Editorial
-
రెండేమిటి మూడు ఎన్నికలైనా జరపవచ్చు..
కేంద్ర, రాష్ట్ర చట్ట సభలకే కాదు, వాటికి స్థానిక సంస్థలను కలిపి మూడింటికీ ఒకేసారి ఎన్నికలు జరుపుకోవచ్చు. తద్వారా, స్థానిక అభివృద్ధి, నియోజక వర్గాల వారీ అభివృద్ది పట్ల ఆయా పార్టీల వైఖరికి ప్రాధాన్యత పెరుగుతుంది. వికేంద్రీకృత అభివృద్ధి, సమాన అభివృద్ధి దృష్టి పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయనే మాట రీత్యా, స్థానిక, రాష్ట్ర, కేంద్ర పరిపాలన సమ ప్రాధాన్యత రీత్యా ఆలోచించినపుడు మూడింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అన్ని విషయాలపై సమగ్ర అవగాహన కలుగుతుంది. ప్రజలు మూడు విధాల పనికి వచ్చే, పని చేసే నాయకత్వాన్ని ఎన్నుకునే అవ కాశం కలుగుతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికయ్యాక ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే వారి ఎన్నికకు అడ్డుకట్ట పడుతుంది. అయితే ఇటువంటి ఎన్నికల విధానం కోసం కొన్ని పనులు ముందుగా నిర్వర్తించాలి. అందులో ముఖ్యమైనది రాజ్యాంగ సవరణ. జమిలి ఎన్నికలు ఫెడరలి జానికి విరుద్ధం. రాష్ట్ర ప్రయోజనాలకు, స్వేచ్ఛకు, అధికారాలకు విరుద్ధం. అందరు అంగీకరిస్తేనే జమిలి ఎన్నికల ఆలోచనకు కార్యరూపం ఇవ్వాలి. కొత్త ఎన్నికల విధానం ప్రవేశపెట్టడానికి ప్రస్తుత వ్యవస్థలో కొన్ని మార్పులు చేయాలి. ప్రభుత్వాల పదవీకాలం ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించి ప్రజల తీర్పు మరోసారి తొందరగా పొందడానికి, అవకాశం కల్పించాలి. 200 ఏళ్ల క్రితం నిర్ణయించుకుని 4 ఏళ్లకోసారి అమెరికా ఎన్నికలు జరుపుకొంటున్నది. మనం మూడేళ్లకొకసారి ఎన్నికలు జరుపుకొంటూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఆదర్శంగా నిలవాలి. రెండవసారి గెలి స్తేనే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పెన్షన్లుంటాయనే నిబంధన పెట్టాలి. ఇలాగైతేనే మొదటిసారి ఎన్నికైనపుడు ప్రజలకు ప్రజా ప్రతి నిధులు తమ సేవలతో అందుబాటులో ఉంటారు. రాజకీయ పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యానికి కట్టుబడి పార్టీలో అన్ని స్థాయుల్లో ఎన్నికలు జరిపేలా చర్యలు తీసు కోవాలి. ఆయా దేశాల జనాభాను బట్టి చట్ట సభల్లో సీట్ల సంఖ్య నిర్ణయమవుతోంది. ఆ మేర ప్రజా ప్రతినిధులు ఎన్నికవు తున్నారు. కానీ మనదేశంలో జనాభా పరంగా చూసినప్పుడు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధులు తక్కువనే చెప్పాలి. జనాభా పరంగా చూసినప్పుడు భారత్‌లో 3,200 మంది పార్లమెంటు సభ్యులు (2,600 లోక్‌సభ సభ్యులు, 600 రాజ్యసభ సభ్యులు) ఉండాలి. చైనా, అమెరికా, గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రే లియా, జపాన్ చట్ట సభల్లో ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధుల సంఖ్యతో పోల్చినప్పుడు... మన చట్ట సభల్లో ప్రజా ప్రతినిధుల సంఖ్య పెంచవలసిన అవసరం బోధపడుతుంది. భారతదేశ జనాభా ప్రకారం సభ్యుల సీట్లే కాదు, ఇప్పటి అసెంబ్లీల సీట్లకు నాలుగైదు రెట్లు పెరగాలి. ఇదేవిధంగా స్థానిక సంస్థల సీట్లూ పెంచాలి. 3,200 పార్లమెంట్ సీట్లలో మహిళలకు సగం, బీసీలకు 27 శాతం, ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 7 శాతం ప్రాతినిధ్యం కోసం రాజ్యాంగాన్ని సవరించాలి. వీలైతే అందరి సమ్మతితో ఆధార్ కార్డుతో ఓటర్ కార్డు, పాన్ కార్డు, వృత్తి, మొత్తం ఆస్తిపాస్తుల రికార్డు అనుసంధానించాలి. ఏ నియోజక వర్గంలో ఓటు వేశారో తెలిపే ఒక ‘కాలమ్’ చేర్చు కోవడం ద్వారా రెండు మూడు చోట్ల ఓటర్ల లిస్టులో పేరుంటే ఏదో ఒక చోట మాత్రమే ఓటు వేసే విధంగా ఎన్నికల సంఘం సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసుకోవాలి. అపుడే కరెక్టుగా అన్ని ప్రాంతా లకూ, వర్గాలకూ ప్రాతినిధ్యం లభిస్తుంది. మరీ ముఖ్యంగా ప్రాథమిక హక్కుల్లో ఓటు హక్కును చేర్చాలి. అలాగే పౌర బాధ్యతల్లో ఎన్నికల్లో ఓటుహక్కును విని యోగించుకోవడాన్నీ చేర్చాలి. సంక్షేమ పథకాలు, ప్రణాళికలు నియోజక వర్గాలవారీగా రూపొందించుకోవడం అవసరం. బ్యాంకింగ్, సైనిక, రైల్వే వంటి రంగాలకు నియోజక వర్గాల వారీగా ప్రాతినిధ్యం ఉన్నపుడే అన్ని రంగాలవారి ప్రాతినిధ్యంతో సమంగా ప్రజాస్వామ్యం అందుబాటులోకి వస్తుంది. ఆదాయ పన్ను ఇతర దేశాలలో వలె రాష్ట్రాలకే చెందడం అవసరం. ఈ విధానం అనుసరిస్తే లోక్‌సభ నియోజక వర్గం నుండి ఏటా ఇద్దరు చొప్పున పదేళ్లలో 20 మంది ఐఏఎస్‌లూ, ఐపీఎస్‌లూ ఎన్నికవుతారు. వారు ఎక్కడున్నా తమ ప్రాంత అభి వృద్ధిని పట్టించుకుంటారు. అలాగే జడ్జీలు, ఇతర అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సైనికులు అన్ని నియోజక వర్గాల నుండి సమంగా ఎదుగుతారు. గ్రామ సభల వలె నాలుగు నెలలకోసారి అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల సభలు ఏర్పాటు చేసి, నిర్వహించే విధంగా రాజ్యాంగంలో మార్పులు చేయాలి. అసెంబ్లీ, పార్లమెంట్ సమా వేశాలకు ముందు ఈ సభలు నిర్వహించి స్థానిక అభివృద్ధి, సంక్షేమం, ప్రణాళికలపై చర్చించాలి. ఎంపీ లాడ్స్ ఫండ్స్ దేనికి ఖర్చు చేయాలో ఈ సభల్లో చర్చించి అనుమతి పొందాలి. అప్పుడే ఎక్కడ నిధుల కొరత ఉందో అక్కడికి నిధులను మళ్లించవచ్చు. ఇటువంటి ఏర్పాట్లు చేసిన తర్వాత జమిలి ఎన్నికలే కాదు, మూడు ఎన్నికలు ఒకేసారి జరుపుకోవచ్చు. బి. ఎస్. రాములు వ్యాసకర్త తెలంగాణ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్, సామాజికవేత్త -
మనిషికేమైంది..?
ఉజ్జయిని: ఈ వారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో, దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రెండు వేర్వేరు ఉదంతాలు మన సమాజం ఉనికిని ప్రశ్నిస్తున్నాయి. ఇక్కడ మానవత్వం ఉందా, కన్నుమూసిందా అన్న సందే హాన్ని రేకెత్తిస్తున్నాయి. ఉజ్జయిని నగర వీధుల్లో మొన్న సోమవారం ఉదయం ఒంటిపై సరైన బట్టలు కూడా లేకుండా నెత్తురోడుతున్న పన్నెండేళ్ల బాలిక తనను కాపాడాలంటూ ఇల్లిల్లూ తిరిగి విన్నవించుకున్నా ఒక్కరంటే ఒక్కరు స్పందించలేదు. ఇలా రెండున్నర గంటలు గడిచి ఆమె స్పృహ కోల్పోయి రోడ్డుపై పడిపోగా ఒక ఆశ్రమం నుంచి బయటికొస్తున్న యువకుడు గమనించి చొరవ తీసుకున్నాడు. తన పైపంచె తీసి కప్పి ఆమెను ఆసుపత్రిలో చేర్చి పోలీసులకు సమాచారం అందించాడు. ఆమెపై అత్యంత దారుణంగా అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షలో తేలింది. బహుశా ఆ యువకుడు కూడా స్పందించకపోయి వుంటే రక్తస్రావంతో ఆమె మరణించేది కూడా. ఎందుకంటే అత్యాచారం చేసిన దుర్మార్గుడు ఆమె అవయవాలను తీవ్రంగా గాయపరిచాడు. గర్భాశయానికైతే అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది కూడా. దశాబ్దం క్రితం ఢిల్లీలో నిర్భయ అనుభవించిన నరక యాతననే ఈ బాలిక కూడా చవిచూసింది. తాను ఉజ్జయిని ఎలా చేరిందో చెప్పలేని స్థితిలో ఉంది. బాలిక తప్పిపోయిందని అంతక్రితం ఆమె తాత సాత్నాలో ఫిర్యాదు చేశాడంటున్నారు. ఉజ్జయినికి 720 కిలోమీటర్ల దూరంలోని సాత్నా నుంచి ఆ బాలికను తరలించిందెవరు అన్నది ఇంకా తేల్చాల్సి వుంది. ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడితోపాటు మరో అయిదు గురిని అరెస్టు చేశారు. దేశ రాజధాని నగరంలో మంగళవారం జరిగిన ఉదంతం కూడా అమాను షమైనది. ప్రసాదం దొంగిలించాడన్న అనుమానంతో మతిస్థిమితం లేని ఒక ముస్లిం యువకుణ్ణి అందరూ ఏకమై కరెంటు స్తంభానికి కట్టి, తీవ్రంగా కొట్టి ప్రాణం తీశారు. ఒంటినిండా గాయాలతో తీవ్ర రక్తస్రావమై అతను మరణించాడని శవపరీక్షలో తేలింది. ఈ ఉదంతంలో అరెస్టయిన ఏడు గురూ పాతికేళ్ల లోపువారే కాగా, అందులో ఒకడు మైనర్. ఈ రెండు ఉదంతాల్లోనూ సమాజం ప్రేక్షక పాత్ర వహించింది. బాధితులను ఆదుకోవాలన్న స్పృహ లేకుండా ప్రవర్తించింది. ఉజ్జయిని నగరానికి ఉజ్వల చరిత్ర వుంది. ఒకనాడది వైభవోపేతంగా వర్ధిల్లిన సాంస్కృతిక కేంద్రం. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో మౌర్య చంద్రగుప్తుడి విశాల సామ్రాజ్యంలో భాగం. తన తండ్రి బిందుసారుడి కాలంలో అశోకుడు స్వయంగా పర్యవేక్షించిన ప్రాంతం. నాలుగో శతాబ్దంలో రెండో చంద్రగుప్త విక్రమాదిత్యుడి రాజధాని. అది కాళిదాస మహాకవీంద్రుడు నడయాడిన నేల. అక్కడే శూద్రకుడు, ధన్వంతరి, వరరుచి, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు వంటివారు వివిధ శాస్త్రాల్లో ఉద్దండ పండితులుగా ప్రఖ్యాతి గడించారు. అంతటి గొప్ప చరిత్ర కలిగినచోట పట్టపగలు నగర వీధుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఒక బాలిక కాపాడమని అర్థిస్తే ఆడ, మగ అందరూ తలుపులేసుకున్నారంటే... పదో పరకో ఇచ్చి తమ అపరాధ భావనను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారంటే ఎలాంటి వారికైనా మనసు వికలమవుతుంది. రోడ్డు ప్రమాదాలు జరిగి నప్పుడు బాధితులను ఆసుపత్రికి తరలించటానికీ, కనీసం పోలీసులకు ఫోన్ చేసి చెప్పటానికీ ఎవరూ ముందుకు రాకపోవటం తరచు గమనిస్తూనే ఉంటాం. చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకుంటామనీ, కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తుందనీ ఇప్పటికీ అనేకులు వెనకడుగేయటం కనబడుతూనే ఉంటుంది. కానీ అర్ధనగ్న స్థితిలో ఆపన్నహస్తం కోసం ఎదురుచూసిన బాలికకు వైద్య సాయం అందేలా చూడటం సంగతి అటుంచి కనీసం ఒంటిని కప్పుకోవటానికి బట్టలిచ్చేందుకు కూడా ఎవరూ సిద్ధపడకపోవటం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ అమానవీయతకు సీసీ టీవీ కెమెరాలు సాక్ష్యంగా నిలిచాయి. సమాజం మొత్తాన్ని కాపలా కాయటం ఏ ప్రభుత్వానికైనా అసాధ్యమన్నది వాస్తవం. లక్షల్లో జనాభా ఉండేచోట వందల్లో మాత్రమే రక్షకభటులుంటారు. అయితే ఉన్న ఆ కొద్దిమందీ కూడా కొన్ని సందర్భాల్లో నేరగాళ్లకు సాయపడుతున్నారనీ, రాజకీయ ప్రాపకం కోసం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనీ ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. రెండున్నర గంటలపాటు ఆ బాలిక ఎక్కడో మారుమూల పల్లెటూరులో కాదు... కేంద్రం స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్న నగర వీధుల్లో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో సంచరిస్తున్నప్పుడు ఒక్క కానిస్టేబులైనా ఆమెను గమనించి ఆదుకోలేకపోవటం పోలీసుల పనితీరును పట్టిచూపిస్తోంది. ఇక గోవధ జరిగిందనో, జరగబోతున్నదనో అనుమానంతో కొందరు దుండగులు మారణాయుధాలతో దాడిచేసి చంపుతున్న ఉదంతాల్లో నేరగాళ్లకు ప్రభుత్వాల ఆశీస్సులుంటున్న సంగతి బహిరంగ రహస్యం. కానీ సమాజం ఏమై పోతోంది? పట్టపగలు కళ్లెదుట జరుగుతున్న దురంతాలపై కూడా కనీస స్పందన కొరవడటం, సహానుభూతి వ్యక్తం కాకపోవటం ఏమిటి? ఎన్నికల్లో ఓటేయటంతోనే పౌరులుగా తమ బాధ్యత తీరిందని జనం అనుకుంటున్నారా? కుల మత చట్రాల్లో, రాజకీయ రొదలో కూరుకుపోయి మనుషు లుగా తమ నైతిక బాధ్యతను విస్మరిస్తున్నారా? ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి. ఆపత్సమయాల్లో మానవీయతను ప్రదర్శించటం, సహానుభూతి వ్యక్తపరచటం, బాధితులకు అండగా నిలవటం మనుషుల కనీస లక్షణాలని తెలుసుకోలేని సమాజం శవప్రాయమైనది. అలాంటిచోట ఎవరికీ రక్షణ ఉండదు. సమాజం సంఘటితంగా ఉన్నప్పుడే, అన్యాయాన్ని ప్రశ్నించే తత్వాన్ని ఒంటబట్టించు కున్నప్పుడే ఇలాంటి దురంతాలకు అడ్డుకట్ట పడుతుంది. ఇదీ చదవండి: అర్ధనగ్నంగా రక్తమోడుతూ -
అమెరికా చదువు సంస్కృతులు
అమెరికా విద్యారంగంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు, రాజకీయులు ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. కొన్నేళ్ళ క్రితం వరకు పాఠశాలల నిర్వహణ అద్భుతంగా ఉండేది. యువ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో చనువుగా ప్రవర్తించే వారు. పిల్లల విషయాలను చర్చించడానికి ఒక రోజయినా వారితో గడిపేవారు. నేటి విద్యార్థులు, యువత అతి తక్కువ సమయంలో ఊహించని, తీవ్రమయిన మార్పులకు గురవుతున్నారు. యుక్త వయసులోకి ప్రవేశిస్తున్న వీరు జ్ఞానాన్ని గ్రహించటానికి పెనుగు లాడుతున్నారు. పాఠశాలలకూ సమస్యలున్నాయి. విపరీతంగా సాగదీయ బడిన ప్రతిష్ఠాత్మక పునర్నిర్మాణ పథకం, ఆశించిన స్థాయిని అందు కోలేని దూరవిద్య, కరోన మహమ్మారి కాలపు అలవాట్ల నుండి బయటపడలేని దుఃస్థితి అందులో కొన్ని. విద్యాలయాల వద్ద మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల అమ్మకాలు మరో తీవ్ర సమస్య. బాంబుల, తుపాకుల ఉపయోగ సంస్కృతి సకారాత్మక నిర్ణయా లకు అడ్డుతగులుతున్నాయి. మహమ్మారి కాలంలో కోల్పోయిన పాఠ్యాంశాలను విద్యా ర్థులు ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నట్లు అనిపిస్తుంది. రెండేళ్లలో తప్పిన సాంఘికీకరణ, పరిపక్వతలను సంపాదిస్తున్నారు. సామాజిక అభివృద్ధిలో విద్యార్థులు రెండేళ్ళు వెనుకబడ్డారని మానసికశాస్త్ర ఉపాధ్యాయుల అభిప్రాయం. అందుకే బళ్ళలో అంతా బాగుందనేవాళ్ళ సంఖ్య తగ్గింది. విద్యారంగం పిచ్చివాళ్ళ, తీవ్రవాదుల హస్తాల్లో చిక్కుకుందని కొన్ని పత్రికలు ప్రచారం కూడా చేస్తున్నాయి. అమెరికాలో విడాకులు పెరిగాయి. పిల్లలకు ఇద్దరు తల్లిదండ్రుల పెంపక అవకాశం లేదు. తల్లిదండ్రులు ఇద్దరిలో ఎవరో ఒకరే పిల్లలను పెంచవలసి వస్తోంది. 25 శాతం పిల్లలు ఇలాంటి వారే. ఏ దేశంలోనూ ఈ స్థితి ఈ స్థాయిలో లేదు. ఈ చేదునిజం అమెరికాలో సింగిల్ పేరెంట్ సంరక్షణ శిశువులను ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనితో సమాజం నష్టపోతోంది. ఈ పిల్లలు ప్రవ ర్తనా సమస్యలను ఎదుర్కొంటున్నారు. పాఠశాలల్లో వీరి సంఖ్య తక్కువ. వారిలో అవగాహన, బోధనాంశాలను అర్థం చేసుకోవడంలో తేడా ఉంటోంది. పిల్లల చదువు, భావిపౌరుల శ్రేయస్సుకు... అమెరికాలో పతనమయిన కుటుంబ, సామాజిక సంబంధాలను మెరుగుపర్చడమే మార్గం. – సంగిరెడ్డి హనుమంత రెడ్డి, వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
పారాహుషార్!
అజ్ఞానం అనేక విధాల అపాయకరం. ఆరోగ్యం విషయంలో అది మరీ ప్రమాదకరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక ఆ సంగతి మన భారతీయులందరికీ మరోసారి గుర్తుచేసింది. మన దేశ జనాభాలో 18.83 కోట్ల మంది దాకా అధిక రక్తపోటు (హై బీపీ)తో బాధపడుతున్నారనీ, అయితే వారిలో కేవలం 37 శాతం మందికే తమ ఆరోగ్య పరిస్థితి గురించి అవగాహన ఉందనీ వెల్లడించింది. అధిక రక్తపోటు ఉందని తేలినవారిలో నూటికి 30 మందే మందులు వాడుతున్నారనీ, వారిలోనూ 15 మందే దాన్ని నియంత్రణలో ఉంచుకుంటు న్నారనీ పేర్కొంది. బీపీ ఉన్నవారిలో కనీసం సగం మంది దాన్ని నియంత్రణలో ఉంచుకోగలిగినా... వచ్చే 2040 నాటికి గుండెపోటు, పక్షవాతం వల్ల సంభవించే 46 లక్షల మరణాలను మన దేశంలో నివారించవచ్చు. డబ్ల్యూహెచ్ఓ చెబుతున్న ఈ మాటలు భారత్‌లో ‘హై బీపీ’ పట్ల పేరుకున్న అశ్రద్ధను గుర్తుచేస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణలోని ఈ లోటుపాట్లపై ప్రజలు, వారితో పాటు ప్రభుత్వం కూడా తక్షణం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్త హైపర్‌టెన్షన్ ప్రభావంపై డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన తొట్టతొలి నివేదిక ఇదే! 2019 నాటి డేటా ఆధారంగా ఈ ప్రపంచ సంస్థ చేసిన నిర్ధారణలు ఆలోచింపజేస్తున్నాయి. ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక బీపీతో బాధపడుతున్నారట! వారిలోనూ ప్రతి అయిదుగురిలో నలుగురు దాన్ని అదుపులో ఉంచుకోవట్లేదట! జీవనశైలిలో అనూహ్య మార్పుల వల్ల 1990 నుంచి 2019కి వచ్చేసరికల్లా బీపీ బాధితుల సంఖ్య 65 కోట్ల నుంచి రెట్టింపై, 130 కోట్లకు చేరింది. పైకి లక్షణాలేవీ ప్రత్యేకంగా కనిపించని ‘సైలెంట్ కిల్లర్’ ఇది. అందుకే, గుండె జబ్బు, కిడ్నీలు దెబ్బ తినడం లాంటి ఇతర సమస్యలు తలెత్తినప్పుడు గానీ ఈ అధిక బీపీని పలువురు గుర్తించడం లేదని వైద్యులు వాపోతున్నారు. బీపీ ఉన్నట్టు తెలిసినా సరిగ్గా మందులు వాడక అశ్రద్ధ చేసి తల మీదకు తెచ్చుకుంటున్నవారు అనేకులు. భారత్‌లో గుండెపోటు, స్ట్రోక్‌లతో మరణిస్తున్న వారిలో నూటికి 52 మంది అనియంత్రిత అధిక బీపీ (140/90కి పైన)కి బలి అవుతున్నవారే! చౌకగా మందులతో అదుపు చేయవచ్చని తెలిసినా, పలు దేశాల్లో ఈ పెను ప్రమాదకారిపై తగినంత శ్రద్ధ పెట్టడం లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో కొన్ని తమ పౌరులందరికీ పరీక్షలు జరిపి, ఉచితంగా చికిత్స అంది స్తున్నాయి. అయితే, అల్పాదాయ దేశాల్లో అలాంటి పరిస్థితి లేదు. నిజానికి, మనదేశంలో ప్రజల్లో అధిక బీపీ దుష్ఫలితాల్ని నియంత్రించేందుకు ‘ఇండియా హైపర్‌టెన్షన్ కంట్రోల్ ఇనీషియేటివ్’ (ఐహెచ్‌సీఐ)ను 2017 నవంబర్లోనే కేంద్ర ఆరోగ్య శాఖ చేపట్టింది. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ స్థాయిలోనే అసాంక్రమిక వ్యాధుల పరీక్షలు జరిపి, చికిత్స, మందులిచ్చి, 2025 నాటి కల్లా దేశంలో 7.5 కోట్ల మందికి బీపీ, షుగర్ల నుంచి సంరక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదట 5 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొద్ది జిల్లాల్లో మొదలైన ఈ ఆరోగ్య యజ్ఞం క్రమంగా 155 జిల్లాలకు విస్తరించింది. అయితే, ఈ ఏడాది జూన్ నాటికి 27 రాష్ట్రాల్లో దాదాపు 58 లక్షల మంది బీపీ రోగులకు మాత్రం చికిత్స అందించగలిగింది. నిరుడు ఇది ఐరాస అవార్డును అందుకున్న ప్రశంసనీయ ప్రయత్నం. కానీ, బీపీ బాధితుల సంఖ్య కోట్లలో ఉన్న దేశంలో చెరువు నీటిని చెంబుతో తోడితే సరిపోదు. డబ్ల్యూహెచ్ఓ తాజా నివేదిక సైతం ముందుగా ప్రజల్లో చైతన్యం పెంచాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతోంది. సమాజంలోని పేదవర్గాల్లో పలువురు అధిక బీపీ బాధితులు కొంతకాలం పాటు మందులు వాడి, పరిస్థితి కొద్దిగా కుదుటపడగానే మానేస్తున్నారట! కొన్ని అధ్యయనాలు వెల్లడించిన ఈ చేదు నిజం ఆందోళన రేపుతోంది. బీపీకి చికిత్స, మందులు మధ్యలో ఆపడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని భారతీయ ఆరోగ్య సంరక్షణ మార్గదర్శకాలు ఎప్పటి నుంచో చెబుతున్నదే! అయినా మనం పెడచెవిన పెడుతున్నాం. ఈ ధోరణి మారాలి. 30 ఏళ్ళ వయసు నుంచే బీపీ చూపించు కోవాలనీ, 50వ పడిలో పడ్డాక తరచూ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరనీ వైద్యులిస్తున్న సలహాను పాటించడం మంచిది. అలాగే, రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సిఫార్సున్నా, భారత్‌లో 8 గ్రాముల దాకా తీసుకుంటున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి తాజా నివేదిక సైతం హెచ్చరిస్తోంది. ఉప్పు తగ్గించడం, ధూమపానం, మద్యపానం మానే యడం, శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన ఆహారం, కంటి నిండా నిద్ర లాంటి జీవనశైలి మార్పులతో, జీవితాంతం బీపీ మందులు మానకుండా వాడడం శ్రేయస్కరం. గణాంకాలు గమనిస్తే, గత 15 ఏళ్ళలో దేశంలోని చిన్న పట్నాలు, గ్రామీణ ప్రాంతాలకు సైతం బీపీ సమస్య విస్తరించింది. ఆరోగ్య సంరక్షణ వసతుల్లోని లోటు సైతం అక్కడి సమస్యను పెంచు తోంది. మచ్చుకు, గ్రామీణ బిహార్ లాంటి చోట్ల ఆరోగ్య సేవకుల్లో మూడోవంతు మందికి మాత్రమే సరైన బీపీ చికిత్స తెలుసట! అంతర్జాతీయ పరిశోధకుల సర్వే నిరుడు తేల్చిన దిగ్భ్రాంతికరమైన నిజమిది. జిల్లా, గ్రామస్థాయుల్లో ప్రజారోగ్య సేవకుల నైపుణ్యం పెంచి, డాక్టర్ల, నర్సుల కొరతను అధిగమించడం ద్వారా ప్రభుత్వ బీపీ కార్యక్రమాన్ని మెరుగుపరచవచ్చని నిపుణుల సూచన. ఏమైనా, డబ్ల్యూహెచ్ఓ తాజా నివేదిక ఇస్తున్న సందేశాన్ని మన విధాన నిర్ణేతలు వెంటనే చెవి కెక్కించుకోవాలి. ఎందుకంటే, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని బట్టి పంథా మార్చి, కొత్త వ్యూహాలను అనుసరించడమే ఏ సమస్యకైనా అసలైన ఔషధం. -
పటిష్ఠతే పరమావధి!
