Editorial
-
ఒక్క అడుగు... ఒకే ఒక్క అడుగు!
అవును. 2023 ప్రపంచ వన్డే క్రికెట్ కప్‌కూ, భారత క్రికెట్ జట్టుకూ మధ్య మిగిలిన దూరం ఇక ఒకే ఒక్క అడుగు. 2011లో ఆఖరుసారిగా కప్ గెలిచిన తర్వాత మళ్ళీ పన్నెండేళ్ళకు తొలిసారిగా భారత జట్టు ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరడం అభిమానుల్లో ఆనందోత్సాహాల్ని నింపుతోంది. లక్ష్యం చాలా చేరువగా కనిపిస్తుండడంతో అందరిలో ఆశలు రేపుతోంది. బుధవారం ముంబయ్‌లోని వాంఖెడే స్టేడియమ్లో భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య ఒక దశ వరకు పోటాపోటీగా సాగిన తొలి సెమీ ఫైనల్లో మన జట్టు విజయం సాధించిన తీరు మునుపెన్నడూ లేని ఆత్మవిశ్వాసాన్ని అందిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో అప్రతిహతంగా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా ఆదివారంఅహ్మదాబాద్‌లో మరొక్కసారి చేసే ఫైనల్ ఇంద్రజాలానికై అందరూ ఎదురుచూస్తున్నారు. 2011లో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత నుంచి చూస్తే గడచిన 2015, 2019 టోర్నీల్లో కన్నా ఈసారే భారత జట్టు విజయావకాశాలు మెరుగ్గా, అధికంగా ఉన్నాయని మొదటి నుంచి క్రికెట్ పండితుల మాట. నిరుడు టీ–20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ నుంచి అవమానకరమైన రీతిలో వెనుదిరిగిన జట్టు ఏడాది తిరిగేసరికల్లా ఇంత బలమైన జట్టుగా రూపొందడం ఒక రకంగా అనూహ్యమే. ఆ ఘోర ఓటమి తర్వాత జట్టును పటిష్ఠంగా తీర్చిదిద్దడం వెనుక కెప్టెన్ రోహిత్ శర్మ పట్టుదల, కోచ్ రాహుల్ ద్రావిడ్ కృషి, ఆటగాళ్ళ నిరంతర శ్రమ దాగి ఉన్నాయి. మునుపటి రెండు కప్‌ల కన్నా ఈసారి భారత జట్టు మరింత స్థిరంగా, నిలకడగా కనిపిస్తోంది. ఆటగాళ్ళందరూ కలసి కట్టుగా సాగుతూ, వ్యక్తులుగా కన్నా ఒక జట్టుగా ప్రతిభా ప్రదర్శన చేయడం కలిసొస్తోంది. జట్టు సారథిగా రోహిత్ శర్మ ఆ విషయంలో అందరికీ ఆదర్శమయ్యాడు. ఈ టోర్నీలో కనీసం 3 సందర్భాల్లో వ్యక్తిగత మైలురాళ్ళకు దగ్గర ఉన్నా, దాని కన్నా జట్టు ప్రయోజనాల కోసం వేగంగా పరుగులు చేయడం మీదే దృష్టి పెట్టి, ఆ క్రమంలో ఔటవడమే అందుకు ఉదాహరణ. ఓపెనర్‌గా పరుగుల వరదతో ప్రత్యర్థి బౌలర్ల మానసిక స్థైర్యాన్ని చిత్తు చేసి, భారీ ఇన్నింగ్స్‌కు ఆయన పునాది వేస్తూ వస్తున్నారు. ఈ టోర్నీలో రోహిత్ శతకాలేమీ సాధించకపోయి ఉండవచ్చు. 124.15 స్ట్రైకింగ్ రేట్‌తో 550 పరుగులు చేసి, అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నిలవడం విశేషం. సాధారణంగా వ్యక్తిగత విజయాలు, ప్రతిష్ఠను ఆశించే, ఆరాధించే చోట ఇది అసాధారణం. జట్టులో ఎవరి పాత్ర వారికి నిర్దిష్టంగా నిర్వచించడంలోనూ తెలివైన వ్యూహం, లక్ష్యంపై గురి కనిపిస్తున్నాయి. బుధవారం నాటి సెమీస్ అందుకు మంచి ఉదాహరణ. ఓపెనర్లు వేసిన పునాదిని పటిష్ఠం చేయడంలో కోహ్లీ, శరవేగంతో పరుగుల వరద పారించడంలో శ్రేయాస్ అయ్యర్, కొనసాగింపుగా రాహుల్, బౌలింగ్‌లో ప్రత్యర్థుల భాగస్వామ్యాన్ని ఛేదించడానికి పేసర్లు బుమ్రా, షమీ, సిరాజ్‌ల త్రయం, స్పిన్నర్లుగా కుల్దీప్, జడేజాలు సమర్థంగా పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా జట్టులో ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తుండడం విశేషం. శుభ్‌మన్ గిల్ లాంటి వారి పాత్ర తక్కువేమీ కాదు. బ్యాటింగ్‌లో కోహ్లీ, శ్రేయాస్‌లు వరుసగా సెంచరీల మీద సెంచరీలు కొడుతు న్నారు. సెమీస్‌లోనే వన్డేల్లో శతకాల అర్ధ సెంచరీ పూర్తి చేసి, బ్యాట్స్మన్ల కింగ్ కోహ్లీ అయ్యాడు. ఆరాధ్య దైవమైన సచిన్ చూస్తుండగా, అతని రికార్డును అధిగమిస్తూ ఈ కొత్త చరిత్ర సృష్టించాడు. ఈసారి భారత బౌలర్ల అమోఘ ప్రతిభా ప్రదర్శన మళ్ళీ 1983 నాటి కపిల్ డెవిల్స్‌ను తలపిస్తోంది. ఈ వరల్డ్ కప్‌లో మొదటి 4 మ్యాచ్‌ల తర్వాత ఆలస్యంగా తుది జట్టులోకి వచ్చిన పేస్‌బౌలర్ షమీ ఇప్పటికే ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టి, వికెట్ల వేటగాడిగా నిలిచాడు. వికెట్లలో అర్ధశతకం పూర్తిచేశాడు. ప్రపంచ కప్ చరిత్రలో మరి ఏ ఇతర భారతీయ ఆటగాడికీ లేని రీతిలో 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టిన అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి, నంబర్ 1గా నిలిచాడు. లయ తప్పకుండా, పిచ్ మీద వికెట్ల గురి తప్పకుండా, పరుగు వేగం తగ్గకుండా ప్రత్యర్థులపై పులిలా విరుచుకుపడుతున్న షమి ఈ భారత జట్టు అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం. ఈ 19న జరిగే ఫైనల్లో షమీ ఇలాగే విజృంభిస్తే మనం కప్పు కొట్టడం కష్టమేమీ కాదు. గురువారం నాటి రెండో సెమీఫైనల్లో ఎప్పటిలానే సెమీస్ శాపం తప్పించుకోలేక సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో తడబడింది. ఈ టోర్నీలో మొదట తడబడినా తర్వాత నిలబడిన ఆస్ట్రేలియా ఆఖరికి తక్కువ పరుగుల లక్ష్యాన్ని సైతం శ్రమించి, గెలిచింది. ఓడితేనేం పోరాటస్ఫూర్తిలో సౌతాఫ్రికా జనం మనసు గెలిచింది. అయిదుగురు రెగ్యులర్ బౌలర్లతోనే ప్రయోగం చేస్తున్న భారత్, అయిదుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన బలమైన ఆసీస్‌తో మహాయుద్ధానికి సమస్త శక్తియుక్తులూ కేంద్రీకరించాలి. అయితే, ఇప్పటికే భారత టాప్ 5 బ్యాట్స్మన్లు 65.8 సగటుతో 2570 పరుగులు సాధించారు. 2007 నాటి ఆసీస్ జట్టు బ్యాట్స్మన్ల సగటు కన్నా ఇది ఎక్కువ. అలాగే ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లలో ఓడిన ఆసీస్ ఆటను గమనిస్తే ఆ జట్టు మరీ అజేయమైనదేం కాదనీ అర్థమవుతుంది. అందుకే, వరల్డ్ కప్ వేదికపై 1983లో అనామకంగా వెళ్ళి అద్భుతం చేసిన∙కపిల్ సేన, 2011లో ఒత్తిడిని తట్టుకొని అంచనాలందుకున్న ధోనీ అండ్ కో తర్వాత ముచ్చటగా మూడోసారి ఇప్పుడు రోహిత్ శర్మ అండ్ టీమ్ ఆ ఘనత సాధిస్తే ఆశ్చర్యం లేదు. పుష్కరకాలం నిరీక్షణ ఫలిస్తే శతకోటి భారతీయులకు అంతకన్నా ఆనందమూ లేదు. అనూహ్య ఘటనలు జరిగితే తప్ప ఆతిథ్య దేశమైన మనమే ఈ ఆదివారం ఐసీసీ వరల్డ్ కప్ అందుకోవచ్చు. ఎందుకంటే– ప్రతిసారి కన్నా భిన్నంగా ఈసారి మనది వట్టి ఆశ, అభిమానుల ప్రార్థన కాదు... అంతకు మించిన ప్రతిభా ప్రదర్శన, ఆత్మవిశ్వాస ప్రకటన! -
ఆదేశాలేనా? ఆచరణ లేదా?
ఆదేశాలిచ్చినా ఆచరణలో పెట్టకపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. వాయు కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాజధాని ఢిల్లీలోనే కాక, దేశవ్యాప్తంగా నిర్ణీత నిషేధిత రసాయనాలున్న టపాసులను నిషేధిస్తున్నట్టు సుప్రీమ్ కోర్టు గతవారం ఆదేశాలిచ్చింది. కానీ, జరిగింది మాత్రం వేరు. ఇష్టా రాజ్యంగా టపాసులు కాల్చడం కొనసాగింది. ఎప్పటిలానే దట్టమైన పొగలో ఢిల్లీ కూరుకుపోయింది. దీపావళి వేళ ఒక్క ఢిల్లీలోనే కాక దేశవ్యాప్తంగా వాయు, శబ్ద కాలుష్యాలు నియంత్రణ కాకపోగా మరింత పెరిగాయి. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా సహా 7 నగరాల్లో కాలుష్యస్థాయి ఘనపు మీటర్‌కు 500 మైక్రోగ్రాముల స్థాయిని దాటేసినట్టు గంటల వారీగా చేసిన విశ్లేషణలో వెల్లడైంది. హానికారకమైన నిర్ణీత టపాసులు కాల్చడంపై నిషేధం అమలులో ప్రభుత్వాల వైఫల్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఢిల్లీ, గురుగ్రామ్, చండీగఢ్, కోల్‌కతా, ముంబయ్, తదితర నగరాల్లో నిషేధిత టపాసులు సైతం నిల్వచేశారు, అమ్మారు, బాహాటంగా వాటిని కాల్చారు. కోర్టు ఆదేశాలు సైతం గాలికి పోవడం విషాదమే. అయితే, ప్రజల్లో చైతన్యం తీసుకురాకుండా, వారిని మానసికంగా సంసిద్ధం చేయకుండా, ప్రభుత్వాల ఆచరణలో చిత్తశుద్ధి లేకుండా... ఎవరెన్ని ఆదేశాలు జారీ చేసినా ప్రయోజనం ఉండదని మరోసారి రుజువైంది. దీపావళి ముగిసి మూణ్ణాళ్ళయినా ఢిల్లీలో వాయు నాణ్యత ఇప్పటికీ ప్రమాదకర స్థాయిలోనే ఉందని వార్త. నిజానికి, దేశ రాజధానిలో టపాసులపై నిషేధం పెట్టడం ఇదేమీ తొలిసారి కాదు. వాటి అమ్మకాన్ని దేశ రాజధానిలో నిషేధించాల్సిందిగా 2018 అక్టోబర్‌లో సైతం సుప్రీమ్ కోర్ట్ అప్పటి ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ‘పర్యావరణ హిత’ (గ్రీన్) టపాసులు, తక్కువ ఉద్గారాలు వెలువరించే ‘మెరుగైన’ టపాసులకు మినహాయింపు నిచ్చింది. అప్పుడూ ఆ మాట ఆదేశాలకే పరిమితమైంది తప్ప ఆచరణకు నోచుకోలేదు. అప్పట్లో కొద్దిరోజులకే... తక్కువ కాలుష్యం కలిగించే టపాసులను అభివృద్ధి చేసినట్టు ‘కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్’ ప్రకటించింది. సాంప్రదాయిక టపాసుల కన్నా ఇవి చౌక అనీ చెప్పింది. వాటి అతీగతీ తెలీదు. అంతకన్నా ఘోరమేంటంటే, చైనా నుంచి దిగుమతి చేసుకున్న టపాసులు ‘మేడిన్ ఇండియా’ అంటూ నకిలీ ముద్రతో మార్కెట్లో యథేచ్ఛగా తిరుగుతున్నాయి. వాటిని ఆపే ప్రయత్నాలు సమర్థంగా జరగడం లేదు. అలాగే, ఇటీవల రెండు గంటలే టపాసులు కాల్చడానికి అనుమతిస్తున్నట్టు ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. ఆ ఆదేశాలూ ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. వెరసి, కాలుష్య నియంత్రణపై మాటలే తప్ప చేతలు కనిపించని వైనం సహజంగానే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెర తీస్తోంది. టపాసుల నిషేధంపై ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ విమర్శిస్తోంది. బీజేపీ నేతాగణం, బీజేపీ పాలిత రాష్ట్రాలే ఆచారాల పేరు చెప్పి టపాసులు కాల్చేలా ప్రజల్ని కావాలని రెచ్చగొడుతున్నాయని ‘ఆప్’ ఆరోపిస్తోంది. పరస్పర నిందారోపణలు పక్కనపెడితే, కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు. దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణ చర్యలు ఫలితమివ్వకపోవడానికి... ఢిల్లీకీ, పొరుగు రాష్ట్రాలకూ మధ్య సమన్వయ లోపం ఓ ప్రధాన కారణం. ఇక, ఢిల్లీలోని ‘ఆప్’ ప్రభుత్వ వైఫల్యాలు సరేసరి. పండుగ వచ్చే ముందు ప్రతిసారీ ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేయడం, మార్గదర్శకాలు జారీ చేయడం షరా మామూలే. అవన్నీ వట్టి కంటి తుడుపు చర్యలే అవుతున్నాయి. ఏటా ఈ సీజన్లో ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పంట వ్యర్థాల దహనంలోనూ ఇదే జరుగుతోంది. చట్టాలు చేసినా సరే పంజాబ్, హర్యానా సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం ఆగింది లేదు. ఒక్క పంజాబ్‌లోనే సెప్టెంబర్ 15 నుంచి ఇప్పటికి 28 వేలకు పైగా దహనాల ఘటనలు జరిగినట్టు లెక్క. ఫలితంగా హర్యానా లాంటి చోట్ల వాయు నాణ్యతా సూచి ‘అల్ప’, ‘అత్యల్ప’ స్థాయుల్లోనే కొనసాగుతోంది. అనారోగ్యాన్ని మరింత పెంచే ఈ కాలుష్య విషాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ నేత సోనియా లాంటి వారు నిరుడు గోవా, ఈసారి జైపూర్‌లకు తరలిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ పర్యావరణ పరిరక్షణ పట్ల మన చిత్తశుద్ధి లేమికి ప్రతీకలు. పంట వ్యర్థాలు, దీపావళి టపాసుల విషయంలోనే కాదు... వినాయక చవితి, విజయదశమి వేళ దేవతా విగ్రహాల నిమజ్జనంలోనూ ఇదే తంతు. హైదరాబాద్ లాంటి చోట్ల హుస్సేన్‌సాగర్‌లో మట్టి విగ్రహాలే నిమజ్జనం చేయాలని ఏటేటా కోర్టు ఆదేశాలిస్తున్నాయి. ప్రభుత్వాలు సరేనని తలూపుతున్నాయి. క్షేత్రస్థాయిలో జరు గుతున్నది మాత్రం వేరు. కాలుష్యకారక విగ్రహాలతో ఒకటికి మూడు రోజులు సచివాలయం సాక్షిగా నిమజ్జనాలు నడుస్తుంటాయి. సంప్రదాయాల్ని పాటించాల్సిందే. కానీ, పెరిగిన కాలుష్య ప్రమాదం దృష్ట్యా వాటిని పర్యావరణ అనుకూలంగా మార్చుకోవడం ముఖ్యం. తాగే నీరు, పీల్చే గాలిని ప్రాణాంతకంగా మార్చుకొమ్మని ఏ ధర్మమూ బోధించదు. అది గ్రహించి, మారాల్సింది మనమే! సమాజంలో మార్పు రాత్రికి రాత్రి వస్తుందనుకోలేం. టపాసుల సంరంభాన్నీ, విగ్రహాల ఆర్భా టాన్నీ తగ్గించుకొమ్మని ప్రజలను కోరే ముందు ప్రభుత్వాలు చిత్తశుద్ధి కనబరచాలి. ఆదేశాలన్నీ అప్పటికప్పుడు తీసుకుంటున్న అత్యవసర చర్యలుగా కనిపిస్తే లాభం లేదు. పాఠాల్లో భాగంగా టీచర్ల ద్వారా పిల్లలకు అవగాహన పెంచాలి. నివాసగృహాల అసోసియేషన్లను పర్యావరణహిత చర్యల్లో భాగం చేయాలి. పర్యావరణం, ప్రజారోగ్యం అందరి బాధ్యత గనక కేంద్రం, రాష్ట్రాలు ఒక దానిపై మరొకటి నెపం మోపడం సరికాదు. ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షాలూ సహకరించడమే దీనికి సరైన పరిష్కార మార్గం. మునిసిపాలిటీ, అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు అందరూ కలసికట్టుగా నడవాలి. ఊపిరాడని దేశ రాజధానిలో ముందుగా ఆ అడుగులు పడాలి. -
మార్పుల వ్యూహంతో మేలెంత?!
మార్పు మంచికే! అయితే, అన్ని మార్పులూ మంచి చేస్తాయా? మంచిని ఆశించడమే తప్ప, ఆఖరికి ఏమవుతుందో అప్పటికప్పుడు చెప్పలేం. బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ ప్రస్తుతం మార్పునే నమ్మారు. క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరించారు. పాలస్తీనా అనుకూల నిరసన ప్రదర్శనలపై విరుచుకుపడిన హోమ్ మంత్రి సువెల్లా బ్రేవెర్మన్ను పక్కకు తప్పించారు. ఆమె స్థానాన్ని విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీకి అప్పగించారు. మాజీ ప్రధాని అయిన 57 ఏళ్ళ డేవిడ్ కామెరాన్‌ను విదేశాంగ మంత్రిగా ముందుకు తెచ్చారు. భారతీయ సంతతికి చెందిన 43 ఏళ్ళ బ్రేవెర్మన్ ఛాందసవాద, వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుపడడంతో, ఆమెకు ఉద్వాసన పలికి, మధ్యేవాదానికి జై కొడుతున్నట్టు కనిపించే యత్నం చేశారు. మునుపటి లిజ్ ట్రస్ హయాం నుంచి ప్రతికూలత మూటగట్టుకున్న కన్జర్వేటివ్ పార్టీ పట్ల మళ్ళీ నమ్మకం కలిగించడానికి సునాక్‌కు ఇవి సరిపోతాయా? కన్జర్వేటివ్ పార్టీ తన సొంత ఉనికిని కాపాడుకొనేందుకు కిందా మీదా పడుతోందనడానికి తాజా ఉదాహరణ రిషీ సునాక్ తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అని విశ్లేషకుల మాట. బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్ ఒక్కరే కాక ఇంకా పలువురు పెద్ద పదవులు నిర్వహించినవారు సైతం ఈ మంత్రివర్గ మార్పులు చేర్పుల్లో చిన్న హోదాలు చేపట్టారు. గతంలో ప్రధానమంత్రి పదవికి రేసులో నిలబడ్డ నాయకురాలు, వ్యాపార శాఖ మంత్రి అయిన డేమ్ ఆండ్రియా లెడ్సమ్ ఇప్పుడు జూనియర్ హెల్త్ మినిస్టర్ పదవి చేపట్టారు. అలాగే ఇంకొందరు! సునాక్ వైపు నుంచి చూస్తే – ఇది మునుపటి లిజ్ ట్రస్ హయాం వారిని కొందరినైనా వదిలించుకొని, తనదైన జట్టును నిర్మించుకొనేందుకు ఆయన చేస్తున్న యత్నంగా కనిపిస్తుంది. మరోవైపు నుంచి చూస్తే – మునుపటి లిజ్ పాలన తలనొప్పులు తేవడంతో ఏడాది క్రితం ఆ స్థానంలోకి వచ్చిన సునాక్ తన సర్కార్‌పై నమ్మకం కలిగించడంలో విఫలమయ్యారనీ, అందుకే ఈ మార్పులనీ అనిపిస్తుంది. ప్రధానిగా పదవి చేపట్టినప్పటి నుంచి సునాక్ తరచూ కామెరాన్‌తో సంభాషిస్తున్నారనీ, వారం రోజుల క్రితమే విదేశాంగ మంత్రిగా పగ్గాలు పట్టాల్సిందిగా కోరారనీ ఒక కథనం. ఇంతలోనే బ్రేవెర్మన్ దురుసు రాతలతో రచ్చ రేగింది. చివరకు సునాక్ అనుకుంటున్న మార్పే అనివార్యంగా, ముందుకు తోసుకొచ్చింది. ‘డీసీ’గా అభిమానులు ముద్దుగా పిలుచుకొనే డేవిడ్ కామెరాన్ పునరాగ మనంతో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి పాలకçపక్షం చిక్కుల్లో పడి, బయటపడేందుకు మరో మార్గం లేనప్పుడు పాత కాపులను మళ్ళీ రంగంలోకి దింపి ఉన్నత పదవులివ్వడం, ఎంపీలు కాని వారిని ఎగువ సభ ద్వారా పార్లమెంట్‌లోకి తేవడం బ్రిటన్‌లో తరచూ ఉన్నదే! వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం వెన్నాడుతున్న వేళ సునాక్ సర్కార్ ఏదో ఒకటి చేయక తప్పని పరిస్థితి. అందులో భాగమే తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, కామెరాన్ పునరాగమనం లాంటి చర్యలు. మాటలతో ముగ్ధుల్ని చేయగల కామెరాన్‌ను జనం నమ్ముతారనీ, రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా మారుతుందనీ సునాక్ అంచనా. అయితే, పదకొండేళ్ళు పార్టీకి నేతగా, ఆరేళ్ళ కాలం ప్రధానిగా పనిచేసి, గత ఏడేళ్ళుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన కామెరాన్ అనుభవం కష్టాల్లో ఉన్న పార్టీకీ, సునాక్ ప్రభుత్వానికీ ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. కామెరాన్‌కు పలువురు ప్రపంచ నేతలతో స్నేహం, అంతర్జాతీయ వ్యవహారాలపై పట్టు ఉన్నాయి. భౌగోళిక రాజకీయాలన్నీ అస్థిరంగా ఉన్న వర్తమానంలో అది బ్రిటన్ ప్రభుత్వానికి ఉపయుక్తమే. కానీ, వచ్చే ఎన్నికల్లో కలిసిరావడం మాత్రం కష్టమే. కేవలం 24 శాతం మంది బ్రిటన్ వయోజనులు కామెరాన్‌కు సానుకూలంగా ఉంటే, 45 శాతం మంది ఆయనకు ప్రతికూలంగా ఉన్నారని నెల కిందటి తాజా సర్వే. వెరసి కామెరాన్‌పై సునాక్ అతిగా ఆశలు పెట్టుకుంటే నిరుత్సాహం తప్పదు. పదమూడేళ్ళ పాటు సొంత కన్జర్వేటివ్ పార్టీయే గద్దె మీద ఉన్నాక వచ్చే ఎన్నికలు సునాక్‌కు ఏటికి ఎదురీతే. ఆయన తనను తాను మార్పుకు ప్రతిరూపంగా, స్థిరచిత్తుడిగా జనానికి చూపుకోవడం అవసరం. అందుకని మాటల్లో, రాతల్లో జాత్యహంకార, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న బ్రేవెర్మన్ను పదవిలో కొనసాగిస్తే కష్టం. గతంలో పలుమార్లు మాటల తూటాలు పేల్చిన ఆమె తాజాగా పాలస్తీనా అనుకూల నిరసన ప్రదర్శనపై నిర్లక్ష్యంగా, నొప్పించేలా ‘ది టైమ్స్’ పత్రికలో రాశారు. ప్రధాని ఆమోదం లేని ఆ వ్యాసంతో తన కథకు తానే ముగింపు రాసుకున్నారు. స్వతంత్ర పోలీసు వ్యవస్థను తప్పుబట్టడమే కాక, నిరసనను ప్రాథమిక హక్కుగా భావించే ఆధునిక బ్రిటన్ సమాజాన్నీ దూరం చేసుకున్నారు. పదవీచ్యుతురాలయ్యారు. అయితే, రానున్న రోజుల్లో ఆమె ఊరకుంటారని అనుకోలేం. సునాక్ పాలన అనంతరం అవసరమైతే పార్టీ పగ్గాలు చేపట్టగల ఛాందస వర్గ నేతగా ఆమె తనను తాను గట్టిగా నిలుపుకొన్నారు. అయిదేళ్ళ లోపల 650 మంది సభ్యుల దిగువ సభకు ఎన్నికలు జరగడం బ్రిటన్ విధానం. ఆ లెక్కన 2025 జనవరి 28 లోపల ఎన్నికలు జరగాలి. ఏ తేదీన జరగాలో నిర్ణయించే అధికారం ప్రధా నిదే. 2011లో చట్టం తెచ్చి, దాన్ని మార్చినా, 2019 ఎన్నికల్లో విజయం తర్వాత కన్జర్వేటివ్‌లు మళ్ళీ యథాపూర్వ స్థితిని పునరుద్ధరించారు. ఆ లెక్కన పార్లమెంట్‌ను ముందే రద్దు చేసి, ఎన్నికలు జరిపించమని సునాక్ కోరినా కోరవచ్చు. ఏడాది క్రితం సునాక్ పగ్గాలు చేపట్టినప్పటితో పోలిస్తే, కన్జర్వే టివ్‌ల ప్రతిష్ఠ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అప్పటి అనుకూల వాతావరణమూ లేదు. మరి, సునాక్ చేసిన తాజా మార్పులు ఎన్నికల నాటికి అద్భుతాలు చేయగలవా? ఏమో గుర్రం ఎగరావచ్చు! -
ఇది మూణ్ణాళ్ళ కథ కాదు!
ప్రజల ఆరోగ్యం విషయంలోనూ పాలకులకు న్యాయస్థానాలు గడువు విధించాల్సి రావడం విచిత్రమే. అయితే, ఇప్పటికే అదే పనిలో ప్రభుత్వముంటే, త్వరితగతిన పనులు జరగడానికి ఈ గడువు విధింపు తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. శానిటరీ న్యాప్కిన్ల పంపిణీపై దృష్టి పెడుతూ, జాతీయ స్థాయిలో ‘వాంఛనీయ’ ఋతుస్రావ కాల ఆరోగ్య విధానాన్ని 4 వారాల్లో ఖరారు చేయాలంటూ సుప్రీమ్ కోర్ట్ గత సోమవారం అన్నమాట అలాంటిదే. ప్రభుత్వ ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో సగటున ఎంతమంది ఆడపిల్లలకు ఎన్ని మరుగుదొడ్లు ఉండాలన్న దానిపైనా జాతీయ స్థాయిలో ఒక మోడల్‌ను నిర్ణయించాల్సిందిగా కోర్ట్ ఆదేశించింది.దాదాపు 37.5 కోట్ల మంది ఋతుస్రావ వయసువారున్న దేశంలో... 2011 నుంచి పెండింగ్‌లో ఉన్న కేసులో... దేశ ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ధర్మాసనం ఇచ్చిన ఈ ఆదేశం మహిళా లోకానికి కొంత ఊరట. ఋతుస్రావ ఆరోగ్య ప్రాధాన్యాన్ని కోర్ట్ గుర్తించడం, ప్రస్తావించడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో అనేకసార్లు ఆ పని చేసింది. పట్టని ప్రభుత్వాలకు అక్షింతలు వేసింది. ఏడు నెలల క్రితం ఏప్రిల్‌లో కూడా ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంలో స్పందిస్తూ, ఋతుకాలపు ఆరోగ్యంపై ఏకరూప జాతీయ విధాన రూపకల్పనకు కేంద్రాన్ని సుప్రీమ్ ఆదేశించింది. తాజాగా, కోర్ట్‌లో ప్రభుత్వ వకీలు పేర్కొన్నట్టు జాతీయ విధానం ముసాయిదాను కేంద్రం ఇటీవలే ఆన్లైన్లో పెట్టింది. సామాన్య ప్రజల మొదలు నిపుణుల దాకా అందరి అభిప్రాయాలు కోరింది. తద్వారా ఋతుస్రావం పట్ల తరతరాలుగా మన దేశంలో నెలకొన్న అనేక అపోహలనూ, సవాళ్ళనూ నిర్వీర్యం చేయాలన్నది ప్రయత్నం. అర్ధంతరంగా బడి చదువు మానేయడం సహా అనేక సమస్యలకు కారణమవుతున్న ఈ ఆరోగ్య అంశం పట్ల దృష్టి పెట్టడానికి స్వతంత్ర దేశంలో ఏడున్నర దశాబ్దాలు పట్టింది. అలాగని అసలేమీ జరగలేదనలేం. కొన్నేళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా ఋతుస్రావ కాల ఆరోగ్యం, పరిశుభ్రత (ఎంహెచ్‌హెచ్) పట్ల దృష్టి పెరుగుతోంది. భారత్‌లో సైతం ప్రజారోగ్య చర్చల్లో ఈ అంశాన్ని భాగం చేశారు. ‘జాతీయ ఆరోగ్య మిషన్ 2011’లో గ్రామీణ ప్రాంతాల్లోని కౌమార బాలికల్లో ఋతుస్రావ కాలపు ఆరోగ్య పథకాన్ని తీసుకొచ్చారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో దీన్ని చేర్చారు. కేంద్ర తాగునీటి, పారిశుద్ధ్య శాఖ సైతం 2015లోనే పాఠశాలలకు మార్గ దర్శకాలు జారీచేసింది. దాని ఫలితాలు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల్లో కొంత కనిపించాయి. పీరియడ్స్ వేళ ఆరోగ్యకర మైన పద్ధతులను పాటించడమనేది మునుపటి సర్వేతో పోలిస్తే, అయిదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో 15 నుంచి 24 ఏళ్ళ వయసు యువతుల్లో 20 శాతం పెరిగింది. ఇది కొంత సంతోషకరం. పైగా, ఐరాస పేర్కొన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఎంహెచ్‌హెచ్ కూడా ఒకటనేది గమనార్హం. నిజానికి, ఆంధ్రప్రదేశ్‌లో ‘స్వేచ్ఛ’, కేరళలో ‘షీ ప్యాడ్’, రాజస్థాన్‌లో ‘ఉడాన్’ ఇలా రకరకాల పేర్లతో వివిధ రాష్ట్రాలు కౌమార బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లను పంపిణీ చేస్తున్నాయి. దీర్ఘకాలిక వినియోగ నిమిత్తం కేరళ, కర్ణాటకలు న్యాప్కిన్లకు బదులు ఋతుస్రావ కప్స్ అందిస్తున్నాయి. అయితే, సమాజంలోని దురభిప్రాయాలను పొగొట్టడమనే సవాలు మిగిలే ఉంది. పన్నెండేళ్ళ సోదరి దుస్తుల మీద ఉన్న తొలి ఋతుస్రావ రక్తపు మరకలను చూసిన ఓ అన్నయ్య ఆమెను అనుమానించి, కొట్టి చంపిన ఘటన ఆ మధ్య మహారాష్ట్రలో జరిగింది. ఆడవారికే కాక, మగవారికి సైతం పీరియడ్స్ పట్ల అవగాహన పెంచాలంటున్నది అందుకే. ‘ఆ 3 రోజులు’ ఆడవారిని ప్రాథమిక వసతులైనా లేని గుడిసెల్లో విడిగా ఉంచే మహారాష్ట్ర తరహా అమానుష పద్ధతుల్ని మాన్పించడం లక్ష్యం కావాలి. ఋతుక్రమం అపవిత్రత కాదనీ, శారీరక జీవప్రక్రియనీ గుర్తెరిగేలా చేయాలి. తగిన ఎంహెచ్‌హెచ్ వసతులు లేకపోవడంతో ఏటా మన దేశంలో 2.3 కోట్ల మందికి పైగా బాలికలు అర్ధంతరంగా బడి చదువులు మానేస్తున్నట్టు సర్వేల మాట. సరిగ్గా చదువుకోని వారు ఋతుస్రావ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపలేకపోతున్నారన్నది దాని పర్యవసానం. అంటే, ఇది ఒక విషవలయం. దీన్ని ఛేదించాలి. బడిలో వసతులు పెంచడంతో పాటు జాతీయ విధానం ద్వారా ఆరోగ్యంలో, సామాజిక అనాచారాలను మాన్పించడంలో టీచర్లు కీలక పాత్ర పోషించేలా తగిన శిక్షణనివ్వాలి. విధానాల నిర్ణయం, కార్యక్రమాల రూపకల్పనలో తరచూ ఓ పొరపాటు చేస్తుంటారు. యువతుల మీదే దృష్టి పెట్టి, ఋతుక్రమం ఆగిపోయిన లక్షలాది మహిళల ఆరోగ్యాన్ని విస్మరిస్తుంటారు. అది మారాలి. మెనోపాజ్ అనంతర ఆరోగ్యం, అపోహల నివృత్తిపైనా చైతన్యం తేవాలి. ఆరోగ్య కార్యకర్తలకు అందుకు తగ్గ శిక్షణనివ్వాలి. ప్యాడ్ల పంపిణీతో బాధ్యత ముగిసిందను కోకుండా సంక్లిష్ట సామాజిక అంశాలపై జనచైతన్యం ప్రధానాంశం కావాలి. ఇన్నేళ్ళకు ఒక జాతీయ విధానం తేవడం విప్లవాత్మకమే కానీ దానితో పని సగమే అయినట్టు! గ్రామప్రాంతాల్లోనూ అందరికీ అందుబాటు ధరలో న్యాప్కిన్లుండాలి. శుభ్రమైన మరుగుదొడ్లు, నీటి వసతి బడిలో భాగం కావాలి. ఆరోగ్యం, ఆచారం లాంటి అంశాల్లో తరతరాలుగా సమాజంలో నెలకొన్న అభిప్రాయాలను పోగొట్టడం సులభం కాకపోవచ్చు. కానీ, అందుకు ప్రయత్నించకపోతే నేరం, ఘోరం. ఋతుస్రావ ఆరోగ్యంపై చైతన్యం తేవడంలో భారత్ మరింత ముందడుగు వేసేందుకు సత్వర జాతీయ విధానం తోడ్పడితే మేలు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సైతం ఏళ్ళు పూళ్ళు తీసుకొని, మరో అయిదేళ్ళ తర్వాత అమలు అంటున్న పాలక వర్గాలు ఆకాశంలో సగమనే ఆడవారి తాలూకు శారీరక, మానసిక ఆరోగ్యం గురించి వెంటనే పట్టించుకుంటే అదే పదివేలు. -
పల్లవి... కాంగ్రెస్, చరణం... చంద్రబాబు!
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ స్వరం మారుతున్నది. గాత్రంలో కొత్త గమకాలు పుట్టుకొస్తున్నాయి. లక్ష్యసిద్ధి కోసం బొంత పురుగునైనా ముద్దాడాలనేది కేసీఆర్ నుడివిన సూక్తి. దాన్ని మరింత ముందుకు తీసుకొనిపోతూ భస్మాసురుడి కౌగిట్లో చేరడానికి సిద్ధపడింది... గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కూటమి కట్టి తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. కనాకష్టంగా 3 శాతం ఓట్లు సంపాదించింది. ఆ మూడు శాతం ముచ్చట కోసం కాంగ్రెస్ పార్టీ తన తెలంగాణ రిమోట్ కంట్రోల్‌ను చంద్రబాబు చేతిలో పెట్టినట్టు కనిపిస్తున్నది. కాంగ్రెస్ గెలుపు కోసం తెలుగుదేశం పోటీ నుంచి తప్పుకున్నది. ఈ సంగతి స్వయంగా చంద్రబాబే తనకు చెప్పినట్టు అప్పటి తెలంగాణా యూనిట్ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టంగా చెప్పారు. పైకి కనిపించే దృశ్యం ఇది. దీపం ముందు శలభంలా కాంగ్రెస్ కోసం తెలుగుదేశం ఒక సారో పాత్రలో కనిపిస్తున్నది. కానీ సారం మాత్రం అది కాదు. పోచమ్మ గుడి ముందు కట్టేసిన బలి పొట్టేలు కాంగ్రెస్ పార్టీయే! లేని విశ్వసనీయతను చంద్రబాబుకు కట్టబెట్టడం కోసం, ఆయనకు తెలంగాణలో ‘హోమ్లీ ఫీలింగ్’ను కలుగజేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం తనను తాను హననం చేసుకోవడానికి కూడా అది వెనుకాడటం లేదు. తెలంగాణ ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకొని ‘ఇండియా టుడే’ జాతీయ న్యూస్ ఛానల్ వాళ్లు హైదరాబాద్‌లో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇతర పార్టీల నాయకులతోపాటు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన రెండు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. వీటిపై తెలంగాణాలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ‘1995లో చంద్రబాబు ప్రారంభించిన ఐటీ, ఫార్మా, ఔటర్ రింగ్ రోడ్, మెడికల్ హబ్ వంటి కార్యక్రమాలను కాంగ్రెస్ కొనసాగించింద’ని ఆయన చెప్పారు. ఇదొక చర్చనీయాంశం. భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) పద్ధతులతో రాచకొండ ప్రాంతంలో ఒక కొత్త నగరాన్ని 50 వేల ఎకరాల్లో నిర్మించడం రెండో వివాదాస్పద వ్యాఖ్య. చంద్రబాబు విఫల ప్రయోగం అమరావతిని ఈ సమీకరణ గుర్తుకు తెస్తున్నది. ఏదో యథా లాపంగా రేవంత్ రెడ్డి నోటి వెంట ఈ మాటలు వచ్చి ఉంటా యనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వైపు నుంచి ఆ తర్వాత ఎటువంటి వివరణ రాలేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులెవరూ ఖండించలేదు. ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే రెండు చోట్ల, అందులో ఒకటి ముఖ్యమంత్రి స్థానంలో పోటీ చేసే అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా రేవంత్ వ్యాఖ్యల్లో అభ్యంతరాలు కనిపించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగానికి పాదు చేసిందెవరు? ఎనభయ్యో దశకం నాటి నుంచే తెలుగునాట సమాచార రంగంలో యెల్లో మీడియా గుత్తాధిపత్యాన్ని సంపాదించింది. అప్పటి నుంచి యెల్లో మీడియాకు తాను వలచింది రంభ, తాను ముని గింది గంగ! తెలుగు ప్రజలందరూ ఇటువంటి అభిప్రాయాలనే కలిగివుండి తీరాలి. వేరే మార్గం లేదు! ఆ దశలో చంద్రబాబు అనే కొయ్యగుర్రాన్ని సృష్టించి పరుగులరాణి పంచకల్యాణిగా లోకానికి పరిచయం చేశారు. ‘ఐటీ రంగ సృష్టికర్త అతనే’ అని డప్పు వేయించారు. ఈ డప్పుల మోత ఎంత ఉన్మాద స్థాయికి చేరిందంటే – చివరికి చంద్రబాబే అవన్నీ నమ్మి, తనను తాను ఐన్‌స్టీన్‌కు అన్నయ్యగా, న్యూటన్‌కు పాఠం చెప్పిన గురువుగా భ్రమపడేంతగా! రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ సెల్‌ఫోన్, కంప్యూటర్ వగైరా వగైరాలను తానే కనిపెట్టాననే అపస్మారక మాటల నుంచి ఆయన బయటపడలేక పోవడానికి యెల్లో మీడియా డప్పుల మోతే కారణం. వాస్తవానికి హైదరాబాద్‌లో ఐటీ రంగానికి ఆద్యులెవరు? భవిష్యత్తులో ఐటీ రంగం పోషించబోయే పాత్రను అర్థం చేసు కున్న దార్శనికుడు... నాటి ప్రధాని పీవీ నరసింహారావు. ‘సాఫ్ట్వేర్ పార్క్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో ఐదారు నగరాల్లో ఐటీ పార్కులను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. సహజంగానే ఆయనకు హైదరాబాద్‌పై ఉండే మక్కువతో మొదటి పార్క్‌ను హైదరాబాద్‌కు కేటాయించారు. ఇప్పుడు ‘సైబర్ టవర్స్’గా మనం పిలుచుకుంటున్న భవంతికి 1993లోనే నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి (కాంగ్రెస్) శంకు స్థాపన చేశారు. దాన్ని మరుగుపరిచి, ఆ ప్రాంతంలో తనకు కావలసిన వారు, బినామీలు భూములు కొనుగోలు చేసేంత వరకు మూడు నాలుగేళ్ల పాటు చంద్రబాబు జాగు చేశారు. ఈ ఆలస్యం కారణంగా ఐటీలో తొలిస్థానంలో ఉండవలసిన హైదరాబాద్‌ను బెంగళూరు అధిగమించింది. ఆ రకంగా హైద రాబాద్ ఐటీ రంగానికి చంద్రబాబు చేసింది ద్రోహం! వడ్డించేవాడు మనవాడైతే కడ పంక్తిన కూర్చున్నా ఢోకా లేదంటారు. వర్తమాన చరిత్రను రికార్డు చేసే వార్తాపత్రికలకు చంద్రబాబు కావల్సినవాడ య్యారు. కనుక ఐటీని కనిపెట్టినవాడనే భుజకీర్తులను ఆయనకు తగిలించారు. ‘కామమ్మ మొగుడంటే కామోసు’ అనుకున్నట్టు ఆయన నిజంగానే తాను ఐటీ ఫౌండర్‌నని నమ్మడం మొదలు పెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ వారైనా వాస్తవాలను వెలుగులోకి తెచ్చి ఆ క్రెడిట్‌ను తీసుకోవాలి కదా? విచిత్రంగా కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ వాళ్లే దీన్ని గుర్తించి క్రెడిట్‌ను కాంగ్రెస్‌కు ఇస్తున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్లు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ గజమాల చంద్రబాబు మెడలోనే ఉండాలని తెగ ఉబలాటపడుతున్నారు. దాని కొనసాగింపే నిన్నటి ‘ఇండియా టుడే’ సమావేశంలో రేవంత్ చెప్పిన మాటలు. చంద్రబాబు ప్రారంభించిన ఐటీతో పాటు ఔటర్ రింగ్ రోడ్డును కూడా తాము కొనసాగించామని రేవంత్ చెప్పారు. సైబర్ టవర్స్‌కు కాంగ్రెస్ వాళ్లు శంకుస్థాపన చేస్తే, ఆలస్యం చేసైనా చంద్రబాబు నిర్మించి ప్రారంభించాడు. ఐటీ ప్రారం భంలో చంద్రబాబు పాత్ర కూడా ఉన్నదని చెబితే ఎంతో కొంత అతుకుతుంది. ఔటర్ రింగురోడ్డును బాబు తలకు ఎట్లా చుట్టేస్తారు? 2004 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దానిప్రకారం మియాపూర్ నుంచి శంషాబాద్ వరకు 150 అడుగుల వెడల్పుతో రోడ్డును నిర్మించాలి. మియాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు అప్పటికే రోడ్డు ఉన్నది. దాన్ని కొంచెం వెడల్పు చేస్తే సరిపోతుంది. అక్కడ నుంచి శంషాబాద్ వరకు 150 అడుగుల వెడల్పుతో 27 కి.మీ. రోడ్డును కొత్తగా వేయాలి. ఇది ప్రకటన మాత్రమే! కాగితం కదిలిందీ లేదు. సర్వే జరిగిందీ లేదు. ఈ నోటిఫికేషన్ కూడా హైదరాబాద్ పడమటి ప్రాంతాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డును అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలనే ప్రతిపాదన వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు జీవం పోసుకున్నది. 500 అడుగుల వెడల్పుతో, 175 కి.మీ. పొడవునా నిర్మించాలని సంకల్పించి, సర్వేలను ముగించి, శరవేగంగా భూసేకరణను కూడా పూర్తి చేసింది ఆయన హయాంలోనే! ఈ భూసేకరణ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వంతో రామోజీరావు కయ్యానికి దిగి, ‘పెద్దలా? గద్దలా..?’ పేరుతో విషప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన భూముల్లో కొద్ది భాగం రోడ్డు కోసం సేకరించవలసి వచ్చింది. దాన్ని మినహాయించాలంటే రోడ్డు వంకర తిరగాలి. సాంకేతికంగా ఇది సాధ్యమయ్యే పని కాదు గనుక ఆయన సలహాను వైఎస్సార్ ప్రభుత్వం మన్నించలేకపోయింది. దాంతో ప్రభు త్వంపై ఆయన యుద్ధాన్ని ప్రకటించారు. భూసేకరణ దశలోనే జరిగిన ఈ రభస ఇప్పటికే చాలామందికి గుర్తే! భూసేకరణ పూర్తి చేయడమే గాక రోడ్డు నిర్మించడంలో కూడా 90 శాతాన్ని రాజశేఖరరెడ్డి పూర్తి చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం మిగతా భాగాన్ని పూర్తి చేసి సుందరీకరణ, విద్యుదీ కరణ వంటి పనులను చేపట్టింది. వాస్తవాలు ఇలా వుంటే ఔటర్ రింగ్ రోడ్డులో ఎటువంటి పాత్ర లేని చంద్రబాబు ఖాతాలో దాన్ని వేయడం యెల్లో మీడియాకు, తెలుగుదేశం వీరాభి మానులకు మాత్రమే సాధ్యమయ్యే సాహసం. ఈ సాహస పోటీలో వాళ్లను తలదన్నేలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహ రిస్తున్నది. తాము మాత్రమే సొంతం చేసుకోవాల్సిన ప్రతిష్ఠలో అర్ధ భాగాన్ని చంద్రబాబుకు సమర్పించేందుకు వారు సిద్ధపడుతున్నారు. మహాభారతంలో ద్రోణాచార్యుడు, పాంచాల రాజైన ద్రుపదుడు బాల్యస్నేహితులు. కష్టాల్లో ఉన్న ద్రోణుడు ఒకసారి సాయం కోసం ద్రుపదుడి దగ్గరకు వెళ్లాడట. ద్రుపదుడు అవమానించి పంపాడు. ఆ కోపాన్ని చానాళ్లపాటు ద్రోణుడు కడుపులో దాచుకున్నాడు. కురు, పాండవ రాకుమారులకు విద్య నేర్పిన తర్వాత కడుపులోని అక్కసును వాళ్ల ముందు ద్రోణా చార్యుడు వెళ్లగక్కాడు. వెంటనే అర్జునుడు బయల్దేరి ద్రుపదుణ్ణి బంధించి తెచ్చి గురువు ముందు నిలబెడతాడు. ఆ విధంగా గురుదక్షిణ చెల్లిస్తాడు. చంద్రబాబు తాను వేసుకున్న విజనరీ ముసుగుకు అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్లో ఘోర అవమానం జరిగింది. ఆ ప్రాజెక్టు ఆచరణ సాధ్యమయ్యేది కాదన్న అభిప్రాయం రోజురోజుకూ బలపడుతున్నది. తనను నమ్మి పెట్టుబడులు పెట్టిన కస్టమర్ల నుంచి ఒత్తిడి ఎదుర వుతున్నది. ఈ దశలో ప్రాజెక్టు ఆచరణ సాధ్యమేనన్న ఊరట దొరకాల్సిన అవసరం బాబుకు ఏర్పడి ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ ద్వారా ఓ గ్రీన్ ఫీల్డ్ సిటీ ఏర్పాటును ప్రకటిస్తే చంద్రబాబుకు బోలెడంత ఊరట. తన విజన్‌ను పక్క రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కేవలం ప్రకటన చాలు. ఆ తర్వాత కొంచెం ప్రచారం చాలు. అంతకు మించి అది ముందుకు కదిలే అవకాశాలు లేవు. ఈ ప్రకటనతో లాభపడే మొదటి వ్యక్తి రామోజీరావు. ఔటర్ రింగ్ రోడ్డుకూ, రాచకొండ గుట్టలకూ మధ్యన ఫిలిం సిటీ ఉంటుంది. పక్కనే రాచకొండ నగరం ప్రచారంతో తన ఫిలిం సిటీ భూముల విలువ పెరుగుతోంది. ఒకప్పుడు లక్ష నాగళ్లతో ఫిలిం సిటీని దున్నేయాలన్న నినాదాల బదులు లక్షల కోట్ల విలువైన ల్యాండ్ బ్యాంక్‌గా అది మారుతోంది. ఆ భూముల చట్టబద్ధత, వివా దాలు వగైరా వేరే అంశం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సారథికి పూర్వాశ్రమంలో చంద్ర బాబు గురువు. చంద్రబాబుకు రామోజీ గురువు. రాచకొండ నగర ప్రకటన ఈ గురుపరంపర కోరిన దక్షిణ కావచ్చు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్ఠానానికీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలకూ ఎందుకు పట్టడం లేదు? ఎవరి అవసరాలు వారివి! గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు భారీగా ఆర్థిక సాయాన్నందించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ల్లోనూ ఖర్చు బాధ్యతను ఆయన తీసుకున్నందువల్లనే పొత్తు కుదిరిందన్న విషయం కూడా విదితమే. ఇప్పుడు కూడా ఆ బాధ్యతను కర్ణాటక కాంగ్రెస్‌తో పాటు బాబు వర్గం కూడా తీసుకున్నట్టు సమాచారం. ఇటీవల కొందరు సినీ ప్రముఖులు, వ్యాపారులు, ఇతర రంగాల వారూ సుమారు 150 మంది హైదరాబాద్‌లోని ఓ క్లబ్లో సమావేశమై రాజకీయ చర్చలు జరిపినట్టు సమాచారం వచ్చింది. వీరిలో కొందరు అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్లో భూములు కొనుగోలు చేసినవారున్నారు. ఇంకొందరు తెలుగు దేశం పార్టీతో వ్యాపార, సామాజిక సంబంధాలున్నవారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలనీ, అందుకు అవసరమైన ‘సహకారాన్ని’ అందించాలనీ కూడా వారు తీర్మా నించినట్టు తెలిసింది. ఇందుకు ప్రతిఫలంగా వారు ఆశించేది కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని కొంచెం పైకి లేపే జాకీ కావాలి. అమరావతి వెంచర్లో చిన్నపాటి కదలికైనా రావాలి. కర్ణుడి చావుకు ఆరు కారణాలన్నట్టు రాచకొండ ప్రక టనకు కూడా ఇటువంటి అనేక కారణాలుండవచ్చు. నగర రియల్ ఎస్టేట్ అవసరాలకు అత్యంత చేరువలో ట్రిపుల్ వన్ జీవో పరిధిలో లక్ష ఎకరాలు సిద్ధమవుతున్న సమయంలో డిమాండ్‌ను మించిన సప్లై అందుబాటులోకి వచ్చింది. రాచకొండ సిటీ ఆచరణాత్మకమవుతుందని ఎవరూ భావించడం లేదు. భావించాల్సిన అవసరం కూడా లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపా రులకు కావలసింది అరచేతిలో వైకుంఠం చూపడమే! అమ రావతిలో బాబు చూపిన వైకుంఠం వికటించింది. ఇప్పుడు కాంగ్రెస్ ‘హస్తం’లో దాన్ని కొత్తగా చూపించాలి. మెడికల్ బెయిల్ మీద హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు తక్షణ మిషన్ ఇదే! క్యాటరాక్ట్ ఆపరేషన్ కోసం నాలుగు వారాల సమయం కావాలని బాబు న్యాయవాదులు గట్టిగా వాదించి 28వ తేదీ దాకా మెడికల్ బెయిల్ తెచ్చుకున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచార ఘట్టం ఆ రోజున పూర్తవుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
Mahua Moitra: కష్టాల్లో ఫైర్ బ్రాండ్
తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టినవారికి గుర్తింపు రావటం అంత సులభం కాదు. ప్రసంగించే అవకాశం లభించటం, దాన్ని సద్వినియోగం చేసుకోవటం చాలా అరుదు. మహిళా ఎంపీల విషయంలో దాదాపు అసాధ్యం. కానీ రాజకీయ రంగప్రవేశం చేసిన కొద్దికాలంలోనే తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎన్నికై లోక్‌సభలో ప్రవేశించిన మహువా మొయిత్రా చాలా త్వరగానే ‘వార్తల్లో వ్యక్తి’ అయ్యారు. తీరా నాలుగేళ్లయ్యే సరికల్లా వివాదంలో చిక్కుకున్నారు. ఏం జరిగిందో అందరూ గ్రహించే లోగానే ఉరుము లేని పిడుగులా, ఊహించని ఉత్పాతంలా వచ్చిపడిన వివాదం చివరికామె పార్లమెంటు సభ్యత్వానికి కూడా ఎసరుపెట్టేలా పరిణమించింది. సభ్యుల నైతిక వర్తనను నియంత్రించే లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ఆమెను సభ నుంచి బహిష్కరించాలని స్పీకర్‌ను కోరుతూ గురువారం నివేదికను ఆమోదించింది. ఇందుకు ప్రధానంగా అనైతిక వర్తన, తీవ్ర తప్పిదాలకు పాల్పడటం కారణాలుగా చూపింది. అంతేకాదు... ఈ విషయంలో సంస్థాగత విచారణ, చట్టపరంగా గట్టి చర్యలు అవసరమని సిఫార్సు చేసింది. పార్లమెంటు సభ్యులు సభలో ప్రశ్నలు వేయటానికి వినియోగించే ఎన్ఐసీ వెబ్సైట్ లాగిన్, పాస్వర్డ్ ఆమె తన స్నేహితుడైన దుబాయ్ రియలెస్టేట్ వ్యాపారి దర్శన్ హీరానందానీకి ఇచ్చారనీ, ఆయన నుంచి కోటి రూపాయల ముడుపులు తీసుకుని ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ సంస్థలపై ప్రశ్నలు సంధించారనీ మొయిత్రాపై వచ్చిన ఆరోపణలు. ఆ ప్రశ్నలు అదానీ సంస్థల ప్రయోజనాలు దెబ్బతీసేంత తీవ్రమైనవా? అందువల్ల హీరానందానీకి ఒరిగేదేమిటి? ముడుపుల సంగతిని మొయిత్రా తోసి పుచ్చారు. లాగిన్, పాస్వర్డ్ ఇచ్చినట్టు అంగీకరించారు. అందుకుగల కారణాలు చెప్పారు. ఇదంతా దేశభద్రతకు ముప్పు తెచ్చే చర్య అనీ, లంచం తీసుకుని ప్రశ్నలేయటం అనైతికమనీ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే గత నెలలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. కమిటీ విచారణ తీరుతెన్నులను ప్రశ్నిస్తూ ఇప్పటికే మొయిత్రా ఓం బిర్లాకు లేఖ రాశారు. కమిటీ తనను ప్రశ్నించిన తీరు ‘వస్త్రాపహరణం’ మాదిరిగా వున్నదంటూ దుయ్యబట్టారు. మొయిత్రా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వలె ఆంగ్ల భాషాప్రావీణ్యం వుండటం వల్లనే త్వరగా ఆమెకు పేరుప్రతిష్టలు సాధ్యమైనాయని అనుకోవటానికి లేదు. ప్రసంగించదల్చుకున్న అంశంపై పట్టు సంపాదించటం ఒక్కటే మొయిత్రా ప్రత్యేకతని చెప్పడానికి కూడా లేదు. విషయ పరిజ్ఞానంతోపాటు విస్ఫులింగాలు విరజిమ్మే స్వభావం, నిర్భీతిగా పాలక పక్షాన్ని నిలదీసే తత్వం ఆమెకొక విశిష్టతను తీసుకొచ్చాయి. అంతకుముందు మూడేళ్లు ఆమె తృణమూల్ ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ మొయిత్రా గురించి దేశానికంతకూ తెలిసింది ఈ నాలుగేళ్ల కాలంలోనే. సభలోనే కాదు... వెలుపల కూడా ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా నిప్పులు చిమ్ముతారు. మూకుమ్మడి అత్యాచారం కేసులో యావజ్జీవ శిక్షపడిన గుజరాత్ దోషులకు క్షమాభిక్ష పెట్టడాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎథిక్స్ కమిటీ విచారణలో నిర్ధారించిన అంశాలేమిటో, అవి ఏరకంగా తీవ్రమైన స్వభావంతో కూడుకున్నవో ఇంకా తెలియాల్సి వుంది. ఎన్ఐసీ లాగిన్, పాస్వర్డ్ ఇవ్వటం విషయంలో ఇంతవరకూ ఎలాంటి నిబంధనలూ లేవు. అయినా సరైంది కాదనుకుంటే ఆమెను మందలించవచ్చు. కమిటీలోని విపక్ష సభ్యులు చెబుతున్న ప్రకారం 800 మంది ఎంపీల్లో అనేకులు సగటున కనీసం ఇద్దరు ముగ్గురికి ఇలా ఇస్తారు. కంప్యూ టర్ల వాడకం, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవటం ఇందుకు కారణం. ఈ విషయంలో స్పీకర్ ఏం నిర్ణయిస్తారన్నది చూడాలి. ఆ సంగతలా వుంచితే ఫిర్యాదు, విచారణ వగైరాలన్నీ ఆదరా బాదరాగా సాగినట్టు కనబడుతోంది. అక్టోబర్ 26న కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ నెల 2న జరిగిన రెండో సమావేశం మధ్యలోనే ముగిసింది. అడిగినవాటికి జవాబివ్వకుండా ఆమె దుర్భాషలాడారని కమిటీ ఛైర్మన్ వినోద్ కుమార్ సోంకార్ ఆరోపిస్తే... ఫిర్యాదుతో సంబంధం లేని ప్రశ్నలతో తన వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా వేధించారన్నది మొయిత్రా ఆరోపణ. దుబాయ్ వెళ్తే ఏ హోటల్లో దిగుతారు... మీతో ఎవరుంటారు... మీరు మీ మిత్రులతో మాట్లాడుతున్నట్టు వారి భార్యలకు తెలుసా అని అడిగారని కూడా ఆమె ఆరోపించారు. దీనికి నిరసనగా ఆమె, విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. కమిటీ విచారణ గోప్యం కనుక ఆరోపణలు, ప్రత్యారోపణల్లో నిజానిజాలేమిటో తెలియదు. అయితే ఈ మొత్తం వ్యవహారం మన పార్లమెంటరీ వ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తుందన్నది మాత్రం వాస్తవం. అసలు దూబే ఫిర్యాదుకు మొయిత్రా మాజీ సహచరుడు దేహద్రాయ్ లేఖ ఆధారమన్న సంగతి కమిటీకి తెలుసా? కమిటీకిచ్చిన అఫిడవిట్లో మొయిత్రాకు ముడుపులు చెల్లించానని హీరానందానీ అంగీకరించారా? లేదని విపక్ష సభ్యులు చెబుతున్నారు. విడిపోయిన జంట పరస్పరం ఆరోపించుకోవటం సర్వసాధారణం. ఇప్పటికే పెంపుడు కుక్క విషయంలో వారిద్దరూ కేసులు పెట్టుకున్నారు. కనుక దేహద్రాయ్ ఫిర్యాదు అంశంలో దూబే, ఎథిక్స్ కమిటీ ఆచితూచి అడుగు లేయాల్సింది. మహిళ గనుకే ఇలా చేశారన్న అపవాదు రానీయకుండా చూసుకోవాల్సింది. ఈ వ్యవహారంలో వ్యక్తిగతం, రాజకీయం కలగాపులగం చేశారన్న అప్రదిష్ట కలగడమూ మంచిది కాదు. ఏదేమైనా వ్యవస్థను ఢీకొట్టేవారు నిరంతరం అత్యంత జాగురూకతతో మెలగాలని మొయిత్రా ఇప్పటికే గుర్తించి వుంటారు. ఈ వివాదంలో పార్లమెంటరీ వ్యవస్థ ఔన్నత్యానికి అనుగుణమైన నిర్ణయం వెలువడాలని అందరూ కోరుకుంటారు. ఇదీ చదవండి: అమలు గ్యారంటీ -
Deep Fake: ఇది లోతైన సమస్య!
మేధ అవసరం. సవ్యంగా వాడితే ఆధునిక సాంకేతికత అందించిన కృత్రిమ మేధ (ఏఐ) కూడా అవసరాలు తీర్చవచ్చు. కానీ, దాన్ని అపసవ్యంగా వాడి, అసత్య ప్రచారానికీ, అసభ్య వీడియోలకూ వినియోగిస్తే ఏమవుతుందో నాలుగైదు రోజులుగా తాజా ఉదాహరణలతో చూస్తున్నాం. లిఫ్టులో అడుగిడుతున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సరైన ఓ బ్రిటిష్ ఇండియన్ మహిళ వీడియోను తీసుకొని, ఆమె ముఖం బదులు ప్రముఖ సినీ నటి రష్మికా మందన్న ముఖాన్ని తగిలించిన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, వివాదం రేపింది. నటి కత్రినా కైఫ్ పైనా ఇలాగే మరో నకిలీ వీడియో బయటకొచ్చింది. పెరిగిన ఏఐ సాంకేతిక వినియోగంతో ఈజీగా మారి, ఇంటర్నెట్ను ముంచెత్తుతున్న ఈ డీప్ ఫేక్‌లపై మళ్ళీ చర్చ రేగింది. వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత, గౌరవం మొదలు జాతీయ భద్రత దాకా అన్నిటికీ ముప్పుగా మారుతున్న ఈ సాంకేతికతకు ప్రభుత్వం ముకుతాడు వేయాల్సిన అవసరాన్ని తెరపైకి తెచ్చింది. రకరకాల సాంకేతిక విధానాల ద్వారా బొమ్మలు, వీడియోలు, ఆడియోల్లో ఒక మనిషి స్థానంలో మరో మనిషి రూపాన్నీ, గొంతునూ అచ్చు గుద్దినట్టు ప్రతిసృష్టించి, డిజిటల్‌గా తిమ్మినిబమ్మిని చేయడమనే ‘డీప్ ఫేక్’ ఇప్పడు ప్రపంచమంతటినీ పట్టిపీడిస్తున్న చీడ. నిజానికి, ఫోటో–షాపింగ్ ద్వారా బొమ్మలు మార్చే పద్ధతి చాలా కాలంగా ఉన్నదే. కానీ, శక్తిమంతమైన మెషిన్ లెర్నింగ్,కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇట్టే బురిడీ కొట్టించేలా వీడియోలు, ఆడియోలు చేయడం డీప్ ఫేక్ను పదునైన అస్త్రంగా మార్చేశాయి. అసలు ఏదో, నకిలీ ఏదో కనిపెట్టేందుకు పలు పద్ధతులు లేకపోలేదు. అయితే, అసలు సంగతి వివరించేలోగా సోషల్ మీడియా పుణ్యమా అని నకిలీ సమాచారం క్షణాల్లో లోకాన్ని చుట్టేస్తోంది. చివరకు నాసిరకం డీప్‌ఫేక్‌లు సైతం జనం మనసులో అనుమానాలు రేపి, అసలు సిసలు సమాచారాన్ని వెనక్కి నెట్టేస్తున్నాయి. వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. పోనుపోనూ సాంకేతికత పదును తేరి, అందరికీ అందుబాటులోకి వస్తే, డీప్‌ఫేక్‌లు నైసు తేలతాయి. అప్పుడిక అసలు, నకిలీలలో తేడాలు పసిగట్టడం ఇంకా కష్టం. ఇవాళ కంపెనీలు, రాజకీయ పార్టీలు, నేతలు తమకంటూ సొంత ఇమేజ్ సృష్టించుకోవడానికీ, పెంచుకోవడానికీ, చివరకు ప్రత్యర్థులపై బురదచల్లడానికి ఫేక్ న్యూస్‌ను ఆసరాగా చేసుకుంటున్న తీరు చూస్తున్నాం. ఫలితంగా, అవి జనం మానసిక స్థితిపై ముద్ర వేసి, వారు తీసుకొనే నిర్ణయాలను ప్రభావితం చేయడమూ జరుగుతోంది. సమాచారం కోసం ఆన్‌లైన్‌పై అధికంగా ఆధారపడడం, సామాన్యుల్లో సైతం ఇంటర్నెట్ వినియోగం పెరిగాక వచ్చిన కొత్త తలనొప్పులివి. బాట్లు, ట్రోల్స్, ప్రభావం చూపే ప్రచారాలు... ఇలా పేర్లు ఏమైనా, అన్నిటి పనీ ఒకటే! ఆన్లైన్లో తమకు కావాల్సినట్టు కథనాలు వండివార్చడమే! మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ వగైరా ఆధునిక సాంకేతికతల పుణ్యమా అని త్వరలోనే పూర్తిగా ఏఐ సృష్టించిన వార్తా కథనాలు, పాడ్ కాస్ట్‌లు, డీప్ ఫేక్ చిత్రాలు, వీడియోలతో కూడిన డిజిటల్ ప్రపంచాన్ని మనం పంచుకోవాల్సిన పరిస్థితి. మనం ఊహించలేనంత స్థాయిలో, వేగంతో ఇవన్నీ డిజిటల్ ప్రపంచాన్ని ముంచెత్తనున్నాయి. ఓ అధ్యయనం ప్రకారం 2018 నాటికి కనిపెట్టిన డీప్‌ఫేక్‌లు 10 వేల లోపే! ఇవాళ ఆన్లైన్లో వాటి సంఖ్య లక్షల్లోకి చేరింది. కొత్త కృత్రిమ మీడియా సమాచారం ఆందోళనకరం. నిరుడు ఉక్రెయిన్‌పై దాడిని సమర్థించుకొనేందుకు రష్యా డీప్ ఫేక్‌లను వాడే ప్రమాదం ఉందని పాశ్చాత్య దేశాలు అనుమానించాయి. ఈ ఏడాది మే నెలలో వైట్‌హౌస్ సమీపంలో పొగ వస్తున్న డీప్‌ఫేక్ చిత్రం దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. డీప్‌ఫేక్ కాకున్నా, రచయితల సమ్మె వేళ స్వర్గీయ తారల్ని తెరపై పునఃసృష్టించే పనికి హాలీవుడ్ స్టూడియోలు దిగడమూ నైతికతపై చర్చ రేపింది. సైబర్ ఆర్థిక నేరాలు, అసలును పోలిన నకిలీ సృష్టితో శీలహననం నుంచి దేశ భద్రత దాకా సాంకేతికత నీలినీడ పరుస్తోంది. సినీ తారలు ఇవాళ ఎదుర్కొన్న ఇబ్బంది సామాన్యులకు ఎదురవడానికి ఎంతో కాలం పట్టదు. ఈ ఏడాది ప్రపంచంలో 5 లక్షల డీప్‌ఫేక్ ఆడియో, వీడియోలు సోషల్ మీడియాలో షేరవుతాయని అంచనా. పైగా, డీప్‌ఫేక్ వీడియోల్లో 98 శాతం ఆడవారిపై చేసినవే. బాధిత ప్రపంచ దేశాల్లో 6వ స్థానం మనదే! ఆ మాటకొస్తే, 2020లోనే అజ్ఞాత సేవగా సాగిన ‘డీప్ న్యూడ్’ గురించి పరిశోధకులు బయటపెట్టారు. ఒక వ్యక్తి ఫోటోలను వారి అంగీకారంతో సంబంధం లేకుండా, క్రమం తప్పక అందించడం ద్వారా నకిలీ నగ్నచిత్రాలను సృష్టించే ఆ సర్వీస్‌పై రచ్చ రేగింది. పలు పాశ్చాత్య దేశాల్లో అరెస్టులు, దర్యాప్తులు, చట్టాల్లో మార్పులు జరిగాయి. కాలంతో పాటు సాంకేతికత మారి, జనజీవితంపై దాడి చేస్తున్న సమయంలో మన ప్రభుత్వాలు అవసరమైన కట్టుదిట్టాలు, చట్టాలు చేయకపోవడం సమస్య. ఫిర్యాదు చేసిన 24 గంటల్లో సోషల్ మీడియా సంస్థలు సదరు మార్ఫింగ్ కంటెంట్‌ను తొలగించాలన్న రూలు ఇప్పటికే ఉంది. కానీ, డీప్ ఫేక్‌లను ముందే అరికట్టే చర్యలు అవసరం. అమెరికా లాంటి చోట్ల అరకొర చట్టాలతోనైనా ఆపే ప్రయత్నం జరుగుతోంది. బ్రిటన్‌లో డీప్‌ఫేక్ అశ్లీల వీడియోల తయారీ చట్టరీత్యా నేరం. చైనాలో ఏకంగా నిషేధమే ఉంది. వీడియోను మార్చినా, మార్పు చేసిన వీడియో అని రాయాల్సిందే. యూరోపియన్ యూనియన్ లాంటివీ కఠిన నియమాల రూపకల్పనకు కిందా మీదా పడు తున్నాయి. మన దేశంలోనూ అలాంటి ప్రయత్నం తక్షణమే జరగాలి. బాహ్య ప్రపంచంలో లానే వర్చ్యువల్ లోకంలోనూ వనితలను లక్ష్యంగా చేసుకొని, వారిపై సాగుతున్న ఈ హేయమైన దాడిని అడ్డకుంటే అది సభ్య సమాజానికే అవమానం. -
ఈ నరమేధం ఆగాలి!
నెల దాటిపోయినా, పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి వ్యవహారానికి ముగింపు కనిపించడం లేదు. గాజా భూఖండంపై భూతల దాడిని ఇజ్రాయెల్ ముమ్మరం చేయడంతో మారణహోమం ముమ్మరమవుతోంది. ఆ ప్రాంతమంతటినీ నిర్జనవాసంగా మార్చేంత వరకు నెతన్యాహూ నిద్ర పోయేలా లేరు. పైపెచ్చు, గాజా ప్రాంతపు భద్రత బాధ్యత ఇకపై తమదేనంటూ ఇజ్రాయెల్ ప్రధాని సోమవారం మరో బాంబు పేల్చారు. దాని భావమేమిటో ఆయన విడమరిచి చెప్పనప్పటికీ, గాజాను తన హస్తాల్లో బిగించనున్నట్టు అర్థమవుతూనే ఉంది. గాజాను పునరాక్రమించుకోవడం, లేదంటే కనీసం 2005 సెప్టెంబర్ ముందు లాగా గాజా అంతటా తమ సైన్యమే ఉండేలా చూసు కోవడం ఇజ్రాయెల్ మనసులో మాటగా కనిపిస్తోంది. అదేమీ లేదని నెతన్యాహూ సహచరులు పైకి చెబుతున్నా, ఆ మాటలను నమ్మడం కష్టమే. సాక్షాత్తూ అమెరికా సైతం తనతో సహా పశ్చిమ దేశాలన్నీ తీవ్రవాద సంస్థగా భావిస్తున్న హమాస్‌తో రేపెప్పుడో యుద్ధం ముగిశాక గాజాను ఇజ్రాయెల్ పునరాక్రమించుకోరాదంటూ బుధవారం హెచ్చరించాల్సి వచ్చింది. అదే సమయంలో గాజాలో హమాస్ పాలన కొనసాగరాదనీ, అదే జరిగితే మళ్ళీ మొన్న అక్టోబర్ 7 తరహా దాడులు పునరావృతం కావచ్చనీ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సన్నాయినొక్కు నొక్కారు. గాజా దిగ్బంధనం, భూభాగాన్ని తగ్గించడం, బలవంతాన జనాన్ని ఖాళీ చేయించడం లాంటివేమీ చేయరాదనీ, వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనియన్ అథారిటీ పాలన సాగించాలనీ అన్నారు. హమాస్‌ను నిర్వీర్యం చేయడమే లక్ష్యమని పైకి చెబు తున్నప్పటికీ, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న ధోరణి చూస్తే అలా అనిపించడం లేదు. సరిహద్దులు దాటి హమాస్ చేసిన అక్టోబర్ 7 నాటి దాడిలో ఇజ్రాయెల్‌లో 1400 మంది ప్రాణాలు కోల్పోగా, 240 మంది దాకా బందీలయ్యారు. ఇజ్రాయెల్ నెల రోజుల పైగా సాగిస్తున్న ప్రతీకార దాడిలో ఇప్పటికి 11 వేల మంది దాకా ప్రాణాలు కోల్పోయారని లెక్క. దాడికి ప్రతిదాడిగా మొదలై, తీవ్రవాదం పేరు చెప్పి, అమాయక ప్రజలు సహా అందరినీ కబళిస్తున్న యుద్ధం ఆందోళన కలిగిస్తోంది. పొరుగున ఉన్న భూఖండంలో నరమానవుడు మిగలకుండా నేలమట్టం చేయాలన్న ఇజ్రాయెల్ దుందుడుకుతనం తీవ్రమైనది. ఇదే దూకుడు కొనసాగితే... అప్పుడిక పాలస్తీనా పక్షాన ఇరాన్ తదితర దేశాలు నేరుగా బరిలోకి దిగితే... పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. దేశదేశాల ప్రపంచ వేదిక ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో మెజారిటీ దేశాలు శాంతిస్థాపన వైపు మొగ్గి, యుద్ధ విరమణకు తీర్మానం చేయకపోలేదు. అయితే, ఆ శాంతి వచనాలను పట్టించుకున్న నాథుడు లేడు. ఆ తీర్మానాన్ని అమలు చేసేందుకు సమకట్టాల్సిన అగ్రదేశాల్లో అధికభాగం ఈ యుద్ధంలో ఏదో ఒక పక్షం వెనుక పరోక్షంగానైనా నిలబడడం పెద్ద సమస్య. ఐరాస ప్రధాన కార్య దర్శి ఆ మధ్య అన్నట్టు... ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి ఉన్నట్టుండి ఏ శూన్యం నుంచో జరగలేదు. అదే సమయంలో ఆయనే వ్యాఖ్యానించినట్టు... పాలస్తీనియన్లు కష్టాలు, కన్నీళ్ళకు పరిష్కారం ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన భయానక దాడి కూడా కాదు. నాణానికి ఉన్న ఈ రెండు వైపులనూ సమగ్రంగా చూడగలిగితేనే ప్రపంచ దేశాలు ఈ సంక్లిష్ట సమస్యకు సరైన జవాబు ఆలోచించగలవు. అసలు తాజా పరిణామాలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ బాధ్యత కూడా చాలానే ఉంది. అక్టోబర్ 7 హమాస్ దాడికి దారితీసిన ఇజ్రాయెల్ గూఢచర్య వైఫల్యానికీ, అసలు హమాస్ తీవ్రవాదం పెచ్చరిల్లడానికీ, నెల రోజులుగా పాలస్తీనా – ఇజ్రాయెల్‌లలో సాగుతున్న ప్రాణనష్టానికీ ఆయనే బాధ్యుడని సొంత పౌరులే తప్పుబడుతున్నారు. ఇజ్రాయెల్ రాజకీయాల్లోని అస్థిరత సైతం గడచిన కొన్ని వారాల పరిస్థితికి పాక్షికంగా కారణమే. వాటి నుంచి దృష్టి మరల్చ డానికే అన్నట్టుంది నెతన్యాహూ వ్యవహారం. హమాస్‌కు అడ్డాలుగా మారాయంటూ, ఆయన ఆస్పత్రులపై బాంబులు వేయించారు. చివరకు నిరాశ్రయులైన పాలస్తీనీయులకు ఆశ్రయమిస్తున్న గాజాలోని అతి ప్రాచీన గ్రీకు ఆర్థొడాక్స్ చర్చినీ వదల్లేదు. గాజాలోని నివాస వసతుల్లో దాదాపు సగానికి పైగా దాడుల్లో నేలమట్టమైన పరిస్థితి. హమాస్ పేరిట సామాన్యులపై సాగుతున్న ఈ అసాధారణ యుద్ధ నేరంపై సహజంగానే నిరసన తలెత్తింది. ఇజ్రాయెల్ పక్షీయులతో సహా అన్ని దేశాలపై ఇప్పుడు తక్షణ కాల్పుల విరమణకు అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. జీ–7 దేశాల విదేశాంగ మంత్రులు తమ తాజా సమావేశంలో శాశ్వత యుద్ధ విరమణ ఊసెత్త కుండా, అమాయక పాలస్తీనా పౌరులకు సాయం అందించడానికి వీలుగా మానవతా దృక్పథంతో దాడులకు విరామాలు ఇవ్వాలని కోరారు. విస్తృత శాంతి ప్రక్రియకు పూనుకోవాలని మాత్రం అనVýæలిగారు. ఇవి కంటితుడుపు మాటలే. గాజాలో నరమేధాన్ని మౌనంగా చూస్తున్న ప్రపంచ మానవాళి మొత్తం సమష్టి బాధ్యత వహించాల్సిందే. ఎవరి అంతరాత్మకు వారు జవాబు చెప్పుకోవా ల్సిందే. రోజూ 160 మంది పాలస్తీనా పసివాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ఒక పోరులో పదుల సంఖ్యలో జర్నలిస్టులు అసువులు బాశారు. గాజాలో తిండి, నీరు లేక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక విలపిస్తూ, ఆత్మీయుల మృతదేహాలను గుర్రపుబండ్లల్లో తీసుకెళుతున్న దృశ్యాల్ని చూసి మనసు కరగనివారు మనుషులు కారు. ఇది త్రాసులో తప్పొప్పుల లెక్కలు తేల్చే తరుణం కాదు. అన్నెం పున్నెం ఎరుగని పిల్లల్నీ, అమాయకుల్నీ ఈ మతి లేని మహా విధ్వంసం నుంచి కాపాడాల్సిన సమయం. చిన్నారుల మరుభూమిగా మారు తున్న గాజా మరింత విధ్వంసంలోకి జారిపోక ముందే యుద్ధానికి తెర దించడం అత్యవసరం. -
ఈ నగరానికి ఏమైంది?
ప్రభుత్వాల మధ్య ఆరోపణల పర్వం వింత కాకపోవచ్చు. కానీ, పర్యావరణ అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిందారోపణలు సాగడం విచిత్రమే. దేశ రాజధానిలోని వాయు కాలుష్యం వ్యవహారంలో ఇప్పుడు కేంద్రానికీ, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికీ నడుమ చోటుచేసుకుంటున్నది అదే. ఢిల్లీ – ఎన్సీఆర్ (దేశ రాజధాని ప్రాంతం)లో మంగళవారం సైతం వాయునాణ్యత ‘తీవ్ర ఆందోళన దశ’లో ఉన్న వేళ... చివరకు సర్వోన్నత న్యాయస్థానం సైతం జోక్యం చేసుకుంది. వాయు కాలుష్యాన్ని ఓ రాజకీయ పోరుగా మార్చరాదనీ, గాలి నాణ్యత ప్రజారోగ్యాన్ని హత్య చేస్తోందనీ న్యాయస్థానం చెప్పాల్సి వచ్చింది. పొరుగున పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లలో పంట వ్యర్థాలను తగలబెట్టడమే ఏటా చలికాలంలో ఢిల్లీ వాయు కాలుష్యానికి ప్రధాన కారణమని కోర్ట్ అభిప్రాయపడింది. రాష్ట్రాలన్నీ ఈ కొయ్యకాళ్ళ దహనాన్ని ఆపాలని ఆదేశించింది. ఢిల్లీలో కాలుష్యం తగ్గించడానికి సరి – బేసి వాహనాల ట్రాఫిక్ నియంత్రణ విధానాన్ని మళ్ళీ తేవాలన్న ఢిల్లీ ఆప్ సర్కార్ నిర్ణయం కంటితుడుపేనని కోర్ట్ కుండబద్దలు కొట్టడం పరాకాష్ఠ. ఢిల్లీ పరిసరాల్లో వాయునాణ్యత తృప్తికరమైన దాని కన్నా నాలుగు రెట్లు క్షీణించి, మంగళవారం సైతం వాయు నాణ్యత సూచి దాదాపు 400 మార్కుకు దగ్గరగా నిలిచిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డ్ మాట. ఏడేళ్ళ తర్వాత కాలుష్యం దెబ్బతో స్కూళ్ళు మూతబడ్డాయి. ఇప్పటికే ఆఫీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టారు. దట్టమైన పొగ నిండిన రోడ్లతో, గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ, ముక్కులకు మాస్కులు తగిలించుకొని సాహసించి జనం బయటకు రావాల్సిన పరిస్థితి. ఈ కాలుష్య బాధ నుంచి తప్పించుకోవడానికి ఇప్పటికే పెద్ద సంఖ్యలో పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు తరలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో తిరిగాయి. మనుషులే కాదు మూగజీవాలైన పక్షులూ పెద్దయెత్తున అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి. ఉన్నంతలో వాహన కాలుష్యాన్ని తగ్గించాలని ఈ నెల 13 నుంచి సరి – బేసి విధానం పాటిస్తామని ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. 2019 తర్వాత ఢిల్లీలో మళ్ళీ ఈ పద్ధతిని తేవడం ఇదే తొలిసారి. పరిస్థితి తీవ్రతకు ఇది ప్రతీక. ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయి ఒక్కసారిగా పెరిగిపోవడం, పరిసర రాష్ట్రాల్లో కొయ్యకాళ్ళను కాల్చడం లాంటివి కనీసం పదేళ్ళుగా చూస్తున్నాం. కొన్నేళ్ళుగా ఇది రాజకీయ అంశమూ అయింది. పంట వ్యర్థాలను తగలబెడుతున్నవారిపై చర్యలు తీసుకోవడంలో పొరుగున ప్రత్యర్థి పార్టీలు అధికా రంలో ఉన్న పంజాబ్, హర్యానాలు విఫలమవుతున్నాయని ఢిల్లీ ఆప్ సర్కార్ గతంలో ఆరోపిస్తూ వచ్చింది. ఇప్పుడు పంజాబ్‌లో సొంత సర్కారే ఉన్నా, పరిస్థితిలో మార్పు లేదు. విడ్డూరమేంటంటే, పర్యావరణ అంశాలకు వచ్చేసరికి సుప్రీమ్ కోర్టే ప్రతిసారీ జోక్యం చేసుకోవాల్సి రావడం! ‘పర్యావ రణ పరిరక్షణ కోర్టు బాధ్యత అనుకోవడం తప్పు. వాయు, శబ్ద కాలుష్య నియంత్రణ బాధ్యత ప్రతి ఒక్కరిదీ’ అని సుప్రీమ్ మరో కేసులోనూ హితవు పలకాల్సొ చ్చింది. టపాసుల్లో నిర్ణీత రసాయనాల వాడకంపై నిషేధం ఢిల్లీకే కాక, అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని కుండబద్దలు కొట్టాల్సి వచ్చింది. రాజధానిలో ఇంత రచ్చ జరుగుతున్నా, పంజాబ్ లాంటి చోట్ల ఇప్పటికీ యథేచ్ఛగా మోళ్ళ కాల్చివేత కొనసాగుతూనే ఉంది. ఇటీవల పంజాబ్‌లో ఈ దహనాలు 740 శాతం మేర హెచ్చాయి. ఒకే రోజు వెయ్యి నుంచి 3 వేల పైగా అలాంటి ఘటనలు రికార్డవుతున్నాయి. ఫలితంగా ఏటా నవంబర్, జనవరి మధ్యన ఢిల్లీ వాయునాణ్యత దారుణంగా పడిపోవడం రివాజైంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు తప్పును పక్కవారి మీదకు నెట్టివేస్తే లాభం లేదు. ఢిల్లీలోని ఈ వాయు కాలుష్యాన్ని జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలి. స్థానిక అవసరాలు, దీర్ఘకాలిక సంప్రదాయా లను దృష్టిలో పెట్టుకొంటూనే మోళ్ళను కాల్చడాన్ని నిషేధిస్తూ, కేంద్ర స్థాయిలో చట్టం తీసుకు రావచ్చు. దశాబ్దాల క్రితమే అమెరికా లాంటి చోట్ల తెచ్చిన కఠినమైన చట్టాలు ఫలితాన్నిచ్చాయి. అయితే, పంజాబ్ లాంటి చోట్ల మోళ్ళ కాల్చివేతను నిషేధిస్తూ, చట్టమున్నా అమలు శూన్యం. అందుకే, వట్టి చట్టం చేయడం కన్నా అందరూ పాటించే ఆచరణాత్మక మార్గం చూడడం ఉత్తమం. నిజానికి, ఖరీఫ్‌లోని పంట కోత తర్వాత, రబీ సీజన్‌కు 10 నుంచి 14 రోజుల్లో రైతులు త్వరితగతిన పొలాల్ని సిద్ధం చేయాలి. అందుకు వరి మోళ్ళను తగులబెట్టడమే మార్గమని వారి భావన. ఈ పరిస్థితుల్లో హానికారక కాలుష్యంపై చైతన్యం పెంచాలి. పంట వ్యర్థాలను వదిలించుకొనేందుకు ఆధునిక ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలి. దాదాపు 3.3 కోట్ల జనాభాకు నివాసమైన దేశ రాజధాని ఇవాళ ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత నగరం. ఈ గాలి పీల్చడం వల్ల ఢిల్లీ వాసులకు శ్వాసకోశ వ్యాధులు రావడమే కాదు, సగటు ఆయుర్దాయం దాదాపు 11.9 ఏళ్ళు తగ్గుతోందని చికాగో విశ్వవిద్యాలయ అధ్యయనం. గతంలో బీజింగ్, లండన్ లాంటివీ ఈ సమస్యను ఎదుర్కొని బయటపడ్డవే. వారి అనుభవాల నుంచి పాఠాలు నేర్వాలి. ఢిల్లీలో స్మోక్ టవర్ల ఏర్పాటును పెంచాలి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగేలా సబ్సిడీలతో ప్రోత్సహించాలి. కేంద్రం సైతం వాయుకాలుష్య పరిష్కారం తన బాధ్యత కాదని చేతులు దులుపు కోలేదు. ముందుకొచ్చి, నిర్ణీత బడ్జెట్ కేటాయింపుతో సమస్య తీవ్రత ఉన్న ఢిల్లీ లాంటి రాష్ట్రాలకు అండగా నిలవాలి. ఢిల్లీ లాంటి చోట్ల బయో డీకంపోజర్లను తెస్తామంటూ భారీ వాగ్దానాలు, ప్రచారం చేసి ఇప్పుడా ఊసే ఎత్తని పాలకపక్షాలు సమన్వయంతో సమగ్ర కార్యాచరణకు దిగితేనే సత్ఫలితాలు వస్తాయి. లేదంటే, ప్రతి ఏటా ఇదే వాయు కాలుష్యం మాట వినాల్సి వస్తుంది. -
శరణార్థులపై పాక్ పంజా
నిన్నటి వరకూ ఎత్తుకుని ముద్దాడినవారు హఠాత్తుగా విసిరికొడితే...? ఇప్పుడు పాకిస్తాన్లో తలదాచుకుంటున్న అఫ్గానిస్తాన్ శరణార్థులు ఇలాంటి దుఃస్థితిలోనే పడ్డారు. ఇజ్రాయెల్ గడ్డపై హమాస్ దాడుల పర్యవసానంగా దాదాపు నెలరోజుల నుంచి గాజా స్ట్రిప్‌లో మారణహోమం సాగుతోంది. నిరాయుధ పౌరులు వేలాదిమంది పిట్టల్లా నేలరాలుతున్నారు. ఈ పరిణామాలపై అరబ్బు ప్రపంచం భగ్గుమంటోంది. కానీ ఈమూల ప్రాణాలు అరచేతపట్టుకుని వచ్చిన శరణార్థులను బలవంతంగా వెనక్కి పంపించటానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. వారిని నరకకూపంలోకి నెట్టడం అన్యాయమని అనేకులు నచ్చజెబుతున్నా, తీవ్ర పర్యవసానాలుంటాయని తాలిబన్లు బెదిరిస్తున్నా పాక్ పాలకులు లక్ష్యపెట్టడం లేదు. చట్టవిరుద్ధంగా వుంటున్న 17 లక్షలమంది శరణార్థుల్లో సోమవారం నాటికి లక్షా 70 వేలమందిని పంపించామని పాక్ ప్రకటించింది. శరణా ర్థుల సమస్య పూర్తిగా పాకిస్తాన్ స్వయంకృతం. నిన్నటివరకూ తన మిత్రులైన తాలిబన్లతో వైరం తెచ్చుకుని, పెరుగుతున్న నేరాలకూ, అధోగతిలో వున్న దేశ ఆర్థికవ్యవస్థకూ అఫ్గాన్ శరణార్థులను కారణంగా చూపి వదుల్చుకోవాలని చూడటం పాకిస్తాన్ సైన్యం కపటనీతికి అద్దం పడుతుంది. 80వ దశకంలో అఫ్గాన్‌పై సోవియెట్ యూనియన్ సైన్యం దురాక్రమణకు దిగినప్పుడు అమెరికా అండతో అఫ్గాన్‌కు అండగా నిలిచినట్టు నటించింది పాకిస్తానే. ఆ వంకన వచ్చిపడిన నిధులు అన్నివిధాలా అక్కరకొచ్చాయి. సోవియెట్ దళాలు నిష్క్రమించాక తాలిబన్ల ఏలుబడి మొదలైనప్పుడు వారితో చెట్టపట్టాలేసుకుని వారి అరాచకాలకు అండదండలందించింది, వారిని ఉసిగొల్పి మన దేశాన్ని చికాకుపరిచింది కూడా పాకిస్తానే. 2001లో తమ దేశంపై ఉగ్రదాడి జరిగాక అమెరికా ఆగ్రహించి అఫ్గాన్‌పై దండయాత్రకు దిగింది. తాలిబన్లను తొలగించి తమ అనుకూలురను ప్రతిష్టించింది. అనంతరకాలంలో పరిమిత ప్రాంతాల్లోనైనా అంతో ఇంతో సాధారణ పరిస్థితులుండేవి. మహిళలు చదువుకోవటానికి, వృత్తి ఉద్యోగాలు చేసుకోవటానికి వీలుండేది. మన దేశం, మరికొన్ని దేశాలు అఫ్గాన్‌లో అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాయి. ఇదంతా పాకిస్తాన్‌కు కంటగింపైంది. అఫ్గాన్‌లో తమ హవా సాగటం లేదన్న దుగ్ధతో పాకిస్తాన్ అక్కడ ఏదోవిధంగా పాలకులను చికాకుపరిచేది. చివరకు అమెరికాలో ట్రంప్ హయాం వచ్చాక చడీచప్పుడూ లేకుండా తాలిబన్ల తరఫున ఆయనతో రాయబారాలు జరిపి, వారు పూర్తిగా మారిపోయారని నమ్మబలికింది. ఆ తర్వాతే అమెరికా మంచి తాలిబన్లు, చెడ్డ తాలిబన్లు అంటూ వర్గీకరించి అఫ్గాన్ నుంచి నిష్క్రమించేందుకు దారులు వెదుక్కొంది. ఈ క్రమం అంతటా పాకిస్తాన్ ఆడిన ప్రమాదకర క్రీడ అడుగడుగునా కనబడుతూనే వుంది. తీరా రెండేళ్లక్రితం తాలిబన్ల పాలన మొదలయ్యాక ఇద్దరికీ చెడింది. పాక్ సైన్యం చేతుల్లో కీలుబొమ్మలు కావటానికి తాలిబన్లు ససేమిరా అనటం, తమ సహజ వనరులను పాక్ పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి అంగీకరించకపోవటం సైన్యానికి ఆగ్రహం కలిగించింది. శరణార్థులను వెనక్కు పంపటంలోని ఆంతర్యం అదే. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం పాకిస్తాన్‌లోని అఫ్గాన్ శరణార్థుల సంఖ్య 13 లక్షలు. మరో 8 లక్షల 80 వేలమంది చట్టబద్ధంగా అక్కడుంటున్నారు. వీరిలో 2021లో మళ్లీ తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నాక ప్రాణభయంతో వచ్చినవారు దాదాపు 6 లక్షలమంది. వీరుగాక 1980 ప్రాంతంలో సోవియెట్ దురాక్రమణ సమయంలో వచ్చిన 3 లక్షలమంది శరణార్థులున్నారు. కానీ పాక్ సైన్యం లెక్కలు వేరేలా వున్నాయి. 17 లక్షలమంది శరణార్థులు అక్రమంగా వుంటున్నారని అది చెబుతోంది. ఎవరి లెక్కలు ఏమైనా శరణార్థుల్లో అనేకులు దశాబ్దాలుగా ఉపాధి వెదుక్కొని ఇస్లామాబాద్ మొదలుకొని కరాచీ వరకూ అనేక నగరాల్లో స్థిరపడి అక్కడే తమకంటూ గూడు ఏర్పర్చుకున్నారు. ఆ సమాజంలో భాగమయ్యారు. వారి పిల్లలు చదువుకుంటున్నారు. ఉపాధి వెదుక్కున్నారు. కొందరు ఆస్తులు కూడబెట్టుకున్నారు. కానీ హఠాత్తుగా పాకిస్తాన్ సైన్యం పోలీసులు, సైన్యం విరుచుకుపడి వారి అధికారిక పత్రాలు స్వాధీనం చేసుకుని పొమ్మంటే ఏమై పోవాలి? తనకు అనుకూలంగా వున్నప్పుడు సమస్యను చక్కగా వినియోగించుకుని, తాలిబన్లతో తకరారు తలెత్తాక ఇన్ని లక్షలమందిని కట్టుబట్టలతో గెంటేయాలని చూడటం ఏం న్యాయం? ఇప్పుడు దేశవ్యాప్తంగావున్న అఫ్గాన్ శరణార్థులను సరిహద్దుల్లోని తోర్ఖాం ప్రాంతానికి తరలించి నరకాన్ని తలపించే గుడారాల్లో కుక్కుతోంది. కొందరిని బలూచిస్తాన్ వైపున్న చమన్వైపు తరలిస్తోంది. ఒకపక్క అమానవీయంగా ఇన్ని లక్షలమందిని నరక కూపంలోకి నెడుతూ స్వచ్ఛందంగా పోతున్నారని సైన్యం తప్పుడు ప్రచారం చేస్తోంది. 1950 ప్రాంతం తర్వాత దేశంనుంచి ఇంత పెద్దయెత్తున జనం తరలిపోవటం ఇదే ప్రథమమని పాకిస్తాన్ మీడియా చెబుతోంది. ఉగ్రవాదం విషయంలో పాక్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరే దేశంలో ఆత్మాహుతి దాడులు, ఇతర నేరాలు పెరగటానికి కారణం. తాము మద్దతుగా నిలిచిన తాలిబాన్లే అడ్డం తిరగటంతో సైన్యానికి దిక్కుతోచటం లేదు. దానికితోడు దేశంలో పౌర ప్రభుత్వంతో పొసగటం లేదు. ఇమ్రాన్‌ను ప్రధాని పదవి నుంచి దించినా అంతా అనుకున్నట్టు జరగలేదు. త్వరలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. దేశం దివాలా తీసింది. ఈ పరిస్థితుల్లో సకల క్లేశాలకూ శరణార్థులను బాధ్యులుగా చూపి, బలిపశువుల్ని చేయటం దుర్మార్గం. అంతర్జాతీయ చట్టాలను గౌరవించి శరణార్థుల విషయంలో కనీస మానవీయత ప్రదర్శించటం అవసరమని పాక్ సైన్యమూ, పాలకులూ గుర్తించాలి. -
కాలాన్ని గెలిచినవాడు
గతం అనేది ఎక్కడుంది? గతంలో జీవించిన మనుషులు కాలపు పొరల్లో ఎక్కడ చిక్కుకుని ఉన్నారు? గత సంఘటనలు ఏ కాలగర్భంలో వెచ్చగా దాగి ఉన్నాయి? గతం తాలూకు ఆలంబన అంటూ లేకపోతే మనిషికి వర్తమానంలో ఉన్నదేమిటి? గతం అనేది మనిషి యావజ్జీవితపు ధ్రువపత్రం. కానీ గతాన్ని వర్తమానంలోకి లాగే మంత్రదండం ఎక్కడుంది? జ్ఞాపకం ద్వారా మాత్రమే గతాన్ని చైతన్యవంతం చేయగలం. కానీ ఆ జ్ఞాపకం స్వచ్ఛందంగా మనసులోకి దూకాలి. అలా దూకాలంటే ఇంద్రియాలను ఏదో కదిలించాలి. అది ‘బలమైనదే’ కానక్కరలేదు.బలంగా ముద్ర వేసినదైతే చాలు. అనుకోకుండా ఒక చలికాలం పూట వెచ్చదనం కోసం అమ్మ ఇచ్చిన టీ కప్పులో ‘మడలీన్ ’ అనే చిన్న గుండ్రపాటి కేకును అద్దుకోగానే, ఆ మొదటి రుచి అంగిలికి తాకగానే, ఎప్పుడో చిన్నతనంలో తాము నివసించిన ‘కోంబ్రే’లో అనుభవించిన అదే రుచి మార్సెల్ ప్రూస్ట్‌కు చప్పున గుర్తొస్తుంది. ఆ వెనువెంటనే బాల్యంలో తిరగాడిన ఆ ఊరు, ఆ మనుషుల తాలూకు జ్ఞాపకాలు జలజలా రాలుతాయి. ఇక కాలంలో వెనక్కి ఈదుకుంటూ వాళ్ల కుటుంబీకుల పుట్టుపూర్వోత్తరాలు ఏకధారగా వల్లెవేయడానికి కూర్చుంటాడు. అలా గతాన్ని స్వగతంగా మార్చుకోవడం ద్వారా ఇరవయ్యో శతాబ్దపు అత్యంత విస్తారమైన ఆత్మకథాత్మక నవలారాజం ‘ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైమ్’ సాహిత్యలోకానికి అందింది. సుమారు నాలుగు వేల పేజీలున్న ఈ నవల 1913 నుంచి 1927 మధ్య ఏడు భాగాలుగా ప్రచురితమైంది. ఏ రచయితకైనా గతమే పెట్టుబడి. కానీ ప్రత్యేకించి ఆ గతంలో జీవిత పరమార్థాన్ని అన్వేషించడంలోనే ప్రూస్ట్ రచనా వైభవం దాగివుంది. కాలం అనే విధ్వంసక శక్తిని కళ అనే సాధనంతో ఆయన ఎదుర్కొన్నాడు. కాలంలో కలిసిపోయిన వారిని సాహిత్యం ఊతంగా సజీవ మూర్తులుగా నిలబెట్టాడు. సమకాలీన ఫ్రెంచ్ సమాజపు రీతులు, బాధలు, భయాలు, తపనలు, ఒంటరితనాలు, సరదాలు, సంతోషాలు, నిర్దయలు, క్షమలు, ఇంకా ఆయన సంక్లిష్ట లైంగికేచ్ఛలు అన్నీ అక్షరాల్లోకి తెచ్చాడు. కిటికీలోంచి సముద్రం మీద కనబడే సూర్యోదయాన్ని చూస్తూ అనుభవించే తన్మయత్వంలా రాతను మలిచాడు. చరిత్రకారుడు, తాత్వికుడు, మానసిక శాస్త్రజ్ఞుడు, రాజకీయాంశాల వ్యాఖ్యాత, ఇంకా ‘పర్వర్టు’, ఇంకా ఒక కవి– ఇలా ఆరుగురు ప్రూస్టులు ఇందులో కనబడతారంటారు ఆడమ్ గోప్నిక్. సంగీతం, సాహిత్యం, యుద్ధం, సమాజం, పెయింటింగ్, శృంగారం, కళలు, అసూయ, ఫ్యాషన్లు– ఇలా ప్రూస్ట్ అభిప్రాయానికి చిక్కకుండా మిగిలిపోయేది ఏదీ ఉండదు. ‘తన జీవితపు మెటీరియల్‌ను ఇంత బాగా ఏ రచయితా వాడుకోలేదు’ అంటారు టెన్నెస్సీ విలియమ్స్. ‘ఒక రచయిత ఒకసారి చదివితే పూర్తయ్యేట్టయితే ఆ రచయిత పెద్దగా ఏమీ చెప్పనట్టు! హోమర్లాగా జీవితకాలం వెంటతెచ్చుకోగలిగే రచయిత ప్రూస్ట్’ అంటారు డేనియల్ మెండెల్సన్ . కలిగిన ఫ్రెంచ్–యూదు కుటుంబంలో పుట్టాడు మార్సెల్ ప్రూస్ట్ (10 జూలై 1871– 18 నవంబర్ 1922). ఐఫిల్ టవర్‌ను నిర్మించిన ఇంజినీర్ గుస్తావ్ ఐఫిల్... ప్రూస్టులకు సన్నిహితుడు. తొమ్మిదో ఏట నుంచే ప్రూస్టుకు ఉబ్బసంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలుండేవి. ప్యారిస్ ఉన్నత సమాజంలో ముందు కలియ తిరిగినప్పటికీ రానురానూ ఏకాంతంలోకి వెళ్లిపోయాడు. బయటి నుంచి వచ్చే పెద్ద శబ్దాలను కూడా భరించేవాడు కాదు. హైపర్ సెన్సిటివ్. అందుకే పగలు పడుకొని రాత్రుళ్లు రాయడం అలవాటు చేసుకున్నాడు. ‘నిశాచర సరస్వతి!’. కల్పనతో కూడిన తన ఆత్మకథలోని మొదటి భాగమైన ‘స్వాన్స్ వే’ను ఎవరూ ప్రచురించడానికి ముందుకు రాలేదు. దాంతో సొంత డబ్బుతో అచ్చు వేయించుకున్నాడు. దాన్ని తిరస్కరించినవారిలో అప్పటి ప్రఖ్యాత రచయిత ఆంద్రే గిదె కూడా ఒకరు. ‘నా జీవితంలో నేను చేసిన అత్యంత పెద్ద తప్పిదం’ అని ఆయన తర్వాత పశ్చాత్తాపపడ్డారు. తన మృత్యువు సమీపంలో ఉందని ప్రూస్ట్‌కు తెలుసు. తన రచన ఎక్కడ పూర్తవ్వదో అనే ఆందోళన ఉండేది. నాలుగు భాగాలు ప్రూస్ట్ బతికి ఉన్నప్పుడే వచ్చాయి. ఆయన రాసుకున్న డ్రాఫ్టుల ఆధారంగా తర్వాతి మూడు భాగాలు ఆయన తమ్ముడు రాబర్ట్ ప్రూస్ట్, రచయిత జాక్వెస్ రివియేరీ సంపాదకులుగా వచ్చాయి. ఇందులో ఐదో భాగం అయిన ‘ద ప్రిజనర్’ సరిగ్గా నూరేళ్ల కింద 1923లో వచ్చింది. ఇది అనారోగ్యంతో ప్రూస్ట్ చనిపోయాక విడుదలైన మొదటి భాగం. ఇప్పుడు ఆంగ్లంలో ప్రామాణిక అనువాదంగా పరిగణిస్తున్నది బ్రిటిషర్ అయిన సి.కె.స్కాట్ మాంక్రీఫ్ చేసినది. ఆయన పెట్టిన పేరు ‘రిమెంబ్రన్స్ ఆఫ్ థింగ్స్ పాస్ట్’. చాలా ఏళ్లు ఈ పేరుతోనే వ్యాప్తిలో ఉన్నప్పటికీ, ఈ అనువాదానికి తర్వాత మెరుగులు దిద్దినవారిలో ఒకరైన డి.జె.ఎన్ రైట్ నవల పేరును ‘ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైమ్’గా మార్చారు. ఈ శీర్షికే ప్రూస్ట్ మానసిక ప్రపంచానికి దగ్గరగా ఉండి, స్థిరపడిపోయింది. ప్రూస్ట్ ఇల్లియర్స్ అనే చోట తన చిన్నతనం గడిపాడు. దాని ఆధారంగానే ‘కోంబ్రీ’ని సృష్టించాడు. 1971లో ప్రూస్ట్ శతాబ్ది సందర్భంగా దానికి ‘ఇల్లియర్స్–కోంబ్రీ’గా నామకరణం చేసి రచయిత పట్ల గౌరవం చాటుకున్నారు. జీవితం లోంచి సాహిత్యంలోకి వచ్చిన పేరు, మళ్లీ సాహిత్యం లోంచి జీవితంలోకి వచ్చింది. ఒక కొత్త మనిషిని అర్థం చేసుకోవడానికి పాత్రికేయులు ‘ప్రూస్ట్ ప్రశ్నావళి’(ప్రూస్ట్ క్వశ్చనెయిర్) అని అడుగుతుంటారు. మన జీవితానికి దగ్గరగా వెళ్లాలంటే– నేనెవరు? ఈ జీవితంతో ఏం చేసుకోవాలి? అనే ప్రశ్నలను అన్వేషిస్తూ జీవిత సాగరాన్ని అన్వేషించిన ప్రూస్టియన్ ప్రపంచంలోకి వెళ్లాలి. -
కాంగ్రెస్ వెనుక అదృశ్య హస్తం!
కొన్ని సారూప్యతలు కాకతాళీయం కావచ్చు. కొన్ని కాకతాళీయంగా భ్రమింపజేసే ప్రణాళికలు కావచ్చు. 83 సంవత్సరాల వృద్ధుడైన విప్లవ కవి వరవరరావుకు కూడా హైదరాబాద్‌లో క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకోవడానికి ముంబై ఎన్ఐఏ కోర్టు అనుమతి లభించింది. అయితే ఈ అనుమతి కోసం ఆయన గత ఏడాదిన్నర కాలంగా ప్రయత్నిస్తున్నారట! చంద్రబాబు కూడా క్యాటరాక్ట్ ఆపరేషన్ కోసం హైకోర్టు నుంచి మెడికల్ బెయిల్ సంపాదించిన సంగతి తెలిసిందే. వరవరరావుకు చంద్రబాబు కంటే ఓ వారం రోజుల ముందే కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఆయనకు ఆపరేషన్ కోసం ఒక వారం రోజులు మాత్రమే సమయమిచ్చారు. చంద్రబాబుకు ఆ హడావిడి లేదు. న్యాయ స్థానం ఉదారంగానే సమయాన్నిచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ కావడానికి ఒక రోజు ముందే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. సరిగ్గా ఎన్నికల ప్రచారం ముగిసేరోజు దాకా ఆయనకు బెయిల్ గడువు వర్తిస్తుంది. భలే టైమింగ్! రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణ వ్యవహారాల్లో బాబు ఆసక్తి చావలేదు. ఆయనకూ, ఆయనకు కావలసిన వారికీ అక్కడ విస్తారంగా ఆస్తులుండటం అందుకు కారణం కావచ్చు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నించి ఆయన దొరికిపోయిన సంగతి మనకు తెలిసిందే. అలా దొరక్కపోయి ఉన్నట్లయితే డబ్బులు వెదజల్లి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చేయాలని కుట్ర పన్నారట! ప్రభుత్వానికి ఉప్పందడంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోగలిగింది. హైదరాబాద్ మీద ఏపీకి పదేళ్లపాటు ఉన్న రాజధాని హక్కుల్ని వదులుకునేందుకు సిద్ధపడటంతో కేసీఆర్ ఈ కేసులో చంద్రబాబును వదిలేశారు. రెండోసారి అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్‌తో జట్టుకట్టి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నించి భంగ పడ్డారు. ఆయన ఆసక్తికి తగినట్టుగానే ఆయన ప్రస్తుత మెడికల్ బెయిల్ టైమింగ్ కూడా బాగా కుదిరింది. బెయిల్ రావడానికి రెండు రోజుల ముందు తెలంగాణా టీడీపీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌ను చంద్రబాబు ములాఖత్‌కు పిలిపించుకున్నారు. ఆ భేటీ తర్వాత జ్ఞానేశ్వర్ హైదరాబాద్‌కు వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టి పార్టీకి రాజీ నామా చేశారు. ఎన్నికల్లో పార్టీ పోటీ చేయకుండా టీడీపీ అభిమానుల ఓట్లు కాంగ్రెస్‌కు వేయించాలని చంద్రబాబు ఆయనకు చెప్పారట! ఈ వైఖరి నచ్చని జ్ఞానేశ్వర్ తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీ నుంచి తప్పుకున్నారు. ఇదే సమయానికి తెలంగాణ కాంగ్రెస్ వైఖరిలో కూడా మార్పులు రావడం మొదలైంది. రాయ్‌పూర్ తీర్మానం మేరకు బీసీలకు, మహిళలకు, యువతరానికి టిక్కెట్ల పంపిణీలో పెద్ద పీట వేయబోతున్నట్లు ఊదరగొట్టారు. బీసీలకు 34 సీట్లను కేటాయించబోతున్నట్టు రాష్ట్ర నాయకత్వం పలుమార్లు ప్రకటించింది. కానీ కేటాయింపు దగ్గరికొచ్చే సరికి మొండి చేయి చూపెట్టారు. ఏపీ రాజ కీయాల్లో బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్ర బాబు హెచ్చరిస్తుంటారు. తెలంగాణా కాంగ్రెస్ వాళ్లు మాత్రం నిజంగానే బీసీల తోకలు కత్తిరించేశారు. ఇప్పటివరకు ప్రకటించిన 100 సీట్లలో 20 సీట్లు మాత్రమే బీసీలకు ప్రకటించారు. అందులో నాలుగు సీట్లు హైదరాబాద్ పాతబస్తీ లోనివి! డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేని స్థానాలు. అంటే నికరంగా బీసీలకు 16 సీట్లను మాత్రమే కాంగ్రెస్ ఇచ్చి నట్టు! ప్రకటించవలసిన సీట్లు 19. అవన్నీ బీసీలకు ఇస్తేనే కాంగ్రెస్ మాట నిలబెట్టుకున్నట్టు! కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం మరో నాలుగు కంటే ఎక్కువ సీట్లు బీసీలకు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. బీఆర్ఎస్ పార్టీ దూరం పెట్టడంతో అలిగి ఆఫీసుల్లో కూర్చున్న కమ్యూనిస్టు ముత్తయిదువలను కాంగ్రెస్ వాళ్లు బొట్టు పెట్టి మరీ పిలుచు కొచ్చారు. కనీసం చెరో రెండు సీట్లను వాయనంగా ఇస్తామని చివరిదాకా నమ్మబలికారు. ఆఖరు నిమిషంలో చెరొకటే ఇస్తామని చెట్టెక్కడంతో అవమానంగా భావించిన సీపీఎం కాంగ్రెస్‌తో తెగదెంపులు ప్రకటించింది. సీపీఐ మాత్రం ఆ ఒక్కటి చాలనే నిర్ణ యానికి వచ్చినట్టు సమాచారం. పార్టీలో దీర్ఘకాలంగా పని చేస్తున్న వారికీ, యువనేతలకూ టిక్కెట్ల పంపి ణీలో చేయిచ్చినట్టు వార్తలు వచ్చాయి. వారికి బదులుగా దాదాపు 35 మంది పారాచూటర్లకు (అప్పుడే పార్టీలోకి వచ్చినవారు) టిక్కెట్లు కేటాయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపు గుర్రాలనే రంగంలోకి దించాలనే నిర్ణ యంతో రాయ్‌పూర్ డిక్లరేషన్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అదే నిజమైతే పదేళ్లుగా అధికారంలో వుండి బాగా నునుపుదేలి ఉన్న బీఆర్ఎస్ గుర్రాలను ఈ కొత్త గుర్రాలు ఢీ కొట్ట గలుగుతాయా? కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నట్టు వారికి అనుకూలమైన గాలి వీస్తున్నట్టయితే బలిసిన అభ్యర్థులు దేనికి? రాయ్‌పూర్ డిక్లరే షన్‌కు కట్టుబడి ఉండవచ్చు కదా! అభ్యర్థుల ఎంపికకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ వివరణలు సంతృప్తికరంగా లేవు. వారి నిర్ణయాలను వారే తిరగదోడటం వెనుక ఇంకేదో బలమైన కారణం ఉన్నట్టు తోస్తున్నది. పోస్ట్ ఎలక్షన్ ‘అవసరాలను’ కూడా దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. 1994 ఎన్నికలకు ముందు తెలుగుదేశం అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు–రామోజీ ద్వయం ఈ రకమైన వ్యూహాన్ని అమలుచేసింది. వెన్నుపోటు ఘట్టంలో ఈ వ్యూహం వారికి ఉపకరించింది. ‘గెలుపు గుర్రాల’ ఎంపికలో పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వేలను ప్రామాణికంగా తీసుకుంటున్నామని కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటున్నారు. రాయ్‌పూర్ డిక్లరేషన్ తయారు చేయడంలో కూడా సునీల్ పాత్ర ఉందనే ప్రచారం ఉన్నది. తన డిక్లరేషన్‌కు విరుద్ధంగా తానే అభ్యర్థులను ప్రతిపాదిస్తాడా? ఇంకేదైనా కారణం ఉన్నదా? సునీల్ కనుగోలు మనవాడే! బళ్లారిలో పుట్టి పెరిగిన తెలుగువాడు. ఆంధ్రరాష్ట్రంతో సామాజిక బంధాలు – బాంధవ్యాలు ఉన్నవాడేనని చెబుతారు. రాహుల్ ‘భారత్ జోడో’ యాత్ర రూపకల్పనలో కూడా ఆయన పాత్ర ఉన్నదట! తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీలో తెలుగుదేశం కూటమి తరఫున పనిచేయాలనే ఆలోచన కూడా ఉన్నదంటారు. ఇందులో నిజానిజాలు ఎట్లా ఉన్నా కాంగ్రెస్ పార్టీ తన మార్గదర్శకాలను తానే ఉల్లంఘించడం కోసం సునీల్ కనుగోలు పేరును వాడేసుకుంటున్నది. చంద్రబాబు మెడికల్ బెయిల్‌పై విడుదలై హైదరాబాద్‌కు చేరుకున్న రోజున జూబ్లీహిల్స్‌లోని ఓ క్లబ్లో ఒక భారీ పార్టీ జరిగిందట! సినిమా రంగానికి, రాజకీయ రంగానికి చెందిన సుమారు 150 మంది బాబు అనుయాయులు ఈ పార్టీలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో తామంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని అందులో చర్చ జరిగిందట! చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొందరు ఛోటా, బడా నేతలు ‘సెటిలర్లందరూ ఈసారి కాంగ్రెస్‌కే ఓటేస్తార’ని బడాయి కబుర్లు చెప్పడం వింటున్నాము. వాస్తవం ఏమిటంటే ఆంధ్ర సెటిలర్లలో చంద్రబాబు సామాజిక వర్గం వారి జనాభా కేవలం ఇరవై శాతం మాత్రమే. మిగిలిన ఎనభై శాతం జనాభాలో అత్యధికులు ఈ వర్గం రాజకీయ అభిప్రాయాలకు పూర్తి విరుద్ధ అభిప్రా యాలతో ఉంటారు. కానీ సెటిలర్లందరి తరఫున వీరు చేస్తున్న ప్రకటనలు కాంగ్రెస్ పార్టీ కొంప ముంచే అవకాశాలే ఎక్కువ. 25 అసెంబ్లీ సీట్లున్న గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో బీఆర్ఎస్ బాగా బలపడిందని జాతీయ సర్వే సంస్థలు చెబుతున్నాయి. సీఎస్డీఎస్కు చెందిన సంజయ్ కుమార్ ‘ఇండియా టుడే’ ఛానల్లో మాట్లాడుతూ మరోసారి తెలంగాణలో బీఆర్ఎస్ గెలవబోతున్నట్టు చెప్పారు. ‘టైమ్స్ నౌ’లో నావికా కుమార్ కూడా తమ సర్వేలో అటువంటి ఫలితమే వచ్చిందని చెప్పారు. ఒక్క సీ–ఓటర్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను అంచనా వేస్తున్నది. కానీ ఆ సంస్థ ట్రాక్ రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. ప్రభుత్వ వ్యతిరేకత కొంత మేరకు కాంగ్రెస్ పార్టీకి ఉపకరి స్తున్న మాట యథార్థమే. కానీ విజయ తీరాలను చేరడానికి కాంగ్రెస్ అనేక అడ్డంకులను అధిగ మించవలసి ఉన్నది. కాంగ్రెస్ పార్టీని అభిమానించే బీసీల్లో ఏర్పడిన అసంతృప్తిని తొలగించ వలసి ఉన్నది. అంతర్గత కుమ్ము లాటలను అధిగమించవలసి ఉన్నది. అన్నిటినీ మించి కాంగ్రెస్ గెలిస్తే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరన్న నమ్మకం ఓటర్లకు కలగాలి. అప్పుడు కూడా బీజేపీ ఓటు శాతం సింగిల్ డిజి ట్‌కు పరిమితమైతేనే కాంగ్రెస్ బలమైన పోటీదారుగా రంగంలో ఉంటుంది. ఈలోగా బిడ్డను కనా ల్సిన తెలంగాణ కాంగ్రెస్‌కు బదులుగా చంద్రబాబు వర్గం తానే పురిటి నొప్పులు పడతానంటే ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
భావజాలం గీసిన భూమధ్య రేఖ!
