తరచూ రాజకీయ సంక్షోభాలు చవిచూసే ద్వీపసమూహ దేశం మాల్దీవుల్లో ఈసారి శాంతియుతంగా అధికార మార్పిడి జరిగింది. అది సంతోషజనకమే అయినా, ఈ తాజా అధ్యక్ష ఎన్నిక ఫలితాలు భారత్‌లో కొత్త ఆందోళన రేపుతున్నాయి. చైనాకు అనుకూలుడైన ప్రతిపక్ష అభ్యర్థి దేశాధ్యక్షుడు కానుండడమే అందుకు కారణం. మాల్దీవులకు కొత్త అధ్యక్షుడి రాకతో, ఇప్పటి దాకా అక్కడున్న పలుకుబడి, పట్టు భారత్ కోల్పోనుంది. అది గణనీయమైన నష్టమే. రక్షణ రంగం, ప్రాథమిక వసతుల ప్రాజెక్టుల్లో మాల్దీవులతో భారత సంబంధాలే ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాంశం కావడం గమనార్హం.
మాల్దీవులపై డ్రాగన్ దేశం మరోసారి పట్టు సాధించే అవకాశం రావడంతో ఢిల్లీ – మాల్దీవుల బంధానికి ఇది పరీక్షా సమయం. ప్రభుత్వం మారినా, కీలకమైన మాల్దీవుల్లో తన ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేయడం భారత్‌కు ఇప్పుడు తప్పనిసరి. అంతేకాక, గడచిన రెండు దశాబ్దాలుగా చైనా తన ప్రాబల్యం పెంచుకొంటూ, మన పెరట్లో తన పట్టు బిగిస్తున్న వైనాన్ని గమనించి జాగ్రత్తపడక తప్పదని మరోసారి రుజువైంది.
భారత్‌కు దక్షిణంగా సుమారు 450 మైళ్ళ దూరంలో, కేవలం 5 లక్షల జనాభా ఉండే మాల్దీవులు చిరు ద్వీపదేశమే. అయితే, హిందూ మహాసముద్రంలో రద్దీగా ఉండే నౌకా రవాణా మార్గంలో నెల కొన్నందున వ్యూహాత్మకంగా చాలా కీలకం. అందుకే, ఆ దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు అనేసరికి భారత, చైనాల్లో ఆసక్తి నెలకొంది. ఒక విధంగా చూస్తే ఈ ఎన్నికలు... ద్వీపదేశంపై భారత, చైనాల్లో ఎవరికి పట్టు ఎక్కువుందో తెలియపరిచే ప్రజాభిప్రాయ సేకరణ పోటీ లాంటివి.
రాజధాని మాలే నగరానికి ప్రస్తుతం మేయర్‌గా ఉంటూ, దేశాధ్యక్ష పదవికి పోటీ పడ్డ ముయిజు మొదటి నుంచి చైనాతో సన్నిహిత సంబంధాల్ని కోరుకుంటున్నారు. నిజానికి, జనంతో క్రిక్కిరిసిన రాజధానిలో జాగా కొరత వల్ల తలెత్తిన గృహవసతి సమస్య, తరిగిపోతున్న డాలర్ రిజర్వులు సహా అనేక అంశాలు ఈ ఎన్నికల ప్రచారంలో ముందుకు వచ్చాయి. అయితే, చివరకు మాల్దీవుల భవితపై ఆసియాలోని రెండు అగ్రదేశాల ప్రభావం చుట్టూరానే ఓటింగ్ సరళి సాగింది. దాదాపు 85 శాతానికి పైగా ఓటింగ్‌లో పాల్గొన్న ఈ ఎన్నికల్లో ఓటర్లు భారత, చైనా వర్గాలుగా చీలిపోయారని చెప్పవచ్చు.
ఇరుగుపొరుగు దేశాల్లో పలుకుబడిని పెంచుకొనే ప్రయత్నాలు భారత, చైనాలు రెంటికీ కొత్త కాదు. ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’ (బీఆర్‌ఐ) కింద అభివృద్ధి రుణాలతో మాల్దీవుల్లో చైనా ముందుగా అడుగేసింది. ఇటీవల కొన్నేళ్ళుగా భారత్ తన పట్టు చాటింది. నిరుడు శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పతనమైనప్పుడు వందల కోట్ల డాలర్ల సాయం అందించిన ఢిల్లీ 2018లో సోలిహ్ అధ్యక్షు డిగా ఎన్నికైన నాటి నుంచి ద్వీపదేశంలో తన ఉనికిని విస్తరించింది. ప్రాజెక్టులూ పెరిగాయి.
