Editorial
-
నిదురించని తోటలోకి
ఒక రాత్రి గజదొంగ ఒక ఇంట్లో ప్రవేశించాడు. అలికిడికి ఇంట్లో ఉన్న ముసలామె లేచింది. ‘ఎవరూ?’ అని గద్దించింది. ‘నేను దొంగని’ అన్నాడు దొంగ. ‘ఆరి బడవా... నువ్వు రీతి జాతి ఉన్న దొంగవైతే ఇలా ఒంటరి ముసల్ది ఉన్న ఇంట్లో జొరబడతావా? నా కొడుకు పహిల్వాను. పక్క ఊరికి కుస్తీకి వెళ్లాడు. నీకు దమ్ముంటే రేపు నా కొడుకున్నప్పుడు వచ్చి దొంగతనం చెయ్యి’ అంది. దొంగకు పౌరుషం వచ్చింది. ‘అలాగే. నా రోషం నువ్వెరగవు. కాచుకో’ అని వెళ్లిపోయాడు. మరుసటి రోజు కొడుకు వచ్చాడు. తల్లి భోజనం పెడుతూ జరిగింది చెప్పింది. కొడుకు తింటున్న వాడల్లా ముద్ద విడిచి విచారంగా కూచున్నాడు. ‘ఏమి నాయనా?’ అంది ముసలామె. ‘అది కాదమ్మా... నువ్వెలా అలా సవాలు విసిరావు. వాడు దొంగ. ముందు దెబ్బ తీస్తాడో, వెనుక దెబ్బ తీస్తాడో, మత్తుమందు జల్లుతాడో, కొంపకు నిప్పెడతాడో ఎలా తెలుసు? నేరుగా వస్తే పోరాడి గెలుస్తానుగాని దొంగదెబ్బ తీస్తే ఏం చేయను? అవన్నీ కాదు. నిద్రనేది ఒకటి ఉంది కదా... నేను గుర్రు పెట్టి నిద్రపోతున్నప్పుడు వాడు బండరాయి తెచ్చి నెత్తినేస్తే ఏం చేయను’ అన్నాడు. ముసలామె తెల్లముఖం వేసింది. మనిషికి నిద్ర ముంచుకొచ్చే రోజుల్లో పుట్టిన కథ ఇది. ప్రేమ్‌చంద్ రాసిన ‘ఫూస్ కీ రాత్’ అనే కథ ఉంది. అందులో ఒక నిరుపేద రైతు తన పొలానికి గడ్డకట్టే చలికాలంలో కాపలా కాయాల్సి వస్తుంది. అతనికి కంబళి ఉండదు. పెళ్లాం, అతను కలిసి కంబళి కోసం మూడు రూపాయలు జమ చేస్తారు కాని ఎవరో అప్పులోడు వచ్చి ఆ డబ్బు పట్టుకెళతాడు. పేదరైతు ప్రతి రాత్రి చలిలో వణుకుతూ నిద్ర పట్టక పొలంలో నానా అవస్థలు పడతాడు. రోజంతా నిద్ర అతడి కనురెప్పల మీదే ఉంటుంది. నిద్ర కావాలి! ఆ రోజు పొలానికి వెళ్లి చలిమంట వేసుకుంటాడు. పక్కనే నడుము వాలుస్తాడు. ఎన్నాళ్లుగా ఆగి ఉందో నిద్ర... కమ్ముకుంది. ఒళ్లెరక్క నిద్ర పోయాడు. మంచును లెక్క చేయక నిద్ర పోయాడు. చలిమంట వ్యాపించి పంటంతా తగలబడినా అలాగే పడి నిద్ర పోయాడు. తెల్లారి భార్య వచ్చి గుండెలు బాదుకుంటూ ‘పొలం తగలబడింది’ అంటే రైతు లేచి చూసి ‘దరిద్రం వదిలింది. ఇప్పుడైనా నిద్రపోని’ అని నిద్ర పోతాడు. కష్టం చేసే వాడు నిదురకు పడే కష్టం గురించి ప్రేమ్‌చంద్ రాసిన కథ అది. నిద్రంటే మనకు చప్పున గుర్తుకొచ్చే జంట ఊర్మిళ, లక్ష్మణస్వామి. అన్నతో పాటు లక్ష్మణుడు అడవికి పోతే పద్నాలుగేళ్లు ఊర్మిళ నిద్ర పోయింది. నిద్ర ఆమెను తన ఒడిలోకి తీసుకుంది. నిద్ర ఆమెను వాస్తవ కలతల నుంచి, భర్త ఎడబాటు దుఃఖం నుంచి, పోచికోలు కబుర్ల నుంచి, ఆరాల నుంచి కాపాడింది. ఊర్మిళకు నిద్ర పట్టకపోయి ఉంటే ఏమై ఉండేదో! శ్రీరాముడి పట్టాభిషేకఘట్టంలో లక్ష్మణుడు హఠాత్తుగా నవ్వడం చూసి ఎవరి వ్యాఖ్యానాలు వారు చేశారు. ‘ఎందుకు నవ్వావు లక్ష్మణా’ అనంటే ‘పద్నాలుగేళ్లు కంటికి రెప్పలా అన్నా వదినలను కాచుకున్నప్పుడు ఒక్కసారి కూడా నిద్ర రాలేదు. తీరా ఇప్పుడు ఇంత గొప్పగా పట్టాభిషేకం జరుగుతుంటే ఈ మోసకారి నిద్ర ముంచుకొస్తున్నదే అని నవ్వాను’ అంటాడు. ‘కలలు కూడా దోచుకునే దొరలు ఎందుకు?’ అంటాడు ఆత్రేయ ఏదో పాటలో. పేదవాడికి ఐశ్వర్యం, వైభోగం లేకపోవచ్చు. ఆరు రకాలుగా తినే వీలు లేకపోవచ్చు. కాని వాడు తుండు తల కింద పెట్టుకున్నాడంటే నిద్రలోకి జారుకుంటాడు. కలల్లో మునిగిపోతాడు. విన్సెంట్ వాన్ గో గీసిన ‘నూన్ – రెస్ట్ ఫ్రమ్ వర్క్’ అనే ప్రఖ్యాత చిత్రం ఉంటుంది. కూలిపని చేసి మధ్యాహ్నం భోజన వేళ గడ్డివాములో కునుకు తీస్తున్న జంటను వేస్తాడు. ఆ క్షణంలో ఆ జంటను చూస్తే వారికి మించిన ఐశ్వర్యవంతులు లేరనిపిస్తుంది. విశ్రాంతినిచ్చే నిద్ర ఎంత పెద్ద లగ్జరీ. కుంభకర్ణుడొక్కడే జీవితమంటే ఉరుకులు పరుగులు కాదని మొదట గ్రహించినవాడు. అతడు ఆరునెలలు నిద్ర పోయేవాడంటే అర్థం– వెకేషన్ లో ఉండేవాడని! తింటూ నిద్రపోతూ. ఆర్నెల్లు మాత్రమే పని. నెలలో రెండు వారాలు పని చేసి రెండు వారాలు విశ్రాంతి తీసుకునే నాగరిక సమాజం ఎప్పుడో వచ్చే తీరుతుంది. ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది’ అని రాశాడు శేషేంద్ర. ఇప్పుడు మొక్కలు, పూలు ప్రతి ఇంటా ఉన్నా నిదురకు బీడువారిన కళ్లే చాలా ఇళ్లల్లో. కుక్కి మంచంలో సుఖంగా నిద్రపోయే కాలం నుంచి వేల రూపాయల పరుపు మీద కూడా సరిగా నిద్ర పట్టని మనుషుల సంఖ్య చాప కింద నీరులా పెరుగుతోంది. నిద్ర పట్టక, నిద్ర పోలేక, రాత్రి ఎంతకీ గడవక, నిద్ర మాత్రలు మింగలేక, మింగినా నిద్ర రాక... ఒక గొప్ప వైభోగమయ జీవన క్రియను కోల్పోయిన తాజా నిరుపేదలు. ప్రపంచంలో జపాన్ తర్వాత నిద్ర పట్టని వాళ్లు ఎక్కువ ఉన్న దేశం మనదే. నిదుర ఎందుకు పట్టదు? లక్ష కారణాలు. కాని ఏది నిశ్చింత బతుకు అనేది ఎవరికి వారు వ్యాఖ్యానించుకుని అంతకు సంతప్తి పడటం నేర్చుకుంటే అదిగో బెడ్‌లైట్ స్విచ్చంత దూరంలో నిద్ర కాచుకుని ఉంటుంది. మీ జీవనంలోనే నిద్ర మాత్ర ఉంటుంది. వెతకండి. గాఢనిద్ర ప్రాప్తిరస్తు! -
గురితప్పిన రాహుల్జీ బాణాలు
కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ మూడు రోజులపాటు ఉత్తర తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సభలకు జనం బాగానే వచ్చారు. స్పందన కూడా బాగుందని కాంగ్రెస్ వర్గాలు సంబర పడ్డాయి. అంతా బాగానే ఉంది గానీ, ఒక ముఖ్యమైన లోపం మాత్రం కన బడింది. మత్స్య యంత్రాన్ని కొట్టడానికి ఒక నియమం ఉన్నది. ఆ యంత్రం పైన గిరగిరా తిరుగుతుంటే కింద నీటిలో దాని నీడను చూసి పైనున్న చేపను కొట్టాలి. రాహుల్ పద్ధతి ఇందుకు విరుద్ధంగా కనిపించింది. ఆయన పైనున్న చేప వంక చూస్తూ నీటిలోని దాని నీడపైకి బాణాన్ని ఎక్కుపెట్టారు. ఆ బాణాన్ని వదిలితే ఏమవుతుంది? నీళ్లు కదులుతాయి గనుక కాసేపు నీడ కనిపించదు. చేప మాత్రం నిక్షేపంగా తిరుగుతూనే ఉంటుంది. రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలను పరిశీలిస్తే అసలు ఇవ్వాల్సిన ముఖ్యమైన గ్యారంటీని విస్మరించినట్టు బోధపడుతుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం పైనా, బీఆర్ఎస్ పైనా ఆయన చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఆయన పొలికటికల్ నరేటివ్ లేదా రాజకీయ భాషణ అప్డేట్ అయినట్టు కనిపించడం లేదు. రాజకీయాల్లో గెలవాలంటే ఈ భాషణే ముఖ్యం. ఆ భాషణ కొత్త భావాలతో కూర్చి ఉండాలి. జనాన్ని ఉత్తేజ పరిచేదిగా ఉండాలి. వారికి ఊరటనిచ్చేదిగా ఉండాలి. ఈ మూడు రోజుల రాహుల్ ప్రసంగాల్లోని భాషణ కంటే, పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నేతల భాషణే మెరుగ్గా కనిపిస్తున్నది. వాళ్లలో రాజకీయ స్పష్టత ఉన్నది. వారి భాషణ కూడా అందుకు అనుగుణంగా ఉన్నది. ఆర్థికాభివృద్ధిలోనూ, సంక్షేమ రంగంలోనూ ఈ తొమ్మిదిన్నరేళ్ల పాలన ఒక విజయగాథగా గణాంకాల ఆధారంతో వారు చెప్పుకొస్తున్నారు. ఈ జైత్రయాత్రను కొనసాగిద్దామని సూటిగా సుత్తి లేకుండా, వారు సందేశాన్నివ్వగలిగారు. పరిపాలనా రథం జైత్రయాత్ర సాగించాలంటే రాజకీయ సుస్థిరత అత్యంత అవసరమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి మైనస్ మార్కులు పడేది ఇక్కడే. వారు చెబుతున్న ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి కూడా రాజకీయ సుస్థిరత అనే ప్రధానమైన గ్యారంటీ అత్యంత అవసరం. ఈ గ్యారంటీని ఇచ్చే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదని దాని ట్రాక్ రిపోర్టే కుండబద్దలు కొట్టి చెబుతున్నది. 2004 ఎన్నికల నాటికే రాష్ట్ర కాంగ్రెస్‌లో తిరుగులేని నేతగా ఎదిగిన వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి హయాంలో మాత్రమే కాంగ్రెస్ రాజకీయ సుస్థిరతను సాధించగలిగింది. ఫలితంగానే అభివృద్ధి – సంక్షేమాల్లో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించి 2009 ఎన్నికల్లో కూడా గెలవగలిగింది. ఈ ఒక్క ఛాప్టర్ను మూసేస్తే కాంగ్రెస్ కథలో మిగిలిన భాగాలన్నీ కుమ్ములాటల కథలే! కాంగ్రెస్ కీచులాటల ఫలితంగానే తెలుగుదేశం పార్టీ పుట్టుకొచ్చి అధికారం చేపట్టిన ఉదంతం తెలిసిన విష యమే. 1978–83 మధ్యకాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారడం, పాలన అట కెక్కడం మూలంగా జనం మార్పు కోరు కున్నారు. 1989లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే కథ పునరావృతమైంది. ముగ్గురు ముఖ్యమంత్రుల్ని మార్చాల్సి వచ్చింది. ఇలా మార్చకపోయిన ట్లయితే సైబర్ టవర్స్ (హైటెక్ సిటీ)కి శంకు స్థాపన చేసిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని పూర్తిచేసి ఉండేది. చంద్రబాబు డప్పు వాయించుకోవడానికి అవకాశమే ఉండేది కాదు. 2009 ఎన్నికల తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ దురదృష్టవశాత్తు నాలుగు నెలల్లోనే చనిపోయారు. కాంగ్రెస్ అసలు కథ మళ్లీ మొదలైంది. ఏడాదిపాటు సీనియర్ నేత రోశయ్యను ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత ఆయన్ను మార్చి కిరణ్‌కుమార్ రెడ్డిని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇంకో మార్పు జరగకపోవడానికి కారణం పార్టీలో వచ్చిన ఐక్యత కాదు. అప్పటికే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉద్ధృతం కావడం, రాష్ట్ర విభజన అనివార్యమని తేలడంతో ఆ పదవికి ఎవరూ పోటీపడలేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో రెండుసార్లు ప్రధాన ప్రతిపక్ష హోదాను ప్రజలు కాంగ్రెస్‌కు కట్టబెట్టారు. ఆ బాధ్యత నిర్వహణలో కూడా ఆ పార్టీ ఘోరంగా విఫలమైంది. మొదటిసారి 21 మందిని గెలిపిస్తే చివరకు 10 మంది మిగిలారు. రెండోసారి 19 మందిని గెలిపిస్తే ఐదుగురు మిగిలారు. అధికారం అప్పజెప్పినప్పుడు కొట్లాడుకుని పరిపాలనను పడకే యించారు. ప్రతిపక్షంలో కూర్చోబెడితే సంత బేరాలకు లొంగిపోయారు. మరి ఏ ధైర్యంతో ఇప్పుడు ప్రజలు ఓటేయాలి? రాజకీయ సుస్థిరతను అందిస్తామనే గ్యారంటీ కదా కాంగ్రెస్ పార్టీ నుంచి జనం ఆశించేది? ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో కనీసం డజన్ మంది ముఖ్యమంత్రి పదవి ఆశావహులున్నారు. ఓ ఆరేడు మందయితే గట్టి పట్టుదలతో పోటీలో ఉన్నట్టు సమా చారం. ఇటువంటి పరిస్థితిలో రాజకీయ సుస్థిరతను ఎలా ఆశించాలి! తెలంగాణ రాష్ట్ర పురోగతికి రాజకీయ సుస్థిరత ప్రాణాధారం. హైదరాబాద్ నగరం రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్. గడిచిన పదేళ్లలోనే ఐదు లక్షలమందికి ఐటీ రంగంలో ఉద్యో గాలిచ్చిన నగరం. ఫార్మా తదితర రంగాల్లో ఇంకో ఆరేడు లక్షలమందికి కొత్తగా ఉపాధినిచ్చింది. రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తున్న లక్షలాది మంది పేద కార్మికులకు కడుపు నింపుతున్న నగరం. రాజకీయ అస్థిర పరిస్థితులు ఏర్పడితే దాని ప్రభావం ఉపాధి రంగం మీద పడుతుంది. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆయన సామాజిక వర్గానికి చెందిన కొందరు యువతీ యువకులు ఐటీ కారిడార్‌లో ప్రదర్శన చేసినప్పుడు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఉలికిపడింది ఇందుకే. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉద్ధృతంగా జరుగుతున్న రోజుల్లో కూడా ఉపాధి రంగాన్ని ఆందోళనలకు దూరంగా ఉంచారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలంటే ఇవ్వాల్సిన అసలైన గ్యారంటీ రాజకీయ సుస్థిరత. దాని ట్రాక్ రికార్డ్ దృష్ట్యా నామ్‌కే వాస్తే హామీ ఇస్తే జనం నమ్మరు. జనాన్ని నమ్మించడానికి ఏం చేయాలో ఆ పార్టీ నిర్ణయించుకోవాలి. అప్పుడు మాత్రమే ఆరు గ్యారంటీల గురించి జనం ఆలోచిస్తారు. ఈ ఆరు గ్యారంటీల్లో కొన్ని పాత పథకాలే. వేలంపాటలో పెంచినట్టు కేటాయింపులను కొంచెం పెంచి కొత్త పథకాలుగా స్టాంప్ వేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ‘విద్యావికాసం’ అనే కొత్త పేరు పెట్టారు. గృహిణులకు 2,500 రూపాయల ఆర్థిక సాయానికి సంబంధించిన విధానాలను అధికారంలోకి వస్తే అప్పుడు తయారు చేస్తారట! కర్ణాటక నుంచి దిగుమతి చేసుకున్న ఈ పథకం అక్కడే ఇంకా బాలారిష్టాలను దాటలేదు.రాజకీయ సుస్థిరత అనే గ్యారంటీ ఇవ్వలేని పార్టీ ఇచ్చే ఆరు గ్యారంటీలకైనా... పన్నెండు గ్యారంటీలకైనా విలువ లేదు. గురితప్పిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహంలో ఇది మొదటి భాగం. ఇక రెండో భాగం దాని రాజకీయ భాషణ. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నిత్యం చేస్తున్న విమర్శలనే ఈ మూడు రోజుల్లో రాహుల్ గాంధీ వల్లెవేశారు. ‘కాళేశ్వరం’లో లక్ష కోట్ల అవినీతి జరిగింది. కుటుంబ పెత్తనం నడుస్తున్నది. ‘ధరణి’ పేరుతో వేలాది ఎకరాలు కబ్జా పెడుతున్నారు. ‘దొరల తెలంగాణ’గా మార్చారు. సామాజిక న్యాయం కరువైంది. బీఆర్ఎస్ బీ–టీమ్‌గా బీజేపీ పనిచేస్తున్నది. వగైరా వగైరా. వీటిలో కొన్ని ఆరోపణలు 2018 ఎన్నికల్లోనే కాంగ్రెస్ కూటమి ప్రజల ముందుంచింది. అయినా ఆ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేయగలిగింది. ఇప్పుడు మరోసారి చైనా యుద్ధ కాలం నాటి త్రీ నాట్ త్రీ రైఫిళ్లను, డబ్బా ట్యాంకులను తీసుకొచ్చి కాల్పులు జరుపుతున్నారు. ఈ ప్రచారంలో రాహుల్ గాంధీకి బాగా నచ్చిన మాట... దొరల తెలంగాణకూ, ప్రజల తెలంగాణకూ మధ్య పోరాటం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దగ్గర్నుంచి రాహుల్ కాపీ కొట్టినట్టున్నారు. రాష్ట్రంలో పేదలకూ, పెత్తందార్లకూ మధ్యన యుద్ధం జరుగుతున్నదని జగన్ మోహన్‌రెడ్డి పదే పదే ప్రజలకు గుర్తు చేస్తున్నారు. అందుకు అక్కడ సహేతుకమైన కారణం ఉన్నది. ప్రాతిపదిక ఉన్నది. పేదల సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని అక్కడి పెత్తందారీ శక్తులు తెలుగుదేశం రాజకీయ కూటమి రూపంలో అడ్డుకుంటున్నారు. యెల్లో మీడియా రూపంలో అడ్డుకుంటున్నారు. రకరకాల వేదికల పేర్లతో అడ్డుకుంటున్నారు. కేవలం రాజకీయ విమర్శలతోనే ఆటంకాలు సృష్టించలేదు. కోర్టు మెట్లెక్కి మరీ అడ్డుకుంటున్నారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందించినా, సర్కారు బళ్ల ప్రమాణాలను పెంచినా, ప్రజల ఇంటి ముంగి టకు పరిపాలనను చేర్చినా, ధర్మాసుపత్రుల నాణ్యతను పెంచినా, ఊరూరా ‘రైతు భరోసా కేంద్రాల’ను తెరిచినా, 30 లక్షలమంది మహిళలకు ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపట్టినా సహించలేకపోయారు. వీటన్నింటి మీద కేసులు వేశారు. ఈ నేపథ్యంలో జనాన్ని జాగృతం చేయడం కోసం జరుగు తున్న కుట్రలను విడమర్చి చెప్పడం కోసం జగన్మోహన్రెడ్డి ఆ నినాదాన్ని అందుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో దొరలకు మేలు చేస్తున్నవేమిటి? పేద ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాలేమిటి? ఆ పార్టీ దగ్గర ఉన్న పీడిత ప్రజల సాధికారతా కార్యక్రమం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో దొరలు మాత్రమే లబ్ధి పొంది అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేసుకుంటు న్నారా? పేద కుటుంబాలకు ఈ పథకం దక్కడం లేదా? పద్దెనిమిది వందలకు పైగా ఏర్పాటైన గురుకుల పాఠశాలలు – కళా శాలల్లో ఏడున్నర లక్షలమంది దొరల బిడ్డలే నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారా? ఇటు వంటి గణాంకాలేవో ఉండాలి కదా విమర్శ చేయడానికి! అందుకు తగిన ప్రాతిపదికను చూపెట్టాలి గదా. అప్పుడే ఆ నినాదాన్ని జనం అందిపుచ్చుకుంటారు. అంతే తప్ప పదాలు బలంగా ఉన్నాయి, వాక్యం బరువుగా ఉందని ముచ్చటపడి ఔత్సాహిక కవిలా ఉత్సాహ పడితే రాజకీయాల్లో అభాసుపాలవుతారు సుమా! ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక భూస్వామ్య కులంలో పుట్టాడు కనుక ఆయనది దొరల పాలన అనడం ఆమోదయోగ్యం కాదు. నిజమే, ఉత్తర తెలంగాణలోని భూస్వామ్య కులం వారు ఎక్కువమంది బీఆర్ఎస్లోనే ఉన్నారు. అట్లానే దక్షిణ తెలంగాణ భూస్వామ్య కుటుంబాల వారు ఎక్కువమంది కాంగ్రెస్‌లో ఉన్నారు. నాయకుల పుట్టుక కారణంగా వారు దొరల పక్షమా, పేదల పక్షమా అని నిర్ధారించగలమా? తెలుగునాట దొరతనానికి వ్యతిరేకంగా, భూస్వాముల పీడనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు నాయకత్వం వహించినవారెవరు? పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, చెన్నమనేని రాజేశ్వరరావు... వీరంతా భూస్వాముల బిడ్డలే కదా? గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పుంజుకున్న మాట వాస్తవం. ఇందుకు కర్ణాటక ఫలితాలు కొంత దోహదపడ్డాయి. వ్యూహాలు సవరించుకొని బీజేపీ బలం పుంజుకోకపోతే అది కాంగ్రెస్‌కు మరింత మేలు చేస్తుంది. కొన్ని సీట్లు పెరగొచ్చు, కానీ పరిణామాలు కొంత భిన్నంగా మారుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో బీసీలకు అన్యాయం జరిగిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మరోపక్క బీజేపీ బీసీలకు పెద్దపీట వేస్తున్న సూచనలు కనబడుతున్నాయి. ఇప్పుడు కనిపించిన వాపును బలుపుగా భ్రమిస్తే కాంగ్రెస్‌కు మరోసారి భంగపాటు తప్పదు. ఈ పరి స్థితుల్లో కాంగ్రెస్ బలంగా పోటీలో నిలబడాలంటే రెండు షరతులు – 1. రాజకీయ సుస్థిరతను ఇవ్వగలమన్న భరోసాను కల్పించాలి. 2. కాలాను గుణమైన, తెలంగాణ అభివృద్ధికి ఆలంబన కాగల రాజకీయ ఎజెండాను జనం ముందుంచాలి. కర్ణాటక మేనిఫెస్టో తారక మంత్రం కాదు! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఓర్వలేని కళ్లన్నీ నీ మీదే తల్లీ!
ఎదగాలి నాన్నా... నువ్వింకా ఇంకా పైపైకి... ఈ లోకం గుర్తించేంత పైకి ఎదగాలి తల్లీ! దిగువ కులాల వృత్తి చట్రాల్లో బందీలై వెనుకబాటుతనాన్ని వారసత్వంగా మోసుకొస్తున్న మీ అమ్మానాన్నల కలలు ఫలించేలా... మీకు అండగా నిలబడిన మీ జగన్ మామ ఆశీస్సులు సాకారమయ్యేలా ఎదగాలి తల్లీ! అసూయా దృక్కులు నిన్ను వెన్నాడుతాయ్. భయపడకు! ఓర్వలేని తనం శాపనార్థాలు పెడుతుంది. చలించకు! పెత్తందార్లు పగబడతారు. ప్రతిఘటించు! నీ వెనుక మీ మేనమామ ఉన్నాడు. తరతరాలుగా మీ తాత ముత్తాతల దగ్గర్నుంచీ మీ అమ్మానాన్నల దాకా మిమ్మల్ని తొక్కిపెట్టి ఉంచిన పెత్తందార్లు ఇప్పుడు నీ చదువు మీద యుద్ధం ప్రకటించారు. భయం లేదులే! అభయం దొరికింది కదా... ఇక దృష్టి పెట్టి చదువు! చదువే నీ తిరుమంత్రం. చదువే నీ రణతంత్రం. అంబేడ్కర్, ఫూలే, సావిత్రీబాయి, నారాయణ గురులు ఉపదేశించిన విముక్తి మార్గం చదువు. నువ్వు అమెరికాకు వెళ్లి ఐక్యరాజ్యసమితి వేదికపై ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడుతుంటే మన పెత్తందార్లు కళ్లల్లో నిప్పులు పోసుకున్నారు తెలుసా? నువ్వు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో మాట్లాడుతుంటే ఈర్ష్యతో వాళ్ల కడుపులు కుతకుతలాడాయి తెలుసా? కానీలే, ‘రానీ, రానీ, వస్తే రానీ! కోపాల్, తాపాల్, శాపాల్ రానీ’ అన్నాడు కదా శ్రీశ్రీ. నిప్పులు పోసుకున్న వాళ్ల కళ్లు పేలిపోనీ, రగిలిన కడుపులు పగిలిపోనీ, ఇప్పుడా పెత్తందార్లు మీ అమ్మానాన్నలపైనే కాదు, అండగా నిలబడిన మీ జగన్ మామ మీద, చదువుకుంటున్న మీ మీద కూడా యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధంలో గెలవాలంటే మీ కర్తవ్యం ఏమిటో తెలుసా? బాగా చదవాలి. పైపైకి ఎదగాలి. అడవులు కొండలు ఎడారులా మనకడ్డంకి అంటూ ముందుకు సాగాలి. సరిహద్దుల్నీ సముద్రాల్నీ దాటుకుంటూ వెళ్లాలి. ఆకాశాన్ని చీల్చుకుంటూ పైకెగరాలి. ఆరుద్ర పాట తెలుసుకదా! ‘‘గ్రహ రాశుల నధిగమించి, ఘనతారల పథము నుంచి, గగనాంతర రోదసిలో,గంధర్వ గోళ గతులు దాటి’’ అలా సాగిపోవాలి. ఇంతకూ పెత్తందార్లంటే ఎవరో తెలుసా చిన్నా? వాళ్లూ అందరిలాగే ఉంటారు. కోరలూ కొమ్ములూ కనిపించవు. కాకపోతే డబ్బు ఉన్నదనే అహంకారంతో కనిపించని కొమ్ములు మొలుస్తాయి. ఈ సృష్టిలో ప్రతీదీ తమకే కావాలనుకుంటుంది పెత్తందార్ల వర్గం. భూమి, గాలి, నీరు, ఆకాశం మీద కూడా వాళ్లకే హక్కు ఉన్నట్టు భావిస్తారు. పొలాలు, ఫ్యాక్టరీలు, డబ్బు, అధికారం, హోదా అన్నీ వాళ్లకే ఉండాలి. మంచి చదువులు చదివితే తెలివి తేటలొస్తాయి. కనుక మంచి చదువులు తమ పిల్లలకే ఉండాలి. పేద పిల్లలు కూడా మంచి చదువులు చదివితే తమ పిల్లలతో సమానంగా ఉంటారు. మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. తమకు నౌకర్లు, చాకర్లు, డ్రైవర్లు, వంట వాళ్లు దొరకరు. సినిమా వాళ్లకు ‘పవర్ స్టార్’.. ‘పంచర్స్టార్’ అని వెర్రికేకలు వేసే ఫ్యాన్స్ దొరకరు. ఈ కారణాల వల్ల ఇంగ్లీష్ మీడియంలో చదివితే చెడిపోతా రని వాళ్లు ప్రచారంలో పెడుతున్నారు. మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యక తను గురించి సుద్దులు చెప్పడానికి కొందరు పెద్దల్ని రంగంలోకి దించుతారు. ఇప్పటికే దించారు కూడా! మాతృభాష లోనే పాఠాలు నేర్చుకుంటే జ్ఞానం పెరుగు తుందనీ, సులభంగా అర్థమవుతాయనీ చెబుతారు. అంతేగాకుండా అంతా ఆంగ్ల మీడియంలో చదివితే తెలుగు సంస్కృతి దెబ్బతింటుందని వాపోతారు. అలాంటి వాళ్లు మీకు తగిలినప్పుడు రెండు ప్రశ్నలు వేయండి. ఒకటి – ఇప్పుడు ఇంగ్లీషులో చదవకపోతే పై చదువులకు వెళ్లినకొద్దీ ఇంగ్లీషులోనే చదవాల్సిన పాఠాలకు ఎలా అలవాటు పడతామని అడగాలి. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ఎలా నెగ్గుతామని అడగాలి. మీరు పై చదువులు పెద్దగా చద వొద్దని కదా వారి ఉద్దేశం. అందుకని మీరా ప్రశ్న అడగ్గానే గతుక్కుమంటారు. ఇక రెండో అంశం – ‘అయ్యా! గత యాభయ్యేళ్లుగా మా అమ్మానాన్నలు, తాతముత్తాతలు తెలుగులోనే చదివి, తెలుగు భాషకు సేవలు చేసి అలసిపోయారు. ఇప్పుడు కొంతకాలం మేము ఇంగ్లీషులో చదువుకుంటాము. మీ పెత్తందార్లంతా ఇంతకాలం ఇంగ్లీషు చదువులు చదివారు కదా! ఇప్పుడు పిల్లల్ని మనవల్నీ తెలుగు మీడియంలో చదివించండి. వారు తెలుగు భాషను రక్షిస్తారు. మేం ఇంగ్లీష్ చదువుకొని అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతామ’ని చెప్పండి. ఏమంటారో చూద్దాం. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యాన్నిస్తూ ‘నాడు – నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి మీకు తెలుసు. ఈ కార్యక్రమం ఫలితంగా శిథిలా వస్థకు చేరిన సర్కారు బళ్లు మళ్లీ చిగురించాయి. ప్రైవేట్ స్కూళ్లను మించి సకల హంగులు సంతరించుకున్నాయి. మీకిస్తున్న బూట్లు, బ్యాగ్, బెల్ట్, యూనిఫామ్ అన్నీ బెస్ట్‌గా ఉండాలని స్వయంగా సీఎం హోదాలో ఉన్న మీ మేనమామ స్వయంగా సెలెక్ట్ చేసి పంపిస్తున్నారు. ‘గోరుముద్ద’ మెనూ కూడా ఆయనే తయారు చేశారు. కూలినాలి చేసుకునే పేద తల్లులు వారి బిడ్డల్ని స్కూళ్లకు పంపించేలా ప్రోత్సహించడం కోసం ‘అమ్మ ఒడి’ పేరుతో నగదు అందజేస్తున్న సంగతి కూడా మీకు తెలిసిందే. ఈ మొత్తం కార్యక్రమాల్లో భాగంగా మూడేళ్ల కిందనే ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించారు. ఏటా ఒక్కో తరగతిని పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు తొమ్మిదో తరగతి వరకు అంతా ఇంగ్లీష్ మీడియమే. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించిన ఆదిలోనే పెత్తందారీ ప్రతిఘటన మొదలైంది. తెలుగు భాషోద్యమం పేరుతో ఓ నకిలీ ఉద్యమాన్ని ప్రారంభించడానికి యెల్లో మీడియాతో కలిసి చంద్రబాబు ప్లాన్ చేశారు. కానీ, క్షేత్రస్థాయి నుంచి వ్యతిరేకత వస్తుందన్న సమాచారంతో కాస్త వెనక్కు తగ్గారు. కొద్దిరోజుల విరామం తర్వాత మళ్లీ చంద్రబాబు మొదలుపెట్టారు. ఈసారి ప్రత్యక్షంగా పేద తల్లితండ్రుల మెదళ్లలోకి దూరాలని ప్రయత్నించారు. శ్రీకాకుళం నుంచి రోడ్డు మార్గం ద్వారా వస్తున్న చంద్రబాబుకు విశాఖ సమీపంలో ఓ పదిమంది కూలీలు రోడ్డు పక్కన కనిపించారు. వెంటనే వాహనాన్ని ఆపేసి వాళ్ల మధ్యన కూర్చున్నారు. ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత ‘‘ఆయనేదో (జగన్) ఇంగ్లీష్ మీడియం అంటున్నాడు. ఏమొస్తది ఇంగ్లీష్ మీడియంతో! కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోద్ది. మన పిల్లలు మొద్దబ్బాయి లుగా తయారవుతారు...’’ అంటూ ఇంకేదో చెప్పబోయారు. అక్కడున్న జనమంతా అసహ నంతో ‘జై జగన్’ అని నినాదాలు చేయడంతో చల్లగా జారుకున్నారు. పెత్తందార్ల కూటమికి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయకుడు. ఆయన సమన్వయంలోనే యెల్లో మీడియా పనిచేస్తున్నది. ఈ మీడియా సమూహంలో అతి ముఖ్యుడు రామోజీరావు. ఆయన చంద్రబాబుకు గురుపాదుల వంటివారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఎకరాల విశాల సామ్రాజ్యాన్ని అక్రమ పద్ధతుల్లో విస్తరించారు. ఈ విస్తరణలో భాగంగా ఆయన చట్టాలను కూడా యథేచ్ఛగా ఉల్లంఘించారు. ఆయనకు ‘ఈనాడు’ అనే పత్రిక, ‘ఈటీవీ’ పేరుతో చానళ్లున్నాయి. తాను తెలుగు కోసమే పుట్టినట్టు, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసమే గాలి పీల్చుకుంటున్నట్టు ఆయన డప్పు వేయించుకుంటారు. ఆయన స్థాపించిన ఫిలిం సిటీ చేరువలో కొండల మీద రమాదేవి పబ్లిక్ స్కూల్ పేరుతో ఒక పాఠశాలను స్థాపించారు. అది మాత్రం పక్కా ఇంగ్లీష్ మీడియం, సెంట్రల్ సిలబస్. తెలుగు మీడియం పాఠశాల పెడితే భారీగా ఫీజులు కట్టి ఎవరు చదు వుకుంటారు? కనక తనకు కలెక్షన్ కోసం సంపన్నులు చదువుకునే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండాలి. పేద బిడ్డలు మాత్రం కనీస వసతులు లేని ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియం చదవాలి. ఇదీ వారి నీతిసారం. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ గురుపాదులవారు రాజ గురువుగా చక్రం తిప్పిన రోజుల్లోనే ప్రభుత్వరంగంలోని విద్యా వ్యవస్థ శిథిలమైపోయి వీథికో ప్రైవేట్ స్కూల్, ఊరికో కార్పొరేట్ కాలేజీ బ్రాంచీలు విస్తరించాయి. చదువు అంగడి సరుకుగా రూపాంతరం చెందింది. పేదలు డ్రాపౌట్లుగా మిగిలి పోయారు. ఫలితంగా రెండు తరాల పేదలు నాణ్యమైన చదువుకు నోచుకోక జీవన ప్రమా ణాలను కోల్పోవలసి వచ్చింది. ఈ మానవ కల్పిత మహా సంక్షోభం మీద పరిశోధన జరగవలసిన అవసరం ఉన్నది. ఇంగ్లీష్ మీడియం విద్యకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడేందుకు చంద్రబాబు, ఆయన ముఠా వెనుకడుగు వేసినా పరోక్ష ప్రయత్నాలను మాత్రం ఆపలేదు. తెలుగు భాషా సంస్కృతుల ముసుగులో వివిధ వేదికల ద్వారా ఇంగ్లీష్ మీడియంపై విషం చల్లుతూనే వస్తున్నారు. రాజ్యాంగబద్ధ పద వుల్లో పనిచేసిన పెద్దమనుషుల సేవలను కూడా ఇందుకోసం విరివిగా వినియోగించు కున్నారు. అయినా ఫలితం కలుగలేదు. ప్రజల సంపూర్ణ మద్దతుతో ఇంగ్లీషు మీడియంతో పాటు ఆనక విద్యాసంస్కర ణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేసిన తర్వాత, ఐఎఫ్‌పీ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చిన తర్వాత ఆ యా విద్యా ర్థుల నాణ్యతా ప్రమాణాలు పెరిగినట్టుగా అసెస్మెంట్ పరీక్షల్లో ఉపాధ్యా యులు గుర్తించారు. ఈ స్ఫూర్తితో దశలవారీగా ఐబీ సిలబస్‌ను కూడా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఇక లాభం లేదనుకున్న పెత్తందారీ ముఠా ఎన్నికలకు ఇంకో ఆరు నెలల సమయం ఉండగా ఆఖరు కృష్ణుడిని రంగంలోకి దించింది. పవన్ కల్యాణ్:ది లాస్ట్ కృష్ణా తన సహచరుడు నాదెండ్ల మనోహర్‌తో కలిసి శుక్రవారం నాడు ఇంగ్లీష్ మీడియంపై, విద్యాసంస్కరణలపై విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఈ విద్యావిధానంపై కేసులు పెట్టి దీంతో సంబంధం ఉన్న వారందరినీ జైలుకు పంపుతారట! తమ పిల్లల్ని ఏ స్కూల్లో, ఏ మీడి యంలో, ఏ సిలబస్‌తో చదివించారో కూడా పవన్, మనోహర్‌లు ఈ సమావే శంలో చెబితే బాగుండేది. కానీ చెప్పలేదు. పవన్ హెచ్‌ఎమ్‌వి రికార్డులాంటోడు. అందులో రికార్డయిందే చెప్పగలడు. కానీ, పేద విద్యార్థుల ప్రగతికి ఉద్దేశించిన ఇంగ్లీష్ మీడియంపై యుద్ధం ప్రకటించి తాను ఏ వర్గం తరఫున పనిచేస్తున్నాడో చాటి చెప్పుకున్నాడు. లంకలో పుట్టిన ప్రతివాడూ రాక్షసుడే అన్నట్టు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించే ప్రతివాడూ పెత్తందార్ల తాబేదారే! నీవారెవరో పరవారెవరో గుర్తించడానికి ఇది మాత్రమే లిట్మస్ టెస్ట్ తల్లీ! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
నిఠారి హంతకులెవరు?
కనీవినీ ఎరుగని ఘోరం జరుగుతుంది. పత్రికల్లో పతాక శీర్షికవుతుంది. చానెళ్లలో ప్రధాన చర్చ నీయాంశంగా మారుతుంది. సమాజంలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతాయి. కారకులను ఉరికంబం ఎక్కించాలంటూ జనం డిమాండ్ చేస్తారు. ఇప్పటికిప్పుడు ఎన్కౌంటర్ చేయాలని గొంతెత్తుతారు. తీరా కాలం గడిచాక, న్యాయస్థానాల్లో విచారణలు వాయిదాల్లో సాగాక నిందితులు నిర్దోషులుగా విడుదలవుతారు. అన్ని కేసుల్లోనూ కాకపోవచ్చుగానీ, కొన్నింటి విషయంలో ఇలాగే జరుగుతోంది. బాధిత కుటుంబాలకు న్యాయం దక్కలేదని ఆక్రోశించాలో, అమాయకులకు విముక్తి లభించిందని భావించాలో తెలియని అయోమయ స్థితి ఏర్పడుతోంది. మరి దోషులెవరన్న ప్రశ్న తలెత్తుతోంది. సరిగ్గా పదిహేడేళ్ల క్రితం పెనుసంచలనం సృష్టించిన ‘నిఠారీ హత్యల’ కేసుల్లో నిందితులుగా భావించిన సురేందర్ కోలీ, మోనిందర్ సింగ్ పంధేర్‌లు తాజాగా అలహాబాద్ హైకోర్టు తీర్పుతో నిర్దోషులుగా బయటపడటం బహుశా ఎవరూ ఊహించని ముగింపు. ఎందుకంటే 2005–06 మధ్య వారిద్దరూ చేశారని చెప్పిన నేరాల జాబితా చాలా పెద్దది. వారి చేతుల్లో ఏకంగా 18 మంది బాలికలు, మహిళలు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తేల్చారు. ఒంటరిగా కనబడిన నిరుపేద బాలికలకూ, మహిళలకూ మాయమాటలు చెప్పి బంగ్లాలోకి తీసుకెళ్లటం, వారిని హతమార్చటం నేరగాళ్లు అనుసరించిన విధానం. హత్యల తర్వాత మృతదేహాలపై కోలీ, పంధేర్‌లు లైంగికదాడి జరిపే వారనీ, నరమాంస భక్షణ చేసేవారనీ వచ్చిన కథనాలు వెన్నులో వణుకు పుట్టించాయి. మృత దేహాలపై లైంగిక దాడి తర్వాత శరీర భాగాలను ఇంటి వెనకున్న కిటికీ నుంచి విసిరేసేవారని కూడా ఆ కథనాల సారాంశం. ఎప్పటికప్పుడు వీరందరి అదృశ్యంపైనా ఫిర్యాదులొచ్చినా పోలీసులు నిర్లక్ష్యం వహించటంవల్లే ఇన్ని హత్యలు జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. తీరా ఇన్నేళ్లు గడిచాక పోలీసులు సరైన సాక్ష్యాధారాలను చూపలేకపోయారనీ, వారి దర్యాప్తు ఆద్యంతం అస్తవ్యస్థంగా సాగిందనీ హైకోర్టు తేల్చింది. వీధిలో ఆడుకుంటున్న పిల్లలకు మురికి కాల్వలో పుర్రె భాగం దొరకటంతో ఈ కేసుల డొంక కదిలింది. ఆ తర్వాత 8 మంది పిల్లల ఎముకలు ఇంటి వెనుక దొరికాయి. నిందితులపై 2009లో బ్రెయిన్ మ్యాపింగ్, నార్కో అనాలిసిస్, సైకలాజికల్ అసెస్మెంట్స్ వంటి శాస్త్రీయ పరీక్షలు చేశారని వార్తలొచ్చాయి. ‘హఠాత్తుగా నాలో దయ్యం నిద్ర లేచేది. ఎవరినో ఒకరిని మట్టుబెట్టాలన్న వాంఛ పుట్టుకొచ్చేది’ అని కోలీ చెప్పినట్టు కూడా మీడియా కథనాలు తెలిపాయి. నిందితులిద్దరిపైనా 19 కేసులు నమోదుకాగా, వీటిని విచారించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 12 కేసుల్లో కోలీని దోషిగా తేల్చి మరణశిక్ష విధించగా, రెండు కేసుల్లో పంధేర్ దోషిగా తేలాడు. అతనికి కూడా మరణశిక్ష పడింది. దోషులు అప్పీల్ చేసుకోగా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఒక కేసులో మినహా అన్నింటి లోనూ కోలీ నిర్దోషిగా బయటపడ్డాడు. పంధేర్‌కు అన్ని కేసుల నుంచీ విముక్తి లభించింది. వీరిద్దరి పైనా బలమైన సాక్ష్యాధారాలూ లేవని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నోయిడా సెక్టార్‌లోని నిఠారి అప్పట్లో ఒక చిన్న గ్రామం. ఇప్పుడు పట్టణంగా మారింది. మన నేర న్యాయవ్యవస్థ మాత్రం ఎప్పట్లాగే లోపభూయిష్టంగా ఉంది. అలహాబాద్ హైకోర్టు తీర్పు దాన్నే నిర్ధారించింది. మీడియాలో ప్రముఖంగా ప్రచారంలోకొచ్చి, ఆందోళనలు మిన్నంటే కేసుల్లో పోలీసు లపై వాటి ప్రభావం, ఒత్తిళ్లు అధికంగా వుంటాయనటంలో సందేహం లేదు.వాటిని సాకుగా చూపి ఆదరాబాదరాగా ఎవరో ఒకరిని నిందితులుగా తేల్చాలనుకోవటం సరికాదు. సాక్ష్యాధారాల సేక రణలో కూడా పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోలేకపోయారనీ, నిందితులపై థర్డ్ డిగ్రీ పద్ధతులు ప్రయోగించి తేల్చటానికే ఉత్సాహం ప్రదర్శించారనీ హైకోర్టు తప్పుబట్టిందంటే దర్యాప్తు ఎలా అఘోరించిందో అర్థం చేసుకోవచ్చు. చాన్నాళ్లక్రితం కేంద్ర ప్రభుత్వ కమిటీ మనుషుల అదృశ్యాల వెనక శరీర అవయవాల వ్యాపారం సాగించే సంఘటిత ముఠాల హస్తం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేసింది. నిఠారి హత్యల విషయంలో ఆ కోణంలో దర్యాప్తు సాగలేదు. థర్డ్ డిగ్రీ విధానాలను ఉపయోగించటం ద్వారా పోలీసులు కేసు తేల్చేశారన్న అభిప్రాయం జనంలో కలిగించవచ్చుగానీ, న్యాయస్థానాల్లో విచారణ సమయానికి ఇవన్నీ మటుమాయమవుతాయి. సంశయాతీతంగా సాక్ష్యా ధారాలుండకపోతే, మమ్మల్ని కొట్టి ఒప్పించారని నిందితులు చెబితే చివరికి కేసు వీగి పోతుంది. కేవలం ఒక వ్యక్తి లేదా ఇద్దరు ఇంతమందిని హతమార్చారనీ, మరెవరి ప్రమేయమూ ఇందులో లేదనీ నిర్ధారించాలంటే అందుకు దీటైన సాక్ష్యాధారాలుండాలి. అవి శాస్త్రీయంగా సేకరించాలి. ఎక్కడ అశ్రద్ధ చేసినా, ఏ చిన్న లోపం చోటుచేసుకున్నా మొత్తం కుప్పకూలిపోతుంది. దానికి తోడు ప్రతీకారంతో రగిలిపోతూ తక్షణ న్యాయం కావాలని రోడ్డెక్కే ధోరణులు మొత్తం దర్యాప్తును అస్తవ్యస్థం చేస్తున్నాయి. జనాన్ని సంతృప్తిపరచటం కోసం దొరికినవారిని నిందితులుగా తేల్చి పోలీసులు చేతులు దులుపుకొంటున్నారు. సుప్రీంకోర్టులో ఎటూ సీబీఐ అప్పీల్ చేస్తుంది. అక్కడే మవుతుందన్నది చూడాల్సివుంది. అత్యాధునిక ప్రమాణాలతో భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. అంతరిక్షంలో ఘనవిజయాలు నమోదు చేస్తున్నాం. కానీ పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దటంలో, దానికి వృత్తిగత నైపుణ్యాలను అలవాటు చేయటంలో విఫలమవుతున్నాం. క్రిమినల్ కేసుల్లో సత్వర దర్యాప్తు, పకడ్బందీ సాక్ష్యాధారాల సేకరణ ప్రాణప్రదం. వాటిని విస్మరిస్తే కేసులు కుప్ప కూలు తాయి. నేరగాళ్లు తప్పించుకుంటారు. నిఠారి నేర్పుతున్న గుణపాఠాలివే. -
చేతులు కాలకముందే...
ఆగ్రహం ఉండొచ్చు, ఆవేశం ఉండొచ్చు. కానీ సంయమనం మరిచి ఆగ్రహకారకుల్ని నిర్మూలించాలనుకోవటం ఉన్మాదమవుతుంది. చివరికది స్వీయ విధ్వంసానికి దారి తీస్తుంది. ఈ విషయంలో అమెరికాకు చాలా అనుభవం ఉంది. అందుకే కావొచ్చు ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా పర్యటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు ఇచ్చిన సలహా ఎంతో విలువైనది. ఆగ్రహాగ్నిని సకాలంలో చల్లార్చుకోనట్టయితే అది మిమ్మల్నే దహిస్తుందని చెప్పటమే కాదు... ఉగ్రదాడి తర్వాత అమెరికా తీసుకున్న చర్యలు ఎలా పరిణమించాయో గుర్తు చేశారు. ఈనెల 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి విచక్షణారహితంగా వందలమందిని హతమార్చటాన్ని ఎవరూ సమర్థించలేదు. అదే సమయంలో దాడి కార కులపై అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా చర్య తీసుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరారు. మిలిటెంట్లు రెచ్చిపోయి నప్పుడో, దేశంలో ఎన్నికలు సమీపిస్తున్నప్పుడో ఇజ్రాయెల్ అతిగా వ్యవహరించి పాలస్తీనా పౌరుల ప్రాణాలు తీస్తుండటం దశాబ్దాలుగా రివాజైంది. వెస్ట్‌బ్యాంక్, గాజా, లెబనాన్‌లపై అపాచే హెలి కాప్టర్లు, ఎఫ్–16 యుద్ధ విమానాలతో క్షిపణుల వర్షం కురిపిస్తూ ఆసుపత్రులు, స్కూళ్లు, జనావా సాలు నేలమట్టం చేసిన ఉదంతాలు ఎన్నో వున్నాయి. ఇలాంటి సమయాల్లో క్షతగాత్రుల్ని ఆదుకోవ టానికీ, ఇతరత్రా సాయం అందించటానికీ ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలకు కూడా అనుమతులు లభించవు. ఇప్పుడు జరుగుతున్నదీ అదే. మందులు, ఆహారపదార్థాలు అందించ టానికి ఈజిప్టువైపునున్న సరిహద్దుల్లో వందలాది ట్రక్కులు రెండురోజులుగా నిలిచిపోయాయి. మరోపక్క ఇజ్రాయెల్ భీకర దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఒక ఆసుపత్రిపై జరిగిన రాకెట్ దాడిలో 500 మంది చనిపోయారు. ఇప్పటికే దాదాపు అయిదువేల మంది పాలస్తీనా పౌరులు చనిపోగా, పదివేలమంది గాయాలపాలయ్యారు. హమాస్ ప్రయోగించిన రాకెట్ గురి తప్పి ఆసుపత్రిపై పడిందని ఇజ్రాయెల్, అది ఇజ్రాయెల్ దళాల పనేనని హమాస్ అంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బైడెన్ హితవచనం కీలకమైనది. కానీ ఆసుపత్రిపై జరిగిన దాడి విషయంలో ఇజ్రాయెల్‌ను వెనకేసుకు రావటం సరైందేనా? యుద్ధమంటూ మొదలయ్యాక కారకులు ఎవరో వెంటనే గుర్తించలేకపోవటం సర్వసాధారణం. కనీసం ఆ సంగతి తేలేవరకూ కూడా ఆగకుండా ఇజ్రాయెల్ వాదనను సమర్థించటం న్యాయమేనా? వేలాదిమంది క్షతగాత్రులకు వైద్య సాయం నిలువరించి, పదిలక్షల మందిని ఆకలిదప్పుల్లో ఉంచటం సమస్యను చక్కదిద్దగలదని ఆయన విశ్వసిస్తున్నారా? ఈ విషయంలో ఇజ్రాయెల్ తీరును తప్పుబట్టాల్సిన అవసరం లేదా? హమాస్ చెరలో బందీలుగా వున్న 200 మందినీ విడుదల చేసేవరకూ గాజాకు ఏ రకమైన మానవతా సాయం అందనీయబోమని నెతన్యాహూ చేసిన ప్రతిన ఏ నాగరిక ప్రమాణాలతో చూసినా నిర సించదగ్గది. ఇజ్రాయెల్ రక్షణకు కావాల్సిన ‘అసాధారణ ప్యాకేజీ’ కోసం అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రతి పాదిస్తానని చెబుతున్న బైడెన్‌కు సాధారణ ప్రజానీకం గోడు పట్టిన దాఖలాలు లేవు. 2001లో అమె రికాపై ఉగ్రదాడి తర్వాత తీసుకున్న చర్యలతో తమకు న్యాయం దక్కిందని, ఆ క్రమంలో తప్పులు కూడా జరిగాయని ఆయన అంగీకరించటం మంచిదే. ఆనాడు ఇరాక్‌పై దురాక్రమణ యుద్ధానికి సెనెటర్‌గా ఆయన కూడా మద్దతునిచ్చారు. అది ఇరాక్ వినాశనానికే కాక, అమెరికా ఆర్థిక పతనానికి సైతం కారణమైంది. ఈ చేదు అనుభవాలను బైడెన్ పరోక్షంగా ప్రస్తావించటంకాక కుండబద్దలు కొట్టినట్టు చెప్పివుంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ అక్షరాలా ఉగ్రరూపం దాల్చింది. గతంలో కేవలం ఒకే ఒక సైనికుడి కోసం వేయిమంది పాలస్తీనా పౌరులను విడిచిపెట్టిన ఆ దేశం... హమాస్ చెరలో 200 మంది ఇజ్రాయెల్ పౌరులుండగా ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నది. అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో బందీగా ఉన్న యువతి షెమ్ వీడియో తెలియజేస్తోంది. బాంబుల మోతలతో తాము చావుబతుకుల్లో బిక్కుబిక్కుమంటూ వున్నామని, తమను రక్షించటానికి పూనుకోవాలని ఆమె వేడుకుంటోంది. వాస్తవానికి ఇంకా సైన్యం భూతల దాడులకు దిగ లేదు. అది మొదలైతే ఇంకెన్ని వైపరీత్యాలు చూడాల్సి వస్తుందో అనూహ్యం. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 6 వేల మంది పాలస్తీనా పౌరుల విడుదల, భూతల దాడుల ప్రయత్నాలకు స్వస్తి హమాస్ డిమాండ్లు. పాలస్తీనాలో శాంతి స్థాపన ఇజ్రాయెల్, హమాస్లకు లేదా పశ్చిమాసియాకు మాత్రమే కాదు... అమెరికాకు కూడా అత్యవసరం. ఇజ్రాయెల్ తన మతిమాలిన చర్యల ద్వారా ఇప్పటికే సంక్షోభాన్ని మరింత పెంచింది. ఇజ్రాయెల్‌కు అండగా ఉన్నట్టు కనబడకపోతే వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ఇంటిదారి పట్టాల్సివస్తుందని బైడెన్ భయపడుతూ ఉండొచ్చు. కానీ ఆ పని చేస్తే అరబ్ దేశాలతో ఇజ్రాయెల్‌కు పీటముడి వేయాలన్న అమెరికా లక్ష్యం గల్లంతవుతుంది. గాజా ఆసుపత్రిపై మారణకాండ తర్వాత ఆ ఛాయలు కనబడుతూనే వున్నాయి. సౌదీ అరేబియా–ఇజ్రాయెల్ మైత్రికి సంబంధించిన యత్నాలు కొన్ని వారాల క్రితమే ఫలించగా, అవి కాస్తా నిలిచి పోయాయి. ఇరాన్‌తోనూ ఒప్పందం కుదర్చాలని అమెరికా తహతహలాడింది. దానికి కూడా గండి పడింది. బైడెన్‌తో జరగాల్సిన సమావేశాన్ని పాలస్తీనా నాయకుడు మహమ్మద్ అబ్బాస్ రద్దు చేసుకున్నారు. జోర్డాన్, ఈజిప్టు దేశాల్లో బైడెన్ రెండో దశ పర్యటన వాయిదా పడింది. భూతల దాడులు మొదలైతే అరబ్ దేశాల్లో ఊహకందని పరిణామాలు చోటు చేసుకుని, ప్రపంచానికే పెనుముప్పుగా మారుతుంది. దాన్ని నివారించటమే అమెరికాకైనా, మరొక దేశానికైనా అంతిమ లక్ష్యం కావాలి. -
సమన్యాయ సంకటం
ధర్మం, న్యాయం వేరు... చట్టం వేరు. కాలాన్ని బట్టి సమాజం దృష్టి మారినంత వేగంగా చట్టం మారడం కష్టం. ఒకవేళ మార్చాలన్నా ఆ పని పాలకులదే తప్ప, న్యాయస్థానాల పరిధిలోది కాదు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపునిచ్చేందుకు నిరాకరిస్తూ అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం వెలువరించిన తీర్పు ఆ సంగతే తేల్చింది. ‘‘ఈ కోర్టు చట్టం చేయలేదు. ప్రభుత్వం చేసిన చట్టాలను విశ్లేషించి, వ్యాఖ్యానించగలదు. అది అమలయ్యేలా చూడ గలదు’’ అని భారత ఛీఫ్ జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. స్వలింగ వివాహాలను అనుమతించాలంటే చట్టం చేయాల్సింది పార్లమెంటేననీ, అందుకు తగ్గట్టు ‘ప్రత్యేక వివాహ చట్టాన్ని’ (ఎస్ఎంఏ) సవరించే బాధ్యత పాలకులదేననీ అభిప్రాయపడింది. అయితే, ఎల్జీబీటీక్యూ సముదాయ సభ్యులకు కలసి జీవించే హక్కుందనీ, దాన్ని తమ తీర్పు తోసిపుచ్చడం లేదనీ స్పష్టతనిచ్చింది. స్వలింగుల పెళ్ళికి చట్టబద్ధత లభిస్తుందని గంపెడాశతో ఉన్న ఎల్జీబీటీక్యూ లకు ఇది అశనిపాతమే. హక్కులకై వారి పోరాటం మరింత సుదీర్ఘంగా సాగక తప్పదు. నిజానికి, స్వలింగ సంపర్కం నేరం కాదని 2018 జూలైలో సుప్రీమ్ చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఇక తదుపరిగా స్వలింగ జంటల వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు లభిస్తుందని ఎల్జీబీటీక్యూ వర్గం భావించింది. అందుకు తగ్గట్లే ఆ గుర్తింపును కోరుతూ 21 పిటిషన్లు దాఖలయ్యాయి. పిల్లల్ని దత్తత చేసుకొనే హక్కు, పాఠశాలల్లో పిల్లల తల్లితండ్రులుగా పేర్ల నమోదుకు అవకాశం, బ్యాంకు ఖాతాలు తెరిచే వీలు, బీమా లబ్ధి లాంటివి కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ అంశంపై ఏప్రిల్‌లో పదిరోజులు ఏకబిగిన విచారణ జరిపి, మే 11న తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం మంగళవారం నాలుగు అంశాలపై వేర్వేరు తీర్పులిచ్చింది. స్వలింగ పెళ్ళిళ్ళ చట్టబద్ధత పార్లమెంట్ తేల్చాల్సిందేనంటూ ధర్మాసనం బంతిని కేంద్రం కోర్టులోకి వేసింది. పెళ్ళి చేసుకోవడాన్ని రాజ్యాంగం ఒక ప్రాథమిక హక్కుగా ఇవ్వలేదని ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. అయితే, పిల్లల దత్తత సహా స్వలింగ సంపర్కుల ఇతర అంశాలపై అయిదుగురు జడ్జీల మధ్య భిన్నాభిప్రాయా లున్నాయి. దాంతో, ధర్మాసనం 3–2 తేడాతో మెజారిటీ తీర్పునిచ్చింది. వివాహ వ్యవస్థ, స్వలింగ సంపర్కాలపై ఎవరి అభిప్రాయాలు ఏమైనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అర్జెంటీనా, ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్, జపాన్ సహా 34 దేశాలు సమ లైంగిక వివాహాలను చట్టబద్ధం చేశాయి. వచ్చే ఏడాది నుంచి 35వ దేశంగా ఎస్తోనియాలోనూ అది చట్ట బద్ధం కానుంది. ఇవి కాక మరో 35 దేశాలు స్వలింగ సంపర్కులకు పెళ్ళి మినహా అనేక అంశాల్లో చట్టపరమైన గుర్తింపునిచ్చాయి. అమెరికా అయితే సాధారణ వివాహ జంటలకిచ్చే ప్రభుత్వ సౌకర్యాలన్నీ ఈ స్వలింగ జంటలకు సైతం 2015 నుంచి అందిస్తోంది. స్వలింగ సంపర్కం, లైంగిక తల విషయంలో ప్రపంచంలో మారుతున్న ఆలోచనా ధోరణులకు ఇది ప్రతీక. అందుకే, మన దగ్గరా ఇంత చర్చ జరిగింది. ఆ మాటకొస్తే, భిన్న లైంగికత అనేది అనాదిగా సమాజంలో ఉన్నదే. మన గ్రంథాల్లో ప్రస్తావించినదే. అందుకే, సాక్షాత్తూ సుప్రీమ్ ఛీఫ్ జస్టిస్ సైతం, ఇదేదో నగరాలకో, ఉన్నత వర్గాలకో పరిమితమైనదనే అపోహను విడనాడాలన్నారు. అందరి లానే వారికీ నాణ్యమైన జీవితాన్ని గడిపే హక్కుందని పేర్కొన్నారు. ఇది గమనంలోకి తీసుకోవాల్సిన అంశం. స్వలింగ జంటల వివాహాలకు పచ్చజెండా ఊపనప్పటికీ, భిన్నమైన లైంగికత గల ఈ సము దాయం దుర్విచక్షణ, ఎగతాళి, వేధింపుల పాలబడకుండా కాపాడాల్సిన అవసరం తప్పక ఉందని సుప్రీమ్ అభిప్రాయపడింది. అందుకు కేంద్రం, రాష్ట్రాలు తగు చర్యలు చేపట్టాలని కూడా కోర్టు ఆదేశాలిచ్చింది. మరోపక్క స్వలింగ సంబంధాల్లోని జంటలకున్న సమస్యలను పరిశీలించేందుకూ, వారికి దక్కాల్సిన హక్కులను చర్చించేందుకూ ఓ సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. పెళ్ళికి చట్టబద్ధత దక్కలేదని నిరాశ కలిగినప్పటికీ, స్వలింగ జంటలకు ఒకింత ఊరటనిచ్చే విషయాలివి. అర్ధనారీశ్వర తత్వాన్ని అనాది నుంచి అర్థం చేసుకొంటూ వస్తున్న భారతీయ సమాజం భిన్న లైంగికతను ఘోరంగా, నేరంగా, నీచంగా చూడడం సరికాదు. ఆ సముదాయం సైతం మన లోని వారేనన్న భావన కలిగించాలి. దీనిపై ప్రజల్లో ప్రభుత్వం చైతన్యం పెంచాలి. శానస నిర్మాతలు లైంగికతలో అల్పసంఖ్యాక సముదాయమైన వీరికి అవసరమైన చట్టం చేయడంపై ఆలోచించాలి. భారతీయ సమాజంలో వైవాహిక, కుటుంబ వ్యవస్థలకు ప్రత్యేక స్థానమున్న మాట నిజం. అది అధిక సంఖ్యాకుల మనోభావాలు ముడిపడిన సున్నితమైన అంశమనేదీ కాదనలేం. స్వలింగ జంటల వివాహం, పిల్లల దత్తత, పెంపకం సంక్లిష్ట సమస్యలకు తెర తీస్తుందనే కేంద్ర ప్రభుత్వ భయమూ నిరాధారమని తోసిపుచ్చలేం. కానీ, ఈ పెళ్ళిళ్ళకు గుర్తింపు లేనందున పింఛన్, గ్రాట్యుటీ, వారసత్వ హక్కుల లాంటివి నిరాకరించడం ఎంత వరకు సబబు? మన దేశంలో 25 లక్షల మందే స్వలింగ సంపర్కులున్నారని ప్రభుత్వం లెక్క చెబుతోంది. కానీ, బురద జల్లుతారనే భయంతో బయటపడిన వారు అనేకులు గనక ఈ లెక్క ఎక్కువే అన్నది ఎల్జీబీటీక్యూ ఉద్యమకారుల మాట. సంఖ్య ఎంతైనప్పటికీ, దేశ పౌరులందరికీ సమాన హక్కులను రాజ్యాంగం ప్రసాదిస్తున్నప్పుడు, కేవలం లైంగికత కారణంగా కొందరిపై దుర్విచక్షణ చూపడం సరికాదు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించి, కాలానుగుణంగా పాత చట్టాల్లో మార్పులు చేయాలి. అందరూ సమానమే కానీ, కొందరు మాత్రం తక్కువ సమానమంటే ఒప్పుతుందా? -
రంగుల ఒలింపిక్స్ స్వప్నం
ఎప్పటి నుంచో వింటున్నదే... తెర వెనుక జోరుగా ప్రయత్నాలు సాగుతున్నదే... ఇప్పుడు అధికారి కంగా ఖరారైంది. 128 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ మళ్ళీ విశ్వక్రీడల్లో పునఃప్రవేశం చేయనుంది. మరో అయిదేళ్ళలో రానున్న 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో ఈ ‘జెంటిల్మెన్ క్రీడ’ సహా స్క్వాష్, బేస్‌బాల్/ సాఫ్ట్‌బాల్, లక్రాస్, ఫ్లాగ్ ఫుట్‌బాల్ ఆటలు అయిదింటిని అదనంగా ప్రవేశపెట్టనున్నారు. భారత్‌లో 50 ఓవర్ల ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతున్న వేళ ఈ ప్రకటన రావడం విశేషం. ముంబయ్‌లో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ, భారత్‌లో 2036 నాటి ఒలింపిక్స్ నిర్వహణకు మన ప్రధాని బాహాటంగా ఉత్సుకతను వ్యక్తం చేశారు. ఆ వెంటనే రెండు రోజులకే ఒలింపిక్ కార్యక్రమ సంఘం అధ్యక్షుడు కార్ల్ స్టాస్ క్రికెట్‌కు ఒలింపియాడ్‌లో స్థానాన్ని ప్రకటించడం ఉత్సాహం నింపింది. కాలానికి తగ్గట్టు మారే ఈ ప్రయత్నం అభినందనీయమే. అదే సమయంలో ఇది పలు సవాళ్ళపై చర్చ రేపింది. ఎప్పుడో 1900లోనే తొలిసారిగా ప్యారిస్ ఒలింపిక్స్‌లోనే క్రికెట్ భాగమైంది. తర్వాత ఇన్నేళ్ళకు లాస్ ఏంజెల్స్‌లో మళ్ళీ తెరపైకి వస్తోంది. స్క్వాష్ సహా మిగతా 4 ఆటలకు విశ్వ క్రీడాంగణంలో ఇదే తెరంగేట్రం. ప్రపంచంలోని అతి పెద్ద క్రీడా సంరంభం నుంచి ఇన్నేళ్ళుగా క్రికెట్‌ను దూరంగా ఉంచడం దురదృష్టకరమే! ఇప్పుడు టీ–20 క్రికెట్ విస్తృత ప్రాచుర్యం పొందడమే కాక మును పెన్నడూ లేని విధంగా ప్రపంచంలోని అనేక దేశాలు ఆ ఫార్మట్ పోటీల్లో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో టీ–20 క్రికెట్‌కు కూడా చోటివ్వడం ప్రజాస్వామ్యబద్ధమైన ఆలోచన. తద్వారా ఒలింపిక్స్ మరింత చేరువవుతుంది. ఫుట్‌బాల్ తర్వాత ప్రపంచంలో అత్యధికులు అనుసరించే క్రీడగా క్రికెట్ ప్రసార, ప్రచార హక్కులతో ఒలింపిక్ సంఘానికి వచ్చే ఆదాయం, అటు నుంచి భారత్‌కు లభించే వాటా సరేసరి. అందుకే, ఐఓసీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక చాలా లెక్కలే ఉన్నాయి. అయితే చిన్న తిరకాసుంది. క్రికెట్ సహా కొత్తగా చేరే ఆటలన్నీ 2028 ఒలింపిక్స్‌కే పరిమితం. వాటిని తర్వాత కొనసాగించాలా లేదా అన్నది ఆపైన 2032లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే బ్రిస్బేన్ నిర్ణయిస్తుంది. నిజానికి, కామన్వెల్త్ దేశాలే కాక, ప్రపంచమంతా ఆడే విశ్వక్రీడగా క్రికెట్ విస్తరించాల్సి ఉంది. ఐఓసీ గుర్తింపు పొందిన 206 దేశాల్లో ప్రస్తుతం 50 శాతాని కన్నా తక్కువ చోట్లే క్రికెట్ ఆడుతున్నారు. కనీసం 75 శాతం చోట్ల క్రికెట్ తన ఉనికిని చాటాల్సి ఉంది. అది ఓ సవాలు. కొన్ని ఐఓసీ సభ్యదేశాలు చేస్తున్న ఈ వాదన సబబే. అలాగే, కొత్తగా ఒలింపియాడ్లోకి వస్తున్న అయిదింటిలో నాలుగు... టీమ్ స్పోర్ట్స్. కాబట్టి, క్రీడాగ్రామంలో ఆటగాళ్ళ సంఖ్య అంగీకృత కోటా 10,500 కన్నా 742 మేర పెరుగుతుంది. గేమ్స్ విలేజ్‌పై భారం తగ్గించడానికి ఇతర ఆటల్లో అథ్లెట్ల కోటా తగ్గించడం, కొన్ని మెడల్ ఈవెంట్లను ఈసారికి పక్కనపెట్టడమే మార్గం. అది కొంత నిరాశే! అలాగే, ఒలింపిక్స్‌లోకి క్రికెట్ పునఃప్రవేశం బాగానే ఉంది కానీ, అగ్ర క్రికెటర్లు ఆ క్రీడాసంరంభంలో కాలుమోపుతారా అన్న అనుమానం పీడిస్తోంది. ఇటీవలి ఏషియన్ గేమ్స్ అనుభవమే అందుకు సాక్ష్యం. ఆసియా ఖండంలోని అధిక భాగం అగ్రశ్రేణి జట్లు ప్రధాన ఆటగాళ్ళను అక్కడకు పంపనే లేదు. అదేమంటే, దగ్గరలోనే 50 ఓవర్ల ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఉందన్నాయి. ఇండియా అయితే ఏషియాడ్కి క్రికెట్ జట్టునే పంపకూడదనుకుంది. ఆఖరు క్షణంలో క్రికెట్ బోర్డ్ మనసు మార్చుకుంది. వచ్చే 2028 నాటి అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ ఇంకా ఖరారు కాలేదు గనక, ఆ ఏడాది జూలైలో 16 రోజుల పాటు సాగే ఒలింపిక్స్‌లో అగ్రతారలు ఆడేందుకు వీలుగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షెడ్యూల్‌ను ఖరారు చేస్తుందని ఒలింపిక్ సంఘం ఆశాభావంలో ఉంది. గతంలో యూ23 అవతారంలో ఒలింపిక్స్‌లో ఫుట్‌బాల్ ప్రయోగం చేశారు. కానీ, ఆదరణ, ఆదాయం అంతంతే! టెన్నిస్, గోల్ఫ్లను చేర్చుకున్నా, ప్రథమశ్రేణి పేర్లు కనపడలేదు. ఇక, వరు ణుడి కరుణపై ఆధారపడడం క్రికెట్‌కు మరో తలనొప్పి. తాజా ఏషియాడ్‌లో వాన వల్ల మ్యాచ్ రద్దయి, టీ20 ర్యాంకింగ్‌ను బట్టి స్వర్ణపతక విజేతను నిర్ణయించిన ప్రహసనం చూశాం. ఇక, 2036 ఒలింపిక్స్‌ను భారత్‌లో నిర్వహించేలా సర్వశక్తులూ ఒడ్డుతామని మోదీ ప్రకటించడం సంతోషమే అయినా, సాధ్యాసాధ్యాలపై అనుమానాలున్నాయి. జీ20 సదస్సు, ఏషియాడ్‌లో పతకాల శతకం తెచ్చిన ఉత్సాహంలో ప్రధాని దీన్ని ‘140 కోట్ల ప్రజల స్వప్నం’గా పేర్కొన్నారు. కానీ, వేల కోట్లతో స్టేడియమ్‌లు నిర్మించేకన్నా సామాన్యులకు కూడుగూడుపై దృష్టి పెట్టాలనే వాదనని విస్మరించలేం. భారీ ఖర్చు రీత్యా 2026 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడానికి సైతం ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. ఇక, 2010లో మన కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. అప్పట్లో భారత ఒలింపిక్ అసోసియేషన్‌ను 14 నెలలు ఐఓసీ బహిష్కరించింది. అవన్నీ మనం మర్చి పోరాదు. 2035 నాటికి భారత్ 6 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ అవుతుందనీ, 2047కి అగ్రరాజ్యంగా అవతరిస్తామనీ జబ్బలు చరుస్తున్న వేళ ఒలింపిక్స్ స్వప్నం వసతులు పెంచుకోవడానికీ, క్రీడా ప్రతిభను పెంచిపోషించుకోవడానికీ ఉపయుక్తమే! దాని వెంటే ఉన్న సవాళ్ళతోనే సమస్య. తలసరి ఆదాయంలో మనల్ని ఎంతో మించిన లండన్, టోక్యో, ప్యారిస్, సియోల్లకున్న సహజ మైన సానుకూలత మనకుందా? సంబరం ముగిశాక ఏథెన్స్, రియో లాంటి ఆతిథ్య దేశాలకు ఐరావతాలుగా మారి క్రీడాంగణాల్ని వాడుకొనే ప్రణాళిక ఉందా? పేరుప్రతిష్ఠలతో పాటు ప్రజలకూ పనికొచ్చేలా వ్యూహరచన చేస్తేనే ఎంత రంగుల కలకైనా సార్థకత. -
మానవత్వం మరిస్తే...
పది రోజులైంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ప్రాంత తీవ్రవాద గ్రూపు హమాస్ జరిపిన దాడి తాలూకు ప్రకంపనలు ఆగేలా లేవు. హమాస్‌ను తుదముట్టిస్తామంటూ గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడి అంతకంతకూ తీవ్రతరమవుతోంది. భూతల దాడులకు దిగడానికి సర్వసన్నద్ధమైంది. ఇప్పటికే గాజాను ఈ యూదు దేశం అష్టదిగ్భంధనం చేయడంతో అక్కడి పాలెస్తీనియన్లకు తినడానికి తిండి కాదు కదా తాగడానికి నీళ్ళయినా లేని పరిస్థితి. ఆగని యుద్ధంలో ఇప్పటికి 2600 మందికి పైగా పాలస్తీనియన్లు, ఇరువైపులా కలిపి 4 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పది వేల మందికి పైగా గాయపడ్డారు. పిల్లలు, స్త్రీలు, వృద్ధులనే తేడా లేకుండా, బాధితుల కనీసపాటి అవసరాలకు కూడా అక్కర లేకుండా అంతర్జాతీయ మానవతావాద చట్టానికి (ఐహెచ్ఎల్)కి నీళ్ళొది లేస్తున్న ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం చివరికి మానవ సంక్షోభంగా మారిపోయే సూచనలు న్నాయి. మానవతా దృక్పథం అవసరమనే అంతర్జాతీయ సమాజంలో ఇది ఆందోళన రేపుతోంది. పాలస్తీనా జనాభా 23 లక్షలైతే, 11 లక్షల మంది పైగా పౌరులు ఇజ్రాయెల్ హెచ్చరికలతో ఇప్ప టికే ఉత్తర గాజా విడిచివెళ్ళారు. అంటే సగం మంది నిరాశ్రయులయ్యారు. గాజా నుంచి ఈజిప్టులోకి వెళ్ళేందుకు రాఫా మార్గం తెరిచేందుకు దౌత్య యత్నాలు జరుగుతుండడంతో మరింతమంది అటూ వెళ్ళవచ్చు. యుద్ధం సృష్టించిన ఈ బీభత్సంలో సొంత గడ్డ విడిచివెళ్ళాల్సిన దైన్యంలో పడిన వీరి జీవితకాలపు దుఃఖాన్ని ఎవరు తీర్చగలరు? ఇజ్రాయెల్ భూతల దాడులు చేస్తే, ఇప్పటికే తిండి, నీళ్ళు, విద్యుత్తు, ఇంధనం లేక అల్లాడుతున్న ప్రాంతంపై అది అమానుష దాడి. హమాస్ మాటేమో కానీ, అన్నెం పున్నెం ఎరుగనివారు బలైపోతారు. ఐరాస ప్రతినిధి అన్నట్టు అది సామూహిక ఉరిశిక్ష వేయడమే! ‘ఆరుబయలు కారాగారం’గా పేరుబడ్డ గాజా ‘ఆరు బయలు శవాగారం’ అవుతుంది. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడినీ, వందలమంది మరణానికి కారణమైన తీరునూ, అమాయకు లను బందీలుగా తీసుకెళ్ళిన వైనాన్నీ మానవతావాదులు ఎవరూ సమర్థించరు. కానీ, ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్నదేమిటి? ఆత్మరక్షణ ధోరణిని అతిక్రమించి, గాజాను తుడిచిపెట్టేయాలనీ, పాల స్తీనాను ఉనికిలో లేకుండా చేయాలనీ తెగబడుతున్న తీరును ఏమనాలి? ఒకప్పుడు సురక్షితంగా బతకడానికి తమకంటూ ఓ దేశం కావాలని మొదలైన యూదులు నాటి సువిశాల ఒట్టోమన్ సామ్రా జ్యంలో పాలస్తీనా ప్రావిన్స్‌లో భూములు కొనడంతో ఆరంభించారు. మొదటి ప్రపంచ యుద్ధానంతర పరిణామాల్లో చివరకు పాలస్తీనా విభజనకూ, 1948లో స్వతంత్ర ఇజ్రాయెల్ ఏర్పాటుకూ కారణమయ్యారు. ఆనాడు పాలస్తీనాకు యూదులు వలసొస్తే, ఈనాడు పాలస్తీనియన్లు వలస పోతున్న పరిస్థితి. రావణకాష్ఠంలా సాగుతున్న పాలస్తీనా అంశంలో ఇరుపక్షాల తప్పులూ కొల్లలు. ఇజ్రాయెల్ – పాలస్తీనా అంశాన్ని ముస్లిమ్ – యూదు సమస్యగా చిత్రీకరించి, అగ్నికి ఆజ్యం పోస్తున్న ఇరుపక్షాల దేశాలకూ చివరకు స్వప్రయోజనాలే కీలకం. పెదవులపై సానుభూతి, ఆయుధాలు అందించి యుద్ధాన్ని పెద్దది చేయడంతో పెరిగే మంటలు ప్రజలకు పనికిరావు. గాజా కేవలం 41 కి.మీ.ల పొడవాటి చిన్న భూభాగమే కావచ్చు. దాన్ని కైవసం చేసుకోవాలన్న ఇజ్రాయెల్ ఆకాంక్ష నెరవేరడం సులభమేమీ కాదు. గతంలో 2009లో 15 రోజులు, 2014లో 19 రోజులు గాజాపై ఇజ్రాయెల్ దండయాత్ర చేయకపోలేదు. అన్నిటికీ యుద్ధం పరిష్కారమైతే అనేక సమస్యలు ఏనాడో పరిష్కరమయ్యేవి. పాలస్తీనియన్లలో 44 శాతం మంది 2006లో తీవ్రవాద హమాస్‌కు ఓటు వేసి తప్పు చేశారు. దానికి ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారు. అన్నీ కోల్పోయి, భవితపై ఆశ లేని దుఃస్థితికి వచ్చారు. ప్రాణాలు అరచేత పెట్టుకొని పారిపోదామన్నా అభ్యంతరం చెబుతూ, అమాయకులైన వారినే హమాస్ అడ్డం పెట్టుకొంటున్న వార్తలు విచారకరం. ఈ పరిస్థితుల్లో ఈ యుద్ధం తక్షణం ఆగేందుకు ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నించాలి. బాధితులకు తక్షణ సాయం, శాంతిస్థాపన తక్షణ కర్తవ్యం కావాలి. దురదృష్టవశాత్తూ ప్రపంచ దేశాలు రెండు వర్గాలుగా చీలిపోయి మాట్లాడుతున్నాయి. అయితే, హమాస్ దాడితో వచ్చిన సానుభూతి క్షీణిస్తూ, విమర్శలు పెరగడాన్ని ఇజ్రాయెల్ సైతం గమనిస్తోంది. గాజాకు అత్యవసర సాయం అందేందుకు దోవ ఇస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతెన్యాహూ అన్నట్టు తాజా వార్త. అలాగే, దాడులు ఆపేస్తే ఇజ్రాయెలీ బందీలను హమాస్ విడిచిపెడతానందని ఇరాన్ మాట. హమాస్ నుంచి ఆ మేరకు అధికారిక ప్రకటన రాలేదు కానీ, యుద్ధాన్ని ఆపే అలాంటి కనీస ప్రయత్నాలు అత్యవసరం. మన సంగతికొస్తే, మునుపటితో పోలిస్తే భారత ఆర్థిక సౌభాగ్యానికీ, జాతీయ భద్రతకూ ఇటీవల అతి కీలకమైన మధ్యప్రాచ్యంపై దేశంలో అధికార, ప్రతిపక్షాలు దేశీయంగా హిందూ, ముస్లిమ్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం మానాలి. ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకొని, క్రమం తప్పకుండా సమావేశమై, మారుతున్న పరిస్థితుల్నీ, మన దేశం అనుసరిస్తున్న వ్యూహాన్నీ ఎరుకపరచాలి. సంక్షోభం ముదురుతున్న వేళ సమతూకమే భారత మంత్రం. యుద్ధంలో మానవీయ చట్టాలను గౌరవించాల్సిందిగా ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేయాలి. హమాస్ దుశ్చర్యకు గాజాలో అమాయకులపై ప్రతీకారం అర్థరహితమని నచ్చజెప్పాలి. అలాగే, హమాస్ వద్ద బందీలైన ఇజ్రాయెలీలను వెంటనే విడిపించేందుకు అరబ్ మిత్ర దేశాలు పాటుపడేలా కృషి చేయాలి. అటు ఇజ్రాయెల్‌తోనూ, ఇటు ఇరాన్, ఖతార్ మొదలు సౌదీ అరేబియా, ఈజిప్ట్ దాకా మధ్యప్రాచ్యంలోని కీలక దేశాలతోనూ ఉన్న సత్సంబంధాల రీత్యా భారత్ ఈ యుద్ధానికి తెరపడేలా చూడాలి. మధ్యప్రాచ్యాన్ని కమ్ముకొస్తున్న మానవ సంక్షోభాన్ని నివారించాలి. -
శాంతి అనిత్యం, యుద్ధమె నిత్యం
బతుకు–చావు, యుద్ధమూ–శాంతి, ప్రేమ–విద్వేషం, కారుణ్యం–కర్కశత్వం... ఇవి పరస్పర వ్యతిరిక్తాలూ, ఒకదానికొకటి ఎంతో దూరాలూ అనుకుంటాం. కానీ, వాస్తవంలో ఎంత దగ్గరగా ఉంటాయో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. బతుకును అంటిపెట్టుకునే చావు ఉంటుందని తెలిసినా; అది హత్యో, ఆత్మహత్యో, యుద్ధం పేరిట సామూహిక హత్యో కాక, సహజ మరణమైతే, ఆ దారి వేరు. బతుక్కీ, చావుకీ మధ్య ఉంటుందనుకునే దూరాన్ని చెరిపివేస్తూ హఠాత్తుగా యుద్ధాలు బద్దలవుతాయి. ఇజ్రాయెల్–పాలస్తీనాల మధ్య పదిరోజుల క్రితం మొదలైన యుద్ధం ఇప్పటికే వేలసంఖ్యలో బతుకు దీపాలను ఆర్పివేసింది. బతుకునిచ్చే అమ్మతనాన్ని భక్తితో స్మరించుకుంటూ తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాలలో అమ్మవారిని మన దగ్గర కొలుచుకోనున్న రోజుల్లోనే, అక్కడ ఆ మూల సమరనాదాలు, తల్లుల గర్భశోకాలు మిన్నంటడం వైచిత్రి. అమ్మ ఎక్కడైనా అమ్మే! అమ్మకు, అమ్మతనానికి ప్రాంత, మత, భాషాభేదాలు లేవు. చారిత్రకంగా చూసినా ఒకప్పుడు ప్రపంచమంతటా మొదటగా కొలుపులందుకున్నది అమ్మే; అయ్య కొలుపు ఆ తర్వాతే వచ్చింది. అమ్మ అంటే అన్నమూ, అభయమూ కూడా! అమ్మవారిని ధనలక్ష్మిగాను, ధాన్యలక్ష్మిగానూ కూడా భావించుకుంటాం. అమ్మ చేతుల్లో వరికంకులను, చెరుకుగడలను అలంకరిస్తాం. అమ్మకు రకరకాల అన్నాలు ఇష్టమని చెప్పి నివేదించి ఆ అన్న ప్రసాదాలను మనమే ఆరగిస్తాం. మన దగ్గరే కాదు, ఒకప్పుడు అమ్మ ఆరాధన ఉన్న ప్రతిచోటా అమ్మను అన్నానికి ప్రతీకగానే కొలిచారు. అమ్మను బతుకమ్మ అనడంలోనే, పది కాలాలపాటు సుఖశాంతులతో బతికించే అమ్మ ఆశీస్సు ఉంది. అమ్మను కొలుస్తూనే అమ్మ మనసుకు దూరమై యుద్ధానికి దగ్గరవడమే మనిషి జీవితంలోని పెను విషాదం. తను దగ్గరవడమే కాదు; అన్నసాధనాలు ధరించిన అమ్మ చేతుల్లో కూడా ఆయుధాలు ఉంచి; అన్నపూర్ణను ఆయుధపూర్ణగా మలచిన చరిత్ర మనిషిది. మానవ చారిత్రక ప్రస్థానంలో ఇది ఎప్పుడు మొదలైందో కానీ, ఇప్పటికీ తనకు యుద్ధమే కావాలో శాంతే కావాలో తేల్చుకోలేని సందిగ్ధంలోనే మనిషి ఉన్నాడు. యుద్ధానికీ, శాంతికీ మధ్య మనిషి చక్రభ్రమణం నిరంతరాయంగా సాగుతూనే ఉంది. యుద్ధమే ప్రధానమై శాంతి ఎంత అప్రధానమైందంటే,రెండు యుద్ధాల మధ్య తాత్కాలిక విరామాన్నే శాంతిగా నిర్వచించుకునే పరిస్థితికి వచ్చాం. శాంతికాలంలో యుద్ధాన్ని జపించడం, యుద్ధకాలంలో శాంతిని స్మరించడం మనిషికి పరిపాటిగా మారింది. యుద్ధం కడుపున శాంతిశిశువును, శాంతి కడుపున యుద్ధశిశువును కోరుకోవడమూ అంతే నిత్యసత్యమైంది. యుద్ధమొచ్చి శాంతిని చెదరగొడుతున్నట్టు భ్రమిస్తాం కానీ; వాస్తవానికి శాంతే మధ్య మధ్య వీచే మలయమారుతమై ప్రచండమైన యుద్ధపు వేడిగాడ్పులకు అవరోధ మవుతోందన్న ఎరుక మనకు లేదు. యుద్ధమే ఇక్కడ శాశ్వతంగా తిష్ఠవేసిన చుట్టమై; శాంతి ఎప్పుడైనా తొంగిచూసే అతిథి మాత్రమైంది. యుద్ధమనే ఎడారిలో శాంతీ, సుఖసంతోషాల ఒయాసిస్‌లను లియో టాల్‌స్టాయ్ నవల ‘యుద్ధమూ–శాంతీ’ అద్భుతంగా కళ్ళకు కట్టిస్తుంది. అమెరికా అంతర్యుద్ధం దరిమిలా ఎంత విధ్వంసం జరిగిందో, ఎందరి బతుకులు తలకిందులయ్యాయో మార్గరెట్ మిచెల్ నవల ‘గాన్ విత్ ద విండ్’ అనితరసాధ్యంగా చిత్రిస్తుంది. ఇంకా వెనక్కి, మహాభారతానికి వెడితే, యుద్ధాన్ని యజ్ఞంగా పేర్కొని పవిత్రీకరించడమే కాదు; రోగమొచ్చి చావడం కన్నా యుద్ధంలో చావడం పరమపుణ్యప్రదమని కీర్తించడం కనిపిస్తుంది. చివరికది అపార జననష్టంతో పాటు, యోధజాతి మొత్తం ఎలా తుడిచిపెట్టుకుపోయిందో ఒక మహావిలయ సదృశంగా చిత్రిస్తుంది. అందులోని స్త్రీపర్వం మొత్తం భర్తలను, కొడుకులను, తండ్రులను, సోదరులను కోల్పోయి గుండెలు బాదుకునే స్త్రీ నిర్భరశోకాన్ని కరుణ రసార్ద్రంగా వినిపిస్తుంది. ఆ దుఃఖం గాంధారినోట శాపంగా మారి యాదవకుల విచ్ఛిత్తి రూపంలో మరో విధ్వంసం వైపు నడిపిస్తుంది. యుద్ధాన్ని ఆకాశానికెత్తిన మహాభారతమే, దాని విపరీత పర్యవసానాలను ఎత్తిచూపి సామాన్యులూ, మాన్యులైన మునులూ కూడా తీవ్రంగా గర్హించిన సంగతినీ నమోదు చేయడం విశేషం. యుద్ధపశ్చాత్తాపం జీవితాంతమూ ధర్మరాజును ఎంతగా వెన్నాడుతూ వచ్చిందంటే, అశ్వమేధయాగాన్ని తలపెట్టి అర్జునుని అశ్వం వెంట పంపిస్తూ, రాజులను ఓడించు కానీ ప్రాణనష్టం మాత్రం కలిగించవద్దని హెచ్చరించవలసి వచ్చింది. ప్రాంతాలు, మతాలు, సంస్కృతులు, భాషల మధ్య ఎక్కడా కనిపించనంత సాదృశ్యం యుద్ధాలలో కనిపిస్తుంది. యుద్ధరూపంలోని ఊచకోత ఎక్కడైనా ఒక్కలానే ఉంటుంది. గ్రీకు మహాకవి హోమర్ చెప్పిన ఇలియడ్ అచ్చం మహాభారతానికి ప్రతిబింబంలా ఉంటుంది. అది చిత్రించిన ట్రాయ్ యుద్ధం చివరిలో కూడా అయినవారిని కోల్పోయిన తల్లులు, భార్యల దుఃఖారావాలూ, ఆర్తనాదాలూ గుండెల్ని పిండివేస్తాయి. ఇన్ని అనుభవాలున్నా; ఇన్నిన్ని శోకసముద్రాలు కట్టలు తెంచుకున్న ఉదాహరణలు కళ్ళముందున్నా మనిషిలో యుద్ధోన్మాదం ఉపశమించలేదు; సమర మోహం తీరలేదు; రుధిరదాహం చల్లారలేదు. శాంతియుతంగా జీవించడం మనిషి ఇప్పటికీ నేర్చు కోలేదు. యుద్ధంలో చివరికి అటూ ఇటూ విజితులే తప్ప విజేతలెవరూ ఉండరనీ; మిగిలేవి శవాలూ, జీవచ్ఛవాలు మాత్రమేనన్న నిష్ఠురసత్యాన్ని మనిషి ఇప్పటికీ జీర్ణించుకోలేదు. బతుకు నిచ్చే, బతకనిచ్చే అమ్మతత్వానికి దూరంగా చావు దిశగా ఈ చీకటి ప్రస్థానం ఎంతకాలం?! -
బీసీ ‘కమలం’!
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికి తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మూడో స్థానంలో ఉన్నది. కర్ణాటక ఎన్నికలకు ముందు కొంతకాలంపాటు అది రెండో స్థానంలో ఉన్న భావన కనిపించింది. రాష్ట్రంలో ఉన్న బలమైన పునాది కారణంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఉత్తేజంతో వేగంగా కోలుకొని, బీజేపీని వెనక్కు నెట్టి, రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇంకొన్ని ఇతర కారణాలు కూడా ఈ పరిణామానికి దోహదపడి ఉండవచ్చు. ఇప్పుడున్న వరసక్రమం – బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఇదే క్రమం కొనసాగుతుందా? కచ్చితంగా చెప్పడం కష్టం. వరస మారడానికి అవకాశాలు పుష్కలం. గడచిన కొన్నేళ్లుగా బీజేపీ సృష్టిస్తున్న రాజకీయ సంచలనాలను గమనంలోకి తీసుకుంటే ఆ పార్టీ మన అంచనాలను తలకిందులు చేయగల అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయ లేము. ఇంతకుముందు రెండుసార్లు (1998, 2019) జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఇరవై శాతం ఓట్లను తెలంగాణలో సాధించింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆ పార్టీ పూర్తిగా చతికిలబడుతూ వస్తున్నది. ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచీ కూడా మన దగ్గర ముఖాముఖి పోటీలకే ప్రాధాన్యత లభించడం చూస్తున్నాం. 1978లో రెడ్డి కాంగ్రెస్, 2009లో ప్రజా రాజ్యం బలంగా ముందుకొచ్చినా ఇరవై శాతం ఓట్లను దక్కించుకోలేదు. ఒక్క టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మాత్రమే ఈ ప్రాంతంలో మూడో పక్షానికి ఆదరణ లభించడం మొదలైంది. గత రాజకీయ చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించిన బీజేపీ నాయకత్వం, ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నప్పటికీ పోలింగ్ నాటికి బలంగా ముందుకు రాగల అవకాశాలున్నాయని గుర్తించింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రెండుమార్లు ఇరవై శాతానికి పైగా ఓట్లు సాధించిన అనుభవాన్ని బట్టి, రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించే ఛాన్స్ ఉన్నట్టయితే అంతకంటే ఎక్కువ ఓట్లు రాబట్టడం కష్టం కాదని ఆ పార్టీ అంచనా వేస్తున్నది. ప్రస్తుతం నెలకొన్న ముక్కోణ పోటీ పరిస్థితుల్లో తమ మూడో కోణాన్ని బీసీ కోణంగా మలచడం ద్వారా సంచలనం సృష్టించాలనే నిర్ణయానికి బీజేపీ వచ్చినట్టు సమాచారం. అధికార బీఆర్ఎస్కు వందమందికి పైగా సిటింగ్ ఎమ్మెల్యేలున్న కారణంగా టిక్కెట్ల పంపిణీలో ప్రయోగాలు చేసే అవకాశం దానికి లేకుండా పోయింది. కాంగ్రెస్‌కు ప్రయోగాలు చేసే అవకాశం ఉన్నది. 34 మంది బీసీలకు టిక్కెట్లు ఇవ్వబోతున్నట్టు కూడా ఆ పార్టీ నేతలు ప్రకటించారు. కానీ ఇప్పుడు వెలువడుతున్న సూచనలను బట్టి ఆ పార్టీ మాట నిలబెట్టుకునే అవకాశాలు దాదాపుగా లేవని తెలుస్తున్నది. టిక్కెట్లు ఇవ్వక పోగా బీసీ నాయకుల పట్ల కాంగ్రెస్ నాయకత్వం ఈసడింపు ధోరణితో వ్యవహరిస్తున్నదనే వార్తలు గుప్పుమంటున్నాయి. కొద్దిరోజుల క్రితం రేణుకా చౌదరి నేతృత్వంలో కమ్మవారి ప్రతినిధుల బృందం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవడానికి వెళ్లింది. ఆగమేఘాల మీద వారికి పార్టీ అగ్రనేతల అపాయింట్మెంట్లు లభించాయి. సుమారు 40 నియోజకవర్గాల్లో ఫలితాలను తారుమారు చేసే శక్తి తమ వర్గానికి ఉన్నదనీ, కనీసం పది సీట్లయినా తమకు కేటాయించాలని కోరారట! ఆరు స్థానాల వరకు కేటాయించడానికి అధిష్ఠానం సుముఖత వ్యక్తం చేసినట్టు వార్తలొ చ్చాయి. రెండు శాతం జనాభా గల బృందాన్ని సాదరంగా ఆహ్వానించి ఆరు సీట్లు ఆఫర్ చేసిన అధిష్ఠానం 54 శాతం జనాభా గల తమకెంత రాచమర్యాదలు చేస్తుందోనని ఊహించుకుని బీసీ నేతలు కొందరు ఢిల్లీ బాట పట్టారు. వారం రోజులపాటు ఢిల్లీ ఫుట్‌పాత్‌ల మీద కాలక్షేపం చేయడం తప్ప వీరికి అగ్రనేతల దర్శనభాగ్యం మాత్రం లభించలేదు. నానా తంటాలు పడి కాళ్లావేళ్ళా పడ్డ మీదట కేసీ వేణుగోపాల్ అనే ప్రధాన కార్యదర్శి ఓ పది నిమిషాలు టైమిచ్చాడట! ఇద్దరు మాజీ ఎంపీలు, ఇతర కీలక బాధ్యతలు వెలగబెట్టిన ప్రముఖ బీసీ నేతలు ఈ బృందంలో ఉన్నారు. ఈ ప్రతినిధులకు మాట్లాడే అవకాశం ఏమాత్రం ఇవ్వకుండానే వేణుగోపాల్ విరుచుకు పడ్డాడని సమాచారం. ‘మీకు టిక్కెట్లిస్తే గెలవరు. మీలో పెద్దపెద్ద నాయ కులకు సైతం డిపాజిట్లు రావు. పార్టీ గెలవాలని ఉందా? లేదా? గెలవాలనుకుంటే సర్దుకుపొండి’ అంటూ విసుక్కున్నాడట! పొన్నాల లక్ష్మయ్యను సస్పెండ్ చేసి పారేస్తానని కూడా వేణుగోపాల్ హెచ్చరించాడట! అదృష్టవశాత్తు ఈ బృందంలో పొన్నాల లేడు. బృంద సభ్యులు అవమాన భారంతో తలలు వంచుకొని వెనుదిరగడం తప్ప మాట్లాడే అవకాశం మాత్రం లభించలేదు. 45 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అనుబంధాన్ని నిన్న పొన్నాల తెంచే సుకున్నారు. అవమాన భారంతో గుండె మండిపోయిన తర్వాతనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షుని అపాయింట్ మెంట్ కోసం ఏడాది పాటు ప్రయత్నించినా పొన్నాలకు చేదు అనుభవమే మిగిలిందని ఆయన అనుచరులు వాపోయారు. ఢిల్లీలో పది రోజుల పాటు కాళ్లరిగేలా తిరిగినా పొన్నాలకు ఏ నాయకుడి అపాయింట్‌మెంటూ దొరకలేదు. అమెరికాలో ఉన్నతో ద్యోగం చేస్తూ 1980లోనే ఇండియా వచ్చి కాంగ్రెస్‌లో చేరిన వ్యక్తి పొన్నాల. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, పన్నెండేళ్లు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్‌కు మొట్ట మొదటి అధ్యక్షుడు. అటువంటి వ్యక్తికి జరిగిన సత్కారాన్ని చూసి పార్టీలోని బీసీ నేతలు ఖిన్నులవుతున్నారు.కాంగ్రెస్ పార్టీలోని యువ నాయకులకు ఫోన్లు చేసి మరీ ‘ఈ పార్టీలో బీసీలకు భవిష్యత్తు లేదు. బీజేపీలోకో, బీఆర్ఎస్లోకో వెళ్లండ’ని సీనియర్ బీసీ నేతలు సలహా ఇస్తున్నారు. ఈ రాజకీయ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవా లని బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చింది. 54 శాతం జనాభా ఉన్న బీసీ బాణాన్ని తన ప్రధానాస్త్రంగా ప్రయోగించేందుకు ఆ పార్టీ సమాయత్తమవుతున్నది. దేశానికి మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రిని అందించిన పార్టీ తమదేనని ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ సంస్థాగత పదవుల్లో బీసీలకు ప్రాధాన్యతను ఇవ్వడం ప్రారంభించింది. బీసీ వర్గానికి చెందిన డాక్టర్ కె. లక్ష్మణ్ గతంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా పనిచేయడమే గాక ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఓబీసీ మోర్చాకు అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక చేయించి పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా నియమించారు. దేశవ్యాప్తంగా పదమూడు మంది మాత్రమే ఉండే ఈ బోర్డులో స్థానం దక్కడం ఒక అరుదైన గౌరవం. మొన్నటివరకూ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన బండి సంజయ్‌ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈటల రాజేందర్‌కు ప్రధానమైన ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ పదవి లభించింది. ఈటల ఆధ్వర్యంలో జరిగిన ముదిరాజ్ ఆత్మగౌరవ సభ విజయం సాధించడంతో బీజేపీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ ఎన్నికల్లో బీసీ అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమైంది. పార్టీ అంతర్గత లెక్కల ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఆరేడు స్థానాల్లో బీజేపీ సులభంగా గెలవగలుగుతుంది. అంటే అక్కడ పార్టీ మొదటి స్థానంలో ఉన్నట్టు లెక్క. మరో పదిహేను నుంచి ఇరవై స్థానాల్లో రెండో స్థానంలో ఉన్నట్టు ఆ పార్టీ భావిస్తున్నది. నాలుగు నుంచి ఎనిమిది శాతం వరకు అదనపు ఓట్లను పొందగలిగితే ఈ రెండో స్థానం సీట్లను గెలవగలుగుతుంది. ఎకాయెకిన అన్ని ఓట్లను అదనంగా సంపాదించే మార్గం బీసీ మంత్రమేనన్న అభిప్రాయంతో బీజేపీ వ్యూహం రూపొంది స్తున్నట్టు తెలుస్తున్నది. వ్యూహం ఫలిస్తే బీజేపీ ఖాతాలో పాతిక సీట్లు పడతాయి. పాతిక సీట్లు గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన గేమ్ తన చేతిలోనే ఉంటుందని దాని అంచనా. మెజారిటీ స్థానాల్లో పార్టీ మూడో స్థానంలోనే ఉన్నందువల్ల ప్రయోగాలు చేయడానికి ఎటువంటి ఇబ్బందీ లేదు. బలంగా ఉన్న 25 సీట్లతోపాటు మిగిలిన అన్రిజర్వ్డు సీట్లతో కలిపి నలభై స్థానాలకు పైగా బీసీలకు కేటాయించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు భోగట్టా. మొట్టమొదటిసారిగా ఒక బీసీ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలిలో ఎన్నడూ లేనివిధంగా 27 మంత్రి పదవులూ, పార్టీ పరంగా సంస్థా గత పదవులతోపాటు ఎక్కువ ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించిన పార్టీగా ప్రచారం చేసుకుని బీసీ ఓటర్లలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. తెలంగాణలో జనసంఖ్య పరంగా వరసగా ముదిరాజ్ – గంగపుత్ర, యాదవ – కురుమ, గౌడ, మున్నూరు కాపు, పద్మశాలి, రజక, వడ్డెర బలమైన కులాలు. ముదిరాజ్, మున్నూరు కాపు వర్గాల్లో బీజేపీకి ఇప్పటికే బలమైన నాయకత్వం, పలుకుబడి ఉన్నాయి. ఎమ్మెల్యే టిక్కెట్లను అధికంగా కేటాయించడం ద్వారా మిగిలిన కులాల్లో ప్రాబల్యం సంపాదించడానికి ఆ పార్టీ ప్రయత్నించవచ్చు. యాదవ కులానికి చెందిన డాక్టర్ కాసం వెంకటేశ్వర్లును అత్యంత ప్రాధాన్యత కలిగిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. సాధారణంగా సామాజిక వర్గాలను ఆకర్షించడానికి రెండు మూడు నెలల ముందు చేసే ప్రయత్నాలు ఫలించవు. కానీ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని అనుకూలంగా మలచు కోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. పొన్నాల రాజీనామాపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించిన తీరు బీసీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెండు శాతం జనాభా గల అగ్రవర్ణానికి అడిగిందే తడవుగా అగ్రనేతల అపాయింట్మెంట్ లభించడం, బీసీ వర్గాల్లో దశాబ్దాల అనుభవం గల నాయకులకు కూడా దర్శనం దొరక్క పోవడంపై విస్తృతంగా చర్చ జరుగు తున్నది. ఈ చర్చ ఎటు దారితీస్తుందో వేచి చూడాలి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
మార్చింగ్ సాంగ్
నూరు గొడ్లను తిన్న ఒకానొక రాబందు ఓ చిరుగాలి వానకు గాయపడిందట! ఈ గాయం ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదమట! కానీ, గాయపడిన పిట్టల కోసం, రాలిపడిన పువ్వుల కోసం పరితపించడం మాత్రం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమట! పిట్టల గాయాలు మాన్పి నింగి లోకి ఎగరేయడం నేరమట! రాలిన పువ్వులను మాల కూర్చి మందిరానికి చేర్చడం పాపమట! తీతువులు నీతులు చెబుతున్నాయ్. గ్రద్దలు క్రుద్ధమవు తున్నాయ్. తోడేళ్లు తొడలు చరుస్తున్నాయ్! ఆంధ్రప్రదేశ్ పెత్తందారీ వ్యవస్థ నేడు ప్రజాస్వామ్య పాఠాలను బోధిస్తున్నది. దాని తాబేదార్లు తందానా అంటున్నారు. పెత్తందారీ ప్రజా స్వామ్యం కోసం వందిమాగధులు, భజంత్రీలు సహస్ర గళార్చన చేస్తున్నారు. రాబందుల స్వేచ్ఛపై ఆంక్షలేమిటి? రామోజీల ‘చీట్’లకు ఆటంకాలేమిటని ప్రశ్నిస్తున్నారు. తోడేళ్ల మందలు స్వైర విహారం చేసినంత మాత్రాన బంధిస్తారా? ప్రభుత్వ పెద్దలు ఖజానాకు కన్నం వేస్తే అరెస్టు చేస్తారా? అని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి గ్రహణం పట్టిందని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఊరేగుతున్నారు. ఇప్పుడక్కడ ఒక ప్రజాస్వామ్య యుద్ధం జరుగుతున్నది. కులం,మతం, ప్రాంతం, జాతి, స్త్రీ–పురుష వివక్ష లేకుండా భారత రాజ్యాంగం ప్రజలందరికీ ప్రసాదించిన హక్కులను వారికి దఖలు పరచడానికి, ఆదేశిక సూత్రాలను శిరసావహించడానికి అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ప్రతిపక్షం, దాని తైనాతీల రూపంలో ఘనీభవించిన పెత్తందారీ వ్యవస్థ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటున్నది. దాని దశకంఠాలు రణరంకెలు వేస్తున్నయ్. దాని వేయి చేతులు కత్తులు దూస్తున్నయ్. పేద ధనిక తేడా లేకుండా పుట్టిన ప్రతిబిడ్డ ఆనందంగా ఆరోగ్యంగా పెరగడం కోసం, ఉన్నత లక్ష్యాల వైపు స్వేచ్ఛగా పరుగెత్తగలగడం కోసం, అందలాలు అందుకోవడం కోసం సమానావకాశాలుండాలని రాజ్యాంగం వాంఛించింది. ఆ వాంఛితానికి వాస్తవ రూపు కట్టడం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. పెత్తందారీ వ్యవస్థ ప్రయోజనాలకు ఈ ప్రయత్నాలు వ్యతిరేకం. కనుకనే తెలుగుదేశం – యెల్లో మీడియాల సేనాధిపత్యంలో మోహరించిన పెత్తందారీ వ్యవస్థ యుద్ధం ప్రకటించింది. అందుకే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పోరాటాన్ని ‘క్లాస్ వార్’గా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ‘వర్గ పోరాటానికి’ తన సేనావాహినిని సమాయత్తం చేస్తూ ఈ వారం విజయవాడలో వైఎస్ జగన్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మండలం, ఆ పైస్థాయి పార్టీ నేతలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘మీరే నా సేనాపతులు. మీరే నా దళపతులు’... అంటూ ఈ సమావేశంలో ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. నిజానికది ప్రసంగం కాదు. ఒక మార్చింగ్ సాంగ్. కవాతు గీతం. ‘పదండి ముందుకు, పదండి తోసుకు... పోదాం పోదాం పైపైకి! కదం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ’ అని శ్రీశ్రీ చెప్పినట్టుగా సాగిందా ప్రసంగ పాఠం. ప్రజలందరికీ సమాన హక్కుల కోసం, సమాన అవకాశాల కోసం తన ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ‘మాగ్నా కార్టా’పై ఆయన తన దళపతులకు సంపూర్ణ అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. నా... నా... నా... నా... నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా అగ్రకులాల పేదలు అని పదేపదే సంబోధిస్తూ ఆయన తన పొలిటికల్ ఫిలాసఫీని ఘంటాపథంగా ప్రకటించారు. ఆ ఫిలాసఫీని పార్టీ నాయకశ్రేణుల మెదళ్లలోకి బలంగా జొప్పించే ప్రయత్నం చేశారు. గడిచిన ఎన్నికల్లో మేనిఫెస్టో రూపంలో ప్రకటించిన ‘మాగ్నాకార్టా’ను 99 శాతం అమలు చేశామని ఆయన ఈ సభలో ప్రకటించారు. ‘‘ఈ 52 మాసాల్లో మనం చేసిన మంచే మన బలం... మన ధైర్యమని చెబుతూ ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాం. దేవుడి దయ మనకు తోడుగా ఉన్నది. చేసిన అభివృద్ధి కళ్లెదుట కనిపిస్తున్నది. కనుక ’వై నాట్ 175‘ అనేది మన లక్ష్యం కావాల’’ని పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే ప్రయత్నం చేశారు. ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలుచేస్తూ సాగిన ఐదేళ్ల పదవీ కాలానికి ఒక వినూత్నమైన క్లైమాక్స్ సన్నివేశాన్ని ప్రజా ఉద్యమ రూపంగా మలిచి ఆయన పార్టీ శ్రేణుల ముందుంచారు. ఈ ఉద్యమం నాలుగు రూపాల్లో సంక్రాంతి పండుగ దాకా కొనసాగుతుంది. ఆ తర్వాత పెన్షన్ల పెంపుతో సహా మరో మూడు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖాన్ని పూరించబోతున్నది. ఈ నాలుగంచెల ఉద్యమంలో భాగంగా పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికీ, ప్రతి ఓటరుకూ చేరువవుతాయి. ‘మా పరిపాలనలో మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటేయండ’ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క మాటతోనే ఆయన పార్టీ సగం యుద్ధాన్ని గెలిచింది. అదే సందేశాన్ని పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటి గడప ముందు వినిపిస్తారు. క్లైమాక్స్‌లోని మొదటి ఉద్యమ రూపం – ‘జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం’. ఇది ప్రారంభమై పదిహేను రోజులు విజయవంతంగా నడిచింది. ఇంకో ఇరవై ఐదు రోజులు కొనసాగుతుంది. ఇందులో భాగంగా పదిహేను వేల ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామాన్నీ, ఇంటినీ జల్లెడపడుతున్నారు. ఈ శిబిరాలు అందరికీ పరీక్షలు చేసి, సమస్యలున్నవారికి మందులు ఇవ్వడానికి మాత్రమే పరిమితం కావడం లేదు – జబ్బులున్న వారినీ, దీర్ఘకాలిక రోగా లున్నవారినీ కూడా గుర్తించి వారికి చేయూతనిచ్చి రోగం నయమయ్యే దాకా నిలబెట్టే కార్యక్రమాన్ని కూడా డిజైన్ చేశారు. ఈ శిబిరాలు జరిగినన్ని రోజులు ఊరూవాడా అంతటా ఆరోగ్య రంగంపై చర్చ జరుగుతుంది. ప్రభుత్వ వైద్య సేవలు నాడు ఎలా ఉన్నాయి, నేడు ఎలా ఉన్నాయనే చర్చ జరుగుతుంది. యాభై వేలకు పైగా వైద్య సిబ్బందిని కొత్తగా నియమించడం, ఊరూరా వెలసిన ఆరోగ్య కేంద్రాలు, పటిష్ఠమైన పీహెచ్‌సీలు, అందు బాటులోకి ఫ్యామిలీ డాక్టర్ పథకం, అంబులెన్స్ సర్వీసులు, కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలు వగైరా విషయాలన్నింటిపై జనంలో చర్చ జరుగుతుంది. వారికి అవగాహన పెరిగి, వైద్య సేవలను గరిష్ఠంగా వినియోగించు కోగలుగుతారు. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనేది రెండో దశ కార్యక్రమం. ఇది కూడా నలభై రోజుల దీక్ష. ఇందులో కూడా పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటి తలుపునూ తడతారు. ఐదేళ్లలో వచ్చిన మార్పులను గుర్తు చేస్తారు. పరిపాలనా వికేంద్రీకరణనూ, కొత్త జిల్లాలను, గ్రామ సచివాలయాలను, వలంటీర్ వ్యవస్థను, వాటి ప్రయోజనాలనూ గుర్తు చేస్తారు. చేరువైన ఆరోగ్యరంగాన్నీ, మెరుగైన విద్యా వ్యవస్థనూ పరిశీలించాలని చెబుతారు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఆర్బీకే సెంటర్లనూ, వాటి ప్రయోజనాలనూ వివరిస్తారు. మొత్తంగా ఆ ఇంటికీ, ఊరికీ, ఆ ప్రాంతానికీ జరిగిన మేలును విడమర్చి చెబుతారు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వాల పనితీరును తులనాత్మక పరిశీలనకు పెడతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులంతా పాల్గొనే సామాజిక బస్సు యాత్రలు రెండు మాసాలపాటు సాగుతాయి. సామాజిక న్యాయానికి జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత, వేసిన పెద్దపీట ఈ యాత్రలలో హైలైట్ అవుతుంది. రాజకీయ ఆర్థిక ఆధ్యాత్మిక విద్యా రంగాల్లో ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన సామాజిక న్యాయం, బాబు హయాంలో జరిగిన దురన్యాయాలు చర్చకు వస్తాయి. ‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు? బీసీలు జడ్జీలుగా పనికిరారు, బీసీల తోకలు కత్తిరిస్తా..’ అనే భావజాలానికీ, ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ’ అనే భావ జాలానికీ మధ్య ఉన్న తేడాను జనం గుర్తిస్తారు. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా’ అనే పురుషాహంకారానికీ, మహిళా సాధికా రత స్వరానికీ మధ్య గల తేడాను ప్రజలు అర్థం చేసుకుంటారు. ఆఖరి దశలో జరిగే ‘ఆడుదాం ఆంధ్రా’ అనే కార్యక్రమం ఒక యువ చేతనా ఉద్యమం. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా క్రీడా రత్నాలను వెలికితీసే యజ్ఞం. లక్షలాదిమంది యువకులు ప్రత్యక్షంగా ఈ యజ్ఞంలో పాల్గొంటారు. ఎన్ని కల ప్రచారానికి ముందు ఐదేళ్ల పాలనా కాలానికి వైసీపీ అధినేత రూపకల్పన చేసిన భారీ క్లైమాక్స్ సన్నివేశం ఇది. ఐదేళ్లు ఆధికారంలో ఉన్న తర్వాత ప్రతి గడప తొక్కడానికీ, ప్రతి గుండెను తడమడానికీ ఎంత ధైర్యం కావాలి? ‘నేను మంచి చేసి ఉంటేనే నాకు ఓటేయండి’ అని చెప్పడానికిఎంత నైతిక స్థైర్యం కావాలి? ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతున్న వైసీపీ ప్రభు త్వంతో తలపడేందుకు ప్రతిపక్ష శిబిరం దగ్గర ఉన్నదేమిటి? అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అవినీతికి పాల్పడి చట్టానికి దొరికిపోయి సెంట్రల్ జైల్లో సేద తీరుతున్న అధినాయకుడు. తండ్రి అరెస్టు తర్వాత పార్టీ శ్రేణులకు ధైర్యం ఇచ్చి నిలబడకుండా ఢిల్లీకి పారిపోయిన వార సుడు. నాయకుడు చేసిన అవినీతి గురించి వాదనలొద్దు, గవర్నర్ అనుమతి తీసు కోలేదు కనుక కేసు కొట్టేయాలని వాది స్తున్న ఖరీదైన లాయర్లు. ఒక సిద్ధాంతం, నిబద్ధత, మాట నిలకడ, విలువల కట్టు బాటు వంటివేమీ లేని ఒక నట భాగ స్వామి. ప్రతిపక్ష నేత సొంత పార్టీ కోమాలోకి జారుకోగా ఆయన సొంత కులం వారిని రెచ్చగొట్టి ఏవో కొన్ని కార్య క్రమాలను మమ అనిపిస్తున్న కోటరీ... ఇదీ ప్రస్తుత టీడీపీ, దాని మిత్ర పక్షాల పరిస్థితి. పెత్తందారీ శిబిరానికి అర్థబలం, అంగబలం దండిగానే ఉండ వచ్చు గాక. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో దానికి నైతిక బలం హీనదశలో ఉన్నది. సాను భూతి కోసం నాటకాలాడే దుఃస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. పేదవర్గాలు చైత న్యంతో మెలిగితే మరో ఐదేళ్లలో ఆ వర్గాల సాధికారత ఇంకో వంద రెట్లు పెరుగుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఆకలి సూచీలో అధోగతి!
ఎన్నో విజయాలు సాధిస్తున్నాం... అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఎంతో దూరంలో లేదని చెప్పుకొంటూనే ఉన్నాం. కానీ ఆకలి భూతాన్ని అంతం చేయటంలో వెనకబడే ఉన్నామని ఏటా వెలువడుతున్న అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత నెలలో ఐక్యరాజ్యసమితి ఆధ్వ ర్యంలోని ప్రపంచ ఆహార కార్యక్రమం చీఫ్ సిండీ మెకెయిన్ మాటలు విన్నా, తాజాగా ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్ఐ)ని గమనించినా మన పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదని అర్థమవుతుంది. జీహెచ్ఐ జాబితాలో మొత్తం 125 దేశాలు వుంటే, అందులో మన స్థానం 111. నిరుటికన్నా నాలుగు స్థానాలు కిందకు దిగజారామని ఆ నివేదిక చెబుతోంది. 2015 వరకూ ఎంతో పురోగతి సాధించిన భారత్ ఆ తర్వాత వరసగా నేల చూపులు చూస్తుందన్నది దాని సారాంశం. భారత్‌కు సంబంధించి నంతవరకూ ఇది వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించటం లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెబుతోంది. అసలు జీహెచ్ఐ కోసం నిర్దేశించిన ప్రమాణాలు, తీసుకుంటున్న నమూనాలు, మొత్తంగా ఆ ప్రక్రియ సక్రమంగా లేదని కేంద్రం ఆరోపణ. ప్రపంచంలో 2030 నాటికి ఆకలన్నదే ఉండరాదన్నది ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఒకటి. కేవలం ఆహారం లభించటం ఒక్కటే ఆకలి లేదన టానికి గీటురాయి అనుకోవటానికి లేదనీ, ఆ లభిస్తున్న ఆహారంలో మనిషికి అవసరమైన కేలరీలు వుండాలనీ సమితి వివరించింది. మరో ఏడేళ్లకల్లా ప్రపంచ దేశాలన్నీ ఈ లక్ష్యాన్ని అందుకోవలసి వుండగా అనేక దేశాలు ఇంకా వెనకబడే ఉన్నాయని జీహెచ్ఐ అంటున్నది. జాబితా గమనిస్తే పాకిస్తాన్ 102తో మనకన్నా మెరుగ్గా వుండగా, బంగ్లాదేశ్ (81), నేపాల్ (69), శ్రీలంక (60) దాన్ని మించిన మెరుగుదలను చూపించాయి. 28.7 స్కోర్‌తో ఆకలి తీవ్రత భారత్‌లో చాలా ఎక్కువగా ఉందన్నది జీహెచ్ఐ అభియోగం. పౌష్టికాహార లోపంలోనూ 16.6 స్కోర్‌తో మనం చాలా కింది స్థాయిలో వున్నాం. అయిదేళ్లలోపు పిల్లల్లో మరణాల రేటు 3.1గా ఉందని నివేదిక వివరిస్తోంది. మొన్న ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ కరోనా మహమ్మారి విరుచుకుపడిన సమయంలో 80 కోట్లమందికి పైగా ప్రజానీకానికి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) ఆహారధాన్యాలు అందించామనీ, కానీ 2022–23లో ఆహార సబ్సిడీల బిల్లు రూ.2.87 లక్షల కోట్లకు చేరుకున్నందున అదనంగా ఇచ్చే ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ నిలిపేశామనీ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పౌష్టికాహారలోపం కేవలం ఆహారధాన్యాలు ఉచితంగా అందించటం వల్ల మాత్రమే తీరేది కాదు. అవసరమైన పోషకాహారాన్ని అందించటంతో పాటు మహిళా విద్య, శిశు సంరక్షణ, మెరుగైన పారిశుద్ధ్యం, సురక్షితమైన మంచినీరు లభించేలా చూడటం వంటివి ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ ఈ రంగాలన్నిటా నిరుటితో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్లో చేసిన కేటాయింపులు ఏపాటి? సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) పేరు మారి సక్షమ్ అంగన్వాడీ, పోషణ్ 2.0 అయింది. కానీ గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి ఒక శాతం తగ్గి 20,554 కోట్లకు పరిమితమైంది. ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ (మధ్యాహ్న భోజన పథకం)కు నిరుడు రూ. 12,800 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్లో అది రూ. 11,600 కోట్లకు తగ్గింది. బాలికల విద్యకు నిరుటితో పోలిస్తే కేవలం 0.2 శాతం పెంచి రూ. 37,453 కోట్లకు సరిపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో బేటీ బచావో, బేటీ పఢావో, వన్ స్టాప్ సెంటర్ (ఓఎస్సీ) తదితర పథకాలతో కూడిన సంబాల్ స్కీమ్‌కైతే కేటాయించిన నిధులు మిగిలిపోయాయి. మహిళలకు అందించే ఇలాంటి పథకాలైనా, శిశువులకు ఉద్దేశించిన పథకాలైనా పరిస్థితిని మెరుగుపరచగలవు. జీహెచ్ఐ సూచీ ప్రాతిపదికలు, మొత్తంగా అది రూపొందించే ప్రక్రియ లోపరహితమైనదని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేయనవసరం లేదు. ఎందుకంటే ఇంత జనాభా గల దేశంలో పౌష్టికాహార లోపాన్ని గణించటానికి కేవలం 3,000 మంది వివరాలు మాత్రమే తీసుకుంటే అది సంపూర్ణ చిత్రాన్ని ఆవిష్కరించగలుగుతుందా? తీవ్రమైన పోషకాహారంతో పిల్లలు అతి బలహీనంగా వుండటం జీహెచ్ఐ సూచీ ప్రకారం 18.7 శాతం వుండగా, మన పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా ప్రతి నెలా సాగిస్తున్న పర్యవేక్షణలో అది కేవలం 7.2 శాతానికి పరిమి తమైందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే 80 కోట్లమందికి పైగా ప్రజానీకానికి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద 11 లక్షల 80 వేల టన్నుల ఆహారధాన్యాలను 28 నెలలపాటు అందించామని కూడా వివరించింది. అలాగే పోషకాహార లోప సవాల్‌ను ఎదుర్కొనడానికి వివిధ పథకాల కింద ఎంతో చేస్తున్నామంటున్నది. జీహెచ్ఐ సూచీకి తీసుకున్న నమూనాలు సక్రమంగా లేవనడం వరకూ ఏకీభ వించొచ్చు. అయితే నివేదికే పక్షపాతంతో వున్నదనీ, భారత్ ప్రతిష్టను దెబ్బతీయడమే దీని లక్ష్యమనీ అనడం సరికాదు. ఎందుకంటే ఇదే ప్రక్రియ సూచీలోని 125 దేశాల్లోనూ అమలు పరిచివుంటారు. దేశ జనాభాలో నిర్దిష్టంగా ఫలానా శాతం అని పెట్టుకుని దాని ప్రకారం నమూనాలు తీసుకుంటే ఈ సూచీ వెల్లడిస్తున్న అంశాలు వాస్తవానికి మరింత చేరువగా ఉండేవనటంలో సందేహం లేదు. ఒకపక్క బడ్జెట్ కేటాయింపుల్లో, కేటాయించిన నిధులు వ్యయం చేయటంలో మనం సక్రమంగా లేమని అర్థమవుతున్నప్పుడు ఆకలి సూచీ వంటివాటిపై ఆరోపణలు చేయటంవల్ల ఉపయోగం లేదు. పోషకాహారం విషయంలో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య వ్యత్యాసం వుంది. రాష్ట్రాల్లో ప్రాంతాలవారీగా కూడా తేడాలున్నాయి. ఇవన్నీ సరిచేసుకుంటే నిస్సందేహంగా మెరుగుపడతాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు చేరవవుతాం. ఆ దిశగా ప్రభుత్వాలన్నీ దృష్టి పెట్టాలి. -
ఇంకెప్పటికి మారతాం?!
ఆ కేంద్రపాలిత ప్రాంతం మొత్తంలో ఏకైక మహిళా ఎమ్మెల్యే ఆమె. అక్కడి ప్రభుత్వంలో ఉన్న ఒకే ఒక్క మహిళా మంత్రి కూడా ఆమే! తీరా, అలాంటి వ్యక్తి కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందంటే ఏమనాలి? మామూలు పరిస్థితుల్లో రాజీనామా చేయడం కాదు... లింగ, కుల దుర్విచక్షణల్ని తట్టుకోలేక రాజీనామా చేశానంటున్నారు. ఆ ఆరోపణలు దిగ్భ్రమ కలిగిస్తున్నాయి. పుదుచ్చేరిలోని ఏకైక దళిత, మహిళా ఎమ్మెల్యే సి. చంద్ర ప్రియాంక ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారారు. అయితే, ఆమె అసమర్థత రీత్యానే పదవి నుంచి తప్పించామని అధికార కూటమి అంటోంది. ఏమైనా, ఈ మహిళా మంత్రి రాజీనామా ఉదంతం స్త్రీలు, వెనుకబడిన కులాల పట్ల మన వ్యవస్థలోని చిన్నచూపును మరోసారి చర్చకు పెడుతోంది. దాదాపు 40 ఏళ్ళ విరామం తర్వాత పుదుచ్చేరిలో మంత్రి పదవి దక్కిన మహిళ చంద్రిక అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముప్ఫై మంది సభ్యుల పుదుచ్చేరి అసెంబ్లీలో కారైక్కాల్ ప్రాంతంలో రిజర్వుడు స్థానమైన నెడుంగాడు నుంచి ఎన్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి సారథ్యంలోని ఎన్డీఎ ప్రభుత్వంలో 2021లో ఆమెకు మంత్రి పదవి దక్కింది. ‘మంచి ఆలోచనలతో, కష్టపడి పనిచేయాలని రాజకీయాల్లోకి వచ్చాన’న్న చంద్రిక పురుషాధిక్య రాజకీయ ప్రపంచంలో వివక్షకు గురయ్యానని ఆరోపించారు. ప్రజాదరణ ఉన్నా కుట్రల్ని తట్టుకొని, ధనశక్తి అనే భూతంపై పోరాడడం తేలిక కాదని గ్రహించినట్టు ఆమె తన రాజీనామా లేఖలో ఆవేదన చెందారు. ప్రతిపక్ష కాంగ్రెస్, డీఎంకె, వామపక్షాలు ప్రభుత్వాన్నీ, సీఎం ‘దళిత వ్యతిరేక వైఖరి’నీ తప్పు బట్టాయి. అయితే, కీలకమైన మంత్రి పదవిని చంద్రిక సమర్థంగా నిర్వహించట్లేదనీ, ఆరునెలలుగా చెబుతున్నా పట్టించుకోవట్లేదనీ, అందుకే ఆమెను పదవి నుంచి తప్పించామనీ, కేంద్రానికి లేఖ పంపగానే అది తెలిసి ఆమె ముందే రాజీనామా చేశారనీ అధికార పక్షం చెబుతోంది. చిత్రమేమిటంటే, అధికారపక్షం చెబుతున్న ఈ కథనాన్నే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరైన మరో మహిళ తమిళిసై సౌందరరాజన్ పేర్కొనడం! దుర్విచక్షణ ఉన్నట్టు తెలీదనీ, తనకు చెబితే పరిస్థితిని చక్కదిద్దేదాన్ననీ గవర్నర్ అన్నట్టు తమిళ పత్రికల కథనం. అయితే, మన దేశంలో అలాంటివి లేవనుకోవడం వట్టి భ్రమ. ఆ మాటకొస్తే, ఎవరూ బయటపడకపోయినా చంద్రిక కథ లాంటిదే... ఈ దేశంలోని పలు వురు మహిళా నేతల వ్యధ! పురుషాధిక్య ప్రపంచంలో, అందులోనూ రాజకీయాల్లో ఎన్నో సహించి, భరిస్తే కానీ స్త్రీలు తమకంటూ చిన్నచోటు దక్కించుకొని, గొంతు విప్పలేరన్నది నిష్ఠురసత్యం. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, చట్టం చేయడానికి సైతం దశాబ్దాలు పట్టిన రాజకీయ వ్యవస్థ మనది. అది అమలయ్యేదెన్నడో నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితి. ఈ పరి స్థితుల్లో చంద్రిక లాంటి వారి ఉదంతాలు ఒక మేలుకొలుపు. ఆమె ఆరోపణలు సంపూర్ణ అసత్యాలని కొట్టిపారేయలేం. స్వతంత్ర భారత శతవసంతాల నాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయాలనేది పాలకులు ప్రవచిస్తున్న లక్ష్యం. 2047 కల్లా అది సాధ్యం కావాలంటే, జనాభాలో దాదాపు సగం ఉన్న మహిళల పాత్ర, వారి ప్రాతినిధ్యం కీలకం. కానీ, అధిక శాతం పార్టీలు, ప్రభుత్వాల చేతలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. గమనిస్తే, 1970ల వరకు లోక్‌సభలో మహిళా ప్రాతినిధ్యం 5 శాతం వద్దే తచ్చాడుతూ వచ్చింది. 2009లో గానీ అది రెండంకెలకు చేరు కోలేదు. రాజ్యసభలో అయితే 1951 నుంచి ఇప్పటి దాకా ఏనాడూ మహిళల సంఖ్య 13 శాతమైనా దాటలేదు. రాష్ట్ర శాసనసభల్లోనైతే సగటు మహిళా ప్రాతినిధ్యం 10 శాతం కన్నా తక్కువే. మహిళా మంత్రుల సంఖ్యలోనూ మన దేశంలో ఇదే పరిస్థితి. గత మూడు దశాబ్దాల పైచిలుకులో కేంద్రంలో మంత్రిపదవులను చేపట్టిన స్త్రీలు నాటి మహిళా ప్రాతినిధ్యంతో పోలిస్తే 11 శాతమే. క్యాబినెట్ హోదా దక్కినవారైతే 7 శాతమే. రాజకీయ పాలనలో కాదు, ప్రభుత్వ అధికార యంత్రాంగంలోనూ ఆడవారి వాటా మరీ తీసికట్టు. మొత్తం 30 లక్షల పైచిలుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 11 శాతమే స్త్రీలు. కార్యనిర్వాహక, శాసన నిర్మాణ వ్యవస్థలతో పోలిస్తే, భారత న్యాయ వ్యవస్థలో లింగ సమానత మరీ కనాకష్టం. 1950 నుంచి చూస్తే, సుప్రీమ్ కోర్ట్ జడ్జీల్లో కూడా ఆడ వాళ్ళు 3 శాతమే. ప్రతిచోటా ఉన్నత స్థాయికి చేరడానికి అతివలకు అనేక అవరోధాలు. ఈ గణాంకాలన్నీ ఇప్పటికీ మహిళల పట్ల మనకున్న దుర్విచక్షణకూ, మారని మన పితృస్వామ్య భావజాలా నికీ నిలువుటద్దాలు. దానికి తోడు దళితులు, వెనుకబడిన వర్గాల స్త్రీల పరిస్థితి మరీ కష్టం. ఈ నేపథ్యం నుంచి పుదుచ్చేరి ఉదంతాన్ని చూసినప్పుడే సమస్య లోతులు స్పష్టమవుతాయి. దాదాపు 156 దేశాల్లో సగటున 23 శాతం మహిళా మంత్రులుంటే, భారత్ తద్భిన్నం. కేంద్రంలో పేరుకు మహిళా మంత్రుల సంఖ్య పెంచినా, వారికి రక్షణ, పరిశ్రమలు, రైల్వేలు, రవాణా, వ్యవసాయం లాంటి కీలక శాఖలు అప్పగించడం అరుదు. ఈ పరిస్థితిని మార్చాలంటే, మహిళా రిజర్వేషన్ చట్టాలు తెస్తే సరిపోదు. కులం, మతం, ప్రాంతం, జెండర్ అంశాల్లో పార్టీల, ప్రజల ఆలోచన మారాలి. వెనుకబడిన వర్గాల, స్త్రీల సమర్థతను శంకించడం క్షమార్హం కాదు. అవకాశమిచ్చి, ప్రోత్సహిస్తే, పలువురు నేతల కన్నా వారే సమర్థులు. పాలిచ్చి పెంచిన అమ్మలు మనల్ని పాలించ లేరా? కుటుంబానికి ఇరుసుగా మారి, మొత్తం సమాజాన్ని నిలబెడుతున్న స్త్రీలు సమర్థులు కారా? వారికా సమర్థత లేదనుకోవడం మూర్ఖత్వం. మకిలిపట్టిన మనసుల్లోని మనుస్మృతి భావజాలం! -
ఆలోచన రేపుతున్న ఎంపిక
ఏటా ఇచ్చే పురస్కారాలు సైతం విజేతల ఎంపిక, వారు చేసిన కృషి రీత్యా విశిష్టంగా నిలుస్తాయి. రాయల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ఈ ఏడాదికి గాను ఇప్పటి దాకా ప్రకటించిన పురస్కారాల్లో కొన్ని అలాంటివే! స్వెరిజెస్ రిక్స్‌బ్యాంక్ ప్రైజ్ అనే పేరు కన్నా ఆల్ఫ్రెడ్ నోబెల్ స్మారకార్థం ఇచ్చే ‘నోబెల్ పురస్కారం’గానే ప్రసిద్ధమైన ఈ గౌరవం దక్కిన ఇద్దరు మహిళల గురించి ఇప్పుడు ప్రపంచమంతా ఆసక్తి కనబరుస్తోంది. మహిళా శ్రామికశక్తిపై విస్తృత పరిశోధన జరిపిన ఆర్థిక శాస్త్రవేత్త క్లాడియా గోల్డిన్‌కు అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్, అలాగే ఇరాన్లో జైలులో మగ్గుతున్న మానవ హక్కుల ఉద్యమకారిణి నర్గిస్ మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి దక్కడం వారు దీర్ఘకాలంగా చేస్తున్న కృషికి అతి పెద్ద అంతర్జాతీయ గుర్తింపు. ఈ ఇద్దరి ఎంపిక వేతనాల్లో స్త్రీ పురుష వ్యత్యాసం మొదలు లింగ సమానత్వం దాకా అనేక అంశాలపై మరోసారి చర్చ రేపుతోంది. గోల్డిన్ కృషికి అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కడం బాగున్నా, అందులోనూ వైచిత్రి ఉంది. ఆమె నాలుగు దశాబ్దాల కృషి అంతా శ్రామిక విపణుల్లో మహిళలు, లింగ సమానత్వం గురించి! విచిత్రం ఏమిటంటే 1969లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని స్థాపించినప్పటి నుంచి నిన్నటి వరకు ఆ పురస్కారం దక్కింది ఇద్దరంటే ఇద్దరు మహిళలకే! అదీ వేరేవాళ్ళతో కలసి! ఆ గౌరవం దక్కిన మూడో మహిళ గోల్డినే! పైగా, ఒక మహిళకు ఒంటరిగా అర్థశాస్త్రంలో నోబెల్ దక్కడమూ ఇదే ప్రప్రథమం. నోబెల్ బహుమతుల్లో లింగ అసమానత్వంపై విమర్శలు వస్తున్న వేళ లేబర్ మార్కెట్లో మహిళా విజయం లోతుపాతులు విశ్లేషించిన గోల్డిన్‌కు ఈ గౌరవం దక్కడం గమనార్హం. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరైన గోల్డిన్ అమెరికాలోని శ్రామిక విపణినీ, అలాగే వేతనాల్లో లింగ అసమానత్వానికి కారణాలనూ నాలుగు దశాబ్దాలుగా లోతుగా అధ్యయనం చేస్తూ వచ్చారు. 200 ఏళ్ళ అమెరికా చరిత్రను లోతుగా విశ్లేషిస్తూ, చారిత్రకంగా స్త్రీ పురుషుల ఆదాయాల్లో తేడాకు ప్రధానంగా చదువు, వివిధ రకాల ఉద్యోగాలే కారణమని తేల్చారు. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి పారిశ్రామిక ఆధారిత వ్యవస్థ వైపు దేశం మారడంతో శ్రామిక విపణిలో వివాహిత స్త్రీల భాగస్వామ్యం పడిపోయిందనేది ఆమె అధ్యయన సారం. ఆ తర్వాత 20వ శతాబ్దంలో సర్వీసుల పరిశ్రమ వృద్ధి చెందడంతో, మరింత విద్యావంతులైన మహిళలు రంగంలోకి వచ్చారు. గర్భనిరోధక విధానాల లాంటివి ఆరోగ్యరంగంలో వ్యాప్తిలోకి వచ్చాయి. తత్ఫలితంగా, శ్రామికశక్తి లోకి మహిళలు మళ్ళీ ప్రవేశించారు. కానీ, అప్పటికే తలెత్తిన అంతరం మాత్రం పూడిపోలేదు. ముఖ్యంగా, తొలిచూలుతో ఈ తేడా తలెత్తుతోందని గోల్డిన్ పరిశోధన. ఇక, మరణశిక్షకు వ్యతిరేకంగా గళం విప్పినందుకూ, దేశంలో మహిళలకు సైతం సమాన హక్కులు ఉండాలని కోరినందుకూ ఇరాన్లో కటకటాలు లెక్కపెడుతున్న నర్గిస్ పోరాటం మరో పెద్ద కథ. ఇప్పటికి ఆమె 13 సార్లు అరెస్టయి, అయిదుసార్లు దోషిగా తీర్మానమై, 31 ఏళ్ళ జైలుశిక్షను ఎదుర్కొంటోంది. 2022 నాటి డబ్యూఈఎఫ్ గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదికలో అట్టడుగున అఫ్గానిస్తాన్, పాకిస్తాన్లతో పాటు నిలిచిన దేశంగా ఇరాన్ పేరుమోసింది. అలాంటి దేశాల్లో నర్గిస్ లాంటి మహిళలు కడకు తమ ఉనికిని కాపాడుకొనేందుకు సైతం పోరాడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు క్లాడియా గోల్డిన్ అధ్యయనానికీ, ఇటు నర్గిస్ మొహమ్మదీ అలుపెరుగని పోరాటానికీ నోబెల్ గుర్తింపు రావడం ఆనందదాయకం. సరిగ్గా గోల్డిన్‌కు నోబెల్ ప్రకటించిననాడే మన దేశంలో వార్షిక ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే‘ (పీఎల్ఎఫ్ఎస్) విడుదలైంది. గత 2022 జూలై నుంచి ఈ 2023 జూన్‌కి సంబంధించిన ఈ సర్వే శ్రమజీవుల్లో మహిళల సంఖ్య మునుపటి కన్నా కొద్దిగా పెరిగిందని పేర్కొంది. అయితే, అది సహజ మైన పెరుగుదల కాక కరోనా తర్వాత కుటుంబ ఆదాయాలు దెబ్బతినడంతో తప్పని పరిస్థితుల్లో వచ్చిన పాలపొంగు అని విశ్లేషకుల అభిప్రాయం. వెరసి, లోతుగా గమనిస్తే భారత్‌లోనూ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం రేటు ఇవాళ్టికీ తక్కువగానే ఉందన్నది విచారకరమైన వాస్తవం. ఇది మారాలంటే... అర్థవంతమైన ఉపాధి, అదే సమయంలో మహిళా శ్రామికశక్తి భాగస్వామ్యం పెరి గేలా విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలది. అందుకు ప్రొఫెసర్ గోల్డిన్ అధ్యయనం నుంచి భారతదేశం సైతం పాఠాలు నేర్వాలి. ఏ దేశమైనా సరే ఆర్థిక పురోగతి సాధించినంత మాత్రాన శ్రామిక విపణిలో లింగ వ్యత్యాసం దానంతట అది తగ్గిపోదని గోల్డిన్ నిరూపించారు. అలాగే, సామాజిక, వ్యవస్థాపరమైన అవ రోధాలు ఉన్నంత కాలం కేవలం స్త్రీ విద్య సైతం శ్రామికశక్తిలో లింగ అంతరాల్ని తగ్గించలేదు. సాంప్రదాయిక సమాజాల్లో పిల్లల పెంపకమూ ఓ కీలకాంశం. విధాన నిర్ణేతలు వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. లింగ కోణం నుంచి అర్థశాస్త్ర అధ్యయనం ప్రధాన స్రవంతిలో భాగం కాదన్న భావనల్ని గోల్డిన్ బద్దలుకొట్టారు. అమెరికా నుంచి ఇరాన్ దాకా ప్రపంచంలో ప్రతి చోటా ఇవాళ్టికీ ఆడవారి పరిస్థితి ఒకేలా ఉంది. ఇవాళ పురుషుల్లో నూటికి 80 మంది ఉద్యోగాల్లో ఉంటే, ప్రపంచ మహిళా జనాభాలో కేవలం సగం మందే వేతన ఉపాధి పొందుతున్నారు. అదీ మగవాళ్ళ కన్నా తక్కువ వేతనాలకే పనిచేస్తూ, వృత్తిలో ఉన్నత శిఖరాల అధిరోహణకు అవకాశాలూ తక్కువే. అందుకే, లింగ సమానత్వ సాధనలో ప్రపంచం ప్రయాణించాల్సిన దూరం ఇంకా ఎంతో ఉంది. ఆ దిశలో నోబెల్ విజేతలైన గోల్డిన్ అధ్యయనం, నర్గిస్ పోరాటం మనకు తాజా మార్గదర్శకాలు. -
Asian Games 2023: పతకాల శతకం
కోరినది నెరవేరింది. అనుకున్నట్టే... ఆశించినట్టే... ఆసియా క్రీడోత్సవాల్లో మన దేశం పతకాల శతకం పండించింది. చైనాలోని హాంగ్జౌలో జరిగిన 19వ ఏషియన్ గేమ్స్‌లో 655 మంది సభ్యుల భారత బృందం 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలతో మొత్తం 107 పతకాలు గెలిచింది. మునుపు 2018లో జకార్తా ఏషియన్ గేమ్స్‌లో సాధించిన 70 పతకాల రికార్డును తిరగరాసింది. ఆసియా క్రీడల పతకాల వేటలో మూడంకెల స్కోరుకు మన దేశం చేరడం ఇదే ప్రప్రథమం. శతాధిక పతకాల సాధనలో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే చైనా, జపాన్, దక్షిణ కొరియాల సరసన అగ్ర శ్రేణి క్రీడాదేశంగా మనం కూడా స్థానం సంపాదించడం గర్వకారణం. ఈ క్రమంలో అతి సామాన్య స్థాయి నుంచొచ్చి అంతర్జాతీయ వేదికపై చెరగని ముద్ర వేసిన మనవాళ్ళ కథలు స్ఫూర్తిదాయకం. ఈ క్రీడోత్సవాల్లో 201 స్వర్ణాలతో సహా మొత్తం 383 పతకాలతో తిరుగులేని ప్రథమ స్థానంలో చైనా నిలిచింది. 188 మెడల్స్‌తో జపాన్, 190తో దక్షిణ కొరియా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. కరోనా వల్ల ఏడాది ఆలస్యంగా 2021లో జరిగిన టోక్యో–2020 వేసవి ఒలింపిక్స్ లోనూ చైనా, జపాన్‌లు ఇలాగే పతకాల సాధనలో రెండు, మూడు స్థానాల్లోనే ఉన్నాయి. ప్రపంచస్థాయి ఒలింపిక్స్‌లోనే అంతటి విజయాలు నమోదు చేసుకున్న ఆ దేశాలు ఇప్పుడు ఆసియా క్రీడోత్సవాల్లోనూ ఇలా ఆధిక్యం కనబరచడం ఆశ్చర్యమేమీ కాదు. అయితే, ఒలింపిక్స్ పతకాల ర్యాంకింగుల్లో ఆసియా దేశాల కన్నా వెనకాల ఎక్కడో 48వ ర్యాంకులో ఉన్న భారత్, తీరా ఏషియాడ్‌లో మాత్రం వాటన్నిటినీ వెనక్కి నెట్టి, నాలుగో ర్యాంకులోకి రావడం గణనీయమైన సాధన. మొత్తం 107 పతకాల్లో అత్యధిక పతకాలు (6 స్వర్ణాలతో సహా 29) మనకు అథ్లెటిక్స్‌లోనే వచ్చాయి. ఆపైన అత్యధికంగా షూటింగ్లో (22 మెడల్స్), ఆర్చరీలో (9), అలాగే బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, హాకీల్లో మనవాళ్ళు ప్రపంచ శ్రేణి ప్రతిభ కనబరిచారు. హాంగ్జౌలోని ఈ తాజా ఆసియా క్రీడోత్సవాల్లో మన దేశానికి మరో విశేషం ఉంది. ఈ క్రీడల పోరులో సాంప్రదాయికంగా తనకు బలమున్న హాకీ, రెజ్లింగ్, కబడ్డీ, షూటింగ్ లాంటి వాటిల్లోనే కాదు... అనేక ఇతర అంశాల్లో జమాజెట్టీలైన ఇతర దేశాల జట్లకు ఎదురొడ్డి భారత్ పతకాలు సాధించింది. పట్టున్న హాకీ, కబడ్డీ లాంటి క్రీడల్లో ప్రతిష్ఠ నిలబెట్టుకుంటూనే, ఆటల్లోని ఆసియా అగ్రరాజ్యాలను ఢీ కొని, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి ప్రపంచ శ్రేణి ఆటల్లోనూ పతకాలు గెలుచుకుంది. ఇది గమనార్హం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆదివారం ముగిసిన ఈ ఆసియా క్రీడా సంబరంలో మన ఆటగాళ్ళ విజయగీతిక భారత క్రీడారంగంలో అత్యంత కీలక ఘట్టం. కేవలం పతకాల గెలుపు లోనే కాక, క్రీడాజగతిలో మన వర్తమాన, భవిష్యత్ పయనానికీ ఇది స్పష్టమైన సూచిక. క్రీడాంగణంలోనూ మన దేశం వేగంగా దూసుకుపోతూ, రకరకాల ఆటల్లో విశ్వవిజేతల సరసన నిలవాలన్న ఆకాంక్షను బలంగా వ్యక్తం చేస్తున్న తీరుకు ఇది నిలువుటద్దం. 2018 నాటి ఏషియన్ గేమ్స్‌లో పతకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచిన భారత్ ఇవాళ నాలుగో స్థానానికి ఎగబాకిందంటే, దాని వెనుక ఎందరు క్రీడాకారుల కఠోరశ్రమ, దృఢసంకల్పం ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, క్రీడా ప్రాధికార సంస్థలు ఆటలకు అందించిన ప్రోత్సాహమూ మరువలేనిది. ఆతిథ్యదేశమైన చైనా వైఖరి అనేక అంశాల్లో విమర్శల పాలైంది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆటగాళ్ళకు తన వీసా విధానంతో అడ్డం కొట్టి, డ్రాగన్ తన దుర్బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. జావెలిన్ త్రో సహా కొన్ని అంశాల్లో చైనా అధికారిక రిఫరీలు భారత ఆటగాళ్ళ అవకాశాల్ని దెబ్బ తీసేలా విచిత్ర నిర్ణయాలు తీసుకోవడమూ వివాదాస్పదమైంది. తొండి ఆటతో బీజింగ్ తన కుత్సితాన్ని బయటపెట్టుకున్నా, స్థానిక ప్రేక్షకులు ఎకసెక్కాలాడుతున్నా భారత ఆటగాళ్ళ బృందం సహనంతో, పట్టుదలతో ఈ విజయాలను మూటగట్టుకు వచ్చింది. ఆ విషయం విస్మరించలేం. అందుకే కొన్ని అంశాల్లో అసంతృప్తి ఉన్నా, కొందరు క్రీడాతారలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆటతీరులో నిలకడ చూపలేక పోయినా తాజా ఆసియా క్రీడోత్సవాల్లో భారత ప్రదర్శనను అభినందించి తీరాలి. వచ్చే ఏటి ప్యారిస్ ఒలింపిక్స్‌కు దీన్ని ఉత్ప్రేరకంగా చూడాలి. మునుపటితో పోలిస్తే, క్రీడాజగత్తులో మనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం సంతో షకర పరిణామం. అలాగని సాధించినదానితో సంతృప్తి పడిపోతేనే ఇబ్బంది. ఇప్పటికీ జనాభాలో, అనేక ఇతర రంగాల్లో మనతో పోలిస్తే దిగువనున్న దేశాల కన్నా ఆటల్లో మనం వెనుకబడి ఉన్నాం. అది మర్చిపోరాదు. ఆర్థిక, సామాజిక ఇబ్బందులతో పాటు క్రీడావ్యవస్థలోని సవాలక్ష రాజకీయాలు, పెత్తందారీ విధానాలు, క్రీడా సంఘాలను సొంత జాగీర్లుగా మార్చుకున్న నేతలు – గూండాలు మన ఆటకు నేటికీ అవరోధాలు. మహిళా రెజ్లర్లతో దీర్ఘకాలంగా అనుచితంగా వ్యవహరిస్తున్నట్టు అధికార పార్టీ ఎంపీపై అన్ని సాక్ష్యాలూ ఉన్నా ఏమీ చేయని స్వార్థ పాలకుల దేశం మనది. అలాంటి చీకాకులు, చిక్కులు లేకుంటే మన ఆటగాళ్ళు, మరీ ముఖ్యంగా ఇన్ని ఇబ్బందుల్లోనూ పతకాల పంట పండిస్తున్న పడతులు ఇంకెన్ని అద్భుతాలు చేస్తారో! ఏషియాడ్‌లో మనం గెల్చిన 28 స్వర్ణాల్లో 12 మాత్రమే ఒలింపిక్స్ క్రీడాంశాలనేది గుర్తు చేసుకుంటే చేయాల్సిన కృషి, సాధించాల్సిన పురోగతి అవగతమవుతుంది. మహారాష్ట్రలోని దుర్భిక్ష ప్రాంతంలోని రైతు కొడుకు, ముంబయ్‌లో కూరలమ్మే వాళ్ళ కూతురు లాంటి మన ఏషియాడ్ పతకాల వీరుల విజయగాథలెన్నో ఆ లక్ష్యం దిశగా మనకిప్పుడు ఆశాదీపాలు! -
మానవాళి కోరుకోని యుద్ధం
ఆ దృశ్యాలు ఏదో హార్రర్ సినిమానో, మరేదో అమెరికన్ వార్ సినిమానో చూస్తున్నట్లుంది. ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన ‘హమాస్’ తీవ్రవాద సంస్థ జరిపిన ఆకస్మిక దాడులు, బదులుగా గాజా భూఖండంపై ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతీకార దాడుల దృశ్యాలు మూడు రోజులుగా చూస్తున్న వారికి ఒళ్ళు ఝల్లుమనేలా చేస్తున్నాయి. భారీ విధ్వంసాలు, 1200 మందికి పైగా మృతులు, వేలల్లో నిరాశ్రయులు, పసిపిల్లల మొదలు పదహారేళ్ళ పడుచుల దాకా తీవ్రవాదుల చేతిలో చిక్కిన వందకు పైగా బందీల కథ మానవతావాదుల గుండెను బరువెక్కిస్తోంది. పొరుగున ఉన్న అరబ్ దేశాలతో ఇప్పుడిప్పుడే ఇజ్రాయెల్ సంబంధాలు మెరుగుపడుతున్నాయనీ, ఆర్థిక సహకారం – శాంతి సాధనే ధ్యేయంగా సరికొత్త మధ్యప్రాచ్యానికి బాటలు పడుతున్నాయనీ భావిస్తున్న వేళ ఉరుము లేని పిడు గులా హమాస్ దాడి మొత్తం కథను మార్చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చేసిన అనివార్య యుద్ధప్రకటన కాలాన్ని వెనక్కి తిప్పేసింది. తాజా ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంతో దశాబ్దాల పాటు మధ్యప్రాచ్యంలో కొనసాగిన అశాంతి మళ్ళీ భూతమై తిరిగొచ్చింది. ఇది యాభై ఏళ్ళ నాటి జ్ఞాపకాలను తట్టిలేపింది. అప్పట్లో 1973 అక్టోబర్ 6న యూదుల లెక్కలో పవిత్రమైన యోమ్ కిప్పూర్ రోజున ఈజిప్ట్, సిరియాలు సరిగ్గా ఇలాగే ఇజ్రాయెల్‌పై దాడి చేశాయి. 1949, 1956, 1967 తర్వాత ‘నాలుగో అరబ్ – ఇజ్రాయెలీ యుద్ధం’గా పేరుబడ్డ ఆ 19 రోజుల యుద్ధంలో చివరకు ఇజ్రాయెల్ పైచేయి సాధించి, పొరుగు భూభాగాలను స్వాధీనం చేసు కుంది. దాంతో, పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. అప్పటిలానే మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయెల్‌పై భయానక దాడి జరిగింది. అదీ పవిత్ర హిబ్రూ బైబిల్లోని తొలి అయిదు భాగాల సమాహారమైన తోరా పఠనం ప్రారంభించే రోజున జరిగింది. గూఢచర్యంలో, దాడుల్ని నిరోధించే వ్యవస్థల్లో పేరున్న ఇజ్రాయెల్ ఈసారీ ఏమరుపాటుతో ఉంది. అక్టోబర్ 7 తెల్లవారుజామున అంతా నిద్రలో ఉన్న వేళ ఆకాశ, సముద్ర, భూ మార్గాలు మూడింటి ద్వారా, ఏకకాలంలో అనేక ప్రాంతాల్లో హమాస్ తీవ్రవాదులు ఆకస్మిక దాడి జరిపి, దిగ్భ్రాంతికి గురిచేశారు. 5 నుంచి 7 వేల రాకెట్ల వర్షం కురిపించారు. ఇజ్రాయెల్ అన్నట్టు ఒక రకంగా ఇది... 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో అంతర్జా తీయ వాణిజ్య కేంద్ర జంట భవనాలపై అల్–ఖైదా తీవ్రవాదుల ‘9/11 దాడుల’ను గుర్తుచేస్తోంది. ప్రపంచ ప్రసిద్ధ క్షిపణి – రాకెట్ నిరోధక వ్యవస్థ ‘ఐరన్ డోమ్ సిస్టమ్’ను సైతం తప్పించుకొని, వందలాది రాకెట్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకొని రావడం నివ్వెరపరింది. ఇది నెతన్యాహూ సర్కార్ వైఫల్యాల్లో కొత్త చేరిక. తూర్పు జెరూసలేమ్‌లోని పవిత్ర అల్–అక్సా మసీదుకు వచ్చే పాల స్తీనా భక్తులపై దాడులు, మసీదులోకి యూదుల ప్రవేశం లాంటి రెచ్చగొట్టే చర్యలు పరిస్థితిని ఇక్కడి దాకా తెచ్చాయి. తాజా దాడి నుంచి ఇజ్రాయెల్ వెంటనే తేరుకొని, హమాస్ కీలక కేంద్రాలపై ప్రతి దాడులు జరిపింది. జొరబడిన హమాస్ తీవ్రవాదులను నిర్వీర్యం చేసింది. ఇప్పుడప్పుడే తెగే అవ కాశం లేని ఈ యుద్ధంలో సైనిక బలిమితో చివరకు ఇజ్రాయెలే గెలవచ్చు కానీ, ఇరువైపులా జరిగే నష్టం మాటేమిటి? ఇరాన్‌ను శత్రువుగా భావిస్తూ, దాన్ని శిక్షించడానికి ఇజ్రాయెల్‌ను వాటంగా చేసు కుంటున్న అమెరికా ఈ ఒత్తిడి వ్యూహం వల్ల మధ్యప్రాచ్యంలో మంటలు చల్లారవని గ్రహించాలి. మధ్యప్రాచ్యంలో మంటలు ఈనాటివి కావు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటుతో లక్షలాది పాలస్తీనియన్లు నిరాశ్రయులై, సొంత గడ్డ మీదే శరణార్థులు కావాల్సి వచ్చింది. నాటి నుంచి పాలస్తీనియన్లకూ, ఇజ్రాయెల్‌కూ మధ్య పోరు సాగుతూనే ఉంది. గతంలో 2008–09లో, 2014లో ఇజ్రాయెల్‌కీ, హమాస్‌కీ మధ్య యుద్ధాలు జరిగాయి. కానీ, కథ కంచికి చేరలేదు. నిజానికి, పాలస్తీనియన్ ప్రజలందరికీ హమాస్ ప్రతినిధి అనుకోవడం కూడా పొరపాటే. ఆ తీవ్రవాద సంస్థ చేసిన చర్యలన్నిటికీ పాలస్తీనాను తప్పుబట్టలేం. కానీ, దీర్ఘకాలిక పాలస్తీనా సమస్యకు పరిష్కారానికి చర్చలు, శాంతియుత మార్గమే సాధనం. అది గ్రహించకుండా హింసకు దిగేవారిని కూడా క్షమించలేం. తీవ్రవాద దాడుల దుష్ఫలితం ఇప్పటికే ప్రతిదాడుల రూపంలో గాజా భూఖండంలో అమాయకులపై పడింది. ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక శాంతి, సుస్థిరతలు కావాలంటే పాలస్తీని యన్లకూ, ఇజ్రాయెల్‌కూ మధ్య పరస్పర అంగీకారయోగ్యమైన రాజకీయ రాజీ కుదరాలి. స్వతంత్ర పాలస్తీనా దేశమనేది అసాధ్యమైన వేళ ఆచరణయోగ్య పరిష్కారం వైపు ఆలోచించాలి. పాలస్తీనా పక్షాన ఇజ్రాయెల్‌కు ఎదురొడ్డుతున్న ఇరాన్, సిరియా, లెబనాన్‌లోని హెజ్బొల్లా బృందం అది గ్రహించాలి. ఉక్రెయిన్ యుద్ధంతో అస్తుబిస్తవుతున్న ప్రపంచం మరో యుద్ధాన్ని భరించలేదు. భారత్ సంగతికొస్తే, రక్షణ వ్యవహారాల్లో బలమైన భాగస్వామి అయిన ఇజ్రాయెల్ చేతిని విడిచిపెట్టే పరిస్థితి లేదు. అదే సమయంలో దశాబ్దాల తరబడి పాలస్తీనా అంశంలో బాధితుల గళానికి మద్దతుగా నిలిచిన చరిత్ర మనది. ఆ చారిత్రక వైఖరిని పూర్తిగా వదిలేసి, ఇరాన్‌తో పాటు వివిధ అరబ్బు దేశాలతో స్నేహానికి పీటముడి వేసుకోనూ లేము. ‘ఈ కష్టకాలంలో ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటిస్తున్నాం’ అని భారత ప్రధాని ప్రకటించారు. దురాక్రమణలు, తీవ్రవాద దాడులను విస్పష్టంగా ఖండించాల్సిందే. అదే సమయంలో గాజా భూఖండంపై ప్రతీకార దాడుల వల్ల ఇప్పటికే నిరాశ్రయులైన లక్షా పాతిక వేల మంది సామాన్య పౌరులపై మానవతాదృష్టి సారించాల్సిందే. అందుకు మనం ఇప్పుడు ఆచితూచి అడుగేయాలి. తటస్థంగా ఉంటూ, శాంతి స్థాపనకు కృషి చేయాలి. పాలస్తీనియన్లకు కొద్దిపాటి సడలింపులిస్తే ఇజ్రాయెల్‌తో సాధారణ సంబంధాలకు సిద్ధపడ్డ సౌదీ అరేబియా సైతం నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. మానవాళి కోరుకోని ఈ యుద్ధం ఆగాలి. -
సీన్యో కాల్వీనో
ఇటాలో కాల్వీనో అనే పేరు వినగానే ఆయనో ఇటాలియన్ రచయిత అనిపించడం సహజమే. ఊహకు అందేట్టుగా ఇటాలియనే అయినా కాల్వీనో పుట్టింది క్యూబా రాజధాని హవానాలో. తమ దేశ మూలాలు మర్చిపోకూడదనే ఉద్దేశంతో తల్లి పెట్టిన ఈ పేరు ఆయనకు పెద్దయ్యాక మరీ జాతీయవాదపు పేరులా తోచింది. అయితే వాళ్ల కుటుంబం ఇటలీకి తిరిగి వచ్చాక, తన 20 ఏళ్ల వయసులో కాల్వీనో జాతీయవాద ఫాసిస్టు పార్టీ మీద పోరాడటం దానికి ఒక చిత్రమైన కొనసాగింపు. ఆ పోరాటంలో భాగంగా ఇటాలియన్ కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యాడు. కమ్యూనిస్టుగా బతికాడు. అనంతర కాలంలో ఆ పార్టీకి దూరమయ్యాడు. అప్పటికే ఆయన వాస్తవిక చిత్రణ మీద పార్టీ విమర్శించడం మొదలుపెట్టింది. ఇక హంగెరీ మీద సోవియట్ రష్యా దాడి(1956) తర్వాత పార్టీ మీది భ్రమలు పూర్తిగా చెదిరిపోయి రాజీనామా చేశాడు. మళ్లీ ఏ పార్టీలోనూ సభ్యుడు కాలేదు. జర్నలిస్టుగా ఉద్యోగం చేసుకుంటూ; కథలు, నవలలు రాసుకుంటూ; తనకు నచ్చిన రాతలను ప్రమోట్ చేసుకుంటూ, కథల మీద మాట్లాడుకుంటూ బతికాడు. ఆధునిక ఇటాలియన్ సాహిత్యంలో అత్యధికంగా అనువాదం అయిన రచయితగా ప్రసిద్ధి గడించిన ఇటాలో కాల్వీనో శతజయంతి (జననం: 1923 అక్టోబర్ 15) సంవత్సరం ఇది. ఇటాలో కాల్వీనో ప్రపంచంలో నిచ్చెన వేసుకుని చందమామ మీదికి ఒక్క గెంతులో ఎక్కేయొచ్చు. దాని పాలను లోడుకోవచ్చు. చేయాల్సిందల్లా పొక్కులుగట్టిన చందమామ ఉపరితలం మీదుండే పొలుసులను కొద్దిగా జరిపి అక్కడ గరిట పెట్టడమే. కాకపోతే ఆ మీగడ చిక్కదనపు పాలల్లో ‘ఎక్కువభాగం పండ్లు, కప్పల గుడ్లు, శిలాజిత్, అలచందలు, తేనె, పటికలుగా మారిన పిండి, సొరచేపల గుడ్లు, నాచు, పుప్పొడి, చిన్నచిన్న పురుగులు, చెట్ల జిగురు, మిరియాలు, ఖనిజ లవణాలు, బూడిద’ ఉంటాయి కాబట్టి వాటిని శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది (ద డిస్టన్ ్స ఆఫ్ ద మూన్ ). ఇంకా, కాల్వీనో లోకంలో చిన్న పిల్లను పోనివ్వడానికి జోర్డాన్ నది తన నీటిని కొద్దిగా వంచి దారి ఇస్తుంది. ఎందుకంటే ఆ నదికి ఇష్టమైన ఉంగరపు ఆకృతి కేకుల్ని ఆ పాప పెడతానంది కదా (ఫాల్స్ గ్రాండ్‌మదర్)! ఆయన సృజించిన నగరానికి ఎప్పటికీ దేనికీ కిందికి దిగే పనిలేదు. అది పొడవాటి ఫ్లెమింగో కాళ్ల మీద నిలబడి ఉంటుంది. అదొక్కటే నగరానికీ, భూమికీ సంబంధం (ది ఇన్విజిబుల్ సిటీ). వెంట వెంటనే కలుసుకుంటున్నట్టుగా వచ్చి, లేచి, విరిగిపడే అలల్లో ఒకదాన్నుంచి ఇంకోదాన్ని ఎలా విడదీయాలో తెలీక అదేపనిగా చూస్తుంటాడు ‘మిస్టర్ పాలొమార్’. విలువలు తలకిందులైన ప్రపంచంలో ఒక మనిషి నిజాయితీ కూడా ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేయగలదు. అందరూ బుద్ధిగా దొంగతనం చేస్తున్నప్పుడు, ఆయన మాత్రం చేయనంటే ఎలా కుదురుతుంది? (ద బ్లాక్ షీప్). కాల్వీనో తల్లి ఇటలీలోని సార్డినీయా ద్వీపానికి చెందినవారు. ప్రపంచంలో శతాధిక వృద్ధులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇదీ ఒకటి. దీనికి భిన్నంగా కాల్వీనో అరవై ఏళ్లే బతికాడు(మరణం: 1985 సెప్టెంబర్ 19). ఆయన రచనల విషయంలో మాత్రం ఈ మాట అనలేము. ‘అవర్ యాన్సెస్టర్స్’ ట్రయాలజీ, ‘కాస్మికామిక్స్’ లాంటి పుస్తకాలను వెలువరించిన కాల్వీనో ప్రపంచంలో అన్నీ అసాధ్యాలే. కొన్నిసార్లు రాస్తున్నప్పుడు నాకు వెర్రెత్తుతుంది అంటాడాయన. ఒక నవలను మళ్లీ మళ్లీ చదవడానికి ఉపక్రమించే పాఠకుడి జీవితం కూడా ఆయనకు నవల అవుతుంది. దీన్ని అత్యంత పోస్ట్ మాడర్నిస్ట్ నవల అంటారు (ఇఫ్ ఆన్ ఎ వింటర్స్ నైట్ ఎ ట్రావెలర్). కానీ ఆయన రచనలు ఎంత ఆధునికమో అంత ప్రాచీనం. ఎంత ప్రాచీనమో అంత ఆధునికం. కొత్త పుంతలు తొక్కడం అనే మాట ఆయనకు బాగా వర్తిస్తుంది. ఇటాలియన్ జానపద గాథలను కూడా ఆయన ప్రచురించాడు. కాల్వీనో రచనా వ్యాసంగంలో ఇదొక ముఖ్యాంశం. ‘రాజకీయాల తర్వాత, సాహిత్యానికి రెండో స్థానం ఇవ్వడం అనే ఆలోచన పెద్ద తప్పు. ఎందుకంటే, రాజకీయాలు దాదాపుగా ఎన్నడూ తన ఆదర్శాలను సాధించలేవు. మరోపక్కన, సాహిత్యం దాని రంగంలో అది కొంతైనా సాధించగలదు, దీర్ఘకాలంలో కొంత ఆచరణాత్మక ప్రభావాన్ని కూడా కలిగించగలదు... ముఖ్యమైన విషయాలు నెమ్మదైన ప్రక్రియల ద్వారా మాత్రమే సాధించగలం’ అనే కాల్వీనో విదేశీ సంస్కృతులను గురించిన అవగాహన ఏ సంస్కృతికైనా కీలకం అనేవాడు. సొంత సృజన శక్తిని సజీవంగా ఉంచుకోవాలంటే విదేశీ ప్రభావాలకు సిద్ధంగా ఉండాలన్నాడు. ఇద్దరం కలుస్తున్నామంటే, భిన్న ప్రపంచాల్ని వెంట బెట్టుకుని వస్తాం; ఆ కలిసిన బిందువు నుంచి కొత్త కథ మొదలవుతుందంటాడు. ఒకరోజు– మనకు కవితలు, నవలలు రాసేలా కవికీ, రచయితకూ ప్రత్యామ్నాయం కాగలిగే సాంకేతిక పరిజ్ఞానం వస్తుందని 1967లోనే కాల్వీనో ఊహించిన విషయాన్ని ఛాట్ జీపీటీ నేపథ్యంలో పాత్రికేయుడు రాబెర్టో డి కారో గుర్తుచేసుకుంటారు. విదేశీ మాటలు, ప్రత్యేకించి ఆంగ్లపదం ‘ఫీడ్‌బ్యాక్’ మీద కాల్వీనో మోజు పడి, దాన్ని ఎలాగైనా ‘మిస్టర్ పొలొమార్’ ఆంగ్లానువాదంలో చేర్చాలని ఉబలాటపడ్డాడట. ‘సీన్యో(మిస్టర్ లాంటి ఒక గౌరవ వాచకం) కాల్వీనో! ఒక ఇటాలియన్ చెవికి ఆ పదం ఎంత అందంగా వినబడినా, ఆంగ్ల సాహిత్యంలో అదేమంత ఉచితంగా ఉండ’దని కాల్వీనో రచనలకు స్థిర అనువాదకుడిగా పనిచేసిన విలియమ్ వీవర్ తిరస్కరించాడట. అయితే, ఎంతటి కృత్రిమ మేధ వచ్చినా, చంద్రుడి పాలు మీగడలా చిక్కగా ఉంటాయని ఊహించిన కాల్వీనో మెదడును ఏ కంప్యూటరూ అందుకోలేదని మనం ఫీడ్‌బ్యాక్ ఇచ్చి ఆయన్ని ఆనందపరచొచ్చు! -
బ్రెయిన్ డెడ్ పార్టీకి సానుభూతి వైద్యం
వచ్చే ఫిబ్రవరి లోగా చంద్రబాబుకు బెయిల్ దొరికే అవకాశం లేదు! ఆయన మీద నమోదైన కేసులు, న్యాయస్థానాల్లో సీఐడీ చేస్తున్న వాదనలు పరిశీలించిన న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇది!! ఈ లోగానే ఆయనకు ఊరట లభించాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. పూర్వాశ్రమంలో ఇటువంటి అద్భుతాలు చంద్రబాబు వల్ల సాధ్యమయ్యేవి. ఆ మేజిక్ ఇప్పుడేమైపోయిందని బాబు అనుచరగణం కలవర పడిపోతున్నది. కొన్ని దశాబ్దాలుగా ఆయన్ను ఆశీర్వదిస్తూ వస్తున్న ‘అద్భుత’ దీపాలు కొన్ని ఇప్పుడు వానప్రస్థం స్వీకరించి మిణుకుమిణుకుమంటున్నాయి. కనుక ఇప్పుడు పాత మేజిక్ మీద ఆశ పెట్టుకోవడం కుదరకపోవచ్చు. చంద్రబాబు మీద నమోదైన నేర శిక్షాస్మృతి సెక్షన్లు ఆరు మాసాల్లోగా బెయిల్ లభించడానికి అనుమతించవు. కనుకనే చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఇదొక అక్రమ కేసుగా వాదిస్తూ విచారణే జరక్కుండా కొట్టివేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోపక్క చంద్రబాబు పార్టీ అనుయాయులు, యెల్లో మీడియా పెద్దలు సమష్టిగా ‘అక్రమ కేసు’ వాదాన్ని తీవ్రంగా ప్రచారంలో పెట్టే పనిలో నిమగ్న మయ్యారు. తప్పుడు సమాచారాన్ని అందజేసి కొందరు తట స్థుల చేత కూడా తమకు అనుకూలమైన ప్రకటనలు చేయించు కుంటున్నారు. యెల్లో మీడియా తనను తాను తాకట్టు పెట్టుకుంటూనే, బాబు సామాజిక వర్గాన్ని కూడా తాకట్టు పెడుతూ ఒక కృత్రిమ సానుభూతి వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం వారొక తప్పుడు వాదాన్ని తయారుచేసి అందుకు అనుగుణంగా లా పాయింట్లు లాగుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో అవినీతి జరిగిందా లేదా అనే చర్చను వారు పక్కనబెట్టి సాంకేతిక అంశాలను ముందుకు తెస్తున్నారు. ఆ సాంకేతిక అంశాలు కూడా న్యాయస్థానాల పరిశీలన ముందు నిలబడేవి కావని న్యాయకోవిదులు ఘంటాపథంగా చెబుతు న్నారు. ‘అవినీతి నిరోధక చట్టం (సవరణ, 2018) సెక్షన్ 17ఏ ప్రకారం చంద్రబాబును అరెస్టు చేయాలంటే (మాజీ ముఖ్య మంత్రి కనుక) గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఇక్కడ గవర్నర్ అనుమతి తీసుకున్నట్టు రికార్డు చేయలేదు కనుక కేసు కొట్టేయండి’ అని కోర్టులో వాదిస్తున్నారు. ‘ఒకసారి కేబినెట్ ఆమో దించిన తర్వాత దీన్ని ‘స్కామ్’ అని ఎట్లా అంటారు? ఇచ్చేయండి బెయిల్’ అని అభ్యర్థిస్తున్నారు. ఈ కేసులో దుర్వినియోగ మైన డబ్బులు బాబు ఇంటికి చేరినట్టుగా సాక్ష్యాలు చూపలేదు గనుక ఆయన్నెట్లా బాధ్యుడిని చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటివే మరికొన్ని సాంకేతిక అంశాలను రూపొందించుకొని చంద్రబాబు అరెస్టు అక్రమమనే వాదాన్ని యెల్లో మీడియా ప్రచారం చేస్తున్నది. ఈ రకమైన ప్రచారంతో సాను భూతిని సృష్టించడానికి పడరాని పాట్లు పడుతున్నది. ఇది రాజకీయ దురుద్దేశంతో, కక్షపూరితంగా నమోదైన కేసుగా చిత్రిస్తున్నది. ఒకవేళ రాజకీయ కక్షే నిజమైతే ఆ కక్ష ఏ ప్రభుత్వానిది? కేంద్రానిదా... రాష్ట్రానిదా? ఎందుకంటే ఈ కేసు 2016లోనే వెలుగు చూసింది. వెలుగులోకి తెచ్చింది కేంద్ర ఏజెన్సీలు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయంగా చంద్రబాబు నాయుడే! పుణేలో ఉన్న కొన్ని డొల్ల కంపెనీలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కోసం జీఎస్టీకి దరఖాస్తు చేసుకున్నాయి. సరుకులను కొనుగోలు చేసినప్పుడు చెల్లించిన జీఎస్టీలో మళ్లీ వాటిని అమ్మేసినప్పుడు కంపెనీలు పన్ను రాయితీని క్లెయిమ్ చేస్తాయి. సరుకులను సొంతానికి కాకుండా వ్యాపారం కోసం ఉపయోగించడం వల్ల ఈ రాయితీ లభిస్తుంది. ఎన్నడూ లక్ష రూపాయల వ్యాపారం కూడా చేసినట్టు చూపని కంపెనీలు హఠాత్తుగా భారీ ప్రమాణంలో ట్యాక్స్ ఇన్పుట్ను క్లెయిమ్ చేయడంతో జీఎస్టీ అధికారు లకు అనుమానం వచ్చి తనిఖీ చేశారు. ఈ తనిఖీలో డొల్ల కంపెనీల బాగోతం బయటపడింది. సరుకులు ఎక్కడా కొనకుండానే, అమ్మకుండానే బోగస్ ఇన్వాయిస్ (బిల్లులు)లు సృష్టించారని తేలిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కోసం సరుకులు సరఫరా చేస్తున్నట్టుగా బోగస్ ఇన్వాయిస్లు ఉండడంతో ఆ రాష్ట్ర ప్రజాధనాన్ని ఎవరో ఈ రకంగా కొల్లగొడుతున్నారని జీఎస్టీ అధికారులకు అర్థమైంది. దాంతో వారు ఈ సమాచారాన్ని రాష్ట్ర సీఐడీకి అందజేశారు. ముఖ్యమంత్రిగా అప్పుడు చంద్రబాబు ఉన్న కారణంగా కేసు ముందుకు కదల్లేదు. తర్వాత ఈ వ్యవహారంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ (ఈడీ) అధికారులు కూడా ప్రవేశించి కేసులు నమోదు చేశారు. ఈడీ, జీఎస్టీ అధికారులు కేంద్ర ప్రభుత్వంలో భాగం కనుక, ఈ కేసును వెలికితీసింది వారే కనుక రాజకీయ కక్ష, దురుద్దేశం నిజమైతే కేంద్రానికే ఉండాలి కదా! ఇక అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ సంగతి చూద్దాం. దీని ప్రకారం నిందితుడి అరెస్టుకు అతని నియామక అధికారి (అపాయింటింగ్ అథారిటీ) ముందస్తు అనుమతి అవసరమని ఈ సెక్షన్ చెబుతున్నది. ముఖ్యమంత్రిగా నియమించేది గవ ర్నర్ కనుక ఆయన అనుమతి ముందస్తుగా ఉండాలని తెలుగు దేశం వాదన. అరెస్టయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే మాత్రమే అనే సంగతిని కూడా పక్కనపెడదాం. సీఐడీ చేస్తున్న వాదన ప్రకారం ఈ సెక్షన్ అమల్లోకి వచ్చింది 2018లో! కానీ ఈ స్కామ్ జరిగిందీ, జిఎస్టీ, ఈడీలు కేసులు నమోదు చేసిందీ అంతకుముందే కనుక గవర్నర్ అనుమతి అవసరం లేదు. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన మరో విశేషమేమిటంటే చంద్రబాబు మీద కేవలం అవినీతి నిరోధక చట్టం కేసులు మాత్రమే నమోదు కాలేదు. సీఆర్పీసీ సెక్షన్లయిన 120బి, 107, 409 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కూడా కేసులు పెట్టారు. అవినీతి నిరోధక చట్టానికి జరిగిన సవరణ సీఆర్పీసీ సెక్షన్ల కింది జరిగిన అరెస్టులకు కూడా వర్తిస్తుందా? అందుకు ఏదైనా ఉదాహరణ ఉన్నదా? 409 రెడ్ విత్ 34 కేసులో ఆరు నెలల వరకు బెయిల్ రావడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీమెన్స్‌తో ఒప్పందాన్ని కేబినెట్ ఆమోదించిన తర్వాత అమలులో జరిగిన దుర్వినియోగానికి ముఖ్యమంత్రి ఎలా బాధ్యత వహిస్తారు అనేది యెల్లో మీడియా అమాయకంగా అడుగుతున్న మరో ప్రశ్న. ఒకవేళ కేబినెట్ భేటీ జరిగిందనే అనుకున్నా అనంతరం వెలువడిన జీవోలో ఏమున్నది? ఈ స్కీమ్‌కు సీమెన్స్ కంపెనీ 90 శాతం నిధులను ఉచితంగా కేటా యించడానికి ముందుకు వచ్చింది. మిగిలిన పదిశాతం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే చాలని ఉన్నది. కేబినెట్ జరిగి ఉంటే ఇదే విషయాన్ని చెప్పి ఉంటారు. కానీ ఆచరణలో ఒప్పందం ఎలా జరిగింది? ఎవరి మధ్యన జరిగింది? రాష్ట్ర ప్రభుత్వం తరఫున నైపుణ్యాభివృద్ధి సంస్థ సదరు ఒప్పందంలో భాగస్వామి కావాలి. కానీ, కాలేదు. డిజైన్‌టెక్ అనే ఓ ప్రైవేట్ సంస్థ భాగస్వామిగా మారింది. సీమెన్స్ సంస్థ తర ఫున ఆ సంస్థ ఇండియా అధికారి దొంగసంతకంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అది అతని రెగ్యులర్ సంతకం కాదనీ,దొంగ సంతకమనీ నిరూపణయింది. అతని ఉద్యోగం ఊడింది. ఒప్పందంతో తమకు సంబంధం లేదని సీమెన్స్ అధికారిక ప్రకటన చేసింది. న్యాయస్థానానికి కూడా లిఖిత పూర్వకంగా చెప్పింది. ఇదంతా బోగస్ వ్యవహారమనీ, దురుద్దేశ పూర్వకంగా జరిగిందని చెప్పడానికి ఇవన్నీ సరైన కారణాలు కావా? మరో కీలకమైన విషయం – జీవోలో చెప్పినదాని ప్రకారం సీమెన్స్ సంస్థ 90 శాతం నిధుల్లో ఒక్క పైసా విడుదల చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం వాటా మొత్తం రూ.371 కోట్లను విడుదల చేయడం! దాన్ని డిజైన్‌టెక్ అనే ప్రైవేట్ సంస్థ ఖాతాకు మళ్లించడం! ఇలా విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని అధి కారులు నోట్ ఫైల్లో రాసినా చంద్రబాబు పట్టుబట్టి విడుదల చేయించారు. ఈ మేరకు నోట్‌ఫైళ్లలో ఆయన ఆదేశాలు జారీ చేశారు. 13 చోట్ల సీఎం సంతకాలు చేశారని సీఐడీ ఆధారాలు చూపెట్టింది. స్కామ్ పూర్తిగా సీఎం కనుసన్నల్లో దురుద్దేశ పూర్వ కంగా జరిగిందనడానికి ఇంతకంటే రుజువులేం కావాలి? ఈ మొత్తం వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన గంటా సుబ్బారావు అనే వ్యక్తి, డిజైన్‌టెక్ కంపెనీ అధిపతి, సీమెన్స్ ఇండియాలోని ఉద్యోగి– ఈ ముగ్గురితో కలిసి కుట్రపూరితంగా నాటి ముఖ్య మంత్రి పథక రచన చేశారనడానికి కావల్సిన ఆధారాలు ఇవన్నీ! ఇక్కడే సీఆర్పీసీ సెక్షన్ 409, సెక్షన్ 34 వర్తిస్తున్నాయి. సెక్షన్ 409 అంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్! నమ్మక ద్రోహానికి పాల్పడటం! ప్రజలు నమ్మకంతో అప్పగించిన ముఖ్యమంత్రి పదవిని స్వార్థ ప్రయోజనాల కోసం గానీ, ఇతరుల ప్రయోజనాల కోసం గానీ వినియోగించడం!! ప్రజా ధనానికి పరిరక్షకుడిగా ఆయన్ను ప్రజలు నియమించారు. ఆ నమ్మకాన్ని వమ్ముచేస్తూ ఆ ధనాన్ని షెల్ కంపెనీలకు తరలించడంలో కీలకపాత్రను పోషించారు. సెక్షన్ 34 – ఈ స్కామ్ వెనుకనున్న దురుద్దేశానికి వర్తిస్తుంది. ఈ రెండు సెక్షన్లూ రుజువైతే కనీసం పదేళ్ల జైలుశిక్ష పడుతుంది. ‘సదరు స్కామ్ డబ్బులు బాబు జేబులోకే వెళ్లాయనేందుకు రుజువేమిటి? అది రుజువు చేయకుండా ఎలా కేసు పెడతారు? ఎలా అరెస్టు చేస్తార’ని మరో ప్రశ్నను టీడీపీ వారూ, యెల్లో మీడియా వారూ సంధిస్తున్నారు. బాబు మీద నమోదు చేసిన సీఆర్పీసీ 120బి, 107 సెక్షన్లు ఏం చెబుతున్నాయి? కుట్రలో భాగస్వామి అయితే చాలు సెక్షన్ 120బి వర్తిస్తుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఉండనక్కర్లేదు. అందుకు అనుమానం, ఆస్కా రం కలిగించే పరిస్థితులుంటే చాలు. అంటే సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ చాలు. 107 అంటే ఒక నేరాన్ని ప్రోత్సహించడం. కనుక చంద్రబాబు జేబులోకి డబ్బులు వెళ్లాయా లేదా అనే విషయాన్ని అరెస్టుకు ముందో, రిమాండ్‌కు ముందో నిర్ధారణ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడో ఉదాహరణ చెప్పుకో వచ్చు. ‘ఏ’ అనే వ్యక్తి కుట్రపూరితంగా, దురుద్దేశంతో ‘బి’ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశాడు. ‘బి’ బంధువులకు ఫోన్ చేసి ‘సి’అనే వ్యక్తికి డబ్బు చేరిస్తే విడుదల చేస్తానని చెప్పాడు. డబ్బు ‘సి’ చేతికి చేరుతుంది. డబ్బు నా చేతికి రాలేదు కనుక నేను నేరస్థుడిని కాదని ‘ఏ’ అనేవాడు బుకాయిస్తే చెల్లుతుందా? షెల్ కంపెనీల ద్వారా డబ్బును చంద్రబాబు గూటికి చేర్చడంలో ఆయన పీఏ శ్రీనివాస్ ముఖ్య భూమికను పోషించాడని సీఐడీ భావిస్తున్నది. అతడికి నోటీసులు ఇవ్వగానే దేశం విడిచి పారిపోయాడు. కుట్ర జరిగిందనడానికి ఇది మరో బలమైన సాక్ష్యం. రెండు రోజుల క్రితం ఏసీబీ న్యాయస్థానంలో సీఐడీ తరఫున వాదించిన ఏఏజీ సుధాకర్‌రెడ్డి ఓ కొత్త విష యాన్ని చెప్పారు. స్కామ్ సొమ్ములో ఓ 27 కోట్లు విరాళంగా తెలుగుదేశం పార్టీ ఖాతాకు చేరాయని ఆయన చెప్పారు. 27 కోట్ల విరాళం విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా నిర్ధారించారు. ఈ ఆరోపణకు సీఐడీ వారు ఆధారాలు చూపగలిగితే తెలుగుదేశం పార్టీ ఆస్తులనూ, ఖాతాలనూ సీజ్ చేసే పరిస్థితి రావచ్చు. అదే జరిగితే మూలిగే నక్కపై తాటిపండు పడినట్టే! ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఒక జీవచ్ఛవంలా తయారైంది. రక్తప్రసరణ దాదాపుగా నిలిచిపోయింది. సొంత పుత్రుడు, బావమరిది పార్టీని ఉద్ధరిస్తారనే నమ్మకాన్ని చంద్ర బాబు కూడా కోల్పోయి ఉంటారు. వైసీపీ వారు దత్తపుత్రుడిగా అభివర్ణించే పవన్ కల్యాణ్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పిలిపించుకున్నారు. చెవిలో ఏం చెప్పారో తెలియదు కానీ, బయటికి రాగానే పవన్ కల్యాణ్ ఆవేశంతో మాట్లాడారు. తెలుగుదేశం – జనసేన పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. ఆయన పక్కన మామాఅల్లుళ్ళు చేతులు కట్టుకొని అనుచరుల్లా నిలబడిపోయారు. తాను ‘అలగా జనం’గా పరిగణించే వారి సమక్షంలో బాలయ్య బ్రాండ్ బ్లడ్డూ, బ్రీడూ తల వంచుకొని నిలబడాల్సి వచ్చింది. ఆ పూటకు అలా గడిచిపోయింది. తర్వాత మూడు వారాల పాటు చినబాబూ లేడు, పవన్‌బాబూ లేడు. బాలయ్య బాబు పెద్దగా సందడి చేయలేదు. చినబాబు ఢిల్లీలో దాక్కున్నారు. అరెస్టు భయంతో పారిపోయాడని పార్టీ శ్రేణులు భావించాయి. మొన్న రాష్ట్ర సీఎం ఢిల్లీకి వెళ్ళగానే చినబాబు రాజమండ్రికి తిరిగొచ్చారు. తీరా సీఎం రాష్ట్రానికి రాగానే, చినబాబు భార్యను తీసుకొని మళ్ళీ ఢిల్లీ బాట పట్టాడు. కార్యకర్తల నైతిక స్థైర్యం పూర్తిగా దెబ్బతిన్నది. పార్టీలో కదలిక కోసం నానాతంటాలు పడవలసి వస్తున్నది. చివరికి బాబు సొంత సామాజిక వర్గంలో భావోద్వేగాలను రెచ్చగొట్టి నిరసన కార్యక్రమాలను మమ అనిపిస్తున్నారు. వారం రోజుల కిందనే మళ్లీ రంగప్రవేశం చేసిన పవన్ కల్యాణ్ కూడా తెలుగుదేశం పరిస్థితిపై బహిరంగ వ్యాఖ్యానాలు చేయవలసి వచ్చింది. ఆ పార్టీ పూర్తిగా బలహీన పడినందువల్లనే తాము యువరక్తం ఎక్కించవలసి వస్తున్నదని ఆయన సభలోనే ప్రకటించారు. తెలుగుదేశం – జనసేన పార్టీలు ఉమ్మడిగా కృషిచేసినా పవన్ సభలు గతంతో పోలిస్తే బోసిపోతున్నాయి. రెండు పార్టీల పొత్తు పట్ల జనసేనలో వ్యతిరేకత, తెలుగుదేశం శ్రేణుల మనోధైర్యం దెబ్బతినడం ఈ పరిస్థితికి కారణం. జనస్పందన తగ్గడంతో పవన్ కూడా షాక్ తిన్నట్లున్నారు. గతంలో పదిహేను రోజులకో, నెలకో మాట మార్చేవాడు. ఇప్పుడు ప్రతిరోజూ మారుస్తున్నారు. ఒకరోజు ఎన్డీఏ నుంచి బయటకొచ్చానంటాడు. ఆ మరుసటి రోజే ఎన్డీఏలోనే ఉన్నానని అంటాడు. అవినీతి రెండు రకాలని ఓ కొత్త భాష్యాన్ని చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు చేసిన అవినీతి ‘ఆమోదయోగ్యమైన’దేనట! ఇదెక్కడి దౌర్భాగ్యం! పైగా ప్రజలే అవినీతిపరులంటూ శాప నార్థాలు పెడుతున్నారు. ఆయన పూర్తిగా బ్యాలెన్స్ కోల్పో యారు. జనం నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు ఆశలు పెట్టుకున్న అస్త్రాలన్నీ ఇలా విఫలమవుతున్నాయి. ఈ స్థితిలో ఆయన ఇంకో ఆరు నెలలు జైల్లోనే ఉంటే పార్టీ బ్రెయిన్ డెడ్ ఖాయం. బయటకు వచ్చి అవయవదానం చేయవలసిందే! ఈ స్థితిని తప్పించడానికి యెల్లో మీడియా తెగ ప్రయాసపడుతున్నది. ‘ప్రజాస్వామ్యం కోసం’ అనే ముసుగులో మేధావుల పేరుతో కావలసినవారిని కొందరిని సమీకరించి ఒక సానుభూతి వాతావరణాన్ని సృష్టించడానికి తంటాలు పడు తున్నారు. అధినేత అవినీతికి ఇప్పుడు పార్టీ మూల్యం చెల్లిస్తున్నది. అది పతనోన్ముఖాన వేగంగా జారిపోతున్నది. ఎలాగోలా బతికించాలని యెల్లో మీడియా తాపత్రయం. ‘అక్క ఆరాటమే గాని బావ బతికేట్టు లేడు!’ వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఏ వెలుగులకీ ప్రస్థానం!
చదివేస్తే ఉన్న మతి పోయిందని నానుడి. బాంబే ఐఐటీ పాలకవర్గం నిర్వాకం వల్ల తిండి చుట్టూ మన సమాజంలో అల్లుకొని ఉన్న వివక్ష ఆ ఉన్నత శ్రేణి విద్యాసంస్థను కూడా తాకింది. బాంబే ఐఐటీ హాస్టళ్లలో మూణ్ణెల్ల క్రితం శాకాహారులకు విడిగా టేబుల్స్ కేటాయించాలన్న డిమాండ్ బయల్దేరింది. మాంసాహారుల పక్కన కూర్చుంటే ఆ ఆహారం నుంచి వచ్చే వాసనల కారణంగా తమలో వికారం, వాంతులు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆ డిమాండు చేస్తున్నవారి ఫిర్యాదు. ఎప్పుడో 1958లో స్థాపించిన ఆ విద్యాసంస్థలో ఇప్పుడే ఈ డిమాండ్ ఎందుకు తలెత్తిందన్న సంగతలా వుంచితే... దాన్ని అంగీకరిస్తే మాంసాహారం అపవిత్రం లేదా మలినం అని సమాజంలోని కొన్ని వర్గాల్లో నెలకొన్న అభిప్రాయానికి ఆమోదముద్ర వేసినట్టవుతుందన్న సందేహం బాంబే ఐఐటీ పాలకవర్గానికి కలగలేదు. ప్రాంగణంలోని మూడు హాస్టళ్లలో విడిగా ఆరు టేబుళ్లను ‘వెజిటేరియన్ ఓన్లీ’ బోర్డులతో అలంకరించింది. అంతటితో ఊరుకోలేదు. దీనిపై నిరసన వ్యక్తం చేసిన విద్యార్థికి రూ. 10,000 జరిమానా విధించింది. ఈ నిరసన ఘర్షణకు దారితీస్తుందనీ, క్రమశిక్షణ ఉల్లంఘన కిందికొస్తుందనీ డీన్ అంటున్నారు. ఇలాంటి డిమాండ్ తలెత్తినప్పుడు దానిపై అందరి అభిప్రాయాలూ తీసుకోవటం, ఒక కమిటీని నియమించటం, దాని సాధ్యాసాధ్యాలు, పర్యవసానాలపై చర్చించటం ప్రజాస్వామిక పద్ధతి. అలాంటి విధానమే అమలైవుంటే శాకాహార విద్యార్థులు అంతిమంగా తమ డిమాండ్‌ను వదులుకునేవారో, మాంసాహార ప్రియులు వారి సమస్య పట్ల సానుభూతితో వ్యవహరించేవారో తెలిసేది. ఈ ప్రక్రియ అమలైందా లేదా... అందులో వచ్చిన అనుకూల, ప్రతికూల అభిప్రాయాలేమిటన్నది ఎవరికీ తెలియదు. బాంబే ఐఐటీలోని అంబేడ్కర్ పెరియార్ ఫూలే స్టడీ సర్కిల్ (ఏపీపీఎస్సీ) విద్యార్థుల ప్రకారం పాలకవర్గం ఈ మొత్తం వ్యవహారాన్ని గోప్యంగా ఉంచింది. కనుక సహజంగానే నిరసనలు వ్యక్తమయ్యాయి. ‘మేం ఏం చేసినా శిరసావహించాల్సిందే, లేకుంటే కొరడా ఝళిపిస్తాం’ అన్నట్టు వ్యవహరించటం, ప్రశ్నించటమే నేరమన్నట్టు పరిగణించటం ఉన్నత శ్రేణి విద్యాసంస్థకు శోభస్కరం కాదు. వికారాలున్నవారిని దూరంగా పోయి తినమని చెప్పక గోటితో పోయేదానికి గొడ్డలి అందుకున్నట్టు ఇంత రాద్ధాంతం దేనికో అర్థం కాదు. పాశ్చాత్య దేశాల్లో కూడా శాకాహారం, మాంసాహారం విభజన వుంది. డెయిరీ ఉత్పత్తులు సైతం సమ్మతం కాదనే వెగానిజం కూడా అక్కడుంది. అమెరికన్లలో గత మూడు నాలుగేళ్లలో దాదాపు 15 శాతం మంది శాకాహారులుగా మారారని ఈమధ్య ఒక సర్వే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2020లో 1,400 కోట్ల డాలర్లుగా ఉన్న వెగాన్ మార్కెట్, ఆ మరుసటి ఏడాదికి 1,577 కోట్ల డాలర్లకు పెరిగిందని మరో సర్వే అంటున్నది. అయితే మన దేశంలో వలే అక్కడ తినే ఆహారం కులాలతో ముడిపడి లేదు. ఇక్కడ శాకాహారులు చాలా ఉన్నతులనీ, మాంసాహారులు తక్కువనీ అభిప్రాయం బలంగా పాతుకుపోయింది. అందుకు మన సంస్కృతి, సంప్రదాయాలు కూడా దోహదపడుతున్నాయి. ఆహారపుటలవాట్లలో కులాన్ని వెతకటం పాక్షిక దృష్టి అంటున్నవారు కొన్ని తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, కశ్మీర్ వంటిచోట్ల బ్రాహ్మణులు మాంసాహారులుగా ఉండటాన్ని ఉదహరిస్తున్నారు. కానీ ఇవి చెబుతున్నవారు మన దేశంలో చాలాచోట్ల అట్టడుగు కులాలవారికి అద్దెకు ఇల్లు ఇవ్వకుండా ఉండటానికి ‘వెజిటేరియన్లకు మాత్రమే’ అనే బోర్డులు పెడుతున్న ధోరణిని మరిచిపోకూడదు. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను ఒంటిస్తంభం మేడలో ఉంచి చదువు చెప్పించాలనుకోకుండా... ప్రాథమిక విద్య మొదలుకొని అన్ని దశల్లోనూ విద్యాసంస్థలకు పంపటంలో ఒక అంతరార్థం ఉంటుంది. వివిధ వర్గాల పిల్లలతో కలిసిమెలిసి పెరగటం, సామాజిక అవగాహన పెంపొందించుకోవటం అనే లక్ష్యాలు కూడా అంతర్లీనంగా ఇమిడివుంటాయి. తెలియనిది తెలుసుకోవటం, భిన్నత్వాన్ని గౌరవించటం, అవసరమైతే ప్రశ్నించటం, ఈ క్రమంలో తనను తాను మార్చుకోవటం కూడా విద్యాసముపార్జనలో భాగమే. బాధ్యతాయుతమైన రేపటి పౌరులుగా రూపొందటానికి ఇవన్నీ అవసరం. బాంబే ఐఐటీలో చదువుతున్నవారు పరిశోధనల కోసమో, ఉన్నతోద్యోగాల కోసమో విదేశాలకు వెళ్లవలసి వచ్చినప్పుడు తోటి మనిషి ఆహారాన్ని చూసి వికారాలు తెచ్చుకోవటం అక్కడికి కూడా మోసుకుపోతే క్షణకాలమైనా మనుగడ సాగించగలరా? ఈ ఆలోచన వాళ్లకు రాకపోతే పోయింది... సంస్థ నిర్వాహకులకేమైంది? ఉన్నతశ్రేణి విద్యాసంస్థల్లో ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని రాజ్యసభలో మొన్న జూలైలో కేంద్రం తెలిపింది. ఈ ఉదంతాల్లో వ్యక్తిగత కారణాలను వెదకటం తప్ప సంస్థాగతంగా ఎలాంటి దిద్దుబాటు చర్యలు అవసరమన్న విచికిత్సలోకి పోవటం లేదు. తినే తిండి మొదలుకొని ఎన్నిటినో ఎత్తి చూపి న్యూనత పరిచే ధోరణి ఉండటాన్ని ఈ సంస్థల పాలకవర్గాలు గుర్తించటం లేదు. బాంబే ఐఐటీ మరో అడుగు ముందుకేసి అలాంటి ధోరణులను బలపర్చే నిర్ణయాన్ని తీసుకోవటం ఆందోళన కలిగించే అంశం. ఈ జాడ్యం హైదరాబాద్ ఐఐటీకి కూడా వ్యాపించిందంటున్నారు. ఏకంగా శాకాహారుల కోసం అది ప్రత్యేక హాల్ కేటాయించబోతున్నదన్న వార్తలొస్తున్నాయి. తమ సంస్థల్ని ప్రపంచ శ్రేణి విద్యా కేంద్రాలుగా రూపుదిద్దటం ఎలాగన్న ఆలోచనలు మాని, క్షీణ విలువలను తలకెత్తుకోవటం ఏ మేరకు సమంజసమో నిర్వాహకులు ఆలోచించాలి. -
నలభయ్యారు రోజుల పండుగ!
నలభై ఆరు రోజులు... 48 మ్యాచ్‌లు... దేశంలోని 10 వేర్వేరు నగరాలు... 10 అంతర్జాతీయ క్రికెట్ జట్లు. ఒక క్రీడా సంరంభానికి ఇంతకు మించి ఇంకేం కావాలి? అక్టోబర్ 5న ఆరంభమైన ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్–2023 కచ్చితంగా మరో పెద్ద ఆటల పండుగ. ఒక పక్కన చైనాలో ఆసియా క్రీడోత్సవాల హంగామా సాగుతుండగానే మన గడ్డపై మరో సందడి మొదలైపోయింది. నాలుగేళ్ళకు ఓసారి సాగే అంతర్జాతీయ వన్డే ప్రపంచ కప్ షురూ అయింది. నిరుటి ఛాంపియన్ ఇంగ్లండ్ ఈసారీ బలమైన జట్టుగా ముందుకు వస్తుంటే, సొంతగడ్డపై సాగుతున్న పోటీలో కప్పు కొట్టాలనే ఒత్తిడి భారత జట్టుపై ఉంటుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు సైతం బలమైన పోటీదార్లుగా నిలుస్తుంటే, ఆఖరు నిమిషంలో తడబడతారనే పేరున్న దక్షిణాఫ్రికా జట్టు ‘అనూహ్యమైన గెలుపుగుర్రం’ కావచ్చని ఓ అంచనా. గత వరల్డ్ కప్‌లో లానే పోటీలో పాల్గొనే పది జట్లూ లీగ్ దశలో పరస్పరం తలపడే ఈ ప్రపంచపోటీ రానున్న నెలన్నర కాలంలో విస్తృత చర్చనీయాంశం కానుంది. యాభై ఓవర్ల ఈ వన్డే మ్యాచ్‌ల వరల్డ్ కప్‌కు గతంలో 1987, 1996, 2011ల్లో భారత్ ఆతిథ్యమిచ్చింది. అయితే, అప్పుడు ఉపఖండంలోని ఇతర దేశాల సహ ఆతిథ్యంలో అవి సాగాయి. కానీ, ఈసారి పూర్తిగా మనమే ఆతిథ్యమిస్తున్నాం. సరిగ్గా దసరా, దీపావళి పండుగ సీజన్లోనే వరల్డ్ కప్ రావడంతో తమకు కలిసొస్తుందని ప్రకటనకర్తలు భావిస్తున్నారు. తమ ఉత్పత్తుల కొనుగోళ్ళు పెరుగుతాయని బ్రాండ్లన్నీ ఉత్సాహపడుతున్నాయి. దానికి తోడు ఆతిథ్య దేశం భారత్ కావడంతో ఉత్పత్తుల ప్రచారం మరింతగా జనంలోకి చొచ్చుకుపోతుందని భావిస్తున్నాయి. ఈ వాణిజ్య ప్రకటనల ఆదాయంలో సింహభాగం తాజా వరల్డ్ కప్‌కు అధికారిక మీడియా హక్కులున్న డిస్నీ స్టార్‌కు చేరుతుంది. పలు బ్రాండ్లు టీవీ, డిజిటల్ వేదికల్లో స్పాన్సర్షిప్ కోసం డిస్నీస్టార్తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. నాకౌట్ మ్యాచ్‌ల వేళ టీవీలో 10 సెకన్ల ప్రకటన ఇప్పుడు రూ. 30 లక్షల పైనే అని వార్త. ఈ వరల్డ్ కప్‌తో ప్రయాణ, పర్యాటక, ఆతిథ్య, ఆహార రంగాలు ప్రధానంగా లబ్ధి పొందుతాయని నిపుణుల విశ్లేషణ. మ్యాచ్‌ల పుణ్యమా అని ఇప్పటికే విమాన టికెట్ల రేట్లు, హోటల్ బస రేట్లు భారీగా పెరిగాయి. దేశ స్టాక్ మార్కెట్‌పైనా గణనీయమైన ప్రభావం ఉంటుందని అంచనా. సినిమా, క్రికెట్‌లంటే ప్రాణాలిచ్చే భారత్‌లో మామూలుగా అయితే, వన్డే క్రికెట్ వరల్డ్ కప్ అంటే చంద్రమండల యాత్ర అంత సంబరం ఉండాలి. విచిత్రంగా ఈసారి ఎందుకనో ఆ క్రేజు వ్యాపారంలోనే తప్ప వ్యవహారంలో కనిపించట్లేదు. మన దేశమే పూర్తిగా ఆతిథ్యమిస్తున్నప్పటికీ, తాజా కప్‌కు ముందస్తు హంగామా అంతగా లేదు. దాదాపు లక్షా 30 వేల మంది కూర్చొనే సౌకర్యంతో ప్రపంచంలోనే పెద్ద క్రికెట్ స్టేడియమ్గా పేరొందిన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియమ్లో గురువారం అంతా కలిపి 20 వేల మంది కూడా లేరు. ఆది నుంచీ ఆన్లైన్లో కొనడానికి టికెట్లు దొరకలేదు గానీ, తీరా మ్యాచ్ రోజున మైదానమంతా ఖాళీగా ఉంది. లార్డ్స్‌లో గత 2019 వరల్డ్ కప్ ఫైనల్లో హోరాహోరీగా తలపడ్డ న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ తాజా ప్రపంచ కప్‌ను ప్రారంభించారు. కానీ లాభం లేకపోయింది. భారత జట్టుతో తొలి మ్యాచ్ మొదలుపెడితే ఊపు వచ్చేదేమో! నిజానికి, 1999 నుంచి ఐసీసీ వరల్డ్ కప్‌గా పేరుబడ్డ ఈ పోటీల్లో ఆతిథ్యదేశం ఆరంభమ్యాచ్‌లో పాల్గొనడం ఆనవాయితీ. అదెందుకు మార్చారో తెలియదు. ఈసారి మ్యాచ్ టికెట్ల కొనుగోలు అసాధ్యమైపోయింది. ఆఖరి నిమిషంలో మ్యాచ్‌ల తేదీలు, వేదికలు మారిపోయాయి. ఇవి చాలదన్నట్టు 2000లల్లో టీ20 మ్యాచ్‌లకు అలవాటు పడ్డ కొత్త తరానికి ఐపీఎల్ సరికొత్త నంబర్ వన్ టోర్నమెంట్‌గా అవతరించింది. వెరసి, 2011లో భారత్ ఆతిథ్యమిచ్చినప్పటితో పోలిస్తే పన్నెండేళ్ళ తర్వాతి ఈ వరల్డ్ కప్ ఆ స్థాయి హడావిడి సృష్టించట్లేదు. అలాగే, గతంలో వరల్డ్ థీమ్సాంగ్ ప్రతి ఛానల్లో మోత మోగేది. ఈసారి రణ్‌బీర్ సింగ్‌తో చేసిన ‘దిల్ జష్న్ బోలే...’ పాట విఫలమైంది. ఇక, మైదానం వెలుపల అవలక్షణాలకు కొదవ లేదు. ఐసీసీ వార్షిక ఆదాయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) వాటా 72 శాతానికి పెరిగింది. మిగతా దేశాల క్రికెట్ బోర్డులు బాగా వెనకబడ్డాయి. దాంతో, ఎప్పటిలానే బీసీసీఐ తన హజం చూపిస్తోంది. బీసీసీఐ అక్రమాలకు నెలవంటూ సుప్రీమ్ కోర్ట్ వేసిన ముగ్గురు సభ్యుల సంఘం నివేదిక లోపాలెత్తిచూపినా అది తన పంథా మార్చుకోలేదు. చిత్రంగా అధికారిక అమ్మకాలు మొదలైనా కాక ముందే టికెట్లు ‘అమ్ముడైపోయాయి’ అని బోర్డులు వెలిశాయి. మచ్చుకు, అహ్మదాబాద్‌లోని అదే భారీ స్టేడియమ్లో జరిగే భారత – పాకిస్తాన్ మ్యాచ్‌కు 8500 టికెట్లే అమ్మకానికి పెట్టారంటే ఏమనాలి? భారీ క్రికెట్ వేదికలైన ముంబయ్, కోలకతాలను వెనక్కినెట్టి, ఈసారి అహ్మదాబాద్ ముందుకు రావడంలోనూ రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఆటకు సంబంధం లేని ఇతర ప్రయోజనాలను పక్కనపెట్టి, భారత్ తన ప్రతిష్ఠను పెంచుకోవడానికి ఇది మరో అవకాశం. జీ20 సదస్సు నిర్వహణ తర్వాత అంతర్జాతీయ వేదికపై మరోసారి మన పేరు మోగడానికి మంచి సందర్భం. దాన్ని చేజార్చుకోకూడదు. 1975లో మొదలైనప్పటి నుంచి ఆతిథ్య దేశాలేవీ కప్ గెల్చుకోలేదన్న వాదనను 2011 ఏప్రిల్‌లో మన ధోనీ సేన సమర్థంగా తిప్పికొట్టింది. తర్వాత 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లండ్‌లు అదే బాటలో నడిచాయి. కోహ్లీ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా లాంటి బ్యాట్స్మన్లు, బుమ్రా, షమీ, షిరాజ్ లాంటి పేసర్లు, అశ్విన్, కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్లతో పటిష్ఠమైన రోహిత్ సేన ఆ కథ పునరావృతం చేయాలని ఆశ. రాజకీయాల కన్నా ఆట, వ్యక్తిగత రికార్డుల కన్నా దేశం గొప్పదని గ్రహిస్తే, నిర్వాహకులైనా, ఆటగాళ్ళైనా అద్భుతాలు చేయడం అసాధ్యమేమీ కాదు! -
మనకు కొత్త సవాలు
తరచూ రాజకీయ సంక్షోభాలు చవిచూసే ద్వీపసమూహ దేశం మాల్దీవుల్లో ఈసారి శాంతియుతంగా అధికార మార్పిడి జరిగింది. అది సంతోషజనకమే అయినా, ఈ తాజా అధ్యక్ష ఎన్నిక ఫలితాలు భారత్‌లో కొత్త ఆందోళన రేపుతున్నాయి. చైనాకు అనుకూలుడైన ప్రతిపక్ష అభ్యర్థి దేశాధ్యక్షుడు కానుండడమే అందుకు కారణం. మాల్దీవులకు కొత్త అధ్యక్షుడి రాకతో, ఇప్పటి దాకా అక్కడున్న పలుకుబడి, పట్టు భారత్ కోల్పోనుంది. అది గణనీయమైన నష్టమే. రక్షణ రంగం, ప్రాథమిక వసతుల ప్రాజెక్టుల్లో మాల్దీవులతో భారత సంబంధాలే ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాంశం కావడం గమనార్హం. మాల్దీవులపై డ్రాగన్ దేశం మరోసారి పట్టు సాధించే అవకాశం రావడంతో ఢిల్లీ – మాల్దీవుల బంధానికి ఇది పరీక్షా సమయం. ప్రభుత్వం మారినా, కీలకమైన మాల్దీవుల్లో తన ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేయడం భారత్‌కు ఇప్పుడు తప్పనిసరి. అంతేకాక, గడచిన రెండు దశాబ్దాలుగా చైనా తన ప్రాబల్యం పెంచుకొంటూ, మన పెరట్లో తన పట్టు బిగిస్తున్న వైనాన్ని గమనించి జాగ్రత్తపడక తప్పదని మరోసారి రుజువైంది. భారత్‌కు దక్షిణంగా సుమారు 450 మైళ్ళ దూరంలో, కేవలం 5 లక్షల జనాభా ఉండే మాల్దీవులు చిరు ద్వీపదేశమే. అయితే, హిందూ మహాసముద్రంలో రద్దీగా ఉండే నౌకా రవాణా మార్గంలో నెల కొన్నందున వ్యూహాత్మకంగా చాలా కీలకం. అందుకే, ఆ దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు అనేసరికి భారత, చైనాల్లో ఆసక్తి నెలకొంది. ఒక విధంగా చూస్తే ఈ ఎన్నికలు... ద్వీపదేశంపై భారత, చైనాల్లో ఎవరికి పట్టు ఎక్కువుందో తెలియపరిచే ప్రజాభిప్రాయ సేకరణ పోటీ లాంటివి. రాజధాని మాలే నగరానికి ప్రస్తుతం మేయర్‌గా ఉంటూ, దేశాధ్యక్ష పదవికి పోటీ పడ్డ ముయిజు మొదటి నుంచి చైనాతో సన్నిహిత సంబంధాల్ని కోరుకుంటున్నారు. నిజానికి, జనంతో క్రిక్కిరిసిన రాజధానిలో జాగా కొరత వల్ల తలెత్తిన గృహవసతి సమస్య, తరిగిపోతున్న డాలర్ రిజర్వులు సహా అనేక అంశాలు ఈ ఎన్నికల ప్రచారంలో ముందుకు వచ్చాయి. అయితే, చివరకు మాల్దీవుల భవితపై ఆసియాలోని రెండు అగ్రదేశాల ప్రభావం చుట్టూరానే ఓటింగ్ సరళి సాగింది. దాదాపు 85 శాతానికి పైగా ఓటింగ్‌లో పాల్గొన్న ఈ ఎన్నికల్లో ఓటర్లు భారత, చైనా వర్గాలుగా చీలిపోయారని చెప్పవచ్చు. ఇరుగుపొరుగు దేశాల్లో పలుకుబడిని పెంచుకొనే ప్రయత్నాలు భారత, చైనాలు రెంటికీ కొత్త కాదు. ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’ (బీఆర్ఐ) కింద అభివృద్ధి రుణాలతో మాల్దీవుల్లో చైనా ముందుగా అడుగేసింది. ఇటీవల కొన్నేళ్ళుగా భారత్ తన పట్టు చాటింది. నిరుడు శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పతనమైనప్పుడు వందల కోట్ల డాలర్ల సాయం అందించిన ఢిల్లీ 2018లో సోలిహ్ అధ్యక్షు డిగా ఎన్నికైన నాటి నుంచి ద్వీపదేశంలో తన ఉనికిని విస్తరించింది. ప్రాజెక్టులూ పెరిగాయి. నిజం చెప్పాలంటే – గతానికి భిన్నంగా గత అయిదేళ్ళలో భారత అనుకూల సోలిహ్ పాలనలో మాల్దీవుల్లో శాంతి, స్వేచ్ఛ నెలకొన్నాయి. అంతకు ముందు అయిదేళ్ళు ప్రస్తుతం అవినీతి ఆరోపణలపై జైలులో ఉన్న చైనా అనుకూల అబ్దుల్లా యమీన్ పాలన సాగింది. అయితే, ప్రస్తుత సర్కార్ మాల్దీవుల సార్వభౌమాధికారాన్ని భారత్‌కు తాకట్టు పెడుతోందనే భావనను జనంలో ప్రతిపక్ష కూటమి కల్పించగలిగింది. ‘ఇండియా అవుట్’ అనే దాని నినాదాల భావోద్వేగం ఫలించింది. సెప్టెంబర్ మొదట్లో జరిగిన తొలి రౌండ్ ఓటింగ్‌లో 8మంది అభ్యర్థుల్లో సోలిహ్‌కు 36 శాతం, ముయిజుకు 46 శాతం వచ్చినా, ఎవరూ అర్ధశతం దాటలేదు. అలా అదనపు రెండో విడత ఓటింగ్ అవసరమైంది. ఈసారి ప్రతిపక్ష ముయిజు స్పష్టమైన విజేతగా నిలిచారు. బ్రిటన్‌లో చదువుకొని, సివిల్ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ చేసి, ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన 45 ఏళ్ళ ముయిజు రాజకీయా ల్లోకి రాక ముందు ప్రైవేట్ రంగంలో ఇంజనీర్. మాలేకు మేయర్ అవడానికి ముందు ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా వ్యవహరించారు. తాజా ఎన్నికల్లో ముయుజు గెలుపునకు సోలిహ్ తప్పులూ కారణమే. దేశానికి భారత్ నుంచి పెట్టుబడులు, అభివృద్ధి సాయం అందుతున్న మాట అటుంచి, ఓ చిన్న భారత సైనికదళాన్ని దేశంలోకి తెచ్చారన్న ప్రత్యర్థుల ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టలేక పోయారు. అలాగే, దేశాధ్యక్షుడయ్యేందుకు తనకు సాయపడ్డ బాల్యమిత్రుడు పార్టీని చీల్చి, కొత్త కుంపటి పెట్టే పరిస్థితి తెచ్చుకున్నారు. ఆ పార్టీ 7 శాతం ఓట్లు సాధించడం పెద్ద దెబ్బ అయింది. భారత్ సంగతికొస్తే ఈ ఫలితాల్ని అతిగా అంచనా వేసినా తప్పే! అలాగని తక్కువగా అంచనా వేసినా చిక్కే!! భౌగోళిక సామీప్యం, ఉమ్మడి భద్రతా ప్రయోజనాలు, సాంస్కృతిక సాన్నిహిత్యం రీత్యా మాలేతో మనది లోతైన బంధం. కానీ, ఇండో– పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో చైనా తన ఛాయను విస్తరిస్తూ, ఆర్థిక – వ్యూహాత్మక గణితంలో మాలేను తెలివిగా భాగం చేసుకుంది. సోలిహ్ పాలనలో గణనీయంగా పెట్టుబడులు పెట్టి, ‘గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్’ సహా అనేక ప్రాథమిక వసతులకు ఆర్థిక సాయం చేసిన భారత్ ఇప్పుడు చాకచక్యంగా వ్యవహరించాలి. మాలేతో మనది ప్రభుత్వాల మార్పుతో సంబంధం లేని సుస్థిర బంధమని చాటాలి. కొత్త సర్కా రుతో స్నేహానికి భారత విదేశాంగ విధాన వ్యవస్థ శ్రమించాలి. భారత వ్యతిరేక అపోహలు పోగొట్టేలా రాజకీయంగా అన్ని పార్టీలతో సుహృద్భావం పెంచుకోవాలి. ఇండియా పొడ గిట్టని యమీన్ రేపు మళ్ళీ తెర వెనుక చక్రం తిప్పుతారని భావిస్తున్న వేళ... కొత్త అధ్యక్షుడికి ఇప్పటికే అభినందనలు తెలిపిన భారత్ అంతటితో ఆగక మరింత ముందడుగు వేయాలి. హిందూ మహాసముద్రంలో మన వ్యూహాత్మక ప్రయోజనాలకు దెబ్బ తగలకపోవడమే ప్రాథమ్యం కావాలి! -
ఇన్నేళ్ళకు న్యాయం!
మూడు దశాబ్దాల పైచిలుకు క్రితం కేసులో బాధితులకు ఎట్టకేలకు కాసింత ఊరట దక్కింది. పోలీసుల దమనకాండకు ప్రతిరూపమైన తమిళనాడు వాచాత్తి ఘటనలో సెప్టెంబర్ 29న మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ఆ రకంగా చిరకాలం గుర్తుండిపోతుంది. మారుమూల గ్రామంలోని గిరిజనులపై దాడి చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన కేసు అది. అటవీ, పోలీసు అధికారులతో సహా మొత్తం 269 మంది దోషులంటూ కింది కోర్టు ఏనాడో తీర్పు ఇచ్చింది. దోషులు పైకోర్టును ఆశ్రయించి, జాగు చేశారు. తాజాగా మద్రాస్ హైకోర్ట్ ఆ అప్పీళ్ళను కొట్టివేసింది. కింది కోర్ట్ తీర్పును హైకోర్ట్ సమర్థించడమే కాక, 215 మందినీ దోషులుగా తీర్మానిస్తూ, ఒక్కొక్కరికీ 1 నుంచి 10 ఏళ్ళ పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. బాధితులకు ఇన్నాళ్ళకైనా న్యాయం దక్కిందనే భావన కలుగుతోంది. ప్రజాస్వామ్యం పట్ల, న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం మిగులుతోంది. నిజానికి, తమిళనాట ధర్మపురి జిల్లాలో తూర్పు కనుమల్లో నెలకొన్న గిరిజన గ్రామం వాచాత్తి గురించి ముప్ఫయ్యేళ్ళ క్రితం ఎవరూ విననైనా విని ఉండరు. కేవలం 655 మంది, అందులోనూ 643 మంది మలయాళీ షెడ్యూల్డ్ తెగల వారున్న 200 గడపల గ్రామం అది. కానీ, ఆ రోజు జరిగిన ఆ దారుణ ఘటనతో ఒక్కసారిగా ఆ గ్రామం వార్తల్లో నిలిచింది. గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ, పోలీసులు, అటవీ అధికారులు గ్రామంపై దాడి చేశారు. అక్కడ గిరిజనులపై సాగించిన అమానుషం, బడికెళ్ళే ఓ చిన్నారి సహా 18 మంది మహిళలపై సామూహిక అత్యాచారం, తాగునీటిలో విషం కలిపిన తీరు, పశువుల్ని ఊచకోత కోసి ఊరి బావిలో పడేసిన వైనం... ఆ గ్రామం రూపురేఖల్నే మార్చేశాయి. ‘గంధపు చెక్కల స్మగ్లింగ్ గ్రామం’ అని ముద్రవేస్తూ అమాయకులపై అధికారులు సాగించిన ఆ దమనకాండ ఓ మాయని మచ్చ. కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లోతుగా విచారించి అధికారుల తప్పు తేల్చినా, ఏళ్ళ తరబడి వాయిదా పడుతూ వచ్చిన న్యాయం ఇన్నాళ్ళకు దక్కింది. బాధితులకు కాస్తయినా ఊరట దక్కింది. 1992 జూన్ 20 నుంచి మూడు రోజులు సాగిన అమానుష ఘటనలో మొత్తం 269 మంది నిందితులు కాగా, వారిలో 54 మంది న్యాయ విచారణ కాలంలోనే కన్నుమూశారు. మిగిలినవారికి ఇప్పుడు శిక్ష పడింది. ఈ కథ ఇక్కడి దాకా రావడం వెనుక న్యాయం కోసం సుదీర్ఘంగా సాగిన పోరాటం ఉంది. అప్పట్లో అధికారులపై కేసులు నమోదు కాకపోగా, గిరిజనులపైనే స్థానిక పోలీసులు ఎదురు కేసులు పెట్టిన పరిస్థితి. గిరిజనులు తమ ఇళ్ళను తామే ధ్వంసం చేసుకున్నారని అధికారులు బుకాయించారు. హైకోర్ట్ ఆదేశిస్తే గానీ చివరకు సీబీఐ దర్యాప్తు జరగలేదు. అంతరాయాలతో విచారణ సుదీర్ఘంగా 19 ఏళ్ళు సాగి, చివరకు 2011లో ధర్మపురి సెషన్స్ కోర్ట్ అధికారులను దోషులుగా తేల్చి, శిక్ష వేసింది. దోషులు మద్రాస్ హైకోర్ట్‌ను ఆశ్రయించడంతో మరో 11 ఏళ్ళ సుదీర్ఘ కాలం గడిచిపోయింది. ఈ కేసు విచారణ సత్వరమే పూర్తి చేయాలని హైకోర్ట్ న్యాయమూర్తి ఒకరు ఈ ఏడాది మొదట్లో పట్టుబట్టడంతో ఇప్పటికైనా కథ ఓ కొలిక్కి వచ్చింది. చిత్రం ఏమిటంటే – వాచాత్తి దమన కాండపై అప్పట్లోనే ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైతే, ప్రభుత్వంలో ఉన్నత హోదాల్లో ఉన్నవారు అలాంటి నేరాలకు పాల్పడరంటూ జడ్జి దాన్ని కొట్టేయడం! జయలలిత సారథ్యంలోని అప్పటి అన్నాడీఎంకె పాలకులు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఆ తరువాత అధికారంలో ఉన్న డీఎంకె, అన్నాడీఎంకె సర్కార్లూ తమ బ్యూరోక్రాట్లకు కాపు కాసేందుకే ప్రయత్నించాయి. కొందరు ఉద్యమకారులు, లాయర్లు, నిజాయతీపరులైన అధికారులు, జడ్జీల వల్ల చివరకు న్యాయం జరిగింది. అత్యాచార బాధితులు పట్టువిడవకుండా పోరాడడంతో ఇప్పటికైనా సత్యం గెలిచింది. కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయదేవత సాక్షిగా ధర్మం నిలిచింది. కేవలం 655 మంది ఆదివాసీలు బలమైన రాజ్యవ్యవస్థతో తలపడి, విజయం సాధించడం చరిత్రాత్మకం. ఆ రకంగా ఇది బలవంతులపై బలహీనుల గెలుపు. ఆదివాసీల హక్కుల గెలుపు. న్యాయవ్యవస్థ స్వతంత్రమనీ, పాలకుల తప్పులను సైతం సహించదనీ రుజువైంది. ఎస్సీ– ఎస్టీ చట్టం ఇప్పటికీ బలంగానే ఉందని తేలింది. అయితే, నేటికీ కొనసాగుతున్న అనేక దమనకాండ కేసుల్లో ఇంత సుదీర్ఘ పోరాటం, సత్యాన్ని వెలికితీసి దోషులకు శిక్షపడేలా బృహత్ యత్నం సాధ్యమేనా? న్యాయం దక్కడంలో ఆలస్యమైతే, న్యాయం చేయనట్టే! వాచాత్తి ఘటనలో అపరిమిత ఆలస్యమైంది. దోషుల్లో పలువురు బెయిల్‌పై బయట గడిపి, ఉద్యోగ ప్రయోజనాలన్నీ పొంది, హాయిగా రిటైరయ్యారు. ఇప్పటికైనా దోషులను శిక్షించడమే కాక, బాధితులకు తగిన న్యాయం చేయాలి. నష్టపరిహారాలిస్తే సరిపోదు. నలుగురిలో గౌరవంగా బతికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. వలసవాద బ్రిటీషు పాలన లక్షణాలను పోలీసులు, అధికారులు ఇప్పటికైనా వదిలించుకొంటే మేలు. తమిళనాట గిరిజనులపై అమానుషాల నుంచి మిజోరమ్‌లో గ్రామాల దహనం, కశ్మీర్లో నిర సనకారులపై కాల్పుల దాకా దశాబ్దాలుగా చూస్తున్నవే. బ్రిటీషు దౌర్జన్యానికి మన భారతీయ పోలీ సులు వారసులుగా మారిన వైనానికి ఇవి ప్రతీకలు. పదే పదే సాగుతున్న మానవహక్కుల ఉల్లంఘనకు సాక్ష్యాలు. అందుకే, ‘‘దాడుల పేరిట చట్టవ్యతిరేక చర్యలకు’’ పోలీసులు బరి తెగించడం దుస్సహమని కోర్ట్ అన్న మాట కీలకం. నిన్నటికి నిన్న కూడా వార్తల్లో కనిపిస్తున్న ఇళ్ళపై దుర్మార్గ దాడుల ధోరణిని వ్యవస్థ సత్వరమే వదిలించుకోవాలి. వాచాత్తి కేసు గుర్తుచేస్తున్న పాఠం అదే! -
చరిత్ర సృష్టించించిన బిహార్ సర్కార్.. ప్రజల ముందుకు కులగణన ఫలితాలు
గాంధీ మహాత్ముడి జయంతి రోజైన సోమవారం బిహార్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. గత తొమ్మిది నెలల్లో రెండు దఫాలుగా నిర్వహించిన కులగణనలో వెల్లడైన గణాంకాలను ప్రజల ముందుంచింది. ఇందులో ఆర్థిక స్థితిగతుల సర్వే కూడా ఉంది. మొన్న జనవరిలోనూ, ఏప్రిల్‌లోనూ నిర్వహించిన ఈ కుల గణన మండల్ రాజకీయాలకు అంకురార్పణ పడిన బిహార్‌లోనే చోటు చేసుకోవటం గమనించదగ్గది. ఈ విషయంలో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ చొరవను అభినందించాలి. నిజానికి రాజకీయ పక్షాలేవీ బాహాటంగా దీన్ని వ్యతిరేకించలేదు. 2021లో బిహార్ నుంచి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన అఖిలపక్ష బృందంలో ఆ రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఉన్నారు. దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని ఆ ప్రతినిధి బృందం డిమాండు చేసింది. కానీ బీజేపీ కేంద్ర నాయ కత్వం దీనిపై మౌనంగానే ఉంది. బిహార్ గణాంకాలు వెల్లడిస్తున్న అంశాలు ఈ సర్వే అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. సంక్షేమ పథకాల అమలు మొదలై దశాబ్దాలు గడుస్తున్నా ఈనాటికీ అనేక వెనకబడిన కులాలు అభివృద్ధికి ఎంతో దూరంలో ఉన్నాయని ఈ గణన రుజువు చేస్తోంది. ఎప్పుడో వలస పాలనలో దేశవ్యాప్తంగా 1931లో తొలిసారి కులగణన నిర్వహించగా తొమ్మిది దశాబ్దాల అనంతరం ఇన్నాళ్లకు నితీష్‌కుమార్ ఈ సాహసం చేశారు. 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సామాజిక ఆర్థిక కుల గణన పేరిట ఒక ప్రయత్నం చేయకపోలేదు. 130 కోట్లమంది ప్రజానీకం నుంచి వివరాలు కూడా సేకరించారు. కానీ దాని నిర్దుష్టతపై సందేహాలున్నాయంటూ నాటి పాల తకులు ఆ గణాంకాలను అటకెక్కించారు. దీని వెనకున్న నిజానిజాలేమిటో ఎవరికీ తెలియదు. విమర్శల మాటెలావున్నా, ఎదుర్కొన్న అవరోధాలు ఎలాంటివైనా బిహార్ గణాంకాలు వెల్లడిస్తున్న వాస్తవాలు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ఏ కులానికి ఆ కులం తమ జనాభా ఎక్కువని చెప్పుకోవటం ఎన్నికల సమయంలో రివాజే అయినా మొత్తంగా చూసుకుంటే దేశ జనాభాలో ఓబీసీల శాతం అత్యధికమన్నది అందరూ ఎప్పటినుంచో అంగీకరిస్తున్న సత్యం. బిహార్ గణాంకాలు ఆ సంగతినే ధ్రువీకరించాయి. అయితే అభివృద్ధి ఫలాలు ఈనాటికీ అందుకోలేని అశక్తతలో అనేక కులాలున్నాయని ఈ గణన వెల్లడిస్తోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. బిహార్ లోని 13.07 కోట్ల జనాభాలో ఇతర వెనకబడిన వర్గాల (ఓబీసీ) సంఖ్య మూడున్నర కోట్లు (27 శాతం) కాగా, అత్యంత వెనకబడిన వర్గాలు 4.70 కోట్లు (36 శాతం) అని నివేదిక వెల్లడిస్తోంది. అంటే మొత్తంగా వెనకబడిన వర్గాల జనాభా 63 శాతం! రాష్ట్ర జనాభాలో 2.6 కోట్లమంది (20 శాతం) ఎస్సీలు, 22 లక్షలమంది (1.6 శాతం) ఎస్టీలు. జనరల్ క్యాటగిరీలో ఉన్న ఆధిపత్య కులాలు 15.5 శాతం అని కుల గణన చెబుతోంది. జనాభాలో హిందువులు 81.99 శాతం కాగా, ముస్లింలు 17.7 శాతం, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, ఇతర మతాలవారూ ఒక శాతంలోపేనని నివేదిక తెలిపింది. దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన పర్యవసానంగా దేశవ్యాప్తంగా కుల వృత్తులు తీవ్ర సంక్షోభంలో పడి నిరసనల వెల్లువెత్తాక అట్టడుగు వర్గాల సంక్షేమానికి ప్రభుత్వాలు కొత్త విధానాలు రూపొందించాయి. కానీ ఈ మొత్తం వ్యవహారం చీకట్లో తడుములాటగానే ఉంటున్న దన్న విమర్శలు ఆనాటినుంచీ ఉన్నాయి. ఎందుకంటే సాధికారకమైన గణాంకాలు లేకపోవటంతో 1979లో కేంద్రంలోని అప్పటి జనతాపార్టీ ప్రభుత్వం నియమించిన మండల్ కమిషన్ నివేదిక అంచనాలనే అన్ని ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఓబీసీలు 52 శాతం ఉంటారని ఆ నివేదిక అంచనా వేసింది. అయితే ఈ శాతం మరింత ఎక్కువుండొచ్చని పలువురు సామాజిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతూ వచ్చారు. ఇప్పుడు బిహార్ గణాంకాలు ఆ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. బహుశా దేశవ్యాప్తంగా కుల గణన చేస్తే ఇదే రుజువయ్యే అవకాశం ఉంది. కుల గణనకు పూనుకొని నితీష్ సర్కారు కొత్త ఆలోచనలు రేకెత్తించింది. దీనివల్ల ఆయన పార్టీకీ లేదా అక్కడి సామాజిక న్యాయ రాజకీయాలకూ వెనువెంటనే కలిగే ప్రయోజనం ఏమిటో చెప్పలేం. ఓబీసీల హక్కుల కోసం మాట్లాడే పార్టీలు ఎటూ కొత్త ఆలోచనలు చేయక తప్పదు. ఆ కులాల్లో సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా ఇన్ని వ్యత్యాసాలున్నాయని గ్రహించాక వాటికి తమ దగ్గరున్న పరిష్కారాలేమిటన్నది పార్టీలు తేల్చుకుంటాయి. వీటన్నిటికన్నా ప్రధానమైనదేమంటే... ఓబీసీ కులాల్లో కొన్ని మాత్రమే అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నాయనీ, ఇప్పటికీ అందుకు దూరంగావుంటున్న కులాలు అనేకం ఉన్నాయనీ, వాటి జనాభాయే ఎక్కువనీ నివేదిక వెల్లడించిన వాస్తవం పాలనావ్యవస్థ కళ్లు తెరిపిస్తుంది. ఇప్పుడు అమలు చేస్తున్న విధానాల, పథ కాల లోపాలను సరిదిద్ది, వాటిని పదునెక్కించటంతోపాటు కొత్తగా చేయాల్సిందేమిటన్న అంశంపై దృష్టి సారిస్తుంది. బహుశా రిజర్వేషన్ల శాతం 50 శాతం మించరాదన్న నిబంధనపై సైతం న్యాయ స్థానాలు పునరాలోచన చేయవచ్చు. శతాబ్దాలుగా మన దేశంలో వేళ్లూనుకున్న నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ వల్ల సామాజిక అభివృద్ధికి మెజారిటీ వర్గాలు దూరంగా ఉండిపోయాయని బ్రిటిష్ వలస పాలనలోనే గుర్తించారు. కానీ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలు అరకొరగానే ఉంటూ వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడిచాక కూడా అత్యంత వెనకబడిన కులాలున్నాయంటే అది మన పాలనా వ్యవస్థ లోపాన్ని పట్టి చూపుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలు సైతం కులగణనకు అనుకూలంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమే ఈ విషయంలో చొరవ తీసుకుని జనగణనతోపాటు కుల గణనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే అట్టడుగు వర్గాలవారిని ఉద్ధరించటానికి ఆ చర్య దోహదపడుతుంది. -
మనుషులు చేజారుతారు
‘హమ్ తుమ్ ఏక్ కమరే మే బంద్ హో’.... భారత సినీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూపిన ‘బాబీ’ మొన్నటి సెప్టెంబర్ 28కి యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇవాళ్టికీ దేశంలోని అన్ని భాషల్లో ఏదైనా టీనేజ్ ప్రేమకథ తీస్తూంటే గనక అది ఏదో ఒక మేరకు ‘బాబీ’కి కాపీ. ఆ సినిమా ఇచ్చిన ఫార్ములాతో వందలాది కథలు వచ్చాయి. వస్తాయి. ‘మేరా నామ్ జోకర్’ తీసి నిండా మునిగిన రాజ్‌కపూర్‌ను కుబేరుణ్ణి చేసిన సినిమా అది. ఆ సంపద వచ్చిన సందర్భంలోనే రాజ్‌కపూర్ ఒక మనిషిని చేజార్చుకున్నాడు. తెలిశా.. తెలియకనా? ‘బాబీ’ని కనీస ఖర్చుతో తీద్దామనుకున్నాడు రాజ్‌కపూర్. హీరో తన కొడుకే రిషికపూర్. హీరోయిన్ కొత్తమ్మాయి డింపుల్ కపాడియా. ముఖ్య పాత్రలు ప్రేమ్‌నాథ్, ప్రేమ్చోప్రా భార్య తరఫు బంధువులు. లక్ష్మీకాంత్– ప్యారేలాల్ ఇంకా కెరీర్ ప్రారంభంలో ఉండి రాజ్‌కపూర్‌తో మొదటి సినిమా చేయడమే వరం అనుకునే రకం. ఖర్చేముంది? ఒక్కటి ఉంది... ప్రాణ్ రెమ్యూనరేషన్ . ఆ రోజుల్లో ప్రాణ్ సినిమాకు రెండు, మూడు లక్షలు తీసుకుంటున్నాడు. రాజ్‌కపూర్‌తో అప్పటికి నలభై ఏళ్లుగా ప్రాణస్నేహం. ‘ఒక్కరూపాయి తీసుకొని చేస్తా. సినిమా ఆడితే ఇవ్వు. ఆడకపోతే మర్చిపో’ అన్నాడు ప్రాణ్. అన్నమాట ప్రకారం ఒక్క రూపాయికే చేశాడు. సినిమా రిలీజ్ అయ్యింది. ఇరవై పాతిక లక్షలు పెట్టి తీస్తే దేశంలో, బయట కలిపి 30 కోట్లు వచ్చాయి. నేటి లెక్కల ప్రకారం 1200 కోట్లు! రాజ్‌కపూర్ ప్రాణ్‌ని పిలిచి మంచి పార్టీ ఇస్తే బాగుండేది. థ్యాంక్స్ చెప్పి అడిగినంత ఇచ్చి ఉంటే బాగుండేది. ఇవ్వకపోయినా బాగుండేది. కాని రాజ్‌కపూర్ లక్ష రూపాయల చెక్ పంపాడు. లక్ష? తను అడగలేదే? పోనీ తాను అందరి దగ్గరా తీసుకునేంత కూడా కాదే. ప్రాణ్ ఆ చెక్ వెనక్కు పంపాడు. మళ్లీ జీవితంలో రాజ్కపూర్ని కలవలేదు. జారిపోయాడు. ‘షోలే’ రిలీజ్ అయితే మొదటి రెండు వారాలు ఫ్లాప్‌టాక్. రాసిన సలీమ్–జావేద్ ఆందోళన చెందారు. ఫ్లాప్ కావడానికి స్క్రిప్ట్ కారణమనే చెడ్డపేరు ఎక్కడ వస్తుందోనని బెంబేలెత్తారు. మాటల్లో మాటగా దర్శకుడు రమేష్ సిప్పీతో ‘గబ్బర్‌సింగ్ వేషం వేసిన అంజాద్‌ఖాన్ వల్లే సినిమా పోయింది. అతడు ఆనలేదు’ అన్నారు. అప్పటికే తన తొలి సినిమాకు ఇలాంటి టాక్ రావడం ఏమిటా అని చాలా వర్రీగా ఉన్న అంజాద్‌ఖాన్ బ్లేమ్ గేమ్‌లో తనను బలి చేయబోతున్నారని తెలిసి హతాశుడయ్యాడు. తీవ్రంగా కలత చెందాడు. కాని సినిమా కోలుకుంది. ఎలా? అలాంటి కలెక్షన్లు ఇప్పటికీ లేవు. అతి గొప్ప విలన్ గా అంజాద్‌ఖాన్ ఎన్నో సినిమాలు చేశారు. కాని ఒకనాటి మిత్రులైన సలీమ్–జావేద్ రాసిన ఏ స్క్రిప్ట్‌లోనూ మళ్లీ యాక్ట్ చేయలేదు. చేజారిపోయాడు. దాసరి నారాయణరావు తొలి రోజుల్లో నటుడు నాగభూషణాన్ని ఎంతో నమ్ముకున్నాడు. అభిమానించాడు. నాగభూషణం దాసరికి దర్శకుణ్ణి చేస్తానని చెప్పి చాలా పని చేయించుకున్నాడు. చివరి నిమిషంలో వేరొకరిని పెట్టుకున్నాడు. దాసరి ఆ తర్వాత పెద్ద దర్శకుడయ్యి 150 సినిమాలు చేశాడు. వందల పాత్రలు రాశాడు. కాని దాసరి కలం నుంచి ఒక్క పాత్ర కూడా నాగభూషణం కోసం సృజించబడలేదు. దాసరి సినిమాల్లో నాగభూషణం ఎప్పుడూ లేడు. రామానాయుడు అవకాశం ఇస్తే ఎంతో కష్టం మీద ‘ప్రేమఖైదీ’ సినిమాకు దర్శకత్వం వహించాడు ఇ.వి.వి.సత్యనారాయణ. అప్పటికి అతని మొదటి సినిమా ఫ్లాప్. ఈ సినిమా కూడా పోతే భవిష్యత్తు లేదు. ఫస్ట్ కాపీ చూసిన పరుచూరి బ్రదర్స్ ఏ మూడ్‌లో ఉన్నారో ‘మా స్క్రిప్ట్‌ను చెడగొట్టినట్టున్నాడే’ అనే అర్థంలో రామానాయుడు దగ్గర హడావిడి చేశారు. వారు స్టార్‌రైటర్స్. వారి మాట మీద రామానాయుడుకు గురి. ఇ.వి.వి హడలిపోయాడు. స్క్రిప్ట్‌ను తన బుర్రతో ఆలోచించి మెరుగుపెట్టి తీస్తే ఇలా అంటారేమిటి అని సిగరెట్లు తెగ కాల్చాడు. సినిమాను మూలపడేస్తే ఇంతే సంగతులే అని కుంగిపోయాడు. కాని సినిమా రిలీజయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత 51 సినిమాలు తీశాడు ఇ.వి.వి. ఒక్కదానికీ గురు సమానులైన పరుచూరి సోదరుల స్క్రిప్ట్ వాడాలనుకోలేదు. బాగా చనువుగా, ఆత్మీయంగా ఉండే మనుషుల పట్ల కొందరికి హఠాత్తుగా చిన్నచూపు వస్తుంది. ఆ.. ఏముందిలే అనుకోబుద్ధవుతుంది. వారితో మనం ఎలా వ్యవహరించినా చెల్లుబాటవుతుందిలే అనిపిస్తుంది. వారితో చెప్పకుండా ఫలానా పని చేద్దాం... శుభలేఖ ఆఖరున పంపుదాం... కష్టంలో ఉన్నారని తెలిసినా చూసీ చూడనట్టు ఉందాం... ఇచ్చిన మాటను తేలిగ్గా తీసుకుందాం... వారి వీపు మీద విస్తరి పరిచి భోం చేద్దాం... అనుకుంటే ఆ క్షణంలో ఆ సదరు వారు మనం చెప్పింది విన్నట్టుగా కనపడతారు. నవ్వుతున్నట్టే ఉంటారు. కాని వారి లోపల మనసు చిట్లుతున్న చప్పుడు మన చెవిన పడకుండా జాగ్రత్త పడతారు. ఆ తర్వాత వారు మనకు కనిపించరు. జారిపోతారు. చేజారిపోతారు. మనుషులు చేజారితే ఏమవుతుంది? వారితో మాత్రమే సాధ్యమయ్యే జీవన సందర్భాలన్నీ నాశనమవుతాయి. వారితో నిర్మించుకున్న గతం తుడిచిపెట్టుకుపోతుంది. వారితో వీలైన భవిష్యత్తు నష్టమవుతుంది. ఉంటే బాగుండు అనుకునే క్షణాల్లో వారు ఉండరు. డబ్బు, దస్కం, పలుకుబడి, క్షమాపణ ఏదీ వారిని మళ్లీ వెనక్కు తీసుకురాదు. హాయ్, హలో బాపతు సవాలక్ష దొరుకుతారు. ఈ నిజమైన ఆత్మీయులను కాపాడుకుంటున్నారా? అసలు మీరెంత మందిని చేజార్చుకున్నారో ఎప్పుడైనా లెక్క చూసుకున్నారా? -
బ్రాండ్ బాబు బాగోతం!
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ! తప్పించుకు తిరిగేవాడు దొరికితే సంచలనమే సుమీ!! చార్లెస్ శోభరాజ్ వంటి కరుడుగట్టిన నేరస్తుడు అరెస్టయితేనే అప్పట్లో అదో సంచలన వార్తయింది. అటువంటిది మన అతిపెద్దమనిషి చంద్రబాబు అరెస్టయితే సంచలనం కలగకుండా ఉంటుందా? ఆయనపై ఇప్పటివరకు కనీసం రెండు డజన్ల పెద్దస్థాయి అవి నీతి ఆరోపణలు వచ్చాయి. కనీసం ఒక్కదానిపై కూడా విచా రణ జరక్కుండా అడ్డుచక్రాన్ని గిరగిరా తిప్పి విసరడంతో ఆయన చూపుడు వేలు నేర్పరితనం ఇప్పటికే రికార్డు పుటల్లోకి ఎక్కింది. చంద్రబాబును సెంట్రల్ జైలుకు పంపించిన అభియో గాలు ఇప్పుడు న్యాయస్థానాల పరిశీలనలో ఉన్నాయి. కనుక వాటి మీద చర్చను పక్కనపెడితే, ఆయన అరెస్టు మాత్రం పెద్ద వార్తే అయింది. పెద్ద వార్తల చుట్టూ అనేక పిల్ల వార్తలూ, పిట్టకథలూ, ఉపాఖ్యానాలు, వ్యాఖ్యానాలు చేరిపోవడం సహజం. అలా చేరిపోయిన వాటిలో పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోని ఇద్దరు నాయకుల రాజకీయ వ్యాఖ్యానాలు మరో చర్చకు దారితీశాయి. ఐటీ ఉద్యోగుల పేరుతో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ వారు రెండు, మూడు ఊరేగింపులు చేశారు. దీనిపై కేటీఆర్ అభ్యంతరం చెబుతూ ‘పక్క రాష్ట్ర రాజకీయ అంశంపై ఇక్కడెందుకు నిరసనలు? ఐటీ కారిడార్‌లో శాంతిభద్రతల సమస్య సృష్టించడమెందు క’ని ప్రశ్నించారు. వెంటనే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దానిపై స్పందించారు. చంద్రబాబు జాతీయ నాయకుడనీ, ఆయన కోసం ఎక్కడైనా ఆందోళన చేయవచ్చనీ చెబుతూనే ‘బీఆర్ఎస్కు ఆంధ్ర వాళ్ల ఓట్లు కావాలి గానీ, వాళ్ల సమస్యలు అక్కర్లేదా’ అని వ్యాఖ్యానించారు. ఈ చర్చలో అంతర్లీనంగా రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి – ఐటీ రంగ అభివృద్ధికీ, హైదరాబాద్ అభి వృద్ధికీ మారుపేరుగా చంద్రబాబును ప్రస్తావిస్తూ ఒక ఫేక్ బ్రాండ్ ఇమేజ్ను గత పాతికేళ్లుగా యెల్లో మీడియా పోషించు కుంటూ వస్తున్నది. దాని కొనసాగింపుగానే ఐటీ ఉద్యోగులంతా చంద్రబాబును తమ తాతపాదుల వారిగా తలపోస్తు న్నారనే భ్రాంతిని సృష్టించడం కోసం ఈ ర్యాలీలను తెలుగు దేశం పార్టీ నిర్వహించింది. ఈ ర్యాలీల్లో కూడా ఒక సామాజిక వర్గమే ప్రధాన భూమికను పోషించిందన్న మాట కూడా ఒక నిష్ఠుర సత్యం. ఇక రెండో అంశం – తెలంగాణలో ఆంధ్రావాళ్ల ఓట్లు. సెటిలర్ల ఓట్లన్నీ గంపగుత్తగా తెలుగుదేశం పార్టీ ఖాతాలో, బాబు కనుసైగల అజమాయిషీలో ఉన్నట్టు కూడా యెల్లో మీడియా మరో భ్రాంతి జనిత బ్రాండ్‌ను సృష్టించింది. ఇద్దరు తెలంగాణ నాయకుల వ్యాఖ్యలు యథాలాపమా, ఆలోచనాపూర్వకమా అనే విషయం వారికి మాత్రమే తెలుసు. కానీ ఆచరణలో అవి స్పష్టమైన పాత్రనే నిర్వహించాయి. చంద్రబాబు మీద కప్పిన ఫేక్ బ్రాండ్ ముసుగును తొలగించే ప్రయత్నం కేటీఆర్ వ్యాఖ్యల్లో కనిపిస్తే, ఆ ముసుగును కాపాడే అంతరార్థం రేవంత్‌రెడ్డి మాటల్లో ధ్వనించింది. రేవంత్‌రెడ్డికి పూర్వాశ్రమంలో చంద్రబాబుతో ఉన్న సాహచర్యం కారణంగా అలా కావాలని మాట్లాడి ఉండవచ్చేమో! చంద్రబాబు పట్ల ఆయన సానుకూల స్పందన పెద్ద విశేషమేమీ కాదు. కానీ, ఆ నకిలీ బ్రాండ్ ముసుగును తొలగించడం బీఆర్ఎస్కు కచ్చితంగా ఒక రాజకీయ అవసరం. తమ హయాంలో జరిగిన నగరాభివృద్ధినీ, ఐటీ పురోగతినీ కూడా యథేచ్ఛగా యెల్లో మీడియా చంద్రబాబు ఖాతాలో వేస్తుంటే ఏ ప్రభుత్వమైనా ఎంతకాలం భరిస్తుంది? తెలుగుదేశం పార్టీ నేతలకు తమిళ సినిమారంగ స్టార్ రజనీకాంత్ సన్నిహితుడు. ఎన్టీఆర్‌కు వెన్ను పోటు పొడిచిన సమయంలో ఆయన హైదరాబాద్‌కు వచ్చి మరీ చంద్రబాబు గ్యాంగ్‌కు మద్దతు పలికిన సంగతి చాలా మందికి గుర్తే. ఆయన ఈమధ్య మాట్లాడుతూ హైదరాబాద్‌కు వెళ్తే న్యూయార్క్‌కు వెళ్లినట్లుంటుందని చెబుతూ, అందుకు చంద్రబాబే కారకుడని ఓ వీరతాడును ఆయన మెడలో వేశారు. ఈ పదేళ్లలో హైదరాబాద్‌లో జరిగిన పరిణామాలకూ, ఇరవయ్యేళ్ల కిందనే తోక ముడిచిన చంద్రబాబుకూ ఏరకమైన సంబంధముంటుంది? ఇటువంటి ఘటనలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు సహజంగానే అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఆ అసౌకర్యమే కేటీఆర్ మాటల్లో వెల్లడై ఉండవచ్చు. యెల్లో మీడియాను మాత్రమే అనుసరించే వారి మెదళ్లలో ఈ ఫేక్ బ్రాండ్ గుజ్జు ఎంత నిండిందో తెలియజెప్పే ఉదంత మొకటి ఈమధ్యనే మీడియాలో కనిపించింది. బాబు అరెస్టుకు నిరసన తెలియజేస్తున్న ‘ఐటీ ఉద్యోగుల్లో’ ఒక యువతి ముందు మన యెల్లో మీడియా మైకు పెట్టింది. ‘‘సీబీఎన్ అరెస్టును తెలంగాణ ప్రభుత్వం ఖండించలేదండీ! ఎందుకంటే ఇప్పుడు సీబీఎన్ బయటకొస్తే ఆటోమేటిక్‌గా ఏపీ డెవలపయిపోతుంది. తెలంగాణ వెనకబడుతుంది. అందుకని వాళ్లు ఖండించరు’’. ఆహా ఎంత పరిణతి! సాక్షాత్తూ జ్ఞాన సరస్వతీ దేవి ఉపదేశమా ఇది. ‘‘తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ ... ... ... సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా!’’ మనం మరోసారి అక్షరాభ్యాసం చేయాల్సిందే. నిన్నటిదాకా ఆయన బయటే ఉన్నాడు కదమ్మా. ఐదేళ్లు అధికారంలో కూడా ఉన్నాడు కదమ్మా. మరి ఆటోమేటిగ్గా ఏపీ అగ్రస్థానంలోకి ఎందుకు దూసుకెళ్లలేదు తల్లీ అనే సహజమైన ప్రశ్న కూడా ఆ దిగ్భ్రాంతి క్షణాన ఎవరికీ జనించి ఉండదు. ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రచార సాధనాల (మీడియా) ద్వారా ప్రజాభిప్రాయాన్ని ఎలా ఉత్పత్తి చేసుకుంటాయో (manufacturing consent) తెలియజెప్పే సిద్ధాంత పత్రాన్ని అమెరికా మేధావులు నోమ్ చోమ్స్కీ, ఎడ్వర్డ్ హెర్మాన్లు వెలువరించారు. ఏపీలో చంద్ర బాబు అధికారంలోకి రాకపూర్వమే అమెరికా పరిస్థితులను అధ్యయనం చేసి వారు ఈ థియరీని ప్రతిపాదించారు. కానీ, ప్రస్తుత మన యెల్లో మీడియా కర్మాగారాలను, వాటి ఉత్ప త్తులను చూసి ఉంటే పరిశోధన పక్కనపెట్టి మూర్ఛ పోయేవారు. ఈ కర్మాగారాల్లో తయారైన అతి ముఖ్యమైన ఉత్పత్తి ‘బ్రాండ్ బాబు’! ఐటీకి ఆద్యుడుగా, అభివృద్ధికి రోల్‌మోడల్‌గా, హైదరాబాద్ నిర్మాతగా బ్రాండ్ బాబును ప్రచారంలో పెట్టారు. ఇప్పుడీ బ్రాండ్ బాబు ఇమేజిపై పోస్ట్‌మార్టమ్ జరిగి తీరాలి. వర్తమాన చరిత్రకు జరుగుతున్న వక్రీకరణను సరిచేయవలసిన బాధ్యత కూడా వర్తమాన సమాజానిదే! హైదరాబాద్‌లోనే కాదు, మొత్తం దేశంలో కూడా ఐటీ అభివృద్ధికి సంబంధించి ఏ ఒక్కరికో క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే అది మన తెలుగుజాతి కీర్తికిరీటం పీవీ నరసింహారావుకే దక్కాలి. ఆయన ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) పేరుతో ఐదారు నగరాల్లో ఐటీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో హైదరా బాద్ మొదటిది. చంద్రబాబు నిర్మించినట్టుగా మనం చదువు కుంటున్న హైటెక్ సిటీ లేదా సైబర్ టవర్స్‌కు 1993లోనే అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి శంకుస్థాపన చేశారు. దేశంలోనే పెద్దవైన ఐదు ఐటీ కంపెనీల్లో ఒకటైన సత్యం కంప్యూటర్స్ (టెక్ మహేంద్ర) 1987లోనే ఏర్పాటైంది. 1995లో జరిగిన వెన్నుపోటు పట్టాభిషేకం నాటికి సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో హైదరాబాద్‌ది మూడో స్థానం. 2004లో చంద్ర బాబు గద్దె దిగేనాటికి నాలుగో స్థానం. ఆ తర్వాత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో మళ్లీ మూడో స్థానానికి ఎగబాకింది. ఐటీ ఎగుమతుల్లో ఇప్పుడు హైదరాబాద్‌ది దేశంలో రెండో స్థానం. గూగుల్, ఫేస్బుక్, ఆపిల్, క్వాల్కామ్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు వాటి అతిపెద్ద క్యాంపస్‌లను (అమెరికా వెలుపల) హైదరాబాద్‌లో చంద్రబాబు అనంతర కాలంలోనే ఏర్పాటు చేశాయి. ఐటీ రంగం విస్తృతమవుతున్న నేపథ్యంలో నేదురుమల్లి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కొత్తగా 11 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతినిస్తే, వాటికి వ్యతిరేకంగా చంద్రబాబు నేతృత్వంలో యెల్లో మీడియా ఆధ్వర్యంలో, కమ్యూనిస్టుల తోడ్పాటుతో, పెద్ద ఉద్యమాన్ని లేవదీసి వాటిని ఆపేశారు. చంద్రబాబు గద్దెనెక్కగానే ఏకంగా 30 కాలేజీలను ప్రారంభించారు. ఎవరూ కిమ్మనలేదు. ఆ పదకొండు ఎవరికి చెందినవి, ఈ 30 ఎవరివి అనేది ఒక ప్రత్యేక రాజకీయ – సామాజిక అధ్యయనాంశం. ఇప్పుడు అప్రస్తుతం. వైఎస్ఆర్ అధికారంలో ఉన్న సమయంలో ఇంజనీరింగ్ మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో వీసాల కోసం అమెరికా కాన్సులేట్ కార్యాలయాన్ని వైఎస్ హైదరా బాద్‌లో ఏర్పాటు చేయించారు. ఇవన్నీ వాస్తవాలు! చెరిపేస్తే చెరిగిపోయేవి కావు. ఎవరైనా రికార్డులను పరిశీలించుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డును, శంషాబాద్ ఎయిర్‌పోర్టును కూడా యెల్లో మీడియా బాబు ఖాతాలోనే వేస్తున్నది. బాబు సంగతి సరేసరి. ‘సెల్‌ఫోన్ కనిపెట్టింది కూడా నేనే’ అనే స్థాయికి చేరిన వైపరీత్యం ఆయన మనస్తత్వానిది. ఎయిర్‌పోర్టు పనులకు శంకుస్థాపన చేసిందీ, కొత్త ఎయిర్‌పోర్టును ప్రారంభించిందీ కూడా వైఎస్సార్ హయాంలోనే! ఔటర్ రింగ్‌రోడ్డు కోసం భూసేకరణ దగ్గర్నుంచీ రోడ్డు నిర్మాణం 90 శాతం పూర్తయింది కూడా వైఎస్సార్ హయాంలోనే! ఇక ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా ఎయిర్‌పోర్టు నుంచి నగరానికి వస్తున్నప్పుడు రజనీ కాంత్‌కు కనిపించిన న్యూయార్క్ దృశ్యం ఈ అయిదేళ్లలో ఆవిష్కృతమైన పరిణామం. పీవీ నరసింహారావుకు, వైఎస్సార్‌కు, కేసీఆర్‌కూ దక్కా ల్సిన ఘనతలను కూడా బరబరా లాక్కుని చంద్రబాబుకు కట్టబెట్టే సమాచార గూండాగిరీకి యెల్లో మీడియా పాల్పడు తున్నది. అది ప్రజాభిప్రాయ ‘ఉత్పత్తి’ దశను దాటి ప్రజాభి ప్రాయ ‘రిగ్గింగ్’ దశకు చేరుకున్నది. అందులో భాగమే తెలంగాణలో, హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్లంతా బాబు వర్గమే అనే ప్రచారం. బాబు వర్గం అంటే వారి ఉద్దేశం ప్రకారం టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న సామాజికవర్గం. సెటిలర్లలో వారు సింహభాగం ఉంటారు. మిగిలిన వారిని ప్రభావితం చేస్తారని వారి ఉద్దేశం. ఈ తప్పుడు లెక్కలతోనే తెలంగాణ రాజకీయ పార్టీలను యెల్లో మీడియా దబాయి స్తున్నది. సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయ బోయే నాయకులను బెదిరించి చంద్రబాబు అరెస్టును ఖండించే ప్రకటనలు యెల్లో మీడియా చేయిస్తున్నది. కానీ వారు చెబుతున్న లెక్కలు వాస్తవమేనా? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేసిన క్షేత్రస్థాయి పరిశీలన ప్రకారం దాదాపు ఇరవై లక్షలమంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సెటిలర్లు ఉన్నారు. వీరిలో ఇరవై శాతం వరకు కమ్మవారుంటారని అంచనా. పదిహేను శాతం రెడ్లు, పదిహేను శాతం కాపులు. బీసీలు ముప్పయ్ శాతం. మిగిలిన ఇరవై శాతం ఇతరులు. ఇవి వాస్తవికతకు దగ్గరగా ఉన్న ఉజ్జాయింపు లెక్కలు మాత్రమే. యెల్లో మీడియా దబాయింపు ప్రకారం ఇరవై శాతం సామాజిక వర్గం చెప్పుచేతుల్లోనే ఎనభై శాతం మసలుకుంటున్నట్టు లెక్క. వాస్తవానికి ఆంధ్రా సెటిలర్లు అనేది ఒక ఓటు బ్యాంకు ఎంతమాత్రమూ కాదు. ఎవరి రాజ కీయ అభిప్రాయాలు వారివి. కులాల లెక్కలు కూడా చెల్లవు. అసలు ఆంధ్రప్రదేశ్‌లోనే కుల ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాజకీయ పోరాటాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్గ పోరాటంగా మార్చివేశారు. పేదలకూ – పెత్తందార్లకూ మధ్య యుద్ధంగా ఆయన పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఇంకా తెలుగు దేశం పార్టీ మాత్రమే ఒక్క కులాన్ని పట్టుకుని వేలాడుతున్నది. అటువంటి విభజనే సెటిలర్లలో కొంతమేరకు ఉండవచ్చు. లేదా స్థానిక అంశాల ఆధారంగా వారి మద్దతు ఉండవచ్చు. సెటిలర్లపై చంద్రబాబు ప్రభావం అనేది యెల్లో మీడియా ఉత్పత్తి చేస్తున్న భ్రాంతి మాత్రమే. తెలంగాణ ప్రజలకు చంద్ర బాబులో ఇప్పటికీ ఒక సామాజిక విధ్వంసకుడు కన్పిస్తాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గడిచిన ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠం నేర్చుకున్నదో లేక మరోసారి బలిపీఠం ఎక్కడానికి సిద్ధపడుతున్నదో వేచి చూడాలి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com