నిఖార్సయిన వర్గ విభజన చోటు చేసుకుంటున్నది. కులమూ, వర్గమూ కలగాపులగమైన సమాజం మనది. పెత్తందారీ తోడేళ్లు కులాల మేకతోళ్లు కప్పుకొని మందల్లో దూరిన ప్రమాదకర వ్యవస్థ మనది. ఇప్పుడు ఒక రేడియం స్టిక్కర్ అడ్డుగీత రెండు వర్గాల మధ్య విభజన రేఖలా చీకట్లో కూడా మెరుస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక శక్తుల పునరేకీకరణ రాజకీయ శిబిరాల్లో వేగంగా జరుగుతున్నది. ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’ పేరుతో వైసీపీ పతాకాల నీడలో పీడిత వర్గాల ప్రజలు రాష్ట్రమంతటా కదం తొక్కుతున్నారు. అగ్రకుల పేదల సౌహార్దం ఈ యాత్రలకు వన్నె తెస్తున్నది. గడిచిన ఏడు రోజుల్లో 19 నియోజకవర్గాల్లో సాధికార యాత్రలు జరిగాయి. 19 బహిరంగ సభలు జరిగాయి. ఈ సభల్లో ఐదు లక్షలమందికి పైగా జనం పాల్గొన్నట్టు అంచనా. ఇంకా బస్సు యాత్ర పొడుగునా మద్దతు ప్రకటించినవారూ, బస్సులో ఉన్న నాయకుల సందేశాన్ని గ్రామగ్రామాన విన్న వారినీ కలుపుకుంటే ఈ సంఖ్య బహుశా రెట్టింపు ఉంటుంది. ఇంకో యాభై రోజులపాటు ఈ యాత్రలు కొనసాగనున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ప్రజాదరణను గమనంలోకి తీసుకుంటే దాదాపు కోటిమంది సాధికార యాత్రల్లో ప్రభావితమయ్యే అవకాశం ఉన్నది. పేద వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వైసీపీ నేతలు బలహీన వర్గాల ప్రజలకు వివరిస్తున్నారు. ఈ ఆలంబనతో సాధికారత పథంలోకి దూసుకొనిపోవలసిన ఆవశ్యకతను వారికి బోధిస్తు న్నారు. పాల్గొంటున్న జనం కూడా నాటి ప్రభుత్వ విధానాలు, నేటి ప్రభుత్వ విధానాల మధ్య గల తేడాలను బేరీజు వేసుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పదేపదే బహిరంగ సభల్లో ప్రస్తావించిన ఒక పోలిక ఇప్పుడు జనం చర్చల్లో నిత్యం నానుతున్నది. పేదల సంక్షేమం కోసం తాము ‘డీబీటీ’ (ప్రత్యక్ష నగదు బదిలీ) విధానాన్ని అనుసరిస్తుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ‘డీపీటీ’ (దోచుకో... పంచుకో... తినుకో) అమలు చేశారని ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు జనం సాక్షిగా రుజువులు కనిపిస్తున్నాయి. అమ్మవొడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు, పెన్షన్ కానుక వగైరా 29 స్కీముల పేరుతో అక్టోబరు చివరి నాటికి 2 లక్షల 40 వేల కోట్ల రూపాయలను జనం ఖాతాల్లో జగన్ ప్రభుత్వం వేసింది. జగనన్న తోడు, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, విద్యాకానుక తదితర తొమ్మిది నాన్ డీబీటీ స్కీముల కింద మరో లక్షా 67 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. చంద్రబాబు కాలం నాటి రాష్ట్ర బడ్జెట్‌తో జగన్ ప్రభుత్వం బడ్జెట్ దాదాపుగా సమానం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రకటన ప్రకారం బాబు సర్కార్ చేసిన అప్పుల కంటే జగన్ సర్కార్ చేసిన అప్పులు తక్కువ. మరి ఈ ప్రభుత్వం జనం ఖాతాల్లోకి పంపించిన డబ్బును బాబు హయాంలో దేనికి ఉపయోగించారు? జగన్ ప్రభుత్వ డీబీటీ, నాన్ డీబీటీ స్కీముల ద్వారా 1 కోటి 30 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి. ప్రతి కుటుంబానికీ ఒకటి కంటే ఎక్కువ పథకాలు లభించాయి. ఈ కుటుంబాల వారికి సగటున 3 లక్షల రూపాయల లబ్ధి జరిగింది. మరి బాబు హయాంలో ఈ డబ్బులు పొందిన లబ్ధిదారులెవరు? చంద్రబాబు హయాంలో అమలైన సంక్షేమ పథకాలు అరకొర మాత్రమే! సంక్షేమ పెన్షన్ల మీద 53 మాసాల్లో జగన్ ప్రభుత్వం 81 వేల కోట్లు ఖర్చుపెడితే 60 మాసాల్లో బాబు ప్రభుత్వం పెట్టిన ఖర్చు 20 వేల కోట్లు మాత్రమే! ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను పూర్తిగా నీరుకార్చారు. ఇంతకు మినహా ఆయన అమలుచేసిన డీబీటీ స్కీములు ఏమీ లేవు. అప్పుడు పేద లబ్ధిదారులు ప్రయోజనం పొందిన స్కీములు తక్కువే అయినా పెత్తందారీ లబ్ధిదారులు మాత్రం కళ్లు చెదిరే మొత్తాలను స్కాముల ద్వారా కొల్లగొట్టారు. ఇందులో ఆరు స్కాములపై ఇప్పటికే సీఐడీ కేసులు నమోదు చేసింది. 371 కోట్ల స్కిల్ స్కామ్‌లో లబ్ధిదారుగా చంద్రబాబు వైపే వేళ్లన్నీ చూపెడుతున్నాయి. 144 కోట్ల ఫైబర్‌నెట్ స్కామ్‌లో కూడా ఆయనే తుది లబ్ధిదారుగా సీఐడీ నిర్ధారణకొచ్చింది. ఇన్నర్ రింగ్‌రోడ్డు స్కామ్‌లో అధమ పక్షం రెండు వేల కోట్ల భూ దోపిడీ జరిగింది. ఇందులో చంద్రబాబు కుటుంబంతో పాటు మాజీ మంత్రి నారాయణ, లింగమనేని, పవన్ కల్యాణ్, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమలను లబ్ధిదారులుగా గుర్తించారు. 4,500 కోట్ల విలువైన అసైన్డ్ భూముల కుంభకోణంలో చంద్రబాబుతో పాటు నారాయణ, లింగమనేని కుటుంబాలు ముఖ్య లబ్ధిదార్లు. మద్యం కుంభ కోణం విలువ 5,200 కోట్లు. చంద్ర బాబుతోపాటు అయ్యన్నపాత్రుడు, సుధా కర్ యాదవ్ (యనమల వియ్యంకుడు), ఎస్పీవై రెడ్డి లబ్ధిదారులు. ఇసుక కుంభ కోణం విలువ 10 వేల కోట్లు. చంద్ర బాబుతోపాటు పీతల సుజాత, దేవినేని ఉమ, చింతమనేని ప్రభాకర్‌లపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ ఆరు స్కామ్‌ల మీద సీఐడీ తగిన ఆధారాలతో కేసులను నమోదు చేసింది. ఇవే కాకుండా బలమైన ఆరోపణలతో డజన్ల కొద్దీ స్కాములున్నాయి. ఒక్క విశాఖపట్నం నగరంలోనే రూ. లక్ష కోట్ల విలువైన 20 వేల ఎకరాల భూమిని కొల్లగొట్టారు. ‘హుద్ హుద్’ తుపాను సమయంలో వాటికి సంబంధించిన భూరికార్డులు గల్లంతయి నట్టు అధికారికంగా ప్రకటించారు. ఆ సమయంలోనే చంద్రబాబు విశాఖలో మకాం వేసి తుపానుపై తాను యుద్ధం చేసినట్టు ప్రకటించిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 వేల కోట్ల విలువైన గ్రానైట్, ఇనాం, ప్రైవేట్ భూములను చెరపట్టినట్టు ఆధారాలు లభిస్తు న్నాయి. పవన విద్యుత్ ఒప్పందాల్లో 11,625 కోట్లు కొల్లగొట్టారు. అమరావతి బాండ్ల జారీ ముసుగులో చినబాబు, పెద బాబులు రెండు వేల కోట్ల పెట్టుబడులు బినామీ కంపెనీల ద్వారా పెట్టినట్టు ఆరోపణ లొచ్చాయి. నీరూ–చెట్టూ పథకంలో 24 వేల కోట్లను కైంకర్యం చేశారు. ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోళ్ల కాంట్రాక్టుల్లో 4 వేల కోట్లు స్వాహా చేశారు. తాత్కాలిక సచివాలయ భవనం కాంట్రాక్టులో 800 కోట్ల కమిషన్ బాబుకు చేరినట్టు గుర్తించిన ఐటీ శాఖ ఆయనకు నోటీసుల మీద నోటీసులు జారీ చేసింది. అమరావతి హైటెన్షన్ విద్యుత్ లైన్ల మార్పిడిలో 380 కోట్లు, రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌కో కాంట్రాక్టుల్లో 675 కోట్ల మూలవిరాట్టుకు ముడుపు కట్టినట్టు సమాచారం. జెన్కో థర్మల్ ప్రాజెక్టు టెండర్లలో 670 కోట్లు, మెడికల్ కిట్ల కొనుగోళ్లలో 1800 కోట్లు అవినీతి ఖాతాలో పడి నట్టు రుజువులున్నాయి. ఇవి కొన్ని మాత్రమే! ఇక రాజధాని పేరు మీద తెరలేపిన అవినీతి ఒక అంతులేని అగాధం. దిగితే తప్ప దాని లోతు తెలియదు. బాబు జమానాలో దాదాపు ఆరు లక్షల కోట్ల మేరకు స్వాహాకార్యం జరిగినట్టు బలమైన ఆరోపణలున్నాయి. ఈ మొత్తంలో వాటాలు పొందిన వారిలో పెత్తందార్లు, ఉప పెత్తందార్లు చాలామందే ఉన్నారు. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదార్లు సాధికారత పేరుతో జైత్రయాత్రలు చేస్తుంటే మన పెత్తందారీ, పిల్ల పెత్తందారీ లబ్ధిదారులు చూస్తూ ఊరుకుంటారా? ఎంతమాత్రం ఊరుకోరు. స్కిల్ స్కామ్‌లో చంద్ర బాబు అరెస్ట్ సందర్భాన్ని ఉపయోగించుకొని సాధికారత యాత్రలను మరుగుపరచడానికి శతవిధాలా ప్రయత్నించారు. నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. పార్టీ పేరుతోనూ, ఇతర సంఘాల పేరుతోనూ ఈ పిలుపులు ఇచ్చినప్పటికీ ఇందులో పాల్గొన్న వారిలో అత్యధికులు ఒకే ఒక్క సామాజిక వర్గం వారు. ఈ కార్యక్రమాల కోసం సోషల్ మీడియా వేదికగా జరిగిన సన్నాహాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన వారి వివరాలను పరిశీలించినప్పుడు వెల్లడైన వాస్తవం ఇది. బాబు మెడికల్ బెయిల్‌పై విడుదలై విజయవాడ చేరుకున్న సందర్భంగా పబ్లిక్ షోను ఆర్గనైజ్ చేసిన వారిని పరిశీలించినప్పుడు కూడా ఇదే సంగతి తేటతెల్లమైంది. నలభయ్యేళ్ల చరిత్ర, అందులో ఇరవయ్యేళ్లు అధికారంలో ఉన్న పార్టీ చివరికి ఒక సామాజికవర్గంపైనా, పిడికెడు మంది ఇతరులపైనా ఆధారపడాల్సి రావడం ఒక విషాదం. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ బలాబలాల పొందిక ఒక స్పష్టమైన రూపాన్ని తీసుకున్నది. ఇప్పుడు మేకతోళ్లు కప్పుకున్న తోడేళ్లను మంద గుర్తించ గలుగుతున్నది. ఐదేళ్ల పాలనలో ఆరు లక్షల కోట్ల ప్రజాధనాన్ని భోంచేసిన పెత్తందారీ శక్తులు ఒక పక్కన, నాలుగున్నర లక్షల కోట్లను పైసా వృథా కాకుండా ప్రజా సంక్షేమానికి తరలించిన ప్రజాశక్తులు పక్కన మోహరించాయి. అధికారానికి దూరమైనప్ప టికీ ధనబలం కలిగిన పెత్తందారీ శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఇతర చిన్నాచితక రాజకీయ పార్టీలను అదుపులోకి తీసుకొని తనకు అను కూలంగా తోలుబొమ్మలాటలాడించగల సామర్థ్యం పెత్తందారీ పార్టీకి ఉన్నది. మీడియా మీద ఉన్న గుత్తాధి పత్యంతో ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా ‘ఉత్పత్తి’ చేసుకోగల ప్రావీణ్యం దానికున్నది. వ్యవస్థ లను నియంత్రించి చట్టానికీ, ధర్మానికీ తాను కోరు కున్న భాష్యం చెప్పగల నేర్పరితనం దాని సొంతం. రాబోయే యుద్ధంలో పేదవర్గాలు గెలుపొందాలంటే నిరంతర జాగరూకత ఒక్కటే మార్గం. రచ్చబండలపై రాజకీయ పార్టీల జమాఖర్చులను దండోరా వేయడమే శరణ్యం. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కృత్రిమ మేధపై మథనం
సృష్టిలో నూతనత్వాన్ని ఆహ్వానించటం, హత్తుకోవటం, తలకెత్తుకోవటం మనిషి సహజ లక్షణం. అదే లేకుంటే ప్రపంచంలో ఇంత అభివృద్ధి సాధ్యమయ్యేది కాదు. కానీ కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) విషయంలో మొదటినుంచీ అనుమాన దృక్కులు తప్పడం లేదు. ఆరంభంలో టెక్ సిబ్బందిని మాత్రమే వణికించిన ఏఐ ఇప్పుడు సమస్త జీవన రంగాల్లోకి చొచ్చుకొస్తూ అందరినీ భయపెడుతోంది. ఈ వారం చోటుచేసుకున్న రెండు పరిణామాలు ఈ భయసందేహాలు కేవలం అపోహల పర్యవసానం మాత్రమే కాదనీ, చేదు వాస్తవమనీ రుజువు చేస్తున్నాయి. వ్యూహాత్మకమైన అణుబాంబుల వ్యవస్థలోకి కూడా అది చొరబడితే ఏమవుతుందన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఏఐకి కళ్లెం బిగించేందుకు ఉద్దేశించిన ఉత్తర్వులపై ఈ వారం మొదట్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేయగా, బ్రిటన్‌లో ఈ విషయమై అమెరికా, చైనా, భారత్ సహా 28 దేశాలు పాల్గొన్న రెండు రోజుల శిఖరాగ్ర సదస్సు గురువారం ముగిసింది. ఇందులో ప్రభుత్వాల ప్రతినిధు లతోపాటు కంప్యూటర్ శాస్త్రవేత్తలు, టెక్ దిగ్గజాల ప్రతినిధులు కూడా పాల్గొనటం సమస్య తీవ్రతను తెలియజెబుతోంది. ఏఐతో ఏర్పడే అవకాశాలతోపాటు, అందులో చోటుచేసుకుంటున్న నూతన ఆవిష్కరణలు మానవాళికి పెనుముప్పు కలిగించే ఆస్కారం ఉందన్న అంశంలో అన్ని దేశాల మధ్యా ఏకాభిప్రాయం కుదిరింది. శిఖరాగ్ర సదస్సుకు ఎంచుకున్న బ్లెచ్లీ పార్క్ చరిత్రాత్మకమైనది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ రూపొందించి, దేశదేశాల్లోని తన సైనిక బలగాలకూ పంపే ‘నిగూఢ సంకేతాన్ని’ ఛేదించింది అక్కడే. అది పంపే సందేశాలేమిటో తెలియక కాకలు తీరిన నిపుణులే తలలు పట్టుకున్న తరుణంలో ఈ పరిణామం జర్మనీ కట్టడికి, రెండో ప్రపంచ యుద్ధ ముగింపునకు కారణమైంది. ‘ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి’ అన్న చందంగా ఏఐ తయారవటం వాస్తవం. అంతక్రితం మాటెలావున్నా ఏడెనిమిది నెలల క్రితం రంగంలోకొచ్చిన చాట్‌జీపీటీ అంద రినీ ఒక్కసారి దిగ్భ్రమపరిచింది. దాన్నుంచి తేరుకునే లోగానే చాట్‌జీపీటీ–4 కూడా అందుబాటు లోకొచ్చింది. దాని సాయంతో పాఠశాల, కళాశాలల విద్యార్థులు గణిత శాస్త్ర సమస్యలను క్షణాల్లో ఛేదిస్తున్నారనీ, మెదడుకు పదును పెట్టడం మానేశారనీ మొదట్లో వినగా... అమెరికావంటి దేశాల్లో ఏఐని ఉపయోగించి పరిశోధక పత్రాలు కూడా తయారు చేశారని తర్వాత బయటపడింది. లక్షల మంది బుర్రలు బద్దలుకొట్టుకునే జటిలమైన సమస్యకు ఏఐ క్షణంలో పరిష్కారం చూపుతుందనీ, దాని సాయంతో భారీ సొరంగాల తవ్వకాల్లో ఎదురయ్యే కష్టాలను అవలీలగా అధిగమించవచ్చనీ రుజువవుతూనే వుంది. ప్రయోజనాల సంగతి తేలినా పూర్తి స్థాయిలో వినియోగంలోకొస్తే ఏమవు తుందోనన్న బెంగ అందరిలోనూ గూడుకట్టుకుని వుంది. ఆ మధ్య స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులను సర్వే చేయగా, వారిలో మూడోవంతుకు మించి ఏఐ వల్ల అనర్థాలున్నాయని అభిప్రాయపడ్డారు. మొన్న మార్చిలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్, యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వాజ్నిక్ సహా 1,300 మంది ఏఐ పరిశోధనలను ఆర్నెల్లపాటు నిలిపివేయాలని పిలుపునిచ్చారు. ఎవరు ఏం చెప్పినా వేలంవెర్రి ఆగదు. ఏఐ విషయంలో జరిగింది అదే. దానివల్ల కలిగే ముప్పేమిటో దాదాపు అన్ని దేశాల్లోనూ రుజువవుతూనే వుంది. క్షణాల్లో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపి మాయ చేయటం ఏఐకి చాలా సులభమని తేలిపోయింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్సీ్క రష్యా అధ్యక్షుడు పుతిన్ సేనలకు దాసోహమంటున్న వీడియో కొన్నాళ్లు హల్చల్ చేసింది. ‘నన్ను అడగకుండా, నా ప్రమేయం లేకుండా, నాకు అసలు తెలియకుండా ఏదో ఒకరోజు నన్ను ఏఐ ద్వారా దృశ్యబద్ధం చేసే ప్రమాదమున్నద’ని పేర్కొంటూ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ న్యాయస్థానం తలుపుతట్టాడు. ఉత్తర్వులు కూడా పొందాడు. దేనికైనా అనుకూల, ప్రతికూల అంశాలు రెండూ వుంటాయి. సాంకేతికత అనేది ఎప్పుడూ రెండువైపులా పదునున్న కత్తి. ఏఐతో ఒక మనిషికి జీవం పోయొచ్చు. వేలాదిమంది కుత్తుకలు తెగ్గొట్టవచ్చు. తులనాత్మకంగా చూస్తే మొదటి అంశంలో ఏఐ పురోగతి నత్తనడకన వుండగా... ఉద్దేశపూర్వకంగా, సమాజానికి నష్టం కలిగించే రీతిలో దాన్ని ఉపయోగించుకునే ధోరణులు వేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వాల నియంత్రణలు సృజనాత్మకతకు అవరోధమవుతాయని, కట్టడిలో మనుగడ సాగించే సమాజాలు ఎదగవని ఒకప్పుడు నమ్మేవారు. సామాజిక మాధ్యమాల రాకతో కాలం మారింది. ఇప్పుడు ప్రభుత్వాలే చడీచప్పుడూ లేకుండా వాటి సాయంతో జనంలో ఆమో దాన్ని సృష్టించుకుంటూ బతకనేరుస్తున్న వైనాన్ని చూస్తున్నాం. లాభార్జనే తప్ప మరేం పట్టని కార్పొ రేట్ సంస్థల తీరు కూడా కళ్లముందే వుంది. కనుక ఏఐ నియంత్రణలో పాటించాల్సిన ధర్మాలేమిటో, పౌరుల గోప్యత పరిరక్షణకు ఏం చేయాలో, స్వీయభద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త లేమిటో నిర్ణయించటం అంత సులభం కాదు. అమెరికా వరకూ తీసుకుంటే బైడెన్ ఉత్తర్వులిచ్చారు గానీ, వాటిని పెద్దగా బలంలేని ప్రతినిధుల సభలో ఆమోదింపజేసుకోవటం కష్టమే. బ్రిటన్ కూడా సొంతానికి ఒక నిబంధనావళి రూపొందించుకుంది. చైనా, యూరోపియన్ యూనియన్లు సైతం అంతే. మన దేశం ఇంకా ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. ఏదేమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం నుంచి బయటికొచ్చిన భూతాన్ని తెలివిగా వినియోగించుకోవటమెలాగో, అదుపు చేయటమెలాగో గ్రహించటం ప్రపంచానికి పెను సవాలే. దీన్ని మానవాళి ఎలా అధిగమిస్తుందో చూడాలి. ఇదీ చదవండి: అఫిడవిట్లతో జాగ్రత్త -
మరో నిఘా నేత్రం?
నిత్యం ఏవో కళ్ళు మనల్ని గమనిస్తున్నాయంటే ఎలా ఉంటుంది? చేతిలోని మన చరవాణి సైతం చటుక్కున ప్రత్యర్థిగా మారిపోయే ప్రమాదం ఉందని తెలిస్తే ఏమనిపిస్తుంది? ఫోన్లలోని కీలక సమాచారాన్ని చేజిక్కించుకొనేందుకు ‘పాలకవర్గ ప్రాయోజిత ఎటాకర్లు’ ప్రయత్నిస్తున్నారంటూ ఆపిల్ సంస్థ అక్టోబర్ 31న పంపిన అప్రమత్తపు ఈ–మెయిల్స్‌తో అదే జరిగింది. ఐ–ఫోన్లు వాడుతున్న పలువురు ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులే కాదు... ప్రపంచమంతా ఉలిక్కిపడింది. వ్యక్తిగత డేటా, గోప్యతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందంటూ దేశవ్యాప్తంగా ఆపిల్ ఐ–ఫోన్ వినియోగదారులు పలువురికి ఇలా పారాహుషార్ సందేశాలు అందడం తేలికైన విషయమేమీ కాదు. సహజంగానే కేంద్ర ఐటీ శాఖ మంత్రి ప్రభుత్వం హ్యాకింగ్‌కు పాల్పడుతోందనే ఆరోపణల్ని కొట్టిపారేశారు. దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామన్నారు. ఈ అప్రమత్తత నోటిఫికేషన్లు పంపిన టెక్ దిగ్గజం ఆపిల్‌కు నోటీసులిచ్చి, సహకరించాల్సిందిగా కోరారు. ఫోన్లు – కంప్యూటర్ల హ్యాకింగ్, పాలకపక్షాల గూఢచర్యం ఆధునిక సాంకేతిక యుగం తెచ్చిన అతి పెద్ద తలనొప్పి. ఇది అనేక దేశాల్లో గుట్టుగా సాగుతూనే ఉంది. పులు కడిగిన ముత్యాలమని చెప్పుకొనే పాలకవర్గాలు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా యన్నది కీలకం. డేటా లీకేజీలు, గూఢచర్య సాఫ్ట్వేర్ వినియోగాలు మనకూ కొత్త కావు. దేశంలో ఇజ్రాయెలీ గూఢచర్య సాఫ్ట్వేర్ ‘పెగసస్’ వినియోగం సహా పలు ఆరోపణలపై గతంలో విచారణలు జరిగాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగబోవని హామీలూ వచ్చాయి. అన్నీ నీటిమూటలే. పెగసస్ సాఫ్ట్వేర్ కొనలేదని ప్రభుత్వం తోసిపుచ్చినా, కొత్త గూఢచర్య సాఫ్ట్వేర్ల కొనుగోలుకు భారత్ ఉత్సుకత చూపుతుందని విదేశీ పత్రికల్లో విశ్వసనీయ కథనాలు వచ్చాయి. సుప్రీం కోర్ట్ నియమించిన కమిటీ కొన్ని ఫోన్లను పరిశీలించి, పెగసస్ వినియోగంపై కచ్చితమైన సాక్ష్యాధారాలు లభించలేదని చెబుతూనే, ఈ దర్యాప్తులో కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని కుండబద్దలు కొట్టింది. అందుకే, తాజా విచారణపైనా అపనమ్మకం వ్యక్తమైతే తప్పుపట్టలేం. తాజా అప్రమత్త సందేశాలు పంపడానికి కారణాలను ఆపిల్ వివరించిన తీరూ అస్పష్టంగా ఉంది. అది సమగ్రంగా కారణాలను వివరించాల్సింది. అసలు ‘పాలకవర్గ ప్రాయోజిత’ ఎటాకర్లు అనే పదానికి ఆ సంస్థ చెబుతున్న వ్యాఖ్యానం, జనానికి అర్థమవుతున్న టీకా తాత్పర్యం వేర్వేరు. పుష్కలంగా నిధులు, వ్యవస్థీకృత సామర్థ్యం, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలున్నవన్నీ ఆ వర్గం కిందకు వస్తాయన్నది ఆపిల్ మాట. ప్రభుత్వ జోక్యం లేనిదే అది అసాధ్యమనేది అందరికీ తెలుసు. అందుకే, తాజా రగడపై అటు భారత అటు ప్రభుత్వం, ఇటు ఆపిల్ క్రియాశీలంగా వ్యవహరించాలి. వినియోగదారుల్ని అప్రమత్తం చేయడమే నేరమన్నట్టు ప్రభుత్వం, ఆపిల్ చెవులు మెలేస్తే దేశంలో పెట్టుబడులకు ప్రతికూల వాతావరణమే మిగులుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 శాతం మంది ఆపిల్ ఐ–ఫోన్లు వాడుతుంటే, వారిలో 7 శాతం మన దేశంలోనే ఉన్నారు. తమ ఉత్పత్తులు పూర్తి సురక్షితమనీ, హ్యాకింగ్ అవకాశం అత్యల్పమనీ, ఆ యా దేశాల ప్రభుత్వాల పక్షాన తాము గూఢచర్యానికి ఎన్నడూ పాల్పడబోమనీ ఆపిల్ కూడా నమ్మకం కలిగించాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఏర్పాటైన పార్లమెంటరీ సంఘం తక్షణం సమావేశమై, ఆపిల్ సందేశాలపై విచారణ జరపాలంటూ ప్రతిపక్ష సభ్యులు ఇప్పటికే ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారు. అయితే, ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ఫోన్ల హ్యాకింగ్ వాదనను ‘యాక్సెస్ నౌ’ సంస్థ సమర్థిస్తోందనీ, కోటీశ్వరుడైన అమెరికన్ ఫైనాన్షియర్ జార్జ్ సోరోస్‌కు ఆ సంస్థలో పెట్టుబడులున్నాయి గనక ఆయనకు ఈ హ్యాకింగ్ వివాదంతో సంబంధం ఉందనీ అధికార బీజేపీ ఐటీ విభాగాధిపతి ఆరోపించారు. పాలక వర్గాలపై ఆరోపణలు వచ్చినప్పుడు అవి నిరాధారమని నిరూపించి, నిజాయతీని నిరూపించు కోవాలి. అది వదిలేసి బోడిగుండుకూ, మోకాలుకూ ముడిపెడితే ప్రయోజనం శూన్యం. అదే సమ యంలో ఇచ్చిన సమాచారంపై దృష్టిపెట్టకుండా, తెచ్చిన వార్తాహరుడిపై కత్తులు నూరితే కష్టం. ఆపిల్ అప్రమత్తతకు సరిగ్గా ఒక రోజు ముందరే మన ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్’ నుంచి దాదాపు 80 కోట్ల మంది పౌరుల ఆధార్ వివరాలు లీకయ్యాయి. దీనిపైనా లోతైన విచారణ జరపాల్సి ఉంది. ఆధార్ వివరాలు నమోదు చేసే ‘యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా’ సర్వర్ కట్టుదిట్టమైనదే. కానీ, ఇతర మార్గాల్లో వివరాలు బయటకు పొక్కుతున్నాక ఇక గోప్యతకు అర్థమేముంది! వ్యక్తిగత డిజిటల్ డేటా రక్షణపై ఇటీవలే చట్టం చేసిన ప్రభుత్వం సమాచార సేకరణ, నిల్వ, వినియోగంపై కట్టుదిట్టమైన నియమావళి సత్వరం తీసుకురావాలి. ప్రజాస్వామ్యానికి కీలకమైన ప్రతిపక్షాలు, పాత్రికేయులపై నిఘా పెట్టి, పౌరుల ప్రాథమిక హక్కయిన గోప్యతను తుంగలో తొక్కాలనుకుంటే అది ఘోరం. ఈ వ్యవహారంపై ప్రజల్లో చైతన్యం పెంచి, ఇలాంటి ఉల్లంఘనల్ని ప్రతిఘటించేలా సంసిద్ధం చేయాలి. పాలకపక్షాలు ఈ ఆరోపణల్లోని నిజానిజాల నిగ్గు తేల్చాలి. పదేపదే ఆరోపణలు వస్తున్నందున వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం వాటిల్లకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పరిష్కార మార్గాల అన్వేషణే కాదు... ఆచరణలోనూ ప్రజలందరికీ నమ్మకం కలిగించాలి. గోప్యత ఉల్లంఘన జరిగినట్టు తేలితే, కఠిన చర్యలు చేపట్టాలి. అలాకాక, రెండేళ్ళ క్రితం నాటి ‘పెగసస్’ లానే దీన్ని కూడా చాప కిందకు నెట్టేయాలని పాలకులు ప్రయత్నిస్తేనే చిక్కు. రాజకీయ రచ్చగా మారుతున్న తాజా వ్యవహారంలో అసలు సంగతి వదిలేసి, కొసరు విషయాలు మాట్లాడుకుంటే ఎన్నటికీ ఉపయోగం లేదు. -
ఈ గంటల లెక్క సరైనదేనా?!
శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం అని కవి వాక్కు. కాకపోతే ఎలా శ్రమించాలి? ఎంతసేపు శ్రమించాలి? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. అందుకే కావచ్చు... వారానికి 70 గంటలు పని చేయాలంటూ ఇన్ఫోసిస్ సంస్థ సహ–వ్యవస్థాపకులు నారాయణమూర్తి తాజాగా చేసిన వ్యాఖ్య దేశవ్యాప్తంగా, ముఖ్యంగా యువతరంలో పెద్ద చర్చ రేపుతోంది. ఐటీ వృత్తినిపుణుల్ని ఉద్దేశించి ఓ పాడ్ క్యాస్ట్‌లో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయమది. రానున్న దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్త మార్పులతో వచ్చిపడే డిమాండ్లను అందుకొని, భారత ఉత్పాదకతను పెంచుకోవాలంటే ఈ అధిక పని గంటల విధానం అవసరమనేది ఆయన మాట. కార్పొరేట్ దిగ్గజాలు ఆ ప్రతిపాదనను సమర్థిస్తుంటే, శ్రామికవర్గాలు ఈ సుదీర్ఘ పనిగంటల ఆలోచనను వ్యతిరేకిస్తున్నాయి. వెచ్చించిన కాలం, ఉత్పాదకత... ఈ రెంటి మధ్య సంబంధం అన్నిసార్లూ అనులోమానుపాతంలోనే ఉంటుందా అనే మౌలిక ప్రశ్న మొదలైంది. పనిగంటలు పెంచి, ఎక్కువ పని చేయడమనే ప్రతిపాదన పట్ల పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు కారణాలు లేకపోలేదు. మన దేశంలో ఇప్పటికే అధిక సంఖ్యాకులు ఎక్కువ పని చేస్తూ, తక్కువ వేత నాలు పొందుతున్నారు. ఇక, ఇంటిని చక్కబెట్టే మహిళలు, అసంఘటిత రంగ శ్రామికులు లక్షల మంది ఈ 70 గంటల లెక్కకు మించే పనిచేస్తున్నారు. జీతం బత్తెం లేని కుటుంబ స్త్రీలు, వేతనం పొందినా లెక్కల్లోకి రాని అసంఘటిత శ్రామికుల రీత్యా ఉత్పాదకతలో అది కనిపించకపోవచ్చు. ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్’ (ఓఈసీడీ) గణాంకాల ప్రకారం అధిక పనిగంటల విషయంలో మొత్తం 187 దేశాల్లో మనది 136వ ర్యాంకు. భారతీయ శ్రామికులు సగటున ఏటా 1660 గంటలు పనిచేస్తూ, 2,281 డాలర్ల మేర తలసరి జీడీపీ అందిస్తున్నారు. ఇండొనేసియా, ఆస్ట్రేలియా వగైరా దాదాపు అంతే గంటల్లో అధిక తలసరి జీడీపీ సాధిస్తున్నాయి. నిజానికి, రోజుకు గరిష్ఠంగా 8 గంటల పని మాత్రమే అనే పద్ధతిని భారతీయ కార్మిక చట్టాల్లోకి తేవడానికి ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వారానికి 70 గంటలు, అంటే రోజుకు 11.5 గంటలు అనే పద్ధతి తెస్తే మునుపటి పోరాటాల ఫలితమంతా గంగలో కలిసిపోతుందనే భయమూ శ్రామికుల్లో ఉంది. అదనపు జీతం, పరిహారాల ఊసెత్తకుండా కేవలం అధిక పని గంటల ప్రతిపాదన తీసుకురావడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది. ఒకవేళ ఉత్పాదకత, అభివృద్ధి పెరగాలనుకుంటే... శ్రామికులు తమ ఉద్యోగంతో పాటు నచ్చిన మరో పని కూడా ఏకకాలంలో చేసుకొని అదనంగా సంపాదించుకొనేలా ‘మూన్‌లైటింగ్’కు అనుమతించాలని కొందరు నిపుణుల సూచన. తద్వారా శ్రామికులకూ, దేశానికీ ఉపయోగమనేది వారి వాదన. అయితే, పలు దిగ్గజ టెక్ సంస్థల భావన తద్భిన్నంగా ఉంది. మారుతున్న శ్రామిక సంస్కృతిలో మూన్‌లైటింగ్ విడదీయరాని భాగమని కేంద్ర ఐటీ అమాత్యులంటున్నా, దాన్ని శిరోధార్యమంటున్న కార్పొరేట్ల సంఖ్య తక్కువే! వృత్తి పట్ల అంకితభావం, అచంచలమైన శ్రద్ధ కావాల్సిందే! కానీ, పని మీద దృష్టి అనేది చివరకు ఉద్యోగ జీవితానికీ – కుటుంబ జీవితానికీ మధ్య సమతౌల్యం దెబ్బ తీయకూడదు. మనిషి పూర్తిగా డస్సిపోయే పరిస్థితి తేకూడదు. శారీరక, మానసిక సమస్యలకు కారణం కాకూడదు. ఏ పని చేసినా సంతోషంగా చేస్తే ఫరవాలేదు. ఆ పరిస్థితి అంతటా సాధ్యం కాదు. సంతోషమే సగం బలం అనే మనం అందులో వెనకబడ్డాం. ఇప్పటికే ప్రపంచ సంతోషసూచిలో మన దేశపు స్కోరు గణనీయంగా తగ్గుతోంది. దశాబ్దం క్రితం 2013లో 4,772 స్కోరుతో సంతోషసూచిలో భారత్ 111వ ర్యాంకులో ఉండేది. తీరా ఈ ఏడాది మన స్కోరు 4,036కు పడిపోయింది. మన ర్యాంకు 126కు దిగజారింది. ఈ పరిస్థితుల్లో సంతోషంగా పని చేయాలనే పద్ధతికి నీళ్ళొదిలి, మానసిక ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, అధిక గంటల పనితో ఉత్పాదకత పెంచాలని భావిస్తే, మొదటికే మోసం వస్తుంది. దీర్ఘకాలంలో అది దేశానికి నష్టదాయకంగా పరిణమించే ప్రమాదం ఉంది. నారాయణమూర్తి అన్నట్టు దేశాభివృద్ధికి మరింత శ్రమించాలనడంలో సందేహం లేదు. అయితే ఆ శ్రమను పని గంటలతో కొలవాలనుకుంటేనే చిక్కు. భారత్‌ను ఇప్పటికీ నిరుద్యోగం, తక్కువ ప్రతిఫలానికే పనిచేయాల్సి రావడం పట్టిపీడిస్తున్నాయి. స్వయం ఉపాధికి దిగుదా మంటే కావాల్సిన పెట్టుబడి దొరకని పరిస్థితి. విద్య, ఆరోగ్య వసతులూ అంతంత మాత్రమే. అవ్యవస్థీకృత ఆర్థికరంగంలో వారానికి 48 గంటల పైనే పని చేస్తున్నా, వేతనాల్లో వ్యత్యాసం, ఉపాధి భద్రత లేమి లాంటి సమస్యలు సరేసరి. ఈ నేపథ్యంలో జీవన ప్రమాణాల్ని మెరుగుపరిచేలా ప్రభుత్వ విధానాలు మారాలి. పనిగంటల కన్నా మానవ సంక్షేమ మూలధనంపై దృష్టిపెట్టడం కీలకం. అప్పుడు ఉత్పాద కత పెరుగుతుంది. అందుకు పాలకులు ప్రాథమిక వ్యవస్థాగత లోపాలను సవరించడం అవసరం. గమనిస్తే, అనేక అభివృద్ధి చెందిన దేశాల కన్నా సగటు భారతీయ శ్రామికుడు ఎక్కువ సేపు పనిచేస్తున్నా, ఉత్పాదకత తక్కువగా ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి. అంటే, ఎంత నాణ్యమైన పని చేశావనేది ప్రధానం కావాలి కానీ, ఎంతసేపు గానుగెద్దులా పని చేశావనేది కాదు. గంటలకొద్దీ శ్రమను పెంచే కన్నా, నైపుణ్యాలకు పదునుపెట్టి, కొద్దిపాటి పరిశ్రమతో అధిక ఫలితం అందించే నవీన మార్గాలను అన్వేషించాలి. పారిశ్రామిక శిఖరం జేఆర్డీ టాటా మాటల్లో చెప్పాలంటే, ‘భారత్ ఆర్థిక అగ్రరాజ్యం కావడం కన్నా, ఆనందమయ దేశం కావాలి.’ అంచనాలు, అంతకు మించి ఒత్తిడి అంతకంతకూ అధికమవుతున్న కాలంలో అది చాలా ముఖ్యం. సంతోషం, సామర్థ్యం పెరిగితే సంపద అదే సృష్టి అవుతుంది. శ్రమజీవి ప్రతి చెమటచుక్క సిరులు పండిస్తుంది. -
దివ్యమైన పతకాల పంట
భారతీయ క్రీడా రంగానికి ఇది కనివిని ఎరుగని సీజన్. ఇటీవలే ఏషియన్ గేమ్స్‌లో పతకాల శతకం సాధించిన భారత్ తాజాగా ఏషియన్ పారా గేమ్స్‌లోనూ శతాధిక పతకాలను చేజిక్కించుకుంది. మునుపెన్నడూ లేని విధంగా ఆసియా పారా క్రీడోత్సవాల్లోనూ శతాధిక పతకాలు సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంబరాలు జరుపుకొనే మరో సందర్భం అందించింది. విధి క్రూరంగా వ్యవహరించినా, ఆత్మస్థైర్యం కోల్పోకుండా ముందుకు సాగితే విజయానికి ఆకాశమే హద్దు అనడానికి తాజా ఆసియా పారా క్రీడోత్సవాల్లో పాల్గొన్న మన 303 మంది ఆటగాళ్ళ విజయగాథలే ఉదాహరణ. ఈ పారా గేమ్స్‌లో భారత్ అరడజను ప్రపంచ రికార్డులు, 13 ఏషియన్ రికార్డులు నెలకొల్పింది. క్రీడల్లోనూ భారత్ బలంగా ఎదుగుతున్న క్రమానికి ఇది మరో మచ్చుతునక. 2036లో ఒలింపిక్స్‌కు ఆతిథ్య దేశంగా నిలవాలని ఆశిస్తున్న భారత్‌కు ఈ విజయాలు అతి పెద్ద ఉత్ప్రేరకాలు. ఈసారి ఆసియా క్రీడోత్సవాల్లో భారత బృందం నినాదం ‘ఇస్ బార్ సౌ పార్’. అలా వంద పతకాల లక్ష్యాన్ని దాటడమే ఈసారి లక్ష్యమనే నినాదంతో ముందుకు దూకిన భారత్ 107 పతకాలతో ఆ గోల్ సాధించింది. చైనాలోని హాంగ్జౌలో సాగిన ఏషియాడ్‌తో పాటు, ఆ వెంటనే అదే వేదికగా సాగిన ఏషియన్ పారా గేమ్స్‌లోనూ భారత్ 111 పతకాలతో మరోసారి ఈ శతాధిక విన్యాసం చేయడం విశేషం. ఏషియన్ గేమ్స్‌లో మనవాళ్ళు కనివిని ఎరుగని రీతిలో పతకాల సాధన చేయడంతో, అందరి దృష్టీ ఈ పారా అథ్లెట్ల మీదకు మళ్ళింది. మొత్తం 191 మంది పురుష అథ్లెట్లు, 112 మంది స్త్రీ అథ్లెట్లు 17 క్రీడా విభాగాల్లో మన దేశం పక్షాన ఈ క్రీడా సంరంభంలో పాల్గొన్నారు. మునుపెన్నడూ పారా క్రీడోత్సవాల్లో లేని విధంగా 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్యాలు దేశానికి తెచ్చిపెట్టారు. పతకాల పట్టికలో చైనా, ఇరాన్, జపాన్, దక్షిణ కొరియా తర్వాత అయిదో స్థానంలో మన దేశాన్ని నిలిపారు. నిజానికి, భారత క్రీడా వ్యవస్థలో పారా క్రీడల పట్ల దీర్ఘకాలికంగా ఉదాసీనత నెలకొంది. ఉదాహరణకు, 2008 నాటి బీజింగ్ పారాలింపిక్స్‌లో మనం అయిదుగురు అథ్లెట్లనే పంపాం. రిక్తహస్తాలతో ఇంటిదారి పట్టాం. అయితే, ఎనిమిదేళ్ళ క్రితం రియోలోని క్రీడాసంరంభంలో 19 మంది భారతీయ పారా ఒలింపియన్లు పాల్గొని, 2 స్వర్ణాలు సహా మొత్తం 4 పతకాలు ఇంటికి తెచ్చారు. అక్కడ నుంచి పరిస్థితులు క్రమంగా మారాయి. రెండేళ్ళ క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో మనవాళ్ళు 5 స్వర్ణాలు సహా 19 మెడల్స్ గెలిచారు. అలా పారా అథ్లెట్లకూ, క్రీడలకూ ప్రాచుర్యం విస్తరించింది. ఏషియన్ పారా గేమ్స్‌లోనూ 2018లో భారత్ 72 పతకాలు గెల్చి, తొమ్మిదో స్థానంతో సంతృప్తి పడాల్సి వచ్చింది. అదే ఈసారి హాంగ్జౌలో మనవాళ్ళు ఏకంగా 111 పతకాలు సాధించి, అయిదో స్థానానికి ఎగబాకారు. రానున్న ప్యారిస్ పారాలింపిక్స్ పట్ల ఆశలు పెంచారు. చైనా గెల్చిన 521 పతకాలతో పోలిస్తే, మన సాధన చిన్నదే కావచ్చు. అయితే, దేశంలో అథ్లెట్లతో పాటు పారా అథ్లెట్లూ పెరుగుతూ, క్రీడాంగణాన్ని వెలిగిస్తున్న వైనం మాత్రం అవిస్మరణీయం. ఈ పారా – అథ్లెట్ల భారత బృందం సాధించిన 111 పతకాలకూ వెనుక 111 స్ఫూర్తి కథనాలున్నాయి. చేతులు లేకపోతేనేం, విలువిద్యలో దిట్ట అయిన కశ్మీర్‌కు చెందిన 16 ఏళ్ళ శీతల్ దేవి తన పాదాలతోనే బాణాన్ని సంధించి, లక్ష్యాన్ని ఛేదించి, పతకం సాధించిన తీరు వైరల్ అయింది. నిరాశలో కూరుకున్న కోట్లమందికి ఆమె సరికొత్త స్ఫూర్తి ప్రదాత. అలాగే, ఒకప్పుడు రెజ్లర్‌గా ఎదుగుతూ, రోడ్డు ప్రమాదంలో ఎడమకాలు పోగొట్టుకున్న సుమిత్ అంతిల్ మరో ఉదాహరణ. జీవితంలో పూర్తిగా నిస్పృహలో జారిపోయిన ఆ ఆటగాడు కన్నతల్లి ప్రోత్సాహంతో, అప్పటి దాకా విననైనా వినని పారా క్రీడల్లోకి దిగారు. ఇవాళ జావెలిన్ త్రోయర్‌గా పారాలింపిక్స్‌కు వెళ్ళారు. ఏషియన్ ఛాంపియన్‌గా ఎదిగారు. తాజా క్రీడోత్సవాల్లో తన ప్రపంచ రికార్డును తానే మెరుగుపరుచుకున్నారు. సోదరుడి వివాహంలో కరెంట్ షాక్‌తో చేతులు రెండూ కోల్పోయిన పారా స్విమ్మర్ సుయశ్ నారాయణ్ జాధవ్, కుడి మోచేయి లేని పరుగుల వీరుడు దిలీప్, నడుము కింది భాగం చచ్చుబడినా తొణకని కనోయింగ్ వీరుడు ప్రాచీ యాదవ్... ఇలా ఎన్నెన్నో ఉదాహరణలు. పారా క్రీడల విషయంలో గతంలో పరిస్థితి వేరు. దేశంలో పారా క్రీడలకు పెద్ద తలకాయ అయిన భారత పారా ఒలింపిక్ కమిటీ అనేక వివాదాల్లో చిక్కుకుంది. 2015లో అంతర్జాతీయ పారా లింపిక్ కమిటీ సస్పెండ్ చేసింది. ఆ పైన 2019లో జాతీయ క్రీడా నియమావళిని ఉల్లంఘించారంటూ, సంఘం గుర్తింపును క్రీడా శాఖ రద్దు చేసింది. ఏడాది తర్వాత పునరుద్ధరించింది. అంతర్గత కుమ్ములాటలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం లాంటి ఆరోపణలు సరేసరి. అన్ని అవరోధాల మధ్య కూడా ఆటగాళ్ళు పట్టుదలగా ముందుకు వచ్చారు. ఒకప్పుడు నిధులు, శిక్షణ కొరవడిన దశ నుంచి పరిస్థితి మారింది. ప్రత్యేక అవసరాలున్న ఆటగాళ్ళకు నిధులు, శిక్షణనివ్వడంలో శ్రద్ధ ఫలిస్తోంది. భారత క్రీడా ప్రాధికార సంస్థకు చెందిన పలు కేంద్రాల్లో భారత పారా అథ్లెట్లకు మునుపటి కన్నా కొంత మెరుగైన శిక్షణ లభిస్తోంది. విదేశీ పర్యటనలతో వారికి క్రీడా ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు. ఆటగాళ్ళ దీక్షకు తల్లితండ్రులు, కోచ్‌ల ప్రోత్సాహం తోడై పతకాల పంట పండిస్తోంది. పారా స్పోర్ట్స్ అంటే ఎవరికీ పెద్దగా తెలియని రోజుల నుంచి దివ్యాంగులు పలువురు క్రీడల్ని ఓ కెరీర్‌గా ఎంచుకొనే రోజులకు వచ్చాం. అయితే, ఇది చాలదు. వసతుల్లో, అవకాశాల్లో సాధారణ ఆట గాళ్ళతో పాటు దివ్యాంగులకూ సమప్రాధాన్యమివ్వాలి. దేశంలోని దివ్యాంగ క్రీడాకారుల్లోని ప్రతిభా పాటవాలు బయటకు తేవాలి. 9 నెలల్లో రానున్న ప్యారిస్ పారాలింపిక్స్‌కి అది చేయగలిగితే మేలు! -
నడుస్తున్న చరిత్ర!
పాత చరిత్రను కొత్తగా లిఖించే మరోప్రయత్నం మొదలైంది. పిల్లల పాఠ్యపుస్తకాల్లో ప్రస్తుతం ఉన్న ‘ప్రాచీన చరిత్ర’ స్థానంలో ‘సంప్రదాయ (క్లాసికల్) చరిత్ర’ను ప్రవేశపెట్టనున్నారు. అంటే, ప్రాచీన, మధ్య యుగ, ఆధునిక అంటూ బ్రిటీషు వారు చేసిన చరిత్ర విభజన ఇక చెరిగిపోనుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) వేసిన ఉన్నత స్థాయి సంఘం చేసిన ఈ సిఫార్సు చర్చ రేపుతోంది. అలాగే, ఇకపై ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ను తీసుకురావాలని సైతం సదరు కమిటీ సిఫార్సు చేసిందన్న వార్త తేనెతుట్టెను కదిలించింది. భారతదేశపు గతానికి సంబంధించిన కథనాలను ‘సరిచేసేందుకు’ ఈ మార్పులు తీసుకు వస్తున్నామన్నది ఎన్సీఈఆర్టీ కమిటీ మాట. ఇండియా స్థానంలో భారత్ అనే సిఫార్సును అంగీకరించలేదని ఎన్సీఈఆర్టీ వివరణనిచ్చినా, కమిటీ చేసిన ఇతర ప్రతిపాదనలపైనా అనుమానాలు, చర్చోపచర్చలు ఇప్పుడప్పుడే ఆగేలా లేవు. 2020 నాటి జాతీయ విద్యా విధానంలో భాగంగా సాంఘిక శాస్త్రాల్లో మార్పులు చేర్పులు సూచించడం కోసం రిటైర్డ్ చరిత్ర ప్రొఫెసర్ అయిన సీఐ ఐజాక్ సారథ్యంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని 2022లో ఎన్సీఈఆర్టీ నియమించింది. పాఠ్యప్రణాళికలో భాగంగా పిల్లలకు బోధించే అన్ని సబ్జెక్టుల్లోనూ ‘భారతీయ విజ్ఞాన వ్యవస్థ’ (ఐకేఎస్)ను ప్రవేశపెట్టాలని కూడా ఈ కమిటీ సిఫార్సు చేసింది. ‘ప్రాచీన చరిత్ర’ బదులు ‘సంప్రదాయ చరిత్ర’ను పెట్టాలనే ప్రతిపాదనకు తనదైన సమర్థనను వినిపించింది. ప్రస్తుత పాఠ్యపుస్తకాల్లో మన వైఫల్యాలనే పేర్కొన్నారనీ, మొఘలులు, సుల్తానులపై మన విజయాలను చెప్పలేదనీ, కాబట్టి యుద్ధాలలో ‘హిందూ విజయాల’పై దృష్టి పెడుతూ పాఠ్యపుస్తకాలు మార్చాలనీ ఐజాక్ బృందపు వాదన. చరిత్రను చరిత్రగా చెప్పాల్సిందే! అందులో లోటుపాట్లను సవరించడమూ తప్పు కాదు. కానీ, సాక్ష్యాధారాలతో సాగాల్సిన ఆ చరిత్ర రచనను మతప్రాతిపదికనో, మరో ప్రాతిపదికనో మార్చాలనుకోవడమే సమస్య. ‘ఇండియా’ అంటూ ప్రతిపక్ష కూటమి తమకు తాము నామకరణం చేసుకున్న తరువాత నుంచి ఈ ‘ఇండియా’ వర్సెస్ ‘భారత్’ రచ్చ నడుస్తూనే ఉంది. భారత రాజ్యాంగం ‘ఇండియా... దటీజ్ భారత్’ అని పేర్కొన్నప్పటికీ, ప్రభుత్వం కొన్నాళ్ళుగా ఈ ‘భారత’ నామంపై కొత్త ప్రేమ కనబరు స్తోంది. ఆ మధ్య జీ–20 వేళ రాష్ట్రపతి అధికారిక విందు ఆహ్వానంలో సైతం ‘భారత్’ అనే పదాన్నే వాడడం వివాదం రేపింది. అసలు ‘ఇండియా’ అనే పేరే వలసవాద ఆలోచనకు ప్రతీక అన్నది అధికార పక్షం వాదన. ఏడువేల ఏళ్ళ నాటి విష్ణుపురాణం తదితర ప్రాచీన గ్రంథాల్లో ‘భారత్’ అని ఉపయోగించినందున ఆ పేరును వాడాలనేది ఐజాక్ కమిటీ సూచన. అయితే, ఇన్నేళ్ళుగా ‘ఇండియా’, ‘భారత్’లను పరస్పర పర్యాయపదాలుగానే వాడుతున్న దేశంలో ‘ఇండియా’ అని ఉన్నచోటల్లా పాఠ్యపుస్తకాల్లో ‘భారత్’ అని మార్చేయమని సిఫార్సు చేయడమే అర్థరహితం. ప్రభుత్వం తమనేమీ ప్రభావితం చేయలేదని ప్రొఫెసర్ ఐజాక్ అంటున్నారు కానీ, హిందూత్వ భావజాలం వైపు ఆయన మొగ్గు జగమెరిగిన సత్యం. పాలక పక్షపు ప్రాపకం కోసం చేసే ఇలాంటి ప్రతిపాదనలు, సిఫార్సులు గాలిలో నుంచి వాటంతట అవి ఊడిపడతాయని అనుకోలేం. అలా అనుకుంటే అమాయకత్వమే. ఆ మాటకొస్తే, 2018లోనే ప్రాచీన చరిత్రను తిరగరాసేందుకు తోడ్పడే నివేదికను సమర్పించాల్సిందిగా కేఎన్ దీక్షిత్ సారథ్యంలోని కమిటీని కోరారు. దీక్షిత్ సాక్షాత్తూ ఇండియన్ ఆర్కియలాజికల్ సొసైటీకి ఛైర్మన్, భారత పురావస్తు సర్వేక్షణ సంస్థకు మాజీ జాయింట్ డైరెక్టర్ జనరల్. తాజా సిఫార్సులు వచ్చే విద్యా సంవత్సరానికల్లా అమలులోకి రావచ్చట. పిల్లల పాఠ్యపుస్తకాల్లోనే కాక, విద్యావిషయక పరిశోధనలోనూ ఈ కమిటీ సిఫార్సులు చోటుచేసుకుంటాయని 2018లో సంస్కృతీశాఖ మంత్రిగా చేసిన మహేశ్‌శర్మ తదితరులు ఆశాభావంతో ఉన్నారు. అసలింతకీ కొత్తగా చేర్చదలచిన ఈ ‘సంప్రదాయ చరిత్ర’ అంటే ఏమిటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. దేశాన్ని పాలించిన రాజవంశాలన్నిటికీ పాఠ్యగ్రంథాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించాలని ఐజాక్ కమిటీ ప్రతిపాదించింది. ఈ సమప్రాతినిధ్యం ప్రాంతాల ప్రాతిపదికన, చరిత్రలో ఆ వంశాల ప్రాధాన్యం ప్రాతిపదికనైతే ఫరవాలేదు. అలా జరుగుతుందా అన్నది ప్రశ్న. సంగీతం, సాహిత్యం, కళలు, వాస్తుశిల్పం, వాణిజ్యం, భక్తి ఉద్యమాల్లో ఎంతో భాగమున్న దక్షిణాది రాజవంశాలను ఎన్సీఈఆర్టీ పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంతకాలం ఉత్తర భారత దృక్కోణంలోనే నడుస్తున్న వారి పుస్తకాల్లో దక్షిణ భారత రాజవంశాలకూ తగినంత చోటిస్తారా? అది ఓ బేతాళప్రశ్న. అయితే, దేశంలో నిత్యం జరిగే చారిత్రక, పురావస్తు అధ్యయనాల్లో కొత్తగా బయటపడుతున్న అంశాలను సైతం పాఠ్యప్రణాళికలో చేర్చాలన్న కమిటీ సిఫార్సును తప్పక స్వాగతించాలి. చరిత్ర జడపదార్థం కాదు. దొరికిన సరికొత్త సాక్ష్యాధారాలతో ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చు కోవాలి. సమకాలీన అంశాలనూ చేర్చుకోవాలి. కానీ, కొత్త మార్పుల పేరిట పాలకపక్ష భావజాలా నికి అనుకూలంగానో, అన్నీ పురాణాల్లోనే ఉన్నాయిష అనో చరిత్రను మార్చాలని చూడడమే దుస్స హనీయం. అసలు సిసలు భారత్‌కు తామే ప్రతినిధులమని పిల్లలకు పాఠాలతో ఎక్కించి, రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే అంత కన్నా ఘోరం లేదు. చంద్రయాన్–3, నారీ శక్తి వందన్, కోవిడ్ నిర్వహణ లాంటి అంశాలకూ చోటిచ్చేలా ఎన్సీఈఆర్టీ ప్రణాళికా రచన చేసినట్టు విద్యాశాఖ చెబుతోంది. నిజానికి, పరిశోధన చేసి, పిల్లల వయసుకు తగిన పాఠాలతో ముందుకు రావడం ఎన్సీఈఆర్టీ పని. ఆ బాధ్యత వదిలేసి, అధికార పార్టీ రాజకీయ ఆలోచనలకు తగ్గట్టు, లేదా ఒక పక్షం విజయాలనే కీర్తిస్తున్నట్టు పాఠ్యాంశాలనే మార్చాలనుకుంటే అది సమగ్ర చరిత్ర కాదు. సమర్థనీయం కానే కాదు! -
మాటలంటే మాటలా!
మాటలదేముంది మాటలే కదా అని తేలికగా తీసిపారేయలేము. మాటలు కేవలం మాటలే కావచ్చు గాని, మాటలంటే మాటలు కాదు. లోకంలో మాటలు నేర్చిన జీవులు మనుషులే! తాము నేర్చిన మాటలను ఊసుపోక శుక పికాదులకు నేర్పించిన ఘనత కూడా మనుషులకే దక్కుతుంది గాని, అది వేరే విషయం. మాటల మహిమను వర్ణించాలంటే మాటలు చాలవు. మాటకారులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇట్టే నెట్టుకొచ్చేయగలరు. అసాధ్యమనుకున్న పనులను చిటికెలో చక్కబెట్టగలరు. మాటకారులైన దౌత్యవేత్తలు మాటలతో యుద్ధాలను కూడా నివారించగలరు. మాటల మహత్తును ఒక పూర్వకవి ఇలా వర్ణించాడు: ‘మాటల చేత దేవతలు మన్నన జేసి వరంబు లిత్తురా/ మాటల చేత భూపతులు మన్నన జేసి పురంబు లిత్తురా/ మాటల చేత మానినులు మన్నన జేసి మనంబు లిత్తురా/ మాటలు నేర్వకున్న నవమానము, న్యూనము, మానభంగమున్’. చక్కగా మాట్లాడటం చేతనైతే దేవతలను; భూపతులను; మానినులను సైతం మెప్పించి, వారి ద్వారా కోరిన ప్రయోజనాలు పొందడం సాధ్యమవుతుంది. సక్రమంగా మాట్లాడటం చేతగాకుంటే చీవాట్లు, శిక్షలు తప్పకపోవచ్చు. నలుగురిలోనూ నవ్వుల పాలయ్యే పరిస్థితులు కూడా తప్పకపోవచ్చు. మాటకారితనానికి మారుపేరుగా వెలిగిన మహానుభావులు చరిత్రలో చాలామంది ఉన్నారు. అక్బర్ ఆస్థానంలోని బీర్బల్, శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలోని తెనాలి రామకృష్ణుడు వంటి వారు ఆ కోవలోకే వస్తారు. వారి మాటకారితనాన్ని ఇప్పటికీ జనాలు కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నారు. కొందరు ముక్తసరిగా మాట్లాడతారు. కొందరు ఆచి తూచి తూకం వేసినట్లుగా మాట్లాడతారు. కొందరు గలగలా ధారాళంగా మాట్లాడతారు. కొందరు రసజ్ఞులు సరసంగా మాట్లాడతారు. రసజ్ఞత బొత్తిగాలేని కొందరు విరసంగా మాట్లాడతారు. కొందరు నిష్ఠురంగా మాట్లాడతారు. ‘నరుడు మదిలో దొంగ/ నాల్క బూతులబుంగ/ కడుగజాలదు గంగ’ అన్నారు ఆరుద్ర. అదేం కర్మమోగాని కొందరు నోరు తెరిస్తే చాలు, బూతులతో మోత మోయిస్తారు. ఇటీవలి రాజకీయాల్లో ఇలాంటివారి వాగ్ధాటి విపరీతంగా మార్మోగుతోంది. కొందరు మాటలతోనే కోటలు కట్టేస్తుంటారు కొందరి మాటలు కోటలు దాటేస్తుంటాయి. అలాంటివారు రాజకీయాల్లో అమోఘంగా రాణిస్తుంటారు. ‘ఏదైనా సభలో ఆశువుగా మాట్లాడటానికి ముందు నేను కనీసం మూడువారాల పాటు సాధన చేస్తాను’ అని చెప్పుకున్న మార్క్ ట్వేన్ మన రాజకీయ నాయక దిగ్గజాల ముందు ఎంతటి అర్భకుడో కదా పాపం! మన రాజకీయ నాయకులు అంత శ్రమ లేకుండానే, ఎంత పెద్ద బహిరంగ సభలోనైనా గంటల కొద్ది ఏకధాటిగా ప్రసంగించగలరు. రాజకీయరంగంలోనే కాదు, సాహితీ రంగంలోనూ, ఆధ్యాత్మిక ప్రవచన రంగంలోనూ ఇలాంటి అనర్గళ వాక్ప్రతిభాసంపన్నులు తారసపడుతుంటారు. మాటలు రకరకాలు. మనుషుల్లో ఎన్ని రకాలో మాటలు కూడా అన్ని రకాలు. హితవైన మాటలు, మధురమైన మాటలు, కల్లబొల్లి మాటలు, సరళమైన మాటలు, పరుషమైన మాటలు, దుందుడుకు మాటలు, ముతక మాటలు, నాజూకు మాటలు, చమత్కారం మాటలు, వెటకారం మాటలు– చెప్పుకుంటూ పోతే జాబితా చేంతాడంతవుతుంది. మనది ప్రజాస్వామ్యం. అందువల్ల మనకు మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది. మన రాజ్యాంగం ప్రకారం ‘వాక్స్వాతంత్య్రం’ మన ప్రాథమిక హక్కుల్లో ఒకటి. దురదృష్టవశాత్తు జనాలు అతిగా దుర్వినియోగం చేసుకునే హక్కు కూడా ఇదే! ‘ప్రజలు వాక్స్వాతంత్య్రాన్ని ఎందుకు కోరుకుంటారంటే, దాన్ని ఆలోచనా స్వాతంత్య్రానికి ప్రత్యామ్నాయంగా భావిస్తారు. ఆలోచనా స్వాతంత్య్రాన్ని దాదాపుగా వారు ఎప్పుడూ ఉపయోగించుకోరు’ అని డేనిష్ కవి, తత్త్వవేత్త సోరెన్ కీర్కెగార్డ్ వాక్స్వాతంత్య్రాభిలాష వెనుకనున్న మతలబును రెండు శతాబ్దాల కిందటే తేటతెల్లం చేసేశాడు. మాటలు నోటి ద్వారా వెలువడతాయి. అంతమాత్రాన మాట్లాడటానికి నోరు మాత్రమే ఉంటే సరిపోదు. మాట్లాడటానికి ఆలోచన అవసరం. అనాలోచితంగా మాట్లాడే మాటలు ఒక్కోసారి చిక్కుల్లోకి నెడతాయి. ‘వివేకవంతులు తమ మాటలను ఆలోచనలతో జల్లెడ పడతారు’ అన్నాడు బుద్ధుడు. కాకపోతే సమాజంలో వివేకవంతుల సంఖ్య ఎప్పుడూ పరిమితమే! అరకొర జ్ఞానంతో అల్లాడే వాక్శూరులు వినేవాళ్లను వెర్రిగొర్రెల్లా లెక్కగట్టి చేటభారతాలు చెప్పుకుంటూ పోతారు. వారి వాక్స్వాతంత్య్రాన్ని ఎవరూ హరించలేరు గాని, అమెరికా మాజీ ప్రధాన న్యాయమూర్తి వారెన్ ఇ బర్గర్ అన్నట్లుగా ‘వాక్‌స్వాతంత్య్రంలో శ్రవణ స్వాతంత్య్రం కూడా మిళితమై ఉంటుంది’ అనే వాస్తవాన్ని గుర్తెరగాలి. అప్పుడే వాక్స్వాతంత్య్రాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం. మనకు బహుభాషా పరిజ్ఞానం ఉంటే ఉండవచ్చు; అపారమైన పదసంపద ఉండవచ్చు; అనర్గళ వాగ్ధార ఉండవచ్చు. అంతమాత్రాన అనాలోచితంగా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతూ పోతే శృంగభంగం తప్పదు. అసలే ఇది మనోభావాల కాలం. ఏ మాట ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందో అనేదానిపై కనీసమైన అంచనా మాట్లాడే ముందే ఉండాలి. ఎంతటి భాషా వేత్తలయినా మాటలను ఆచి తూచి ఉపయోగించాలి. మాటల గురించి ఇన్ని మాటలు ఎందుకంటే, ‘ఆది నుంచి ఆకాశం మూగది/ అనాదిగా తల్లి ధరణి మూగది/ నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు/ నడమంత్రపు మనుషులకే మాటలు– ఇన్ని మాటలు’ అని సెలవిచ్చారు వేటూరి. అదీ సంగతి. మరి మాటలంటే మాటలా! -
సాధికారతే ప్రజాస్వామ్యం!
కులం పునాదుల మీద మనం ఒక జాతిని నిర్మించలేమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఘంటాపథంగా ప్రకటించారు. భారతీయులందరినీ ఏకతాటి మీదకు తీసుకొని రావాలంటే అందుకు తొలి షరతు కుల నిర్మూలనేనని ఆయన స్పష్టం చేశారు. ఒక మానవ సమూహం నాగరిక పౌరసమాజంగా మన్నన పొందాలంటే, దాని పాలనా విధానంలో ప్రజా స్వామ్యం శోభిల్లాలంటే... ఆ సమూహంలోని ప్రజలంతా ఆత్మ గౌరవంతో తల ఎత్తుకొని జీవించే పరిస్థితి ఉండాలి. ఆత్మ గౌరవానికి అతిపెద్ద శత్రువు కులమేనని పెరియార్ రామస్వామి నాయకర్ నిగ్గు తేల్చారు. కుల నిర్మూలన కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కుల నిర్మూలన ఎలా సాధ్యపడుతుంది? అనాగరికమైన ఈ కుల వ్యవస్థను కూలదోయడానికి ఉపకరించే ఆయుధాలేమిటి? దుర్భర బర్బర సంప్రదాయాల నుంచి సంఘాన్ని విముక్తం చేయడమెట్లా? ఆయా చార్రితక కాలమాన పరిస్థితులను బట్టి సంఘ సంస్కర్తలు రకరకాలుగా మార్గదర్శనం చేశారు. సహపంక్తి భోజనాలు చేయాలన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలన్నారు. పేదకులాల ప్రజలందరూ బాగా చదువుకోవాలని ఉపదేశించారు. వీటన్నిటి సారాంశం ఒక్కటే. పుట్టుక కారణంగా నిమ్నకులం వారుగా ముద్రవేయించుకునే ప్రజలందరూ ధనిక కులాల వారితో ఇంచుమించు సరిసమా నమైన సాంఘిక, ఆర్థిక, రాజకీయ హోదాలను అందుకోవాలి. అప్పుడే వారిలో ఆత్మన్యూనత అదృశ్యమై ఆత్మగౌరవం మొగ్గ తొడుగుతుంది. భారత రాజ్యాంగం ఇదే అభిప్రాయాన్ని తన లిఖితపూర్వక ఆదేశాల్లో ప్రతిఫలింపజేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజలందరూ సమాన వాటాదారులు కనుక హెచ్చుతగ్గులు లేని సమాజానికి బాటలు వేయడం రాజకీయ పక్షాల కనీస బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడంలో ఇప్పటివరకూ మన ఏలికలు విఫలమవుతూ వస్తున్నారనేందుకు నిమ్నవర్గాల దుఃస్థితే సజీవ సాక్ష్యం. ఆర్థిక, రాజకీయ రంగాల్లో కొన్ని మొక్కుబడి ప్రయోజ నాలను కల్పించినప్పటికీ, సామాజిక హోదాను కట్టబెట్టడంలో మన ప్రభుత్వాలు చేసింది పెద్ద గుండుసున్నా మాత్రమే! ఆంధ్ర ప్రదేశ్‌లో ఆధికారంలో వున్న వైఎస్ జగన్ ప్రభుత్వం తన 53 నెలల పాలనాకాలంలో ఈ ఒరవడిని మార్చింది. ఆర్థిక, రాజ కీయ రంగాల్లో మొక్కుబడి తతంగాలకు స్వస్తి చెప్పి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇంతవరకు ఎవరూ పట్టించు కోని సాంఘిక రంగంలో సైతం ఉద్యమ చైతన్యాన్ని రగిలించే ప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలు ఇవ్వడం ప్రారంభమైంది కనుకనే, ప్రజలు గుర్తించడం మొదలుపెట్టారు కనుకనే పార్టీ అధినేత వైఎస్ జగన్ సామాజిక సాధికార యాత్రలకు పిలుపునిచ్చారు. ఈ రథయాత్రలు మరింత జన చేతనను జ్వలింపజేస్తాయని ఆయన ఆశిస్తున్నారు. రాజకీయ, ఆర్థిక విషయాలకు సంబంధించినంత వరకూ గత కాలపు ప్రభుత్వాల తూతూ మంత్రపు తతంగాల స్థానంలో విప్లవకర విధానాలను ఆయన ప్రవేశపెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే పేద వర్గాల ప్రజలను సంక్షేమ పథం నుంచి సాధికారత గమ్యం వైపు ఆయన మళ్లించారు. ప్రజలకు ఆ గమ్యాన్ని గుర్తు చేయడం కోసం ఇప్పుడు జరుగుతున్న యాత్ర లకు ‘సామాజిక సాధికార యాత్ర’లుగా ఆయన నామకరణం చేశారు. పేదవర్గాల ప్రజలందరూ ఈ గమ్యానికి చేరుకోవడమే నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం, సార్థకత. సమస్త వృత్తి వ్యాపారాలకు ప్రాతినిధ్యం వహించే సకల జనులందరూ నిజమైన స్వేచ్ఛతో, సాధికార స్వరంతో నిర్భ యంగా తమ అభిప్రాయాలు వెల్లడించగలిగే దశకు చేరుకున్న ప్పుడే ప్రజాస్వామ్యం నూరుశాతం ఫలించినట్టు లెక్క. రాజ కీయ వేషాలు వేసుకున్న దొంగలకు, దోపిడీదార్లకు, పిండారీ లకు అదుపులేని లైసెన్స్‌లు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. నడిరోడ్ల మీద సభల పేరుతో తొక్కిసలాటలు సృష్టించి జనాన్ని చంపే స్వేచ్ఛ కోసం, నేరం చేసినట్టు ఆధారా లున్నవాడు కూడా అరెస్ట్ కాకుండా ఉండే స్వేచ్ఛ కోసం, సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననాలకు పాల్పడే స్వేచ్ఛ కోసం ఇప్పుడు జరుగుతున్న ఆరాటాలు, పోరాటాలు ప్రజాస్వామ్యంగా పరిగణించడం సాధ్యం కాదు. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని ప్రకటిస్తూ పేద తల్లిదండ్రుల పక్షాన ఆ ఆస్తిని సమకూర్చే బాధ్యతను వైఎస్ జగన్ ప్రభుత్వం తలకెత్తుకున్నది. ఆ చదువు నాణ్యమైనదిగా, ఆధునిక సాంకేతికత జోడించినదిగా, అత్యు న్నతస్థాయి పాఠశాలల ప్రమాణాలను అందుకునేదిగా ఉండేట్టు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంత బృహత్తరమైన కార్యా చరణలో తల్లిదండ్రుల మీద వీసమెత్తు భారం పడకుండా, పైగా వారికి ప్రోత్సాహకం కూడా లభించేలా ఏర్పాట్లు చేసింది. ప్రతి బాలికా, బాలుడూ కచ్చితంగా బడికి వెళ్లేలా, ఏ ఒక్కరూ మధ్యలో బడి మానివేసే పరిస్థితి రాకుండా అందరూ ఉన్నత విద్యను అభ్యసించే విధంగా ఒక విప్లవోద్యమం మొదలైంది. ఈ ‘ఆస్తి’పరులు తమ చదువును మదుపుచేసి మరో పదేళ్ల తర్వాత నుంచి వరుసగా ప్రతి ఏటా సంపద సృష్టిలో కీలక బాధ్యత వహించబోతున్నారు. తాము పుట్టి పెరిగిన వర్గాన్ని విముక్తం చేయబోతున్నారు. వైద్యం, వ్యవసాయం, చిన్న–సూక్ష్మ పరిశ్రమలు, చిరు వ్యాపారాలు తదితర రంగాలను కూడా పేదల అనుకూల విధానాలు ఆవహిస్తున్నాయి. ఇప్పుడు చేయూత కోసం ఎదురు చూసే స్థితిలో ఉన్న ప్రజలు రానున్న కాలంలో పదిమందిని చేయిపట్టి నడిపించగల స్థితికి చేరుకుంటారు. జగన్ ప్రభుత్వ విధానాల ఫలితంగా మరో ఐదు, పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ అద్భు తాలను చూడబోతున్నది. బలహీన వర్గాలకు రాజకీయ పదవుల కల్పనలో కూడా పాత పద్ధతులకు జగన్ సర్కార్ స్వస్తి చెప్పింది. మంత్రి మండలి శాఖల కేటాయింపుల్లో, శాసనమండలి, రాజ్యసభ సభ్యుల ఎంపికలో, కార్పొరేషన్లు, మేయర్లలో, మునిసిపల్, జడ్పీ ఛైర్మన్లలో, కార్పొరేషన్ చైర్మన్లలో ఇలా అన్నిరకాల రాజ కీయ పదువుల్లో బలహీన వర్గాలకు సింహభాగం కేటాయింపులు చేసిన జగన్ ప్రభుత్వం కొత్త చరిత్రను లిఖించింది. సామాజిక సాధికార యాత్రలో వైసీపీ నాయకులు ఈ గణాంకాలను ఉటంకిస్తూ చేస్తున్న సవాళ్లకు బదులు చెప్పలేక విపక్షం డిఫెన్స్‌లో పడిపోయింది. ఆర్థిక – రాజకీయ రంగాల్లో చోటు చేసుకుంటున్న మార్పులు ఒక ఎత్తయితే, సామాజిక మార్పులు మరో ఎత్తు. పేదవర్గాలు తల ఎత్తుకొని జీవించడానికి దోహదపడే మార్పులు కొన్ని ఆర్భాటం లేకుండా చోటు చేసుకుంటున్నాయి. ఒక నిశ్శబ్ద విప్లవం కమ్ముకొస్తున్న దృశ్యం ఇప్పుడు జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నది. ఇందులో మూడు అంశాలను మనం స్పష్టంగా చూడవచ్చు. 1. కొత్తగా వెలుస్తున్న వాడల్లో కులజాడలు కన్పించడంలేదు. 2. హిందూ సమాజం అపురూప గౌరవంగా భావించే ఆలయ మర్యాదలు పెద్ద కులాల పరిధుల్ని దాటి బలహీనవర్గాల్లోకి ప్రవేశించాయి. 3. శ్రామిక మధ్యతరగతి మహిళల మాటకు ఇంటాబయటా క్రమంగా మర్యాద మన్నన పెరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో లక్షల సంఖ్యంలో నిర్మాణమవుతున్న జగనన్న ఇళ్లను పరిశీలించడానికి ఇటీవల బీబీసీ (బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్) వెబ్సైట్ ప్రతినిధి ఒకరు రాష్ట్రంలో పర్యటించారు. సెమీ అర్బన్ ప్రాంతమైన సామర్లకోటలో వేల సంఖ్యలో నిర్మాణం పూర్తయిన, నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను పరిశీలించి అక్కడ నివాసముంటున్న వాళ్లతో మాట్లాడారు. అందులో ఇంజేటి సమర్పణరాజు అనే లబ్ధిదారుడు చెప్పిన మాటలు దేశం దృష్టిని ఆకర్షించాయి. ‘మాకు (దళితులకు) గతంలో కాలనీలు వేరుగా ఉండేవి. అవమానంగా ఉండేది. ఇక్కడలా చేయలేదు. మాకు ఇచ్చిన ఇళ్ల పట్టాల నంబర్ల ఆధారంగా డ్రా తీశారు. డ్రాలో వచ్చిన ఫ్లాట్లను కేటాయించారు. అన్ని కులాల వారూ పక్కపక్కనే వచ్చారు. సంతోషంగా ఉంది.’ ఆ ప్రతినిధి పరిశీలించిన అన్ని కాలనీల్లో ఈ మాట వినిపించింది. పశ్చిమ గోదావరి జిల్లా పెదతాడేపల్లి వాస్తవ్యురాలు గుండుగోలు అరుణ అనే దళిత మహిళ మాట్లాడుతూ మాకు వచ్చిన ఇంటికి ఎదురుగానే కమ్మవారికి వచ్చింది. మా పక్కనే తూర్పు కాపులకు వచ్చింది. అందరం కలిసే ఉంటున్నామని చెప్పింది. బలహీన వర్గాల వారికి ప్రభుత్వం కేటాయించే ఇంటి స్థలాల్లో కులాల వారీ కాలనీలు పట్టణ ప్రాంతాల్లో క్రమంగా అంతరించాయిగానీ, గ్రామాల్లో చాలాకాలం కొనసాగాయి. ఆ సంప్రదాయాన్ని 17 వేల జగనన్న కాలనీల్లో స్వస్తి పలికి సమష్టి జీవనానికి శ్రీకారం చుట్టారు. సంపన్నులకు, పెద్ద కుటుంబాల వారికీ, వ్యాపారులకు మాత్రమే ఆలయ కమిటీల్లో చోటు దొరికేది. పూర్వపు ధర్మ కర్తలకు లభించే గౌరవ మర్యాదలు ఈ కమిటీ సభ్యులకు కూడా లభిస్తాయి. ఆలయంలో లభించే గౌరవానికి హిందువులు విశేష ప్రాధాన్యమిస్తారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే సినిమా క్లైమాక్స్ దృశ్యం ఈ అభిప్రాయానికి అద్దం పడుతుంది. విఖ్యాత హిందూ దేవాలయం తిరుమలలో ఆలయ మర్యాదల కోసం సంపన్నులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తహతహలాడిపోవడం మనం చూస్తూనే ఉన్నాము. అటువంటి తిరుమలలో తిరుమలేశుని తొలిదర్శనం చేసుకునే అవకాశాన్ని సన్నిధి గొల్లకు జగన్ మోహన్‌రెడ్డి హక్కుభుక్తం చేశారు. వెనక బడిన కులాల్లో మరింత వెనుకబడిన కులాల వారికి కూడా తిరుమల ఆలయ కమిటీలో సభ్యత్వం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చే వేలాది ఆలయా లకు నియమించిన కమిటీల్లో సగం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలవారే! ఇదొక సామాజిక హోదా, గౌరవం. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది బలహీనవర్గాల ప్రజలకు ఇప్పుడీ గౌరవం దక్కింది. మహిళా సాధికారత లేకుండా జన సాధికారత సంపూర్ణం కాదు. అది సంపూర్ణం కాకుండా నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ అవతరించదు. పేద వర్గాల పురుషులు రాజకీయ, ఆర్థిక,సాంఘిక వివక్షలకు మాత్రమే గురవుతారు. శ్రామిక వర్గ మహిళలు తమ పురుషులతో సమానంగా ఈ వివక్షలను ఎదుర్కొంటూనే లైంగిక అసమానత్వాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. ఈ రెట్టింపు వివక్ష ఈనాటిది కాదు. ఈ దేశానికి మాత్రమే పరిమితమైనది కాదు. రెండు శతాబ్దాల క్రితం మాక్సిమ్ గోర్కీ రాసిన రష్యన్ నవల ‘అమ్మ’ ఇతివృత్తమే ఇది. ప్రపంచంలోని అన్ని ప్రధాన భాషల్లో కోట్లాది మంది చదివి ప్రభావితమైన నవల బహుశా ‘అమ్మ’ ఒక్కటేనేమో! రెట్టింపు దోపిడీనీ, రెట్టింపు అవమానాల్నీ ఎదుర్కొన్న అమ్మ మాత్రం బేల కాదు. పోరాట పటిమకు పెట్టింది పేరు. ఆ మాటకొస్తే శ్రామిక మహిళలందరూ పోరాట పటిమ గలవారే. ‘మదర్ ఇండియా’లే! వారి గౌరవ మర్యాదలను ఇనుమడింపజేయగల కొన్ని ప్రత్యేక పథకాలను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇప్పుడు రాష్ట్రంలోని స్థానిక సంస్థల అధ్యక్ష పీఠాలపై సగానికి పైగా మహిళలే ఆసీనులయ్యారు. ఆలయ కమిటీల్లోనూ సగానికంటే ఎక్కువమంది ఉన్నారు. అన్ని నామినేటెడ్ పోస్టుల్లో సగం దక్కించుకున్నారు. మంత్రివర్గంలో కీలక శాఖల అధిపతులుగా ఉన్నారు. రాజకీయ ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచడం ఒక భాగం మాత్రమే! ‘అమ్మ ఒడి’, అమ్మ పేరున ‘ఆస్తిపత్రం’, అమ్మకు ‘చేయూత’ అనే మూడు విశిష్ట పథకాలు ఎక్కడా లేనివి. మహిళల ఆత్మగౌరవానికి మకుట ధారణ చేసినవి. పిల్లల చదువులు, భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయా ధికారాన్ని ‘అమ్మ ఒడి’ పథకం ఆమెకు కట్టబెట్టింది. 30 లక్షల మంది మహిళలకు సంపూర్ణ హక్కులతో ఇంటి పట్టాలను జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్నారు. ఇంటాబయటా ఆమె గౌరవం పెరిగింది. చేయూత పథకంతో నడివయసులోనూ మహిళలు వ్యాపారస్తులుగా రాణిస్తున్నారు. మనుమలు, మను మరాళ్లకు చిన్నచిన్న బహుమతులు కూడా కొనివ్వలేని నిస్స హాయ స్థితిని వాళ్లిప్పుడు జయించారు. వ్యాపార విజయాల కోసం ఇప్పుడు పాటుపడుతున్నారు. ఈ 53 నెలల కాలంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు బహుజనులను, మహిళలను సాధికారత పథంలో నిలబెట్టాయి. ఈ పరిణా మాన్ని పెత్తందారీ శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి. తక్షణమే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో అన్ని వైపుల నుంచీ యుద్ధాన్ని ప్రకటించాయి. తప్పుడు ప్రచారాలతో ఒక విష వృష్టిని కురిపిస్తున్నాయి. సాధికార యాత్రలతో విష ప్రచారాలను ఎండగట్టవలసిన బాధ్యత, పెత్తందారీ కుట్రలను తిప్పి కొట్టవలసిన బాధ్యత బహుజనులూ, మహిళలదే! ఆ బాధ్యతను విజయవంతంగా నెరవేర్చగలిగితేనే కులం జాడలు, వెలివాడలు అదృశ్యమవుతాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఖతార్ ‘మరణ’ మృదంగం!
గల్ఫ్ దేశాల్లో పనిచేయటం కత్తిమీది సాము. అక్కడ అమలయ్యే చట్టాలు, న్యాయవ్యవస్థ తీరు తెన్నులు భిన్నమైనవి. కనుక ఉపాధి కోసం వెళ్లినవారు ఎంతో జాగురూకతతో వుంటారు. అందువల్లే ఆ దేశాల్లో ఒకటైన ఖతార్‌లో అల్ దహ్రా గ్లోబల్ అనే ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మన నావికాదళ మాజీ అధికారులు ఎనిమిది మంది గూఢచర్యం ఆరోపణల సాలెగూటిలో చిక్కుకోవటం, అక్కడి న్యాయస్థానం గురువారం వారికి మరణదండన విధించటం అందరినీ కలవరపెట్టింది. వాస్తవానికి గూఢచర్యం ఆరోపణలున్నాయని మీడియాలో కథనాలు రావటం మినహా అధికారికంగా ఖతార్ ఎలాంటి వివరణా ఇవ్వలేదు. ఖతార్‌తో నిరుడు ఆగస్టు నుంచి సంప్రదింపులు జరుపుతూ, వారి విడుదలకు కృషి చేస్తున్న మన విదేశాంగ శాఖ కూడా ఏమీ చెప్పలేదు. న్యాయస్థానంలో విచారణ సరేసరి. అంతా గోప్యంగా ముగిసిపోయింది. మరణశిక్ష పడినవారు సాధారణ వ్యక్తులు కాదు. మన నావికాదళంలో పనిచేసినన్నాళ్లూ తమ సత్తా చాటినవారు. వీరిలో తెలుగువారైన సుగుణాకర్ పాకాల కమాండర్ స్థాయిలో పనిచేసి రిటైరయ్యారు. తన సర్వీసు కాలంలో రెండుసార్లు నావికాదళ నౌక ఐఎన్ఎస్ తరంగిణిపై ఒంటరిగా వెళ్లి భూమధ్య రేఖప్రాంతంలో అట్లాంటిక్, పసిఫిక్ మహా సము ద్రాలను దాటివచ్చినవారు. ఇతరులు కూడా నావికాదళ విభాగాల్లో నిపుణులు, లబ్ధ ప్రతిష్టులు. ఒక సందర్భంలో అందరినీ స్వదేశం వెళ్లేందుకు సిద్ధంగా వుండమని చెప్పిన ఖతార్ అధికారులు అంత లోనే నిర్ణయం మార్చుకున్నారని అంటున్నారు. వీరు పని చేసిన అల్ దహ్రా గ్లోబల్ సంస్థ నిర్వాహకులను కూడా అరెస్టు చేసిన ఖతార్ అధికారులు రెండు నెలలకే వారిపై ఎలాంటి విచారణ లేకుండా విడుదల చేశారు. మరి భారతీయుల విషయంలో ఈ వివక్ష ఎందుకో అర్థం కాని విషయం. ఇటలీ నుంచి ఖతార్ సమకూర్చుకున్న యు 212 జలాంతర్గామిపై ఆ దేశ నావికాదళ సిబ్బందికి శిక్షణ ఇచ్చే పనిలో ఉన్నప్పుడు హఠాత్తుగా వీరిని అరెస్టు చేశారంటున్నారు. ఆ జలాంత ర్గామి సాంకేతిక వివరాలను ఇజ్రాయెల్‌కు చేరేశారన్నది ప్రధాన అభియోగమని చెబుతున్నారు. నేరారోపణలు ఎదుర్కొన్నవారికి న్యాయసహాయం లభించిందా... అసలు వారిపై వున్న ఆరో పణలు ఏమిటన్నది వెల్లడి కాలేదు. కనీసం కుటుంబ సభ్యులకైనా ఆ వివరాలు అందించారా లేదా అన్నది అనుమానమే. సాధారణంగా గూఢచర్యం కేసుల్లో ప్రభుత్వాలు ఎక్కడలేని గోప్యతా పాటి స్తాయి. ఇందువల్ల అటు ముద్దాయిలకు అన్యాయం జరగటంతోపాటు ఆ దేశానికి కూడా అంత ర్జాతీయంగా చెడ్డపేరొస్తుంది. ఖతార్‌కు ఈ విషయాలు తెలిసేవుండాలి. ఖతార్‌తో వున్న ద్వైపాక్షిక సంబంధాలను వినియోగించుకుని వీరందరి విడుదలకూ మన దేశం చేసిన ప్రయత్నాలను ఆ దేశం వమ్ముచేసింది. అక్కడి మీడియా సంస్థలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టు ఈ కేసు లొసుగులను ఎత్తి చూపుతూ రాసిన కథనం తమ జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నదని ఆగ్రహించి ఆమెను సైతం అరెస్టు చేయటానికి ఖతార్ అధికారులు ప్రయత్నించారని ఒక ఆంగ్ల దినపత్రికలో ఇటీవలే కథనం వెలువడింది. దీనిపై ముందుగా ఉప్పందటంతో ఆ జర్నలిస్టు, అక్కడ వేరే ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త హుటాహుటీన ఆ దేశం విడిచి భారత్ వచ్చారని ఆ కథనం తెలిపింది. ఈ కేసుపై మొత్తంగా ఏడు వాయిదాల్లో విచారణ జరిగిందని చెబుతున్నారుగానీ, దాని తీరుతెన్నులెలా వున్నాయో జర్నలిస్టుకు ఎదురైన చేదు అనుభవమే తేటతెల్లం చేస్తోంది. ఆరోపణలొచ్చినంత మాత్రాన అన్నీ నిజమైపోవని ఖతార్‌కు తెలియదనుకోలేం. ఎందుకంటే ఆ దేశానికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయంటూ ఆరేళ్ల క్రితం గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) నుంచి దాన్ని సౌదీ అరేబియా సాగనంపింది. కానీ చివరికి మళ్లీ ఖతార్‌తో సంధి కుదుర్చుకోక తప్పలేదు. ఉగ్రవాదులుగా ముద్రపడిన తాలిబన్లకు ఆశ్రయం ఇచ్చి, వారితో అమె రికా చర్చలు జరిపేలా చేయటంలో ఖతార్ విజయం సాధించింది. ఇప్పుడు ఇజ్రాయెల్‌లో చొరబడి ఆ దేశ పౌరులను కాల్చిచంపి, అనేకమందిని బందీలుగా పట్టుకున్న హమాస్‌కు సైతం ఖతార్‌లో కార్యాలయం వుంది. ఖతార్ మధ్యవర్తిత్వంతోనే హమాస్ తీవ్రవాదులు బందీల్లో ఇద్దరు అమెరికన్ పౌరులను విడుదల చేశారు కూడా. వీటన్నిటినీ చూపి ఖతార్‌ను ఉగ్రవాద దేశంగా పరిగణించాల్సిన అవసరం లేదు. గల్ఫ్ దేశాల్లో ఖతార్ చూడటానికి చిన్న దేశమే కావొచ్చుగానీ, దానికుండే సహజ వనరులు అపారమైనవి. దాని తలసరి ఆదాయం చాలా ఎక్కువ. ఖతర్కూ, ఇరాన్‌కూ మధ్య సముద్ర జలాల్లో అపారమైన సహజవాయు నిక్షేపాలున్నాయి. అందుకే ఆ దేశంతో ఖతార్‌కు స్నేహ సంబంధాలున్నాయి. ఇతర గల్ఫ్ దేశాల తీరు ఇందుకు భిన్నం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరణశిక్ష పడినవారికి 2015లో భారత్–ఖతార్‌ల మధ్య కుదిరిన ఒప్పందం ఒక ఆశాకిరణం. దాని ప్రకారం యావజ్జీవ శిక్ష పడినవారిని స్వదేశంలో శిక్ష అనుభవించటానికి వీలుగా వెనక్కిపంపే వీలుంటుంది. ప్రస్తుతం మరణశిక్ష పడిన ఎనిమిదిమందీ ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ చేసుకుంటే వారిని నిర్దోషులుగా విడుదల చేయొచ్చు. కనీసం దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చే అవకాశం వుంటుంది. అదే గనుక జరిగితే 2015 ఒప్పందం కింద వీరిని భారత్ పంపే వీలుంటుంది. ఏదేమైనా ఈ వ్యవహారం మన దౌత్య నైపుణ్యానికి పెద్ద పరీక్ష. గత తొమ్మిది నెలలుగా తెరవెనక సాగించిన యత్నాలు పెద్దగా ఫలించలేదు. కనీసం ఇకముందైనా ఖతార్‌ను ఒప్పించటంలో, అది సహేతుకంగా వ్యవహరించేలా చేయటంలో మన ప్రభుత్వం విజయం సాధించాలని ఆశించాలి. -
చైనా కొత్త ఎత్తులు
ప్రపంచమంతా కొత్తగా రాజుకున్న ఇజ్రాయెల్ – గాజా లడాయిపై దృష్టి కేంద్రీకరిస్తున్న తరుణంలో చడీచప్పుడూ లేకుండా చైనా పావులు కదిపింది. మన సన్నిహిత దేశాలైన భూటాన్, శ్రీలంకలతో ఒప్పందాలు కుదుర్చుకుని మనల్ని ఇరకాటంలో పడేసింది. చైనాలో పర్యటించిన భూటాన్ విదేశాంగమంత్రి తాండీ దోర్జీతో చైనా ఉప విదేశాంగమంత్రి సన్ వీ డాంగ్ సంప్రదింపులు జరిపి ఇరుదేశాల సరిహద్దు వివాదాన్నీ పరిష్కరించుకోవటానికి ఉమ్మడి సాంకేతిక నిపుణుల బృందం ఏర్పాటుకు అవగాహన కుదుర్చుకున్నారు. రెండు దేశాల మధ్యా దౌత్యసంబంధాలు ఏర్పాటుచేసు కోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అటు శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే కూడా చైనా సందర్శించి ఆ దేశం తలపెట్టిన బృహత్తర ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ)లో తమ దేశం పాలుపంచుకుంటుందని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై త్వరలో సంతకాలవుతాయని సంయుక్త ప్రకటనలో తెలిపారు. భూటాన్, శ్రీలంక రెండూ సార్వభౌమాధి కారం వున్న దేశాలు. తమ ప్రయోజనాలకు తగినట్టు అవి నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ ఆ ఒప్పందాల పర్యవసానాలు భారత్ భద్రతతో ముడిపడివుండటం మనల్ని కలవరపరిచే అంశం. శ్రీలంక మాటెలావున్నా భూటాన్‌తో మనకు ప్రత్యేక అనుబంధం వుంది. 2007 వరకూ భూటాన్‌తో వున్న స్నేహ ఒడంబడిక ప్రకారం మన దేశం ఆమోదించిన 21 దేశాలతో మాత్రమే అది దౌత్య సంబంధాలు ఏర్పర్చుకునేది. యూపీఏ హయాంలో ఈ ఒప్పందం గడువు ముగిసినా మన దేశం చొరవ తీసుకోకపోవటం, ఈలోగా ఆ ఒప్పందం కింద భూటాన్‌కి అప్పటివరకూ ఇచ్చే సబ్సిడీలు ఆగిపోవటం సమస్యలకు దారితీసింది. ఆ దేశంలో ఒక్కసారిగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగి పోయాయి. వాస్తవానికి భూటాన్ ఉత్తర సరిహద్దులో వున్న చంబీలోయ ప్రాంతాన్ని తమకు ధారాదత్తం చేయమని చైనా కోరినా అది భారత్ భద్రతకు సమస్యలు తెచ్చిపెడుతుందన్న ఏకైక కారణంతో భూటాన్ తిరస్కరించింది. 2005లో భూటాన్ రాజు ఐచ్ఛికంగా రాచరిక ఆధిప త్యాన్ని వదులుకుని రాజ్యాంగబద్ధ పాలనకు బాటలు పరిచారు. అటు తర్వాత నుంచి భూటాన్ ఆలోచన మారింది. దేశానికి గరిష్ఠంగా మేలు చేసే విదేశాంగ విధానం అనుసరించాలన్న అభి ప్రాయం బలపడింది. అలాగని 2017లో డోక్లామ్‌లో చైనాతో వివాదం తలెత్తినప్పుడు భూటాన్ మన సాయమే తీసుకుంది. అయితే మన దేశం మరింత సాన్నిహిత్యంగా మెలిగివుంటే అది చైనా వైపు చూసేది కాదు. డోక్లామ్‌కు దగ్గరలో చైనా భూగర్భ గిడ్డంగుల్ని నిర్మిస్తోందని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ మన దేశాన్ని నిరుడు హెచ్చరించింది. అలాగే అక్కడికి సమీపంలో ఒకటి రెండు గ్రామాలను సృష్టించి ప్రజలను తరలించిందన్న వార్తలొచ్చాయి. డోక్లామ్ ప్రాంతం భారత్– భూటాన్– చైనా సరిహద్దుల కూడలి. అలాంటిచోట చైనా రోడ్డు నిర్మాణానికి పూనుకోవటం వల్ల 2017లో వివాదం తలెత్తింది. మన దేశం గట్టిగా అభ్యంతరాలు తెలపటంతో చైనా వెనక్కు తగ్గింది. కానీ ఆనాటి నుంచీ భూటాన్‌ను బుజ్జగించే ప్రయత్నాలు అది చేస్తూనేవుంది. ఒకపక్క మనతో వాస్తవాధీన రేఖ వద్ద ఏర్పడ్డ వివాదాల పరిష్కారానికి ఏ మాత్రం సిద్ధపడకుండా, చర్చల పేరుతో కాలయాపన భూటాన్‌తో మాత్రం సన్నిహితం కావటానికి చైనా ప్రయత్నించటంలోని ఉద్దేశాలు గ్రహించటం పెద్ద కష్టం కాదు. ఇటు శ్రీలంక సైతం మన అభ్యంతరాలను బేఖాతరు చేసి బీఆర్ఐ ప్రాజెక్టులో పాలుపంచు కునేందుకే నిర్ణయించుకుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు ఇరు పక్షాలూ అంగీకరించాయి. హిందూ మహా సముద్ర ప్రాంతంలో మనల్ని దెబ్బతీసేందుకు మనకు సన్నిహితంగా వుండే దేశాలను రుణాలతో, భారీ ప్రాజెక్టులతో తనవైపు తిప్పుకునే చైనా ప్రయ త్నాలు ఈనాటివి కాదు. భారీ నౌకాశ్రయాలు, రహదారులు, విమానాశ్రయాలు నిర్మించేందుకు తమ ఎగ్జిమ్ బ్యాంకు ద్వారా చైనా అందించిన రుణాలు లంకను కుంగదీశాయి. విదేశీ మారకద్రవ్యం నిల్వలు చూస్తుండగానే అడుగంటాయి. దేశ ఆర్థిక వ్యవస్థ గుల్లయింది. ధరలు పెరిగిపోవటం, నిత్యావసరాల కొరత ఏర్పడటం పర్యవసానంగా నిరుడు తీవ్ర నిరసనలు పెల్లుబికి రాజపక్స సోద రులు, వారి కుటుంబసభ్యులు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో మన దేశం శ్రీలంకకు తక్షణ ఆర్థిక సాయం అందించి ఆదుకుంది. బీఆర్ఐ ప్రాజెక్టుకు అంగీకరించి, చైనా ఇస్తున్న రుణాలకు ఆమోదముద్ర వేస్తే పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందని ఈనెల 11న కొలంబోలో జరిగిన హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల సదస్సు సందర్భంగా మన విదేశాంగమంత్రి జైశంకర్ హెచ్చరించారు. నిరుడు దేశంలో సంక్షోభం తలెత్తినప్పుడు అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర 20 దేశాలున్న పారిస్ క్లబ్‌తో పాటు మన దేశం కూడా శ్రీలంకకు ఒక షరతు పెట్టింది. రుణాల చెల్లింపులో ఒకే విధమైన నిబంధనలు అనుసరించాలని, ద్వైపాక్షిక ఒప్పందం పేరుతో ఎవరికీ వెసులు బాటు ఇవ్వరాదని తెలిపాయి. అయినా చైనా విషయంలో అందుకు భిన్నమైన మార్గాన్ని శ్రీలంక ఎంచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం జాగ్రత్తగా అడుగులేయాలి. మన వ్యూహాత్మక ప్రయోజనాలను దెబ్బతీసే రీతిలో చైనాతో ఒప్పందాలు కుదుర్చుకొనరాదని శ్రీలంక, భూటాన్‌లకు నచ్చజెప్పాలి. ఏ కారణాలు వారిని చైనా వైపు మొగ్గు చూపేందుకు దారితీస్తున్నాయో గ్రహించి మనవైపు ఏమైనా లోటుపాట్లుంటే సరిదిద్దుకోవాలి. సకాలంలో సరైన కార్యాచరణకు పూనుకుంటే మనకు సానుకూల వాతావరణం ఏర్పడటం పెద్ద కష్టం కాదు. -
గణాంకాలు చెప్పే నిజాలు!
సరైన ప్రాతిపదికలు ఎంచుకుని, శాస్త్రీయ విధానంలో నమూనాలు రూపొందించుకుని వాటి ఆధారంగా సర్వే చేయాలేగానీ గణాంకాలెప్పుడూ అబద్ధం చెప్పవు. అలాగే అవి అన్నిసార్లూ పాలకులను రంజింపజేయలేవు. అప్పుడప్పుడు మిశ్రమ ఫలితాలు కూడా తప్పకపోవచ్చు. వెల్లడైన అంశాల్లోని వాస్తవాలను గుర్తించి వాటిని సరిచేసేందుకు అవసరమైన విధానాలను రూపొందించగలిగితే స్థితి గతులు మెరుగుపడతాయి. మనను చిన్నబుచ్చటానికే, ప్రతిష్ఠ దెబ్బతీసేందుకే ఇలాంటి గణాంకాలు అందిస్తున్నారని కొట్టిపారేస్తే అందువల్ల ప్రయోజనం ఉండదు. తాజాగా 2023కి సంబంధించిన అంచనాలతో ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) విడుదల చేసిన నివేదిక వెలువరించిన గణాంకాలు మనకు ఏక కాలంలో అటు సంతోషాన్నీ, ఇటు నిరాశనూ కూడా కలిగిస్తుండగా... ప్రపంచ బ్యాంకు నివేదిక ఓ విధంగా భయపెడుతోంది. ఓఈసీడీ నివేదిక ప్రకారం సంపన్న రాజ్యాలకు అంతక్రితం కన్నా 2021, 2022 సంవత్సరాల్లో వలసలు బాగా పెరిగాయి. ఇందుకు ఉక్రెయిన్ యుద్ధం చాలావరకూ దోహదపడి వుండొచ్చు. ఆ దేశం నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు యూరోప్ దేశాలకు వలసపోయారు. అలాగే 2020లో ప్రతి దేశమూ సరిహద్దులు మూసి వేయటంతో వలసలు దాదాపుగా నిలిచిపోయాయి గనుక దాంతో పోలిస్తే వలసలు పెరిగి వుండొచ్చు. అయితే స్థూలంగా చూస్తే వలసలు పెరిగాయి. అదే సమయంలో ఆ వలసల్లో మహిళల శాతం కూడా పెరిగింది. నిరుడు మన దేశంనుంచే వలసలు అధికంగా వున్నాయని నివేదిక సారాంశం. ఉన్నత విద్యకోసం వెళ్లేవారిని మినహాయించి కేవలం ఉపాధి కోసం వెళ్తున్నవారినే లెక్కేస్తే భారత్ నుంచి ఈసారి ఎక్కువమంది ఉద్యోగార్థులు వెళ్లారని ఆ నివేదిక వివరిస్తోంది. ఓఈసీడీలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలు సహా 38 సంపన్న దేశాలకు సభ్యత్వం వుంది. ఈ దేశాలకు 2021–22 మధ్య పదిలక్షల మంది వివిధ దేశాల నుంచి వలస రాగా అందులో 4.07 లక్షల మంది మన పౌరులు. ఉన్నత విద్య కోసం వెళ్లేవారిలో భారత్ రెండో స్థానంలో వుంది. మన దేశం నుంచి ఈ కేటగిరీలో 4.24 లక్షలమంది వుండగా, చైనా 8.85 లక్షలతో అగ్రభాగాన వుంది. అటు ఉపాధి కోసమైనా, ఇటు విద్యార్జన కోసమైనా అత్యధికులు ఎంచుకుంటున్నది అమెరికా, ఆస్ట్రే లియా, కెనడా దేశాలేనని నివేదిక వెల్లడిస్తోంది. ఈ వలసల గణాంకాలు గమనిస్తే అంతర్జాతీయంగా వుండే తీవ్ర పోటీని తట్టుకుని మన దేశం నుంచి ఎక్కువమంది ఉపాధి అవకాశాలను గెల్చు కుంటున్నారని తెలుస్తుంది. విదేశాలకు వెళ్లినవారు తమ కుటుంబాలకు పంపే నగదు నిరుడు బాగా పెరిగింది. ఆ ఏడాది 11,100 కోట్ల డాలర్లు భారత్‌కు విదేశాల నుంచి వచ్చిందని అంచనా. ఇది దేశ జీడీపీలో 3.3 శాతం. అంతేకాదు... ప్రపంచ దేశాలన్నిటిలో చాలా అధికం. ఈ నగదులో 36 శాతం అమెరికా, బ్రిటన్, సింగపూర్ల నుంచి వచ్చిందేనని గణాంకాలు చెబుతున్నాయి. దీన్నిబట్టే భారత్‌కూ, అభివృద్ధి చెందిన దేశాలకూ సంబంధ బాంధవ్యాలు ఎంత పెరిగాయో తెలుస్తున్నది. అటు విద్యారంగాన్ని గమనిస్తే ఉన్నత చదువుల కోసం పిల్లలను విదేశాలకు పంపే తల్లిదండ్రుల సంఖ్య పెరుగుతున్నదని అర్థమవుతుంది. ఈ విషయంలో లింగ వివక్ష కూడా తగ్గిందని ఓఈసీడీ నివేదిక వివరిస్తోంది. విదేశాల్లో చదువుకొనేందుకు వెళ్లేవారు అంతక్రితంతో పోలిస్తే రెట్టింపు పెరిగారని గణాంకాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా ఉపాధి కోసమైనా, విద్య కోసమైనా వెళ్లేవారు పెర గటం మనవాళ్ల సత్తాను చాటుతోంది. ఎందుకంటే ప్రత్యేక నైపుణ్యాలుంటే తప్ప ఇదంతా సాధ్యం కాదు. అయితే ఇదే సమయంలో మన దేశంలో అటువంటి నిపుణులకు తగిన అవకాశాలు లేవన్న చేదు వాస్తవం వెల్లడవుతోంది. తగిన ఉపాధి, మంచి వేతనాలు లభించినప్పుడు వాటిని వదులు కుని ఎవరూ అయినవారికి దూరంగా పరాయి దేశాలకు వలస వెళ్లాలనుకోరు. వెళ్తున్నారంటే అలాంటివారికి తగిన ఉపాధి అవకాశాలు చూపలేకపోతున్నామని, మెరుగైన వేతనాలు ఇవ్వలేకపోతున్నా మని అర్థం. ఆ నైపుణ్యాలను మన దేశాభివృద్ధికి వినియోగించలేకపోతున్నామని, తగిన శ్రద్ధ పెట్ట డంలేదని గుర్తించాలి. ఈ సందర్భంలో ఈమధ్యే అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ఇచ్చిన గణాంకాల ఆధారంగా రూపొందిన ప్రపంచ బ్యాంకు నివేదికను కూడా ప్రస్తావించుకోవాలి. నిరుడు మన ఇరుగుపొరుగు దేశాలతో పోలిస్తే భారత్‌లో నిరుద్యోగిత అధికంగా వున్నదని ఆ నివేదిక తెలిపింది. మన దేశ యువతలో నిరుద్యోగిత 23.22 శాతం వుంటే, పాకిస్తాన్ (11.3 శాతం),బంగ్లాదేశ్ (12.9 శాతం), ఆఖరికి భూటాన్ (14.4 శాతం)లతో మనకంటే దూరంగా వున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. విదేశాలకెళ్లేవారు పెరగటం గర్వపడాల్సిన విషయమేననటంలో సందేహం లేదు. ఉన్నత విద్యా రంగంలో చూస్తే మన దేశంలో చాలా స్వల్ప సంఖ్యలో ఉన్నత శ్రేణి విద్యాసంస్థలున్నాయి. అవి కూడా వివిధ అంశాల్లో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు దీటుగా నిలబడలేకపోతున్నాయి. బోధనారంగ నిపుణులు కూడా అంతే. వారికి ఉన్నత విద్యాసంస్థల్లో అవకాశాలు లభించి తగిన వేతనాలు లభిస్తే ఇక్కడే ఉంటారు. అందువల్ల మన పిల్లల స్థితిగతులు మరింత మెరుగుపడతాయి. విదేశాల్లో విశ్వవిద్యాలయాలు ఇక్కడివారిని ఆకర్షించి భారీ మొత్తంలో వేతనాలిస్తుంటే మన సంస్థలు ఆ స్థాయిని అందుకోలేకపోతున్నాయి. ఉపాధి విషయంలోనూ అంతే. తయారీ రంగ పరిశ్రమలను పెంచగలిగితే, చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు మరింత మెరుగ్గా చేయూతనందించగలిగితే వలస పోయేవారి మేధస్సు పూర్తిగా ఇక్కడే వినియోగపడుతుంది. ఇక్కడ ఉపాధి అవకాశాలు మరింత విస్తృతమై జీవనప్రమాణాలు పెరగటానికి దోహదపడుతుంది. -
తటస్థతకు తూట్లు పొడవొద్దు!
పాలనా ప్రక్రియలో పాలుపంచుకునే ఉన్నతాధికార వర్గం ఆ ప్రక్రియలో పెనవేసుకుని వుండే రాజకీయ పార్శ్వానికి ఎప్పుడూ దూరంగా ఉంటుంది. ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన కార్యనిర్వాహక వ్యవస్థ (ఎగ్జిక్యూటివ్)లో మంత్రులతోపాటు ఉన్నతాధికారవర్గం కూడా భాగస్వామే. ప్రభుత్వాలు మారినప్పుడల్లా మంత్రులు మారతారు. కానీ ఉన్నతాధివర్గం మాత్రం శాశ్వతం. అందుకే పాలనాపరమైన విధి నిర్వహణ వేరు... రాజకీయ ప్రచారం వేరు అనే స్పృహ అధికార యంత్రాంగానికి ఎప్పుడూ ఉంటుంది. సివిల్ సర్వీసు నిబంధనలు సైతం ఉన్నతాధికారులు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనటానికి అంగీకరించవు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన ఒక సర్క్యులర్ ఆ విభజనను కాస్తా మటుమాయం చేస్తోంది. గత తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిని ప్రచారం చేసేందుకు సీనియర్ అధికారులు దేశంలోని 765 జిల్లాలకూ, ఆ జిల్లాల్లోని 26 కోట్ల 90 లక్షల గ్రామాలకూ తరలివెళ్లాలని ఆ సర్క్యులర్ నిర్దేశించింది. జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ స్థాయి ఉన్నతాధికారులు ఈ యజ్ఞంలో పాలుపంచుకోవాలట. వీరికి రథ్ ప్రభారీస్ (ప్రత్యేక అధికారులు)గా నామకరణం చేశారు. కేంద్రంలోని రక్షణ మంత్రిత్వ శాఖ సహా అన్ని శాఖలూ ఈ మాదిరి సర్క్యులర్‌నే విడుదల చేశాయి. రక్షణ శాఖ ఈ నెల 9న జారీ చేసిన ఉత్తర్వు మరింత విడ్డూర మైనది. వార్షిక సెలవుల్లో వెళ్లే సైనికులు తమ తమ నెలవుల్లో ‘సైనిక దూతలు’గా ప్రభుత్వ పథకా లను ప్రచారం చేయాలని ఆ ఉత్తర్వు పిలుపునిచ్చింది. నవంబర్ 20 మొదలుకొని జనవరి 25 వరకూ ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ పేరుతో దీన్ని కొనసాగించాలన్నది సర్క్యులర్ సారాంశం. సరిగ్గా ఈ తేదీల మధ్యనే తెలంగాణ, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలుంటాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక, ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చాక ఇలాంటి యాత్రలు ఎంతవరకూ సమంజసమన్న సంగతలావుంచి... అసలు ఉన్నతాధికార వర్గం ఈ మాదిరి ప్రచారకర్తలుగా పని చేయటం సరైనదేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పథకాల గురించి అందరికీ తెలిసేలా అవసరమైన ప్రచార ఉపకరణాలను సంసిద్ధపరచుకో వటం ఏ ప్రభుత్వానికైనా అవసరం. అందుకోసమే ప్రభుత్వంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఉంటుంది. ఆ శాఖ ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తుంది. తమ ప్రభుత్వమే మరో దఫా అధికారంలో కొనసాగేందుకు కావలసినదంతా చేస్తుంటుంది. ఇందుకు బడ్జెట్లో కేటాయింపులుంటాయి. తమది ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలున్న రాజకీయ పార్టీ అని బీజేపీ చెప్పుకుంటుంది. ఆ పార్టీకి నోరున్న రాజకీయ నాయకుల లోటు కూడా లేదు. వీరందరినీ కాదని ప్రభుత్వ పథకాలనూ, వాటి ద్వారా సాధించిన ప్రగతినీ ప్రచారం చేసేందుకు ఉన్నతాధికార వర్గాన్ని దించాల నటంలో ఆంతర్యమేమిటన్నది అంతుపట్టని విషయం. కార్యకర్తలు, నాయకుల కంటే ఈ అధికారు లకే విశ్వసనీయత ఉంటుందని పాలకులు అనుకుంటున్నారా? ‘అధికారులు కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లోని కుర్చీలకు అతుక్కుపోవాలా? తాము రూపొందించిన పథకాల ప్రభావం క్షేత్ర స్థాయిలో ఎలా ఉందో తెలుసుకోవద్దా?’ అంటూ బీజేపీ నేతలు చేస్తున్న తర్కం అర్థరహితమైనది. అలా తెలుసుకోవటానికీ, అవసరమైన మార్పులు చేసుకోవటానికీ పకడ్బందీ వ్యవస్థ అమల్లో ఉంది. రాష్ట్రాల్లో ప్రభుత్వాలున్నాయి. అవసరమైన సమాచారాన్ని సత్వరం పొందేందుకు ఎన్నో మార్గా లున్నాయి. ప్రభుత్వ పథకాల సమాచారం ప్రజలందరికీ అందించటానికి, అవి కేవలం లక్షిత వర్గాలకు మాత్రమే చేరేలా, దుర్వినియోగానికి తావులేకుండా చేయటానికి ఎన్నో నిబంధనలు అమల్లో కొచ్చాయి. కానీ ఉన్నతాధికారులే స్వయానా ప్రచారకర్తలుగా మారాలనడం, అందువల్ల మాత్రమే ప్రజలంతా అన్నీ తెలుసుకోగలుగుతారనడం సమంజసం కాదు. ఈ క్రమంలో ఉన్నతాధికార వర్గం రాజకీయాలను అంటించుకుంటే పాలనావ్యవస్థకుండే తటస్థతకు జరిగే నష్టం తీవ్రమైనది. వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడం ఎలాగన్నది కార్యనిర్వాహక వర్గంలోని మంత్రులకు సంబంధించిన ప్రశ్న. అదే వ్యవస్థలో భాగస్థులైన ఉన్నతాధికారవర్గం పాలనా ప్రక్రియ సజావుగా సాగటానికి, పాలకుల విధానాలూ, వారి పథకాలూ లక్షిత వర్గాలకు చేరేలా చేయటంవరకూ పూచీ పడుతుంది. అంతకుమించి ఏం చేసినా దానికి రాజకీయ మకిలి అంటుతుంది. బ్రిటిష్ వలస పాలకుల హయాంలో ఉన్నతాధివర్గం పని... కేవలం శాంతిభద్రతలను పర్యవేక్షించటం, ఖజానాకు ఆదాయం సమకూర్చటం మాత్రమే! కానీ స్వాతంత్య్రం వచ్చాక అదంతా మారింది. సంక్షేమ రాజ్య భావన బలపడటంతో జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రాల స్థాయిలోనూ పాలకుల సంక్షేమ విధానాల అమలు, ప్రణాళికాబద్ధ అభివృద్ధి ఉన్నతాధికార వర్గం ప్రధాన కర్తవ్యా లయ్యాయి. రాజకీయ అస్థిరత అలుముకున్న దశలో కూడా ఉన్నతాధికార వ్యవస్థ తటస్థంగా వ్యవహరిస్తూ రాజకీయ నాయకత్వానికి అవసరమైన సలహాలిస్తూ పాలన సజావుగా సాగేందుకు దోహద పడుతోంది. సివిల్ సర్వీసు అధికారులు ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయాల్లో లేదా మతసంబంధ అంశాల్లో తలదూర్చరాదని ఈ సర్వీసు పథ నిర్దేశకుడైన స్వర్గీయ సర్దార్ పటేల్ హితవు చెప్పారు. అందుకు పూర్తి భిన్నంగా పోయి పాలనావ్యవస్థకూ, సైనిక వ్యవస్థకూ రాజకీయ మకిలి అంటించి మన పొరుగునున్న పాకిస్తాన్ చివరికెలా అఘోరించిందో కనబడుతూనే ఉంది. అందువల్ల ఉన్నతాధికారగణాన్ని ప్రచారకర్తలుగా ఉరికించాలన్న సంకల్పాన్ని కేంద్రం విడనాడాలి. దాని తటస్థతను కాపాడాలి. -
నిదురించని తోటలోకి
ఒక రాత్రి గజదొంగ ఒక ఇంట్లో ప్రవేశించాడు. అలికిడికి ఇంట్లో ఉన్న ముసలామె లేచింది. ‘ఎవరూ?’ అని గద్దించింది. ‘నేను దొంగని’ అన్నాడు దొంగ. ‘ఆరి బడవా... నువ్వు రీతి జాతి ఉన్న దొంగవైతే ఇలా ఒంటరి ముసల్ది ఉన్న ఇంట్లో జొరబడతావా? నా కొడుకు పహిల్వాను. పక్క ఊరికి కుస్తీకి వెళ్లాడు. నీకు దమ్ముంటే రేపు నా కొడుకున్నప్పుడు వచ్చి దొంగతనం చెయ్యి’ అంది. దొంగకు పౌరుషం వచ్చింది. ‘అలాగే. నా రోషం నువ్వెరగవు. కాచుకో’ అని వెళ్లిపోయాడు. మరుసటి రోజు కొడుకు వచ్చాడు. తల్లి భోజనం పెడుతూ జరిగింది చెప్పింది. కొడుకు తింటున్న వాడల్లా ముద్ద విడిచి విచారంగా కూచున్నాడు. ‘ఏమి నాయనా?’ అంది ముసలామె. ‘అది కాదమ్మా... నువ్వెలా అలా సవాలు విసిరావు. వాడు దొంగ. ముందు దెబ్బ తీస్తాడో, వెనుక దెబ్బ తీస్తాడో, మత్తుమందు జల్లుతాడో, కొంపకు నిప్పెడతాడో ఎలా తెలుసు? నేరుగా వస్తే పోరాడి గెలుస్తానుగాని దొంగదెబ్బ తీస్తే ఏం చేయను? అవన్నీ కాదు. నిద్రనేది ఒకటి ఉంది కదా... నేను గుర్రు పెట్టి నిద్రపోతున్నప్పుడు వాడు బండరాయి తెచ్చి నెత్తినేస్తే ఏం చేయను’ అన్నాడు. ముసలామె తెల్లముఖం వేసింది. మనిషికి నిద్ర ముంచుకొచ్చే రోజుల్లో పుట్టిన కథ ఇది. ప్రేమ్‌చంద్ రాసిన ‘ఫూస్ కీ రాత్’ అనే కథ ఉంది. అందులో ఒక నిరుపేద రైతు తన పొలానికి గడ్డకట్టే చలికాలంలో కాపలా కాయాల్సి వస్తుంది. అతనికి కంబళి ఉండదు. పెళ్లాం, అతను కలిసి కంబళి కోసం మూడు రూపాయలు జమ చేస్తారు కాని ఎవరో అప్పులోడు వచ్చి ఆ డబ్బు పట్టుకెళతాడు. పేదరైతు ప్రతి రాత్రి చలిలో వణుకుతూ నిద్ర పట్టక పొలంలో నానా అవస్థలు పడతాడు. రోజంతా నిద్ర అతడి కనురెప్పల మీదే ఉంటుంది. నిద్ర కావాలి! ఆ రోజు పొలానికి వెళ్లి చలిమంట వేసుకుంటాడు. పక్కనే నడుము వాలుస్తాడు. ఎన్నాళ్లుగా ఆగి ఉందో నిద్ర... కమ్ముకుంది. ఒళ్లెరక్క నిద్ర పోయాడు. మంచును లెక్క చేయక నిద్ర పోయాడు. చలిమంట వ్యాపించి పంటంతా తగలబడినా అలాగే పడి నిద్ర పోయాడు. తెల్లారి భార్య వచ్చి గుండెలు బాదుకుంటూ ‘పొలం తగలబడింది’ అంటే రైతు లేచి చూసి ‘దరిద్రం వదిలింది. ఇప్పుడైనా నిద్రపోని’ అని నిద్ర పోతాడు. కష్టం చేసే వాడు నిదురకు పడే కష్టం గురించి ప్రేమ్‌చంద్ రాసిన కథ అది. నిద్రంటే మనకు చప్పున గుర్తుకొచ్చే జంట ఊర్మిళ, లక్ష్మణస్వామి. అన్నతో పాటు లక్ష్మణుడు అడవికి పోతే పద్నాలుగేళ్లు ఊర్మిళ నిద్ర పోయింది. నిద్ర ఆమెను తన ఒడిలోకి తీసుకుంది. నిద్ర ఆమెను వాస్తవ కలతల నుంచి, భర్త ఎడబాటు దుఃఖం నుంచి, పోచికోలు కబుర్ల నుంచి, ఆరాల నుంచి కాపాడింది. ఊర్మిళకు నిద్ర పట్టకపోయి ఉంటే ఏమై ఉండేదో! శ్రీరాముడి పట్టాభిషేకఘట్టంలో లక్ష్మణుడు హఠాత్తుగా నవ్వడం చూసి ఎవరి వ్యాఖ్యానాలు వారు చేశారు. ‘ఎందుకు నవ్వావు లక్ష్మణా’ అనంటే ‘పద్నాలుగేళ్లు కంటికి రెప్పలా అన్నా వదినలను కాచుకున్నప్పుడు ఒక్కసారి కూడా నిద్ర రాలేదు. తీరా ఇప్పుడు ఇంత గొప్పగా పట్టాభిషేకం జరుగుతుంటే ఈ మోసకారి నిద్ర ముంచుకొస్తున్నదే అని నవ్వాను’ అంటాడు. ‘కలలు కూడా దోచుకునే దొరలు ఎందుకు?’ అంటాడు ఆత్రేయ ఏదో పాటలో. పేదవాడికి ఐశ్వర్యం, వైభోగం లేకపోవచ్చు. ఆరు రకాలుగా తినే వీలు లేకపోవచ్చు. కాని వాడు తుండు తల కింద పెట్టుకున్నాడంటే నిద్రలోకి జారుకుంటాడు. కలల్లో మునిగిపోతాడు. విన్సెంట్ వాన్ గో గీసిన ‘నూన్ – రెస్ట్ ఫ్రమ్ వర్క్’ అనే ప్రఖ్యాత చిత్రం ఉంటుంది. కూలిపని చేసి మధ్యాహ్నం భోజన వేళ గడ్డివాములో కునుకు తీస్తున్న జంటను వేస్తాడు. ఆ క్షణంలో ఆ జంటను చూస్తే వారికి మించిన ఐశ్వర్యవంతులు లేరనిపిస్తుంది. విశ్రాంతినిచ్చే నిద్ర ఎంత పెద్ద లగ్జరీ. కుంభకర్ణుడొక్కడే జీవితమంటే ఉరుకులు పరుగులు కాదని మొదట గ్రహించినవాడు. అతడు ఆరునెలలు నిద్ర పోయేవాడంటే అర్థం– వెకేషన్ లో ఉండేవాడని! తింటూ నిద్రపోతూ. ఆర్నెల్లు మాత్రమే పని. నెలలో రెండు వారాలు పని చేసి రెండు వారాలు విశ్రాంతి తీసుకునే నాగరిక సమాజం ఎప్పుడో వచ్చే తీరుతుంది. ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది’ అని రాశాడు శేషేంద్ర. ఇప్పుడు మొక్కలు, పూలు ప్రతి ఇంటా ఉన్నా నిదురకు బీడువారిన కళ్లే చాలా ఇళ్లల్లో. కుక్కి మంచంలో సుఖంగా నిద్రపోయే కాలం నుంచి వేల రూపాయల పరుపు మీద కూడా సరిగా నిద్ర పట్టని మనుషుల సంఖ్య చాప కింద నీరులా పెరుగుతోంది. నిద్ర పట్టక, నిద్ర పోలేక, రాత్రి ఎంతకీ గడవక, నిద్ర మాత్రలు మింగలేక, మింగినా నిద్ర రాక... ఒక గొప్ప వైభోగమయ జీవన క్రియను కోల్పోయిన తాజా నిరుపేదలు. ప్రపంచంలో జపాన్ తర్వాత నిద్ర పట్టని వాళ్లు ఎక్కువ ఉన్న దేశం మనదే. నిదుర ఎందుకు పట్టదు? లక్ష కారణాలు. కాని ఏది నిశ్చింత బతుకు అనేది ఎవరికి వారు వ్యాఖ్యానించుకుని అంతకు సంతప్తి పడటం నేర్చుకుంటే అదిగో బెడ్‌లైట్ స్విచ్చంత దూరంలో నిద్ర కాచుకుని ఉంటుంది. మీ జీవనంలోనే నిద్ర మాత్ర ఉంటుంది. వెతకండి. గాఢనిద్ర ప్రాప్తిరస్తు!