నిజం చెప్పాలంటే – గతానికి భిన్నంగా గత అయిదేళ్ళలో భారత అనుకూల సోలిహ్ పాలనలో మాల్దీవుల్లో శాంతి, స్వేచ్ఛ నెలకొన్నాయి. అంతకు ముందు అయిదేళ్ళు ప్రస్తుతం అవినీతి ఆరోపణలపై జైలులో ఉన్న చైనా అనుకూల అబ్దుల్లా యమీన్ పాలన సాగింది. అయితే, ప్రస్తుత సర్కార్ మాల్దీవుల సార్వభౌమాధికారాన్ని భారత్‌కు తాకట్టు పెడుతోందనే భావనను జనంలో ప్రతిపక్ష కూటమి కల్పించగలిగింది. ‘ఇండియా అవుట్’ అనే దాని నినాదాల భావోద్వేగం ఫలించింది.
సెప్టెంబర్ మొదట్లో జరిగిన తొలి రౌండ్ ఓటింగ్‌లో 8మంది అభ్యర్థుల్లో సోలిహ్‌కు 36 శాతం, ముయిజుకు 46 శాతం వచ్చినా, ఎవరూ అర్ధశతం దాటలేదు. అలా అదనపు రెండో విడత ఓటింగ్ అవసరమైంది. ఈసారి ప్రతిపక్ష ముయిజు స్పష్టమైన విజేతగా నిలిచారు. బ్రిటన్‌లో చదువుకొని, సివిల్ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ చేసి, ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన 45 ఏళ్ళ ముయిజు రాజకీయా ల్లోకి రాక ముందు ప్రైవేట్ రంగంలో ఇంజనీర్.
మాలేకు మేయర్ అవడానికి ముందు ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా వ్యవహరించారు. తాజా ఎన్నికల్లో ముయుజు గెలుపునకు సోలిహ్ తప్పులూ కారణమే. దేశానికి భారత్ నుంచి పెట్టుబడులు, అభివృద్ధి సాయం అందుతున్న మాట అటుంచి, ఓ చిన్న భారత సైనికదళాన్ని దేశంలోకి తెచ్చారన్న ప్రత్యర్థుల ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టలేక పోయారు. అలాగే, దేశాధ్యక్షుడయ్యేందుకు తనకు సాయపడ్డ బాల్యమిత్రుడు పార్టీని చీల్చి, కొత్త కుంపటి పెట్టే పరిస్థితి తెచ్చుకున్నారు. ఆ పార్టీ 7 శాతం ఓట్లు సాధించడం పెద్ద దెబ్బ అయింది.
భారత్ సంగతికొస్తే ఈ ఫలితాల్ని అతిగా అంచనా వేసినా తప్పే! అలాగని తక్కువగా అంచనా వేసినా చిక్కే!! భౌగోళిక సామీప్యం, ఉమ్మడి భద్రతా ప్రయోజనాలు, సాంస్కృతిక సాన్నిహిత్యం రీత్యా మాలేతో మనది లోతైన బంధం. కానీ, ఇండో– పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో చైనా తన ఛాయను విస్తరిస్తూ, ఆర్థిక – వ్యూహాత్మక గణితంలో మాలేను తెలివిగా భాగం చేసుకుంది. సోలిహ్ పాలనలో గణనీయంగా పెట్టుబడులు పెట్టి, ‘గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్’ సహా అనేక ప్రాథమిక వసతులకు ఆర్థిక సాయం చేసిన భారత్ ఇప్పుడు చాకచక్యంగా వ్యవహరించాలి.
మాలేతో మనది ప్రభుత్వాల మార్పుతో సంబంధం లేని సుస్థిర బంధమని చాటాలి. కొత్త సర్కా రుతో స్నేహానికి భారత విదేశాంగ విధాన వ్యవస్థ శ్రమించాలి. భారత వ్యతిరేక అపోహలు పోగొట్టేలా రాజకీయంగా అన్ని పార్టీలతో సుహృద్భావం పెంచుకోవాలి. ఇండియా పొడ గిట్టని యమీన్ రేపు మళ్ళీ తెర వెనుక చక్రం తిప్పుతారని భావిస్తున్న వేళ... కొత్త అధ్యక్షుడికి ఇప్పటికే అభినందనలు తెలిపిన భారత్ అంతటితో ఆగక మరింత ముందడుగు వేయాలి. హిందూ మహాసముద్రంలో మన వ్యూహాత్మక ప్రయోజనాలకు దెబ్బ తగలకపోవడమే ప్రాథమ్యం కావాలి!
మనకు కొత్త సవాలు
Published Thu, Oct 5 2023 1:08 AM | Last Updated on Thu, Oct 5 2023 1:08 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment