నందున ఇలా చేయించానని మొయిత్రా సంజాయిషీ. మామూలుగా ఇది సబబు అనిపించదు. కానీ 800మంది ఎంపీల్లో అత్యధికులు ఇలాగే చేస్తున్నారని, ప్రతిదీ వారే చేయాలంటే అసాధ్యమని ఆమె చెబుతున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక నిబంధనేదీ లేదంటున్నారు. ఒకరిద్దరు సభ్యులు సైతం తామూ అలాగే చేస్తున్నామని చెప్పారు. ఎథిక్స్ కమిటీ మాత్రం ఇది దేశ భద్రతకు ముప్పు తెచ్చే చర్య అంటున్నది. పైగా లంచం తీసుకుని అదానీ సంస్థ లపై ఆమె ఈ ప్రశ్నలు వేశారని బీజేపీ సభ్యుల ఆరోపణ. ఈ సందర్భంగా 2005లో ఆన్లైన్ పోర్టల్ ‘కోబ్రా పోస్ట్’ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ గురించి ప్రస్తావించుకోవాలి. 11మంది ఎంపీలు ప్రశ్నలు అడిగేందుకు తాము ఇవ్వజూపిన డబ్బు తీసుకున్నారని ఆ పోర్టల్ తేల్చింది. వీరిలో బీజేపీ, కాంగ్రెస్, ఆర్జేడీ, బీఎస్పీలకు చెందినవారున్నారు. ఇందులో 10 మంది లోక్‌సభ సభ్యులు, మరొకరు రాజ్యసభకు చెందినవారు. ఇదంతా ఒక చానెల్లో ప్రసారమైంది. ఆ ఎంపీలను సభ నుంచి బహిష్కరిస్తున్న సందర్భంలో మాట్లాడిన బీజేపీ సీనియర్ నేత అడ్వాణీ ఇందులో అవినీతికన్నా ఎంపీల బుద్ధిహీనత వెల్లడవుతోందన్నారు. అందుకు బహిష్కరణ శిక్ష విధించటం క్రూరమైన చర్యగా అభివర్ణించారు. మొయిత్రా విషయంలో దీన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా? అసలు మొయిత్రాపై వచ్చిన ఆరోపణలకు విడిపోయిన ఆమె సహచరుడు జైఅనంత్ దేహద్రాయ్ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేకు రాసిన లేఖ ప్రాతిపదిక. మొయిత్రా, దేహద్రాయ్‌లకు బోలెడు తగువులున్నాయి. పెంపుడు కుక్క విషయం మొదలుకొని ఎన్నిటిపైనో పరస్పరం కేసులు పెట్టుకున్నారు. అందువల్ల ఆ లేఖకు ఎంతవరకూ ప్రాధాన్యమీయవచ్చో ఆలోచిస్తే బాగుండేది. అలాగే ప్రభుత్వంపై మొయిత్రా తరచు నిశిత విమర్శలు చేస్తుంటారు గనుక, ఆ కారణంతోనే చర్య తీసుకున్నారన్న అపప్రద రాకుండా చూసుకోవాల్సింది. అసలు ఆమెకు సభలో మాట్లాడే అవకాశ మిస్తే ఆదరాబాదరాగా చేశారన్న నిందకు అవకాశం వుండేదే కాదు. – డా‘‘ గుబ్బల రాంబాబు, రాజమహేంద్రవరం (డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం) -
కాంగ్రెస్ సర్కారుకు సవాళ్లు
తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ఏలుబడి మొదలైంది. ఎన్నికల ఫలితాలు వెలువడగానే ముఖ్యమంత్రిని నిర్ణయించటం మొదలు మంత్రుల ఖరారు వరకూ కొనసాగే కాంగ్రెస్ మార్కు అనిశ్చితికి పెద్దగా తావు లేకుండానే అంతా పూర్తికావటం గమనించదగ్గది. మరో అయిదు నెలల్లో లోక్‌సభ ఎన్నికలుండటం, తెలంగాణలో గరిష్ఠ స్థాయిలో సీట్లు రాబట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఉండటం ఇందుకు కారణం కావొచ్చు. కేబినెట్ కూర్పులో రాజకీయ, పాలనానుభవం పుష్కలంగా వున్నవారితోపాటు కొత్త నెత్తురుకు కూడా చోటిచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గతంలో కాంగ్రెస్ ఏలుబడిలో మంత్రులుగా పనిచేశారు. జూపల్లి టీఆర్ఎస్ కేబినెట్లో కూడా మంత్రిగా ఉన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గతంలో డిప్యూటీ స్పీకర్‌గా,కాంగ్రెస్ శాసనభా పక్ష నేతగా వ్యవహరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుది ప్రత్యేక రికార్డు. ఆయన ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు దనసరి అనసూయ అలియాస్ సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం అమాత్యులుగా పరిపాలనకు కొత్త వారు. శాఖల కేటాయింపుపై ఊహాగానాలు వస్తున్నా అధికారిక ప్రకటనపై మాత్రం సస్పెన్స్ ప్రస్తు తానికి కొనసాగుతోంది. కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాక తెలంగాణలో ఆ పార్టీకి కొంత ఊపూ ఉత్సాహం వచ్చిన సంగతి నిజమే అయినా... అది అధికారాన్ని అందుకునే స్థాయికి ఎదుగుతుందని మొదట్లో ఎవరికీ అంచనాలు లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా, పార్టీ శాసనసభ్యుల పైనా ప్రజానీకంలో గూడుకట్టుకున్న అసంతృప్తిని పసిగట్టడంలో పార్టీ సారథి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలం అయ్యారు. వివిధ స్థాయుల్లో అవినీతి, సర్కారీ కొలువుల భర్తీలో ప్రదర్శించిన అలసత్వం, పోటీ పరీక్షల నిర్వహణలో వైఫల్యం, ధరణి పోర్టల్‌తో వచ్చిన సమస్యలు ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెచ్చాయి. సీఎం ఎవరికీ అందుబాటులో వుండరన్న అభిప్రాయం ఏర్పడటం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దెబ్బతీసింది. వీటన్నిటి పర్యవసానంగా ప్రత్యామ్నాయం కోసం తెలంగాణ ప్రజానీకం ఎదురుచూసింది. దీన్ని అందిపుచ్చుకుంటున్నట్టే మొదట్లో కనబడిన భారతీయ జనతా పార్టీ స్వీయతప్పిదాల వల్ల క్రమేపీ వెనక్కిపోయింది. ఇది కూడా కాంగ్రెస్‌కు లాభించింది. ఇక ఆ పార్టీ మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలు గెలుపును సునాయాసం చేశాయి. రైతు భరోసా కింద ఏటా రూ. 15,000, వ్యవసాయ కూలీలకు రూ. 12,000, రైతులకు అయిదేళ్ల వ్యవధిలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ, ఇంటింటికీ 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు, ప్రతి మహిళకూ నెలకు రూ. 2,500, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ. 500 కే గ్యాస్ సిలెండర్, ఇంది రమ్మ ఇళ్ల పథకం కింద సొంతిల్లు లేనివారికి ఉచితంగా స్థలం, రూ. 5 లక్షల సాయం, విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యాభరోసా కార్డు, చేయూత పథకం కింద నెలకు రూ. 4 వేల పెన్షన్, రూ. 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా తదితర హామీలు కూడా సగటు ఓటరును బాగా ఆకట్టుకున్నాయి. ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ఫైలు పైనే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. అయితే ఏటా రూ. 88,000 కోట్లు అవసరమని అంచనా వేస్తున్న ఈ పథకాల అమలుకు నిధులు సమకూర్చటం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు. ఇవిగాక ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలు ఉండనే ఉన్నాయి. ప్రస్తుతం రూ. 5 లక్షల కోట్ల రుణభారం ఉన్న తెలంగాణలో ఇదంతా కత్తిమీది సామే. ఎందుకంటే 2023–24 బడ్జెట్లో రాష్ట్ర ఆదాయాన్ని 2.16 లక్షల కోట్లుగా చూపారు. ఇక రెవెన్యూ వ్యయం రూ. 2.12 లక్షల కోట్లుంది. ఎఫ్ఆర్బీఎం చట్టం కింద రుణ పరిమితిని పెంచుకోవటానికి అనుమతించాలన్న బీఆర్ఎస్ సర్కారు వినతిని కేంద్రం తిరస్కరిస్తూ వచ్చింది. బహుశా అందువల్లే కావొచ్చు... తొలి కేబినెట్ భేటీలో అధిక భారం పడని రెండు గ్యారెంటీలు – మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అమలుచేయాలని నిర్ణయించారు. ఇవి రెండూ ఈ 9వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 64 కాగా, మిత్రపక్షం సీపీఐకి ఒక స్థానం వుంది. నిన్నటివరకూ పాలించిన బీఆర్ఎస్ 39 స్థానాలతో బలమైన ప్రతి పక్షంగా ఉంది. 8 స్థానాలు గెల్చుకున్న బీజేపీ, ఏడు స్థానాలున్న ఎంఐఎంలు సైతం పాలనా నిర్వహణను నిశితంగా గమనిస్తుంటాయి. వాగ్దానాల అమలులో విఫలమైతే నిలదీయటానికి విపక్షాలు సిద్ధంగా ఉంటాయి. బీఆర్ఎస్ ప్రాంతీయపార్టీ గనుక కేసీఆర్ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలిగారు. పాలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సారథిగా రేవంత్‌కి పరిమితులు తప్పవు. రాజకీయాలపై ఆసక్తి, అనురక్తి మినహా మరే నేపథ్యమూ లేని రేవంత్‌రెడ్డి అంచెలంచెలుగా ఎది గిన తీరు ఎన్నదగ్గది. విద్యార్థి దశలో ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ఏబీవీపీతో, ఆ తర్వాత టీఆర్ఎస్తో, అటుపై తెలుగుదేశంతో ప్రయాణించిన రేవంత్ రెడ్డి 2017లో అనూహ్యంగా కాంగ్రెస్‌లో కొచ్చి స్వల్పవ్యవధిలోనే పీసీసీ అధ్యక్షుడు కాగలిగారు. ఇంటా బయటా సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే ఓటుకు కోట్లు కేసు, తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో ఇప్పటికీ ఉందంటున్న సాన్ని హిత్యం రేవంత్‌కు గుదిబండలే. వాటినుంచి ఎంత త్వరగా విముక్తులైతే అంత త్వరగా నవ తెలంగాణలో ఏర్పడిన తొలి కాంగ్రెస్ ప్రభుత్వ సారథిగా ఆయన తనదైన ముద్ర వేయగలుగుతారు. -
మిచాంగ్ గుణపాఠం
ప్రకృతి వైపరీత్యాలు విరుచుకుపడినప్పుడల్లా మనిషి చేసిన, చేస్తున్న పాపాలు బయటపడతాయి. అంతవరకూ పాలకులు రూపొందించిన విధానాల్లోని వైఫల్యాలు బట్టబయలవుతాయి. తీవ్ర తుపానుగా పరిగణించిన మిచాంగ్ నాలుగురోజుల పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వణికించింది. దాని ధాటికి చెన్నై నుంచి తమిళ తీరప్రాంతాలతో మొదలుపెట్టి దక్షిణాంధ్ర జిల్లాలన్నీ తడిసిముద్దయ్యాయి. కోస్తా జిల్లాలు సైతం వర్షాలతో సతమతమయ్యాయి. పంటలు దెబ్బ తిన్నాయి. చెన్నైలో గత 47 ఏళ్లలో ఎప్పుడూ చూడనంత స్థాయిలో భారీ వర్షం కురిసింది. నగరం నగరమంతా వరదనీటిలో తేలియాడింది. వివిధ ఘటనల్లో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతవరకూ 2015 నాటి కుంభవృష్టే రికార్డు. ఈ ఏడాది చిన్నా పెద్దా స్థాయిలో దేశం ఆరు తుపాన్లనూ, వాటి దుష్పరిణామాలనూ చవిచూసింది. మొన్న జూన్‌లో గుజరాత్, మహా రాష్ట్రల్లో బిపర్జయ్ తుపాను సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఆకాశాన్నంటే భవంతులతో, రోడ్లపై నిరంతరం రివ్వుమంటూ దూసుకుపోయే వాహనాలతో, అరచేతిలో ఇమిడే సెల్‌ఫోన్‌తో దేన్నయినా క్షణాల్లో పొందగల వెసులుబాటు వగైరాలతో అత్యద్భుతంగా కనబడే నగరాలు, పట్టణాలు చినుకుపడితే నరకాన్ని తలపిస్తాయి. అటువంటిది కనీవినీ ఎరుగని రికార్డు స్థాయి కుంభవృష్టి పడితే ఇక చెప్పేదేముంది? కేవలం ఆది, సోమ వారాల్లో రాత్రింబగళ్లు కురిసిన వర్షపాతం ఏకంగా 35 సెంటీమీటర్లంటే పరిస్థితి ఎలావుందో ఊహించుకోవచ్చు. శివారుల్లో వున్న చెరువులు, రిజర్వాయర్లు, అడయార్, కూవమ్ నదులు, బకింగ్‌హామ్ కాల్వ పూర్తిగా నిండి వరద జలాలు చెన్నై నగరాన్ని ముంచెత్తాయి. ఫలితంగా అన్ని హైవేలు, సబ్‌వేలు మూతబడక తప్పలేదు. వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రముఖులు నివాసం ఉండే పొయెస్ గార్డెన్ రోడ్డు ఏడడుగుల మేర కుంగిపోయి అందులో ట్రాన్స్ఫార్మర్లు, వాహనాలు కూరుకుపోయాయంటే పరిస్థితి ఎలా ఉన్నదో ఊహించుకోవచ్చు. వాతావరణ విభాగం చెబుతున్న ప్రకారం మిచాంగ్ గత తుపానులకు భిన్నమైనది. సాధారణంగా తీరానికి సుదూరంగా తుపాను తిరుగాడుతుంది. కానీ ఈసారి తీరానికి 90 కిలోమీటర్ల దూరంలోనే మిచాంగ్ లంగరేసింది. పైగా అది చాలా నెమ్మదిగా... అంటే గంటకు 5–7 కిలోమీటర్ల మధ్య వేగంతో కదిలింది. తుపాను వేగం సాధారణంగా గంటకు 10–18 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. తీరానికి దగ్గరగా వుండి మందకొడిగా కదలటం వల్ల విడవకుండా భారీ వర్షాలు కురిశాయి. 2015లో చెంబరామ్బాక్కమ్ సరస్సు, పూండి రిజర్వాయర్ల నుంచి ఒక్కసారి భారీయెత్తున నీటిని విడుదల చేసిన పర్యవసానంగా చెన్నై నీట మునిగింది. ఈసారి అన్ని జాగ్రత్తలూ తీసుకుని ఒక క్రమపద్ధతిలో నీరు వదిలినా మిచాంగ్ తీవ్రత కారణంగా ఇంచుమించు అప్పటి పరిస్థితే ఏర్పడింది. తీరానికి ఆవల ఉండాల్సిన సముద్రం నగరబాట పట్టిందా అన్నంతగా వరద పోటెత్తింది. అభివృద్ధి పేరు మీద అన్నిటినీ ఒకేచోట కేంద్రీకరిస్తే వృత్తి ఉద్యోగాల కోసం, చిన్నా చితకా వ్యాపారాల కోసం దూరతీరాల నుంచి సైతం జనం అక్కడికి చేరుకుంటారు. జనాభా అపరిమితంగా పెరుగుంది. నగరీకరణ, పట్టణీకరణ జరుగుతున్నప్పుడు ఆ వంకన భూబకా సురులు ప్రవేశిస్తారు. సరస్సులు, చెరువులు మాయమవుతాయి. కాల్వలు కుంచించుకు పోతాయి. పచ్చటి చెట్లు నేలకొరుగుతాయి. ఎటుచూసినా కాంక్రీట్ కీకారణ్యాలే విస్తరిస్తుంటాయి. మన దేశంలోనే కాదు... వేరే దేశాల్లో ఇదే పరిస్థితి. అయితే ఆ దేశాల్లో కాస్త ముందే మేల్కొని అభివృద్ధి వికేంద్రీకరణ వైపు కదిలారు. కానీ మన దగ్గర ప్రకృతి విలయాలు కళ్ల ముందే కనబడుతున్నా ఆ అంశంపై పాలకులు దృష్టి సారించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణానికి చేసిన ప్రయత్నం ఇందుకు ఉదాహరణ. వికేంద్రీకరణతో పాటు విపత్తులు ముంచుకొచ్చినప్పుడు తలెత్తగల సమస్యలను ముందే గుర్తించి అందుకు తగ్గట్టు మౌలిక సదుపాయాలు ఏర్పరిస్తే ఇబ్బందులు తగ్గుతాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ స్థితిగతులు మారాయి. కర్బన ఉద్గారాలు అపరిమితంగా పెరిగిన పర్యవసానంగా భూగోళం వేడెక్కడం, ఆ వేడిమిలో 90 శాతం సముద్రాలకే పోవటం వల్ల వాటి జలాలు వేడెక్కుతున్నాయి. తుపానులకు అదే ప్రధాన వనరు. ఈ పరిస్థితుల్లో నగరీకరణ, పట్టణీకరణలపై పునరాలోచించటం, ఇప్పటికే ఉన్న నగరాలు, పట్టణాల్లో ప్రస్తుత స్థితిని మెరుగుపరచటానికి అనుసరించాల్సిన విధానాలకు రూపకల్పన చేయటం అవసరం. పారిస్ ఒడంబడికకు అనుగుణంగా అహ్మదాబాద్‌లోని అర్బన్ మేనేజ్మెంట్ సెంటర్ ఈ విధానాలకు తుదిరూపం ఇచ్చింది. తమిళనాడు సర్కారు దాని ఆధారంగా చెన్నైకు మొన్న జూన్‌లో సవివరమైన ప్రణాళికను రూపొందించింది. 2050కల్లా ఆ నగరాన్ని కర్బన ఉద్గారాల బారి నుంచి రక్షించటానికి తీసుకోవాల్సిన చర్యలపై ఒక విధానాన్ని ప్రకటించింది. నీటి కొరత నివారణ, పునరుత్పాదక ఇంధన వనరుల పెంపు, విద్యుత్‌తో నడిచే బస్సులు వందశాతం ఉండేలా చూడటం, నగరంలో హరితవనాల్ని 35 శాతానికి విస్తరించటం, పకడ్బందీ పారిశుద్ధ్యం, చెన్నై వరద ముంపు బారిన పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవటం అందులో కొన్ని. నగర విస్తరణకూ, కాలనీల నిర్మాణానికీ విచ్చలవిడి అనుమతులీయటం విరమించుకుంటే, డ్రైనేజీ వ్యవస్థల పునర్వ్యవ స్థీకరణకు చర్యలు తీసుకుంటే ప్రతి నగరమూ మెరుగవుతుంది. మిచాంగ్ వంటి తీవ్ర తుపానుల వల్ల జరిగే నష్టం కనిష్ఠస్థాయికి పరిమితమవుతుంది. పాలకులు ఈ దిశగా ఆలోచించాలి. -
ఇంకా చల్లారని మణిపూర్
ఘర్షణల సమయంలో తప్ప సాధారణ పరిస్థితుల్లో ఎప్పుడూ వార్తలకెక్కని ఈశాన్య భారతం ఇంకా కుదుటపడలేదని మణిపూర్‌లో సోమవారం రెండు సాయుధ బృందాల మధ్య చోటుచేసుకున్న కాల్పుల ఉదంతం తెలియజెబుతోంది. ఈ కాల్పుల్లో 13 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఏడునెలల క్రితం అక్కడ మొదలైన తెగల ఘర్షణల్లో ఇంతవరకూ 175 మంది మరణించారని, 50,000 మంది నిరాశ్రయులయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆ రాష్ట్రంలో పర్యటించి ఎక్కడెక్కడ మారణకాండ జరిగిందో, తాజా పరిస్థితులు ఎలా వున్నాయో వివరిస్తూ నివేదిక సమర్పించింది. దానిపై సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి పలు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇంతలోనే తాజా ఉదంతం చోటుచేసుకుంది. మే 3 నుంచి వరస బెట్టి జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కాదు. రాష్ట్రంలో మెజారిటీగా వున్న మెయితీలకూ, కుకీ–చిన్‌లకూ మధ్య తలెత్తిన ఘర్షణలు ఏ స్థాయికి చేరాయంటే మహిళలపై గుంపులు దాడిచేసి వారిని వివస్త్రలను చేయటం, నగ్నంగా వూరేగించి అత్యాచారాలకు తెగబడటం యథేచ్ఛగా సాగాయి. ఇక గృహదహనాలు, ఇతర ఆస్తుల ధ్వంసం వంటివి సరేసరి. ఘర్షణల సందర్భంగా పోలీస్ స్టేషన్లపై, సాయుధ రిజర్వ్ బెటాలియన్ స్థావరాలపై గుంపులు దాడులకు దిగి వేలాది తుపాకులు, రాకెట్ లాంచర్లు, లక్షల తూటాలు అపహరించారు. ఆయుధాలు అప్పగించినవారిపై ఎలాంటి చర్యలూ తీసుకోబోమని ప్రభుత్వం హామీ ఇచ్చినా వీటిల్లో వెనక్కొచ్చినవి స్వల్పం. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు చక్కర్లు కొట్టడం పర్యవసానంగా హింసాత్మక ఘటనలు మొదలుకాగా, అటు తర్వాత జరిగిందంతా ప్రధాన స్రవంతి మీడియా నిర్వాకమని ఎడిటర్స్ గిల్డ్ నిజనిర్ధారణ కమిటీ ఆరోపించింది. అది ‘మెయితీ మీడియా’గా మారి పక్షపాతం ప్రదర్శించిందన్నది ఆ కమిటీ అభియోగం. ఆ తర్వాత కమిటీ సభ్యులపై మణిపూర్ సర్కారు కేసులు పెట్టడం, ఆ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించటం వేరే కథ. రాష్ట్రంలోని 90 శాతం ప్రాంతాలు ఇప్పుడు ప్రశాంతంగా వున్నాయని బీరేంద్ర సింగ్ ప్రకటించి నెల్లాళ్లయింది. అయినా అడపా దడపా ఘర్షణల వార్తలు వస్తూనే వున్నాయి. సోమవారం నాటి ఉదంతం ఈమధ్యకాలంలో పెద్దది. మరణించినవారంతా ఎవరో, ఎక్కడివారో అధికారులు ఇంకా తేల్చలేదు. ఘటన జరిగిన ప్రాంతానికి భద్రతా బలగాల శిబిరం 10 కిలోమీటర్ల దూరంలో వున్నదంటే ఇన్ని నెలల మారణకాండ నుంచి ప్రభుత్వం నేర్చుకున్నదేమీ లేదన్నమాట. హింసాత్మక ఘట నల సంఖ్య తగ్గిందని అధికారులు సంబరపడుతూవుండొచ్చు. కానీ కనబడని హింస పీడిస్తూనే వుంది. సమాజం మొత్తం రెండుగా చీలిపోయింది. మెయితీలు, కుకీలు గతంలో మాదిరి స్వేచ్ఛగా సంచరించలేకపోతున్నారు. నెలల తరబడి సాగిన హింస పర్యవసానంగా ఆప్తుల్ని కోల్పోయి, ఎంతో విధ్వంసం చోటుచేసుకుని భవిష్యత్తు అగమ్యగోచరంగా వున్నచోట అంతా బాగున్నదని చెప్పటం పరిహాసాస్పదం అవుతుంది. కుటుంబాల్ని పోషించుకోవటానికీ, చదువుకోవటానికీ, ఇతరేతర వ్యాపకాల కోసం వెళ్లటానికీ స్వేచ్ఛ లేని ప్రశాంతత వల్ల సాధారణ పౌరులకు ఒరిగేదేముంటుంది? ప్రభుత్వ యంత్రాంగం సమగ్రమైన, అత్యవసరమైన చర్యలు తీసుకొనేవరకూ ఇదంతా సాధ్య పడదు. ముఖ్యంగా ఎక్కడికక్కడ రెండు తెగల నుంచి బాధ్యతాయుత వ్యక్తుల్ని గుర్తించి కమిటీలు ఏర్పాటుచేసి సామరస్యత సాధించే దిశగా ప్రయత్నిస్తే వేరుగా వుండేది. ఇంటర్నెట్ సేవలు పునరుద్ధ రించిన 24 గంటల్లోగానే తాజా ఉదంతం చోటుచేసుకోవటం ఆందోళన కలిగించే అంశం. ఏడు నెలల హింసలో ప్రాణాలు కోల్పోయినవారికి సంబంధించిన 88 గుర్తు తెలియని మృతదేహాలు ఏడు నెలలుగా ఇంఫాల్‌లోని రెండు ఆస్పత్రుల శవాల గదుల్లో పడివున్నాయి. రెండు తెగలవారూ భయం భయంగా బతుకుతున్న వర్తమానంలో తమ తమ గ్రామాలొదిలి ఇంఫాల్ వరకూ పోవటం, ఆ మృతదేహాలను గుర్తించటం సాధ్యమేనా? హింస కొనసాగుతున్న కాలంలోనూ, ఆ తర్వాతా తమ వారి జాడ తెలియటం లేదని చెప్పినవారు అనేకులున్నారు. వీరిలో అనేకులు కుకీలు కాగా, మెయితీ తెగకు చెందినవారు కూడా వున్నారు. ఆ మృతదేహాలు కల్లోలం సృష్టించటానికి మయన్మార్ నుంచి వచ్చినవారికి సంబంధించినవేనని అధికారులు చెబుతున్నా అందుకు వారి దగ్గర కచ్చితమైన సాక్ష్యా ధారాలు లేవు. ఆదివాసీ నేతల ఫోరం 22 మంది కుకీల జాడ తెలియటం లేదని ఆ మధ్య ప్రకటించింది. గుర్తుతెలియని మృతదేహాల్లో ఇలా అదృశ్యమైనవారివే అధికంగా వుండొచ్చు. ఇక ఎవరి కోసమూ వేచిచూడకుండా ఈ మృతదేహాలను ఖననం చేయాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించటం మణిపూర్‌లో విషాదస్థితికి అద్దం పడుతోంది. ఈపాటికే శాంతి సాధనకు తగిన చర్యలు తీసుకునివుంటే, బాధిత వర్గాల్లో భరోసా కల్పించి నట్టయితే ‘గుర్తు తెలియని మృతదేహాల’ సమస్య వుండేదే కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. హింసాత్మక ఘటనలకు కారకులైనవారినీ, ఇప్పటికీ ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నవారినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటే శాంతియుత పరిస్థితులను ఏర్పర్చటం తేలికవుతుంది. ఈనాటికీ ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించటం లేదని, అది మెయితీల పట్ల మెతగ్గా వుంటున్నదని ఆది వాసీ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలకు తావు లేకుండా చేసినప్పుడే తమ వారి మృత దేహాలను గుర్తించి, సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించటం బాధిత కుటుంబాలకు సాధ్యమవుతుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవటం మణిపూర్ సర్కారు బాధ్యత. -
జయాపజయాలు
మినీ జనరల్ ఎన్నికలుగా భావించిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటర్లు వెలువరించిన విస్పష్టమైన తీర్పు భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న ‘ఇండియా’ కూటమి, దాని ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్ తలరాతలను తలకిందులు చేసింది. తెలంగాణలో దక్కిన బొటాబొటీ విజయం ఒక్కటే కాంగ్రెస్‌కు ఊరటనిచ్చింది. ప్రధాన రాష్ట్రాలైన రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లతోపాటు ఛత్తీస్‌గఢ్‌ను కూడా గెల్చుకుని మరో ఆర్నెల్లల్లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమే ముచ్చటగా మూడో సారి కూడా అధికారంలోకొస్తుందని బీజేపీ చాటింది. ఈ మూడుచోట్లనుంచీ 65 లోక్‌సభ స్థానాలున్నాయి. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో 36 యేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్)– కాంగ్రెస్ కూటమి కొత్తగా ఆవిర్భవించిన జోరమ్ పీపుల్స్ మూవ్మెంట్ (జడ్పీఎం) చేతుల్లో మట్టికరిచింది. అక్కడ ముఖ్యమంత్రి – ఎంఎన్ఎఫ్ సారథి జోరంతంగాతో పాటు 11 మంది మంత్రులు చిత్తుగా ఓడిపోయారు. ఒకటి రెండు రోజుల్లో ఈ అయిదు రాష్ట్రాల్లోనూ కొత్త సారథులు కొలువుదీరబోతున్నారు. మూడు రాష్ట్రాలు గెలుచుకున్న బీజేపీ గానీ, తెలంగాణ గెల్చుకున్న కాంగ్రెస్ గానీ తమ సీఎం అభ్యర్థులను ప్రకటించాల్సివుంది. ఈలోగా ఊహాగానాలే షికారు చేస్తాయి. ఒక్క మిజోరంలో మాత్రం జడ్పీఎం చీఫ్ లాల్దుహోమా ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ ముందే ప్రకటించింది. ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే ‘ఇండియా’ కూటమిలో రుసరుసలు వినిపించాయి. హిందీ బెల్ట్‌లో బీజేపీ ప్రభంజనానికి కాంగ్రెస్ చేతగానితనమే కారణమని తృణమూల్ కాంగ్రెస్ అనటం, తమ పార్టీ అధినేత మమతాబెనర్జీని, కూటమిలోని ఇతర నేతలనూ కలుపుకొని వెళ్లటంలో ఆ పార్టీ విఫలమైందని ఆరోపించటం... జేడీ(యూ), ఆర్జేడీలు సైతం అదే తరహాలో మాట్లాడటం త్వరలో జరగబోయే కూటమి సమావేశం ఎలా ఉంటుందో చెబుతున్నాయి. మొన్న మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచీ ఊహలపల్లకీలో ఊరేగుతున్న కాంగ్రెస్‌ను తాజా ఫలితాలు కిందకు దించాయి. ఈ పంచతంత్రం గట్టెక్కటం ఎలాగోనని సంశయిస్తూ బరిలోకి దిగిన బీజేపీ... తమ నేతలంతా ఒక్కతాటిపై నిలిచారన్న అభిప్రాయాన్ని కలిగించటంలో విజయం సాధించింది. రణరంగానికి తరలే శ్రేణులపై సైన్యాధిపతికి పట్టుండాలి. అతని ఆదేశాలకు అనుగుణంగా ముందుకురికేందుకు చతురంగ బలాలు సర్వసన్నద్ధంగా వుండాలి. విజయమో, వీరస్వర్గమో అన్నంతగా చెలరేగిపోవాలి. కాంగ్రెస్‌కు సంబంధించి జరిగిందంతా అందుకు విరుద్ధం. అధిష్ఠానం సూచనలు పాటించటానికి రాజస్తాన్‌లో గహ్లోత్, మధ్యప్రదేశ్‌లో కమలనాథ్ ససేమిరా అన్నారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో ఈడీ దాడులతో ఎజెండాలోకొచ్చిన మహదేవ్ యాప్ కొంపముంచింది. కనుకనే ఈ మూడుచోట్లా పార్టీ ఆశలు ఆడియాసలయ్యాయి. ‘ఇండియా’ కూటమిలో దాని స్థానాన్ని మరింత బలహీనపరిచాయి. అధికారంలో ఉన్నవారిని సాగనంపే సంప్రదాయం వున్న రాజస్తాన్‌పై కాంగ్రెస్‌కు ఎటూ పెద్దగా ఆశలు లేవు. అయినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ గత ఏడాదిగా ప్రకటిస్తున్న జనాకర్షక పథకాలు ఈ సరళిని మారుస్తాయేమోనన్న భయం బీజేపీలో లేకపోలేదు. కానీ మధ్యప్రదేశ్‌లో అలా కాదు. అక్కడ కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నంతగా ప్రచారం జరిగింది. ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించి అత్తెసరు మెజారిటీతో పాలన ప్రారంభించిన కాంగ్రెస్‌కు రెండేళ్లు తిరగకుండానే పొగబెట్టి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది. సగటు ఓటరుకు ఆ విషయంలో సానుభూతి ఉన్నదని అందరూ అంటూ వచ్చారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంక్షేమ పథకాల జోరు కనబడుతున్నా బీజేపీ సంశయిస్తూనే అడుగులు వేసింది. జాగ్రత్తగా పావులు కదిపింది. సునాయాసంగా అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక కాంగ్రెసే మళ్లీ అధికారంలోకి రావటం ఖాయమని అందరూ అనుకున్న ఛత్తీస్‌గఢ్‌లో సైతం ఆ పార్టీకి పరాజయం తప్పలేదు. రాజస్తాన్‌లో గహ్లోత్, యువ నాయకుడు సచిన్ పైలెట్ల మధ్య నాలుగేళ్లుగా హోరాహోరీ పోరు సాగుతోంది. వారిద్దరిలో ఎవరు నిష్క్రమిస్తే పార్టీకి ఎక్కువ నష్టమో అధిష్ఠానం తేల్చుకోలేక, ఇద్దరి మధ్యా సంధి కుదిర్చేందుకు తంటాలూ పడింది. ఈ అంతర్గత పోరు ఎంత నష్టపరిచిందంటే స్వతంత్రంగా ఉంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసుకునే గిగ్ వర్కర్స్ సంక్షేమానికి దేశంలోనే తొలిసారి చట్టం తెచ్చిన ఘనతను సైతం ప్రచారం చేసుకోలేకపోయింది. ఇతర సంక్షేమ పథకాలు సరేసరి. ఇక మధ్యప్రదేశ్‌లో దాదాపు 30 స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని ఎందరు మొత్తుకున్నా కమలనాథ్ ససేమిరా అన్నారు. పైగా తాను ఓ వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతిని మరిచి ‘జై జై కమలనాథ్’ నినాదాన్ని రుద్దారు. ఛత్తీస్‌గఢ్‌లో మహదేవ్ యాప్ కుంభకోణం తర్వాత సీఎం బఘేల్‌తో వేదిక పంచుకోవటానికి రాహుల్, ప్రియాంక సిద్ధపడలేదు. సంక్షేమ పథకాలతో ఊదరగొడితే చాలదు... నాయకత్వ పటిమపై విశ్వసనీయత కలిగించాలి. ఆ విషయంలో వైఫల్యమే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను ముంచింది. అటు బీజేపీలో మూడు రాష్ట్రాల్లోనూ స్థానిక నేతలనూ పక్కనబెట్టి అభ్యర్థుల నిర్ణయంలోనూ, ప్రచారవ్యూహంలోనూ అగ్ర నాయకత్వం తనదే పైచేయి అన్నట్టు వ్యవహరించింది. మోదీ సర్వం తానైనట్టు వ్యవహరించారు. అది విజయానికి దోహద పడింది. దాంతోపాటు కాంగ్రెస్ వైఫల్యాలు కూడా బీజేపీకి కలిసొచ్చాయి. జనం భావోద్వేగాలపైకాక సంక్షేమం, అభివృద్ధి అంశాలపై దృష్టి సారించటం కూడా ఆ పార్టీకి పనికొచ్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే తోడ్పడుతుందని భావిస్తే అది బీజేపీకే మేలు. -
చీకటి వెలుగులు
విశాల విశ్వంలో సృష్టి సమస్తం ద్వంద్వాలమయం. ఈ ప్రపంచం ద్వంద్వాలమయం. లోకంలో వెలుగు చీకట్లుంటాయి. నిప్పూ నీరూ ఉంటాయి. తీపి చేదులుంటాయి. రేయింబగళ్లు ఉంటాయి. ఎండా వానా ఉంటాయి. శీతోష్ణాలుంటాయి. శిశిర వసంతాలుంటాయి. జీవితంలో సుఖదుఃఖాలు ఉంటాయి. ఆశ నిరాశలు ఉంటాయి. శాంతి అశాంతులు ఉంటాయి. గెలుపు ఓటములు ఉంటాయి. ఉత్థాన పతనాలు ఉంటాయి. మన వేదాంతం ఎంతగా అద్వైత సిద్ధాంత బోధ చేస్తున్నా, మానవమాత్రులైన వారెవరూ ద్వంద్వాతీతులు కారు, కాలేరు. మనుషులకు మాత్రమే కాదు, ఈ భూమ్మీద పుట్టిన ప్రతి జీవిలోనూ ఆడా మగా ఉంటాయి. ప్రతి జీవికీ చావుపుట్టుకలు ఉంటాయి. ప్రతి జీవితానికీ ఆద్యంతాలుంటాయి. ద్వంద్వబంధురమైన సృష్టి ప్రకృతి సహజం. సృష్టిలో ఇన్ని ద్వంద్వాలే లేకుంటే, ప్రకృతికి ఇంతటి సౌందర్యమెక్కడిది? జీవితానికి ఇంతటి వైవిధ్యమెక్కడిది? అద్వైతం అందమైన భావన. ఆధ్యాత్మిక ప్రవచనాల్లో ‘బ్రహ్మ సత్యం... జగన్మిథ్య’ అనే అద్వైత బోధను ఆలకించేటప్పుడు తన్మయత్వంతో కాసేపు ఓలలాడవచ్చేమో గాని, అది క్షణికమే! ఆ తర్వాత మిథ్యా మైకం నుంచి బయటపడ్డాక మనమింకా ద్వంద్వాల వలయంలోనే ఉన్నామన్న సంగతి ఎరుకపడటానికి ఎంతోసేపు పట్టదు. ‘మనకు రెండు కళ్లు, రెండు కాళ్లున్నట్లే ద్వంద్వాలన్నీ మన జీవితంలో భాగమే!’ అన్నాడు కార్లోస్ సాంటానా. అలాగని అతడేమీ తత్త్వవేత్త కాదు, వేదాంతి కాదు, కనీసం ప్రవచనకర్తయినా కాదు గాని, వారెవరికీ లేని ఎరుక అతడికి ఉంది. కార్లోస్ సాంటానా అమెరికన్ గిటారిస్ట్. అయినా, సృష్టిలోని ద్వంద్వాలను అర్థం చేసుకోవడానికి తత్త్వవేత్తలో, వేదాంతులో, ప్రవచనకర్తలో కానక్కర్లేదు... ఇసుమంత ఇంగితమున్న మనుషులైతే చాలు! ద్వంద్వాలు మన వెలుపలే కాదు, మన లోపల కూడా ఉన్నాయి. ద్వంద్వాల నడుమ నిత్యసంఘర్షణే ప్రకృతి ధర్మం. ‘మానవ జీవితమే మహాభారతం/ అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం’ అన్న ఆరుద్ర మాటలు ఇందుకు చిన్న ఉదాహరణ. మన జీవితాలను నిర్దేశించేవి జ్ఞానా జ్ఞానాలు, ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు, ఉచితానుచితాలు, రాగద్వేషాలు, నీతి అవినీతి వంటి ద్వంద్వాలే! విశ్వానికి మూలం తొలుత ఏకపదార్థమేనని, కాలక్రమంలో అది ద్వంద్వాలుగా విడిపోయిందని పాశ్చాత్య తత్త్వవేత్తల్లో కొందరి భావన. సృష్ట్యాదిలో ప్రపంచమంతా జలమయమై ఉండేదని మన పురాణాల కథనం. గ్రీకు తత్త్వవేత్త థేలీస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. థేలీస్ అభిప్రాయాన్ని అతడి శిష్యుడు అనగ్జిమాండర్ ఖండించాడు. ‘ఏదో ఒక అనిశ్చిత, అనిర్దిష్ట, అజ్ఞాత పదార్థం సమస్త స్థలాన్నీ ఆవరించి ఉండేది. అది అనంతం, అనశ్వరం’ అని అనగ్జిమాండర్ అన్నాడు. సృష్టికి మూలమైన పదార్థం ద్వంద్వాతీతమైనదో కాదో ఇప్పటికీ ఎవరికీ తెలీదు గాని, మన చుట్టూ ఉన్న ద్వంద్వాలు, మన లోపలున్న ద్వంద్వాలు అందరికీ అనుభవపూర్వకమే! జీవితంలో అడుగడుగునా తారసపడే ద్వంద్వాలే మన జీవన గమనాన్ని నిర్దేశిస్తాయి. ఎంతటి వారైనా జీవితంలో ఎదురయ్యే ద్వంద్వాలను అతిక్రమించలేరు. వాటి ఉనికిని గుర్తించకుండా ఉండలేదు. వాటికి అతీతంగా బతకలేరు. కాబట్టి మనం ద్వంద్వాలను నిర్ద్వంద్వంగా అంగీకరించక తప్పదు. లోకంలో కొందరు మనుషులు మంచివాళ్లుగా, మహానుభావులుగా చలామణీ అవుతారు. కొందరు దుర్మార్గులుగా, చెడ్డవాళ్లుగా పేరుమోస్తారు. నిజానికి ఎవరూ పూర్తిగా మంచివాళ్లుగా గాని, పూర్తిగా చెడ్డవాళ్లుగా గాని ఉండరు. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, వాటికి స్పందించే తీరుతెన్నులే మనుషుల మంచిచెడులను బయటపెడతాయి. అందుకే ‘మనుషులందరూ మంచి చెడుల సమ్మేళనాలే’ అన్నాడు స్కాటిష్ రచయిత రాబర్ట్ లూయీ స్టీవెన్సన్. ‘కృతా కృతేచ ద్వంద్వాని కదా శాంతాని కస్యవా/ ఏవం జ్ఞాత్వేహ నిర్వేదాత్ భవ త్యాగపరో వ్రతీ’ అని అష్టావక్రుడు జనక మహారాజుకు చెప్పాడు. కృతాకృత కర్మకలాపాలు, సుఖదుఃఖాది ద్వంద్వాలు శాంతించినప్పుడు భక్తుడు సంశయరహితుడై జ్ఞాని అవుతాడని, అప్పుడు వైరాగ్య వ్రతం చేయకున్నా త్యాగపరాయణుడవుతాడని ఈ శ్లోకానికి అర్థం. జనకుడికి అష్టావక్రుడు చేసిన ఈ వేదాంత బోధ ‘అష్టావక్రగీత’గా ప్రసిద్ధి పొందింది. అష్టావక్రుడు తన గీతబోధలో ద్వంద్వాల ఉనికిని నిరాకరించలేదు. కాకుంటే, అవి శాంతించాలన్నాడు. ద్వంద్వాల మధ్య సమతుల్యతను సాధించినప్పుడే అవి శాంతిస్తాయి. సుఖదుఃఖాలు, రాగద్వేషాల వంటి సహజాతి సహజమైన ద్వంద్వాలకు కొంత మోతాదుకు మించి స్పందించడం మానవ స్వభావం. ద్వంద్వాల ప్రభావాన్ని సమానంగా స్వీకరించి, ఆత్మావలోకనం చేసుకోగల సామర్థ్యమే స్థితప్రజ్ఞ! కాకపోతే, మనుషుల్లో స్థితప్రజ్ఞులు అరుదు. ముఖ్యంగా ప్రజల మధ్య గడిపే రాజకీయ నేతల్లో, సినీతారల్లో మరీ అరుదు. ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికల్లో జయాపజయాలు సర్వసాధారణాలు. ప్రజామోదం పొందిన వారు ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తారు. ప్రజాదరణ కొరవడిన వారు పరాజితులవుతారు. గెలుపొందిన వారు ‘అంతా తమ ప్రయోజకత్వం/ తామే భువి కధినాథులమనుకొని ’ విర్రవీగితే మాత్రం తర్వాతి ఎన్నికల్లో పర్యవసానాన్ని చవిచూడక తప్పదు. పరాజితులు ఇంతే తమ కర్మమ నుకుని కుంగిపోయినా, తమను ఆదరించని ప్రజలను నిందించినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. ఘనవిజయాలు సాధించినప్పుడు బాధ్యతలను గుర్తెరిగి అప్రమత్తంగా ప్రవర్తించాలి. అపజయాలు ఎదురైనప్పుడు ఆత్మవిమర్శ చేసుకుని, లోపాలను సవరించుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. ఎన్నికల క్రతువులో ఘనవిజయాలూ శాశ్వతం కావు, అపజయాలూ శాశ్వతం కావు. శాశ్వతం కానివని తెలిసి తెలిసి ఫలితాలను తలకెక్కించుకుంటేనే ప్రమాదం. -
ఎమ్మెల్యే... ఓ ఎమ్మెల్యే!
అధికారికంగా ఓట్ల లెక్కింపు పూర్తి కాకుండానే ఫలితాలపై కామెంట్ చేయడం న్యాయం కాకపోవచ్చు. కాకపోతే దేశంలో ఎగ్జిట్ పోల్ అనే ప్రక్రియ క్రమంగా శాస్త్రీయతను సంతరించు కుంటున్నది. చిన్నాచితకా ఔత్సాహిక సంస్థలను, రాజకీయ ప్రయోజనం కోసం చేయించుకునే సర్వేలను మినహాయిస్తే, దేశంలో ప్రముఖ సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ సంద ర్భాల్లో నిజమయ్యాయి. అలా నిజమైన సందర్భాల్లో కూడా ట్రెండ్‌ను మాత్రమే సూచించగలుగుతున్నాయి కానీ సీట్ల సంఖ్యను కచ్చితంగా అంచనా వేయడంలో ఇంకా పరిపూర్ణత రాలేదు. మెజారిటీ స్థానిక ఏజెన్సీలతో పాటు ప్రముఖ జాతీయ ఏజెన్సీలు కూడా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజ యాన్ని సంశయాతీతంగా ప్రకటిస్తున్నాయి. ఏబీపీ – సీ వోటర్, జన్ కీ బాత్‌లు 60 స్థానాలకు పైగా కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేస్తే, ఇండియాటుడే – మై యాక్సిస్, టైమ్స్ నౌ– ఈటీజీ, ఇండియా టీవీ – సీఎన్ఎన్, టుడేస్ చాణక్య తదితర సంస్థలు ఈ సంఖ్య 70 దాకా వెళ్లొచ్చని ఊహిస్తున్నాయి. సమా జంలో గొంతు విప్పే స్వభావం వున్న ప్రభావ వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత గత కొంతకాలం నుంచి స్పష్టంగానే కనిపిస్తూ వచ్చింది. అయితే ఈ వ్యతిరేకత పాటక వర్గాల్లో, కింది సెక్షన్లలో ఉండకపోవచ్చనే అభిప్రాయం ఉండేది. రైతుబంధు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అందుకు కారణం కావచ్చు. ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న సంకేతాల ప్రకారం ప్రభావ వర్గాలు, పాటక వర్గాలు అనే తేడా లేకుండా ప్రభుత్వ వ్యతిరేకత అంతటా ఆవరించినట్టు అర్థం చేసుకోవాలి. మెజారిటీ ఓటర్లు మార్పు కోరుకున్నట్టు కనిపిస్తున్నది. ప్రభుత్వానికి అనుకూలంగా నలభై శాతం కంటే తక్కువ మంది, వ్యతిరేకంగా అరవై శాతం కంటే ఎక్కువ మంది ఓటేసినట్టు అంచనాలు వెలువ డ్డాయి. ఈ అంచనాలు ఎంతమేరకు వాస్తవమో ఆదివారం మధ్యాహ్నం కల్లా తేలిపోతుంది. గడిచిన కొంతకాలంగా ప్రభావ వర్గాల్లో బహిరంగంగా వ్యక్తమవుతున్న అసమ్మతికి, పాటక వర్గాల్లో మౌనంగా గూడుకట్టుకుంటున్న అసంతృప్తికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. సామాన్య జనం సంగతి దేవుడెరుగు, ప్రజాప్రతినిధులకు కూడా ముఖ్యమంత్రి దర్శనం దుర్లభమన్న ప్రచారం బాగా వ్యాపించింది. ప్రజాస్వామ్య ప్రియులెవరికీ ఇది రుచించలేదు. రాష్ట్రంలో పరిపాలనంతా ఒక్క కుటుంబం చేతిలోనే కేంద్రీకృతమైందన్న ఆరోపణలను జనం బాగా నమ్ముతున్నారు. తెలంగాణ ఏర్పడితే విద్యాధికులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు దొరుకు తాయని బలహీన వర్గాలకు చెందిన వారు బాగా ఆశలు పెట్టు కున్నారు. వారి ఆంకాంక్షల మేరకు ప్రభుత్వం కొలువుల్ని భర్తీ చేయలేదనే అసంతృప్తి చాలా కాలంగా వ్యక్తమవుతున్నది. ధరణి పోర్టల్ వలన క్షేత్రస్థాయిలో ఏర్పడిన ఇబ్బందులను, సమస్య లను గుర్తించడంలో రాష్ట్ర యంత్రాంగం విఫలమైనట్టు కనిపిస్తున్నది. ఇటువంటి సమస్యలు ఒక ఎత్తయితే, క్షేత్రస్థాయిలో అవి నీతి, ఎమ్మెల్యేల ‘విశ్వరూపం’ మరో ఎత్తు. ముప్పయ్ మందికి పైగా ఎమ్మెల్యేలపై (వారిలో కొందరు మంత్రులు) ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదనే సమాచారాన్ని విస్మరించి వారందరికీ టిక్కెట్లను కేటాయించడం వల్ల పాలక పార్టీకి భారీ నష్టం జరిగి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వీరంతా వరసగా రెండోసారి ఎన్నికయ్యారు. తొలివిడత పదవీకాలంలో ఇంత తీవ్రస్థాయి ఆరోపణలు రాలేదు. రెండోసారి ఎన్నికైన తర్వాత వారు జూలు విదిల్చారు. మండలస్థాయి ఉద్యోగులు, అధికా రుల పోస్టింగులు, బదిలీలు అన్నీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే! కొందరు ఘనాపాఠీలు జిల్లాస్థాయి పోస్టింగుల్లోనూ చక్రాలు, బొంగరాలు తిప్పగలిగారు. ఈ పోస్టింగులకు ఒక రేట్ల పట్టిక కూడా ఉంటుందనేది బహిరంగ రహస్యంగా మారింది. పైగా సదరు అధికారులందరూ ఎమ్మెల్యేల ఆదేశాల మేరకే పని చేయాల్సి ఉంటుంది. వారి పైన ఉండే శాఖాసంబంధిత ఉన్నతాధికారులందరూ నిమిత్తమాత్రులుగా మిగిలారు. అధికారులు జేబుల్లో ఉండటంతో ఈ ప్రజా ప్రతినిధులు భూ వివాదాల్లో తలదూర్చారు. కారుచౌకగా కాజేసి బినామీ పేర్లతో రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా వేశారు. మంజీరా నుంచి మూసీ దాకా దేన్నీ వదలకుండా వందల కోట్ల విలువైన ‘తైలాన్ని’ పిండుకున్నారని ఆరోపణలు వచ్చాయి. మైనింగ్ దందాలు, రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాలు, కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని భోంచేయడం వగైరా వ్యాపకాలను కొందరు ఎమ్మెల్యేలు చేపట్టారు. చివరికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేప ట్టిన ‘దళిత బంధు’ పథకంలోనూ బహిరంగంగానే కమీషన్లు కొట్టేసిన ప్రబుద్ధులున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ధరణిలోని లోటుపాట్లను ఆసరా చేసుకొని నిషేధిత జాబితాలోని భూములు, అసైన్డు భూము లను భారీగా కొనుగోలు చేశారు. చెరువుశిఖం భూములు, కాందిశీకుల భూములను కూడా కొల్లగొట్టి కళ్లముందే కోట్లకు పడగెత్తారు. దేశంలో అతి కొద్దిమంది శ్రీమంతుల దగ్గర ఉండే విలాసవంతమైన వాహనాలను కొందరు ప్రజాప్రతినిధుల లగ్జరీ విల్లాల్లో మనం చూడవచ్చు. కొండలను అక్రమంగా పిండి చేసుకున్న అమాత్యుడొకరు, బండలను అక్రమంగా తరలించు కున్న అమాత్యుడొకరు, భూదందాలకు సహకరించని ఇద్దరు కలెక్టర్లనే శంకరగిరి మాన్యాలు పట్టించిన అమాత్యులు, కొత్త జిల్లాలకు కార్యాలయాల పేరుతో భూ దందాలు చేసిన అమా త్యులు... వీరికి ఏమాత్రం తీసిపోని ఇంకో పాతికమందికి పైగా ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసినట్టు వినిపిస్తున్నది. తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే లందరికీ మళ్లీ టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయించడం కేసీఆర్ చేసిన అతి పెద్ద పొరపాటుగా పరిశీలకులు భావిస్తున్నారు. కనీసం 30 స్థానాల్లో కొత్తవారినీ, యువతరాన్నీ, క్లీన్ ఇమేజ్ గలవారినీ పరిచయం చేసి ఉన్నట్లయితే కచ్చితంగా మెరుగైన ఫలితాలను అధికార పార్టీ సాధించి ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రెండుసార్లు గెలిస్తేనే తరాలకు సరిపోయేంత పోగేసిన వాళ్లను మూడోసారి ఎన్నుకోవడం పట్ల ప్రజలు విముఖత చూపినట్టు ట్రెండ్‌ను బట్టి అర్థమవుతున్నది. ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ఇది వ్యక్తమైంది. అసలు ఎమ్మెల్యేలకున్న అధికారాలేమిటి? విధులేమిటి అన్న అంశంపై విస్తృతమైన చర్చ జరగవలసిన అవసరం ఏర్ప డింది. రాజ్యాంగం ప్రకారం కేంద్రానికీ, రాష్ట్రాలకూ చట్టాలు చేసే అంశాలపై రెండు ప్రత్యేక జాబితాలున్నాయి. ఒక ఉమ్మడి జాబితా ఉన్నది. రాష్ట్ర జాబితాలోని అంశాలు, లేదా ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసన సభలు చట్టాలు చేస్తాయి. ఈ క్రమంలో సదరు అంశంపై క్షుణ్ణమైన అధ్యయనం చేసి ఎమ్మె ల్యేలు చర్చలో పాల్గొనాలి. మెజారిటీ పార్టీ ఎమ్మెల్యేలు తమలో ఒకరిని నాయకునిగా ఎన్నుకొంటే ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్రపతి ఎన్నికలో కూడా ఎమ్మెల్యే వోటర్‌గా ఉంటారు. రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేకు ఇంతకు మించిన అధికారాల్లేవు. తన నియోజకవర్గంలోని ప్రజా సమస్య లను శాసనసభ ద్వారా మంత్రివర్గం దృష్టికి తీసుకొని వెళ్లవచ్చు. అధికార యంత్రాంగం ద్వారా ఆ సమస్య పరిష్కారం కావాలి. ఒక వంతెనగానీ, రోడ్డును గానీ ప్రభుత్వం మంజూరు చేస్తే ప్రభుత్వం తన శాఖల ద్వారా దానిని నిర్మించే ఏర్పాటు చేయడం విధాయకం. కానీ ప్రస్తుతం మన ఎమ్మెల్యేలు పనిని శాంక్షన్ చేయించుకోవడం దగ్గర్నుంచి కాంట్రాక్టర్‌ను నియమించి కమీషన్ వసూలు చేసుకునే వరకు దూసుకొని పోతు న్నారు. సంతకాలు చేయడం వరకే అధికారుల పని! కళ్ల ముందు రాజకీయ అవినీతి కనిపిస్తున్నప్పుడు అధికారుల సంతకాలు ఊరికే రావు కదా! ఆ సంతకాలకూ ఓ లెక్కుంటుంది!! ఎమ్మెల్యే నియోజక వర్గాలకు సమాంతరంగా ఉన్న పంచా యితీ సమితుల స్థానంలో ఐదారు చిన్న చిన్న మండలాలు రావడం కూడా ఎమ్మెల్యేలకు కలిసొచ్చింది. నియోజక వర్గంలో ఓ మినీ ముఖ్యమంత్రిగా అవతరించాడు. తన పరిధిలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ను బదిలీ చేయాలన్నా, పోస్టింగ్ ఇవ్వాలన్నా ఆ శాఖ అత్యున్నత అధికారి డీజీపీ మాట కంటే ఎమ్మెల్యేమాటే చెల్లుబాటు అవుతున్నది. ఇది ఆరోగ్యకరమైన సంప్రదాయ మేనా? వ్యవస్థలు నిర్వీర్యం కావా? ధర్మోరక్షతి రక్షితః అంటారు. ఎమ్మెల్యేలనైనా, ఇంకెవరినైనా వారి చట్టబద్ధమైన అధికారాలకు, విధులకు పరిమితం చేస్తేనే వ్యవస్థలు ప్రజలకు నిష్పాక్షిక సేవలు అందించగలుగుతారు. రాజకీయ పార్టీలు వాటి రాజకీయ అవసరాల కోసం ఎమ్మెల్యేలను శక్తిమంతులుగా మార్చి ఉండవచ్చు. సర్వాధికారాల అండతో ఆ వ్యక్తి చెలరేగిపోయి పదవిని తన వంశపారంపర్య హక్కుగా భావిస్తున్నారు. దాన్ని నిలుపు కోవడం కోసం కోట్ల రూపాయలు వెదజల్లుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు 70 నుంచి 80 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిబద్ధత కలిగిన ప్రజాసేవకులు రాజకీయాల్లో నిలబడగలరా? కోట్లు వెదజల్లినవాడు ప్రజాకంటకునిగా మార కుండా ఉంటాడా? అలాంటి వారికి మూడోసారి నాలుగోసారి టిక్కెట్ ఇస్తే సదరు పార్టీకి గుదిబండగా మారడమే కాదు, ప్రజాస్వామ్యానికీ ప్రమాదకరంగా తయారవుతారు. అప్రతిష్ఠ మూటగట్టుకున్న ఎమ్మెల్యేలు ఈసారి అధికార పార్టీని ముంచు తారో, గట్టెక్కిస్తారో ఆదివారం మధ్యాహ్నానికి తేలిపోతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
చేసిన బాసలు చెదిరిపోతే ఎలా?
‘కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్’ (కాప్) సమావేశాలు దుబాయ్‌లో ప్రారంభమయ్యాయి. భూమిని వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రక్షించుకునే ఉద్దేశంతో నిర్వహిస్తున్న సమావేశాలు ఇవి. ఈ మధ్యే విడుదలైన ‘యూఎన్ఈపీ గ్యాప్ రిపోర్ట్’ సైతం ప్యారిస్ ఒప్పందంలో భాగంగా దేశాలు చేసిన వాగ్దానాలన్నీ నెరవేరినా పుడమి సగటు ఉష్ణోగ్రతలు లక్ష్యంగా నిర్ణయించుకున్న 1.5 డిగ్రీ సెల్సియస్‌గా కాకుండా 2.9 డిగ్రీ సెల్సియస్‌కు చేరతాయని చెప్పడం ఆందోళనకరం.అంత స్థాయికి చేరడం భూమిని కాష్ఠం చేసినట్లే. ప్రకృతి వ్యవస్థలు చిన్నాభిన్నమవుతాయి. ఫలితంగా ఎన్నో ప్రకృతి ఉపద్రవాలకు బీజం పడుతుంది. పైగా రికార్డుల్లో ఎన్నడూ లేనంత ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ ఏడాదే నమోదయ్యాయి. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలోనే మొదలైన కాప్–28కు ప్రాధాన్యం మరింత పెరిగింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏదైనా శంఖనాదం చేస్తుందా అని ప్రపంచం ఎదురు చూస్తోంది. వాతావరణం విషయంలో ఎన్నో రికార్డులు బద్ధలైన సంవత్సరం ఇది.ఇంకో నెల మాత్రమే ఉన్న 2023లో వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షించుకునేందుకు ఉద్దేశించిన ‘కాప్– 28’ సమావేశాలూ మొదలయ్యాయి. అంతర్జాతీయ సమాజం ఏదో ఒక అత్యవసర చర్య తీసుకోకపోతే పరిస్థితి చేయి దాటి పోతుందన్న ప్రమాద ఘంటికలూ వినిపిస్తున్న తరుణమిది! ఐక్యరాజ్య సమితి సమావేశం (కాప్–28) ఇంకోటి దుబాయ్‌లో నవంబరు 30వ తేదీ మొదలైంది. ‘కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్’ (కాప్) అని పిలుస్తున్న ఈ సమావేశాలు భూమిని వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రక్షించుకునే ఉద్దేశంతో నిర్వహిస్తున్నవి. ఇప్పటివరకూ తీసుకున్న నిర్ణయాలూ, వాటి అమలు వంటి అంశాలపై ప్రపంచదేశాలన్నీ కూర్చుని సమీక్షి స్తారిక్కడ. మూడు దశాబ్దాలుగా వాతావరణ మార్పులపై జరుగుతున్న చర్చల పుణ్యమా అని ఇప్పటివరకూ మూడు అంతర్జాతీయ చట్టాలు ఏర్పాటయ్యాయి. ఇందులో ఒకటి 2015 నాటి ‘ప్యారిస్ ఒప్పందం’. అత్యవసరంగా పరిష్కార చర్యలు తీసుకోవాలన్న నిర్ణయాలు కోకొల్లలు. అన్నింటి లక్ష్యం మాత్రం ఒక్కటే. సురక్షితమైన భూమి! ఈ అంతర్జాతీయ నిర్ణయాలు, చట్టాలు లేకపోయి ఉంటే భూమి సగటు ఉష్ణోగ్రతలు 2,100 నాటికి కనీసం నాలుగు డిగ్రీ సెల్సియస్ వరకూ పెరిగి పోతాయి. అయితే ఇప్పుడేదో చాలా గొప్పగా జరిగిపోతుందని కాదు. ఎందుకంటే భూమి ఇప్పటికీ ప్రమాదం నుంచి బయటపడలేదు మరి!ఈ మధ్యే విడుదలైన ‘యూఎన్ఈపీ గ్యాప్ రిపోర్ట్’ కూడా ప్యారిస్ ఒప్పందంలో భాగంగా దేశాలు చేసిన వాగ్దానాలన్నీ నెరవేరినా భూమి సగటు ఉష్ణోగ్రతలు లక్ష్యంగా నిర్ణయించుకున్న 1.5 డిగ్రీ సెల్సియస్‌గా కాకుండా 2.9 డిగ్రీ సెల్సియస్‌కు చేరతాయని చెప్పడం ఆందోళనకరం. 2021 నాటి ‘గ్లాస్ గౌ’ సమావేశాల్లోనూ సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీ సెల్సియస్‌కు పరిమితం చేస్తామని ప్రపంచం ప్రతిన బూనింది! షరతుల్లేని వాగ్దానాల విషయానికి వస్తే... ఇవి కూడా పూర్తిస్థాయిలో అమలైన పక్షంలో ఉష్ణోగ్రత పెరుగుదల అనేది 2.5 డిగ్రీ సెల్సియస్‌కు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఐపీసీసీ 2022 నాటి నివేదిక కూడా దేశాల ఆర్థికసాయంలో మూడు నుంచి ఆరు రెట్లు తక్కువగా అందినట్లు చెప్పడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం. భూమి సగటు ఉష్ణోగ్రతలు 2.9 డిగ్రీ సెల్సియస్‌కు పెరగ డమంటే భూమిని కాష్ఠం చేసినట్లే! ప్రకృతి వ్యవస్థలు చిన్నాభిన్నమవుతాయి. ఫలితంగా ఎన్నో ప్రకృతి ఉపద్రవాలకు బీజం పడుతుంది. గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా మనిషిపై వీటి ప్రభావం కూడా అంతకంతకూ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఊహించుకుంటేనే ఉలిక్కిపడాల్సిన పరిస్థితి ఇది. పైగా రికార్డుల్లో ఎన్నడూ లేనంత ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ ఏడాదే నమోదయ్యాయి. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలోనే దుబాయ్‌లో మొదలైన కాప్–28కు ప్రాధాన్యం మరింత పెరిగింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏదైనా శంఖనాదం చేస్తుందా అని ప్రపంచం ఎదురు చూస్తోంది. ఐరాస వాతావరణ చర్చలే సరిపోవు... వాతావరణ మార్పులను ఎదుర్కోవాలంటే కేవలం చర్చలు సరిపోవు. ప్యారిస్ ఒప్పందం ఏకాభిప్రాయంపై ఏర్పడని కారణంగా... నిర్ణయాలు తీసుకునే విషయంలో సరైన వ్యవస్థ లేక పోవడం వల్ల మనం అనుకున్నంత వేగంగా పురోగతి సాధించ లేకపోయాం. ఈ ఒప్పందంలో కేవలం కొన్ని వాగ్దానాలూ, ఒప్పందాలు మాత్రమే ఉన్నాయి. కొంత వినూత్నంగా ఆలోచించ గలిగితే ఇంతకంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చునని అప్పట్లోనే చాలామంది నిపుణులు చెప్పుకొచ్చారు కానీ పట్టించు కున్నది కొందరే! ఏదో ప్రజల ఆందోళనను కొంత నెమ్మదింప జేసేందుకా అన్నట్లు గొప్ప గొప్ప ప్రకటనలైతే జారీ అయ్యాయి. ఈ ప్రకటనలు మఖలో వచ్చి పుబ్బలో పోయే రకాలు. 2021లో జరిగిన గ్లాస్గౌ సమావేశాల్లో... ‘దశల వారీగా బొగ్గు వాడకాన్ని తగ్గించాలి’ అని ఒక నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా తొలగించాలన్న విషయానికి భారత్ అభ్యంతరం తెలిపింది. ఫలితంగా దశలవారీగా అన్న పదం వచ్చి చేరింది. అయితే భారత్‌లోనే కాదు... చాలా దేశాల్లోనూ బొగ్గు వాడకం తగ్గనూ లేదు. పూర్తిగా నిలిచిపోనూ లేదు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకునే చర్యలు ప్రభావవంతంగా ఉండాలంటే దానికి సర్వతోముఖ ప్రయత్నాలు అవసరం. భాగస్వాములందరూ కలిసికట్టుగా పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఐరాస చర్చలు ఈ అంశంపై నియమ నిబంధనలను ఖరారు చేయడంపై దృష్టి పెట్టడం మంచిది. దుబాయ్‌లో జరిగే చర్చలు మన లక్ష్యానికి సంబంధించిన స్పష్టమైన మార్గాన్ని నిర్దేశించాలి. అలాగే దేశాలు తగిన చర్యలు తీసుకునేలా చేయాలి. కాప్–28 లక్ష్యం ఇదే కావాలి. తొలిసారి ప్రపంచస్థాయి సమీక్ష... దుబాయ్‌లో జరుగుతున్న కాప్–28 సమావేశాల్లో మొట్ట మొదటిసారి ప్రపంచవ్యాప్త వాతావరణ పరిస్థితిపై తాజా సమీక్ష ఒకటి చేపట్టనున్నారు. ‘గ్లోబల్ స్టాక్ టేక్’ ద్వారా ప్యారిస్ ఒప్పందం అమలు విషయంలో ఇప్పటికి మనం సాధించింది ఏమిటి? సాధించాల్సింది ఏమిటన్న స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందన్నమాట. ఈ ఏడాది సెప్టెంబరులో దీనికి సంబంధించిన నివేదికలు సిద్ధ మయ్యాయి. ఆశయాలకు, ఆచ రణకు మధ్య అంతరాన్ని విస్ప ష్టంగా ఈ నివేదికల్లో పేర్కొ న్నారు. కాప్–28 ఇంకో ముంద డుగు వేసి ప్రపంచం నిర్దేశిత లక్ష్యానికి దూరంగా ఉన్న విష యాన్ని స్పష్టం చేయాలి. ప్రస్తుత వాగ్దానాలు సరిపోవని, ఆర్థిక సహకారం తగినంత అందని నేపథ్యంలో వీటి అమలు కూడా అసాధ్యమన్న విషయాన్ని సుస్పష్టం చేయాలి. కాప్–28 ద్వారా ప్రపంచానికి అందించాల్సిన సందేశం ఇంకోటి కూడా ఉంది. కర్బన ఉద్గారాల తగ్గింపు, అందుకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించడంపై ఎక్కువ దృష్టి పెట్టక పోవడం మంచిది. ఎందుకంటే గతంలో కాప్ సమావేశాలు మిగిలిన విషయాలను పక్కనబెట్టి కేవలం ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకునేందుకన్నట్లు భారీ భారీ లక్ష్యాలు ప్రకటించి చతికిలబడ్డాయి కాబట్టి! ఈ రకమైన భారీ లక్ష్యాలు చాలాసార్లు ఆయా దేశాల ఆశయాలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కల్పిస్తుంది. జాతీయ రాజకీయాలు పరిస్థి తులు (కొన్ని సందర్భాల్లో చట్టపరమైన అంశాల) అసలైన, ఆచరణ సాధ్యమైన లక్ష్యాలను నిర్దేశిస్తాయే కానీ.. అంతర్జాతీయ ఒత్తిడి కాదు. ఈ లక్ష్యాలకు అంతర్జాతీయ ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞాన, మానవ వనరుల పరమైన సాయం లభించినప్పుడు మాత్రమే వాస్తవంగా అమలు చేయడం సాధ్యమవుతుంది. తద్వారా మన విశ్వాసం మరింత పెరుగుతుంది. మరింత ఉన్నత స్థాయి లక్ష్యాల కోసం పనిచేసే స్థైర్యం లభిస్తుంది. లక్ష్యాలకన్నా ఆచరణ మిన్న వాతావరణ మార్పులను తట్టుకునేందుకు చేయాల్సిన పనుల విషయంలోనూ కొంచెం పట్టువిడుపు ధోరణి అవసరం. మరింత కఠినమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం కంటే సంప్ర దాయేతర ఇంధన వనరుల వాడకాన్ని పెంచాలని, ఇంధన సామర్థ్యాన్ని పెంచుకోవాలని కాప్–28 వేదికగా పిలుపునివ్వాలి. దీనికీ శిలాజ ఇంధనాల వాడకం తగ్గేందుకూ మధ్య పొంతన కుదిరేలా చూడాలి. అంటే.. లక్ష్యాలను నిర్దేశించడం కాకుండా మార్పు జరిగేందుకు, సక్రమ అమలుకు పూనికగా నిలవాలి అని అర్థం. దీనికి అదనంగా కాప్–28 బాధ్యతల పంపిణీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దేశాల అంతర్గత లక్ష్యాలు కావచ్చు. దేశాల మధ్య కావచ్చు అన్నింటి విషయంలో సమదృష్టి పాటించడం అవసరం. వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించాలంటే వ్యవస్థలకు వ్యవస్థలు మారాల్సి ఉంటుంది. ఇది కొంత విధ్వంసాన్నయితే సృష్టిస్తుంది. దీని ప్రభావం కూడా దిగువ వర్గాలపైనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వారి ప్రయోజనాలు దెబ్బతినకుండా న్యాయమైన, అందరినీ కలుపుకొనిపోయే ఏర్పాట్లు అవసరం. ప్రత్యామ్నాయ జీవ నోపాధులతో పాటు తమదన్న భావనను కల్పించడం కీలక మవుతుంది. కాప్–28 సమా వేశాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా.. వాటి అమలును చురు కుగా పర్యవేక్షించడం ముందుకు తీసుకెళ్లడం ప్రస్తుత తక్షణ కర్తవ్యం కావాలి. ఐక్యరాజ్య సమితి పరిధిలో.. బయట కూడా చేసిన వాగ్దానాలు నెరవేరేలా చూసేందుకు ఒక ప్రణాళిక కూడా అవసరం. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలనేవి ప్రభుత్వాల్లోని అన్ని వర్గాల వారిని సమన్వయం చేసుకుని ఆచరించినప్పుడు వాటికి సార్థకత. అలాగే ఈ చర్యలు ప్రభావశీలంగా ఉండాలంటే భాగస్వాములందరి చర్యలూ, తోడ్పాటు అత్యవసరం. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వాతావరణ సంబంధిత వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. అంతర్జాతీయ కోర్టుల్లోనూ హై ప్రొఫైల్ కేసులు విచారణలో ఉన్నాయి. ఇదంతా బాధ్యత ఎవరిదన్న విషయంపైనే! దేశాలు, ఐక్యరాజ్య సమితి కూడా తాము చేసిన వాగ్దానాలు కచ్చితంగా, సంపూర్ణంగా అమలయ్యేలా చూడాలి. తద్వారా మానవాళిని పరిరక్షించాలి. లావణ్యా రాజమణి వ్యాసకర్త ప్రొఫెసర్,ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ లా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ -
కాప్ దిశ ఎటువైపు..?
ఏటా తప్పనిసరి లాంఛనంగా జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్)–28 సదస్సు శుక్రవారం మొదలైంది. ఈనెల 12 వరకూ జరగబోయే ఈ సదస్సుకు 130 మంది దేశాధినేతలు, దాదాపు 80,000 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా. అలా చూస్తే ఈ సదస్సు గత సమావేశాలతో పోలిస్తే విస్తృతమైనదే. కానీ చివరాఖరికి ఇది ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకోగలదా లేక గత సదస్సుల మాదిరే ఉస్సూరనిపిస్తుందా అన్నదే పెద్ద ప్రశ్న. లక్ష సంవత్సరాల వ్యవధిలో జరగాల్సిన వాతావరణ మార్పులు కేవలం గత వందేళ్లలో సంభవించాయన్న చేదు వాస్తవాన్ని గుర్తించి చిత్తశుద్ధితో కాలుష్య నివారణ చర్యలకు ఉపక్రమించాల్సిన సంపన్న దేశాలు మాటలతో కాలక్షేపం చేసి లక్ష్యానికి తిలోదకాలిస్తున్నాయి. భూమాత తన భవిష్యత్తును పరిరక్షించమంటూ మనవైపు చూస్తున్నదని, ఈ విషయంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించి విజయం సాధించటం మనందరి కర్తవ్యమని సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు అర్థవంతమైనది. 2030 కల్లా కర్బన ఉద్గారాల తీవ్రతను 45 శాతానికి తగ్గించటంతో పాటు హరిత ఇంధనాల వాడకం వాటాను 50 శాతానికి పెంచాలని భారత్ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పటం కూడా మెచ్చదగ్గదే. అయితే ప్రధాన కాలుష్య కారక దేశాలైన చైనా, అమెరికా, ఇతర సంపన్న దేశాలూ ఏం చేయ బోతున్నాయన్నదే ప్రధానం. శిలాజ ఇంధనాల అవసరం లేని భవిష్యత్తును నిర్మించాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ దేశాధినేతలకు విన్నవించారు గానీ వినేదెవరు? వాతావరణ మార్పులు ఎలా వున్నాయో వివిధ నివేదికలు చెబుతున్నాయి. గత ఏడెనిమిది దశాబ్దాలుగా కనీవినీ ఎరుగని ఉష్ణోగ్రతలను ఈ ఏడాది చవిచూశామని వాతావరణ పరిశోధకులు అంటున్నారు. ఇది ఏ స్థాయిలో వున్నదంటే పనామాలో కరువుకాటకాలు విస్తరిల్లి పసిఫిక్, అట్లాంటిక్ మహా సముద్రాలను అనుసంధానించే 80 కిలోమీటర్ల పనామా కాలువకు నీటి పరిమాణం గణనీయంగా తగ్గింది. దాంతో ఆ కాల్వమీదుగా వెళ్లే నౌకల సంఖ్య 40 నుంచి 32కు తగ్గింది. అంతేకాదు... నౌకలు మోసు కెళ్లే సరుకుల బరువుపై కూడా పరిమితులు విధించారు. పర్యవసానంగా సరుకు రవాణా బాగా దెబ్బ తింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదంతా చవిచూసిన కార్చిచ్చులు, వరదలు అన్నీ ఇన్నీ కావు. ఈసారి భారీవర్షాలతో మన దేశం 1,500 కోట్ల డాలర్ల మేర ఆస్తి నష్టాన్ని చవిచూసింది. లిబియానూ, మెక్సికోనూ కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయి. ఇలాంటి పరిణామాలు ఆర్థిక వ్యవస్థలను తలకిందులు చేస్తాయి. నిజానికి ఈ పరిస్థితులను సమీక్షించి, సరైన నిర్ణయాలు తీసుకో వటానికి కాప్ వంటి వేదికలు తోడ్పడాలి. ఆచరణలో అది సాధ్యం కావటం లేదు. ఉష్ణోగ్రతల పెరు గుదలను పారిశ్రామికీకరణకు ముందునాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే కనీసం 1.5 డిగ్రీల సెల్సియస్ మేరకు పరిమితం చేయాలంటే అన్ని రకాల శిలాజ ఇంధనాల వాడకాన్నీ నిలిపేయటం తప్ప తగ్గించటంవల్ల ఒరిగేదేమీ లేదన్నది పర్యావరణవేత్తల మాట. కానీ సంపన్న దేశాలు నిలకడగా ఒక మాట మీద ఉండటం, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చటం ఇంతవరకూ లేనేలేదు. ఉదాహరణకు శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చేస్తున్న హెచ్చరికలు చేదు వాస్తవమని పర్యావరణపరంగా జరుగుతున్న పెను మార్పులు రుజువు చేస్తున్నాయని, తక్షణం కర్బన ఉద్గారాలను ఆపటంలో విఫలమైతే మహా విపత్తు తప్పదని ఇదే సదస్సులో మాట్లాడిన బ్రిటన్ రాజు చార్లెస్–3 చెప్పారు. కానీ విషాదమేమంటే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ గత ప్రభుత్వాల వాగ్దానాలను బుట్టదాఖలు చేస్తూ పెట్రోల్, డీజిల్ కార్ల విక్ర యాలకున్న గడువును 2030 నుంచి 2035కు పొడిగించారు. 2035 నాటికి కొత్త గ్యాస్ బాయిలర్ల ఏర్పాటును ఆపేస్తామన్న వాగ్దానాన్ని కూడా పక్కనబెట్టారు. ఒకే దేశం భిన్న వైఖరులను ప్రదర్శించటం పర్యావరణ పరిరక్షణకు ఏమేరకు దోహదపడుతుందో చార్లెస్–3, సునాక్‌లు ఆలోచించాలి. అసలు శిలాజ ఇంధనాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో వున్న దేశాల్లో ఒకటైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో కాప్ సదస్సు నిర్వహించటం, సదస్సు అధ్యక్ష స్థానంలో వుండటం ఒక విచిత్రం. నిరుడు ఈజిప్టులో కాప్ సదస్సు జరిగింది. అప్పటినుంచీ శిలాజ ఇంధనాలైన బొగ్గు, చమురు, సహజవాయు ఉత్పత్తులు రికార్డు స్థాయికి చేరాయని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం ఉత్పత్తుల్లో చమురు వాటా 40 శాతం కాగా, బొగ్గు ఉత్పత్తి వాటా 31 శాతం. మిగిలిన 29 శాతం సహజవాయు ఉత్పత్తులది. వీటిని ఒకేసారి పూర్తిగా తగ్గించుకోవటం సాధ్యపడదు గానీ, ఒక క్రమ పద్ధతిలో హరిత ఇంధనాల వైపు మొగ్గటం ప్రారంభిస్తే లక్ష్యసాధన సులభం అవుతుంది. కానీ ఆ దిశగా ఏ దేశమూ చర్యలు తీసుకోవటం లేదు. నిరుడు ప్రపంచదేశాలు శిలాజ ఇంధనాల సబ్సిడీ కోసం ఏడు లక్షల కోట్ల డాలర్ల సొమ్మును వినియోగించాయని ఒక అంచనా. పునరుత్పాదక ఇంధన వనరులను పెంచటం విషయంలో ఈసారైనా కాప్ దృష్టి సారించాలి. లేనట్టయితే పర్యావరణ విధ్వంసం మరింత పెరగటం ఖాయం. ఇందుకు అవసరమైన సాంకేతికతలను వెనకబడిన దేశాలకు చవగ్గా అందించటంలో సంపన్న దేశాలు విఫలమవుతున్నాయి. ఇది సరికాదు. నిపుణుల మాట వినటం, పారిస్ ఒడంబడిక అమలుకు నిర్దిష్ట కార్యాచరణ రూపొందించి చిత్తశుద్ధితో దాన్ని అమలు చేయటం తక్షణావసరం. ఒడంబడిక లక్ష్యాలను విస్మరించిన దేశాలపై ఎలాంటి చర్యలుండాలో నిర్ణ యించాలి. ప్రపంచంలో ఏమూల పర్యావరణానికి విఘాతం కలిగినా అది అన్ని దేశాలకూ ముప్పు కలిగిస్తుందని అందరూ గుర్తించాలి. కాప్ సదస్సు ఈ స్పృహను కలిగించగలిగితే దాని లక్ష్యం ఏదోమేరకు నెరవేరినట్టే. -
అమెరికా నిందలో నిజమెంత?
ఖండాంతరాలు దాటి వెళ్లి శత్రువుగా భావించినవారిని చడీచప్పుడూ లేకుండా అంతం చేయటం అంతర్జాతీయంగా ఎప్పటినుంచో వినిపిస్తున్న కథే. ఈ విషయంలో తరచుగా ఇజ్రాయెల్, రష్యాల పేర్లు వస్తుంటాయి. ప్రచ్ఛన్నయుద్ధకాలంలో ఎక్కువగా అమెరికా గూఢచార సంస్థ సీఐఏ పేరు వినబడేది. దాని లక్ష్యాలన్నీ దేశాధినేతలే. అది సాగించిన హత్యలపై ఆ సంస్థనుంచి రిటైరైనవారు ఎన్నో పుస్తకాలు రాశారు. సీఐఏ సాగించిన ఆపరేషన్లు ఇతివృత్తంగా 30కి పైగా చలనచిత్రాలొ చ్చాయి. టీవీ సీరియల్స్ కూడా తక్కువేం కాదు. చిత్రమేమంటే ఈమధ్య కొత్తగా వెలుగులోకొచ్చిన సీఐఏ ఫైళ్ల ఆధారంగా ‘ది లుముంబా ప్లాట్’ అనే పేరుతో అప్పటి కాంగో ప్రధాని పాట్రిస్ లుముంబాను 1961లో హతమార్చిన తీరుపై స్టువార్ట్ ఏ. రీడ్ అనే ఆయన ఒక పుస్తకాన్ని వెలువరించాడు. అలాంటి అమెరికా గడ్డపై ఖలిస్తానీ ఉద్యమకారుణ్ణి హతమార్చటానికి జరిగిన కుట్రలో భారత ప్రభుత్వ అధికారి ప్రమేయం వున్నదని అమెరికా ఆరోపిస్తోంది. మొన్న జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా సందర్శించిన తర్వాత ఈ కుట్ర గురించి మన ప్రభుత్వాన్ని అమెరికా హెచ్చరించిందని నవంబర్ 22న బ్రిటన్‌కు చెందిన ‘ద ఫైనాన్షియల్ టైమ్స్’ వెల్లడించింది. బుధవారం న్యూయార్క్ సిటీ కోర్టులో ప్రభుత్వ అటార్నీ విలియన్స్ 15 పేజీల అభియోగపత్రాన్ని కూడా దాఖలు చేశారు. అందులో ఈ కుట్ర లక్ష్యం ఎవరన్న పేరు ప్రస్తావించికపోయినా సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ నాయకుడు పత్వంత్‌సింగ్ పన్నూన్ అని అక్కడి మీడియా అంటున్నది. ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం ఇటువంటి ఆరోపణే చేశారు. అక్కడ దుండగుల కాల్పుల్లో మరణించిన ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ పాత్ర వున్నదని ఆయన అభియోగం. ఇందుకు సంబంధించి మన దౌత్యవేత్తను బహిష్కరించింది కూడా. నిరాధారమైన ఆరోపణ చేయడాన్ని మన దేశం తప్పుబట్టి ప్రతీకారంగా ఢిల్లీలోని కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. దౌత్య సిబ్బందిని తగ్గించుకోమని కెనడాను కోరింది. ఆ అంకం ముగియకుండానే తాజాగా అమెరికా సైతం ఆ మాదిరి ఆరోపణే చేయటం సహజంగానే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సాధారణంగా మిత్ర దేశాలమధ్య ఈ తరహా పొరపొచ్చాలు రావు. ప్రచ్ఛన్నయుద్ధకాలంలో మనం సోవియెట్ యూనియన్‌తో సన్నిహితంగా వుండటాన్ని జీర్ణించుకోలేక అమెరికా పాకిస్తాన్‌కు అండదండలందించేది. ప్రపంచీకరణ తర్వాత అంతా మారింది. ఇప్పుడు మనకు అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలు బలంగా వున్నాయి.ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాను కట్టడి చేసేందుకు భారత్ సహాయసహకారాలు అవసరమని అమెరికా విశ్వసిస్తోంది. తన ఆరోపణను నిర్ద్వంద్వంగా రుజువుచేసే సాక్ష్యాధారాలు అమెరికా దగ్గరున్నాయా? భారత ప్రభుత్వ అధికారి ఒకరు నిఖిల్ గుప్తా అనే భారత పౌరుడి ద్వారా ఒక కిరాయి హంతకుణ్ణి వినియోగించి పన్నూన్‌ను హతమార్చటానికి కుట్ర చేశారని అటార్నీ దాఖలు చేసిన అభియోగపత్రం చెబుతోంది. అయితే నిఖిల్ గుప్తా అమెరికా మాదకద్రవ్య నిరోధక సంస్థ తాలూకు ఏజెంట్‌ను కిరాయి హంతకుడిగా పొరబడి పన్నూన్ హత్యకు లక్షన్నర డాలర్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని, అడ్వాన్స్‌గా 15,000 డాలర్లు అంద జేశాడని అటార్నీ ఆరోపణ. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా అభియోగపత్రానికి జత చేశారు. ఈ హత్య చేయించగలిగితే అతనిపై గుజరాత్లో వున్న క్రిమినల్ కేసును రద్దు చేయిస్తానని భారత అధికారి వాగ్దానం చేశారని ఎఫ్‌బీఐ చెబుతోంది. మాదకద్రవ్యాలు, మారణాయుధాల విక్రయం కేసులో నిందితుడైన నిఖిల్ గుప్తా చెక్ రిపబ్లిక్కు వెళ్లిన సమయంలో అతన్ని అరెస్టు చేయాలంటూ ఎఫ్‌బీఐ కోరటంతో మొన్న జూన్ 30న అక్కడి పోలీసులు అదుపులోనికి తీసుకుని అమెరికాకు అప్పజెప్పారు. కెనడాలో జరిగిన నిజ్జార్ హత్యలో తమ హస్తమున్నదని గుప్తా ఎఫ్‌బీఐ ఏజెంట్ దగ్గర అంగీకరించాడంటున్నారు. ఖలిస్తాన్‌పై రిఫరెండమ్ జరగాలని పత్వంత్ సింగ్ డిమాండ్ చేస్తున్నారు. ఆయనకు అమెరికా, కెనడా పౌరసత్వాలున్నాయి. ఖలిస్తాన్ వాదాన్ని మన ప్రభుత్వం ఎప్పుడూ అంగీకరించలేదు. 80, 90 దశకాల్లో ఖలిస్తాన్ పేరిట పంజాబ్‌లో ఉగ్రవాదులు సాగించిన మారణకాండను కఠినంగా అణి చేసింది. 1985 జూన్ 23న 329మంది ప్రయాణికులతో కెనడానుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా కనిష్క విమానాన్ని ఉగ్రవాదులు బాంబులతో పేల్చివేశారు. ఆ విషయంలో కెనడా ప్రభుత్వం భారత్‌కు ఎలాంటి సహకారమూ అందించలేదు సరిగదా...కీలకమైన సాక్ష్యాధారాలను పోలీసులు ధ్వంసం చేశారని కూడా ఆరోపణలొచ్చాయి. ఈనాటికీ ఈ కేసు అతీగతీ లేకుండాపోయింది. అమెరికా చేసిన ఆరోపణలపై మన దేశం ఇప్పటికే ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుచేసింది. అది అందించే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. నిఖిల్ గుప్తాతో ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తి నిజంగానే ప్రభుత్వాధికారా? అధికారే అయితే అత్యుత్సాహంతో అతను పరిధి దాటి ప్రవర్తించాడా? వేరే దేశాల్లో వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవటం తమ విధానం కాదని నిజ్జార్ కేసు సందర్భంగా మన దేశం చెప్పింది. పైగా పకడ్బందీ వ్యవస్థలు అమల్లోవున్న అమెరికాలో అలాంటి పనికి ఎవరైనా సాహసిస్తారా అన్నది సందేహాస్పదం. పంజాబ్‌లో కనుమరుగైన ఖలిస్తాన్ ఉద్యమాన్ని మన దేశం ఇంత సీరియస్‌గా తీసుకుంటుందా అన్నది కూడా అనుమానమే. అమెరికా దగ్గరున్న సాక్ష్యాలు నిజంగా అంత బలంగా వున్నాయా, వుంటే దీన్ని తెగేదాకా లాగుతుందా అన్నది చూడాలి. ఈ కేసు సంగతెలావున్నా మన ప్రభుత్వం భవిష్యత్తులో ఈ మాదిరి ఆరోపణలకు తావు లేకుండా చూసుకోవాల్సిన అవసరం వుంది. -
సిల్క్యారా చేస్తున్న హెచ్చరిక
మానవ సంకల్పం ముందు శిఖరం తలొంచింది. పదిహేడు రోజులుగా కోట్లాదిమంది దేశ ప్రజానీకం మాత్రమే కాదు... దేశదేశాల పౌరులూ పడిన ఆరాటం, ఆత్రుత ఫలించాయి. ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగం కుప్పకూలటంతో 422 గంటలపాటు బందీలైన 41 మంది కార్మికులు మంగళవారం సాయంత్రం సురక్షితంగా బయటపడ్డారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నిపుణులు మొదలుకొని వైద్య నిపుణుల వరకూ అందరికందరూ రాత్రింబగళ్లు సమన్వయంతో సాగించిన కృషి ఒక ఎత్తయితే...అత్యంత కష్టసాధ్యమైన ర్యాట్ హోల్ మైనింగ్‌లో నిపుణులైన కార్మికులు చివరి 12 మీటర్ల పొడవునా వున్న శిథిలాలను ఎంతో ఓపిగ్గా, జాగ్రత్తగా తొలగించటం మరో ఎత్తు. వెరసి బందీలైనవారంతా క్షేమంగా బాహ్యప్రపంచాన్ని చూడగలిగారు. ఇలాంటి సంక్లిష్ట సందర్భాల్లో చిక్కుకున్నవారిలో సమూహ చేతన ఎంతమాత్రమూ సడలరాదన్నది మనస్తత్వ నిపుణుల మాట. బందీల్లో కనీసం ఒక్కరికైనా సద్యోజనిత నాయకత్వ లక్షణం వుంటే తప్ప ఇలాంటి సామూహిక చేతనకు అవకాశం వుండదు. 2010లో చిలీ రాగి గనుల్లో పదివారాలు చిక్కుకున్న కార్మికులైనా... మరో ఏడెనిమిదేళ్లకు ఉత్తర థాయ్‌లాండ్‌లోని కొండ గుహల్లోకి వరద నీరు ప్రవేశించటంతో పదకొండు రోజులపాటు చిక్కుకున్న ఫుట్‌బాల్ టీమ్ పిల్లలైనా క్షేమంగా బయటపడటానికి కారణం ఇదే అంటారు. భయానక పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరైనా నాలుగో రోజు వరకూ ప్రాణాలు నిలుపుకోగలిగితే మానసికంగా వారు దృఢంగా వున్నట్టేనని, ఆ తర్వాత వారు దేన్నయినా సునాయాసంగా అధిగమిస్తారని మనస్తత్వ నిపుణులు చెబుతారు. వెలుపలి ప్రపంచంలో కోట్లాదిమంది పడుతున్న తపనకు బందీలైన ఆ 41 మంది కార్మికుల దృఢచిత్తం తోడవటం వల్లనే ఇదంతా సవ్యంగా పూర్తయింది. ఆ కార్మిక కుటుంబాల మాటేమోగానీ... అశేష ప్రజానీకం ఆశానిరాశాల్లో ఊగిసలాడిన తీరు మాత్రం మరిచిపోలేనిది. మినుకు మినుకుమంటున్న ఆశలు, అంతలోనే గంపెడు నిరాశలో ముంచే పరిణామాలూ ఈ పదిహేడురోజులూ ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఆ కార్మికులు బయటికిరావటం నూటికి నూరుపాళ్లూ సాధ్యమేనని మంగళవారం సాయంత్రానికిగానీ ధ్రువపడలేదు. బందీలను విడిపించటానికి భారీ యంత్రాలను వినియోగించి కొండను తొలుస్తున్న క్రమంలో ఈనెల 16న సంభవించిన భూకంపం అన్ని రకాల ప్రయత్నాలపైనా నీళ్లుజల్లింది. ఒక దశలో పైపును అమరుస్తుండగా భారీ పగుళ్ల శబ్దాలు విన బడ్డాయి. ఈలోగా 25 టన్నుల భారీయంత్రమైన అగర్ మెషిన్‌తో తవ్వుతుండగా శిథిలాల్లో ఇరుక్కున్న ఇనుప రాడ్లు తగిలి దాని బ్లేడ్లు తెగిపడ్డాయి. ఇక ర్యాట్‌హోల్ మైనింగ్ నిపుణులు రంగంలో దిగితే తప్ప ఇది పూర్తికాదని నిర్ధారించుకుని మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ల నుంచి వారిని రప్పించారు. అయితే ఈ ఆనందోత్సాహాల సందడిలో అసలు విషయం మరుగున పడకూడదు. అపార ఖనిజ సంపద వున్న దేశాలన్నిటా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చటానికీ, ప్రపంచంలో అగ్రగామిగా నిలిచేందుకూ ప్రభుత్వాలు తపిస్తున్నాయి. ఈ క్రమంలో పర్యావరణానికి కలుగుతున్న చేటు సరే, మనుగడ కోసం మరేదీ చేయలేక ప్రాణాలకు తెగించి గనుల్లో పనిచేస్తున్న బడుగు జీవులు సమిధలవుతున్నారు. చాన్నాళ్ల క్రితమే ఎన్జీటీ నిషేధించిన ర్యాట్ హోల్ మైనింగ్ సిల్క్యారాలో కార్మికుల ప్రాణాలు కాపాడటానికి దోహదపడిన మాట నిజమే అయినా...ఇప్పటికీ చట్టవిరుద్ధంగా అలాంటి మైనింగ్ సాగుతున్నదని ఈ ఎపిసోడ్ నిరూపించింది. కేవలం ఒక మనిషి పాకుకుంటూ వెళ్లగలిగేంత కంత తవ్వుకుంటూ భూగర్భం మూలల్లో వున్న బొగ్గు లేదా ఇతర ఖనిజాలనూ సేకరించటం ఈ కార్మికుల పని. ఈ క్రమంలో ఎక్కడైనా పైకప్పు కూలిందంటే వాళ్ల బతుకులు ముగిసినట్టే. గనుల పరిసర ప్రాంతాల్లో వుంటున్నవారికే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నప్పుడు నేరుగా అందులోకి ప్రవేశించి నిత్యం ఆ దుమ్మూ ధూళితో సావాసం చేసేవారికి ఎంత ముప్పు కలుగుతుందో వేరే చెప్పనవసరం లేదు. ఇక భూమి కుంగిపోవటం, భూగర్భ జలాలు కలుషితం కావటంవంటి పర్యావరణ సమస్యలకు అంతే లేదు. ఇంతా చేసి ఇలాంటి కార్మికుల శ్రమంతా భారీ యంత్రపరికరాలపై పెట్టుబడులూ, అనుమతులు, రాయల్టీ చెల్లింపులూ లేకుండా చట్టవిరుద్ధంగా దోపిడీచేసే మైనింగ్ మాఫియాల పాలవుతోంది. కార్పొరేట్ల లాభార్జనకు దోహదపడుతోంది. హిమశిఖరాలు ఆల్ప్ పర్వతశ్రేణిలా పురాతనమైనవి కాదు. అవి ఆరున్నరకోట్ల సంవత్సరా లనాటివైతే, హిమశిఖరాల వయసు నాలుగుకోట్ల సంవత్సరాలు మించదు. అందువల్లే వాటి భూగర్భంలో నిరంతర చలనం, ఒత్తిడి, అధిక ఉష్ణోగ్రత కొనసాగుతున్నాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీతో సహా 51 శాతం నేల కుంగుబాటు ప్రాంతంలో వున్నదని జర్నల్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్స్ పత్రిక చాన్నాళ్ల క్రితం తెలిపింది. ఇక్కడి కొండల్లో మట్టి, రాళ్లు కలిసి వుండటం వల్ల ఈ కుంగుబాటు ప్రమాదం ఎక్కువ. గత కొన్నేళ్లుగా జోషీమuŠ‡ కుంగుబాటు, ఇతర ప్రాంతాల్లో సైతం భూమి నెర్రెలుబారటం ప్రమాదకర సంకేతాలందిస్తోంది. చార్ధామ్ యాత్రికులకూ, పర్యాటకులకూ అనుకూలంగా వుంటుందని 900 కిలోమీటర్ల మేర చార్ధామ్ హైవే నిర్మాణం చేపట్టారు. సిల్క్యారా సొరంగ నిర్మాణం దానిలో భాగమే. ఇవిగాక ఎన్నో జల విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. ఈ ప్రాజెక్టులను సమీక్షించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సిల్ క్యారా ఉదంతం మనల్ని హెచ్చరిస్తోంది. అప్రమత్తం కావటం మనకే మంచిది. -
ఎవరికీ పట్టని ప్రాణాలు
జానెడు పొట్ట కోసం ఉన్న ఊరునూ, అయినవారినీ వదిలి దూరతీరాలకు పోయి కాయకష్టం చేసే వారు బతుకుపోరాటంలో ఎప్పుడూ ఓడిపోతూనే వుంటారు. మహానగరాల్లో రాళ్లెత్తే కూలీలుగా, క్వారీల్లో గనుల్లో చెమటోడ్చే కార్మికులుగా, భారీ భవంతులకు కాపలాదార్లుగా, స్థానికులు చేయసాహసించని అనేక ప్రమాదకరమైన పనులను తప్పనిసరిగా తలకెత్తుకుని ప్రాణాలు పణంగా పెట్టే బడుగుజీవులుగా వీరు అందరికీ సుపరిచితులే. కానీ భద్రత, ఆరోగ్యం వంటివి వీరికెప్పుడూ ఆమడదూరమే. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా అర్ధాకలితో కాలం గడిపే అలాంటి అభాగ్యులపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) విడుదల చేసిన నివేదిక దిగ్భ్రాంతికరమైన నిజాలు వెల్లడించింది. పనికి సంబంధించిన ప్రమాదాల్లో చిక్కుకుని, వ్యాధుల బారినపడి ప్రపంచవ్యాప్తంగా సగటున ఏటా 30 లక్షలమంది కన్నుమూస్తున్నారని ఆ నివేదిక అంచనా. కార్మికుల ఉసురుతీస్తున్న పది రకాల కారణాలను ఆ నివేదిక గుర్తించింది. సుదీర్ఘమైన పనిగంటలు (వారానికి 55 గంటలు లేదా అంతకన్నా ఎక్కువ) కార్మికుల మరణాలకు ప్రధాన కారణమవుతున్నాయని, ఆ కేటగిరీలో ఏటా మరణిస్తున్నవారు 7,44,924 మంది అని తేల్చింది. ఆ తర్వాత స్థానం సూక్ష్మ ధూళి కణాలు, పొగలు, వాయువులది. వాటి బారినపడి మర ణించేవారు ఏటా 4,50,381 మంది అని లెక్కేసింది. ఇవిగాక నికెల్, ఆర్సెనిక్, డీజిల్ కాలుష్యం, సిలికా, ఆస్బెస్టాస్ తదితరాల వల్ల మరో 15 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. వీటిల్లో 63 శాతం ఆసియా–పసిఫిక్ ప్రాంత దేశాల్లోనే వుంటున్నాయని వివరించింది. వ్యవసాయం, రవాణా, మైనింగ్, నిర్మాణరంగం వగైరాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి నివారణకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పనకు సోమవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రారంభ మైన నాలుగురోజుల సదస్సు సందర్భంగా ఐఎల్ఓ ఈ నివేదిక వెలువరించింది. మనవరకూ తీసుకుంటే జనాభాలో మూడోవంతు మంది వలసబాట పడుతున్నారు. వీరంతా పల్లెటూళ్లను వదిలి పట్టణాలకూ, నగరాలకూ వలసపోయేవారే. ఇలాంటివారు ఎలాంటి గుర్తింపూ లేకుండా బతుకులీడుస్తున్నారు. వారికి ఓటు హక్కుండదు. రేషన్ కార్డు వుండదు గనుక చవగ్గా సరుకులు లభించవు. స్థానికతకు అవకాశం లేదు గనుక వారి హక్కుల కోసం, పని పరిస్థితుల మెరుగు కోసం పోరాడే సంస్థలుండవు. అసంఘటిత రంగ కార్మికులుగా కనీసం చట్టప్రకారం దక్కాల్సినవి వారికి ఎప్పుడూ దూరమే. జ్వరమో, మరే వ్యాధో ముంచుకొచ్చినా చూసే దిక్కుండదు. ఇలాంటి అభాగ్యులకు కుటుంబాలుంటే ఈ కష్టాలన్నీ మరిన్ని రెట్లు ఎక్కువ. ఈ కార్మికుల కాంట్రాక్టర్లు సర్వసాధారణంగా ఏదో ఒక పార్టీ ఛత్రఛాయలో వుంటారు గనుక అధికారులు వారి జోలికి పోవటానికి, కార్మికుల ప్రయోజనాలు కాపాడటానికి సాహసించరు. మెరుగైన సాంకేతికత లున్న యంత్ర సామగ్రి లభ్యమవుతున్నా వాటిపై పెట్టుబడులు పెట్టడం దండగన్న భావనతో ఈ కార్మికులతోనే అన్నీ చేయిస్తుంటారు. ఈ క్రమంలో ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోవటం లేదా అంగవికలురు కావటం రివాజు. ప్రపంచవ్యాప్తంగా గాయాలపాలై ఏటా 3,63,283 మంది కార్మికులు మరణిస్తున్నారని ఐఎల్ఓ నివేదిక చెబుతోంది. మన దేశంలో 2017–2020 మధ్య సగటున రోజూ ముగ్గురు కార్మికులు ప్రమాదాల బారినపడి చనిపోతున్నారని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది. ఇవన్నీ రిజిస్టరయిన ఫ్యాక్టరీలకు సంబంధించినవి. అసంఘటిత రంగంలో సంభవించే మరణాలకు అరకొర డేటాయే వుంటుంది. సాధారణంగా ఆ రంగంలో సంభ వించే చాలా మరణాలు సహజ మరణాల ఖాతాలోకి పోతుంటాయి. వైద్యులు కూడా వారికి సహకరిస్తుంటారు. అసంఘటిత రంగ కార్మికులు చేసే వెట్టిచాకిరీ అపారమైన సంపద సృష్టిస్తోంది. కానీ ఆ సంపద సృష్టికర్తలు అనామకులుగా మిగిలిపోతున్నారు. ముగిసిపోతున్నారు. అంతర్జాతీయంగా నిబంధనలు లేవని కాదు. పని పరిస్థితుల్లో భద్రత, ఆరోగ్యం వంటి అంశా లపై ఐఎల్ఓ రూపొందించిన అంతర్జాతీయ ఒడంబడికను 187 సభ్య దేశాల్లో కేవలం 79 దేశాలు ఆమోదించాయి. కనీసం అందుకు సంబంధించిన నియమ నిబంధనలకైనా సభ్య దేశాలన్నీ ఆమోదం తెలపలేదు. అందుకు కేవలం 62 దేశాలు మాత్రమే సమ్మతించాయి. ఈ రెండు ఒడంబడి కలకూ మన దేశం ఆమడ దూరంలో వుంది. వృత్తిపరంగా ఎదురయ్యే ఇబ్బందులేమిటో, అందులో పొంచివుండే ప్రమాదాలేమిటో బయటివారికన్నా కార్మికులకే ఎక్కువ తెలుస్తుంది. కనీసం అవి బయటివారు తెలుసుకోవటానికైనా కార్మికులకు సంఘాలుండాలి. వారి తరఫున గట్టిగా ప్రశ్నించే నేతలుండాలి. కానీ మన దేశం వరకూ చూస్తే కార్మిక సంస్కరణల పేరిట తీసుకొచ్చిన కొత్త చట్టాలు అలాంటి అవకాశాలను మరింత నీరుగార్చాయి. ఫలితంగా బాల కార్మిక వ్యవస్థ, వెట్టిచాకిరీ, వివక్ష, అధిక పనిగంటలు వంటివన్నీ అసంఘటిత రంగ కార్మికులకు శాపాలవుతున్నాయి. రిజిస్టరైన ఫ్యాక్టరీల్లోనే తప్పుడు లెక్కలు చూపించి కార్మికుల భద్రతకు సంబంధించిన కమిటీల ఏర్పాటు,లైంగిక వివక్ష నిర్మూలన తదితరాలను ఎగ్గొడుతున్నారు. ఇక ఎవరికీ పట్టని అసంఘటితరంగ కార్మికుల గురించి చెప్పేదేముంది? సిడ్నీలో సాగుతున్న సదస్సులో 127 దేశాలకు చెందిన మూడు వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు. 30 గోష్ఠులు, ఆరు సాంకేతిక సదస్సులు కూడా వుంటాయంటున్నారు. కనీసం ఈ సదస్సు తర్వాతనైనా కార్మికుల భద్రతకు ముప్పుగా పరిణమించిన సమస్యలను నివారించటానికి పకడ్బందీ విధానాలు రూపొందించటం తమ బాధ్యతగా ప్రభు త్వాలు గుర్తించాలి. -
రైట్...రైట్!
ఉదారవాదులూ, వామపక్షవాదులూ ‘గత కాలమె మేలు వచ్చు కాలము కంటెన్...’ అనుకోక తప్పని సమయం వచ్చినట్టుంది. మొన్న అర్జెంటీనాలో, ఇప్పుడు నెదర్లాండ్స్‌లో జరిగిన ఎన్నికల్లో మితవాద నేతలు విజయకేతనాలు ఎగరేయటం...యూరప్ ఖండంలోని చాలాచోట్ల నానాటికీ మితవాద పార్టీలకు ఆదరణ పెరుగుతుండటం ప్రపంచం ‘కుడి’వైపు మళ్లుతున్న సూచనలు అందిస్తున్నాయి. దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలో ఇటీవల తీవ్ర మితవాద పక్ష నేత జేవియర్ మిలీ వామపక్ష నేత సెర్జియా మాసాను ఓడించి దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సెంట్రల్ బ్యాంకు మూసివేత, స్థానిక కరెన్సీ పెసో రద్దు ఆయనగారి వాగ్దానాలు. దేశ సాంఘిక, ఆర్థిక విధానాలను ధ్వంసం చేసి నవ అర్జెంటీనా నిర్మించటమే తన ధ్యేయమని చెప్పుకొన్నారు. తాజాగా నెదర్లాండ్స్‌లో తీవ్ర మితవాద పక్షమైన పార్టీ ఫర్ ఫ్రీడమ్ (పీవీవీ) 37 స్థానాలు గెల్చుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. 150 స్థానాలున్న దిగువ సభలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 76 స్థానాలకు దూరంలోనే వున్నా ఆ పార్టీ నేత గీర్డ్ వైల్డర్స్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి ప్రయత్నాలు మొదలెట్టింది. అయితే పీవీవీ ప్రవచించే ఇస్లాం వ్యతిరేకత అక్కడ రాజ్యాంగ విరుద్ధం కావటంవల్ల ప్రధాన స్రవంతి పార్టీలు ప్రభుత్వంలో చేరేందుకు నిరాకరిస్తున్నాయి. మసీదుల మూత, ఖురాన్ నిషేధం, ముస్లిం దేశాల నుంచి వలసలు అరికట్టడం వైల్డర్స్ వాగ్దానాలు. రెండో ప్రపంచ యుద్ధానంతరం పశ్చిమ యూరప్‌లో మితవాద పక్షాలకు కాలం చెల్లి, ఉదార వాద పార్టీల ఆధిక్యతే సాగింది. ఒక్క ఇటలీలోని సోషల్ మూవ్మెంట్ పార్టీ (ఎంఎస్ఐ)కి తప్ప ఎక్కడా మితవాదులకు ఆదరణ దొరకలేదు. 1955–80 మధ్య అక్కడక్కడ మితవాద పార్టీలు తలెత్తి కొద్దో గొప్పో స్థానాలు గెల్చుకున్న ఉదంతాలున్నా అవి ఒకటి రెండు దఫాలకు మించి నిలబడ లేకపోయాయి. 1956లో ఫ్రాన్స్‌లో యూనియన్ అండ్ ఫ్రెంచ్ ఫ్రెటర్నిటీ (యూఎఫ్‌ఎఫ్) 13 శాతం ఓట్లు గెల్చుకుని, 52 స్థానాలు సాధించినా చాలా త్వరగానే కనుమరుగయింది. అంతవరకూ దుందు డుకువాదులుగా పేరుబడిన అతి మితవాద పక్షాలు 1980–2000 మధ్య అంతక్రితంతో పోలిస్తే ఎంతోకొంత మెరుగయ్యాయి. ఆస్ట్రియాలో ఫ్రీడమ్ పార్టీ (ఎఫ్పీ), నెదర్లాండ్స్‌లో సెంటర్ పార్టీ (సీపీ) ఓటర్లను ఆకట్టుకోవటం మొదలెట్టాయి. అయితే ఉదారవాద పార్టీలు, వామపక్ష పార్టీల తర హాలో వీటికి నిర్దిష్టమైన సిద్ధాంతమేమీ ఉండదు. స్థానికత, జనాకర్షణ, అవినీతి, పెరుగుతున్న నేరాలు, వలసలు, ముస్లింలపై వ్యతిరేత వంటివే ఈ పార్టీలకు ఊపిరి. 1980కి ముందు ఒక శాతం అంతకన్నా తక్కువ ఓట్లు మాత్రమే రాబట్టుకునే మితవాదులు 2010 నాటికి 10 శాతం ఓట్లు తెచ్చు కునే స్థితికి ఎదిగారు. ఒక్క ఆస్ట్రియా దీనికి మినహాయింపు. అక్కడ తీవ్ర మితవాద ఫ్రీడమ్ పార్టీ (ఎఫ్పీ) 1999లో 27 శాతం ఓట్లు సాధించి కూటమి ప్రభుత్వంలో చేరింది. ఈ పరిణామం యూర ప్‌కు మింగుడుపడలేదు. ఆ దేశంపై పలు ఆంక్షలు సాధించటంతోపాటు చాలా దేశాలు అక్కడికి దౌత్య పర్యటనలు మానుకున్నాయి. 2019లో ఎఫ్పీ నేత అవినీతి ఆధారాలతోసహా బట్టబయలు కావటంతో దానికి ఆదరణ సన్నగిల్లింది. కానీ మొన్న ఫిబ్రవరిలో జరిగిన ప్రాంతీయ ఎన్నికల్లో అది 24 శాతం ఓట్లతో బలం పుంజుకుంది. వేరే దేశాల్లో కూడా మితవాదులకు ఆదరణ పెరుగుతున్న దాఖలాలు కనబడుతూనే వున్నాయి. స్పెయిన్, బెల్జియం, ఇటలీ, జర్మనీ తదితర దేశాలు ఇందుకు ఉదాహరణ. ఈ ఏడాది మొదట్లో ఇటలీలో నియో ఫాసిస్ట్ పార్టీగా ముద్రపడిన ఎంఎస్ఐ అధికారం చేజిక్కించుకోగా, నిరుడు ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో అతి మితవాది మెరిన్ లీ పెన్ రెండో స్థానంలో నిలిచి ఆశ్చర్యపరిచారు. ఆమె పార్టీ దిగువ సభలో భారీగా స్థానాలు గెల్చుకుంది. జర్మనీలో నియో నాజీ పార్టీ ఏఎఫ్‌డీ ప్రస్తుతానికైతే ద్వితీయ స్థానంలో ఉంది. ఒక్క పోలాండ్ ఇందుకు మినహాయింపు. అక్కడ 2019 ఎన్నికల్లో 43.6 శాతం ఓట్లతో అధికారాన్ని చేజిక్కించుకున్న మితవాద లా అండ్ జస్టిస్ పార్టీ (పీఐఎస్)ని మొన్న అక్టోబర్ ఎన్నికల్లో అధికారంలో నుంచి దించలేకపోయినా, ఆ పార్టీ ఆధిక్యతను 35 శాతానికి తగ్గించటంలో ఉదారవాద పార్టీలు విజయం సాధించాయి. నెదర్లాండ్స్‌లో వైల్డర్స్ సాధించిన ఆధిక్యత సహజంగానే యూరప్ అంతటా రాజకీయ ప్రకంప నలకు కారణమైంది. ఎందుకంటే ఇంతవరకూ నెదర్లాండ్స్‌లో ఏ మితవాద పార్టీ 20 శాతం దాటి ఓట్లు సాధించలేదు. తొలిసారి వైల్డర్స్ 23.6 శాతం ఓట్లు గెల్చుకున్నారు. అంతేకాదు... ఇటలీ మిత వాద నేత మెలొని, ఫ్రాన్స్ మితవాద నేత మెరైన్ లీ పెన్ మాదిరి తన తీవ్రవాద భావాలను కాస్త యినా సవరించుకోలేదు. అధికారంలోకి రాగానే ఈయూలో ఉండాలా వద్దా అనే అంశంపై రిఫరెండమ్ నిర్వహిస్తానని వైల్డర్స్ హామీ ఇచ్చారు. ఇది ఆచరణలో సాధ్యమా కాదా అన్న సంగతలావుంచి వర్తమాన స్థితిగతుల నుంచి గట్టెక్కటం ఎలాగో తెలియక అన్ని దేశాల్లోనూ పాలకులు తలలు పట్టు కుంటున్నారు. ఒకపక్క ఉక్రెయిన్ నుంచి రోజూ వేలాదిమంది శరణార్థులు వస్తున్నారు. పశ్చిమా సియా, ఆఫ్రికా ఖండ దేశాల నుంచి సైతం నిత్యం వలసలుంటున్నాయి. ఇందుకు ఈయూనే తప్పు బట్టాలి. వివిధ దేశాల్లో మంటరాజుకోవటానికి కారణమవుతున్న అమెరికా వైఖరిని నిలువరించక పోగా దానికి సహకారం అందించటమే వలసలు పెరగటానికి కారణం. అశాంతితో దహించుకుపో తున్న దేశాలను వదిలి సహజంగానే జనం సురక్షిత ప్రాంతాలు వెదుక్కుంటారు. ఇతరత్రా విషయా లెలావున్నా వలసలపై ఓటర్లలో ఉన్న భయాందోళనలకు పరిష్కారం వెదకటంలో ప్రధాన స్రవంతి పార్టీలు విఫలమైతే అన్నిచోట్లా రాగలకాలంలో అతి మితవాద పక్షాలదే పైచేయి అవుతుంది. -
మాటకు కట్టుబడి...
మన తెలుగు రాజు హాలుడు సంస్కృతం నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇద్దరు పండితులు వస్తారు నేర్పేందుకు. ఒకడు గుణాఢ్యుడు. రెండు శర్వవర్మ. ‘నేను మీకు సంస్కృతం నేర్పాలంటే 12 సంవత్సరాలు పడుతుంది’ అంటాడు గుణాఢ్యుడు. రాజుగారి అర్జెన్సీ గమనించిన శర్మవర్మ ‘నేను ఆరు నెలల్లో నేర్పుతాను’ అంటాడు. అది అసాధ్యం. కనుకనే గుణాఢ్యుడు ఆగ్రహంతో ‘అదే జరిగితే నాకు తెలిసిన సంస్కృత, ప్రాకృత, దేశ భాషలన్నింటినీ విడిచి పెట్టేస్తాను’ అంటాడు. శర్వవర్మ ఏవో తిప్పలు పడి కొత్త వ్యాకరణం రాసి ఆరు నెలల్లో రాజుగారికి సంస్కృతం వచ్చు అనిపిస్తాడు. ఇందుకు గుణాఢ్యుడు ఆశ్చర్యపోయి, మొత్తానికి సాధించావ్ అనేసి తన దోవన తాను పోతే ఎవరూ ఏమీ అనరు. తల తీసి మొలేయరు. కాని మాటకు విలువ ఇచ్చే కాలం అది. గుణాఢ్యుడు మహా పండితుడు. భాషే జీవంగా జీవించేవాడు. అలాంటివాడు తానిచ్చిన మాటకు విలువనిచ్చి తనకు తెలిసిన అన్ని భాషలను వదిలిపెట్టి, మౌనిగా మారి, అడవులకు వెళ్లిపోతాడు. అక్కడ అతను పైశాచి భాష నేర్చుకుని ‘బృహత్కథ’ రాయడం వేరే విషయం. కాని మాటకు కట్టుబడటం వల్లే కదా ఇన్ని వందల ఏళ్ల తర్వాత గుర్తు చేసుకుంటున్నాము. మనిషి గుంపు జీవనం మొదలెట్టే నాటికి లిపి లేదు. రాతకోతలు లేవు. నోటి మాటే శిలాశాసనం. మాట ఇవ్వడం అంటే ఒప్పందం చేసుకోవడమే. రాజ్యాలు ఏర్పడ్డాక ‘మాటకు కట్టుబడటం’ ఒక విలువగా, యుగ స్వభావంగా స్థాపన చేసేందుకు సత్య హరిశ్చంద్రుడి కథ విశేషంగా వ్యాప్తిలోకి వచ్చింది. హరిశ్చంద్రుడు విశ్వామిత్రునికి ఇచ్చింది కేవలం మాటే. హరిశ్చంద్రుడు పాలకుడు, రాజు. ఇచ్చిన మాట నెరవేర్చకపోతే ఎవరూ ఏమీ చేయరు. కాని మాట తప్పిన అపప్రథను శిరస్సున మోయడం కంటే రాజ్యాన్ని, భార్యను, కుమారుణ్ణి కూడా కోల్పోయేందుకు సిద్ధమవుతాడు. శ్రీరాముడు మరింత ఉదాత్తుడు. తన మాటకు కాదు, తండ్రి ఇచ్చిన మాటకు కట్టుబడి అడవులకు వెళ్లాడు. ‘నువ్వు మాటిస్తే నేనెందుకు వెళ్లాలి నాన్నా’ అనంటే దశరథుడు చేయగలిందేముంది? అందుకే రాముడు దేవుడు. గాంధీ గారు దక్షిణాఫ్రికా వెళుతూ తన తల్లికి ‘మద్యం, మగువ, మాంసం జోలికి వెళ్లను’ అని మాట ఇచ్చారు. అక్కడకు వెళ్లాక మద్యం ఎలాగూ అలవాటు లేదు. మగువకు లోబడలేని నిష్ఠ ఉంది. కాని మాంసం జోలికి వెళ్లకుండా, అక్కడ అదే దొరుకుతుంది కనుక, ఎలా ప్రాణాలు నిలబెట్టుకోవాలో ఆయనకు అర్థం కాలేదు. అయినా సరే, మాట తప్పలేదు– ఆకలికి తాళలేక పచ్చి బియ్యం బొక్కాడు తప్ప. నిజం. అలా ఉండేవారు జనులు, తల్లికి మాట ఇస్తే, గురువు మాట ఇస్తే్త, తమకు తాము మాట ఇచ్చుకుంటే జీవితాంతం కట్టుబడేవారు. ఉత్తరాదిలో ‘ప్రాణ్ జాయ్ పర్ వచన్ నా జాయ్’ అంటారు. మాట పోతే ప్రాణం పోయినట్టే! మరి కల్తీ సరుకు రాకుండా ఉంటుందా? ‘కన్యాశుల్కం’లో కరటక శాస్త్రి తన శిష్యుణ్ణి ఆడవేషం కట్టమని చెప్పి, ఆ వేషంలో లుబ్ధావధాన్లను పెళ్లి చేసుకోమని ‘నువ్వు నెగ్గుకొస్తే మా పిల్లన్నీకిచ్చి ఇల్లరికం వుంచుకుంటాను’ అంటాడు. ‘మాట తప్పితే భూమి తోడ్రా’ అనంటాడు. దానికి శిష్యుడు ‘మీరు యగేస్తే భూవేం చేస్తుందిలెండి?’ అనంటాడు. మాట ఇవ్వడాన్ని పాతకాలపు చాదస్తంగా, మాట తప్పడాన్ని కొత్త జీవన మంత్రంగా పసిగట్టి గురజాడ ‘కన్యాశుల్కం’లో ఆనవాలు వదిలాడు. నిజమే. మనుషులు కాగితాన్ని తప్ప మాటను నమ్మని పరిస్థితి వచ్చింది. ఎక్కడి మాట అక్కడే మర్చిపోవాలి అనే గిరీశాలు మూలకొకడు, మలుపుకొకడు తయారయ్యారు. ‘ఆడిన మాటలు తప్పిన గాడిద కొడకంచు తిట్టగా విని అయ్యో వీడా నాకొక కొడుకని గాడిద ఏడ్చెన్ గదన్నా ఘన సంపన్న’ అనే పద్యం వీరి ఎదుట చదివితే ‘తిట్టుకో తిట్టుకో... అలాగే అలాగే’ అని కాఫీ తాగి లేచ్చక్కా పోతుంటారు. కాని ఎంత అధ్వాన్న రోజుల్లోనైనా వడగడితే జారిపోని విలువలు ఎన్నోకొన్ని మనుషులు మిగుల్చుకునే ఉంటారు. మాట తప్పని స్వభావాన్ని వారు నేటికీ గౌరవిస్తూనే ఉన్నారు. ఈ భూమి, ఈ వనరులు, ఈ సంపద, ఈ గాలి, నీరు... వీటన్నింటికీ తాము సమాన హక్కుదార్లమని తెలిసినా, పోరాడి పొందగలిగే శక్తి ఉన్నా, పాలకులుగా... ఏలికలుగా సింహాసనాల్లో కూర్చున్నవారు తమకు నాలుగు మెతుకులుగా విదిల్చితే పొందాలేమోనన్న స్థితికి వారు నెట్టబడినా, ఇలాంటి స్థితిలో కూడా వారు ఎవరి మాట సత్తుదో, ఎవరి మాటలో సత్తువున్నదో సూక్ష్మంగా గమనిస్తూనే ఉంటారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ తమ ఇంగితజ్ఞానం అనే గీటురాయిని బయటకు తీస్తూనే ఉంటారు. నమ్మిన మాటను గెలిపిస్తారు. ఒకవేళ అది నమ్మించిన మాట మాత్రమే అని గ్రహిస్తే సందర్భం కోసం కాచుకుని ఉంటారు. ‘తప్పుడు వెధవ’ అనే తిట్టు ఉంది. అంటే తప్పు చేసినవాడు మాత్రమే కాదు మాట తప్పినవాడు కూడా! ప్రజల నుంచి తీసుకుని తిరిగి ప్రజలకు అందించడం అనే ఒక సరళ సూత్రంలో పాలకుడు వాహిక మాత్రమే. ప్రజలకు మంచి చేస్తాను అనే మాట మాత్రమే అతనికి శిరోధార్యం కావాలి. జనం చెవిలో పువ్వు పెట్టే నాలుగు మాటలు చెప్పి తమ మెడలో విజయహారాలు ధరిద్దామనుకుంటే అది గేమ్‌లో భాగమే కావచ్చు. కాని అలాంటి గేమ్‌లో ఠక్కున ఔటవడమే గాక మాటగా కూడా గుర్తురాని స్థితికి దిగజారి పోతారు. మాటలు వెదజల్లకండి. ఇవ్వగలిగిన మాట మాత్రమే ఇవ్వండి. మాట జాగ్రత్త! -
కృత్రిమ గాలులు పనిచేస్తాయా?
ఇంకో నాలుగు రోజులు మాత్రమే! ఈనెల 30న తెలంగాణ రాష్ట్రం మూడో సర్కార్ ఎన్నికకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. మూడో అసెంబ్లీ ఎన్నిక ముక్కోణపు పోటీగా మారడం విశేషం. ఎన్నికలన్న తర్వాత సర్వేలు, ప్రజాభిప్రాయ నాడీ జ్యోతిష్యాలు, ‘గాలి’ వేగాన్ని అంచనా వేసి చెప్పడాలు... ఇటువంటి వన్నీ షరా మామూలే! ఒకదానికొకటి పొంతన లేకుండా రకరకాల సర్వే ఫలితాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. ఇలా పొంతన లేకపోడానికి కారణం... ఇందులో కొన్ని ‘ఉద్దేశపూర్వకమైనవి’ కావడమే! అన్ని రకాల సర్వే ఫలితాలను క్రోడీకరిస్తే, ఒక మూడు అంశాలు నిగ్గుతేలుతున్నాయి. ఒకటి – ఈసారి అధికార పార్టీ బీఆర్ఎస్ గట్టి పోటీని ఎదు ర్కొంటున్నది. కొన్ని జిల్లాల్లో పాత బలాన్ని కాపాడుకున్నట్లు కనిపిస్తున్నా కొన్ని జిల్లాల్లో బలహీన పడినట్టు స్పష్టమవుతున్నది. రెండు – కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే పుంజుకున్నది. అయితే ఈ పరిణామం కొన్ని ప్రాంతాలకే పరిమితం. రాష్ట్రవ్యాప్తంగా కనిపించడం లేదు. మూడు – బీసీ ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత బీజేపీ పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. ఇదే ప్రకటన ఒక రెండు మూడు నెలల ముందు చేసి ఉన్నట్లయితే ఆ పార్టీ పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాష్ట్రాన్ని భౌగోళికంగా విభజించి చెప్పవలసి వచ్చినప్పుడు ఉత్తర, దక్షిణ తెలంగాణలుగా చెప్పడం రివాజు. కానీ ఇప్పటి రాజకీయ పరిస్థితికి ఆ విభజన నప్పడం లేదు. రాష్ట్రానికి పడ మటి దిక్కున ఉన్న గ్రేటర్ హైదరాబాద్ (24), మెదక్ (10), నిజామాబాద్ (9) ప్రాంతాల్లోని అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికీ బీఆర్ఎస్ బలంగానే కనిపిస్తున్నది. మొత్తం సీట్లు 43. ఇందులో ఆనవాయితీగా మజ్లిస్ గెలిచే సీట్లు 7 తీస్తే మిగిలినవి 36. ఇందులో అత్యధిక సీట్లలో బీఆర్ఎస్ బలంగా ఉంటుందనీ, రెండో స్థానం కోసం బీజేపీ నుంచి కాంగ్రెస్ గట్టి పోటీ ఎదుర్కోవచ్చనీ క్షేత్రస్థాయి పరిశీలనలో తెలుస్తున్నది. ఖమ్మం జిల్లాను ఉత్తర తెలంగాణగానూ, నల్లగొండను దక్షిణ తెలంగాణను పరిగణిస్తుంటారు. సరిహద్దు జిల్లాలైన ఈ రెండింటినీ కలిపి తూర్పు తెలంగాణగా భావించవచ్చు. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో కలిపి 22 సీట్లున్నాయి. ఇక్కడ మెజారిటీ సీట్లలో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉన్నదని చెబుతున్నారు. బీజేపీ పరిస్థితి అట్లా కాదు. వాయవ్య దిక్కు ఎంట్రీ పాయింట్లో (ముధోల్, ఆదిలాబాద్, బో«ద్, నిర్మల్, ఆర్మూర్, కోరుట్ల) బలంగా కనిపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా పాకెట్ల మాదిరిగా విస్తరించింది. బీఆర్ఎస్ స్థావరంలో 36 సీట్లు ఉండటమే గాక రెండో స్థానం కోసం బీజేపీ నుంచి గట్టి పోటీని కూడా కాంగ్రెస్ ఎదుర్కోవలసి ఉన్నది. ఇందుకు విరుద్ధంగా కాంగ్రెస్ స్థావరంలోని 22 సీట్లలో బీఆర్ఎస్ కచ్చితంగా గెలవగలిగే సీట్లు ఆరు న్నాయి. మరో ఆరు సీట్లలో నువ్వా నేనా అనే పరిస్థితులున్నాయి. ఇది అధికార పార్టీకి సానుకూల అంశం. ఈ స్థావరాల నుంచి బయల్దేరి ఉమ్మడి జిల్లాలైన మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో సీట్ల కోసం మూడు పార్టీలు వేటాడవలసి ఉన్నది. ఆదిలాబాద్ జిల్లాపై మూడు పార్టీలకూ భారీగానే ఆశలున్నాయి. గాలివాటం ఎటువైపున్నా మూడు పార్టీలు కూడా కచ్చితంగా బోణీ కొట్టే అవకాశం ఉన్నది. బొగ్గు బెల్ట్‌లో కాంగ్రెస్ బలంగా ఉన్నదనీ, మిగిలిన ప్రాంతాల్లో బీఆర్ఎస్, బీజేపీలకు అవకాశాలున్నాయనీ స్థానిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిర్పూర్లో బీఎస్పీ అభ్యర్థి కూడా బలంగా కనిపిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు సీట్లు గెలుస్తామన్న నమ్మకంతో బీజేపీ నాయకులు పనిచేస్తున్నారు. పెద్దపల్లి బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉషకు కూడా రాష్ట్రవ్యాప్త గుర్తింపు లభించింది. రెండు ప్రధాన పార్టీల తరఫున రెడ్డి,వెలమ కులాలకు చెందిన ఇద్దరు బడా బాబులు హోరాహోరీ తలపడుతున్న చోట ఐఐటీ గ్రాడ్యుయేట్, పాతికేళ్ల పద్మశాలి యువతి గెలిస్తే బాగుండను కునే వాళ్లు రాష్ట్రవ్యాప్తంగా చాలామందే ఉన్నారు. ఇటువంటి కలలు ఫలించాలంటే మన ప్రజాస్వామ్యంలో చాలా పరిణతి రావాలి. ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే గదా ఏదో ఒకరోజు ఆ నవయుగం ఆవిష్కృత మయ్యేది. నిజానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంస్థాగతంగా బీఆర్ఎస్ చాలా బలంగా ఉన్నది. అయినా కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకున్నట్టు జరుగు తున్న ప్రచారం నేపథ్యంలో ఈ జిల్లాను హోరాహోరీ పోటీ కోటాలో వేయాల్సి వస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా రెండు మూడు సీట్లలో సంచలనం సృష్టిస్తామని బీజేపీ నాయకత్వం చెప్పుకొస్తున్నది. అందుకు అను గుణంగానే చాప కింద నీరు మాదిరిగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. జిల్లాలో ప్రత్యేక ఆకర్షణ పాలకుర్తి నియోజ కవర్గం. ఇక్కడి నుంచి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఓటమి ఎరగకుండా అనేక పోరాటాల్లో గెలిచిన వార్ వెటరన్ ఎర్రబెల్లి. కానీ ఈసారి ఒక పాతికేళ్ల యువతితో హోరాహోరీ పోటీని ఎదుర్కొంటు న్నట్టు వార్తలు వస్తున్నాయి. అమె రికాలో చదువుకొని వచ్చిన యశస్విని రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా మంత్రికి గట్టి పోటీని ఇస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడు రాజకీయ కురుక్షేత్రాన్ని తలపిస్తున్నది. పద్నాలుగు నియోజకవర్గాలున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో కొల్లాపూర్ నియోజకవర్గం ఉన్నది. రెడ్డి, వెలమ వర్గాలకు చెందిన ఇద్దరు దొరలు అక్కడ తలపడుతున్నందుకు కాదు. ఒక నిరుపేద దళిత యువతి... పేరు కర్నె శిరీషా అలియాస్ బర్రెలక్క. అక్కడ బరిగీసి నిలబడింది. ఏ పార్టీ అండ లేదు. ఇండిపెండెంట్‌గానే! పుట్టెడు పేదరికం కారణంగా చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న తల్లికి అండగా ఉంటూ ఓపెన్ యూని వర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేసింది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించ లేదు. నాలుగు బర్రెలు కొనుక్కొని పోషిస్తూ సోషల్ మీడియా ద్వారా బర్రెలక్క పేరుతో ప్రజా జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది. నిరుద్యోగ యువత తరఫున తాను నిరసనను వ్యక్తం చేయడానికి ఎన్నికలను ఒక సాధనంగా మలుచుకోవాలని నామినేషన్ వేసింది. ఈమె పోస్ట్ చేసిన వీడియోలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రం నలు మూలల నుంచి యువతీ యువకులు తండోపతండాలుగా కొల్లాపూర్‌కు వెళ్లి బర్రెలక్కకు మద్దతును ప్రకటిస్తున్నారు. దీనర్థం అక్కడ బర్రెలక్క గెలుస్తుందని కాదు. అంత ఆశలేదు. ఒకవేళ కొల్లాపూర్ ప్రజల్లో హఠాత్తుగా ఏదో ఒక నవ చైతన్యం ప్రవేశించి బర్రెలక్క గెలిస్తే అదొక యుద్ధ ప్రకటనే! నోట్ల కట్టల ప్రజాస్వామ్యానికి రోజులు దగ్గర పడినట్టే! ఉమ్మడి పాలమూరులో బీజేపీ మూడు సీట్లపై ఆశలు పెట్టుకున్నది. కర్ణాటక సరిహద్దుల్లోని ఒక నియోజకవర్గాన్ని, గతంలో రెండుసార్లు గట్టి పోటీ ఇచ్చిన మరో నియోజక వర్గాన్ని ఖాయంగా గెలుస్తామని ఆ పార్టీవారు చెబుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఈ జిల్లాలో మెజారిటీ సీట్లు గెలుస్తామని ఢంకా బజా యించి చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక పవనం బాగా బలంగా ఉంటే తప్ప బీఆర్ఎస్ ఆధిక్యాన్ని తగ్గించడం ఈ జిల్లాలో సాధ్యం కాకపోవచ్చు. బీఆర్ఎస్ను ఓడించి అధికారంలోకి ఖాయంగా వస్తామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అందుకు దోహదపడే కారణ మేమిటో స్పష్టంగా చెప్పలేకపోయింది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కారణమా? లేక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను చూసి జనం మురిసిపోతున్నారనుకోవడమా? ప్రభుత్వ వ్యతిరేకతే కారణమైతే కాంగ్రెస్‌కే జనం ఎందుకు ఓట్లేయాలి? బీజేపీ రూపంలో మరో ప్రత్యామ్నాయం కూడా ఉన్నది కదా! పైగా బీసీ ముఖ్యమంత్రిని ఇస్తామని బీజేపీ చేసిన వాగ్దానం మెజారిటీ రాష్ట్ర ప్రజలను ఆకర్షి స్తున్నప్పుడు కాంగ్రెస్‌నే ప్రత్యామ్నాయంగా ఎందుకుఎంచుకోవాలి? కాంగ్రెస్ మేనిఫెస్టో పట్ల సానుకూలత పెల్లుబకడానికి అందులో ఏమున్నది? కేసీఆర్ అమలు చేస్తున్న కార్యక్రమాలనే కొంచెం అటూ ఇటూ మార్చి అచ్చేశారు. ఆయన ఇస్తున్న డబ్బుల కంటే ఎక్కువ ముట్ట చెబుతామని చెప్పారు. కాలాను గుణంగా ఎవరైనా ఈ పెంపుదల చేయాల్సిందే. అంతకుమించిన మౌలికమైన మార్పుల ప్రతిపాదన ఈ మేనిఫెస్టోలో ఏమీ లేదు. అంతకంటే బీజేపీ చెప్పిన బీసీ ముఖ్యమంత్రే వ్యవస్థలో ఒక గుణాత్మకమైన మార్పును సూచించే హామీ అవుతుంది. కనుక కాంగ్రెస్ చేసిన వాగ్దానాలకు అనుగుణంగా ప్రజాస్పందన ఉన్నదనేది అవాస్తవం. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని అనుకుంటే ప్రతిపక్షానికి జరిగే లబ్ధిలో బీజేపీ కూడా కచ్చితంగా భాగస్వామి అవుతుంది. ఆ పార్టీ చెబుతున్నట్టు రాబోయే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఒక ప్రభంజనంలా లేకుండా సాధారణ స్థాయిలోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశాలే ఉంటాయి. పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ఎంతోకొంత వ్యతిరేకత వ్యక్తమవడం సర్వసాధారణం. కానీ తెలంగాణలో ఇప్పుడు ప్రచార మవుతున్నంత తీవ్రస్థాయిలో ఉన్నదా అనేది సందేహాస్పదం. అంత తీవ్ర వ్యతిరేకతకు తగిన ప్రాతిపదిక లేదు. ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు హైదరాబాద్‌లో వ్యాపార ప్రయోజనాలున్న కొందరు కోటీశ్వరులు గత కొంతకాలంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పించే ఉపాయాలను అన్వేషిస్తున్నారు. సలహాలు – సంప్రతింపుల కోసం యెల్లో మీడియా పెద్దలను కూడా తరచూ కలుస్తున్నట్టు ఇప్పుడిప్పుడే వార్తలు బయట కొస్తున్నాయి. ఈ వ్యవహారానికి అందుబాటులో ఉండి మార్గదర్శనం చేయడం కోసమే చంద్రబాబు లేని జబ్బులు తెచ్చుకొని మెడికల్ బెయిల్ సంపాదించారన్నది నిర్ద్వంద్వంగా రూఢి అవుతున్నది. ఆయన రహస్య భేటీలు నిరాఘాటంగా జరిగిపోతున్నాయి. ఈ మొత్తం స్కీములో భాగంగానే తెలంగాణ రాజకీయ వాతావరణంలోకి కృత్రిమ పవనాలను ప్రవేశ పెట్టినట్టు తెలుస్తున్నది. కొన్ని సర్వే సంస్థలను వశపరచు కొని అనుకూలమైన రిపోర్టులను ప్రచారంలో పెట్టారు. సరికొత్త ఎత్తుగడగా రూమర్ స్ప్రెడర్లను (వదంతుల వ్యాపకులను) రంగంలోకి దించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర ఈ రూమర్ స్ప్రెడర్స్ తమ వృత్తి నైపుణ్యాలను ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీ వేవ్ రాబోతున్నదని, ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నదని సోషల్ మీడియా ప్రచారానికి ఆజ్యం పోశారు. దసరా సెలవులను కూడా ఈ ప్రయోజనానికి వాడు కున్నారు. ఈ ప్రభుత్వం కొనసాగితే పిల్లలకు ఉద్యోగాలు రావనే ప్రచారం విస్తృతంగా చేశారు. క్షేత్రస్థాయిలో జరుగు తున్న ఈ వ్యతిరేక ప్రచారాలను అధికార వర్గాలు గానీ, అధికార పార్టీ కార్యకర్తలు గానీ పసిగట్టలేకపోయారు. ఒక స్వార్థ వ్యాపార – రాజకీయ ముఠా రూమర్ స్ప్రెడర్స్నూ, సోషల్ మీడియా సైన్యాన్నీ రంగంలోకి దించి బీజేపీ సింగిల్ డిజిట్ దాటదనీ, ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నదనీ గత రెండు మాసాలుగా పెద్దఎత్తున ప్రచారంలో పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్‌కు అనుకూలంగా గాలి వీస్తున్నదనే ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ కృత్రిమ ‘గాలుల’ ప్రభావం ప్రజల మీద ఏ మేరకు పడిందనే విషయం మరో వారం రోజుల్లో వెలువడే ఎన్నికల ఫలితాలతో తేలిపోతుంది. ఎన్నికల ఫలితాలను హైజాక్ చేయడానికి ఈ ముఠా ఇంత తీవ్రంగా ఎందుకు ప్రయత్నిస్తున్నదో, ఇన్ని వ్యయ ప్రయాసలకు ఎందుకోర్చుకుంటున్నదో ప్రజలు తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పేదల సాధికారతపై ఉచిత పత్రిక ఉక్రోషం!
సూర్యుడు తూర్పు దిక్కుననే ఉదయించును. ఇది ఒక నిత్య సత్యం. పేద ప్రజల సాధికారతను పెత్తందార్లు అంగీకరించరు. ఇది కూడా అటువంటిదే. అనుదిన సత్యమే. నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక... ఈ సుభాషితాన్ని ‘ఈనాడు’ పత్రికవాళ్లు అప్పుడెప్పుడో బ్రాండ్ క్యాంపెయిన్‌కు వాడుకున్నట్టు గుర్తు. ఇప్పుడు పైన చెప్పిన రెండో సత్యాన్ని నిలబెట్టడం కోసం ఆ పత్రిక యాజమాన్యం ‘త్యాగాలకు’ కూడా సిద్ధమైంది. ఇంటింటికీ ఉచితంగా పత్రికను పంపిణీ చేసే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌లో ‘ఈనాడు’ శ్రీకారం చుట్టింది. ‘సత్యం నినదించు గాక’ అనే క్యాంపెయిన్‌ను ‘ఈనాడు’ చాలాకాలం కిందటే నిలిపివేసింది. చంద్రబాబు–యెల్లో కూటమి అండ్ సన్స్ ప్రయోజనాలకు అనుగుణంగా నిత్యం అసత్యాలను అచ్చొత్తడమే పనిగా పెట్టుకొన్నందున ఆ క్యాంపెయిన్‌ను కొనసాగించడానికి వాళ్లకే సిగ్గేసింది కాబోలు. ఏదో సినిమాలో మెడలో రుద్రాక్ష మాల ఉన్నంత వరకూ అల్లు అర్జున్ నాన్వయలంట్గా ఉండిపోతాడు. ఫైటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ మాలను తీసి పక్కన పెడతాడు. ఈ తీసుకోవడం, వేసుకోవడం గొడవంతా ఎందుకని ‘ఈనాడు’ వాళ్లు సత్యం నినదించుగాక అనే క్యాంపెయిన్‌ను శాశ్వతంగా నిద్రపుచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం సమీపిస్తున్నకొద్దీ అసత్య కథనాల వంటకాన్ని ‘ఈనాడు’ భారీగా పెంచేసింది. పేజీకో పొయ్యి చొప్పున వెలిగించి నిత్యాగ్నిహోత్రాన్ని నిర్వహిస్తున్నది. అసత్య కథనాలతో అధికార పక్షం మీద బురద జల్లడానికే అది పరిమితం కాలేదు.మానవ నాగరికత వికాసానికి మోకాలొడ్డే సాహసం చేస్తున్నది. ప్రజాస్వామ్య పరిణతి ప్రస్థానాన్ని వెక్కిరించే విదూషక పాత్రను పోషిస్తున్నది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపాలనే తింగరి చేష్టకు తెగబడుతున్నది. కష్టజీవులు తలపెట్టిన సాధికారత యజ్ఞంపై మారీచ మాయలు ప్రయోగిస్తున్నది. మహిళలూ – పేదవర్గాల సాధికారత అనేది ఈ దేశ రాజ్యాంగం ఇచ్చిన హామీ. ఈ హామీని అమలుపరచడంలో విఫలమైన ప్రభుత్వా ధినేతలందరూ ఈ విషయంలో దోషులే. ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ సమాన హక్కులూ, సమాన అవకాశాలూ కల్పించడం ద్వారానే క్రమంగా సాధికారత సాధ్యమవుతుంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ క్రమం నెమ్మదించింది. ఇన్నాళ్లకు ఇప్పుడొక రాష్ట్ర ప్రభుత్వం దాని వేగాన్ని పెంచే పని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత రాజ్యాంగం ఆశయాల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలకు, అన్నివర్గాల మహిళలకు ఒక్కొక్కటిగా ఆర్థిక రాజకీయ సాంఘిక హోదాలను కట్టబెడుతూ వెళుతున్నారు. ఈ అవకాశాలను ఉపయోగించుకొని సాధికారత పథంలో పరుగు తీయాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో సామాజిక సాధికార యాత్ర పేరుతో ఒక జన జాగృత కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు భుజాన వేసుకున్న మాట నిజమే. ఆ పార్టీ ప్రభుత్వమే, ఆ పార్టీ అధినేతే స్వయంగా పేదవర్గాల సాధికారతను ఒక పవిత్ర లక్ష్యంగా పరిగణిస్తున్నప్పుడు అదే పార్టీ ఈ కార్యక్రమానికి ముందు నడవడం అసహజమేమీ కాదు. వెనుకబడిన వర్గాలను వెన్నెముక వర్గంగా మలిచే కార్యక్రమం వల్ల పాలక పార్టీ పలుకుబడి మరింత పెరుగుతుందనడం కూడా వాస్తవమే. ఈ ఒక్క కారణం చాలదా యెల్లో మీడియా కళ్లు మంటెక్కడానికి! దానికి తోడు శ్రామిక వర్గాల సాధికారతను సిద్ధాంతపరంగానే చంద్రబాబు కూటమి వ్యతిరే కిస్తున్నది. కబుర్లు ఏవైనా చెప్పవచ్చు. ఆచరణ ఏమిటన్నదే కీలకం.వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన సాధికారతకు బాటలు వేసే ప్రతి కార్యక్రమాన్ని చంద్రబాబు పార్టీ – యెల్లో మీడియా తీవ్రంగా వ్యతిరేకించాయి. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం విద్యాబోధనను వ్యతిరేకించాయి. ఇప్పటికీ అభాసుపాలు చేయ డానికి, విఫలం చేయడానికి ప్రయ త్నిస్తున్నాయి. మహిళల పేరు మీద సొంత ఇల్లు కట్టించే కార్య క్రమాన్ని వ్యతిరేకించాయి. కోర్టు మెట్లెక్కాయి. అమరావతి శాసన రాజధాని పరిధిలో బలహీనవర్గాల ప్రజలకు ఇళ్ల పట్టా లిస్తే ఘోరమైన, క్రూరమైన అప చారం జరిగినట్టు గావుకేకలు పెట్టాయి. బాబు గార్లు ఉండాల్సిన చోట బడుగులు నివసించడమేమిటని వాదించాయి. కుల భ్రష్టమైపోతారట, మైలపడిపోతారట! ఇదే విషయాన్ని పాలిష్ చేసి చెప్పారు. జనాభా సమ తుల్యత దెబ్బతింటుందని! కోర్టులో కూడా ఇదే వాదన చేశాయి. పేదింటి ఆడబిడ్డల చదువు మధ్యలో ఆగిపోకుండా, బాల్య వివా హాల రుగ్మతను రూపుమాపే విధంగా పెళ్లి కానుకల కార్యక్రమాన్ని డిజైన్ చేస్తే కూడా ఈ కూటమి మండిపడింది. కారణం ఆడపిల్లల మీద అభిమానం కాదు. వారి అభివృద్ధి మీద ద్వేషం. అమ్మ ఒడి, చేయూత, ఆసరా వంటి కార్యక్రమాలను ఎద్దేవా చేశారు. ఇలాగైతే ఈ రాష్ట్రం దివాళా తీస్తుందని శాపనార్థాలు పెట్టారు. ఖర్చు చేయడానికి ప్రజల చేతిలో డబ్బులుంచాలని అభిజిత్ బెనర్జీ వంటి ఆర్థిక వేత్తలు చెప్పినా మన యెల్లో కూటమికి తలకెక్కలేదు. జనం సొమ్ముతో సొంత వ్యాపారాలు చేసుకునే మన ‘చీ’ట్ ఫండ్ ముఠాకు అభిజిత్ ముఖర్జీలు, అమర్త్యసేన్లతో ఏం పని? చివరకు ఆర్థిక వేత్తలు చెప్పిందే నిజమైంది. జీఎస్డీపీ గ్రోత్ రేట్లో ఏపీ అగ్రగామిగా నిలబడింది. ఆర్థిక వ్యవస్థ పటిష్ఠమవడంతో పాటు లక్షలాది పేద కుటుంబాల ఆత్మగౌరవం పెరిగింది. ఆత్మ విశ్వాసం ఇనుమడించింది. పేద వర్గాల ప్రజలు సాధికారతను సంతరించుకోవడానికి ఉపయోగపడే ప్రతి కార్యక్రమం మీదా చంద్రబాబు – యెల్లో ముఠా దాడులు చేస్తూనే వస్తున్నది. సాధికారత కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా మలిచి ప్రజలను చైతన్యం చేయడానికి సిద్ధమవగానే ‘ఈనాడు’ పత్రిక అన్ని విలువల్నీ వదిలేసింది. దిగంబరంగా నిలబడింది. చివరకు ఉచిత పత్రిక అవతారమెత్తింది. ‘సాక్షి’ చదివే పాఠకులందరికీ ఫ్రీగా పత్రికను పంచడం మొదలుపెట్టింది. ఇదితొలి దశ. క్రమంగా పాఠకులందరికీ పంచడానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే ‘ఈనాడు’ పాఠకులుగా వున్నవారు వచ్చేనెల బిల్లు కట్టే పరిస్థితి లేదు. పక్కింట్లో ఫ్రీగా వేస్తున్నప్పుడు తాను మాత్రం ఎందుకు బిల్లు కట్టాలి. చివరికి ఫ్రీగా పేపర్ వేయించుకోవడానికి కూడా నెలకు రెండు ప్రియా పచ్చడి సీసాలు గిఫ్టుగా ఇవ్వాల్సిన దుఃస్థితిలోకి మన ఉచిత పత్రిక కూరుకొనిపోవచ్చు. స్వర్ణోత్సవ సంవత్సరంలోకి అడుగిడిన వేళ ఈ విషాదం దాని స్వయంకృతం. సామాజిక సాధికారత యాత్ర మొదలవగానే ఫ్రీ పేపర్ కార్యక్రమాన్ని ఈ పత్రిక ప్రారంభించింది. ఈ కార్యక్రమం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందనేది ఒక కారణం కావచ్చు. అసలు కారణం పేదల, మహిళల సాధికారతకు యెల్లో కూటమి వ్యతి రేకమన్న విషయం గతంలో అనేక మార్లు రుజువైంది. బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసిన వారెవరు? చంద్రబాబు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఈసడించుకున్న వారెవరు? చంద్రబాబు. దళితులు... మీకెందుకురా అధికారాలు, రాజకీయాలు... అవన్నీ మేం చూసుకుంటామని బోధించిన వారెవరు? బాబు శిష్యపరమాణువు చింతమనేని ప్రభాకర్. కోడలు మగపిల్లాడిని కంటా నంటే అత్త వద్దంటుందా అని మీడియా సమావేశంలోనే ప్రవ చించిన వారెవరు? చంద్ర బాబు. మహిళా అధికారి పట్ల వందలాదిమంది సాక్షిగా దుశ్శాసనుడిలా ప్రవర్తించింది ఎవరు? చంద్రబాబు శిష్య పరమాణువు చింతమనేని ప్రభాకర్. బీసీల తోకలు కత్తిరి స్తానని బెదిరించిందెవరు?చంద్రబాబునాయుడు. ఎస్సీ పిల్లలు శుభ్రంగా ఉండరు, స్నానాలు చెయ్యరని తిట్టి పోసిందెవరు? చంద్రబాబు కొనుగోలు చేసిన ఆదినారా యణరెడ్డి. ముస్లిం మైనారిటీ లకూ, గిరిజనులకూ మంత్రి పదవి లేకుండా చేసిందెవరు? చంద్రబాబు నాయుడు. రాజ్యాంగబద్ధమైన గిరిజన సలహా మండలి ఏర్పాటును అటకెక్కించిందెవరు? చంద్రబాబు నాయుడు. ఈ రకమైన దుర్నీతిని ప్రశ్నించకుండా, ప్రస్తావించకుండా, ఎండ గట్ట కుండా ఆమోదముద్ర వేసిన ప్రముఖ పత్రికారాజము ఏది? మన ఉచిత పత్రిక, దాని తోకపత్రిక. ఇటువంటి ముఠా ప్రజా సాధికారతను ఏ రకంగా సహిస్తుంది? రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో రోజూ వేలాదిమంది బహు జనులు సాధికారత కోసం నినదిస్తూ ప్రదర్శనలు చేస్తున్నారు. సభల్లో సగటున ఇరవై నుంచి పాతికవేల మంది చొప్పున మూడు ప్రాంతాల్లో ప్రజలు పాల్గొంటున్నారు. ఉష్ట్ర పక్షికి భయం వేసినప్పుడు దాని తలను ఇసుకలో దాచేస్తుందట! అప్పుడేమీ కనపడదు. భయం తగ్గిన తర్వాత మళ్లీ బయటకు తీస్తుంది. ఉచిత పత్రికకు కూడా అటువంటి భయమేదో ఉన్నట్టుంది. బాటలు నడిచీ, పేటలు కడచీ, కోటల న్నిటినీ దాటుకుంటూ వచ్చే శ్రామిక జనాన్ని చూస్తే భయం. అందుకే సభ ప్రారంభం కాకముందూ, ముగిసిన తర్వాత ఫోటోలు తీసి అచ్చేసుకొని సంబర పడుతున్నది. ఉష్ట్రపక్షి మాదిరిగా ఉచిత పత్రిక దాని తలను ఎక్కడో దాచుకుంటే నిజం దాగుతుందా? ఎన్నో టీవీ చానెళ్లు, పత్రికలు అసలు విషయాన్ని చూపెడుతున్నాయి కదా! అయినా సరే – నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కనీసం ఇప్పటికైనా...
దేన్నయినా పదే పదే చెప్పవలసిరావటం ఎవరికైనా ఇబ్బందే. అందునా రాజ్యాంగ పదవుల్లో వున్నవారికి పదే పదే రాజ్యాంగ నిబంధనలు గుర్తుచేయటం మరింత ఇబ్బందికరమైన వ్యవహారం. కానీ మన సర్వోన్నత న్యాయస్థానానికి ఇది తప్పడం లేదు. తమ శాసనసభ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయకపోవటాన్ని సవాలు చేస్తూ పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పునిస్తూ గవర్నర్ల అధికారాలకుండే పరిధులు, పరిమితుల గురించి సుప్రీంకోర్టు మరోసారి చెప్పక తప్పలేదు. తన ఆమోదముద్ర కోసం వచ్చిన బిల్లుపై ‘సాధ్యమైనంత త్వరగా’ గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని, పునఃపరిశీలన అవసరమని భావిస్తే ఆ సంగతి తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. ఈనెల 10న వెలువడిన ఆ తీర్పు పూర్తి పాఠం గురువారం సుప్రీంకోర్టు వెబ్సైట్లో వెలువడింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును నిలిపి వుంచేందుకు, వెనక్కి పంపేందుకు రాజ్యాంగంలోని 200వ అధికరణ గవర్నర్‌కు అధికారమిస్తోంది. బిల్లు సక్రమంగా లేదని, స్పష్టత కొరవడిందని లేదా రాజ్యాంగ నిబంధనలను అతిక్రమిస్తోందని గవర్నర్ భావించినప్పుడు దాన్ని తిప్పిపంపొచ్చు. అయితే ఆ సందర్భంగా గవర్నర్ ఏం చేయాల్సివుంటుందో కూడా అదే అధికరణ వివరిస్తోంది. గవర్నర్ ఇచ్చిన సలహాను అంగీకరించి బిల్లుకు సవరణలు చేయటమా లేక యధాతథంగా దాన్నే మరోసారి ఆమోదించి పంపటమా అనేది శాసనసభ ఇష్టమని కూడా అదే అధికరణ తేటతెల్లం చేస్తోంది. రెండోసారి వచ్చిన బిల్లును గవర్నర్ ఆమోదించి తీరాలని ఆ అధికరణ వివరిస్తోంది. నిబంధనలు ఇంత స్పష్టంగా వున్నప్పుడు రోజుల తరబడి, నెలల తరబడి నిర్ణయం చెప్పకుండా బిల్లుల్ని పెండింగ్‌లో వుంచటం అసమంజసం, రాజ్యాంగ విరుద్ధం. కానీ మన దేశంలో పదే పదే ఇలాగే జరుగుతోంది. ఇతరేతర వ్యవస్థలు కాలానుగుణంగా ఎంతోకొంత మార్పులు చెందుతూ వచ్చాయి. గవర్నర్ల వ్యవస్థ మాత్రం అన్నింటికీ అతీతంగా వుండిపోయింది. అంతక్రితం సర్కారియా కమిషనైనా, ఆ తర్వాత వీరప్ప మొయిలీ నేతృత్వంలోని పాలనా సంస్కరణల కమిషనైనా రాజకీయ నేతలకు ఆ పదవులు ఇవ్వొద్దని సూచించాయి. గవర్నర్ పదవిని రాజకీయ పునరావాసంగా మార్చొద్దని 1994లో ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు కూడా హితవు చెప్పింది. రాజకీయాలకు అతీతంగా వుండే వ్యక్తులు లేదా ఏదో ఒక రంగంలో నిష్ణాతులైనవారు ఆ పదవిలో వుంటే మంచిదని సర్కారియా కమిషన్ సూచించింది. కానీ కేంద్రంలోని ఏ ప్రభుత్వమూ ఆ సూచన శిరోధార్యమని భావించలేదు. ఇటీవల గవర్నర్లకూ, రాష్ట్ర ప్రభుత్వాలకూ మధ్య తరచు వివాదాలు తలెత్తు తున్నాయి. పంజాబ్‌తోపాటు తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ప్రభుత్వా లకూ, గవర్నర్లకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పంజాబ్‌లో మరీ విపరీతం. అక్కడ ఏకంగా 12 బిల్లుల విషయంలో గవర్నర్ ఎటూ తేల్చకుండా ఆపేశారు. గవర్నర్లు ఇలా వ్యవహరించటం వల్ల ప్రజల దృష్టిలో ప్రభుత్వాలు చులకనవుతాయి. సమస్య అపరిష్కృతంగా వుండిపోవటా నికి కారణం తెలియక అధికార పక్షంపై సామాన్యులు విరుచుకుపడతారు. బహుశా అలా జరగాలని గవర్నర్లు కోరుకుంటున్నారేమో తెలియదు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలపట్ల ఇలా చిన్నచూపుతో వ్యవహరించటం తమ పదవిని తామే చిన్నబుచ్చుకోవటమని గవర్నర్లు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. సమస్యేమంటే తమ ఏలుబడిలోని ప్రభుత్వాలకు గవర్నర్లు ఇబ్బందిగా మారినప్పుడు కొత్తగా మొదటిసారి ఇలా జరుగుతున్నట్టు మాట్లాడే పార్టీలు, గతంలో తాము అధికారంలో వుండగా వ్యవహరించిన తీరును పూర్తిగా మరిచిపోతాయి. దేశంలో ఏ మూలైనా గవర్నర్‌కూ, ఒక ప్రభు త్వానికీ మధ్య వివాదం తలెత్తినప్పుడల్లా కేంద్రంలోని జనతాపార్టీ ప్రభుత్వం గుర్తుకు రాకమానదు. 1977లో జనతాపార్టీ అధికారంలోకి రాగానే ఒకే వేటుతో పది రాష్ట్ర ప్రభుత్వాలను రాజ్యాంగంలోని 356వ అధికరణ కింద బర్తరఫ్ చేసింది. 1980లో కేంద్రంలో మళ్లీ అధికారం వచ్చాక కాంగ్రెస్ ఇదే పని చేసింది. ప్రజల ఆమోదంతో అధికారంలోకొచ్చిన ప్రభుత్వాలను ఇలా ఇష్టానుసారంగా, కక్ష పూరితంగా రద్దు చేయటం దారుణమని ఆ రెండు పార్టీల ప్రభుత్వాలూ అనుకోలేదు. ఆ తర్వాత కాలంలో కూడా ఇదే ధోరణి కొనసాగాక బొమ్మై కేసులో సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పునిచ్చింది. అలాంటి చర్యకు పార్లమెంటు ఉభయసభల ఆమోదం వుండితీరాలన్న నిబంధన విధించింది. అటు తర్వాత ఈ నిరంకుశ విధానానికి ఏదోమేరకు బ్రేకు పడిందనే చెప్పాలి. ఇప్పుడు పంజాబ్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల కేరళ, తమిళనాడు ప్రభుత్వాలకు కూడా ఊరట వచ్చినట్టే. ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తమ బిల్లులు పెండింగ్‌లో వుంచటాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఫెడరల్ వ్యవస్థలో గవర్నర్ల పాత్రేమిటన్న అంశంలో మన రాజ్యాంగ నిర్మాతలకు తగిన అవగాహన లేకపోవచ్చు. కానీ ‘సాధ్యమైనంత త్వరగా’ బిల్లులపై నిర్ణయం తీసుకోవాలనటం ద్వారా గవర్నర్ల బాధ్యతేమిటో స్పష్టంగా చెప్పినట్టయింది. చట్టాల రూపకల్పనలో శాసనసభల పాత్ర వమ్ము అయ్యేలా అధికారాలను వినియోగించటం సరికాదని తాజా తీర్పులో సుప్రీంకోర్టు చెప్పటం హర్షించదగింది. మరోసారి ఇలా చెప్పించుకోవాల్సిన అవసరం రాకుంటే తమకే గౌరవప్రదమని గవర్నర్లు గుర్తించటం మంచిది. -
కార్పొరేట్ సునామీ!
బోర్డు రూం కుట్రలు, కార్పొరేట్ దిగ్గజ సంస్థలు చేతులు మారడం వగైరాలు ప్రపంచానికి కొత్త కాదు. కానీ చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐలో పుట్టుకొచ్చిన సునామీ అందరినీ దిగ్భ్రాంతి పరిచింది. చిత్రమేమంటే... ఏం జరిగిందో అందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగానే అనేక మలుపులు తిరిగి అది కాస్తా చప్పున చల్లారింది. ఈ మొత్తం వ్యవహారమంతా కేవలం అయిదంటే అయిదే రోజుల్లో పూర్తయింది. డైరెక్టర్ల బోర్డు బయటకు నెట్టేసిన వ్యక్తే దర్జాగా వెనక్కి రావటం, బోర్డు సభ్యులతో సహా కంపెనీలో ఎవరినైనా తొలగించే అధికారం చేజిక్కించుకోవటం, ఆయన్ను బయటికి పంపినవారే చివరకు పదవులు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడటం ఈ వివా దానికి కొసమెరుపు. కేవలం నలుగురు డైరెక్టర్లకు వ్యతిరేకంగా 95 శాతంమంది సిబ్బంది తిరగ బడటం, తామంతా రాజీనామా చేస్తామమని హెచ్చరించటం, వారితో ఇన్వెస్టర్లు సైతం చేతులు కలపటం కనీవినీ ఎరుగనిది. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో అద్భుతాలు సృష్టించగల ఉపకరణాలను సృష్టించటమే ధ్యేయంగా శామ్యూల్ ఆల్ట్మాన్ 2015లో స్టార్టప్ కంపెనీ ఓపెన్ ఏఐ స్థాపించాడు. మరో నాలుగేళ్లకు మైక్రోసాఫ్ట్, ట్విటర్ సహా కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులూ అందులో పాలుపంచుకున్నారు. దాని పరిశోధనలు స్వల్ప కాలంలోనే అద్భుత ఆవిష్కరణలకు దారితీసి ఓపెన్ ఏఐ సిలికాన్ వ్యాలీలో 8,000 కోట్ల డాలర్ల దిగ్గజ సంస్థగా ఆవిర్భవించింది. అది ఏడాదిక్రితం తీసుకొచ్చిన చాట్‌జీపీటీ స్మార్ట్ ఫోన్ తర్వాత అంతటి గొప్ప ఆవిష్కరణగా గుర్తింపుపొందింది. అంతేకాదు, అది మున్ముందు మానవాళి మనుగడకు సైతం ముప్పుగా పరిణమించవచ్చన్న భయాందోళనలూ బయల్దేరాయి. దాన్ని అదుపు చేసేందుకు ఎలాంటి చట్టాలు అవసరమో ప్రపంచ దేశాధి నేతలంతా చర్చించుకుంటున్నారు. అమెరికా, బ్రిటన్, యూరొపియన్ యూనియన్లు ఇప్పటికే చట్టాలు చేశాయి. మన దేశం కూడా ఆ పనిలోనే వుంది. కృత్రిమ మేధతో దేశదేశాల పౌరుల గోప్య తకూ, ముఖ్యంగా మహిళల, పిల్లల భద్రతకూ రాగల ముప్పు గురించిన భయసందేహాలు అంతటా ఆవరించాయి. రక్షణ రంగ వ్యవస్థల్లోకి, మరీ ముఖ్యంగా సైనిక స్థావరాల్లోకి ఇది ప్రవేశిస్తే రెప్ప పాటులో భూగోళం బూడిదగా మారుతుందన్న హెచ్చరికలు వస్తూనే వున్నాయి. సురక్షితమైన కృత్రిమ మేధ మాత్రమే ప్రపంచానికి అవసరమంటూ అల్ట్రూయిజం వంటి టెక్ ఉద్యమాలూ బయల్దేరాయి. ఈ నేపథ్యంలో అసలు ఓపెన్ ఏఐలో ఏం జరిగిందన్న ఆసక్తి, ఆత్రుత వుండటం సర్వసాధారణం. విషాదమేమంటే సంస్థ ఎగ్జిక్యూటివ్‌గా వున్న శామ్ ఆల్ట్మాన్కూ, డైరెక్టర్ల బోర్డుకూ మధ్య ఏర్పడ్డ లడాయి ఏమిటన్నది వెల్లడికాలేదు. ఆల్ట్మాన్ దేన్నీ సూటిగా, స్పష్టంగా చెప్పటం లేదని ఇప్పుడు నిష్క్రమించిన డైరెక్టర్లు ఆరోపించారు. ఆయన దేన్ని దాచటానికి ప్రయత్నించాడో, ఏ విషయంలో వారికి స్పష్టత రావటంలేదో వివరించలేదు. సరిగ్గా ఇదే కీలకమైనది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్న భయాందోళనలకూ, ఈ వివాదానికీ సంబంధం వుండే అవకాశం లేకపోలేదని కొందరి విశ్లేషణ. కృత్రిమ మేధతో పరిశోధనలు సాగిస్తున్నది ఓపెన్ ఏఐ మాత్రమే కాదు... దాంతోపాటు అమెరికాలోనే ఆంత్రోపిక్, స్కేల్ ఏఐ, విజ్.ఏఐ, డీప్ 6 వంటి 50 సంస్థ లున్నాయి. ఇవిగాక మన దేశంతోపాటు అనేక దేశాల్లో పలు సంస్థలు కృత్రిమ మేధపై పని చేస్తున్నాయి. ఎలాంటి నిబంధనలూ, నియంత్రణలూ లేని వర్తమాన పరిస్థితుల్లో ఆర్నెల్లపాటు కృత్రిమ మేధ పరిశోధనలపై మారటోరియం విధించాలని టెక్ నిపుణులు కొందరు ఆమధ్య సూచించారు. కృత్రిమ మేధలో పరిశోధనలు చేస్తున్న ఎలిజార్ యుడ్కోవ్స్కీ ఈ టెక్నాలజీ తెలివి తేటల్లో మనుషుల్ని మించిపోతుందని, చివరకు వారినే మింగేస్తుందని, చివరకు మనమంతా నియాండర్తల్ యుగానికి తిరోగమించటం ఖాయమని జోస్యం చెప్పాడు. అయితే కృత్రిమ మేధతో రాగల ప్రమాదాల గురించి కొందరు అతిగా మాట్లాడుతున్నారన్న విమర్శలూ వున్నాయి. మానవాళికి ముప్పు తెచ్చే అగ్ని పర్వతాలు, గ్రహశకలాలు, అణ్వాయుధా లకన్నా అదేమీ పెద్ద ప్రమాదకారి కాదని వారి వాదన. భయాందోళనల మాటెలావున్నా దాని శక్తి సామర్థ్యాలు, ఉపయోగాలు కాదనలేనివి. రెండువేల ఏళ్లనాడు వర్ధిల్లిన పురాతన లిపుల్లో ఏం నిక్షిప్తమైవున్నదో వెలికితీసింది కృత్రిమ మేధ ఆధారంగా అందుబాటులోకి వచ్చిన ఉపకరణాలే. చరిత్రలో తొలికాలపు గ్రీకులు రాసినదేమిటో అర్థం చేసుకోవటానికి మూడువేల యేళ్లు పట్టింది. మయన్లు లిఖించిన పదాల కూర్పులోని రహస్యమేమిటో తెలుసుకోవటానికి రెండు శతాబ్దాలు పట్టింది. కానీ ఏఐ అలాంటి సంక్లిష్టమైన లిపులను క్షణాల్లో తేటతెల్లం చేస్తోంది. అందువల్ల ప్రాచీన మానవుల జీవన విధానంపై మన అవగాహన పెరిగింది. ఇక వైద్యపరంగా కృత్రిమ మేధ సాధిస్తున్నది అపారం. శామ్ ఆల్ట్‌మాన్‌కు గురు సమానుడు స్టీవ్ జాబ్స్. మరొకరితో కలిసి ఆయన నెలకొల్పిన యాపిల్ సంస్థకు ఏరికోరి సీఈఓగా తెచ్చుకున్న వ్యక్తే 1985లో ఆ సంస్థనుంచి స్టీవ్ జాబ్స్‌ను వెళ్ల గొట్టడం, తదనంతర పరిణామాల్లో జాబ్స్ తిరిగి అదే సంస్థకు రావటం చరిత్ర. ఇప్పుడు ఆల్ట్ మాన్కు కూడా అదే జరిగింది. ఏదేమైనా ఓపెన్ఏఐలో జరిగిందేమిటో, పరిశోధనల దశ, దిశ ఎలా వున్నాయో తెలుసుకోవటం ప్రపంచ ప్రజానీకం హక్కు. అది తేటతెల్లం చేయాల్సిన బాధ్యత సంస్థ లపై వుంది. కేవలం మానవాళి మంచికి మాత్రమే ఉపయోగపడేలా, ప్రభుత్వాలతో సహా ఎవరూ ఏఐని దుర్వినియోగం చేయకుండా కట్టుదిట్టమైన నియంత్రణలు విధించటం తక్షణావసరం. -
పీకల మీదకొచ్చింది!
ముప్పు ముంచుకొచ్చినప్పుడు కాని మేలుకోకపోతే కష్టమే. పరిస్థితి చూస్తే అలానే ఉంది. పర్యావరణ మార్పులపై సంబంధిత పక్షాల సదస్సు తాజా సమావేశం (కాప్–28) ఈ నెలాఖరు నుంచి డిసెంబర్ 12 దాకా దుబాయ్‌లో జరగనుంది. ఏటేటా ఐరాస ఆధ్వర్యంలో ఇది మొక్కుబడి తంతుగా మారిపోతున్న వేళ కొద్దిరోజులుగా వివిధ నివేదికలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. ఇప్పటికే పరిస్థితి విషమించిందని వెల్లడిస్తున్నాయి. రోజువారీ సగటు ప్రపంచ ఉష్ణోగ్రతలు తొలి సారిగా ఈ నవంబర్ 17న పారిశ్రామికీకరణ మునుపటి హద్దు దాటి 2 డిగ్రీల సెల్సియస్ పెరిగా యన్న వార్త ఆందోళన రేపుతోంది. పుడమిపై కర్బన ఉద్గారాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు తాము పెట్టుకున్న లక్ష్యాల గురి తప్పుతూనే ఉన్నాయని స్పష్టమవుతోంది. ఎప్పటికప్పుడు పర్యావరణ పరిరక్షణకు ప్రతిన చేస్తున్నా, నష్టనివారణకు నిధుల కొరత పీడిస్తూనే ఉంది. ఆహార అభద్రత మొదలు వ్యాధుల దాకా అనేక రకాలుగా వాతావరణ మార్పులు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతున్నాయి. ప్రజారోగ్యంలో దశాబ్దాలుగా సాధించిన ప్రగతిని దెబ్బ తీస్తున్నాయి. ఆ నేపథ్యంలో వాతావరణ మార్పులపై తాజా నివేదికలు అలజడి సృష్టిస్తున్నాయి. పుడమి మీది ఒక శాతం అత్యంత ధనికులే మొత్తం ప్రపంచ జనాభాలోని 66 శాతం మంది కలగజేసేటంత భూతాపానికి కారణమని ఆక్స్‌ఫామ్ తాజా నివేదిక తేల్చింది. ఇక, ‘కౌంట్‌డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ ఛేంజ్’ అంటూ గత వారం లాన్సెట్ వెలువరించిన 8వ వార్షిక నివేదిక ప్రజారోగ్యం, ఆరోగ్య రక్షణ వ్యవస్థలపై పడే ప్రభావాన్ని కళ్ళకు కట్టింది. పర్యావరణ మార్పుకు ప్రధాన కారణాలైన శిలాజ ఇంధనాల వినియోగం లాంటి వాటికి అడ్డుకట్ట వేయకుంటే, ప్రజల ఆరోగ్యానికే పెను ప్రమాదమని లాన్సెట్ నివేదిక హెచ్చరిస్తోంది. భారత్‌కు సంబంధించి ఈ నివేదిక చెప్పిన అంశాలు, చేస్తున్న హెచ్చరికలు ఆలోచన రేపుతున్నాయి. మన దేశంలో 1986 – 2005 మధ్య కాలంతో పోలిస్తే, 2018 – 2022 మధ్య కాలంలో సగటు వేసవి ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల సెల్సియస్ పెరిగాయట. ఇప్పటికే ఈ అధిక ఉష్ణోగ్రత పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ఆరోగ్యాన్నీ దెబ్బ తీస్తోంది. ఈ వాతావరణ పరిస్థితులు మలేరియా, డెంగ్యూ కేసుల్ని పెంచుతున్నాయి. అలాగే సముద్రతీర ప్రాంతాల్లో గ్యాస్ట్రో ఎంటరైటిస్, సెప్సిస్, కలరాలకు సానుకూలంగా తయారవుతున్నాయి. అలాగే, ‘బ్రోకెన్ రికార్డ్’ శీర్షికన ఐరాసా వెల్లడించిన తాజా నివేదిక సైతం పరిమితులు దాటి గ్రీన్హౌస్ వాయువుల విడుదల పెరిగిన కథను వివరించింది. వెరసి, ఉష్ణోగ్రతలు పారిశ్రామికీరణకు ముందు స్థాయి కన్నా 2 డిగ్రీలు, వీలుంటే 1.5 డిగ్రీలు మించి పెరగరాదని 2015 నాటి ప్యారిస్ ఒప్పందం (పీఏ)లో చేసుకున్న బాసలు చెరిగిపోయేలా కనిపిస్తున్నాయి. నికరంగా కర్బన ఉద్గారాలు లేని ‘నెట్ జీరో’కు కట్టుబడతామని అనేక దేశాలు మాట ఇస్తున్నా, అది ‘విశ్వసనీయంగా’ లేదని తాజా నివేదిక తేల్చేసింది. భూతాపం పెంపును 1.5 డిగ్రీల లోపలకు నియంత్రించే అవకాశాలు నూటికి పద్నాలుగు వంతులేనట! 2021తో పోలిస్తే 1.2 శాతం ఎక్కువగా 2022లో ప్రపంచమంతా కలసి 57.4 బిలియన్ల కర్బన ఉద్గారాలను వెలువరించిందని లెక్క. అలాగే, కరోనాలో 4.7 శాతం తగ్గిన ఉద్గారాలు ఈ ఏడాది మళ్ళీ కరోనా ముందు స్థాయికి చేరిపోవచ్చని అంచనా. నిజానికి, పర్యావరణ మార్పు, ధనిక – బీద అసమానతలు విడదీయరాని జంట. ప్రధానంగా ధనిక దేశాల పాపానికి పేద దేశాలు బలి అవుతున్నాయి. పర్యావరణ మార్పు ప్రభావాన్ని మోస్తున్నాయి. ధనిక దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించాలనీ, చేసిన నష్టానికి పరిహారం చెల్లించాలనీ కాప్28 లాంటి చోట్ల పేద దేశాలు ఒత్తిడి తెస్తున్నది అందుకే. కానీ, అతి తక్కువ సంఖ్యలోని ఆ ధనిక దేశాలే ప్రపంచ పర్యావరణ విధానాన్ని నిర్ణయిస్తుండడంతో పరిష్కారం దిశగా అడుగులు పడడం లేదు. ఈజిప్ట్‌లో నిరుడు కాప్27 సదస్సులో ‘నష్ట పరిహార నిధి’ని ఏర్పాటు చేయాలంటూ ఒప్పందం కుదిరింది. స్వీయ కర్బన ఉద్గారాలు తక్కువే అయినా ధనిక దేశాల ఉద్గారాలతో నష్టపోతున్న బీద దేశాలను పర్యావరణ మార్పు ప్రభావాల నుంచి కాపాడేందుకు ఈ నిధిని ఉద్దేశించారు. ఆలోచన మంచిదైనా, ఆచరణకు వచ్చే సరికి ఆ నిధి ద్వారా డబ్బులు ఎవరిస్తారు, ఎవరికి ఇస్తారనేది ఇప్పటికీ తేలనే లేదు. ఇంకా చిత్రమేమిటంటే– పర్యావరణానికి తూట్లు పొడిచే భారీ చమురు ప్రణాళికలు వేస్తున్న దుబాయ్‌లో కాప్28 సమావేశం జరగనుండడం! అలాగే, వాతావరణ సంక్షోభం, ప్రకృతి సంక్షోభం... ఈ రెంటినీ భిన్నమైన సవాళ్ళుగా భావిస్తూ, స్పందిస్తున్నాం. వాటి వల్ల సమాజంలో తలెత్తే సంక్షోభాన్ని అర్థం చేసుకోవడం లేదు. ప్రపంచమంతా చేస్తున్న ప్రమాదకరమైన తప్పు అదే! తీవ్ర వాతావరణ ఘటనలతో వర్ధమాన దేశాల్లో బాలికలకు నాణ్యమైన విద్య దెబ్బ తింటోందని ప్లాన్ ఇంటర్నేషనల్ నివేదిక మాట. పర్యావరణ బాధిత 30 దేశాల్లో ఏటా కనీసం 1.25 కోట్ల మంది బాలికలు అర్ధంతరంగా చదువుకు గుడ్‌బై చెప్పడానికి వాతావరణ మార్పులు కారణమవుతాయని ‘మలాలా ఫండ్’ సైతం హెచ్చరిస్తోంది. ఇలాంటి గణాంకాలెన్నో వాస్తవ పరిస్థితికి ప్రతిబింబం. అందుకే, పర్యావరణ మార్పు గురించి మాటల కన్నా చేతలు ముఖ్యం. రానున్న దుబాయ్ సదస్సు లోనూ ప్యారిస్ ఒప్పందం తాలుకు అమలు తీరుతెన్నులపై ప్రపంచం మళ్ళీ చర్చిస్తుంది. ఈసారైనా మాటలు తగ్గించి, చేతలపై దృష్టి పెడితే మంచిది. ఎందుకంటే, పర్యావరణంపై ప్రపంచం ఇప్పటికే గాడి తప్పింది. దుష్ఫలితాలూ చూస్తోంది. తాజా హెచ్చరికలు పెడచెవిన పెడితే మరిన్ని కష్టాలు తప్పవు. ప్రపంచానికి పరిష్కారం ఎడారి దేశంలోనూ ఎండమావిగా మారితేనే మానవాళికి నష్టం. -
కోరి తెచ్చుకున్న కొరివి?
ఎన్నికలు, ఫలితాలనేవి ఉద్వేగాలను రేపడం సహజం. అయితే, కొన్ని ఎన్నికలు, కొందరి ఎంపికలు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తాయి. అనుమానాలతో పాటు ఆందోళనలూ రేపుతాయి. అర్జెంటీనా కొత్త అధ్యక్షుడిగా ఛాందసవాద జేవియర్ మిలీ తాజా ఎన్నిక అలాంటిదే. ఓట్ల లెక్కింపులో మిలీ 56 శాతం ఓట్లు సాధిస్తే, అధికార పక్షమైన పెరోనిస్ట్ ప్రభుత్వ ఆర్థిక మంత్రి సెర్జియో మస్సాకు 44 శాతం ఓట్లే వచ్చాయి. వర్తమాన అర్జెంటీనా రాజకీయ వ్యవస్థపై నెలకొన్న ప్రజాగ్రహానికి, ‘సరికొత్త రాజకీయ శకం’ తీసుకువస్తానన్న వాగ్దానం తోడై సృష్టించిన ప్రభంజనంలో మిలీ విజయతీరాలకు చేరారు. అయితే, ఆయన విజయం అర్జెంటీనాలోని ప్రతిపక్షాల్లోనే కాదు... అంతర్జాతీయంగానూ ఆందోళన రేపుతోంది. కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని భావిస్తున్నారు. నలభై ఏళ్ళుగా ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్న దక్షిణ అమెరికా దేశాన్ని కొత్త అధ్య క్షుడు మళ్ళీ వెనక్కి నడిపిస్తారనే భయం నెలకొంది. అదెలా ఉన్నా... అర్జెంటీనా దౌత్య సంబంధాలు, ఆర్థిక భవితవ్యం, ఆ ప్రాంత రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి. నాలుగున్నర కోట్ల జనాభా గల అర్జెంటీనాలో నవంబర్ 19న జరిగిన ఎన్నికలు, ఫలితాలు ఇంతగా చర్చనీయాంశమైంది అందుకే. ఎన్నికల్లో మిలీకి పట్టం కట్టినమాట నిజమే అయినా, అంత మాత్రాన అర్జెంటీనా ప్రజలందరూ ఆయన భావజాలంతో ఏకీభవిస్తున్నట్టు అనుకోలేం. దశాబ్దాల నిర్వహణ లోపాలు, అవినీతితో ఆ దేశం దీర్ఘకాలంగా ఆర్థిక కష్టాల ఊబిలో కూరుకుపోయింది. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. ప్రపంచస్థాయిలోనే ఎక్కువగా ద్రవ్యోల్బణం 150 శాతానికి దగ్గరలో ఉంది. దారిద్య్రం పెరుగుతోంది. దేశంలో నూటికి 40 మందికి పైగా దారిద్య్రంలో మగ్గు తున్నారు. అధికార కరెన్సీ పెసో విలువ ఎన్నడూ లేనంతగా పడిపోయింది. మూడేళ్ళ క్రితం కరోనా రావడానికి ముందు దాకా 80 పెసోలు ఒక డాలరైతే, ఇవాళ వెయ్యి పెసోలైతే కానీ ఒక డాలర్‌కు సమానం కాని దుఃస్థితి. ఈ ఆర్థిక కష్టాలకు రాజకీయ వ్యవస్థ, ముఖ్యంగా వామపక్షాలు కారణమని మిలీ ఆరోపణ. ఆ ఆరోపణల్ని అధికారపక్ష అభ్యర్థి సమర్థంగా తిప్పికొట్టలేకపోయారు. ఎలాగైనా సరే జీవన పరిస్థితుల్లో మార్పు రావాలని తహతహలాడుతున్న జనం మిలీతో ఏకీభావం లేకున్నా ఆయనకే ఓటేశారు. అందుకే, ఈ ఎన్నిక ‘‘నిరసన ఓటు’’ ఫలితమని నిపుణుల మాట. ఆర్థిక నిపుణుడు, మాజీ టీవీ ప్రముఖుడు, తాంత్రిక సెక్స్ కోచ్ 53 ఏళ్ళ జేవియర్ మిలీకి నిజా నికి రాజకీయ అనుభవం లేదు. కానీ, ప్రజలకు ఆయన బాసలు కోటలు దాటాయి. పన్నులు తగ్గిస్తా ననీ, అర్జెంటీనా కేంద్ర బ్యాంకును రద్దు చేస్తాననీ, దేశ కరెన్సీ పెసో స్థానంలో అమెరికా డాలర్‌ను తెస్తాననీ అన్నారు. గర్భస్రావంపై నిషేధం ఎత్తేస్తానన్నారు. కారుణ్య మరణాల్ని వ్యతిరేకించారు. తుపాకులపై నియంత్రణల్ని సడలిస్తానన్నారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ‘సామ్యవాదంపై పోరాటం’ చేయదలచిన దేశాలే అర్జెంటీనాకు మిత్రపక్షాలంటూ తన భావజాలాన్ని కుండబద్దలు కొట్టారు. అసలే కష్టాల్లో ఉన్న దేశాన్ని ఆయన అధ్యక్షత మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందని వందమందికి పైగా ప్రముఖ ఆర్థికవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. పైగా, అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్యదేశాలైన బ్రెజిల్, చైనా, అమెరికా, చిలీ నేతల్ని మిలీ దుమ్మెత్తిపోశారు. ఇక, సర్కారు వద్దే డాలర్లు లేని వేళ దేశ కరెన్సీ స్థానంలో డాలర్లను ప్రవేశపెడతాననడం ఆచరణ సాధ్యం కాని పని. ఏ కొద్దిగా ప్రయత్నించినా అది మరో సంక్షోభానికి తెర తీస్తుంది. అర్జెంటీనా సంగతి అటుంచితే, మిలీ విజయవార్త మిగతా ప్రపంచానికీ శుభవార్తేమీ కాదు. అందుకు అనేక కారణాలు. టీవీ ప్రముఖుడిగా తెచ్చుకున్న పేరును ఆయన రాజకీయాల్లో మదుపు పెట్టారు. రెచ్చగొట్టే మాటలు, మితిమీరిన హావభావ విన్యాసాలతో ముందుకు సాగుతున్నారు. సుమారు అయిదేళ్ళ క్రితం రాజకీయాల్లోకి వచ్చిన ఈ స్వేచ్ఛావాది ప్రపంచ వాతావరణ మార్పు ఓ పెద్ద సామ్యవాద అబద్ధం అంటారు. ప్రపంచవ్యాప్తంగా అతివాదులకు నచ్చే ఆ మాటల్ని ఐరోపా లాంటివి స్వాగతిస్తున్నాయి. విజేత మిలీని తక్షణం అభినందించిన వారి జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో తదితరులు ఉండడం గమనార్హం. అమెరికాలో ట్రంప్ హయాంలో, బ్రెజిల్లో బొల్సొనారో ఏలుబడిలో జరిగిందేమిటో అందరికీ తెలిసిందే, చూసినదే. మరి, స్నేహితుల్ని బట్టి స్వభావం తెలుస్తుందన్న దాన్ని బట్టి రానున్న రోజుల్లో మిలీ ఎలాంటి పోకడలు పోగలరో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థలతో నిత్యం పోరాడే అధ్యక్షుడి వల్ల అర్జెంటీనా ప్రజాస్వామ్యం మరింత బలహీనపడే ముప్పుంది. ఎన్నికల ప్రచార సమయంలో రంపం చేతబట్టి, ఖర్చునూ, కష్టాల్నీ కోసేస్తానని మిలీ చెబుతూ వచ్చారు. విజయోత్సవ ప్రసంగంలోనూ దేశంలో ‘అంచెలంచెలుగా కాక సమూలంగా మార్పు తెస్తా’నని వాగ్దానం చేశారు. అనుభవమే కాదు... భావోద్వేగాలపై అదుపు కానీ, పార్లమెంట్లో మెజారిటీ కానీ లేని మిలీ ఏం చేయగలుగుతారు, ఎంతకాలం నిలబడగలుగుతారన్నది సందేహమే! కొద్దికాలమే పదవిలో ఉన్నా దేశానికి నష్టం భారీగా ఉండవచ్చని పలువురి భయం. అసలు అర్జెంటీనాలో ప్రజాస్వామ్యం బీటలు వారుతోందని ఇప్పటికి మూడేళ్ళుగా అమెరికా, బ్రెజిల్ హెచ్చరిస్తూనే ఉన్నాయి. మిలీ హయాంలో ఆ భయాలన్నీ నిజమైతే, ఆ దేశానికి అంతకన్నా విషాదం మరొ కటి ఉండదు. మాటల్లో, చేష్టల్లో ట్రంప్‌కు తీసిపోని మిలీని అంతా ‘ఎల్లోకో’ (పిచ్చివాడు) అంటుంటారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం పక్కకుపోయి, అధికారం పిచ్చోడి చేతిలో రాయిగా మారితే కష్టమే! కారణాలేమైనా ఇది మెజారిటీ అర్జెంటీనా పౌరులు కోరి తెచ్చుకున్న కొరివి!! -
శతకోటి జనుల స్వప్నభంగం
పరమపద సోపానపటంలో చివరి దాకా వెళ్ళి, మరొక్క గడిలో లక్ష్యాన్ని అందుకుంటామనగా పెద్ద పాము నోటిలో పడితే ఎలా ఉంటుంది? విజయం అంచుల దాకా వెళ్ళి, ఓటమి కోరల పాలబడితే ఎవరి మానసిక పరిస్థితి అయినా ఏమవుతుంది? వరల్డ్ కప్‌లో అప్రతిహతంగా దూసుకెళ్ళి, తీరా ఆదివారం ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తయిన భారత క్రికెట్ జట్టు పరిస్థితీ, 140 కోట్ల మంది భారతీయుల మనఃస్థితీ అంతే. లక్షా 32 వేల మంది జనంతో క్రిక్కిరిసిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియమ్లో నిశ్శబ్దం తాండవించగా, ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచి, ఆరో ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్‌ను ఎగరేసుకుపోయింది. శత కోటి భారతీయుల స్వప్నం భంగమైంది. ఆసీస్‌కు ఇది ఆరో వరల్డ్ కప్ టైటిలైతే, ఆ దేశంతో ఇరవై ఏళ్ళ క్రితం దక్షిణాఫ్రికాలో ప్రపంచ కప్ ఫైనల్స్‌లో తలపడినప్పటి లానే భారత్‌కు మళ్ళీ చేదు అనుభవమే ఎదురైంది. నిజానికి, ఈసారి భారత జట్టు టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగకపోయినా, టోర్నీ ఆరంభం నుంచి ఆటలో ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. పది జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో గ్రూప్ దశ నుంచి ఎదురన్నది లేకుండా సాగింది. 2019 సెమీస్‌లో తమను ఓడించిన న్యూజిలాండ్‌ను ఈసారి సెమీస్‌లో తాను మట్టికరిపించి, ఫైనల్‌కు చేరింది. వరుస విజయాలతో కప్పు భారత్‌దే అన్న నమ్మకం కలిగించింది. తీరా ఆఖరి మహా సంగ్రామంలో తడబడింది. ఇక, తడబడుతూ ఈ టోర్నీని మొదలుపెట్టి, ఆఖరికి అఫ్గానిస్తాన్ చేతిలో సైతం ఓటమి కోరల నుంచి మ్యాక్స్‌వెల్ అసాధారణ డబుల్ సెంచరీతో బయటపడ్డ ఆసీస్ ఆఖరికి విజేత అయింది. తనదైన రోజున మన జట్టు మెడలు వంచి, టైటిల్‌ను సొంతం చేసుకుంది. టోర్నీలో అత్యధిక పరుగులు (కోహ్లీ – 765 రన్స్), అత్యధిక వికెట్లు (షమీ– 7 మ్యాచ్‌లలో 24 వికెట్లు), అత్యుత్తమ విజయ శాతం (90.9) లాంటి ఘనతలు సాధించిన భారత జట్టు ఆఖరి మెట్టుపైకి చేరకుండానే ఆగిపోయింది. అలాగని మునుపెన్నడూ లేనంత బలంగా కనిపిస్తున్న ఈ జట్టును తప్పుబట్టాల్సిన పని లేదు. అప్రతిహత విజయాలతో, అసాధారణ ప్రతిభా ప్రదర్శనతో, గత నెలన్నర పైగా కోట్లాది అభిమానులకు ఆనందోద్వేగాల్ని పంచిన భారత జట్టును తక్కువ చేయలేం. అసలు ప్రపంచ కప్‌లో ఫైనల్స్ దాకా చేరడమే గొప్ప.అలాగే, ఆటలో గెలుపోటములు సహజమనీ, విజేత ఒకరే ఉంటారనీ గుర్తెరగాలి. కాకపోతే, లోటుపాట్లేమిటన్నది కూడా సమీక్షించుకోవాలి. పేరున్న వేదికల్ని సైతం పక్కకునెట్టి, పాలకపక్ష పెద్దలు, బీసీసీఐ సారథుల స్వస్థలం లాంటి ఇతరేతర కారణాలతో అహ్మదాబాద్‌ను ఫైనల్స్‌కు వేదిక చేయడం మన కురచబుద్ధి రాజకీయాల తప్పు. ఇరుజట్లకూ సమాన విజయావకాశాలు కల్పించకుండా, టాస్‌ను కీలకం చేసి, మ్యాచ్‌ను లాటరీగా మార్చేసే పిచ్‌ను తుదిపోరుకు సిద్ధం చేయడం మరో తప్పు. ఇవన్నీ కొంప ముంచాయి. ప్రపంచ టోర్నీల్లో విజేతగా నిలిచే విషయంలో భారత్ వెనుకబడే ఉంది. ఈసారీ ఆ లోటు తీర లేదు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీని సాధించిన తర్వాత దశాబ్ద కాలంగా మరో ప్రపంచ టైటిల్ ఏదీ మనం గెలవలేదు. పదేళ్ళ లెక్క తీస్తే, సెమీస్‌లో 3 సార్లు, ఫైనల్స్‌లో 5 సార్లు... మొత్తం 8 కీలక మ్యాచ్‌లలో మనం చతికిలపడ్డాం. భారీ గేమ్స్ తాలూకు ఒత్తిడి, ఓటమి భయం, జట్టు ఆలోచనా దృక్పథం... ఇలా అనేకం అందుకు కారణాలు కావచ్చు. అంతర్జాతీయ వేదికపై జెండా ఎగరేసేందుకు మనలోని ఈ అంతర్గత ప్రత్యర్థులపై ముందు విజయం సాధించాలి. అందుకెలాంటి ప్రయత్నం, శ్రమ, శిక్షణ అవసరమన్న దానిపై క్రికెట్ యంత్రాంగం దృష్టి పెట్టాలి. కలబడి ఆడడమే కాదు... ఒత్తిడిలోనూ నిలబడి గెలవడమూ కీలకమేనని ఐపీఎల్ అలవాటైన నవతరానికి నూరిపోయాలి. టాస్ మొదలు ఏదీ కలసిరాని చావో రేవో మ్యాచ్‌లో పదో ఓవర్ నుంచి యాభయ్యో ఓవర్ మధ్య 40 ఓవర్లలో 4 బౌండరీలే భారత బ్యాట్స్మన్లు కొట్టారన్న లెక్క ఆశ్చర్యపరుస్తుంది. బ్యాటింగ్‌లో అవతల వికెట్లు టపటపా పడుతుంటే ఒక్కో పరుగుతో, భాగస్వామ్యం, తద్వారా భారీ ఇన్నింగ్స్ నిర్మించే ఓర్పు కావాలి. బంతిని బలంగా బాదడం కన్నా ప్రత్యర్థి ఫీల్డర్ల మధ్య ఖాళీల్లో కొట్టే నేర్పు రావాలి. అన్నీ తెలిసిన భారత్ ఆఖరి రోజున ఆ పనిలో విఫలమైంది. బలంగా కనిపించే జట్టులో తొలి అయిదుగురి తర్వాత బ్యాటింగ్ బలహీనతలూ బయటపడ్డాయి. కనీసం మరో 40 – 50 పరుగులు చేసివుంటే, బౌలింగ్‌లో, ఫీల్డింగ్‌లో మరింత రాణించివుంటే కథ మరోలా ఉండేదన్న మాటలు వినిపిస్తున్నది అందుకే! అలాగని, ఆసీస్ తాజా విజయాన్ని తక్కువ చేయలేం. ప్రతి కీలక సందర్భంలో సర్వశక్తులూ ఒడ్డే ఆ జట్టు పోరాటస్ఫూర్తిని అలవరచుకోవడమే ఎప్పటికైనా మనకు ముఖ్యం. ఆటలను పిచ్చిగా ప్రేమించే, కేవలం 2.5 కోట్ల జనాభా గల ఆ దేశం తరగని ప్రేరణ. మన జట్టు గెలవాలనుకోవడం సబబే కానీ, అన్ని రోజులూ, అన్ని మ్యాచ్‌లూ మనమే గెలవాల నుకోవడం అత్యాశ. అంచనాలు, అనవసర ఒత్తిళ్ళు పెంచేయడం మన లోపమే. కొమ్ములు తిరిగిన ఆటగాళ్ళకైనా కలసిరాని రోజులూ కొన్ని ఉంటాయి. భారత క్రికెట్లో మొన్న ఆదివారం అలాంటిదే. ప్రత్యర్థి ఆటగాడు సెంచరీ కొట్టినా, ఆ జట్టు కెప్టెన్ కప్ అందుకున్నా అభినందించలేనంత సంకుచిత ధోరణి క్రీడాస్ఫూర్తి కానేరదు. అహ్మదాబాద్ సాక్షిగా అందరం ముందు అది తెలుసుకోవాలి. అత్యు త్తమ బౌలింగ్ దాడి, కోహ్లీ అపూర్వ ఫామ్, రోహిత్ ఘనసారథ్యం లాంటి గొప్పలెన్నో ఈ టోర్నీ మిగిల్చిందని గుర్తుంచుకోవాలి. ఇప్పుడిక ప్రతిభకు పదును పెట్టుకుంటూనే, మనదైన మరో రోజు కోసం ఆగుదాం. వచ్చే వరల్డ్‌కప్‌ను ముద్దాడేందుకు నాలుగేళ్ళు నిరీక్షిద్దాం. శారీరకంగా, మానసికంగా మన జట్టు అందుకు సన్నద్ధమయ్యేందుకు సహకరిద్దాం. నెక్స్›్ట టైమ్ బెటర్ లక్... టీమిండియా! -
పుస్తకం కర్ణభూషణం
పుస్తకం హస్తభూషణమన్నారు; అది చదివే పుస్తకాల గురించి! ఇప్పుడు వినే పుస్తకాలు ప్రాచుర్యాన్ని తెచ్చుకుంటూ కర్ణభూషణంగా మారుతున్నాయి. కాలం చేసే తమాషాలలో ఇదొకటి. మన జీవితమూ, ఊహలూ, ప్రణాళికలూ కాలం వెంబడి సరళరేఖలా సాగుతాయనుకుంటాం. కానీ,దృష్టి వైశాల్యాన్ని పెంచుకుని చూస్తే కాలం మళ్ళీ మళ్ళీ బయలుదేరిన చోటికే వచ్చే చక్రంలా కూడా కనిపిస్తుంది. ‘కాలచక్ర’మనే మాట సర్వత్రా ప్రసిద్ధమే. పుస్తక ప్రపంచంలోకే కనుక ఒకసారి తొంగి చూస్తే, ‘చదువు’ అనే మాట పుస్తకంతో ముడిపడే ప్రచారంలోకి వచ్చింది. పుస్తకాలు లేని కాలంలో; లేదా, అవి జనసామాన్యానికి విరివిగా అందుబాటులోకి రాని రోజుల్లో కథలూ, కవిత్వాలూ, ఇతరేతర జ్ఞానాలూ అన్నీ వినుకలి ద్వారానే అందేవి. దీర్ఘకాలంపాటు ప్రపంచవ్యాప్తంగా సమస్త వాఙ్మయమూ చక్షురక్షరాల మధ్య కాకుండా; వక్తకీ, శ్రోతకీ మధ్య ప్రవహిస్తూ మౌఖిక వాఙ్మ యమనే ముద్ర వేసుకుంది. పుస్తక వ్యాప్తితోనే లిఖిత సాహిత్యమన్న మాట వాడుకలోకి వచ్చింది. కాలచక్రం మళ్ళీ మొదటికొచ్చి, పుస్తకమనే ‘పఠన’ మాధ్యమం స్థానాన్ని, ఇయర్ ఫోన్ రూపంలో తిరిగి వెనకటి ‘శ్రవణ’ మాధ్యమం ఆక్రమించుకుంటున్నట్టు తోస్తోంది. నేటి యువత పుస్తకాన్ని చదవడం కన్నా, వినడాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. ఆ విధంగా, ‘పుస్తకాలు లేని గది ఆత్మలేని దేహ’మన్న సిసిరో సూక్తిని కొంత సవరించుకోవలసిన అవసరమూ కలుగుతోంది. కనుకలి నుంచి వినుకలికి మారినప్పుడు పుస్తకం కలిగించే అనుభూతి గాఢతలోనూ మార్పు వస్తుందా అన్నది అనుభవంతో మాత్రమే చెప్పగలం. ఏదైనాసరే అంతిమంగా అలవాటు పడడంలోనే ఉంటుంది. మాధ్యమం ఎలాంటిదైనా పుస్తకానికీ మస్తకానికీ పడిన పీటముడి స్థిరమూ, శాశ్వతమనీ మాత్రం నిస్సంశయంగా చెప్పవచ్చు. రాబోయే కాలం అనూహ్యంగా మన అంచనాలను తలకిందులు చేస్తే తప్ప పుస్తకాలతో మన సహజీవనం మరికొన్ని తరాలపాటు నిరాఘాటంగా కొనసాగుతుందనే అనుకోవచ్చు. కాపురంలోలానే పుస్తకాలతో కాపురంలోనూ చేదూ, తీపీ కలగలిసే ఉంటాయి. పుస్తక ప్రియులు వియ్యమందితే ఒక్కోసారి సొంతింటి పుస్తక వారసత్వానికీ, సొంత సేకరణకూ అదనంగా అత్తింటి పుస్తక వారసత్వమూ అంది, పుస్తకాలు ఇబ్బడి ముబ్బడై అల్మైరాలను దాటిపోయి నేల మీద పరచుకుంటూ ఉంటాయి. పుస్తెతోపాటు సంక్రమించిన పుస్తక సంపదా ఇల్లాలికి దినదిన సమస్య అవుతూ ఉంటుంది. పుస్తకాలతో జీవించడం కూడా ఒక పుస్తకానికి సరిపోయే ఇతివృత్త మవుతుంది. బాల్యం నుంచి, వార్ధక్యం వరకూ మనతో ఉండే పుస్తకాలు, ఒక్క పుట కూడా తెరవకుండానే, ఆయా వయోదశల మీదుగా మన అభిరుచులలో వచ్చే తేడాలను బోధిస్తాయి. మనకు పనికిరానివని పక్కన పెట్టిన పుస్తకాలే క్రమంగా మన చదువుల బల్లకెక్కి వెక్కిరిస్తాయి. మన హస్తస్పర్శ కోసం ఏళ్ల తరబడి మౌన తపస్సు చేసే పుస్తకాలే, ఒక్కసారి తెరవగానే అద్భుత ప్రపంచంలోకి మనల్ని లాక్కుపోతాయి. మన ప్రయాణం ఆగినా పుస్తక ప్రయాణం కొన సాగుతూనే ఉంటుంది. కవిత్వానికి ఏదీ అనర్హం కాదని మహాకవి ఉగ్గడించినట్టుగా, చరిత్ర శోధనకూ ఏదీ అనర్హం కాదు. పుస్తక చరిత్రనే తవ్వితే అది కూడా ఎన్నో అవతారాలు ఎత్తుతూ నేటి దశకు వచ్చిన సంగతి అర్థమై రేపటి అవతారం గురించిన దిగులు, గుబుళ్లను తగ్గిస్తుంది. పుస్తకం గురించిన ఊహ క్రీస్తుపూర్వం నాలుగవ సహస్రాబ్ది నాటికే ఉండేది. ప్రాచీన ఈజిప్టు వాసులు మధ్య ఆఫ్రికా, నైలునదీ లోయల్లో పెరిగే ‘పెపారస్’ అనే నీటిమొక్క నుంచి తీసిన మెత్తని బెరడును రాతకు, చిత్రలేఖనానికి ఉపయోగించేవారు. ఈ ‘పెపారస్’ పేరే ‘పేపర్’గా మారి ఇప్పటికీ వ్యవహారంలో ఉంది. ఆంగ్లంలో ‘బుక్’ అనే మాట పుట్టుకా ఇంతే ఆసక్తికరం. యూరప్, ఆసియా అడవుల్లో పెరిగే ‘బచ్’ అనే చెట్టు తాలూకు తెల్లని బెరడును రాతకు ఉపయోగించేవారు. నేటి ఇండో–యూరోపియన్ భాషలకు మాతృక అయిన ప్రోటో–ఇండో–యూరోపియన్ లోని ‘భెరెగ్’, ‘భగో’ అనే మాటలే వివిధ పుత్రికాభాషల్లో ‘బచ్’ గానూ, ‘బీచ్’ గానే కాక; ఇంకా అనేక రూపాంతరాలు చెందుతూ చివరికి ‘బుక్’గా మారాయి. ప్రాచీన భారతదేశంలో రాతకు ఉపయోగించిన ‘భూర్జపత్ర’ మనే సంస్కృత శబ్ద మూలాలు కూడా ‘భెరెగ్’ అనే ప్రోటో–ఇండో–యూరోపియన్ పదంలోనే ఉన్నాయి. క్రీస్తుశకం తొలి శతాబ్దంలో రోమన్లు శిక్షాస్మృతుల రాతకు గొర్రె, మేక చర్మాన్ని వినియో గించేవారు. క్రమంగా తాటియాకులు, రాగిరేకులు రాతకు ఆలంబనమయ్యాయి. క్రీస్తుశకం 2–5 శతాబ్దుల మధ్యలో వచ్చినట్టు చెబుతున్న ‘డైమెండ్ సూత్ర’ తొలి ముద్రితగ్రంథమంటారు. ఇక 15వ శతాబ్దిలో జోహానెస్ గూటెన్‌బర్గ్ కనిపెట్టిన ముద్రణ యంత్రం పుస్తక ప్రచురణను విప్లవీకరించడం, 16వ శతాబ్దిలో రిచర్డ్ ముల్కాస్టర్ అనే పండితుడు ఎనిమిదివేల మాటలతో తొలి నిఘంటువును ప్రచురించడం వగైరాలు ఇటీవలి చరిత్ర. ఎప్పటికప్పుడు పరిమిత సంఖ్యలో పుస్తకాలను ప్రచురించుకునే నేటి అవకాశాన్ని (ప్రింట్–ఆన్ –ఆర్డర్) ఫ్రెడరిక్ ఫో అనే సైన్సు ఫిక్షన్ రచయిత 1966లోనే ఊహించాడు. ఇంతకీ ఈ పుస్తక స్మరణ దేనికంటే, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పుస్తకాల పండుగ సమీపిస్తోంది. కొన్ని రోజులపాటు జరిగే ఈ పండుగకు ముద్రాపకులు, విక్రేతలు, రచయితలు సమధికోత్సాహంతో సిద్ధమవుతున్నారు. ముద్రిత గ్రంథాల భవిష్యత్తు పట్ల ప్రస్తుతానికి అదే కొండంత భరోసా. -
ఆశల పల్లకిలో కాంగ్రెస్, అడ్వాంటేజ్ బీఆర్ఎస్!
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల మీద కాంగ్రెస్ పార్టీ చాలా ఆశలు పెట్టుకున్నది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లతోపాటు తెలంగాణాలో కూడా విజయం సాధిస్తే ‘ఇండియా’ కూటమిలో తన నాయకత్వానికి గౌరవం పెరుగుతుందనీ, ఆత్మవిశ్వాసంతో పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవచ్చనీ ఆ పార్టీ వ్యూహం. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ గెలుపుపై ఎవరికీ పెద్దగా అనుమానాల్లేవు. మధ్యప్రదేశ్‌లో కూడా సులభంగానే గెలుస్తామనే ధీమా ఆ పార్టీలో కనబడింది. నిన్నటి పోలింగ్ సరళిని పరిశీలించిన తర్వాత కాంగ్రెస్ భారీ విజయాన్ని నమోదు చేయ వచ్చని పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రదేశ్ పరిస్థితి ఇట్లా ఉంటే ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చేసే సంప్రదాయమున్న రాజ స్థాన్లో కాంగ్రెస్ గెలవడం మాత్రం అనుమానమే! రాజస్థాన్‌ను కోల్పోతే ఆ లోటును తెలంగాణతో భర్తీ చేసుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతున్నది. కర్ణాటక ఎన్నికలు, బండి సంజయ్‌ను నాయకత్వం నుంచి తప్పించడం జరిగిన తర్వాత బీజేపీ బలహీనపడినట్టు కనిపించడం కూడా కాంగ్రెస్ ఆశలకు ఊపిరిపోసింది. ఇప్పటికే పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్పై సహజంగానే వ్యతిరేకత ఉంటుందనీ, అది తమకు కలిసివస్తుందనీ కూడా కాంగ్రెస్ అంచనా వేసుకున్నది. ఈ ప్రభుత్వ వ్యతిరేకత మీదనే ఆధారపడకుండా ఒక భారీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటించింది. గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నందువల్ల చేతి గుర్తు మీద వైకుంఠాన్ని చూపడానికి కూడా అది వెనకాడలేదు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆరు గ్యారెంటీలను, ఐదు డిక్లరేషన్లను, రెండు లక్షల ఉద్యోగాలను, ఇంకా అనేక హామీలను ప్రకటించింది. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు, తెలంగాణలో ఆరు గ్యారెంటీలు, ఏపీలో చంద్రబాబు ఇచ్చిన భవిష్యత్తు గ్యారెంటీ... ఈ గ్యారెంటీ మాటలు మేనిఫెస్టోల్లో కొత్తగా చేరినట్టు కనిపి స్తున్నవి. కాంగ్రెస్ – తెలుగుదేశం మధ్యన ఈ ‘గ్యారెంటీ’ లింకేదో ఉన్నట్టుగా కూడా కనిపిస్తున్నది. కాంగ్రెస్ లెక్కల ప్రకారం గడిచిన రెండు సంవత్సరాల్లో రాష్ట్ర ఆదాయ – వ్యయాలు దాదాపు సమానంగా ఉన్నాయి. రైతుబంధు, రైతు బంధు పెంపు కూలీలకు వర్తింపజేయడం, ఆసరా పెన్షన్ల రెట్టింపు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, మహాలక్ష్మి పథకం, ఆరోగ్యశ్రీ బీమా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్... ఇంత వరకు లెక్కేసినా అదనంగా ఏటా 60 నుంచి 70 వేల కోట్లు అవసర మవుతాయి. రైతులకు రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తే అదే 38 వేల కోట్లు. ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున పది లక్షల ఇళ్లు కేటాయిస్తే 50 వేల కోట్లవుతుంది. ఇలా ఒకసారి పెట్టే ఖర్చు ఈ రెండు పద్దులకే 88 వేల కోట్లు. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తెస్తారన్న ప్రశ్నకు కాంగ్రెస్ వాళ్లు కూడా చంద్రబాబు భాషలోనే సంపద సృష్టిస్తా మని చెబుతున్నారు. ఇంతకు ముందు ఐదేళ్లలో చంద్రబాబు ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు మాయం చేసిన ప్రజాధనం 5 లక్షల కోట్లుగా లెక్క తేలింది. కానీ సృష్టించిన సంపద మాత్రం కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ విష యాన్ని గమనంలో ఉంచుకోవలసింది. కర్ణాటకకు ఒక తటస్థ బృందాన్ని పంపించి ఐదు గ్యారెంటీల అమలుపై అధ్యయనం చేసి ఇక్కడ ఆ నివేదికను విడుదల చేసి ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి విశ్వస నీయత పెరిగేది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కర్ణాటక ఐదు గ్యారెంటీల్లో పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన పథకం ‘శక్తి’ మాత్రమే! ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం పేరే ‘శక్తి’. ‘అన్న భాగ్య’ ఇంకో పథకం. రేషన్ కార్డులున్న కుటుంబాల్లోని వారికి నెలకు 10 కిలోల బియ్యం ఇస్తామన్నది ఎన్నికల గ్యారెంటీ హామీ. ఐతే ఐదు కేజీలను మాత్రం ఇవ్వగలుగుతున్నారు. మరో ఐదు కేజీలకు డీబీటీ ద్వారా నగదు బదిలీ చేయాలని నిర్ణయించారు. ఈ నగదు బదిలీలో జాప్యం జరుగు తున్నదనీ, కొందరికి అందడం లేదనీ ఆరోప ణలు వస్తున్నాయి. ప్రతి మహిళకు నెలకు రెండు వేలు అందజేసే పథకం పేరు ‘గృహ లక్ష్మి’. రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభించారు. కోటీ ఆరు లక్షల మంది లబ్ధిదారుల్లో 85 నుంచి 90 శాతం మందికి వరసగా మూడు నెలలపాటు నగదు బదిలీ జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందజేసే ‘గృహజ్యోతి’ పథకం మాత్రం కర్ణాటకలో కల్లోలం సృష్టించింది. ఈ పథకం ప్రారంభానికి ముందు రైతుల పంపుసెట్లకు ఏడు గంటల విద్యుత్‌ను ఇచ్చేవారు. ఇప్పు డది నాలుగు నుంచి ఐదు గంటలకు పడిపోయింది. బెంగళూరు నగరంతో సహా పగటిపూట కరెంట్ కట్లు పెరిగిపోయాయి. ‘గృహజ్యోతి’ రాష్ట్రంలో చీకట్లు నింపిందనే విమ ర్శలు వినిపిస్తున్నాయి. ‘యువ నిధి’ పేరుతో నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేలు ఇస్తామని మేనిఫెస్టోలో గ్యారంటీ ఇచ్చారు. ఇంకా అది ప్రారంభానికి నోచుకోలేదు. విద్యుత్ సరఫరా అంశంపై అధికార బీఆర్ఎస్ పార్టీ సవాళ్లను కాంగ్రెస్ పార్టీ సమర్థంగా ఎదుర్కో లేకపోతున్నది. అధికార పార్టీ విసిరిన ‘పవర్’ ట్రాప్‌లో కాంగ్రెస్ పార్టీ అనవసరంగా చిక్కుకొని నష్టపోయిందనే అభిప్రాయం బలపడుతున్నది. రాష్ట్ర విభజనకు ముందు నుంచే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బలహీనపడిన పార్టీ పెద్దగా పుంజుకున్నట్టు ఇప్పటికీ కనిపించడం లేదు. బీజేపీ ప్రభ తగ్గిన తర్వాత దాని విస్తృతి కొంచెం పెరిగినట్టు కనిపిస్తున్నా... 90 నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీ ప్రధాన పోటీదారుగా ఉన్నది. సాధారణ మెజారిటీకి అవసరమైన యాభై శాతం స్ట్రయిక్ రేటును సాధించినప్పటికీ ఆ పార్టీ అవసరమైన సీట్లకు చాలా దూరంలోనే ఉండిపోతుంది. తాను గట్టిగా పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో మూడింట రెండు వంతుల స్ట్రయిక్ రేటు సాధించగలగాలి. ఆ స్థాయి స్ట్రయిక్ రేటును ‘వేవ్’గా పరిగణిస్తారు. అటువంటి ప్రభంజనం ఏదీ ఉన్నట్టుగా ఇప్పటి వరకూ ఏ ప్రతిష్ఠాత్మక సర్వే సంస్థ కూడా గుర్తించలేకపోయింది. అధికార పార్టీకి ఉన్న మరో సౌలభ్యం దానికి మజ్లిస్ మిత్రపక్షంగా ఉండటం! ఊరు మీద ఊరు పడ్డా మజ్లిస్ పార్టీ ఏడు సీట్లకు మాత్రం ఎటువంటి ఢోకా ఉండదు. బీఆర్ఎస్కు ఓ ఏడు సీట్లు తగ్గినా కూడా మజ్లిస్ తోడ్పాటుతో భర్తీ చేసుకోగలదు. యాభై శాతం స్ట్రయిక్ రేటుతో కూడా ఆ మాత్రం సీట్లను బీఆర్ఎస్ గెలుచుకోగలుగుతుంది. ఇంకో ఆశ్చర్యకరమైన సారూప్యతను కూడా మనం గమనించవచ్చు. రాష్ట్రంలో నలభయ్యేళ్ల లోపు ఓటర్లు ఎంతమంది ఉన్నారో దాదాపుగా అంతే సంఖ్యలో 40 ఏళ్లు దాటిన ఓటర్లు కూడా ఉన్నారు. వివిధ సర్వేల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాల ప్రకారం 40 ఏళ్ల లోపు సమూహంలో ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తున్నది. మార్పు కావాలన్న అభిప్రాయం ఈ సమూహంలో వినబడుతున్నది. నలభ య్యేళ్లు దాటిన వారిలో ప్రభుత్వ అనుకూలత బలంగా కనిపిస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌తో పాటు ఈసారి బీజేపీ కూడా పంచుకోవలసి ఉంటుంది. బీజేపీ ఓటర్లలో యువతరం ఓటర్లే గణనీయంగా ఉన్నారు. ఇది కూడా కాంగ్రెస్‌కు ప్రతికూలమైన అంశం. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 శాతం ఓట్లనే పొందిన కాషాయ పార్టీ ఇప్పుడు డబుల్ డిజిట్ ఓటింగ్ శాతాన్ని నమోదు చేసుకోబోతున్నదని శాస్త్రీయమైన సర్వేల్లో వెల్లడవుతున్నది. వ్యూహాత్మకంగా 25 స్థానాలపై కేంద్రీకరించి పరివార్ శక్తులు చాపకింద నీరులాగా పనిచేసుకుంటు న్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పది సీట్లకు తగ్గకుండా గెలవాలనీ, మిగిలిన పదిహేను చోట్ల రెండో స్థానంలోనైనా నిలవాలనీ బీజేపీ గట్టి పట్టుదలతో పనిచేస్తున్నది. ఈ ప్రయత్నాలు ఫలించినంత మేరకు కాంగ్రెస్ బలంలో కోత పడుతుంది. బీసీ వర్గాలకు ఇచ్చిన 34 సీట్ల హామీని కాంగ్రెస్ నిల బెట్టుకోలేక పోవడం కూడా ఒక మైనస్ పాయింట్. బీసీల్లో ఈ పరిణామం ఎటువంటి మార్పును తీసుకొస్తుందో చూడాలి. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆశాభావంతో ఉన్న వాళ్లు కూడా అది గెలిచే నియో జకవర్గాల పేర్లను 45కు మించి చెప్పలేక పోతున్నారు. విద్యావంతులైన నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమేర ప్రభుత్వ వ్యతిరేకత కన్పిస్తున్నది. సోషల్ మీడియాలో వీరు క్రియాశీలకంగా ఉన్నందు వల్ల కాంగ్రెస్ టాక్ కొంత గట్టిగా వినిపి స్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారీగా పరిస్థితులను బేరీజు వేసుకు న్నప్పుడు అధికార పార్టీ విజయానికి ఢోకా ఉన్నట్టు కనిపించడం లేదు. కాకపోతే బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఆవిర్భవించ వచ్చు. ఈరోజు వరకున్న పరిస్థితి – అడ్వాంటేజ్ బీఆర్ఎస్! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అద్భుత యుగం... అధ్వాన్న శకం!
ఒక అబద్ధం... ఒక అద్భుతం. ఒక ప్రాంత ప్రజాజీవనంలో ఈ రెండూ శత్రుసేనల్లా మోహరించి ఎదురెదురుగా నిలబడితే ఎలా ఉంటుంది? ఫ్రెంచి విప్లవ నేపథ్యకాలంలా ఉండవచ్చు. ఆ సందర్భం మీద చార్లెస్ డికెన్స్ రాసిన అద్భుతమైన నవలను చదువుతున్న అనుభూతి కలగవచ్చు. ‘ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్’ను తెలుగులోకి అనువదించిన తెన్నేటి సూరి విసిరిన ఈటెల్లాంటి మాటల్లో చెబితే... ‘అదొక వైభవోజ్జ్వల మహా యుగం, వల్లకాటి అధ్వాన్న శకం’ (ఇట్ వాస్ ది బెస్ట్ ఆఫ్ టైమ్స్, ఇట్ వాస్ ది వరస్ట్ ఆఫ్ టైమ్స్) అనిపించవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ–సామాజిక వ్యవస్థలో ఈ రెండు పార్శా్వలను ఇప్పుడు మనం స్పష్టంగా చూడవచ్చు. ఒక రివల్యూషన్ రెక్క విప్పుతున్న దృశ్యాన్ని చూడవచ్చు. ఒక రాజకీయ రెనిగేడ్కు ఇది చివరి యుద్ధకాలం. వాటర్లూ! ఆఖరి యుద్ధపు ఆర్తనాదాన్ని కూడా వినవచ్చు. ఈ వారం రోజుల్లో జరిగిన పరిణామాల్లోనూ ఈ విరోధ ఘటనల కొనసాగింపే కళ్లముందు సాక్షాత్కారమైంది. ఓటమి ఖాయమని తెలిసినా మన సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త వంచనను వదల్లేదు. అబద్ధాలను ఆపలేదు. మోసాన్ని మీసంలా తిప్పడం మానలేదు. కుట్రలు ఆగలేదు. అబద్ధ రాజకీయ శక్తి విశ్వరూపం దాల్చి రాళ్లవాన కురిపిస్తున్నా పాలక పార్టీ కూడా వెనక్కు తగ్గడం లేదు. అబద్ధ రాజకీయాల అనుబంధ మీడియా కూడా పాలక పార్టీపై విషపు రాతల విచ్చుకత్తుల్ని విసురుతూనే ఉన్నది. రహదారి గుంతల కోసం దుర్భిణీలేసుకొని వెతుకుతూనే ఉన్నది. అసత్య కథనాల అతుకులబొంతల్ని అచ్చేసి పంచుతూనే ఉన్నది. అయినా అద్భుతం ముందడుగే వేసింది. ఈ వారం మరో మహాద్భుతం. ఫ్రెంచి విప్లవ నినాదా లైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను సమష్టిగా సంధించి విసిరిన సాధికారతా బాణం మరో ఘనవిజయాన్ని సాధించింది. అబద్ధ రాజకీయశక్తి ఈ వారం రోజులుగా ఏం చేస్తున్నది? రోడ్ నంబర్ 65, జూబ్లీహిల్స్‌లో విశ్రాంతి మాత్రం తీసుకోవడం లేదు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నది. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అపవిత్ర రాజకీయ రహస్య భేటీల్లో మునిగితేలుతున్నది. గత ఆదివారం నాడు నగరం నిద్రపోయే సమయంలో ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తన జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డితో సమావేశమైనట్టు భోగట్టా. ఓటుకు కోట్లు గుమ్మరిస్తూ వీడియో సాక్షిగా ఒకరు, ఆడియో సాక్షిగా ఒకరూ అడ్డంగా దొరికిపోయిన ఇద్దరు సహనిందితులు లోకకల్యాణం కోసమే కలుసుకున్నారంటే నమ్మగలమా? కంటికి ఆపరేషన్ కావాలంటూ కోర్టు వారిని నమ్మించి ఆయన మెడికల్ బెయిల్‌పై బయటికొచ్చారు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. అందుకు సాక్ష్యంగా ఓ కన్నుకు బ్యాండేజీతో ఒంటికన్ను చూపుతో ఆయన ఫొటోలను కూడా విడుదల చేశారు. కోర్టు వారి అనుమతి ఈనెల 28 దాకా ఉన్నందున అప్పటిదాకా విశ్రాంతి తీసుకోవాలి. ఇతర వైద్య సమస్యలేమైనా ఉంటే పరీక్షలు చేయించుకోవాలి. ఈ క్లాజు ప్రకారం ఆయన ఏఐజీ అనే ఓ ప్రసిద్ధ కార్పొరేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. మెజీషియన్ టోపీలోంచి ఓ కుందేలు పిల్ల చెంగున దూకినట్టుగా ఆస్పత్రి నుంచి ఓ రిపోర్టు కూడా వెలువడింది. చంద్రబాబుకు గుండెజబ్బు, చర్మవ్యాధి ఉన్నాయనీ, ఇవి పెరగకుండా మూడు నెలలపాటు నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉండాలని ఆ రిపోర్టు సూచించింది. ఈ రిపోర్టును రెగ్యులర్ బెయిల్ కోసం కూడా వాడుకున్నారు. మూడు నెలలపాటు జైలుకెళ్లకుండా ఉండటం ఓకే. మరి ఎన్నికలు సమీపి స్తున్న తరుణంలో ప్రచారం చేసుకోకుండా ఇంట్లో పడుకుంటే ఎలా? ఈ రిపోర్టు శాపంగా మారదా? అందుకే ఆస్పత్రివారు అదే రిపోర్టులో శాప విమోచన మార్గాన్ని కూడా ఉపదేశించారు. ఆయన ప్రజా జీవితంలో నిక్షేపంగా తిరగొచ్చు. కాకపోతే ఆయన కాన్వాయ్‌లో ఒక అంబులెన్స్,అందులో వైద్యులు ఉండాలంట! అదెంత భాగ్యం? ఓ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసుకుంటారు. కావాలంటే అదే ఆస్పత్రివారు సమకూర్చవచ్చు. బారా ఖూన్ మాఫ్. హాయిగా ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు. జైలుకు మాత్రమే వెళ్లకూడదు! ఈ మెడికల్ రిపోర్టు మీద వైద్యరంగంలోని ప్రముఖులు చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉండ వలసినంత అవసరం ఆ రిపోర్టు ప్రకారమే లేదని వారు చెబుతున్నారు. సీటీ క్యాల్షియమ్ స్కోర్ అన్నది గుండె జబ్బు పెరుగుదల సూచిక కాదని, కేవలం క్యాల్షియమ్ పెరుగుదలకు మాత్రమే సూచిక అని వారి అభిప్రాయం. సీటీ క్యాల్షియం స్కోర్‌లో బాగా పెరుగుదల ఉన్నట్లయితే సీటీ యాంజియో, లేదా స్ట్రెస్ థాలియమ్ వంటి పరీక్షలతో గుండె జబ్బు తీవ్రత ఏ మేరకు ఉందో తెలుసుకుంటారు. ఫిబ్రవరి 23న చేసిన యాంజియో పరీక్షలో గుండెజబ్బు ఉన్నట్టు గుర్తించినట్టు ఉన్నది. ఒకవేళ అది ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నట్లయితే అప్పుడే స్టెంట్‌ను అమర్చడం గానీ, బైపాస్ సర్జరీ చేయడం గానీ చేసేవారు. అటువంటిదేమీ చేయలేదు. 2019తో పోల్చితే ఇప్పుడు క్యాల్షియమ్ పెరిగిందని రిపోర్టులో పేర్కొన్నారు. మరి ఫిబ్రవరి 23 నాడు యాంజియో చేసినప్పుడు క్యాల్షియం స్కోరు ఎంత ఉన్నది? రిపోర్టులో దాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? ఆ రోజున కూడా ఇప్పుడున్న స్కోరే ఉన్నదా? అటువంటప్పుడు నాడు అవసరం లేని నిరంతర వైద్య పర్యవేక్షణ ఇప్పుడెందుకు అవసరమవుతున్నది?... ఇత్యాది ప్రశ్నలపై ఇప్పుడు హైదరాబాద్ మెడికల్ సర్కిల్స్‌లో విస్తృతమైన చర్చ జరుగుతున్నది. అబద్ధాలను వండి వార్చడం యెల్లో మీడియాకూ, వారి పార్టీ అధి నేతకూ సహజ లక్షణమనే సంగతి కొత్తగా చెప్పనవసరం లేదు. సాక్షాత్తూ న్యాయస్థానాల్లోనే తప్పుడు సమాచారమివ్వడంలో వారు రికార్డులు సృష్టించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కోర్టు మెట్లెక్కినప్పటి నుంచి యెల్లో కూటమి ఎన్ని వంకర్లు తిరిగిందో చూస్తూనే ఉన్నాము. తాము తప్పు చేయలేదనే అంశాన్ని వాదించకుండా టెక్నికల్ గ్రౌండ్స్‌పై కేసు కొట్టేయమని దబాయించడాన్ని కూడా చూశాము. న్యాయస్థానాల్లో అబద్ధాలను గెలిపించడం కోసం కోట్ల రూపాయలను వెచ్చించి, ఖరీదైన లాయర్లను పెట్టు కోవడం చూశాము. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని మెడికల్ బెయిల్ సంపాదించి 14 గంటలపాటు ఒక ఆర్గనైజ్డ్ రోడ్ షోలో పాల్గొన్న వైనాన్ని కూడా ప్రజలంతా గమనించారు. బెయిల్‌పై ‘విశ్రాంతి’లో ఉన్న బాబు నిశిరాత్రి వేళల్లో కూడా రహస్య రాజకీయాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కూడా ఆయన వేలుపెట్టిన సంగతి కనిపిస్తూనే ఉన్నది. తన శిష్యుడు పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నందువల్ల కాంగ్రెస్‌ను గెలిపించాలనే ఉబలాటంలో ఆయన పెద్ద ఎత్తున నిధులను సమకూరుస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ గనక తెలంగాణలో గెలిస్తే అన్ని రకాలుగా తనకు వెసులుబాటుగా ఉంటుందని తనను కలిసిన వారందరితోనూ చెబుతున్నారట! అదే ఊపుతో ఏపీ పార్టీ వ్యవహారాలను సైతం రహస్య ఎజెండాతో ఆయన నడిపిస్తున్నారు. జనసేనతో పొత్తు కుదిరి ఒక మినీ మేనిఫెస్టోను జాయింటుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ పొత్తు ధర్మానికి విరుద్ధంగా జనసేనకు అంతో ఇంతో కేడర్ వున్న నియోజక వర్గాల్లో గొడవలకు దిగేలా పార్టీ కేడర్‌ను ఆయనే రెచ్చ గొడుతున్నట్టు సమాచారం. జనసేన టిక్కెట్ ఆశిస్తున్న వారి ఆశలపై ఇప్పటి నుంచే నీళ్లు చల్లాలనేది ఆయన వ్యూహం. తెలంగాణలో జనసేనను బీజేపీ వాళ్లు 8 సీట్లకే పరిమితం చేశారు. ఆంధ్రాలో మహా అయితే ఇంకో నాలుగైదు సీట్లు అదనంగా ఇద్దామని ఆయన భావిస్తున్నట్టు వినికిడి. తెలంగాణలో పోటీ చేస్తున్న ఎనిమిది నియోజక వర్గాల్లో సైతం పవన్ కల్యాణ్ ఇంతవరకు ప్రచారంలో పాల్గొనలేదు. దీన్నిబట్టే ఏపీలో కూడా ఏ డజన్ సీట్లకో పవన్ ఒప్పేసుకోవచ్చునంటూ జనసేన శ్రేణులు కలవరపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, మహిళల సాధికారత కోసం గత నాలుగేళ్లుగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం శుక్రవారం నాడు మరో గొప్ప ముందడుగు వేసింది. 35 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములపై పేదసాదలకు ప్రభుత్వం ఆ రోజున యాజమాన్య హక్కులను ప్రకటించింది. ఈ దేశంలో సాగుభూముల కోసం జరిగిన పోరాటాలెన్ని? ఆ పోరాటాల్లో అసువులు బాసిన అమర వీరులు ఎన్ని వేలమంది? తెలంగాణా సాయుధ పోరాటం ఫలితంగా పోలీస్ యాక్షన్ జరిగేలోగా పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారు. పోలీస్ యాక్షన్ తర్వాత అందులో సింహభాగం మళ్లీ భూస్వాముల పరమైంది. భూదానోద్యమం పేరుతో ఆచార్య వినోబా భావే కొంత భూమిని తిరిగి రైతులకు ఇప్పించగలిగారు. 1973లో భూ సంస్కరణల చట్టాన్ని అప్పటి ముఖ్యమంత్రి పీవీ నర్సింహారావు కొంత చిత్తశుద్ధితో అమలు చేయడానికి ప్రయత్నించినందువల్ల పేదలకు మేలు జరిగింది. అంతా కలిపి నాటి ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన భూపంపిణీ ఇరవై లక్షల ఎకరాలను దాటలేదు. దేశంలో భూపంపిణీ అత్యంత సమర్థంగా జరిగిన రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉన్నది. జ్యోతిబసు ప్రభుత్వం 35 లక్షల ఎకరాలను పంపిణీ చేసింది. దీని ఫలితంగా ఆ రాష్ట్రంలో 35 సంవత్సరాల పాటు సీపీఎం ప్రభుత్వం రాజ్యం చేసింది. ఈ భూపంపిణీ వెనుక దశాబ్దాల పాటు సాగిన రైతు ఉద్యమాల నేపథ్యం ఉన్నది. బ్రిటీష్ కాలంలో జరిగిన తేభాగా రైతు పోరాటం ఉన్నది. ఇప్పుడు ఏ పోరాటం లేకుండా ఒక రక్తరహిత విప్లవాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం విజయవంతం చేసి, 35 లక్షల ఎకరాలపై పేదసాదలకు యాజ మాన్య హక్కులు కట్టబెట్టింది. ఇటువంటి చర్యలు పెత్తందార్లు అస్సలు సహించలేరని నూజివీడు సభలో జగన్ ముందుగానే ఊహించారు. ఆయన ఊహించినట్టే యెల్లో మీడియా నోళ్లు ‘వెవ్వెవ్వే’ అనడం మొదలుపెట్టాయి. అసైన్డ్ భూములకు హక్కులు కల్పించడం ఏం గొప్ప అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. భూమి దున్నడం వేరు. దున్నేవాడిదే భూమి కావడం వేరు. ఈ భూప్రపంచం మీద జరిగిన రైతాంగ పోరాటాలన్నింటినీ నడిపించిన రణన్నినాదం – దున్నేవాడిదే భూమి! ఆ నినా దాన్ని సార్థకం చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజా సాధికారత దిశలో సాధించిన ఒక గొప్ప విజయం. పెత్తందారీ కుతంత్ర రాజకీయం ఉడికి పోతున్నది. ఏప్రిల్‌లో జరిగే ఆఖరి యుద్ధానికి కుట్రలు రచిస్తున్నది. తొలి గెలుపులతో ఉత్సాహం నింపుకున్న సాధికార శక్తులు అంతిమ విజయం కోసం సర్వసన్నద్ధంగా ఉన్నాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పనికొచ్చే చర్చలేనా?!
ఎటుచూసినా ఘర్షణలు, బెదిరింపులే రివాజుగా మారిన ప్రపంచంలో... ఏడాదిగా మాటా మంతీ లేని రెండు పెద్ద దేశాలు ఒకచోట కూర్చుని చర్చించుకున్నాయంటే కాస్త వింతగానే అనిపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య బుధవారం కాలిఫోర్నియాలో ద్వైపాక్షిక చర్చలు జరగటం, అందులో పురోగతి సాధించామని ఇద్దరూ చెప్పటం ఉపశమనం కలిగించే పరిణామమే. ఉపశమనం మాట అటుంచి ఇద్దరూ కలవటమే ఇప్పుడు పెద్ద వార్త. అంతకు మించి ఎవరూ పెద్దగా ఆశించలేదు. ఇరు దేశాల విభేదాలతో పోలిస్తే సాధించింది అతి స్వల్పం. వర్తమాన ఉద్రిక్త పరిస్థితుల్లో ఎంతోకొంత సాధించామని చెప్పుకోవటం బైడెన్, జిన్పింగ్లిద్దరికీ అవసరం. రష్యా–ఉక్రెయిన్ల మధ్య దాదాపు రెండేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. కనుచూపు మేరలో అది చల్లారేలా లేదు. ఈలోగా గత నెలలో హమాస్ సాగించిన నరమేథంతో గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇప్పటికి దాదాపు 12,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఏకపక్ష దాడులకు స్వస్తి చెప్పాలన్న వినతులను ఇజ్రాయెల్ బేఖాతరు చేస్తోంది. పర్యవ సానంగా పశ్చిమాసియా ఉద్రిక్తంగా మారింది. ఈ రెండుచోట్లా కీలకపాత్ర పోషిస్తున్న రష్యా, ఇరాన్‌లను ఎలా ఎదుర్కొనాలో తెలియని అయోమయంలో అమెరికా వుంది. జో బైడెన్‌కు వచ్చే ఏడాది దేశాధ్యక్ష ఎన్నికలు రాబోతున్నాయి. ఆయన మరోసారి అదృష్టం పరీక్షించుకోవాలన్న ఆరాటంలో వున్నారు. అటు జిన్‌పింగ్‌కు సమస్యలు తక్కువేం లేవు. అమెరికాతో ఉద్రిక్తతలు పెరిగాక విదేశీ పెట్టుబడులు తరిగిపోయాయి. దశాబ్దాలపాటు ఎడతెగకుండా సాగిన ఆర్థిక పురోగతి మందగించింది. మితిమీరిన రుణభారంతో, రియలెస్టేట్ కుప్పకూలడంతో, ఎగుమతులు దిగజారటంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నేలచూపులు చూస్తోంది. ఇప్పటికే అమెరికా విధించిన ఆంక్షలు మరింత పెరగకుండా చూడటం, సాంకేతికత విక్రయంపై ఆ దేశం మరిన్ని ఆంక్షలు పెట్టకుండా చూసు కోవటం చైనాకు తక్షణావసరం. వివాదాలకు ఎక్కడో ఒకచోట ముగింపు లేకపోతే చైనా మరింత గడ్డుస్థితిలో పడుతుంది. నిజానికి దాన్ని దృష్టిలో వుంచుకునే ‘దుందుడుకు దౌత్యం’లో సిద్ధహస్తులైన చైనా విదేశాంగమంత్రి కిన్ గాంగ్, రక్షణమంత్రి జనరల్ లీ షాంగ్ఫూలను హఠాత్తుగా తప్పించింది. వారిద్దరి ఆచూకీ ఇప్పటికైతే తెలియదు. ఆ దేశాల అంతర్గత సమస్యలు, ఆ రెండింటిమధ్యా వున్న వివాదాల మాటెలావున్నా ఇప్పుడున్న అనిశ్చితిలో అమెరికా, చైనా రెండూ ముఖాముఖి చర్చించుకోవటం ప్రపంచానికి చాలా అవసరం. ఎందుకంటే ఆ రెండింటి మధ్యా తలెత్తే యుద్ధం అన్ని దేశాలకూ పెనుముప్పుగా పరిణమిస్తుంది. ఆర్థిక వ్యవస్థలన్నీ తలకిందులవుతాయి. నాలుగు గంటలపాటు జరిగిన చర్చల అనంతరం బైడెన్, జిన్‌పింగ్‌లిద్దరూ సైనిక ఉద్రిక్తతలు తలెత్తిన పక్షంలో నేరుగా సంభాషించుకునే సదుపాయాన్ని పునరుద్ధరించుకోవటానికి అంగీకరించినట్టు ప్రకటించారు. అప్పటి ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ నిరుడు తైవాన్ పర్యటించటాన్ని ఖండిస్తూ చైనా దీనికి స్వస్తిపలికింది. ఇది చెప్పుకోదగ్గ పురోగతే. అలాగే పర్యావరణ పరిరక్షణకు కలిసి పనిచేయాలనుకోవటం, పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో సమష్టిగా కృషి చేయాలనుకోవటం కూడా మంచిదే. అమెరికా, చైనా రెండూ ప్రపంచాన్ని కాలుష్యం బారిన పడేస్తున్న దేశాల జాబితాలో ఒకటి, రెండు స్థానాల్లో వున్నాయి. కాలుష్యంలో ఇద్దరి వాటా 38 శాతంగా వుంది. పారిశ్రామికీకరణకు ముందున్న ఉష్ణోగ్రతలకన్నా 1.5 డిగ్రీల సెల్సియస్ మించకుండా చూడాలన్నది పారిస్ ఒప్పందం సారాంశం. మప్పు ముంచు కొస్తున్నా రెండు దేశాలూ అవతలి పక్షం అమలు చేశాకే ముందుకు కదులుతామని మొండికేయటంతో ఎలాంటి పురోగతీ లేకుండా పోయింది. ఇప్పటికే ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.2 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి. భూగోళం నలుమూలలా కార్చిచ్చులు, కరువులు, వరదలు వంటి వైపరీత్యాలు తలెత్తు తున్నాయి. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి సారిస్తామనటం మంచిదే. అయితే కొత్తగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు స్థాపించి మరో 366 గిగావాట్ల విద్యుదుత్పాదన కు చైనా వేసుకున్న ప్రణాళికల మాటేమిటి? దాన్ని రద్దు చేయటానికి ఆ దేశం అంగీకరించిందా? ఆ ఊసే లేనప్పుడు ఇలాంటి కంటితుడుపు ప్రకటనలవల్ల ఒరిగేదేమిటి? కృత్రిమ మేధకు సంబంధించిన సాంకేతికతల విషయంలో పారదర్శకంగా వుండాలని, పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాల అధినేతలూ నిర్ణయించారు. కృత్రిమ మేధను సైనిక ప్రయోజనాల కోసం వినియోగించటం మొదలు పెడితే దాని పర్యవసానాలు తీవ్రంగా వుంటాయి. దేశాలమధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడే ప్రమాదం వుంటుంది. అయితే ఈ అంశాలన్నిటిపైనా ఒప్పందాలేమీ లేవు. కేవలం నోటి మాటలే. వాటికి మున్ముందు రెండు దేశాలూ ఏపాటి విలువిస్తాయో తెలియదు. సమావేశానంతరం విడివిడి ప్రకటనలతో సరి పెట్టుకోవటం, కొన్ని గంటలు గడిచాక జిన్‌పింగ్‌ను ఉద్దేశించి ‘ఆయనొక నియంత’ అంటూ బైడెన్ వ్యాఖ్యానించటం, దానికి చైనా విదేశాంగ ప్రతినిధి అభ్యంతరం తెలపటం వాస్తవస్థితికి అద్దం పడు తోంది. తైవాన్, ఫిలిప్పీన్స్‌లతో చైనా లడాయి సరేసరి. తైవాన్‌కు 10,600 కోట్ల డాలర్ల సైనిక సాయం అందించటానికి సంబంధించిన తీర్మానం అమెరికన్ కాంగ్రెస్‌లో పెండింగ్‌లో వుంది. అది సాకారమైతే చైనాతో సంబంధాలు మొదటికొస్తాయి. ఇన్ని అవాంతరాలున్నా అధినేతలిద్దరూ ముఖా ముఖీ మాట్లాడుకోవటం మంచిదే. ఇది ఉద్రిక్తతల ఉపశమనానికి తోడ్పడాలని ఆశించాలి.