అనుమానం పెనుభూతం! ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ గుర్తింపు కార్యక్రమమైన మన ‘ఆధార్’ విశ్వసనీయతపై ఏళ్ళు గడిచినా ఇప్పటికీ ఏవో అనుమానాలు వస్తూనే ఉన్నాయి. భారత సర్కార్ ఎప్పటికప్పుడు ఆ అనుమానాల్నీ, ఆరోపణల్నీ కొట్టిపారేస్తున్నా అవి మాత్రం ఆగడం లేదు. ప్రపంచశ్రేణి రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తన తాజా నివేదికలో ఆధార్ భద్రత, వ్యక్తిగత గోప్యతలపై లేవనెత్తిన ప్రశ్నలతో ఈ అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఎలాంటి సాక్ష్యాధా రాలూ పేర్కొనకుండా, అర్థం లేని ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ ప్రభుత్వం సహజంగానే ఈ నివేదికను కొట్టిపారేసింది. అయితే, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద శ్రామికులకు జరిపే చెల్లింపులు సహా సమస్తం ఇకపై ఆధార్‌తోనే జరపాలని ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్ని స్తున్న వేళ మూడీస్ నివేదికలోని మాటలు కొంత ఆందోళన రేపుతున్నాయి. సత్వరమే ఆ అనుమా నాల్ని నివృత్తి చేసి, ఆధార్ సందేహాతీతమైనదని మరోసారి చాటాల్సిన అవసరం ఏర్పడింది. న్యూయార్క్ కేంద్రంగా నడిచే రేటింగ్ ఏజెన్సీ మూడీస్ గురువారం విడుదల చేసిన పరిశోధనా నివేదిక ఆ మధ్య కొత్తగా రంగప్రవేశం చేసిన ‘వరల్డ్ కాయిన్’తో మన ఆధార్‌ను పోల్చింది. విస్తృత పరిమాణం, సృజనాత్మక ఆలోచన రీత్యా రెండూ ప్రత్యేకంగా నిలిచాయని ప్రశంసించింది. అయితే, భద్రత, గోప్యతలే అసలు సమస్యలంటూ కొన్ని ప్రాథమికమైన ప్రశ్నలు వేసింది. ఉష్ణోగ్రత, ఉక్క పోత ఎక్కువగా ఉండే చోట ఆధార్ లాంటి బయోమెట్రిక్ సాంకేతిక పరిజ్ఞానం ఏ మేరకు సమర్థంగా పనిచేస్తుందన్నది సదరు నివేదిక అనుమానం. ఆధార్ ధ్రువీకరణలో ఇబ్బందుల వల్ల పలుమార్లు సేవలు అందడం లేదనేది దాని వాదన. అన్నిటి కన్నా ముఖ్యంగా, ఆధార్ వ్యవస్థ సురక్షితమేనా, అందులోని వ్యక్తిగత సమాచారం గోప్యమేనా అన్నది మూడీ సంధిస్తున్న ప్రశ్న. దేశంలో 120 కోట్లమందికి పైగా బయోమెట్రిక్, జనసంఖ్యా సంబంధ వివరాలను ఈ ఆధార్ బృహత్ యజ్ఞంలో నమోదు చేశారు. ఎవరికి వారికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించారు. వేలిముద్రలు, కనుపాపల స్కానింగ్, వన్‌టైమ్ పాస్వర్డ్ లాంటì పద్ధతుల్లో వ్యక్తులు తమ గుర్తింపును నిర్ధారించి, ప్రభుత్వ, ప్రైవేట్ సేవలను అందుకొనే వీలు కల్పించారు. మొదట కొంత తటపటాయింపు ఉన్నా, క్రమంగా ఆధార్ నమోదు, దాని వినియోగం విస్తరించింది. బలహీనవర్గా లకు అందించే ప్రభుత్వ సహాయాలకే కాదు... చివరకు బ్యాంకు ఖాతాల ఆరంభం, మొబైల్ కనెక్షన్, పన్నుల చెల్లింపు సహా అనేక రోజువారీ పనులకు సైతం ఆ నంబర్ తప్పనిసరైంది. దళారుల బాధ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే సంక్షేమ పథకాల సాయం అందేలా ఆధార్ బాట వేసింది. ఆధార్ వ్యవహారాలన్నీ చూసే కేంద్ర సంస్థగా ‘భారత యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ’ (యూఐడీఎఐ) వ్యవహరిస్తోంది. చిత్రం ఏమిటంటే, సదరు సంస్థకు నాలుగేళ్ళుగా నాధుడు లేడు. ఎట్టకేలకు గత నెలలో ప్రభుత్వం ఓ తాత్కాలిక ఛీఫ్‌ను నియమించింది. ఇలాంటి చర్యలు ఆధార్ నిర్వహణ పట్ల పాలకుల చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అలాగే, ఈ సంస్థపై ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా’ (కాగ్) నిరుడు విడుదల చేసిన నివేదిక సైతం ఆధార్ నమోదు ప్రక్రియలో లోపాలు, తప్పుడు బయోమెట్రిక్ లాంటి అనేక అంశాలను ఎత్తిచూపడం గమనార్హం. ఆధార్‌లో నమోదైన సమాచారపు భద్రత, వ్యక్తిగత గోప్యత గాలికి పోయే ప్రమాదాన్ని హెచ్చరించింది. ఇవాళ్టి మూడీస్ నివేదిక కన్నా చాలా ముందే మన ‘కాగ్’ వ్యక్తం చేసిన ఈ భయాలపై ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నదీ సమాచారం లేదు. కేంద్రంలో గడచిన ‘ఐక్య ప్రగతిశీల కూటమి’ (యూపీఏ) ప్రభుత్వ హయాంలో ఆరంభమైన ప్పటి నుంచి ఆధార్‌పై భిన్న వాదనలు వస్తూనే ఉన్నాయి. ఆధార్‌కు అనేక సానుకూలతలు ఉన్నప్ప టికీ ఈ ప్రక్రియ, వినియోగం నిర్దుష్టమైనదేమీ కాదని సర్కార్ నుంచి సామాన్యుల దాకా అందరికీ తెలుసు. ఇవాళ్టికీ గ్రామీణ భారతావనిలో డిజిటల్ గుర్తింపు చూపలేనివారికి రేషన్ అంద ట్లేదనీ, కొన్ని ఆకలి చావులకు అదీ ఒక కారణమనీ వార్తలొచ్చాయి. ఆధార్ లోపానికీ, ఆ చావులకూ కారణం లేదన్న ఖండనలూ విన్నాం. అయితే, అతిగా టెక్నాలజీపై ఆధారపడి, సాయం పొందా ల్సినవారిని తృణీకరించడం, అసలు లక్ష్యాన్ని విస్మరించడం అమానవీయతే! రోజూ పనిపాటలతో శ్రమించే వారి చేతిరేఖలు చెరిగిపోతే అది వారి పాపమా? కంటిపాపల స్కానింగ్, వన్‌టైమ్ పాస్వర్డ్ లాంటివి కూడా ఉన్నా నెట్ సౌకర్యం లేని సుదూర గ్రామీణ ప్రాంతాల్లో వాటి మీద పూర్తిగా ఆధారపడలేం. అలాగే, అంచెలంచెల సైబర్ భద్రత ఉందని సర్కారు చెబుతున్నప్పటికీ, అనేక సందర్భాల్లో ఆధార్ సమాచారం గంపగుత్తగా లీకవడం చూశాం. ఈ సమాచార నిధి సైబర్ దొంగల చేతిలో పడితే పర్యవసానాలూ తీవ్రమే! అందుకే, లోపాలను ప్రస్తావించినవారిని నిందించే కన్నా, వాటిని సరిదిద్దడంపై దృష్టి పెట్టడం తక్షణ కర్తవ్యం. ముఖ్యంగా ప్రస్తుతం నడుస్తున్న కేంద్రీకృత విధానం బదులు సమాచార గోప్యత, రక్షణ కోసం మూడీస్ సూచించినట్లుగా ఆధార్‌కు వికేంద్రీకరణ విధానాన్ని అవలంబించడం మంచిదేమో చూడాలి. తద్వారా ఒక అంచెలో ఉల్లంఘన జరిగినప్పటికీ, అక్కడితో నష్టనివారణ చేయగలమని గుర్తించాలి. ఇటీవల జీ–20లోనూ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)లో అద్భుతమంటూ మనం చెప్పుకున్న ఆధార్ వ్యవస్థపై సమగ్ర సమీక్ష జరపాలి. పూర్తి లోపరహితంగా మార్చే పని మొదలుపెట్టాలి. ఓటర్ల జాబితా సహా సమస్తానికీ ఆధారంగా అనుసంధానించాలని అనుకుంటున్న వేళ అది మరింత అవసరం. -
ఈ పరిస్థితి మారేదెట్లా?
భారత – కెనడా సంబంధాలు కొంతకాలంగా ఇరుకునపడ్డ మాట నిజమే కానీ, గత వారం రోజుల పరిణామాలతో అధఃపాతాళానికి పడిపోయాయి. కెనడా పౌరుడైన ఓ ఖలిస్తానీ సిక్కును భారత్ హతమార్చిందంటూ ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో గత వారం చేసిన ఆరోపణ ఒక్కసారిగా పరిస్థితిని దిగజార్చింది. భారత ప్రభుత్వం ఆ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించడం, కెనడా తన మాట వెనక్కి తీసుకోకపోవడం, వరుస దౌత్యవేత్తల బహిష్కరణలు... కొద్దిరోజులుగా వేడిని పెంచుతూ వస్తున్నాయి. భారత్‌లో పర్యటించదలచినవారికి అనేక జాగ్రత్తలు చెబుతూ కెనడా ప్రత్యేక సూచన లిస్తే, కెనడా దేశస్థులకు వీసాల జారీని భారత్ నిలుపు చేసింది. ఆలస్యంగానైనా నిద్ర లేచిన భారత సర్కార్ సదరు ఖలిస్తానీ మద్దతుదార్లకు దేశంలో ఉన్న ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం మొదలెట్టింది. తాజాగా ఐరాస వేదికపైనా అంతర్లీనంగా కెనడా వైఖరిని ఎండగట్టింది. వరుస చూస్తే,రెండు దేశాల మధ్య దౌత్యఘర్షణకు ఇప్పుడప్పుడే తెర పడేలా కనపడట్లేదు. ఈ వ్యవహారంలో తప్పంతా కెనడా ప్రధానిదే. వారం క్రితం భారత్‌పై తీవ్ర ఆరోపణతో రెండు దేశాల మధ్య దౌత్య తుపాను రేపిన ట్రూడో ఇప్పటి వరకు సాక్ష్యం చూపలేకపోయారు. అదేమంటే, ‘ఫైవ్ ఐస్’ గూఢచర్య కూటమి సేకరించిన సమాచారమే ఈ ఆరోపణకు ఆధారమని కెనడా దేశపు మీడియాలో లీకులు వస్తున్నాయి. ఆ మాటకొస్తే ట్రూడో హయాంలో భారత్‌కు వ్యతిరేకంగా జరిగిన అరాచకాలు అనేకం. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను కొని యాడే శకటాలు, దౌత్యవేత్తలపై హింసను ప్రేరేపిస్తూ ‘‘కిల్ ఇండియా’’ పేరిట పోస్టర్లు, హిందూ ఆలయాలపై దాడుల లాంటివన్నీ ఆయన ఏలుబడిలో ఎగసిపడ్డవే. కెనడాలోని సిక్కు ఓట్ల కోసం తీవ్రవాద సభలకు సైతం ఆయన హాజరయ్యారు. అప్పట్లోనే భారత దౌత్యవేత్తలు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కెనడా ప్రయోజనాల కన్నా తన స్వప్రయోజనాలకే ట్రూడో పెద్ద పీట వేస్తున్నట్టున్నారు. ఖలి స్తానీ మద్దతుదారుల్ని సంతోషపరచి, నాలుగు ఓట్లు ఎక్కువ సంపాదించాలన్నదే ఆయన తాప త్రయంగా కనిపిస్తోంది. పరిణతి లేని ఆయన రాజకీయ చర్యలపై నిపుణులైన కెనడా దౌత్యవేత్తలు ఇప్పటికే పెదవి విరిచారు. 2018లో భారత పర్యటన సందర్భంగా నేరస్థుణ్ణి విందుకు ఆహ్వానించి ఫోటోలు దిగి రచ్చ రేపిన ట్రూడో తన తాజా చర్యలతో ఏకంగా భారత్‌తో బంధానికే పూర్తిగా నిప్పంటించేశారు. నిజానికి, భారత అభ్యర్థనపై 2016 నుంచి ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీస్‌లో ఉన్న తీవ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ జూన్ 18న గుర్తు తెలియని దుండగుల తుపాకీ కాల్పులకు చనిపో యాడు. నాలుగు నెలల తర్వాత ట్రూడో నిద్ర లేచి, అది భారత్ చేసిన హత్య అనడం విడ్డూరం. పడిపోతున్న ప్రతిష్ఠను నిలబెట్టుకొనేందుకే జస్టిన్ ట్రూడో ఇలా అంతర్జాతీయంగా భారత్‌పై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో 1968 నుంచి 1984 మధ్య కెనడా ప్రధానిగా పనిచేసిన ఆయన తండ్రి ప్రియర్ ట్రూడో సైతం ఇలాగే పెడసరంగా వ్యవహరించారు. సిక్కు తీవ్రవాది తల్విందర్ సింగ్ పర్మార్‌ను అప్పగించమని అభ్యర్థిస్తే నిరాకరించారు. చివరకు ఆ తీవ్రవాది ఓ ఉగ్రసంస్థకు అధిపతై, 1985లో ఎయిరిండియా విమానాన్ని బాంబు పెట్టి పేల్చేసి, 329 మంది మరణానికి కారణ మయ్యాడు. 2016లో తండ్రి లానే కొడుకు ప్రధాని కాగానే, ఆ కేసులో శిక్షపడ్డ ఏకైక వ్యక్తి పెరోల్‌పై విడుదలయ్యాడు. 2018లో ట్రూడో భారత్ సందర్శించినప్పుడు అప్పటి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తాము అన్వేషిస్తున్న తీవ్రవాదుల జాబితాను అందజేశారు. తాజాగా మరణించిన నిజ్జర్ పేరూ అందులో ఉంది. ఈసారి పెద్ద ట్రూడో బాటలోనే చిన్న ట్రూడో చర్యలేమీ చేపట్టలేదు. నిజ్జర్ మరణంపై ఇంతవరకు చేసిన దర్యాప్తు, అనుమానితులు, అదుపులో తీసుకున్న పేర్లేమీ కెనడా చెప్పట్లేదు. ఇండియాపై ఆరోపణలు చేసి పది రోజులవుతున్నా తన వాదనకు బలం చేకూర్చే సాక్ష్యమేమీ ట్రూడో చూపలేకపోయారన్నది గుర్తించాలి. ఈ గొడవ ఇలా నడుస్తుండగానే, నాజీ సంబంధాలున్న ఓ వయోవృద్ధుడిని శుక్రవారం కెనడా పార్లమెంట్ గౌరవించి, మరో తప్పు చేసింది. ఆఖరికి స్పీకర్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. తాము నెత్తిన పెట్టుకుంటున్న వ్యక్తుల నేపథ్యం తెలుసుకోవడంలో కెనడా పాలనా యంత్రాంగం విఫలమవుతోందనడానికి ఇది మరో మచ్చుతునక. భారత్ సైతం విదేశీగడ్డపై నివసిస్తూ, మాతృదేశానికి ద్రోహం చేయాలని చూస్తున్నవారిపై ఇకనైనా కఠినంగా వ్యవహరించాలి. ఈ ఖలిస్తానీలకు నిధులెక్కడ నుంచి వస్తున్నాయి, వారికి తెరచాటు అండదండ ఎవరనేది కనిపెట్టి, సాక్ష్యాధారాలతో అంతర్జాతీయంగా బట్టబయలు చేయాలి. దేశంలో ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్ల లాంటి వంద తలనొప్పులున్న ట్రూడో నిరాధార ఆరోప ణలకు దిగే కన్నా ముందు ఆ సమస్యలపై దృష్టి పెట్టాలి. ఎనిమిదేళ్ళ క్రితం ఎన్నుకున్న తనను 63 శాతం మంది ఇప్పుడు వ్యతిరేకించడానికి కారణాలు గ్రహించాలి. ఎన్నికల్లో ఓట్లు, సీట్లు, నిధుల కోసం ఆయన పార్టీ వర్గాలు ఖలిస్తానీ అనుకూల వర్గాలపై అతిగా ఆధారపడడం మానుకోవాలి. పౌరుల భావస్వేచ్ఛను పరిరక్షించాల్సిందే కానీ, ఆ మిషతో తీవ్రవాదం సాగిస్తే సహించబోమని అక్కడి సిక్కు ప్రవాసీలకూ స్పష్టం చేయాలి. కెనడాకు 10వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారత్. అక్కడి పర్యాటకుల సంఖ్యలో నాలుగో స్థానం మనదే. కెనడాకెళ్ళే విద్యార్థుల్లో 40 శాతం మనవాళ్ళే. అందుకే ఎన్నికల్లో గెలుపోటముల కన్నా దేశాల మధ్య దశాబ్దాల బంధం ముఖ్యమని ట్రూడో గ్రహించాలి. భారత్ సైతం పరిస్థితిని చక్కదిద్దడమెలాగో ఆలోచించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. ఇరుపక్షాలకూ కావాల్సిన అమెరికా మధ్యవర్తిత్వమూ అందుకు కలిసిరావచ్చు. -
ఎట్టకేలకు కాసింత స్వేచ్ఛ!
ఒకటి కాదు... రెండు కాదు... 143 రోజుల తర్వాత మోక్షం లభించింది. కల్లోలిత మణిపుర్‌లోని బీరేన్‌సింగ్ సర్కార్ ఎట్టకేలకు శనివారం నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించింది. అపరిమిత ఆలస్యం తరువాౖత అయితేనేం, పాలకులు ఇన్నాళ్ళకు ఒక అడుగు ముందుకు వేసినట్ట యింది. రాష్ట్రంలో సాధారణ స్థితి నెలకొల్పేందుకు తీసుకున్న చర్యగా ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ నిర్ణయం హర్షించదగ్గ విషయం. మే 3న రెండు ప్రధాన వర్గాల మధ్య ఘర్షణలు మొదలైనప్పుడే నెట్ సేవలపై రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ నిషేధం విధించింది. ఆ తరువాత జూన్ 25న బ్రాడ్‌బ్యాండ్ సేవలను అనేక షరతులతో పాక్షికంగా పునరుద్ధరించినా, మొబైల్లో నెట్‌పై ఇప్పటి దాకా నిషేధం కొనసాగింది. నూటికి 95 మంది మొబైల్‌తోనే నెట్ సేవలందుకొనే మన దేశంలో ఇప్పుడీ ఎత్తివేత నిర్ణయం మణిపుర్లో అందరికీ సాంత్వన. కుంటుపడ్డ ఆర్థిక వ్యవస్థకూ, జీవనోపాధికీ పెద్ద ఊపిరి. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగైనందు వల్ల’’ ఇప్పుడు మొబైల్ నెట్ సేవల పునరుద్ధరణ నిర్ణయం తీసుకున్నామన్నది సర్కారు వారి మాట. మణిపుర్లో పరిస్థితిపై ప్రభుత్వ కథనంలో నిజానిజాలు ఎంత అన్నది చర్చనీయాంశమే. అయితే, నిర్ణయం ఎందుకు తీసుకున్న ప్పటికీ... జనజీవితాన్ని ప్రభావితం చేస్తూ, అసత్యాల వ్యాప్తికి కారణమవుతున్న నిషేధాన్ని ఎత్తి వేయడం కచ్చితంగా సమంజసం. అందులో మరో మాట లేదు. మణిపుర్లో పర్యటించిన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా బృందం సైతం ఇంటర్నెట్ సేవల నిషేధం చెడు చేసిందని పేర్కొన్న సంగతి మర్చిపోలేం. ఇంటర్నెట్ లేక, నిజనిర్ధారణకు వీలు లేక మీడియా చివరకు ప్రభుత్వపు గూటి చిలకగా మారి, ఆ గూటి పలుకులే పలికే దుఃస్థితి తలెత్తిందని విమర్శలు వచ్చాయి. సత్యనిష్ఠ గల మీడియా లేకపోవడంతో, అదే సందుగా పుకార్లు షికార్లు చేశాయి. విద్వేషవ్యాప్తితో అగ్నికి ఆజ్యం పోశాయి. అలాంటి ఓ పుకారే చివరకు ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన హేయమైన ఘటనకు దారి తీసిందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే మణిపుర్ ఘర్షణల్లో 175 మందికి పైగా బలి కాగా, 60 వేల మంది నిరాశ్రయులయ్యారు. జీవితాలు చెల్లాచెదరయ్యాయి. పరిస్థితిని అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర పాలకులు కాల యాపన చేశాయి. ఫేక్ న్యూస్ ఆపుతామంటూ పెట్టిన నెట్ నిషేధం అసలు న్యూస్ ఏమిటో ప్రపంచానికి అందకుండా చేసింది. అసలు సమస్య ఎక్కడుందో ముందే కనిపెట్టి, బలగాలు త్వరితగతిన చర్యలు చేపట్టే అవకాశాన్ని చేజార్చుకుంది. ఇవాళ ప్రజలు పూర్తిగా రెండు శిబిరాలుగా చీలిపోయే పరిస్థితిని కొనితెచ్చింది. గతంలో కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత దాదాపు రెండేళ్ళ పాటు ఇంట ర్నెట్పై నిషేధం నడిచింది. ఆ తర్వాత మళ్ళీ ఇలా దాదాపు 5 నెలల దీర్ఘకాలం నెట్ సేవలపై కట్టడి కొనసాగింది మణిపుర్‌లోనే! గత అయిదేళ్ళలో ప్రపంచంలో మరే దేశమూ చేయనన్నిసార్లు భారత్ నెట్‌పై కట్టడి పెట్టింది. ఒక్క 2022లోనే 84 సార్లు నెట్ షట్డౌన్లు సాగాయి. ఏ కొద్ది నిరసన తలెత్తినా అణచివేసేందుకు నెట్ నిలిపివేత కొత్త రాజకీయ నియంత్రణ సాధనంగా మారడం విషాదం. రష్యా, సూడాన్, ఇరాన్, మయన్మార్, ఇథియోపియా సహా నిరంకుశ పాలన సాగే అనేక దేశాల్లో కన్నా మన ప్రజాస్వామ్య భారతంలోనే ఇంటర్నెట్ సేవల్ని తరచూ ఆపేయడం విడ్డూరం. నిజానికి, ఇంటర్నెట్ సేవలను నిరవధికంగా సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని ‘అనురాధా భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (2020) కేసులో సుప్రీమ్ కోర్ట్ స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్య్రం,ఇంటర్నెట్ను ఉపయోగించి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే స్వేచ్ఛ అనేవి ప్రాథమిక హక్కులనీ, నెట్‌పై నిషేధం వాటికి భంగం కలిగించడమేననీ కోర్ట్ అప్పుడే తేల్చింది. అత్యవసరమై నిషేధం పెట్టినా దాన్ని పొడిగిస్తూ పోరాదనీ చెప్పింది. ప్రభుత్వాలు ఆ స్ఫూర్తిని అర్థం చేసుకోవట్లేదు. శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం మానేసి, దానికి ప్రత్యామ్నాయం నెట్‌పై నిషేధమే అన్నట్టు ప్రవర్తిస్తున్నాయి. ఇది పరిష్కారం కాదని సుప్రీమ్ తప్పుబట్టింది. కానీ, ఇప్పటి దాకా మణిపుర్ సర్కార్ చేసింది అదే. తాజాగా ఈ మార్చిలో పంజాబ్‌లో వేర్పాటువాద నేత పరారీ, జూలైలో హర్యానాలో మతఘర్షణల సమయంలో ఇతర ప్రభుత్వాలూ ఆ పనే చేశాయి. మణిపుర్లో మైతేయ్‌లకూ, కుకీలకూ మధ్య పేరుకున్న విద్వేషాన్ని పోగొట్టాలంటే పాలకులు చేయాల్సిన పని వేరు. ముందు సమన్యాయం పాటించాలి. అందరితోనూ సుహృద్భావ పూర్వక చర్చలు జరపాలి. తీవ్రవాద వర్గాన్ని ఏకాకిని చేయాలి. సమాజంలో సహనం, శాంతి, పరస్పర విశ్వాసం నెలకొనేలా ఒక్కొక్క అడుగూ వేయాలి. కానీ, ఒక వర్గానికే కొమ్ము కాస్తూ, సొంత సహచరుల నమ్మకమే కోల్పోయిన పాలకుడికి అది కష్టమే! ఇప్పటికీ మణిపుర్ సాధారణ స్థితికి రాలేదని వార్త. కానీ, అందుకు నెట్‌పై విరుచుకుపడడం సరికాదు. ఆ వివేకం ఇన్నాళ్ళకు మన పాలకులలో మేలుకొన్నట్టుంది. ‘డిజిటల్ ఇండియా’ స్వప్నంతో, నెలకు వెయ్యి కోట్ల సంఖ్యలో డిజిటల్ చెల్లింపులతో రొమ్ము విరుచుకుంటున్న దేశం తరచూ నెట్ ఆపేస్తే, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అది చెల్లదు. నెట్ నిషేధంతో మణిపుర్ 60 లక్షల డాలర్లు, దేశవ్యాప్తంగా 400 కోట్ల డాలర్లు నష్టం వచ్చిందని అంచనా. బ్రిటీషు కాలపు టెలిగ్రాఫ్ చట్టం–1885ను అడ్డం పెట్టుకొని కోర్టులకు చిక్కకుండా యథేచ్ఛగా నెట్‌పై నిషేధం పెట్టడం పాలకులకు శోభనివ్వదు. మణిపూర్ ఉదంతంతోనైనా మన ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకొని, తీరు మార్చుకుంటే మనుషులకూ, మానవ హక్కులకూ మేలు. -
త్రిశంకుస్వర్గం
సృష్టిలో ప్రకృతికి వికృతి ఉంటుంది. ప్రతి సృష్టికీ దానికి దీటైన ప్రతిసృష్టి కూడా ఉండనే ఉంటుంది. సహజమైన సృష్టి ప్రకృతి అయితే, మానవులు తమ అమోఘ మేధతో చేసిన ప్రతిసృష్టి వికృతి. సృష్టికి పోటీగా ప్రతిసృష్టి చేయాలనే తపన మానవులకు యుగాల కిందటే మొదలైంది. మానవులకు ఉన్న ఈ తపన వారి కల్పనల్లో ప్రతిఫలించింది. పురాణాలు మొదలుకొని ఆధునిక సాహిత్యం వరకు ప్రతిసృష్టి కల్పనలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ప్రతిసృష్టికి ఉదాహరణ మన పురాణాల్లోనే కనిపిస్తుంది. అదే– విశ్వామిత్ర సృష్టి. త్రిశంకుడి కోసం విశ్వామిత్రుడు ఏకంగా స్వర్గానికే నకలును సృష్టించాడు. విశ్వామిత్రుడు సృష్టించిన త్రిశంకుస్వర్గం దేవేంద్రుడి స్వర్గానికి ఏమాత్రమూ తీసిపోదు. కాకుంటే, కర్మకొద్ది త్రిశంకుడే అందులో తలకిందులుగా వేలాడుతూ నిలిచిపోయాడు. తన కోసం సృష్టించిన స్వర్గంలో తానే తలకిందులుగా వేలాడే దుర్గతి తటస్థించడమే ప్రతిసృష్టిలోని వికృతి! కృత్రిమ మేధతో పనిచేసే మరమనిషి ప్రస్తావన గ్రీకు పురాణాల్లో కనిపిస్తుంది. హిఫీస్టస్ అనే గ్రీకుల దేవుడు క్రీట్ దీవిని రక్షించడానికి టాలోస్ అనే భారీ కంచు మరమనిషిని సృష్టించాడు. హిఫీస్టస్ మన భారతీయ పురాణాల్లోని విశ్వకర్మలాంటి వాడు. శిల్పులు, లోహశిల్పులు వంటి వారికి, అగ్నిపర్వతాలకు అధిదేవుడు. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దికి చెందిన గ్రీకు కవి అపలోనీయస్ ఆఫ్ రోడ్స్ రాసిన ‘ఆర్గనాటికా’ కావ్యంలోనిది ఈ గాథ. ఈ కావ్యంలోనే ఒళ్లంతా బంగారమే గల మరమగువల గురించి కూడా వర్ణించాడు. వాళ్లను కూడా హిఫీస్టస్ సృష్టించాడు. ‘ఆర్గనాటికా’ గాథ ప్రకారం– హిఫీస్టస్ సృష్టించిన టాలోస్ను క్రీట్ రాజు జూస్ తన కొడుకు మైనోస్కు బహుమతిగా ఇచ్చాడు. మైనోస్ నియంతగా మారి టాలోస్ను తన శత్రువులను నిర్మూ లించడానికి వాడుకున్నాడు. కృత్రిమ మేధ శక్తిని, దుర్మార్గుల చేతిలో పడితే దానివల్ల వాటిల్లగల ప్రమాదాలనూ అపలోనీయస్ ఎంతో ముందుగానే ఊహించడం విశేషం. ‘ఆర్గనాటికా’ గాథకు ఇరవైమూడు శతాబ్దాల తర్వాత గాని ‘రోబో’ అనే మాట పుట్టలేదు. చెక్ రచయిత కారల్ కాపెక్ 1920లో రాసిన నాటకం ‘రోసమ్స్ యూనివర్సల్ రోబో’ ద్వారా ‘రోబో’ అనే మాటను వాడుకలోకి తెచ్చాడు. అప్పటి నుంచి మరమనిషికి ‘రోబో’ అనే మాట ఇంగ్లిష్‌లోకి వచ్చింది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా వాడుకలోకి వచ్చింది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి చెందిన గ్రీకు మేధావి అరిస్టాటిల్ కూడా కృత్రిమ మేధ గురించిన ఆలోచనలు చేశాడు. ఆయన తన ‘పాలిటిక్స్’ గ్రంథంలో ‘ప్రతి పరికరమూ తనను ఉప యోగించే వ్యక్తి ఆదేశాలకు అనుగుణంగా లేదా వారి అవసరాలను ముందుగానే గుర్తించి అందుకు అనుగుణంగా వాటి పని అవి చేసుకోగలిగితే చేతివృత్తుల వారికి కార్మికుల అవసరం ఉండదు. అలాగే యజమానులకు బానిసల అవసరం కూడా ఉండదు’ అని రాశాడు. మనుషులు శ్రమలో నిరంతరం నలిగిపోకుండా, వాళ్లు తమ పనులను యంత్రాలకు అప్పగించి నిక్షేపంగా జీవితాన్ని ఆస్వాదించాలనేది ఆయన ఆలోచన. కృత్రిమ మేధతో పనిచేసే మరమనుషులను గురించి ప్రాచీనులు కల్పనలు చేసేనాటికి ప్రపంచంలో కనీసం విద్యుత్తు వినియోగంలో లేదు. అప్పట్లో రవాణా వసతులు కూడా అంతంత మాత్రమే! అయితే, నాటి కల్పనలే నేటి కార్యాచరణలు. కాల్పనికమైన ఊహలే శాస్త్ర పురోగతికి ఊతమిస్తాయి. ఎందరో శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఆనాటి కల్పనల్లోని వర్ణనల మాదిరిగానే ఇంచుమించుగా మనుషులను పోలిన హ్యూమనాయిడ్ రోబోలు ఇప్పటికే వాడుకలోకి వచ్చేశాయి. ఇవి ఎప్పటికప్పుడు మరింతగా ఆధునికతను సంతరించుకుంటున్నాయి. ఇవి కృత్రిమ మేధతో మనుషుల మాదిరిగానే పనులు చేయగలుగుతున్నాయి. కృత్రిమ మేధ తెరమీద ఏకంగా మను షులకు నకళ్లనే సృష్టిస్తోంది. కృత్రిమ మేధ ఇప్పుడు ఆధునిక కరాభరణాలైన స్మార్ట్ఫోన్లకూ పాకింది. కృత్రిమ మేధను విస్తృతంగా వాడుకలోకి తేగలిగిన శాస్త్రవేత్తలు అపర విశ్వామిత్రులే! విశామిత్రుడు సృష్టించిన త్రిశంకుస్వర్గంలో త్రిశంకుడు తలకిందులుగా వేలాడుతున్నట్లుగానే, ఆధునిక శాస్త్రవేత్తలు సృష్టించిన కృత్రిమమేధతో మానవాళి పరిస్థితులు తలకిందులవుతాయా అనే భయాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇవి నిష్కారణమైన భయాలు కావు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న సమస్యలతో సతమతమవుతున్న వారిలో అనుభవపూర్వకంగా తలెత్తుతున్న భయాలు. పలు దేశాలు రాజ్యాంగబద్ధంగా గోప్యత హక్కుకు భరోసా కల్పిస్తున్నా, కృత్రిమ మేధ వల్ల మనుషుల గోప్యతకు పూచీలేని పరిస్థితి ఇప్పటికే ఏర్పడింది. కృత్రిమ మేధ దుర్వినియోగం వల్ల నేరాలు కూడా జరుగుతున్నాయి. కృత్రిమ మేధ కళా సాహితీరంగాల్లోని సృజనకు సవాలుగా మారింది. నిన్న మొన్నటి వరకు నటీనటులు కెమెరా ముందు స్వయంగా నటిస్తేనే తెరమీద కనిపించేవారు. నటీనటులు కెమెరా ముందు స్వయంగా నటించకపోయినా, అచ్చంగా వారి రూపాలను, హావ భావ విన్యాసాలను తెరమీద ప్రదర్శించే స్థాయికి చేరుకుంది కృత్రిమ మేధ. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఇదే సమస్యపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తన అనుమతి లేకుండా, తన రూపాన్ని, మాటలను, హావభావాలను కృత్రిమ మేధ సహాయంతో ప్రదర్శించకుండా ఉండేలా కోర్టు నుంచి ఇటీవల ఉత్తర్వులను కూడా పొందాడు. కృత్రిమ మేధ ఒకవైపు కొన్ని పనులను సులభతరం చేస్తున్నా, మరోవైపు కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. వాటికి పరిష్కారం కనుక్కోకుంటే... మన పరిస్థితి త్రిశంకుస్వర్గమే! -
వికసించిన విద్వత్తేజం!
మూడు దశాబ్దాల అమానవీయ రాజకీయ వ్యవస్థ తన మరణ వాఙ్మూలాన్ని లిఖించవలసిన పరిస్థితులు పొడసూపు తున్నాయి. సమతామమతలతో కూడిన ఒక సరికొత్త సామాజిక పొందిక తన జనన నమోదుకు గుర్తుగా జేగంట మోగిస్తున్నది. ఎట్టకేలకు మన కపట రాజనీతి సామ్రాట్టు చట్టం చేతికి చిక్కి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన పెత్తందారీ పరిపాలన పాపాలు ఒక్కొక్కటిగా బోనెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్తకోణం ఆవిష్కృత మవుతున్నది. తనను అన్యాయంగా కేసులో ఇరికించారని మనకాలపు మాకియవెలీ న్యాయాధికారి ఎదుట బుకాయిస్తున్న సమయంలోనే రాష్ట్రంలో ఒక అబ్బురం చోటుచేసుకున్నది. పెత్తందారీ పాలనలో అణగారిపోయిన పేదవర్గాల్లో మొగ్గతొడిగిన బాల్యం అంతర్జాతీయ వేదిక మీద గొంతు సవరించుకున్నది. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న పదిమంది బాలలు ఐక్యరాజ్యసమితి వేదికలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై ఎలుగెత్తారు. విఖ్యాత కొలంబియా విశ్వవిద్యాలయంలో ధైర్యంగా మాట్లాడారు. విద్య, వైద్య రంగాల్లో తమ కళ్లెదుటనే విప్పారుతున్న మరో ప్రపంచపు కాంతి కిరణాలను గురించి వివరంగా చెప్పారు. యాదృచ్ఛికమే కావచ్చు కానీ, సరిగ్గా అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇంటర్నేషనల్ బకలోరియేట్ (ఐబీ) సంస్థతో ఒక ఒప్పందాన్ని చేసుకున్నది. ఈ ఒప్పందం ప్రకారం ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో క్రమానుగతంగా ఐబీ సిలబస్‌ను ప్రవేశపెడతారు. ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే పాఠశాల విద్యా సిలబస్ ఇది. ఈ విధానంలో చదువుకునే పిల్లలపై మానసిక ఒత్తిడి ఉండదు. వారిలోని సృజనశీలతను వెలికితీసే విధంగా ఉంటుంది. హేతుబద్ధమైన స్వతంత్ర ఆలోచనా ధోరణి అలవడుతుంది. తార్కిక వివేచన అబ్బుతుంది. క్లిష్టమైన విషయాలను కూడా సులభగ్రాహ్యం చేసుకోగల నైపుణ్యం ఒంటబడుతుంది. ప్రపంచం మొత్తం మీద మూడు వేల స్కూళ్లలో, భారతదేశంలో రెండొందల కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే ఈ సిలబస్ అందుబాటులో ఉన్నది. చదివే క్లాసును బట్టి, స్కూల్ స్థాయిని బట్టి ఏటా ఆరు లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. అంటే పట్టణ ప్రాంతాల్లోని అత్యంత సంపన్నులైన వారి పిల్లలకు మాత్రమే ఐబీ సిలబస్ అందుబాటులో ఉన్నది. వైఎస్ జగన్ ప్రభుత్వం అంత ఖరీదైన విద్యను ప్రభుత్వ బడుల్లో చదివే పేద పిల్లలందరికీ ఉచితంగా అందుబాటులోకి తేబోతున్నది. మొదటి సంవత్సరం ఒకటో క్లాసుతో ప్రారంభించి ఏటా ఒక క్లాసును పెంచుకుంటూ వెళ్తారని సమాచారం. ఇదొక నిశ్శబ్ద విప్లవం. వచ్చే పన్నెండేళ్లలో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరూ ప్రతిష్ఠాత్మకమైన ఐబీ గొడుగు కిందకు వస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు ఇరవై లక్షలమందిని ఐబీ విద్యావిధానం తీర్చి దిద్దుతున్నది. ఏపీ ప్రభుత్వ బడుల్లో ఇప్పుడే యాభై లక్షల మంది చదువుతున్నారు. ఇంకో పన్నెండేళ్ల తరువాత ఎంత మంది ఉంటారో అంచనా వేయగలిగితే ఇప్పుడు పడిన అడుగు ఎంత విప్లవాత్మకమైనదో అర్థమవుతుంది. అప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఐబీ విద్యార్థుల సంఖ్య ఇంకా పెరుగుతుం దనుకున్నా కూడా బహుశా సగంమంది ఏపీలోనే ఉంటారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య – వైద్యరంగాలకు తొలి ప్రాధాన్యతనిస్తూ ‘నాడు – నేడు’ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొమ్మిదేళ్లు పనిచేసిన కాలంలోనే ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేయడం ప్రారంభమైంది. విభజిత రాష్ట్రంలోనూ అదే పంథా కొనసాగింది. ఫలితంగా పేదపిల్లలకు నాణ్యమైన చదువు లభించక ఉన్నత స్థానాలకు చేరుకోలేకపోయారు. చాలామంది డ్రాపవుట్లుగా మిగిలి పోయారు. మధ్యతరగతి ప్రజలు పిల్లల చదువుల కోసం రుణభారంలో కూరుకుపోవడం సర్వ సాధారణమై పోయింది. ఆ పరిస్థితిని ‘నాడు–నేడు’ కార్య క్రమం చక్కదిద్దిందనేది మన కళ్లముందటే కదలాడుతున్న చరిత్ర. పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడంతోనే ఆగిపోలేదు. పోటీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంగ్లిషు మీడియంతోపాటు సీబీఎస్ఇ సిలబస్‌ను కూడా ప్రవేశ పెట్టారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనని ప్రకటించిన జగన్మోహన్రెడ్డి ఆ ఆస్తి విలువను అనేక రెట్లు పెంచడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టారు. అప్పటికే కనాకష్టం మీద ప్రైవేట్ స్కూళ్లలో పిల్లల్ని చదివిస్తున్న తల్లులను నిరుత్సాహపరచకుండా ‘అమ్మ ఒడి’ పథకాన్ని వారికి కూడా వర్తింపజేశారు. ఇంగ్లిషు మీడియంలోకి పిల్లలు సులభంగా ప్రవేశించడానికి వీలుగా ఒకటి నుంచి పదో క్లాసు వరకు ద్విభాషా పాఠ్యపుస్తకాలను అందరికీ అందజేస్తున్నారు. ‘విద్యాకానుక’ కింద పాఠ్య పుస్తకాలతోపాటు మూడు జతల యూనిఫాం, నోట్‌బుక్కులు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, బూట్లు, బెల్టును కూడా స్కూళ్లు తెరిచే తొలిరోజు నాటికే ఉచితంగా అందజేస్తున్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజల మీది నుంచి పిల్లల చదువు భారాన్ని పూర్తిగా తొలగించి జగన్ ప్రభుత్వం తన భుజాలపైకి ఎత్తుకున్నది. ఇంగ్లిష్ మీడియంతోపాటు మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లలు ముందడుగు వేయడం కోసం డిజిటల్ బోధనా విధానాన్ని ప్రభుత్వ స్కూళ్లలో విస్తృతంగా ప్రవేశ పెట్టిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 8వ తరగతి నుంచి ఆపైన చదివే విద్యార్థులకు ట్యాబ్‌లను అందజేసింది. పాఠ్యాంశాల్లో తమ ప్రావీణ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడం కోసం ట్యాబ్‌ల ద్వారా ఖరీదైన ‘బైజూస్’ కంటెంట్‌ను అందు బాటులోకి తెచ్చింది. ఆరు నుంచి పదో క్లాస్ వరకు అన్ని తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది. ఒక్క ఉదాహరణ చాలు – చంద్రబాబు పరిపాలనా కాలంలో మొత్తం పాఠశాల విద్యార్థుల్లో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల సంఖ్య 50 శాతానికి పడిపోయింది. ఆ యాభై శాతం మంది కూడా మరో గత్యంతరం లేక మిగిలి పోయినవారే! నాలుగేళ్లలో అది 60 శాతానికి పెరిగింది. ‘అమ్మ ఒడి’ కూడా అందుతున్న నేపథ్యంలో పెద్దక్లాసు పిల్లలు మధ్యలో స్కూల్ మారడం ఇష్టంలేక ఉండిపోతున్నారు. లేకుంటే ఈ శాతం మరింత పెరిగేది. ఒకటి నుంచి ఎనిమిదో క్లాస్ వరకు లెక్కిస్తే చేరికలు చంద్రబాబు హయాంలో 75 శాతం గరిష్ఠంగా ఉండగా ఇప్పుడది 100 శాతాన్ని దాటింది. అంటే హౌస్‌ఫుల్, ఎక్స్ట్రా బెంచ్ అన్నమాట! జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనలు ఉన్నత విద్యారంగాన్ని ఉద్దీపనం చేశాయి. ఎంతగా అంటే జాతీయ స్థాయిలో ఉన్నత విద్యారంగం చేరికల్లో 3.8 శాతం పెరుగుదల ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో 14.81 శాతం నమోదైంది. ఇది చాలు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి! 2018–19లో క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా 37 వేలమందికి ఉద్యోగాలు లభిస్తే 2022–23లో ఒక లక్షా 20 వేలమందికి ఉద్యోగాలు లభించాయి. చేరికల్లోనూ, నియామ కాల్లోనూ నాలుగేళ్లలో నాలుగు రెట్లు ప్రగతి. ‘మేం బాలికలం, ఈ ప్రపంచాన్ని ఏలడానికి సిద్ధంగా ఉన్నామ’ని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగిన యువజన సదస్సులో ఏపీ బాలిక రాజేశ్వరి సభావేదిక మీది నుంచి ప్రకటించింది. ఈ ప్రకటన హాజరైన సభికులను ముగ్ధుల్ని చేసింది. రాజేశ్వరి ఏపీలోని నంద్యాల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థిని. ఆంగ్లభాషలో అనర్గళంగా, నిర్భయంగా అంతర్జాతీయ వేదికపై మాట్లాడటం చాలామంది గమనించి ఉండవచ్చు. మరో ఏపీ బాలిక షేక్ అమ్మజాన్ కూడా అంతే ధాటిగా మాట్లాడి ఆకట్టుకున్నది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నాలుగేళ్లలో ప్రారంభమైన విద్యా విప్లవం రాజేశ్వరి, అమ్మజాన్ వంటి వందలాదిమంది పేదింటి బిడ్డల్ని నాయ కత్వ శ్రేణుల్లో నిలబెట్టింది. ఆధిపత్య శక్తులు లేదా పెత్తందారీ వర్గాలు ఏరకమైన విప్లవాన్నీ సహించవు. విద్యావిప్లవాన్ని కూడా సహించలేదు. ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టినప్పుడే సాంస్కృతిక దాడికి పూనుకున్నారు. దీన్ని తెలుగు భాషపై జరుగుతున్న దాడిగా చిత్రించేందుకు చంద్రబాబు – యెల్లో మీడియా తెగ ప్రయాస పడ్డారు. తమ పిల్లల్ని ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తూ పేదల పిల్లల్ని మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలని శాసిస్తున్న పెత్తందారీ శక్తుల అంతరంగాన్ని జనం గమనించారు. ప్రభుత్వ బడుల్లో ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టే ప్రయత్నాలపై కూడా యెల్లో మీడియా అవాకులు చెవాకులు పేలడం తాజా ఉదాహరణ. ఇప్పుడు సర్వహంగులతో తీర్చిదిద్దిన ప్రభుత్వ స్కూళ్లపై పెత్తందారుల కన్ను పడింది. పొరపాటున అధికారంలోకి వస్తే ఈ స్కూళ్ల నిర్వహణను నారాయణ సంస్థలకు అప్పగించే ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నారు. అప్పుడిక నారా యణకు ఫీజులు చెల్లించి చదువుకోవలసిన దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడతాయి. అధికారంలో ఉన్నప్పుడే ప్రభుత్వ స్కూల్ భవనాలనూ, స్థలాలనూ నారాయణకు అప్పగించే ప్రయత్నం జరిగింది. మరోసారి చంద్రబాబు గెలిచి ఉంటే పేద పిల్లలకు చెట్టుకింది చదువులే మిగిలి ఉండేవి. ఈ పరిస్థితి ఒక్క విద్యారంగానికే పరిమితమైనది కాదు. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టుకున్న వైద్యం, వ్యవసాయ రంగాలపై కూడా పెత్తందారీ శక్తులు కన్నేస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు భిన్న ప్రయోజనాల పట్ల వైరుద్ధ్యంగా, ఆ వైరుద్ధ్యం పోరాటంగా రూపుదిద్దుకున్నాయి. పేదల సంక్షేమాన్ని గాలికొదిలేసి పెత్తందార్లను మేపే విధానం చంద్రబాబు పార్టీది. ఆయన పద్నాలుగేళ్ల పాలనలో అనేకమార్లు రుజువైన నగ్నసత్యమిది. పెత్తందారీ శక్తుల కరదీపికగా యెల్లో మీడియా పనిచేస్తున్నదని కూడా పలుమార్లు రుజువైంది. బలహీనవర్గాల నుంచి ఎదిగిన నాయకులపై హీనంగా, అవమానకరంగా బ్యానర్ వార్తలు వండి వార్చిన నేపథ్యం ఈ మీడియాది. కనుక పేద ప్రజలు, బలహీనవర్గాలు, మహిళల సాధికారత లక్ష్యంగా ప్రత్యామ్నాయ ఎజెండాను భుజాన వేసుకున్న జగన్మోహన్రెడ్డిని ఏమాత్రం సహించే స్థితిలో రాష్ట్రంలోని పెత్తందార్ల పార్టీ, వారి మీడియా లేదన్నది ఒక బహిరంగ రహస్యం. రాష్ట్ర రాజకీయ పోరాటాల అంతస్సారం ఇదే. పెత్తందారీ వర్గాలు, పేదల ప్రయోజనాలకు మధ్య వైరుద్ధ్యం, పోరాటం. ఈ సారాన్ని పేదలు, బలహీనవర్గాల ప్రజలు గ్రహించారు గనుకనే చంద్రబాబు కూటమికి భవిష్యత్తుపై బెంగ పట్టుకున్నది. అన్నిరకాల అవకాశవాద పొత్తుల కోసం అర్రులు చాస్తున్నది ఈ బెంగతోనే! ఈ నేపథ్యంలో వచ్చిన అవినీతి కేసును సానుభూతి కోసం ఉపయోగించుకు నేందుకు ఆ కూటమి పడరాని పాట్లు పడుతున్నది. కానీ, జనస్పందన శూన్యం. అవినీతిలో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయస్థానాలు కూడా భావించడంతో వారు ఆశించిన సానుభూతి రావడం లేదు. కనీసం తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యులు సైతం వీధుల్లోకి రాని దైన్యం ఆ పార్టీని వెన్నాడుతున్నది. కేవలం చంద్రబాబు సొంత సామాజికవర్గం యువతీ యువకుల్ని రెచ్చగొట్టడం ద్వారా అక్కడక్కడా ప్రదర్శనలు చేసి మమ అనిపిస్తున్నారు. నిజానికి యాభయ్యేళ్లకు పూర్వం వరకు ప్రగతిశీల భావాలతో పరుగుతీసిన సామాజిక వర్గమే అది. కానీ చంద్రబాబు బ్రాండ్ స్వార్థ సంకుచిత రాజకీయాలు, యెల్లో మీడియా పెద్దల అవసరాల కోసం జనజీవన స్రవంతి నుంచి ఆ పాయను వేరుచేసి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
సవాళ్లెన్ని ఎదురైనా..
సవాళ్లెన్ని ఎదురైనా.. మహిళా సాధికారతకు గొప్ప ప్రోత్సాహమిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఆమోదం పొందడంతో భారత ప్రజాస్వామిక చరిత్రలో నూతన శకానికి నాంది పలికినట్లు అయ్యింది. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లోని సీట్లలో మహిళలకు 33 శాతం కోటాను ఈ బిల్లు కేటాయించింది. ఇది అమల్లోకి రాగానే లోక్‌సభలో మహిళా ఎంపీల సంఖ్య 82 నుంచి 181కి పెరుగుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ చెప్పారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అనేక సంవత్సరాలుగా దేశంలో రాజకీయ చర్చకు కేంద్రంగా ఉంది. ఈ బిల్లును 1996లో ప్రవేశపెట్టినప్పటికీ, పలు రాజకీయ అవరోధాల కారణంగా ఇది ఆమోదం పొందలేదు. ఇప్పుడు పార్లమెంటులో మహిళలకు 15 శాతం లోపే ప్రాతినిధ్యం ఉంది. దేశ జనాభాలో దాదాపు సగంమంది మహిళలు ఉన్నప్పటికీ, వారి రాజకీయ భాగస్వామ్యం తగినంతగా లేదు. మహిళల గణనీయమైన భాగస్వామ్యంతో కూడిన పార్లమెంట్... భారత ప్రజల విభిన్న అవసరాలను, ఆందోళనలను మరింత మెరుగ్గా పరిష్కరించగలదు. పైగా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మహిళల రాజకీయ సాధికారత మరింతగా అవసరం అవుతోంది. ఈ రిజర్వేషన్ నిజానికి మహిళలకు సాధికారత కల్పించకపోవచ్చని వ్యతిరేకులు వాదిస్తున్నారు. పురుష రాజకీయ నాయకులు తమ మహిళా బంధువులను తమ తరఫున ఉపయోగించుకుంటారనేది ఒక వాదన. ప్రత్యేక నేపథ్యం ఉన్న మహిళలకు మాత్రమే ఇది ప్రయోజనం చేకూరుస్తూ సామాజిక అసమానతలను పెంచుతుందని విమర్శకులు వాదిస్తుంటారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా మరొక వాదన ఏమిటంటే, కోటాను అమలు చేయాలంటే చాలామంది పురుషులు తమ సీట్లను వదులుకోవలసి ఉంటుందనేది! ఇలాంటి సవాళ్లు ఉన్నప్పటికీ, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ ప్రయోజనాలు గణనీయంగా ఉన్నాయి. రాజకీయాల్లో ఉన్న మహిళలు విద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తారని ప్రపంచవ్యాప్తంగా పలు పరి శోధనలు చెబుతున్నాయి. పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం వల్ల ఈ సంక్లిష్టమైన రంగా లకు మరిన్ని వనరులను కేటాయించవచ్చు. పైగా, మహిళా రిజర్వేషన్ ఇతర రంగాలలో లింగ సమా నత్వానికి శక్తిమంతమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఇది సాంప్రదాయికమైన జెండర్ నిబంధనలను, మూస పద్ధతులను సవాలు చేయగలదు. పార్లమెంట్లో పెరిగే మహిళా ప్రాతినిధ్యం మరింత సమగ్రమైన, సమానమైన భారతదేశాన్ని వాగ్దానం చేస్తుంది. స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు గడిచిన తర్వాత కూడా, రాజకీయాల్లో సమాన లింగ ప్రాతినిధ్యాన్ని భారతదేశం సాధించలేకపోయింది. పార్లమెంట్లో అత్యధిక మహిళా ప్రాతినిధ్యం ఉన్న టాప్ 20 దేశాల్లో చాలా వరకు మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు ఉన్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. పార్లమెంటులో మహిళలకు ప్రాతినిధ్యం లేకుండా సమానత్వంతో, న్యాయంతో సామాజిక అభివృద్ధిని సాధించలేము; అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లు ఈనాటి అవసరం. రాజకీయ, ప్రజా జీవితంలో వివక్షను, ప్రత్యేకించి మహిళల పట్ల వివక్షను తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 7 ప్రభుత్వాలను నిర్దేశిస్తున్నది. మహిళలపై అన్ని రకాల వివక్షా నిర్మూలనకు సంబంధించిన కన్వెన్షన్‌పై భారతదేశం సంతకం చేసింది. ప్రభుత్వ విధానానికి, దాని అమలుకు సహకరించడంలో మహిళలకు ‘పాల్గొనే హక్కు’ ఉన్నందున, అన్ని ప్రభుత్వ సంస్థలకు ఎన్నికల్లో పోటీ చేయడానికి పురుషుల వలెనే వారు అర్హులు. ఈ నిబద్ధతను గౌరవించాల్సిన సమయం ఇది. పార్లమెంటులో ఏ సమస్యలను లేవనెత్తుతారు, విధానాలను ఎలా రూపొందిస్తారు అనే అంశంపై పార్లమెంట్లో మహిళల విస్తృత ప్రాతినిధ్యం అపారమైన ప్రభావాన్ని చూపుతుంది. పైగా ఇది మహిళలపై వివక్షాపూరిత చట్టాలను సంస్కరించడానికీ, సవరించడానికీ, ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికీ తగిన స్పేస్‌ని సృష్టిస్తుంది. ఈ అన్ని ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంట్ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం హర్షణీయం. ప్రేమ్ చౌధరీ వ్యాసకర్త రచయిత్రి, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ విద్యావేత్త -
ఇది ఓ చారిత్రక ఘట్టం
మహిళా సాధికారతను నిజం చేసే బిల్లు ఎట్టకేలకు పార్లమెంట్ ఆమోదం పొందింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లు దాదాపు మూడు దశాబ్దాలుగా ఆమోదానికి నోచుకోకుండా పడి ఉంది. ఇప్పుడు అది చట్టం కానుండడంతో అన్ని వర్గాలూ సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ బిల్లులో రిజర్వేషన్ అమలు మొదలయ్యే సమయం గురించి స్పష్టత లేకపోవడం, రాజ్యసభ, రాష్ట్రాల కౌన్సిళ్లలో రిజర్వేషన్ల సంగతిని ప్రస్తావించకపోవడం గమనించదగ్గవి. ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఎట్టకేలకు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఉభయ సభల ఆమోదం లభించింది. దేశాద్యంతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అపురూపమైన ఘట్టమిది. దురదృష్టవశాత్తూ స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం ఇప్పటికీ చాలా తక్కువగానే ఉంది. పంచాయితీలు, స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జరిగిన 73, 74వ రాజ్యాంగ సవరణల పుణ్యమా అని పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. అదే సమయంలో చట్టసభల్లోనూ ఈ రిజర్వేషన్లకు డిమాండ్ కూడా మరింత జోరందుకుంది. 1996 నుంచి పలు ప్రభుత్వాలు మహిళల రిజర్వేషన్ల కోసం పలు రకాల బిల్లులు ప్రవేశ పెట్టాయి కానీ.. రాజకీయంగా ఏకాభిప్రాయాన్ని సాధించి బిల్లును కాస్తా చట్టంగా మార్చడంలో మాత్రం అన్నీ విఫలమయ్యాయి. 2008లో యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టి రెండేళ్ల తరువాత ఆమోద ముద్ర వేయించుకుంది. అది కూడా 186 –1 తేడాతో బిల్లును చట్టంగా మార్చడంలో యూపీఏ దాదాపుగా విజయం సాధించింది కానీ.. పార్లమెంటరీ పద్ధతులను అనుసరించి బిల్లును లోక్‌సభకు పంపడంతో పరిస్థితి మారిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నవారితోపాటు యూపీఏ భాగస్వామ్య పక్షాల్లో కొన్ని కూడా దీన్ని వ్యతిరేకించాయి. దీంతో 2014లో లోక్‌సభ అవధి ముగిసిపోవడంతో ఈ బిల్లు కథ కూడా అటకెక్కింది. ఈ దేశంలో చట్టాలను తయారు చేసే సంస్థల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలన్న ఆశలు ఇప్పటివరకూ ఆరుసార్లు నిరాశలయ్యాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం పార్లమెంట్లో పూర్తిస్థాయి మెజారిటీ కలిగి ఉంది. రాజ్యసభ, లోక్‌సభ గండాలు రెండింటినీ అధిగమించిన నేప థ్యంలో ఇప్పుడు 27 ఏళ్ల కల సాకారమైనట్లుగా భావించాలి. దీంతో మోదీ ప్రభుత్వం చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. నిజానికి తాజా బిల్లు 2008 నాటి బిల్లు తాలూకూ సూక్ష్మ రూపమని చెప్పాలి. లోక్‌సభతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలు, ఢిల్లీ అసెంబ్లీలోనూ మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం ఉండాలని చెబుతుంది ఇది. ఇప్పుడున్న ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ కోటాలోనూ 33 శాతం మహిళలకు ఉండేలా చూస్తుంది కూడా! రొటేషన్ పద్ధతిలో సీట్లు కేటాయిస్తారు. పదిహేనేళ్ల తరువాత రిజర్వేషన్లు రద్దవుతాయి. 2023 బిల్లును రెండు అంశాల్లో మాత్రం విమర్శించక తప్పదు. మొదటిది అమలు మొద లయ్యే సమయం గురించి స్పష్టత లేకపోవడం! ‘‘నియోజకవర్గాల పునర్విభజన తంతును చేపట్టిన తరువాత, జనాభా లెక్కల ద్వారా తగిన సమాచారం సేకరించిన తరువాత, 128వ రాజ్యాంగ సవరణ ప్రచురించిన తరువాత’’ అని బిల్లు పేర్కొంటోంది. వచ్చే ఎన్నికల నుంచే ఈ రిజర్వేషన్లు అమలై ఉంటే బాగుండేది. రెండో లోపం.. రాజ్యసభ, రాష్ట్రాల కౌన్సిళ్లలో మహిళలకు రిజర్వేషన్ల సంగతిని ఈ బిల్లూ ప్రస్తావించకపోవడం! ప్రస్తుత పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం లోక్‌సభ కంటే రాజ్యసభలోనే తక్కువగా ఉంది. మహిళల ప్రాతినిధ్యం అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలోనూ ఉండటం ఆదర్శప్రాయమైన విషయం. ఈ లోటును సరిదిద్దడం ఎలా అన్నది పార్లమెంటేరియన్లు ఆలోచించాలి. 128వ రాజ్యాంగ సవరణ బిల్లులోని సానుకూల అంశాలను చాలామంది తక్కువ చేసి చూస్తున్నారు. పురుషులు మహిళా ప్రతినిధులకు ప్రాక్సీలుగా వ్యవహరిస్తారని అంటున్నారు. ఇది ఒకరకంగా లింగ వివక్షతో కూడిన అంచనా అని చెప్పాలి. మహిళ సామర్థ్యాన్ని శంకించేది కూడా. చట్టాన్ని దుర్విని యోగపరిచేందుకు కొందరు చేసే ప్రయత్నం మిగిలిన వారి హక్కులను నిరాకరించేందుకు ప్రాతిపదిక కాజాలదు. చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం ఈ దేశ మహిళలు సుమారు 27 ఏళ్ల సుదీర్ఘకాలం వేచి చూడాల్సివచ్చింది. ఉభయ సభల పరీక్షను దాటుకున్న ఈ బిల్లులో లోటుపాట్లు లేకపోలేదు కానీ... సంపూర్ణమైన చట్టం కోసం ఇంకో రెండు దశాబ్దాలు వేచి ఉండటం కూడా అసాధ్యం. ఇప్పటి ప్రభుత్వం తీసుకున్న చొరవను అభినందిద్దాం. అయితే రాజకీయాల్లో మహిళ, పురుషులిద్దరూ సమాన స్థాయికి చేరేందుకు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఆంజెలికా అరిబమ్ -వ్యాసకర్త ఫెమ్మే ఫస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు -
సంపన్న రాజ్యాల కపటత్వం
‘పర్యావరణ పరిరక్షణ విషయంలో నిర్లిప్తంగా ఉండటం ద్వారా మానవాళి నరకానికి ద్వారాలు తెరుస్తోంది సుమా...’ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరించిన మర్నాడే 2015 ప్యారిస్ వాతావరణ శిఖరాగ్ర సదస్సుకు పూచీపడిన లక్ష్యాలను నీరుగారుస్తూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నిర్ణయాలు తీసుకున్నారు. సహజంగానే పర్యావరణ ఉద్యమకారులను ఈ ప్రకటన దిగ్భ్రాంతిపరిచింది. గతంలో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక గత ప్రభుత్వ నిర్ణయాలను తాము ఆమోదించబోమని ప్యారిస్ ఒడంబడిక నుంచి వైదొలగారు. తిరిగి జో బైడెన్ వచ్చాకే అమెరికా పాత విధానానికి మళ్లింది. సునాక్ అంత మాట అనకపోయినా ఆయన తాజా చర్యలు మాత్రం అలానే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాన్ని 2030 నుంచి నిలిపేస్తామని ప్యారిస్ శిఖరాగ్ర సదస్సులో బ్రిటన్ వాగ్దానం చేయగా, దీన్ని ఆయన మరో అయిదేళ్లు పొడిగించారు. అలాగే 2035 నాటికి కొత్త గ్యాస్ బాయిలర్ల ఏర్పాటును ఆపేస్తామన్న వాగ్దానాన్ని కూడా పక్కన బెట్టారు. 2050 నాటికల్లా కర్బన ఉద్గారాలను సంపూర్ణంగా తొలగించటమే లక్ష్యమని చెబుతూనే ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలను వాయిదా వేయటం సంపన్న రాజ్యాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. హరిత లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకుంటే ఉపాధి దెబ్బతింటుందని, జనాగ్రహం వెల్లువెత్తుతుందని ఆయన చెబుతున్న మాటలు కేవలం సాకు మాత్రమే. కర్బన ఉద్గారాలకు కారణమయ్యే పరిశ్రమలు మూతబడినా, హరిత ఇంధనంతో పనిచేసే పరిశ్రమల్లో ఉపాధి లభిస్తుంది. భిన్నరూపాల్లో సబ్సిడీలు, ఆర్థిక సాయం అందిస్తే ప్రజలకు అంత కష్టం అనిపించదు. అందుకు భిన్నంగా ఆ లక్ష్యాల నుంచే తప్పుకోవటం అన్యాయం. వచ్చే ఎన్నికల్లో మధ్యతరగతి మద్దతు కోసం వారికి నొప్పి కలిగించే నిర్ణయాలు తీసుకోరాదని సునాక్ భావిస్తున్నారు. ఇందుకు పర్యావరణం బలయ్యే ప్రమాదం ఉన్నా ఆయనకు పట్టడం లేదు. అసలు సంపన్న రాజ్యాల తీరుతెన్నులను ఐక్యరాజ్యసమితి సదస్సే పట్టిచూపింది. ఆ సదస్సుకు 34 దేశాల ప్రతినిధులు హాజరుకావాల్సివుండగా ప్రధాన కాలుష్యకారక దేశాలైన అమెరికా, చైనా లతో సహా ఎవరూ రాలేదు. నిజానికి బ్రిటన్ ప్రధాని హోదాలో పాల్గొనే అవకాశం తొలిసారి వచ్చినందున రిషి సునాక్ తప్పక హాజరవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన గైర్హాజరు కావటమే కాదు... పర్యావరణానికి ముప్పు తెచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సదస్సులో పాల్గొనే ప్రతినిధులు లక్ష్యసాధన దిశగా తీసుకున్న చర్యలేమిటో, వైఫల్యాలుంటే కారణాలేమిటో చెప్పాలని సమితి అన్ని దేశాలనూ కోరింది. సరైన చర్యలు తీసుకుంటున్న దేశాలు ఇతర దేశాలకు స్ఫూర్తిదాయ కంగా నిలుస్తాయన్నది ఐక్యరాజ్యసమితి ఉద్దేశం. కానీ హోంవర్క్ చేయని పిల్లలు ఆ మర్నాడు బడి ఎగ్గొట్టినట్టు పర్యావరణ హిత నిర్ణయాల అమలులో అలసత్వం ప్రదర్శిస్తున్న దేశాలన్నీ ఈ సదస్సుకు గైర్హాజరయ్యాయి. చిత్తశుద్ధి ఉంటే స్వచ్ఛమైన గాలి, నిరపాయకరమైన ఇంధనం అందు బాటులోకి రావటం పెద్ద కష్టం కాదని...ఈ రంగాల్లో ఉపాధి కల్పన అవకాశాలు కూడా పెరుగు తాయని గుటెరస్ చెబుతున్న మాట అరణ్యరోదనే అయింది. 2030 నాటికి బొగ్గు వినియోగం నుంచి ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) దేశాలు పూర్తిగా వైదొలగితే, మరో పదేళ్లకు ఇతర దేశాలు దాన్ని సాధించగలుగుతాయని పారిస్ సదస్సు నిర్దేశించింది. కానీ సంపన్న రాజ్యాలు సభ్యులుగా ఉన్న ఓఈసీడీలో ఏ ఒక్క దేశమూ ఆ దిశగా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. సరి గదా కెనడా, అమెరికా, బ్రిటన్ తదితర సంపన్న దేశాలు మూతబడిన పాత ఫ్యాక్టరీలను సైతం తెరుస్తూ బొగ్గు వినియోగాన్ని మరింత పెంచాయి. ఈ ఏడాది జూన్–ఆగస్టు మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్నిచోట్లా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పారిశ్రామికీకరణకు ముందున్న వాతావరణంతో పోలిస్తే కనీసం 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరగటం ఎంతో దూరంలో లేదని పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్పిన మాట అక్షరసత్యమని ఈ పరిణామం వెల్లడిస్తోంది. గుటెరస్ చేస్తున్న హెచ్చరిక మరింత గుబులు పుట్టిస్తుంది. మరో 2.8 డిగ్రీల సెల్సి యస్ ఉష్ణోగ్రత పెరిగే క్రమంలో ఉన్నామని ఆయన ప్రకటించారు. ప్యారిస్ ఒడంబడిక కుదిరిన సమ యంలో ప్రపంచ దేశాలన్నీ 2020నాటికే ఇంతకు మూడింతల క్రియాశీల కార్యాచరణకు పూనుకోవా లని సదస్సు నిర్దేశించింది. అలాగైతే తప్ప లక్ష్యసాధనను చేరుకోలేమని చెప్పింది. కానీ మరో నాలుగేళ్లకే సంపన్న రాజ్యాల నిర్వాకం బయటపడింది. 2019లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో దాదాపు 60 దేశాలు తాము పూచీపడిన లక్ష్యాలకు మించి కర్బన ఉద్గారాలను తగ్గించు కున్నామని ప్రకటించగా...అందులో అత్యధిక దేశాలు చిన్నవే, తక్కువస్థాయి కాలుష్య కారక దేశాలే. మరి సంపన్న దేశాలు ఏం చేసినట్టు? ఇచ్చిన వాగ్దానాలను గాలికొదిలేసి, పర్యావరణానికి తూట్లు పొడిచాయి. ఈ విషయంలో కాస్తయినా సిగ్గుపడటం మానేశాయి. వాతావరణ సదస్సుకు ముందురోజే జరిగిన సమితి సర్వసభ్య సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భూగోళాన్ని వడగాడ్పులు చుట్టుముట్టడం, అడవులు తగలబడటం, కరువుకాటకాలు, వరదలు వగైరాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. శిలాజ ఇంధనాల వాడకం ఆపకపోతే ఈ ముప్పు మరింత పెరుగుతుందని హెచ్చరించారు. కానీ గత అయిదేళ్లలో సాధించిందేమిటో చెప్పాలి గనక ఆ మర్నాడు జరిగిన సదస్సుకు మాత్రం గైర్హాజరయ్యారు. ఇలాంటి ధోరణులు సరి కాదు. ఇప్పటికైనా సంపన్న రాజ్యాల తీరు మారాలి. భూగోళం ఉనికికి ముప్పు తెచ్చే చర్యలకు స్వస్తి పలకాలి. ఇది కూడా చదవండి: నారీలోకానికి నీరాజనం! -
నారీలోకానికి నీరాజనం!
చిరకాలంగా మహిళాలోకం ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు గురువారం రాజ్యసభ ఆమోదం కూడా పొందటంతో పార్లమెంటు ఆమోదముద్ర లభించినట్టయింది. నూతన పార్లమెంటు భవనం ప్రారంభమయ్యాక జరిగిన ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఇదే కావటం, దీన్ని దాదాపు అన్ని పక్షాలూ ఏకగ్రీవంగా ఆమోదించటం ఒక అరుదైన సన్నివేశం. మహిళా కోటాకు లోక్‌సభలో బుధవారం 454 మంది అనుకూలంగా ఓటేయగా, కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు. రాజ్యసభలో హాజరైన మొత్తం సభ్యులు బిల్లుకు ఆమోదం తెలిపారు. ఇందుకు ఎన్డీఏ ప్రభుత్వాన్ని అభినందించితీరాలి. దశాబ్దాలుగా నేతల ఎన్నికల ప్రచార సభల్లో... చానెళ్ల చర్చల్లో మాత్రమే వినబడుతూ చట్టసభల్లో మాత్రం కనబడని బిల్లుకు ప్రాణప్రతిష్ట చేసి, పట్టాలెక్కించి అన్ని పార్టీలనూ అంగీకరింపజేయటం చిన్న విషయమేమీ కాదు. అయితే జనాభా లెక్కల సేకరణ, దాని ఆధారంగా జరిపే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చాకే కోటా అమలవుతుందనటం నిరాశ కలిగించే అంశం. ఏతావాతా 2029 తర్వాత మాత్రమే ఇది ఆచ రణలోకొస్తుంది. అంటే... మరో ఆరేళ్ల వరకూ దీనికి మోక్షం కలగదు! విస్తట్లో అన్ని పదార్థాలూ వడ్డించి, తినడానికి ఇంకా ముహూర్తం ఆసన్నం కాలేదని చెప్పినట్టయింది. స్వాతంత్య్రం సిద్ధించి 76 సంవత్సరాలు గడిచాక మాత్రమే మహిళా కోటా సాకారం కాగా, దాని అమలుకు మరింత సమయం పడుతుందనటం ఏమాత్రం భావ్యంకాదు. ఈ బిల్లు ఆమోదంలో కొట్టొచ్చినట్టు కనిపించే అంశం మరొకటుంది. ఇరవైయ్యేడేళ్ల క్రితం తొలిసారి లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడే ఓబీసీ వర్గాల వాటా నిర్ధారించాలని బలహీనవర్గాలు పట్టుబట్టాయి. చట్టసభలో మాత్రమే కాదు... వెలుపల సైతం అనేక ప్రజాసంఘాలు ‘కోటాలో కోటా’ గురించి డిమాండు చేస్తూనే ఉన్నాయి. దాదాపు మూడు దశాబ్దాలు గడిచాక కూడా ఆ విషయం తేల్చకుండానే బిల్లు ఆమోదం పొందటం మనం ఆచరిస్తున్న విలువలను పట్టి చూపుతుంది. బిల్లుపై అన్ని పార్టీలనూ ఒప్పించిన అధికార పక్షానికి ‘కోటాలో కోటా’ గురించి నిర్దిష్టంగా తేల్చటం అంత కష్టమైన పనేమీ కాదు. ఎందుకనో ఆ పని చేయలేదు. మహిళా కోటా బిల్లుకు తామే ఆద్యులమని, యూపీఏ ప్రభుత్వ కాలంలో 2010లో దీన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందామని కాంగ్రెస్ నేత సోనియాగాంధీ చెబుతున్నారు. కానీ ఆ బిల్లుకూ, ఇప్పుడు ఆమోదం పొందిన బిల్లుకూ సంబంధం లేదు. అసలు మహిళా కోటా బిల్లుకు అంతకన్నా పూర్వ చరిత్ర చాలా ఉంది. తొలిసారి 1996లో అప్పటి ప్రధాని హెచ్డీ దేవెగౌడ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టగా, ఆ మరుసటి ఏడాది వచ్చిన ఐకె గుజ్రాల్ సర్కారు సైతం బిల్లు దుమ్ము దులిపింది. అప్పుడే ఓబీసీ కోటా సంగతేమిటన్న చర్చ మొదలైంది. వాజపేయి హయాంలోని ఎన్డీఏ ప్రభుత్వం వరసగా 1998, 1999, 2002, 2003 సంవత్సరాల్లో మహిళా కోటా బిల్లును గట్టెక్కించాలని ప్రయత్నించింది. కానీ ఓబీసీ కోటా విషయంలో దుమారం రేగి ఆగిపోయింది. 2008లో యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా ఒక ప్రయత్నం జరిగింది. 2010 మార్చి 9న రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. కానీ లోక్‌సభలో ఎస్పీ, బీఎస్పీ తదితర పక్షాలు ‘కోటాలో కోటా’ కోరుతూ అడ్డుకున్నాయి. ఇప్పుడు ఓబీసీ కోటా తేల్చాలని చెబుతున్న కాంగ్రెస్ నేతలు తమ హయాంలో ఆ పని ఎందుకు చేయలేకపోయారో సంజాయిషీ ఇవ్వాలి. మరోపక్క కోటా చట్టంగా రూపుదిద్దుకున్న నాటినుంచి కేవలం పదిహేనేళ్లు మాత్రమే ఉంటుంది. ఆ లెక్కన 2029 వరకూ అమలే సాధ్యం కాని చట్టం మరో తొమ్మిదేళ్లపాటే అమల్లో ఉంటుంది. ఆ తర్వాత పొడిగింపు సంగతి ఏమవుతుందన్నది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది. ఈ పరిమితి ఏవిధంగా చూసినా సబబుగా లేదు. అతి పెద్ద ప్రజాస్వామిక దేశంలో మహిళలకు 33 శాతం కోటా ఇవ్వటంలో జాప్యం జరగటం సమర్థించుకోలేనిది. లింగ వివక్ష, అసమానతలు, వేధింపులు అన్ని స్థాయిల్లోనూ ఉన్న సమాజంలో మహిళలను విధాన నిర్ణయాల్లో భాగస్వాములను చేయటం, వారి ప్రాతినిధ్యం పెంచటం ఎంతో అవసరం. అందువల్ల సమాజ నిర్మాణంలో తామూ భాగస్వాములమని, తమ ఆలోచనలకూ విలు వుంటున్నదని స్త్రీలు గుర్తిస్తే అది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మరింతమంది మహిళలు రాజకీయాల్లోకి రావడానికి వీలవుతుంది. సమాజంలో మహిళలపట్ల ఉన్న ఆలోచనా ధోరణి మారు తుంది. దీన్ని అవగాహన చేసుకోవటానికీ, ఆచరించటానికీ ఇంత సుదీర్ఘ సమయం పట్టడం విచార కరం. మనకన్నా ఎంతో చిన్న దేశాలూ, బాగా వెనక బడిన దేశాలూ సైతం మహిళలకు చట్టసభల్లో పెద్ద పీట వేసిన వైనం గమనిస్తే మహిళల విషయంలో మనం ఎంత వెనకబాటుతనాన్ని ప్రదర్శిస్తు న్నామో అర్థమవుతుంది. రువాండా పార్లమెంటులో మహిళలు 61 శాతం ఉంటే... క్యూబా(53), నిగ రాగువా(52), మెక్సికో, న్యూజిలాండ్ చట్ట సభల్లో 50 శాతం మహిళలుండి మన సమాజం తీరు తెన్నుల్ని ప్రశ్నిస్తున్నారు. ఆఖరికి దశాబ్దం క్రితం ప్రజాతంత్ర రిపబ్లిక్‌గా ఆవిర్భవించిన నేపాల్‌లో సైతం పార్లమెంటులో 33 శాతం మహిళలున్నారు. అమలుకు ఇంకా సమయం పడుతుందంటు న్నారు గనుక ఈలోగా పార్లమెంటు చర్చలో వ్యక్తమైన అభిప్రాయాలకు అనుగుణంగా ఓబీసీ కోటా సంగతి తేల్చటం, చట్టం అమలుకు విధించిన పరిమితిని ఎత్తివేయటం అత్యంత కీలకమని కేంద్రం గుర్తించాలి. ఎన్నెన్నో అవాంతరాలను అధిగమించి సాకారం కాబోతున్న ఈ చట్టం భవిష్యత్తులో సమాజం మరింత పురోగతి సాధించటానికి నాంది కాగలదని ఆశించాలి. -
కెనడా వక్రబుద్ధి
దశాబ్దాలుగా సక్రమంగా లేని భారత్–కెనడా దౌత్య సంబంధాల్లో మరోసారి పెను తుపాను రేగింది. ఎప్పటిలాగే ఈసారి కూడా కెనడా ప్రవర్తనే ఈ పొరపొచ్చాలకు కారణమైంది. ఖలిస్తానీ ఉద్యమకారుడు హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను మొన్న జూన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన ఉదంతంలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంటులో ఆరోపించారు. అంతేకాక ఈ విషయంలో భారత హైకమిషన్‌లో పనిచేస్తున్న ఒక అధికారిని ఆ దేశం బహిష్కరించింది. దీనికి ప్రతిచర్యగా మన దేశం కూడా ఢిల్లీలోని కెనడా హైకమిషన్‌లో పనిచేస్తున్న సీనియర్ దౌత్యవేత్తను దేశం విడిచివెళ్లాలని ఆదేశించింది. ట్రూడో ఆరోపణలు దురుద్దేశపూర్వకం, నిరాధారం అని కొట్టిపారేసింది. పనిలో పనిగా ఇరు దేశాలూ తమ తమ పౌరు లకు హెచ్చరికలు జారీ చేశాయి. భారత్ వెళ్లే కెనడా పౌరులు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం సూచిస్తే, కెనడా సందర్శించే భారత్ పౌరులపై ఉగ్రవాదుల దాడులు జరిగే ప్రమాదం ఉన్నదని మన దేశం హెచ్చరించింది. దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించుకోవటం వంటి ఉదంతాలు మనకు పాకిస్తాన్, చైనాలతోనే ఎక్కువ. 2013లో అమెరికాలోని న్యూయార్క్‌లో భారత్ డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా పనిచేస్తున్న దేవయాని ఖోబ్రగడే పట్ల అనుచితంగా ప్రవర్తించి సంకెళ్లు వేసి నిర్బంధించిన ఉదంతం తర్వాత మన దేశం అమెరికా దౌత్యవేత్తలకు అంతవరకూ ఉండే ప్రత్యేక సదుపాయాలను ఉపసంహరించింది. గత కొంతకాలంగా కెనడాలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ప్రోద్బలంతో ఖలిస్తానీ ఉద్యమకారులు రెచ్చిపోతున్నారు. ఇదిలా కొనసాగితే ఇరు దేశాల దౌత్యసంబంధాలూ దెబ్బతినే ప్రమాదం ఉన్నదని దౌత్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఒక్క కెనడాయే కాదు... బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో కూడా ఖలిస్తానీ ఉద్యమకారుల పోకడలు ఆందోళనకరంగానే ఉంటున్నాయి. భారత కార్యాలయాలపై, దేవాలయాలపై దాడులు, మన పౌరులను గాయపరచటం వంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. హింసాత్మక ఘటనలకు కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని మన దేశం కోరుతున్నా అక్కడి ప్రభుత్వాల స్పందన అంతంతమాత్రం. ఉద్యమకారులపై చర్యలు తీసు కోవటం మాట అటుంచి ఏకంగా మన ప్రభుత్వంపైనే కెనడా నిందారోపణలకు దిగింది. పాశ్చాత్య దేశాలు తమకు ముప్పు ముంచుకొచ్చినప్పుడు తప్ప ఇతర సమయాల్లో ప్రజాస్వామ్యం గురించి ప్రవచిస్తుంటాయి. 2001లో ఉగ్రవాదులు తమ దేశంలో పెనువిధ్వంసం సృష్టించి, వందలాది మంది మరణానికి కారకులయ్యాక అమెరికా గ్వాంటనామో బేలో శత్రు దుర్భేద్యమైన జైలు నిర్మించి కేవలం ఉగ్రవాదులన్న అనుమానంతో దశాబ్దాల తరబడి ఎందరినో ఏకాంతవాసంలో నిర్బంధించింది. ఇప్పటికీ ఆ జైల్లో ఎలాంటి విచారణ లేకుండా ఎందరో మగ్గిపోతున్నారు. అలాంటి దేశాలు భారత్‌కు సూక్తులు చెబుతున్నాయి. నిఘా వ్యవస్థల మధ్య సమాచారం ఇచ్చి పుచ్చుకొనేందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌లు గతంలోనే ‘ఫైవ్ అయిస్’ (పంచ నేత్రాలు) పేరిట ఒక ఉమ్మడి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఖలిస్తానీ ఉద్యమకారుల ఆగడాల గురించి ఈ వ్యవస్థ వద్ద ఎలాంటి సమాచారం ఉందో తెలియదుగానీ... తాజాగా కెనడా చేసిన ఆరోపణలపై మాత్రం అందులోని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలు ‘ఆందోళన’ వ్యక్తం చేశాయి. ఈమధ్యే న్యూఢిల్లీలో జీ–20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయినప్పుడు నిజ్జార్ ఉదంతాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చానని ట్రూడో అంటున్నారు. మోదీ సైతం ఖలిస్తానీ వాదుల ఆగడాలపై ఆయనను ప్రశ్నించారు. నిజ్జార్ కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. ఈలోగానే ట్రూడో అంత బాధ్యతారహితంగా ఎలా మాట్లాడారన్నది ఆశ్చర్యకరం. మొదటినుంచీ కెనడా అంతర్గత రాజకీయాలు భారత్–కెనడా సంబంధాలను శాసిస్తున్నాయి. కెనడాలో భారతీయుల సంఖ్య దాదాపు 14 లక్షలు. ఇది కెనడా జనాభాలో 3.7 శాతం. అందులో సగం మంది సిక్కులు. కొన్ని నియోజకవర్గాల్లో సిక్కు ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటం, వారిపై ఖలిస్తానీ ఉద్యమ ప్రభావం ఉండటం కెనడా రాజకీయాల్లో వారి ప్రాబల్యాన్ని పెంచింది. అందుకే కావొచ్చు...పంజాబ్‌లో 90వ దశకంలోనే అంతరించిన ఖలిస్తానీ ఉద్యమం ఇంకా అక్కడ సజీవంగా మనుగడలో ఉంది. 2021 ఎన్నికల్లో ట్రూడో నాయకత్వంలోని లిబరల్ పార్టీ మెజారిటీ సాధించలేక సిక్కు నేత జగ్మీత్సింగ్ నేతృత్వంలోని న్యూ డెమాక్రటిక్ పార్టీ(ఎన్డీపీ) మద్దతు తీసుకోవాల్సి వచ్చింది. అప్పటినుంచీ ఖలిస్తాన్ ఉద్యమకారుల విషయంలో కెనడా మరింత మెతకగా ఉంటోంది. కొత్తగా అమెరికా కనుసన్నల్లో ఏర్పాటైన ఇండో–పసిఫిక్ కూటమి తర్వాత భారత్‌తో భాగస్వామ్యం కోసం కెనడా తహతహలాడటం మొదలుపెట్టినా, ఖలిస్తానీ వాదులు ఆ ప్రయత్నాలను వమ్ము చేసేందుకు ఏదో ఒక ఎత్తుగడ వేస్తున్నారు. ఇప్పుడు హత్యకు గురైన నిజ్జార్ వివాదరహితుడేమీ కాదు. 2007లో పంజాబ్‌లోని ఒక సినిమా హాల్లో బాంబు దాడి మొదలుకొని ఇంతవరకూ 20 కేసుల్లో నిందితుడు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్. ఇతగాడే కాదు...అనేకమంది మాఫియా ముఠాల నేతలు కెనడాలో ఆశ్రయం తీసుకుంటూ భారత్‌లో నేరాలకు దిగుతున్నారు. వీరిని అప్పగించమని మన దేశం కోరుతున్నా కెనడా పెడచెవిన పెడుతోంది. కెనడా తీరుతెన్నులపై మన దేశం దౌత్య యుద్ధం సాగించాలి. జరుగుతున్నదేమిటో ప్రపంచ దేశాలకు వివరించాలి. కెనడాలో చదువులకూ, ఉపాధికీ వెళ్లిన మన పౌరుల ప్రయోజనాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. -
Parliament : సరికొత్త సంకల్పంతో...
ఎన్నో కీలక ఘట్టాలకు వేదికైన పాత పార్లమెంటు భవనం చరిత్ర ముగిసి, కొత్త పార్లమెంటు భవనం అందుబాటులోకొచ్చింది. అయిదురోజులపాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సోమవారం పాత భవనంలోనే ప్రారంభమైనా, రెండోరోజు కొత్త భవనంలోకి మారాయి. ఇకపై పాత భవనం సంవిధాన్ భవన్‌గా పేరు మార్చుకుని భవిష్యత్తు తరాలకు ఉత్తేజాన్నందిస్తూంటుందని మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయనన్నట్టు దేశ ప్రజాతంత్ర యాత్రలో సామాన్య పౌరుల సంపూర్ణ విశ్వాసాన్ని చూరగొన్న చరిత్ర పార్లమెంటుది. ఇక్కడే వేలాది చట్టాలపై ఎడతెగని చర్చలు జరిగాయి. ఎన్నో కీలక నిర్ణయాలు రూపుదిద్దుకున్నాయి. ఈ క్రమంలో రాజకీయ పక్షాల మధ్య వాగ్యుద్ధాలు చోటుచేసుకున్నాయి. రాజీలేని ధోరణిలో వాద ప్రతివాదాలు సాగాయి. ఎన్నెన్నో భావోద్వేగాలకు అది వేదికైంది. అదే సమయంలో కీలక సందర్భాల్లో బలమైన స్వరాన్ని వినిపించలేని దాని అశక్తత నిరంకుశ చట్టాలకు కూడా కారణమైంది. అది మౌనం వహించటంవల్ల పాలకపక్షం ఆత్యయిక స్థితి పేరిట దేశ ప్రజల గొంతు నొక్కటానికి అవకాశం ఏర్పడింది. తొలినాళ్లలో ఆరోగ్యకరమైన చర్చలకు చోటిచ్చిన సభే రాను రాను ఉత్త ఉపన్యాస వేదికగా, అప్పుడప్పుడు బలప్రదర్శన రంగస్థలిగా మారుతోంది. దేశ ప్రజాస్వామ్య నిర్మాణంలో తమకూ భాగస్వామ్యం ఉన్నదని... తమ ఆశలూ, ఆకాంక్షలూ వ్యక్తమవుతున్నాయని సామాన్యులు భావించటానికి వీల్లేని స్థితిగతులు నెలకొంటున్నాయి. ఏ విధాన నిర్ణయంలోని మంచిచెడ్డలనైనా ఆరోగ్యకరమైన చర్చల ద్వారా నిగ్గుతేల్చాల్సి వుండగా చాలా నిర్ణయాలు అరుపులూ, కేకల మధ్య మూజువాణి ఓటుతో గట్టెక్కుతున్నాయి. అంతకన్నా దారుణం లక్షల కోట్ల రూపాయలు వ్యయం కాగల ఆర్థిక పద్దులు సైతం గిలెటిన్ అవుతున్నాయి. అవతలి పక్షాన్ని అవహేళన చేయటం, స్వోత్కర్షలకు పోవటం నిత్యకృత్యమైంది. ఇవన్నీ గమనిస్తే నూతన పార్లమెంటు భవనం సరికొత్త ఆశలకూ, విశ్వాసాలకూ అద్దం పడుతుందా అన్నది సందేహాస్పదమే. అది సాధ్యమేనని ప్రధాని తన ప్రసంగంలో బలంగా చెప్పారు. కానీ అధికార, విపక్షాల మధ్య అంతటి సామరస్యత ఏర్పడుతుందా? మన పార్లమెంటు నడతను నిర్దేశిస్తున్న నిబంధనలు సంతృప్తికరంగా లేకపోవటం కూడా సమస్యలకు దారితీస్తోంది. దేన్ని చర్చించాలి...ఏ రూపంలో చర్చించాలన్న అంశాలు తరచు వివాదాస్పదమవుతున్నాయి. సభాధ్యక్షులకుండే విచక్షణాయుత అధికారాలు ఇందుకు దోహదపడుతున్నాయి. గడిచిన కాలాన్ని బేరీజు వేసుకోకుండా, జరిగిన తప్పొప్పులను నిజాయితీగా సమీక్షించుకోకుండా సరికొత్త ప్రయాణం సులభం కాదు. అధికార, విపక్షాల మధ్య విభేదాలుండటం, అవి ఒక్కో సారి తీవ్ర రూపం దాల్చటం అసాధారణమేమీ కాదు. కానీ సమష్టిగా ఉండటానికి ముందుకు రావలసిన తరుణంలో సైతం పాక్షిక దృక్పథంతో వ్యవహరించే ధోరణి ప్రబలుతోంది. ఎదురు పడినప్పుడు మర్యాదపూర్వకంగా పలకరించుకునే సంస్కృతి కూడా ఆవిరవుతోంది. ఇవన్నీ పార్ల మెంటుపై దేశ ప్రజలకుండే విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. మొన్నటికి మొన్న దేశం మొత్తం సిగ్గుతో తలవంచుకోవాల్సిన మణిపుర్ అకృత్యాలపై చర్చ సందర్భంగా అధికార, విపక్షాలు రెండూ వ్యవహరించిన తీరు దిగ్భ్రాంతి కలిగించింది. దీన్ని తప్పించుకునే ధోరణిగా చూడాలా లేక ప్రజల మనోభావాలను అవగాహన చేసుకోవటంలోని అశక్తతగా పరిగణించాలా? సమాజంలో భిన్న వర్గాలున్నప్పుడూ, వాటికి భిన్న ప్రయోజనాలున్నప్పుడూ పార్లమెంటులో అవి ప్రతిబింబించటం వింతేమీ కాదు. నిజానికి అలాంటి వైరుధ్యాలకు సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనటమే ప్రజాతంత్ర సంస్థల లక్ష్యం. కానీ బలం ఉంది కదా అని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటం, వాటి మంచిచెడ్డల విశ్లేషణకు అవకాశమీయకుండా అసమ్మతికి పాతరేయటం ఇటీవలి కాలంలో రివాజైంది. పార్లమెంటు సజావుగా సాగటానికి, అక్కడ ఆరోగ్యవంతమైన చర్చలు జరగటానికి ప్రస్తుత పాలక్ష పక్ష కూటమికి నేతృత్వం వహిస్తున్న పార్టీగా బీజేపీపై ఎక్కువ బాధ్యత ఉంటుంది. అధికార పక్షంనుంచి అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు దాన్ని స్వాగతించి తమ వంతుగా సకారాత్మక దృక్పథాన్ని ప్రదర్శించటం విపక్షాల వంతు. స్వరూపం, సదుపాయాల కోణంలో మాత్రమేకాదు...స్వభావరీత్యా వర్తమాన ప్రగాఢ ఆకాంక్ష లకు కూడా నూతన పార్లమెంటు భవనం అద్దం పడుతుందన్న గ్రహింపు ఏర్పడినప్పుడు ఇరు పక్షాలూ విజ్ఞతతో మెలుగుతాయి. ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయంటే, ఒక బిల్లు విషయంలో, ఒక విధాన నిర్ణయం విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయంటే దాన్ని కేవలం రాజకీయకోణంలో కాక, ప్రజానీకంలో ఏర్పడిన అభిప్రాయానికి ప్రతిబింబంగా చూడగలిగితే చాలా సమస్యలకు పరిష్కారాలు సాధ్యమవుతాయి. ప్రస్తుత పార్లమెంటు భవనం లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చొనటానికి అనువుగా ఉంది. సెంట్రల్ హాల్ లేకున్నా, ఉభయసభల ఉమ్మడి సమావేశాల సమయంలో 1,272 మంది కూర్చొనేందుకు లోక్‌సభలో అవకాశం ఉంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం స్థానాలు కల్పించే బిల్లు రాజ్యసభలో మంగళవారం ప్రవేశించటం శుభపరిణామం. బిల్లు ఆమోదం పొంది చట్టమైనా నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఇది అమల్లోకి వస్తుందనటం కొంత నిరాశ కలిగిస్తుంది. ఏదేమైనా కొత్త సభా భవనం సరికొత్త ఆచర ణకు, సమున్నత సంప్రదాయాలకు వేదిక కాగలదని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. దాన్ని నెరవేర్చ వలసిన బాధ్యత శాసనకర్తలదే. -
ప్రకృత్యైనమః
గుర్తించాలే కానీ దేవుడు అనేక రూపాల్లో ఉంటాడు. వాటిలో కనిపించనివే కాదు, కనిపించేవీ ఉంటాయి. ఎక్కడో ఉన్నాడనుకునే దేవుడు... మన చేతికందే దూరంలో ఒక మొక్కలోనూ, కొమ్మలోనూ, ఆ కొమ్మకు పూసిన పువ్వులోనూ కూడా ఉన్నాడని గ్రహించడమే లౌకిక, పారలౌకిక సమన్వయంతో కూడిన ఆధ్యాత్మిక ప్రస్థానంలో తొలి ఎరుక. దైవం మానుషరూపేణ అంటారు. అలాగే, దైవం ప్రకృతి రూపేణ కూడా! రామకృష్ణ పరమహంస ఓసారి ఆకాశంలో రెక్కలు విప్పుకుంటూ ఎగిరే పక్షిని చూసి సమాధిలోకి వెళ్లిపోయారట. చెట్టును, పిట్టను, పువ్వును, పసిపాప నవ్వును, పారే ఏటినీ, ఎగిరే తేటినీ చూసి తన్మయులైతే చాలు; ఆ రోజుకి మీ పూజ అయిపోయిందని ఒక మహనీయుడు సెలవిస్తాడు. షడ్రసోపేతంగా వండిన తన వంటకాలను తృప్తిగా ఆరగిస్తే ఇల్లాలు ఎంత ఆనందిస్తుందో, తన వ్యక్తరూపమైన ప్రకృతిని చూసి పరవశిస్తే దేవుడు అంతే ఆనందిస్తాడని ఆయన అంటాడు. నది ఒడ్డున నిలబడి దాని పుట్టుకను, గమనాన్ని, పోను పోను అది చెందే వైశాల్యాన్ని, అది ప్రవహించిన పొడవునా దానితో అల్లుకున్న మన జీవనబంధాన్ని స్మరించుకున్నా అది పుణ్య స్నానంతో సమానమేనని ఒక కథకుడు రాస్తాడు. కృష్ణశాస్త్రి గారు పల్లవించినట్టు అడుగడుగునా, అందరిలోనే కాదు; ప్రకృతిలో అన్నింటిలోనూ గుడి ఉంది. అనాది నుంచీ నేటివరకూ మనిషి ఊహలో, భావనలో మనిషీ, దేవుడూ, ప్రకృతీ పడుగూ పేకల్లా అల్లుకునే వ్యక్తమయ్యారు. ఋగ్వేద కవి చూపులో ప్రకృతి పట్ల వలపు, మెరుపు ఎంతో ముగ్ధంగా, సరళంగా, సహజసుందరంగా జాలువారుతాయి. ‘‘వెలుగులు విరజిమ్మే ఓ ఆకాశపుత్రీ, సకల సంపదలకూ నెలవైన ఉషాదేవీ! వస్తూ వస్తూ మాకు ధనరూపంలోని ఉషస్సును వెంట బెట్టుకుని రా’’ అని ఒక ఋక్కు అంటుంది. ఋగ్వేద కవి చింతనలో అగ్ని ధూమధ్వజుడు; సూర్యకాంతితో తళతళా మెరుస్తూ ధ్వనిచేసే సముద్రపు అలల్లా వ్యాపిస్తాడు. ‘‘తమసానదీ జలాలు మంచివాడి మనసులా స్వచ్ఛంగా ఉన్నా’’యని వాల్మీకి వర్ణిస్తాడు. సుగ్రీవుడితో అగ్ని సాక్షిగా స్నేహం చేసిన రాముడు, ‘‘వర్షాకాలంలో మంచి పొలంలో వేసిన పంట ఫలించినట్టు నీకార్యాన్ని సఫలం చేస్తా’’నంటాడు. ఆ మాటలకు సుగ్రీవుడు, ‘‘నదీవేగంలా హఠాత్తుగా ఉరవడించిన కన్నీటివేగాన్ని ధైర్యంతో నిలవరించుకున్నా’’డని రామాయణ కవి అంటాడు. ఏ కాలంలోనూ మనిషీ, ఋషీ, కవీ ప్రకృతి పొత్తిళ్లలో పసివాడిగానే ఉన్నాడు తప్ప ప్రకృతికి దూరం కాలేదు. ఇతిహాస కావ్య ప్రబంధాలలో ప్రకృతి వర్ణనలు తప్పనిసరి భాగాలు. శారద రాత్రుల్లో ఉజ్వల తారకలు, కొత్త కలువ గంధాన్ని మోసుకొచ్చే సమీరాలూ, కర్పూరపు పొడిలా చంద్రుడు వెదజల్లే వెన్నెల వెలుగులూ, చెంగలువ కేదారాలూ, మావులూ క్రోవులూ పెనవేసుకున్న అడవులూ, పక్షులు బారులు కట్టి ఇంటిముఖం పట్టే సూర్యాస్తమయ దృశ్యాలూ, తలను రెక్కల్లో పొదవుకుని పంటకాలువల దగ్గర నిద్రించే బాతువుల సన్నివేశాలూ... ఇలా కవి ఊహల రస్తాకెక్కని ప్రకృతి విశేషం ఏదీ ఉండదు. పత్రం పుష్పం ఫలం తోయం రూపంలో ప్రకృతి భాగం కాని పూజా ఉండదు. వినాయకుని పూజలో ఉపయోగించే మాచీ,బృహతి, బిల్వం, ధత్తూరం, బదరి, తులసి, మామిడి, కరవీరం, దేవదారు, మరువకం లాంటి ఇరవయ్యొక్క పత్రాల పేర్లే చెవులకు హాయిగొలిపి ఆకుపచ్చని చలవపందిరి వేసి మనసును సేదదీర్చుతాయి. అమ్మవారి స్తుతుల నిండా పూవులూ, వనాలూ పరచుకుంటాయి. చంపకాలు, సౌగంధికాలు, అశోకాలు, పున్నాగాలతో అమ్మ ప్రకాశించిపోతుంది. కదంబ పూలగుత్తిని చెవికి అలంకరించుకుంటుంది. చాంపేయ, పాటలీ కుసుమాలు తనకు మరింత ప్రియమైనవి. శిరసున చంద్రకళను ధరిస్తుంది. ప్రకృతి వెంటే పర్యావరణమూ గుర్తురావలసిందే. పర్యావరణ స్పృహ ఇప్పుడే మేలుకొంద నుకుంటాం కానీ, ప్రకృతిలో భాగంగా మనిషి పుడుతూనే పెంచుకున్న స్పృహ అది. రావణ సంహారం తర్వాత రాముడు అయోధ్యకు వెడుతూ, వానరులు ఎక్కడుంటే అక్కడ చెట్లు సమృద్ధిగా ఉండాలనీ; అవి అన్ని కాలాల్లోనూ విరగ కాయాలనీ; నదుల్లో నీరు నిత్యం ప్రవహిస్తూ ఉండాలనీ ఇంద్రుని వరం కోరాడు. పాండవులు ద్వైతవనంలో ఉన్నప్పుడు ఆ అడవిలోని చిన్న జంతువులు ధర్మరాజుకు కలలో కనిపించి, ‘‘మీరు రోజూ మమ్మల్ని వేటాడి చంపడంవల్ల మా సంఖ్య తగ్గిపోయింది, బీజప్రాయంగా మిగిలాం, మేము పూర్తిగా నశించేలోగా దయచేసి మరో చోటికి వెళ్లం’’డని ప్రార్థించాయి. విశ్వనాథవారు తన ‘వేయిపడగలు’ నవలలో పర్యావరణానికి ప్రతీకగా పసరిక అనే పాత్రనే సృష్టించారు. ఆధునిక వేషభాషల వ్యామోహంలో పడీ, జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసే వ్యవసాయ పద్ధతుల వల్ల పర్యావరణ విధ్వంసం ఏ స్థాయిన జరుగుతోందో ఆ పాత్ర ద్వారా గంట కొట్టి చెప్పారు. పూర్వకాలపు రాజులు అడవిని, అటవీ జనాన్ని, సంపదను పర్యావరణ భద్రతకు తోడ్పడే స్వతంత్ర అస్తిత్వాలుగా చూశారు తప్ప, తమ రాజ్యంలో భాగం అనుకోలేదు. ఇప్పుడా వివేచన అంతరించి అడవులు రాజ్యానికి పొడిగింపుగా మారి బహుముఖ ధ్వంసరచనకు లక్ష్యాలయ్యాయి. ప్రకృతికి పండుగకు ఉన్న ముడి తెగిపోయి ప్రతి పండుగా పర్యావరణంపై పిడికిటిపోటుగా మారడం చూస్తున్నాం. ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుందన్న సంగతిని గుర్తు చేసుకోడానికి నేటి వినాయకచవితి కన్నా గొప్ప సందర్భం ఏముంటుంది! -
కళాత్మక చౌర్యం
చతుష్షష్టి కళల్లో హస్తలాఘవం కూడా ఒకటి. దానర్థం దొంగతనమేనని మృచ్ఛకటికం నాటకంలోని శర్విలకుడు అనే దొంగ అభిప్రాయం. కనుక చాకచక్యంగా, కళాత్మకంగా చేసే దొంగతనాన్ని చోరకళగా భావించాలని వాదిస్తాడు. ఓ తెలుగు సినిమాలోని బ్రహ్మానందం పాత్ర కూడా ఇటువంటి అభిప్రా యాన్నే వ్యక్తం చేస్తుంది. జైలు గదిలో తనతోపాటున్న బ్రహ్మాజీని ఏం చేశావని బ్రహ్మానందం అడుగుతాడు. ఫోర్జరీ అంటాడు బ్రహ్మాజీ. ‘ఫోర్జరీ అంటే ఆర్ట్... ఆర్టిస్టులను కూడా అరెస్ట్ చేస్తారా?’ అంటూ వాపోతాడు బ్రహ్మానందం. ఇప్పుడు తెలుగు దేశం, దాని మిత్రపక్షాలవారు, యెల్లో మీడియా బాస్‌లు కూడా ఇదేవిధంగా వాపోతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ పేరు మీద చంద్రబాబు ప్రమేయంతో జరిగిన ఒక స్కామ్‌పై సీఐడీ దర్యాప్తు చేస్తున్నది. 371 కోట్ల రూపాయల ప్రజాధనానికి సంబంధించిన ఈ స్కామ్‌లో 241 కోట్ల రూపాయలు వివిధ మార్గాల ద్వారా చంద్రబాబుకు చేరిన వైనాన్ని సీఐడీ నిర్ధారించింది. ఈనెల తొమ్మిదో తేదీ ఉదయం 6 గంటలకు ఆయనను నంద్యాలలో అరెస్టు చేసింది. ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తున్నారో తెలియజేసే ఫామ్‌పై (ఇంటిమేషన్ ఆఫ్ అరెస్ట్) ఆయన సంతకాన్ని తీసు కున్న దృశ్యం టీవీల్లో కనిపించింది. కానీ తనకు కారణం చెప్ప కుండా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టడానికి హెలికాప్టర్లో తీసుకెళ్తామని పోలీసులు చెప్పారు. అందుకు ఆయన నిరాకరించారు. అరెస్టు చేసిన ఇరవై నాలుగ్గంటల్లోగా కోర్టు ముందు ప్రవేశపెట్టవలసి ఉన్నందువల్ల, ఈలోగా సీఐడీ వారు ప్రశ్నించే సమయం ఇవ్వకూడదన్న వ్యూహంతో ఆయన వ్యవహరించి నట్టు కనిపించింది. అందుకే హెలికాప్టర్లో కాకుండా తన వాహనంలోనే వస్తానని భీష్మించుకున్నారు. పోలీసులు ఆయన మాటను గౌరవించారు. మొదట అరెస్టవడానికి ఆయన సమ్మ తించలేదు. మొండికేసే ప్రయత్నం చేశారు. కానీ, తప్పక పోవడంతో తన వాహనంలోకి ఎక్కి కూర్చున్నారు. రోడ్డు మార్గాన నెమ్మదిగా వెళ్తుంటే తన అరెస్ట్ వార్త దావానలంగా వ్యాపించకపోతుందా, వేలాదిమంది తెలుగుదేశం కార్యకర్తలు దండయాత్రకు రాకపోతారా? జనాన్ని చూసి జడుసుకొని అల్లూరి సీతారామరాజును విడిచిపెట్టి వెళ్లినట్టు పోలీసులు తనను కూడా వదిలేసి తోకముడవకపోతారా అనే రవ్వంత ఆశ కూడా ఏ మూలో ఉండవచ్చు. మార్గమధ్యంలో దండయాత్రలూ, దండుయాత్రలూ ఎదురు కాలేదు కానీ, ఆయన కోరుకున్నట్టుగానే బాగా ఆలస్యమైంది. సీఐడీ అధికారుల ప్రశ్నలకు సహాయ నిరా కరణలో కొంత సమయాన్ని, విశ్రాంతి పేరుతో కొంత సమ యాన్ని బాబు కరిగించారని సమాచారం. బాబు విజయవాడకు చేరుకోకముందే ఢిల్లీ నుంచి ఖరీదైన లాయర్ల బృందం చేరుకున్నది. కోర్టులో హోరాహోరీగా వాదప్రతివాదాలు జరిగాయి. పది గంటలపాటు జడ్జి ఈ వాదనల్ని విన్నారు. ఇరువైపుల నుంచీ పలు సందర్భాల్లో సందేహాలను నివృత్తి చేసుకున్నారు. చివరకు ప్రభుత్వ న్యాయవాది వాదన, రిమాండ్ రిపోర్ట్ అంశాలతో ఏకీభవించి చంద్రబాబును రిమాండ్‌కు పంపారు. హై ప్రొఫైల్ వ్యక్తికి సంబంధించిన కేసు కాబట్టేమో, సుదీర్ఘ సమయం వాదోపవాదాలు జరిగినా సరే జడ్జి ఓపిగ్గా విన్నారు. తీర్పు వెలువడిన మరుక్షణం నుంచే తెలుగుదేశం – యెల్లో కూటమి, దాని సోషల్ మీడియా బృందాలు వాటి వికృత స్వరూపాన్ని బయటపెట్టుకున్నాయి. జడ్జి మీద వ్యక్తిగతంగా దాడుల్ని ఎక్కుపెట్టారు. ఎక్కడి నుంచి వెతికి పట్టుకున్నారో తెలియదు, అది నిజమో కాదో కూడా తెలియదు గానీ, జడ్జిగారిది బీసీ సామాజికవర్గంగా తేల్చేశారు. ఇంకేముంది... యెల్లో కూటమి పెత్తందారీ దురహంకారం బుసలు కొట్టింది. ‘బీసీలు జడ్జీలుగా పనికిరారు, వారిని నియమించకండి’ అంటూ కేంద్ర న్యాయశాఖకు లేఖలు రాసిన చరిత్ర చంద్రబాబుది. ఇప్పుడాయన అనుచర గణాలు ఆయన ఆదర్శాన్ని అందిపుచ్చుకొని విశృంఖలంగా చెలరేగి పోతున్నాయి. తీర్పు చెప్పే న్యాయమూర్తుల్లో, ప్రాణం పోసే డాక్టర్లలో, శాంతిభద్రతలు కాపాడే పోలీసుల్లో కూడా కులం నీడల్ని వెతికిపట్టుకునే దౌర్భాగ్యపు పెత్తందారీ దురహంకార సంప్రదాయాన్ని చంద్రబాబు కూటమి పెంచి పోషిస్తున్నది. పొరపాటున అవతలివారు బీసీలో, ఎస్సీలో, ఎస్టీలో, మైనా రిటీలో అని తేలితే వారి ప్రతిష్ఠ మీద రెచ్చిపోయి దాడులు చేస్తున్నారు. అందుకే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పేదలకు, పెత్తందార్లకు మధ్యన జరుగుతున్న పోరాటం కేవలం రాజకీయ పరమైనది మాత్రమే కాదు... అది సామాజిక, సాంస్కృతిక విలువల పోరాటం కూడా! ఇప్పుడు చంద్రబాబును జైల్లో పెట్టించిన స్కిల్ కేసు వివరాలను మరోసారి క్లుప్తంగా పరిశీలిద్దాం. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వృద్ధి చేయడం అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ)ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. తన అనుచరులను తీసుకొచ్చి సంస్థ పగ్గాలను అందించారు. ఈ సంస్థకూ, డిజైన్ టెక్ అనే ప్రైవేట్ సంస్థకూ, జర్మనీకి చెందిన సీమెన్స్ సంస్థకూ మధ్యన ఒక త్రైపాక్షిక ఒప్పందం కుదిరిందని వెల్లడిస్తూ మరో జీవోను విడుదల చేశారు. ఈ జీవోలో పేర్కొన్న ప్రకారం సీమెన్స్ సంస్థ ఆంధ్ర ప్రదేశ్‌లో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు సహకరిస్తుంది. ఇందుకోసం ఏర్పాటు చేసే శిక్షణ కేంద్రాలకు అవసరమైన సాఫ్ట్వేర్, హార్డ్వేర్ల కొనుగోలు కోసం 3,300 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో 90 శాతాన్ని సీమెన్స్ సంస్థ గ్రాంట్– ఇన్–ఎయిడ్‌గా (ఉచిత సహాయం) సమకూరుస్తుంది. ప్రభుత్వం తరఫున 10 శాతం కింద 330 కోట్లను సమ కూర్చాలి. జీఎస్టీ చెల్లింపులతో కలిపి అది 371 కోట్లు అవుతుంది. ఈమేరకు కుదిరిన ఒప్పంద పత్రంలో మాత్రం గ్రాంట్–ఇన్–ఎయిడ్ ప్రస్తావన గానీ, కుదిరిన తేదీగానీ ఏమీ లేవు. ప్రభుత్వ వాటాగా 371 కోట్లను తక్షణం డిజైన్‌టెక్ సంస్థకు విడుదల చేయాలని పైనుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. సీమెన్స్ వాటా విడుదల కాకుండానే పది శాతాన్ని ఏకమొత్తంగా విడు దల చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆర్థికశాఖ అధికారులు నోటు ఫైళ్లపై కామెంట్లు రాసినా ఖాతరు చేయలేదు. పదేపదే పైనుంచి ఒత్తిడి పెరగడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విడుదల చేస్తున్నట్టు ఆర్థిక శాఖ కార్యదర్శులు నోటుఫైళ్లపై రాసి సంతకాలు చేశారు. ఆ తర్వాత డిజైన్‌టెక్ సంస్థకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డబ్బులు వెళ్ళాయి. అసలీ డిజైన్ టెక్ సంస్థ పాత్ర ఏమిటి? నేరుగా ఏపీఎస్ఎస్డీసీనే సీమెన్స్ సంస్థతో వ్యవహారం నడపవచ్చు గదా! 371 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నప్పుడు టెండర్లను పిలవకుండా ఉండడానికి సీమెన్స్ ఉచిత సాయం కథ ముందుకు తెచ్చారు. ఉచిత సాయం 90 శాతం కింద సాంకేతిక సహకారాన్ని అందిస్తారని మధ్యలో కథ మార్చారు. ఈ డిజైన్‌టెక్ అనే సంస్థది బ్రోకరేజీ పాత్ర. ఈ సంస్థకు చేరిన 371 కోట్లలో 59 కోట్లు వెచ్చించి సీమెన్స్ కంపెనీ నుంచి ఏపీఎస్ఎస్డీసీకి అవసరమైన పరికరాలను, సాఫ్ట్‌వేర్‌ను తెప్పించారు. ఈ కొనుగోలు జస్ట్ షాపింగ్ లాంటిదే. ఎవరైనా కొనుక్కో వచ్చు. ఒప్పందాలతో పనిలేదు. స్కిల్ సెంటర్ల కోసం మొత్తంగా చేసిన ఖర్చు ఇదే. దీనికే 3,300 కోట్ల బిల్డప్ ఇచ్చారు. టెండర్ల గోల లేకుండా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కథను అల్లుకొచ్చారు. డిజైన్ టెక్ సంస్థ మిగిలిన సొమ్ములో 241 కోట్లను పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి తరలించింది. ఇది పుణె కంపెనీ. ఈ కంపెనీ నుంచి ఆ సొమ్ము ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌లోని షెల్ కంపెనీల ద్వారా దుబాయ్, సింగపూర్‌లోని కంపెనీకి తరలివెళ్లింది. వాటి వివరా లను కూడా సీఐడీ తన రిపోర్టులో పొందుపర్చింది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా మొత్తం ప్రాజెక్టు వ్యయా నికి సరిపోయేలా నకిలీ ఇన్వాయిస్లను కూడా ఈ పుణె కంపెనీ సమీకరించుకున్నది. దీనికి బ్రోకరేజీ ఫీజు వసూలు చేసి ఉండ వచ్చు. ఇదిగో ఈ షెల్ కంపెనీల మీద జీఎస్టీ అధికారులు జరిపిన తనిఖీల్లో నకిలీ ఇన్వాయిస్ల భాగోతం బయటపడింది. అప్పటికింకా రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. జీఎస్టీ అధికారులు ఈ నకిలీ వ్యవహారాలను రాష్ట్ర ఏసీబీకి ఉప్పందించారు. ఏసీబీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. సూత్రధారి తానే కనుక ఆయన మౌనం వహించారు. ఏసీబీకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. మౌనంగా నోట్ ఫైళ్లతో సహా సంబంధిత డాక్యుమెంట్లను కాల్చేయాలని ఆదేశించారు. తదనంతరం రంగంలోకి దిగిన ఈడీ ఈ మనీల్యాండరింగ్ వ్యవహారాన్ని మొత్తం నిర్ధారించింది. సీమెన్స్ కంపెనీకి ఇండియా విభాగం చీఫ్‌గా ఉన్న సుమన్ బోస్‌తో సహా డిజైన్‌టెక్ ఎంపీ వికాస్ కన్వీల్కర్, మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఈ సుమన్ బోస్ అసలు పేరు సౌమ్యాద్రి బోస్గానూ, డిజైన్‌టెక్ ద్వారా ఏపీతో కుదుర్చుకున్న ఒప్పందంలో సుమన్ బోస్‌గా సంతకం చేసినట్టుగానూ ఈడీ గుర్తించింది. దొంగ సంతకం దొంగ స్కీమ్‌కు రుజువు కదా! ఆంధ్ర ప్రదేశ్ సీఐడీ విభాగం ఈ కేసులో దర్యాప్తు చేయడానికి పూర్వమే కేంద్ర జీఎస్టీ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ ఈ స్కామ్‌ను పసిగట్టాయి. ఆ కారణంగా సీమెన్స్ ఇండియా ఎండీ సుమన్ బోస్ ఉద్యోగం కూడా ఊడింది. ఈ కేసు మొత్తంలో అన్నిటికంటే ప్రధానమైన అంశం – సీమెన్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ)కి 2022, ఫిబ్రవరి మూడో తేదీ నాడు రాసిన లేఖ! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తాము ఎటువంటి ఒప్పందం చేసుకోలేదనీ, అసలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కీమ్ తమ దగ్గర ఏమీ లేదని ఆ లేఖలో కంపెనీ స్పష్టం చేసింది. కంపెనీ స్వయంగా ఇటువంటి స్కీమ్ లేదని చెబుతుంటే మన చినబాబు, పెదబాబు, యెల్లో మీడియా మాత్రం ఉందని దబాయిస్తున్నారు. శుక్రవారం నాడు ఢిల్లీలో ఒక జాతీయ మీడియా చానల్లో కూర్చొని లోకేశ్ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ఉత్తర కుమారుడు యుద్ధానికి బయల్దేరితే జనించినంత ఆసక్తి చినబాబు మీడియా డిబేట్లపై జనించింది. కష్టంగా కొన్ని విషయాలు చెప్పాడాయన. అన్నీ టెక్నికల్ విష యాలే! గుజరాత్లో సీమెన్స్ కంపెనీ ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కీమ్‌ను అమలు చేసిందనీ, దాన్ని పరిశీలించాకనే తాము ఒప్పందం చేసుకున్నామనీ లోకేశ్ చెప్పాడు. గుజరాత్లో జరిగిన ఒప్పంద పత్రంపై సౌమ్యాద్రి బోస్ అని సంతకం చేసిన వ్యక్తి ఏపీ ఒప్పందంపై సుమన్ బోస్ అని చేశాడు. అక్రమ పథకానికి అక్రమ సంతకం, సక్రమ పథకానికి సక్రమ సంతకం అన్న మాట. చివరకు అతను కంపెనీ నుంచి వెళ్లిపోయాడు. మామూలుగా తాను ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని బెదరగొట్టే విధంగా విరుచుకుపడే ఆర్ణబ్ గోస్వామి చినబాబు విషయంలో కొంత మెతక వైఖరి ప్రదర్శించాడు. మొదటి ఒకటి రెండు ప్రశ్నలు కొంచెం గట్టిగా అడగ్గానే లోకేశ్ కంగారుపడ్డట్టు కనిపించాడు. దాంతో ఆర్ణబ్ కొంచెం నెమ్మదించాడు. ‘లవకుశ’ సినిమాలో ‘ముక్కుపచ్చారని మునికుమారుల చంపకూడదని నే గొంకుచుంటి’ అనే పద్యాన్ని చదువుతున్నప్పుడు ఎన్టీ రామారావు ముఖంలో కనిపించిన ఎక్స్ప్రెషన్స్ గోస్వామిలో కనిపించాయి. ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ తప్పు చేస్తే చైర్మన్ ఎలా బాధ్యుడవుతాడు అని లోకేశ్ ఎదురు ప్రశ్న వేశాడు. అంటే మేనేజర్ స్థాయిలో తప్పు జరిగినట్టు అంగీకరిస్తున్నారా అనే సరికి చినబాబు ఖంగుతిన్నారు. స్కామ్ జరిగితే ఆ డబ్బు ఎక్కడికి చేరిందో సీఐడీ నిరూపించాలి కదా, అలా నిరూపించ లేదని ఆయన ఆఖరి బాణం వదిలారు. నిరూపించకపోవడమేమిటీ? సీఐడీ నిక్షేపంగా నిరూపిస్తు న్నది. ఈడీ కూడా నిర్ధారిస్తున్నది. షెల్ కంపెనీల ద్వారా సింగ పూర్, దుబాయ్‌లకు డబ్బు చేరిన తర్వాత కథలోకి యోగేశ్ గుప్తా ఎంట్రీ ఇస్తాడు. ఆయన హవాలా మార్గంలో దేశానికి తరలించి, మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందజేస్తారు. పార్థసాని హైదరాబాద్‌లో పెండ్యాల శ్రీనివాస్‌కు (చంద్రబాబు పీఏ) అందజేస్తారు. శ్రీనివాస్ ద్వారా ప్యాలెస్ డెన్‌కు ఆ డబ్బు చేరుతుంది. సరిగ్గా ఇవే పేర్లు, ఇదే మోడస్ ఆపరెండీని మనం ఐటీ శాఖ వెలుగులోకి తెచ్చిన స్కామ్‌లో కూడా చూశాము. అమరావతిలోని తాత్కాలిక సచివాలయం భవనం కాంట్రాక్టు ఇచ్చినందుకు గాను పల్లోంజీ సంస్థ చెల్లించిన 118 కోట్ల ముడుపులను (600 కోట్ల పనికి) ఇదే పద్ధతిలో తరలించినట్టు ఐటీ శాఖ కనిపెట్టింది. స్కిల్ స్కామ్‌లో విచారణ కోసం పై ముగ్గురికీ నోటీసులివ్వగానే వారు అందుబాటులో లేకుండా మాయమయ్యారు. యోగేశ్ గుప్తా కనిపించడం లేదు. మనోజ్ పార్థసాని దుబాయ్‌కీ, పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకూ ఉడాయించారు. స్కామ్ డబ్బులు ఎక్కడికి వెళ్లాయో తెలుసు కోవాలన్న ఆసక్తి నిజంగానే లోకేశ్‌బాబుకు ఉంటే ఆ ముగ్గుర్నీ పిలిపించి సీఐడీకి అప్పగిస్తే సరిపోతుంది. గడచిన మూడు దశాబ్దాలుగా ఎవరికీ దొరక్కుండా కళాత్మకంగా నెగ్గుకొస్తున్న ‘స్కామింగ్‘లో ఇప్పుడు తడబడట మేమిటని యెల్లో కూటమి విస్తుపోతున్నది. ఈ కేసులో అరెస్ట యిన దగ్గర్నుంచీ ఈ శిబిరం నుంచి సాంకేతిక అభ్యంతరాలే తప్ప దొంగతనం జరిగిందా లేదా అనే అసలు విషయం జోలికి వెళ్లడం లేదు. మచ్చుకు కొన్ని చూద్దాం. ఎఫ్ఐఆర్లో తన పేరు లేదు గనుక స్కామ్‌తో తనకు సంబంధం లేదని బాబు వాదిస్తున్నారు. ఇదో వితండవాదం. నేరం జరిగినట్టు ఫిర్యాదు అందగానే అనుమానితుల పేర్లతో వేసేది ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్ఐఆర్). దర్యాప్తు క్రమంలో అసలు నేరస్తుడు బయట పడొచ్చు. ఎఫ్ఐఆర్లో పేరు లేదు గనుక అసలు నేరస్తుడిని వదిలేస్తారా?.. నవ్విపోతారు. ఈ వ్యవహారంలో తన పాత్ర లేదనీ, ఎవరినీ ప్రభావితం చేయలేదనీ ఆయన చెప్పుకొస్తున్నారు. కానీ అడుగడుగునా ఈ వ్యవహారంలో ఆయన పాత్రను సీఐడీ దర్యాప్తు నిగ్గుదేల్చింది. ఎపీఎస్ఎస్డీసీని ఏర్పాటు చేయడం దగ్గర్నుంచి, నిబంధనలకు విరుద్ధంగా తన మనుషుల్ని దానిలో జొప్పించడం వరకు ఆయనదే ప్రధాన భూమిక. హడావిడిగా ప్రభుత్వ వాటాను వెంటపడి విడుదల చేయించిందే నాటి ముఖ్యమంత్రి. ఇందు కోసం సంబంధిత ఫైళ్లలో 13 చోట్ల ఆయన సంతకాలు చేసిన విషయాన్ని సీఐడీ రుజువు చేసింది. విద్యాశాఖతో సంబంధం లేకుండా నిధుల విడుదలకు ప్రత్యేక గ్రీన్‌ఛానల్‌ను కూడా ఆయన ఏర్పాటు చేశారు. అప్పుడు ఆర్థిక శాఖ కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఉన్నది. ఇవన్నీ ఎవరు చెబితే చేశారు? అవినీతి నిరోధక చట్టం 17ఏ ప్రకారం గవర్నర్ ఆమోదం లేకుండా తనను అరెస్టు చేయడం కుదరదనీ, తన మీద ఐపీసీ 409 సెక్షన్‌పై కేసు బనాయించడం చెల్లదనీ వాదిస్తున్నారు. అంతే తప్ప స్కామ్ జరగలేదని వాదించడం లేదు. ఈ రెండు అంశా లపై ఏసీబీ కోర్టులో విస్తృతంగా వాదప్రతివాదాలు జరిగాయి. గౌరవ న్యాయస్థానం ఒక నిర్ణయం తీసుకున్నది. ఆయనలో వణుకు మొదలైందని సమాచారం. ఈ స్కామ్తోనే కేసులు ఆగవని, మరో అరడజన్ కేసుల్లో తాను ఇరుక్కోవడం ఖాయ మని భావిస్తున్నారట! చట్టానికి దొరక్కుండా కొల్లగొట్టే తన కౌశలం ఎందుకిలా కొడిగట్టిందో అర్థంకావడం లేదు. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్‌తో సహా బాలకృష్ణ, లోకేశ్ వెళ్లి కలిశారు. ఆయనతో రాజకీయాలేవో మాట్లాడుకొని బయటకు వచ్చిన తర్వాత చేసిన వీరవిక్రమ ధీర గంభీర స్టేట్మెంట్ మాత్రం ఆశ్చర్యం కలిగించింది. ఆయన ప్రకటనలో రెండు ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటిది – వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తాయి. రెండో అంశం – ఇకపై వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్నామని చెప్పడం! వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఈ రాష్ట్ర జనాభాలో నూటికి తొంభైమందికి ఎప్పుడో తెలుసు. అంత ఆవేశంగా చెప్పవలసిన కొత్త విషయమేమున్నది ఇందులో! బహుశా జైల్లో చంద్రబాబు ఉపదేశించిన మంత్ర ప్రభావం వల్ల కావచ్చు. ఆయన మాత్రం చాలా ఆవేశపడ్డారు. యుద్ధం స్టోరీ కూడా పాతదే. పేద ప్రజల సాధికారత ఉద్యమంపైన పెత్తందార్ల తరఫున ప్రతిపక్ష శిబిరం ఎప్పటినుంచో యుద్ధం చేస్తున్నది. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన బోధన కోసం సాగుతున్న యత్నాలపైనా యుద్ధం ప్రకటించింది. మహిళల పేర్ల మీద ఇళ్లు కట్టించి ఇస్తుంటే యుద్ధ సైరన్ వినిపించింది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుంటే రణభేరి మోగించింది. పెత్తందార్లు యుద్ధం ఆపిందెప్పుడు? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కశ్మీర్ మళ్లీ మొదటికి?!
అడపా దడపా జరిగే ఘటనలు మినహా దాదాపు ప్రశాంతంగా ఉన్నట్టు కనబడిన కశ్మీర్‌పై ఉగ్ర వాదులు పంజా విసిరారు. ఒక ఎన్కౌంటర్ సందర్భంగా అనంతనాగ్ జిల్లాలో బుధవారం సైనికాధికారులు కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆషిష్, డీఎస్పీ హుమాయిన్ ముజామిల్ భట్ ఉగ్రవాదుల తుపాకి గుళ్లకు నేలకొరగడం... అదే ప్రాంతంలో శుక్రవారం మరో ఆర్మీ జవాన్ మిలిటెంట్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోవటం అక్కడి తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. దట్టంగా అడవులు, కొండలు ఉండే ప్రాంతాలను ఎంచుకుని భద్రతా బలగాలపై దాడికి తెగబడటం ఇటీవలి కాలంలో మిలిటెంట్లు అనుసరిస్తున్న వ్యూహం. గత నెలలో ముగ్గురు ఆర్మీ జవాన్లను హతమార్చిన ప్రాంతం కుల్గామ్ కూడా దట్టమైన అటవీ ప్రాంతమే. కొండలు, కోనలు ఉండే అటవీప్రాంతంపై సమగ్ర అవగాహన ఉంటే తప్ప సైన్యం మిలిటెంట్లను తిప్పికొట్టడం సాధ్యం కాదు. తమకు బాగా పట్టున్న ఇలాంటి ప్రాంతాల్లో వారానికి సరిపడా ఆహారం, మందుగుండు సిద్ధం చేసుకుని ఒక పద్ధతి ప్రకారం మిలిటెంట్లు సైన్యాన్ని తామున్నచోటకు రప్పిస్తున్నారు. కొండలపై మాటుగాసి తమవైపు వస్తున్న బలగాలపై కాల్పులు జరపటం మిలిటెంట్లకు సులభమవుతోంది. ఎత్తయిన ప్రాంతంలో ఉండటం వల్ల భద్రతా బలగాలకు బాసటగా వచ్చే హెలికాప్టర్లపై సునాయాసంగా దాడులు చేయగలుగుతున్నారు. పైగా మిలిటెంట్ల ఫోన్ సంభాషణలను వినటం, వారి ఆనుపానులు ఎక్కడ వున్నాయో కచ్చితంగా అంచనా వేయటంలాంటి అంశాల్లో సైన్యం విఫలమవుతోంది. మైదాన ప్రాంతాల్లో గతంతో పోలిస్తే పరిస్థితి మెరుగుపడింది. అక్కడ భద్రతా బలగాలకు సమాచార వ్యవస్థ పటిష్టంగా ఉండటంతో మిలిటెంట్ల ఆటలు సాగడం లేదు. ఉగ్రవాద దాడులు పెరగటం వెనక ఎప్పటిలాగే పాకిస్తాన్ హస్తం ఉండటం బాహాటంగా కన బడుతోంది. వాస్తవానికి పాక్ ఆర్థికంగా దివాలా తీసి, ఇప్పట్లో కోలుకునే అవకాశం లేని స్థాయికి చేరుకుంది. రాజకీయంగా సరేసరి. ఇమ్రాన్ ఖాన్‌ను గద్దెదించిన నాటినుంచీ సైన్యంపై సాధారణ ప్రజానీకంలో ప్రతికూలత పెరిగింది. మరోపక్క ఉగ్రవాదులకు నిధులు అందజేయటానికి తోడ్పడే సంస్థలనూ, దేశాలనూ నిరోధించేందుకు అంతర్జాతీయంగా ఏర్పాటైన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్‌పై నిఘా ఉంచింది. అయినా సరే అది తన వెనకటి గుణాన్ని వదులుకోవటానికి సిద్ధపడటం లేదని కశ్మీర్ తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఇప్పుడు జరిగిన దాడులకు బాధ్యు లుగా చెప్పుకున్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు అనుబంధంగా పుట్టుకొచ్చిందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంస్థ ఆంక్షలను అధిగమించటానికి పాకిస్తాన్ ఈ కొత్త ఉగ్ర సంస్థను సృష్టించిందని సులభంగానే గ్రహించవచ్చు. సరిహద్దులకు ఆవలినుంచే టీఆర్ఎఫ్కు ఆయుధాలు, డ్రగ్స్ అందుతున్న సంగతి కూడా నిర్ధారణ అవుతోంది. 370వ అధికరణను రద్దుచేసి, జమ్మూ–కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టి నాలుగేళ్లు కావస్తోంది. అటు తర్వాత కశ్మీర్లో పరిస్థితి మెరుగు పడిందని, ఆర్థికంగా కోలుకోవటంతోపాటు భద్రతరీత్యా సురక్షితంగా ఉన్నదని బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. గతంతో పోలిస్తే కశ్మీర్‌కు పర్యాటకుల సంఖ్య పెరిగింది. నగరాలు, పట్టణాల్లో మిలిటెంట్ల ఆటలు సాగటం లేదు. కానీ అంతమాత్రానికే సంతృప్తి పడితే ప్రమాదకర పర్యవసానా లుంటాయని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఇటీవలి ఎన్కౌంటర్లను పరిశీలిస్తే బలగాలకు మార్గదర్శకాలిచ్చి వారిని నడిపించాల్సిన ప్రధాన అధికారులే బలవుతున్న సంగతి అర్థమవుతుంది. దాడులకు సీనియర్ అధికారులు నేతృత్వం వహించాలన్నది ఒకరకంగా మంచి నిర్ణయమే. ఇందువల్ల దాడుల్లో చురుగ్గా పాల్గొనేందుకు కింది స్థాయి జవాన్లు సంసిద్ధులవుతారు. అయితే దానికి తగినట్టుగా మిలిటెంట్లు మాటువేసిన ప్రాంతాన్ని నిర్ది ష్టంగా, నిర్దుష్టంగా నిర్ధారించుకోవటానికి అవసరమైన పరికరాలు వారికి అందుబాటులో ఉంచటం అతి ముఖ్యం. తగిన వ్యూహాన్ని రూపొందించటంలో, బలగాల్లో ఆత్మవిశ్వాసం నింపి, వారి నమ్మ కాన్ని గెల్చుకోవటంలో సీనియర్ల పాత్ర కీలకమైనది. అటువంటి అధికారులను కోల్పో వటం వల్ల భద్రతా బలగాలకు కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ఇవన్నీ శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించినవి. వీటికి సమాంతరంగా కశ్మీర్లో మళ్లీ రాజకీయ ప్రక్రియ ప్రారంభించటానికి అవసరమైన చర్యలు తీసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలి. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడ గొట్టాక అంతా మెరుగైందని బీజేపీ నేతలు చెబుతున్నా ఉగ్రవాదుల ఆగడాలు క్రమేపీ పెరుగుతున్న సంగతి కాదనలేనిది. పండిట్లపైనా, వలస వచ్చినవారిపైనా మిలిటెంట్ల దాడులు జరుగుతున్నాయని గతంలో కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించిన బృందంలోని సభ్యురాలు రాధాకుమార్ ఇటీవలే గుర్తుచేశారు. కశ్మీర్లో నిరుద్యోగిత దేశ సగటుకన్నా మూడు రెట్లు ఎక్కువున్నదని ఆమె అంటు న్నారు. ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం 2015 నుంచి మిలిటెన్సీకి దూరంగా ఉంది. అక్కడ గత ఏడెనిమిదేళ్లుగా చెప్పుకోదగిన ఘటనలు లేవు. అటువంటిచోట ఉగ్రవాదులు భద్రతా బలగాలపై దాడులు చేయగలిగారంటే ఆలోచించాలి. కశ్మీర్లో నిరుడు దాదాపు వందమంది యువకులు ఉగ్రవాద సంస్థల్లో చేరారని, వీరిలో చాలామంది టీఆర్‌ఎఫ్‌వైపు మొగ్గారని గణాంకాలు చెబు తున్నాయి. కనుక ఉగ్రవాదాన్ని నిరోధించటానికి అవసరమైన చర్యలు తీసుకుంటూనే రాజకీయ ప్రక్రియ ప్రారంభించటం, యువతలో నిరుద్యోగితను అరికట్టడం వంటి చర్యలు అవసరం. -
అప్రమత్తత అవసరం
మరపునపడిందనుకున్న ఆ పేరు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. మనిషి మెదడును దెబ్బ తీసే ప్రాణాంతక నిపా వైరస్ (ఎన్ఐవీ) మరోసారి దేశంలో జడలు విప్పుతోంది. వస్తూనే కేరళలో ఇద్దరి ప్రాణాలు బలి తీసుకొని, పాజిటివ్ వచ్చిన మరికొందరి ఆరోగ్యాన్ని అయోమయంలోకి నెట్టి, సన్నిహితంగా మెలిగిన మరో 800 మందిపై వైద్యపర్యవేక్షణ పెట్టాల్సిన పరిస్థితి తెచ్చింది. వీరిలో 77 మంది ప్రమాదస్థితిలో ఉన్నారనీ, వైరస్ సోకినవారిలో 155 మంది ఆరోగ్య కార్యకర్తలూ ఉన్నారనీ వస్తున్న వార్త ఆందోళన పెంచుతోంది. నిపా సోకితే సహాయక చికిత్సే తప్ప, రోగాన్ని తగ్గించే మందులు కానీ, నివారించే టీకా కానీ ఇప్పటిదాకా లేకపోవడమే పెద్ద సమస్య. కోళిక్కోడ్ జిల్లాలోని 9 గ్రామ పంచాయతీలను ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి, స్కూళ్ళు – ఆఫీసులు – ప్రజారవాణాకు సెలవిచ్చి, సభలూ సమావేశాలపై నియంత్రణలు పెట్టాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కేరళలో మొదలైన ఈ ప్రకంపనలు ఇప్పుడు దేశం మొత్తాన్నీ అప్రమత్తం చేస్తున్నాయి. కలుషిత ఆహారం, రోగితో సాన్నిహిత్యం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించడం నిపా వైరస్ స్వభావం. 1998లో తొలిసారిగా మలేసియా, సింగపూర్లలో పందుల పెంపకందార్లలో, వాటితో సన్నిహితంగా మెలిగే ఇతరుల్లో ఈ వైరస్ తొలిసారి బయటపడింది. అప్పట్లో 300 పైచిలుకు మందికి వైరస్ సోకితే, వంద మందికి పైగా మరణించారు. ఆపై అది వేలాది మైళ్ళు ప్రయాణించి, వివిధ దేశాలకు విస్తరించడం, వైరస్ సోకినవారిలో 72 నుంచి 86 శాతం మంది మరణించడం సంచలనమైంది. వైరస్ సోకిన గబ్బిలాలు, పందుల శరీరద్రవాల ద్వారా మనుషుల కిది వ్యాపిస్తుందట. నిపా సోకితే జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులు, తలనొప్పి, వాంతులతో మొదలై పరిస్థితి తీవ్రమైతే మెదడువాపు, మూర్ఛలతో రోగి కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాట. 1998 – 2015 మధ్య 600కు పైగా కేసులు వచ్చాయని అది లెక్క తేల్చింది. ఈ మాయదారి వైరస్ మన దేశంలో పంజా విసరడం ఇదేమీ తొలిసారి కాదు. గడచిన అయి దేళ్ళలో ఇది నాలుగోసారి. మెదడు మీద దాడి చేసే ఈ అనారోగ్య భూతం 2018 మేలో మొదటిసారి వచ్చినప్పుడు దానిని కట్టడి చేసేలోగా వైరస్ సోకిన 23 మందిలో 21 మంది మరణించారు. ఆ తరువాత 2019, 2021ల్లో కూడా కేరళ తీరాన్ని ఈ వైరస్ తాకింది. మలబారు సీమలో బయటపడ్డ ఈ తాజా నిపా కేసులకు బంగ్లాదేశ్ వేరియంట్ కారణమని గుర్తించారు. మిగతావాటితో పోలిస్తే ఈ వేరియంట్ వ్యాప్తి తక్కువే అయినా, సోకినవారిలో సగటున నూటికి 70 మంది మరణిస్తున్నారన్న గణాంకాలు గుబులు రేపుతున్నాయి. రోగులకు సన్నిహితంగా మెలిగినవారు ఐసొలేషన్‌లోకి వెళ్ళడం, జనమంతా మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి కార్యాచరణ అయింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఈ గబ్బిలపు వైరస్ పదేపదే విరుచుకు పడే ప్రమాదం ఎక్కువని మేలో రాయిటర్స్ పరిశోధన తేల్చింది. విచ్చలవిడిగా అడవుల నరికివేత, ఇష్టారాజ్యపు పట్టణీకరణ, ఫలితంగా వన్యప్రాణులతో మానవ సంఘర్షణ – వీటన్నిటి పర్యవసానం ఇదని ఆ పరిశోధన గుర్తించింది. ఇక, మన దేశంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక సహా 8 రాష్ట్రాల్లోని గబ్బిలాల్లో ఈ ప్రాణాంతక వైరస్ ఛాయలున్నట్టు ఈ ఏడాది జూలైలో భారతీయ వైద్య పరిశోధనా మండలి అధ్యయనం సైతం నిర్ధరించింది. అయితే, కేరళపైనే తరచూ ఈ వైరస్ దాడికి కారణం – జనసాంద్రత, భౌగోళిక పరిస్థితులు, వానలంటూ రకరకాల ప్రచారాలున్నాయి. కచ్చితమైన కారణా ల్నింకా కనిపెట్టాల్సి ఉంది. ప్రస్తుతానికి కేంద్ర బృందం కేరళ వెళ్ళి సంక్షోభంలో సాయపడుతోంది. నిపాకు ప్రధాన కారణమని భావిస్తున్న ఫ్రూట్ బ్యాట్స్ (పండ్లను కొట్టే గబ్బిలాల) సంఖ్య కేరళలో ఎక్కువైతే కావచ్చు కానీ, వాటి నిర్మూలన కుదరదు. కాబట్టి, ఒకేచోట, ఒకేలా కాకపోయినా ఏటా నిపా వైరస్ ముప్పు తప్పదని గ్రహించి, కేరళ సహా అన్ని రాష్ట్రాలూ జాగ్రత్తపడాలి. జంతువుల నుంచి మానవులకు సోకే ఇలాంటి ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల ఆనుపానులు పసిగట్టేందుకు మహమ్మారులపై పరిశోధన అవసరం. కానీ, కేరళే కాదు... కేంద్రం కూడా నిపాపై తగినంత శ్రద్ధ చూపలేదనే చెప్పాలి. పుణేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తరహాలో తిరువనంతపురంలో అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ను నెలకొల్పినా, అది ఇప్పటికీ పూర్తిగా కార్యాచరణలోకి దిగలేదు. అంతకంతకూ పెరుగు తున్న సాంక్రమిక వ్యాధుల రీత్యా తక్షణమే ఆ సంస్థ సేవలపై దృష్టి సారించాలి. 2018 నిపా తాకి డిలో, తర్వాత కరోనా కాలంలో సమర్థనీయంగా పనిచేసిన కేరళ మరోసారి కృతనిశ్చయం చూపాలి. ఇప్పటి వరకు ఇండియా, బంగ్లాదేశ్, సింగపూర్, మలేసియా, ఫిలిప్పీన్స్ లాంటి ఆసియా దేశాలకే ఈ వైరస్ పరిమితమైంది. ప్రపంచంలోని ఇతర దేశాలకు ఇది విస్తరించకపోవడం అదృష్టమే. కానీ, భవిష్యత్తులో విస్తరించదనే నమ్మకం ఏమీ లేదు. వైరస్ల విజృంభణలు, ప్రాణాంతక రోగాలు... ప్రపంచానికి కొత్త కాకపోవచ్చు. అయితే, చికిత్స లేని రోగాలు, వైరస్‌లపై శాస్త్రీయ పరిశోధనలతో ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా పోరాడాల్సిన అవసరాన్ని తాజా నిపా కేసులు గుర్తుచేస్తున్నాయి. నిన్న కాక మొన్న కరోనా కట్టడిలో అలాంటి పోరే మానవాళికి మేలు చేసిందని మరచిపోరాదు. అయితే, అందుకై పరిశోధన – అభివృద్ధి విభాగానికి కావాల్సిన వనరుల్ని అందించడం తక్షణ అవసరం. ఈలోగా చేతుల శుభ్రత, మాస్కుధారణ, స్వచ్ఛమైన ఆహారాన్నే భుజించడం సదా ఆరోగ్యమనీ, అది మన చేతుల్లోని పని అనీ అందరం గుర్తించాలి. ఎందుకంటే... చికిత్స కన్నా నివారణ, భయం కన్నా అప్రమత్తతే పరమౌషధం! -
చేజేతులా చేసుకున్నదే!
జీ20 ముగిసినా దాని ప్రకంపనలింకా తగ్గలేదు. ఢిల్లీ శిఖరాగ్ర సదస్సుకు హాజరై, భారత ఆత్మీయ ఆతిథ్యాన్ని అందుకున్న మిగతా ప్రపంచ నేతలందరికీ ఇది చిరస్మరణీయ అనుభవమేమో కానీ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు మటుకు ఇది పీడకలగా పరిణమించింది. భారత ప్రధాని నుంచి సాదర స్వాగతం అందకపోగా, ఖలిస్తానీ తీవ్రవాదులకు అడ్డుకట్ట వేయకపోవడంపై ద్వైపాక్షిక చర్చల్లోనూ భారత్ ఆయనకు తలంటి పంపినట్టు వార్త. ఎలాగోలా సదస్సు ముగియగానే తిరుగు ప్రయాణం అవుదామంటే ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్యలు. భారత్‌లో కెనడా ప్రధాని చేదు అనుభవాలన్నీ సొంత గడ్డపై ప్రతిపక్షాలకు కావాల్సినంత మేత ఇచ్చాయి. మంగళవారం ట్రూడో తిరుగు పయనమయ్యారు కానీ, భారత్ పర్యటనలో ఆయనకు వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు. భారత్ నుంచి పంజాబ్‌ను వేరుచేయాలని కోరుతున్న ఖలిస్తానీ ఉద్యమకారులు, వారి మద్దతు దార్లపై కెనడా మెతకగా వ్యవహరిస్తోందని భారత వాదన. ట్రూడో మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛ తమ దేశీయ విధానమని సమర్థించుకుంటున్నారు. తమ అంతర్గత రాజకీయాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందనేది కెనడా సర్కార్ ఆరోపణ. జీ20 వేళ ఆదివారం ట్రూడో, మోదీల మధ్య భేటీలో ఇరుపక్షాలూ తమ తమ ఆందోళనలు వ్యక్తం చేశాయి. భారత– కెనడా సంబంధాలు ఇటీవల అంత కంతకూ దిగజారుతున్నాయనడానికి ఆ భేటీ వార్తలే తార్కాణం. ఇరుదేశాల మధ్య చర్చల్లో ఉన్న వాణిజ్య ఒప్పందమూ నత్తనడకన సాగే ప్రమాదంలో పడింది. ఇది ఎవరికీ శ్రేయోదాయకం కాదు. గతంలో 2018లో ప్రధానిగా ట్రూడో తొలి భారత సందర్శన సైతం ఘోరంగా విఫలమైంది. శిక్ష పడ్డ తీవ్రవాదిని విందుకు ఆహ్వానించి, అప్పట్లో ఆయన గందరగోళం రేపారు. అప్పటితో పోలిస్తే, ఇప్పటి పర్యటన మరీ ఘోరం. కీలక మిత్రదేశాల నుంచి దూరం జరిగిన కెనడా, భారత్‌తో తనబంధాన్ని మరింత బలహీనపరుచుకుంది. వెరసి, ఈ ప్రాంతంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, భారత్‌లు రెంటికీ కెనడా దూరమైంది. ఎన్నికల్లో జోక్యం, కెనడియన్ పౌరుల కిడ్నాప్, ఆర్థిక యుద్ధతంత్రం వగైరాల వల్ల చైనాకు దూరం జరగడం అర్థం చేసుకోదగినదే. కానీ, రాజకీయ కారణా లతోనే ట్రూడో భారత్‌ను దూరం చేçసుకుంటున్నట్టు కనిపిస్తోంది. కెనడా జనాభా 4 కోట్ల యితే, భారత జనాభా 140 కోట్లు. కెనడా ఆర్థిక వ్యవస్థకు భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు రెట్టింపు. అలా చూస్తే, భారత్‌తో బంధం కెనడాకు అవసరం, లాభదాయకం. ఆ సంగతి ట్రూడో విస్మరించారు. మునుపటి ప్రధాని స్టీఫెన్ హార్పర్ హయాంలో ఢిల్లీతో వాణిజ్యాన్ని ఒటావా విస్తరించింది. వ్యవసాయ సామగ్రి, ఎరువులు, అణువిద్యుత్‌కు అవసరమయ్యే యురేనియమ్ భారత్‌కు కెనడా అందిస్తూ వచ్చింది. ట్రూడో హయాంలో ఎలాంటి వివరణా ఇవ్వకుండానే ఇటీవలే సరికొత్త వాణిజ్య ఒప్పందంపై చర్చల్ని ఆపేశారు. భారత్‌లో మోదీ విధానాలు కెనడాలో తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తాయని ట్రూడో భావన. అందుకే, వీలైనంత దూరం జరగాలని చూస్తున్నారు. కెనడాలో ఎక్కువగా ప్రవాసీ సిక్కులుండడంతో, వారి మద్దతుకై తంటాలు పడుతున్నారు. భారత్‌లో 2020 నాటి రైతుల ఆందోళనలపై ట్రూడో మాట్లాడుతూ ఇప్పుడు జీ20లో అన్నట్టే భావప్రకటన స్వేచ్ఛల్ని ప్రబోధించారు. తీరా కెనడాలో అలాంటి నిరసనలే ఎదురైతే, అత్యవసర చట్టం ప్రయోగించారు. మైనారిటీలపై మోదీ ప్రభుత్వ కఠిన వైఖరిని తప్పుపడుతున్న ట్రూడో కెనడాలో చేస్తున్నది అదే! అంతర్జాతీయ సంబంధాల్లో కెనడా ఇప్పుడు దోవ తప్పింది. ఐరాస భద్రతామండలి తాత్కాలిక సభ్యత్వం కోసం ఆ దేశం చేసిన గత రెండు ప్రయత్నాలూ విఫలమయ్యాయి. 20వ శతాబ్దిలో శాంతి పరిరక్షణ ప్రయత్నాలకు మారుపేరుగా, ఐరాస శాంతిపరిరక్షక దళానికి సృష్టికర్తగా నిలిచిన కెనడా ఇప్పుడు ఆ ఊసే ఎత్తని స్థితికి చేరింది. ఒకప్పుడు వర్ణవివక్షపై పోరాటంలో, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఏర్పాటులో ముందుండి, మానవ భద్రతకై మందుపాతరల నిషేధ ఒప్పందం కావాలని కూడా పోరాడిన దేశం గత రెండు దశాబ్దాల్లో ఊహించని మార్గం పట్టింది. 2005 తర్వాత ఆ దేశం తన విదేశాంగ విధానాన్ని సమీక్షించుకోనే లేదు. దేశంలో, ప్రపంచ పరిస్థితుల్లో శరవేగంతో మార్పులు వచ్చినా ఎప్పటికప్పుడు తాత్కాలిక ప్రతిస్పందనతోనే విదేశాంగ వాహనాన్ని నెట్టుకొస్తోంది. ఫలితంగా ప్రపంచంలో కెనడా పేరుప్రతిష్ఠలే కాదు... ప్రభావమూ దెబ్బతింటోంది. తక్షణమే కెనడా విదేశాంగ విధానానికి దశ, దిశ కావాలని విశ్లేషకులు అంటున్నది అందుకే! గత ఇరవై ఏళ్ళలో డయాస్పొరా రాజకీయాలు, వ్యక్తిగత రాగద్వేషాలతో కెనడా విదేశాంగ విధానం తప్పటడుగులు వేస్తోంది. మధ్యప్రాచ్యంపై మునుపటి హార్పర్ ప్రభుత్వం, భారత్‌తో వ్యవహారంలో ఇప్పటి ట్రూడో సర్కార్ వైఖరి అందుకు మచ్చుతునక. చమురు, సహజవాయువు, జలవిద్యుచ్ఛక్తి ఉత్పత్తిలో కెనడాది అగ్రపీఠం. అలాగే, యురేనియమ్, అనేక కీలక ఖనిజాలు అక్కడ పుష్కలం. దాన్ని సానుకూలంగా మలుచుకొని విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దుకొనే అద్భుత అవకాశం ఉన్నా అక్కడి పాలకులు ఆ పని చేయట్లేదు. ఇప్పటికైనా కెనడా బయటి ఒత్తిళ్ళను బట్టి నడవడం మానాలి. దేశాన్ని కలసికట్టుగా నిలిపే స్పష్టమైన లక్ష్యాలను పౌరులకు అందించాలి. కీలక అంతర్జాతీయ అంశాల్లో తమ వైఖరిని స్పష్టం చేయాలి. భారత్‌తో బంధాన్ని మళ్ళీ బలోపేతం చేసుకోవడంతో ఆ పనికి శ్రీకారం చుట్టాలి. ఎందుకంటే, పాలకుల పనికిమాలిన చర్యల వల్ల కెనడాకు ఆర్థిక నష్టం కలిగితే అది పాలకుల పాపమే. ట్రూడో ఇకనైనా స్వార్థ రాజకీయ ప్రయోజనాలు వదిలి, విశ్వవేదికపై సమస్త కెనడియన్ల ప్రయోజనాలపై దృష్టి పెడితే మంచిది. -
వ్యూహాత్మక స్నేహబంధం
కొన్నిసార్లు అంతే... కీలక పరిణామాలన్నీ కొద్ది వ్యవధిలో జరిగిపోతుంటాయి. ఢిల్లీలో జీ20 సదస్సు ముగియగానే మరో ముఖ్యపరిణామం సంభవించింది. సోమవారం భారత ప్రధాని మోదీ, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సాద్‌ల సహ అధ్యక్షతన భారత – సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలి (ఎస్పీసీ) తొలి శిఖరాగ్రస్థాయి సమావేశం జరిగింది. విస్తృత చర్చల అనంతరం రెండు దేశాలూ తమ వాణిజ్య, రక్షణ బంధాలను విస్తరించుకోవాలని నిర్ణయించాయి. భారత్‌లో ఒక రోజు పర్యటనకు వచ్చిన సౌదీ యువరాజుతో జరిగిన ఈ కీలక నిర్ణయం దీర్ఘకాలిక ప్రభావం చూపగలిగేది. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న రెండు పెద్ద ఆర్థికవ్యవస్థల మధ్య పెరుగుతున్న సహకారం మధ్యప్రాచ్య – హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు కీలకం. అందుకే, ఈ సమావేశం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. జీ20లో కీలక ‘ఇండియా– మధ్యప్రాచ్యం– యూరప్ ఆర్థిక నడవా’ (ఐఎంఈసీ) ప్రకటించిన వెనువెంటనే... ఆ నడవాలో భాగమయ్యే సౌదీతో భారత బంధాల విస్తరణ శుభపరిణామం. రెండు దేశాల మధ్య ఎస్పీసీ 2019 అక్టోబర్‌లో భారత ప్రధాని, రియాద్ పర్యటనలోనే ఏర్పాటైంది. బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల తర్వాత సౌదీ అలాంటి భాగస్వామ్యం కుదుర్చుకున్న నాలుగో దేశం ఇండియానే! సరిగ్గా ఏడాది క్రితం 2022 సెప్టెంబర్‌లో మన వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సౌదీ వెళ్ళి, ఎస్పీసీ మంత్రిత్వ స్థాయి సమావేశానికి హాజరయ్యారు. అప్పట్లోనే సౌదీలో మన రూపే కార్డ్ వినియోగం సహా అనేక అంశాలు ప్రధాన సహకార అంశాలుగా చర్చకు వచ్చాయి. సోమవారం రెండు దేశాల నేతల మధ్య చర్చలు అందుకు కొనసాగింపు. నిజానికి, కొన్నేళ్ళుగా భారత, సౌదీల బంధం బలపడుతోంది. విభిన్న సాంస్కృతిక, చారిత్రక నేపథ్యాలున్న రెండు దేశాలూ వాణిజ్యం నుంచి సాంస్కృతికం దాకా బాంధవ్యాలు పెట్టుకుంటున్నాయి. ద్వైపాక్షిక బంధాలు పటిష్ఠం కావాలంటే సాంస్కృతిక సంబంధాలు కీలకం. అందు లోనూ రెండు దేశాలూ అడుగులు వేశాయి. సౌదీలో పవిత్ర మక్కా నగరానికి మనదేశం నుంచే ఏటా వేల మంది హజ్ యాత్ర సాగిస్తుంటారు. భారత్ నుంచి ఏటా 1.75 లక్షల మందికి పైగా హజ్ యాత్రికులకు అవకాశం కల్పిస్తూ, ఈ ఏడాది మొదట్లోనే సౌదీ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక దేశం నుంచి చరిత్రలో ఎన్నడూ లేనట్టు ఇంత భారీ సంఖ్యలో యాత్రికుల్ని అనుమతిస్తామంటూ సౌదీ కోటా ఇవ్వడం విశేషం. అలాగే, ఆ రాజ్యంలో అత్యధిక ప్రవాసుల సంఖ్య కూడా మనదే! 22 లక్షల మందికి పైగా భారతీయ ప్రవాసులు సౌదీలో ఉన్నారు. ఇవన్నీ భారత్, సౌదీలను మరింత సన్నిహితం చేస్తున్నాయి. ప్రవాసులంతా తమ దేశంలో భాగమేననీ, వారిని సొంత పౌరులలా కడుపులో పెట్టుకుంటామనీ సౌదీ యువరాజు తాజా పర్యటనలోనూ స్పష్టం చేయడం విశేషం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన రెండు దేశాలూ ప్రధానమైనవి. భారత్‌కు నాలుగో అతి పెద్ద వాణిజ్య భాగస్వామి సౌదీయే! ఇక, సౌదీకి రెండో అతి పెద్ద వాణిజ్య భాగస్వామి భారత్ అని 2022 లెక్క. మన ముడిచమురు దిగుమతుల్లో 18 శాతం పైగా అందిస్తున్నది ఈ అరబ్బు రాజ్యమే. కలసి ప్రగతి బాటలో సాగాలనే లక్ష్యంతో ఇరు దేశాలూ డిజిటల్ పేమెంట్స్, రక్షణ ఉత్పత్తులు, ఇంధనం, ప్రాథమిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం లాంటి రంగాల్లోనూ వాణిజ్య అవకాశాలను అన్వేషిస్తూ వచ్చాయి. సౌదీ యువరాజు, భారత ప్రధాని సహా ఉన్నతస్థాయి వ్యక్తులు కొద్దికాలంగా జరుపు తున్న పర్యటనలు ఈ బంధాన్ని బలోపేతం చేస్తున్నాయి. దానికి తగ్గట్టే ఇరుదేశాలూ తమకు ఉమ్మడి అంశాలైన తీవ్రవాదంపై పోరు, ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారంపై దృష్టి సారిస్తున్నాయి. సోమవారం నాటి చర్చల్లో మహారాష్ట్ర తీరంలో నిర్మించనున్న 5 వేల కోట్ల డాలర్ల విలువైన వెస్ట్ కోస్ట్ రిఫైనరీ ప్రాజెక్ట్‌ను వేగవంతంగా అమలు చేయాలని ఇరుదేశాలూ నిర్ణయించాయి. అందుకు ఓ సంయుక్త సత్వర కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించాయి. ఇంధనం, రక్షణ, సెమీకండక్టర్, అంతరిక్ష రంగాల్లో ముమ్మర సహకారానికి వీలున్నట్టు గుర్తించాయి. డిజిటలీకరణ, పెట్టుబడులు సహా వివిధ రంగాల్లో సహకారాన్ని పెంచుకొనేందుకు 8 ఒప్పందాలపై సంతకాలూ చేశాయి. వాస్తవానికి, భారత్, సౌదీల మధ్య సత్సంబంధాల విస్తరణ కేవలం రెండు దేశాలకే కాక, మధ్యప్రాచ్యం – హిందూ మహాసముద్ర ప్రాంతం అంతటికీ కీలకం. ఈ ప్రాంతంలో సుస్థిరత, ఆర్థికాభివృద్ధి, భద్రతకు తోడ్పడుతుంది. అందుకే భారత్ సైతం ఒకపక్క వ్యూహాత్మకంగా ఇజ్రాయి ల్తో బంధాన్ని పదిలంగా చూసుకుంటూనే, ఇతర అరబ్ దేశాలతో మాటామంతీ సాగిస్తోంది. సౌదీతో మన వ్యూహాత్మక ప్రయోజనాలూ అనేకం. చైనాను మినహాయిస్తే, పాకిస్తాన్‌పై ఒత్తిడి చేయగల ఏకైక దేశం సౌదీనే. అందువల్లే, పాక్‌తో దానికున్న సంబంధాలకు అతీతంగా మన దేశమూ అరబ్బు రాజ్యంతో బలమైన బంధం పెట్టుకుంటోంది. ఇటీవలే ఇరాన్‌తో శత్రుత్వానికి స్వస్తి పలికిన సౌదీ జొహాన్స్‌బర్గ్ సదస్సులో ‘బ్రిక్స్’లో సైతం సభ్యత్వం తీసుకుంది. ఆ పరిణామాల తర్వాత ప్రిన్స్ పర్యటనగా ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. 2019 ఫిబ్రవరిలో భారత్ సందర్శించిన సౌదీ ప్రిన్స్ ఇప్పుడు మళ్ళీ రావడం, ఈసారి భారత– జీసీసీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పైనా దృష్టి పెట్టడానికి ఇరుపక్షాలూ అంగీకరించడం గమనించదగ్గవి. మొత్తానికి, ఈ బంధం వేగంగా పరిణతి చెందుతోంది. తగ్గట్టే మధ్యప్రాచ్యంపై భారత విధానమూ వివిధ రూపాలు తీసుకుంటోంది. సరికొత్త వ్యూహాత్మక కూటమికి పురుడుపోస్తోంది. సౌదీతో స్నేహంలో తాజా భేటీ మరో ముందడుగు. -
మనం సక్సెసే కానీ...
రష్యా అధ్యక్షుడు లేడు. చైనా అధినేత రాలేదు. ఉక్రెయిన్‌పై సాగుతున్న రష్యా యుద్ధంపై సభ్య దేశాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. ఒక్కముక్కలో జీ20లో దేశాలు ఏకాభిప్రాయంతో కానీ, ఏక లక్ష్యంతో కానీ ఉన్నట్టు కనిపించదు. అయినా సరే, ఆదివారం ఢిల్లీలో ముగిసిన జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సును ఘనంగా నిర్వహించి, అన్ని దేశాల తరఫునా ఎవరినీ నొప్పించని 83 పేరాల ఏకాభిప్రాయ ప్రకటన, అదీ ఒకరోజు ముందరే చేయించడమనేది అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్‌కు అసాధారణ విజయమే! దక్షిణార్ధగోళంలోని వర్ధమాన, పేదదేశాల పక్షాన నిలబడి, వాటి ప్రయోజ నాల్ని సదస్సు అజెండాలో మేళవింపజేయడమూ సామాన్యం కాదు. అలాగే బాలీలో నిరుడు అంగీ కరించినదే అయినా, ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ)కు జీ20లో శాశ్వత సభ్యత్వం ఇవ్వడం ద్వారా దక్షిణార్ధగోళానికి తాను సరైన ప్రతినిధినని భారత్ చాటుకున్నట్టయింది. అందుకే, వంతుల వారీగా ఏడాదికొకరికి వచ్చే అధ్యక్షహోదాయే అయినా... జీ20 సారథిగా భారత్ సక్సెస్ కావడం, ప్రపంచ వేదికలో మరో మెట్టు పైకి ఎక్కడం కచ్చితంగా సంతోషించదగ్గ సమయం, సందర్భం. జీ20 సదస్సు ముగింపు వేళ చేసిన ఏకాభిప్రాయ ప్రకటనపై కొన్ని అసంతృప్తులూ లేకపోలేదు. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంపై పాశ్చాత్య ప్రపంచం భావిస్తున్న రీతిలో రష్యాను నిలదీయ లేదనీ, నిరుటి బాలీ డిక్లరేషన్ నుంచి పక్కకు జరిగారనీ ఒక వర్గపు అసంతృప్తి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశల వారీగా మానుకోవడంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం స్థిరసంకల్పం, చిత్త శుద్ధి లేమిని తెలియజేస్తోందన్నది మరో ప్రధానమైన అసంతృప్తి. జీ20 సదస్సులు ఆయా ఆతిథ్య దేశాల ఘనత చాటుకోవడానికే తప్ప, అసలు పనిలో తూతూమంత్రంగా మారాయనే నింద కొంత కాలంగా ఉన్నదే. అది నిజం కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత జీ20 వేదికదే! తాజా జీ20 లోనూ ప్రకటించిన లక్ష్యాలు బలహీనంగా ఉన్నాయనీ, ఇప్పటికే తాము కట్టుబడిన లక్ష్యాలనే దేశాధి నేతలు వల్లెవేశారని విశ్లేషకుల మాట. వెరసి, నిర్వహణలో పేరుప్రఖ్యాతులతో ఇండియా హిట్టే కానీ, కీలక ప్రపంచ సమస్యలపై నిర్ణయంలోనే సదస్సు విఫలమైందనే మాట మిగిలిపోయింది. చర్చించడానికి ఆహారభద్రత, ఋణాల ఉపశమనం, పర్యావరణ సంక్షోభం, వ్యాధులు, బ్యాంకింగ్ సంస్కరణలు, డిజిటల్ ప్రాథమిక వసతుల లాంటి అనేక ప్రపంచ సమస్యలున్నాయి. కానీ, వాటి పరిష్కారానికి అందరికీ అంగీకారయోగ్యమైన, విశ్వసనీయ కార్యాచరణ జీ20లో లోపించింది. పరస్పర భిన్నమైన 20 దేశాలు సమష్టి ఆశయాలు, ఆలోచనలు, అనుభవాల పునాదిపై కాక ఆర్థిక బలిమి ప్రాతిపదికన ఇలా ఒక వేదికపై చేరడమే అసలు చిక్కు. అందుకే, రానురానూ జీ20 వార్షిక సదస్సు ఫలితాలు ప్రశ్నార్థకమవుతున్నాయి. నిరుటి బాలీ సదస్సుతో పోలిస్తే తాజా సదస్సులో అగ్ర దేశాల మధ్య చీలికలు పెరిగాయి. దానివల్ల సదస్సు ప్రధాన అజెండా పట్టాలు తప్పకుండా భారత్ సంక్లిష్ట దౌత్యవిన్యాసంతో సమతూకం సాధించడం విశేషం. అలాగే, ఉక్రెయిన్ వ్యవహారంలో రష్యాపై ఆంక్షల లాంటివి సమర్థించడంలో దక్షిణార్ధగోళానికి సమస్యలున్నాయని పాశ్చాత్య ప్రపంచం గుర్తించింది. అందుకే, ఆ అంశంపైనే పట్టుబట్టి కూర్చోలేదు. రష్యా కన్నా చైనాతో పెను ముప్పు అని గ్రహించిన అమెరికా చివరకు దక్షిణార్థగోళ దేశాల మాట ఆలకించేందుకు భారత్‌తో నడిచింది. నిజానికి, వరుస ప్రకారమైతే జీ20 సదస్సు మన దేశంలో 2022లో, ఇండొనేషియాలో 2023లో జరగాలి. కానీ, ఇండొనేషియాను మన పాలకులు మెత్తగా ఒప్పించి, ఢిల్లీ స్థానంలో ముందుగా బాలీలో సదస్సు జరిపించారు. సార్వత్రిక ఎన్నికలకు వీలైనంత దగ్గరగా, ఈ ఏడాది మన వద్ద ఈ అంతర్జాతీయ సంబరం జరిగేలా చూడగలిగారు. అదెలా ఉన్నా ఈ సదస్సును దేశానికి గర్వకారణంగా చూపి, సానుకూల ఫలితాల దిశగా మలుచుకోవడంలో మనవాళ్ళు సఫల మయ్యారు. ఏడాది కాలంలో కేంద్ర పాలకులు దేశవ్యాప్తంగా 60కి పైగా పట్నాల్లో, 200కు పైగా సమావేశాలు జరిపారు. సాధారణంగా సామాన్యులకు సంబంధం లేని వ్యవహారంగా అనిపించే సదస్సును సైతం తెలివిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. ఈ సదస్సు విజయాన్ని వచ్చే ఎన్నికల్లో సహజంగానే మరింత వాడుకుంటారు. అయితే, సహకార సమాఖ్య విధానాన్నీ, ప్రత్యర్థి పక్షాల మధ్య ద్వైపాక్షికతనూ నమ్మడం వల్లే ఈ సదస్సు ఘనత సాధ్యమైందని సర్కారు వారి మాట. దేశంలోని ప్రతిపక్షాలను కలుపుకొనిపోని వారి నోట ఈ మాట రావడం విడ్డూరమే. సహకార సమాఖ్య లాంటివి పెద్దలు నిజంగా నమ్ముతున్నదీ లేనిదీ నవంబర్ చివర 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ నియామకం, సంఘం నియమావళి ఖరారు వేళ తెలుస్తుంది. ఏమైనా, ఐరాస సర్వప్రతినిధి సభ దాదాపు అచేతనంగా మారిన పరిస్థితుల్లో జీ20 మరింత చొరవ తీసుకోవాలని పరిశీలకుల భావన. అందుకే, ఉక్రెయిన్ యుద్ధ సమస్యలు, పర్యావరణ సంక్షోభానికి కారణమైన శిలాజ ఇంధనాలపై చర్యలు చర్చించకుండానే సదస్సు ముగిసిపోవడంతో నిరుత్సాహపడుతున్నారు. కానీ, సభ్యదేశాల మధ్య సంక్లిష్టతలతో ఆ ఘనత ఒక్క భారత్ చేతు ల్లోనూ లేదని గ్రహించాలి. మొత్తం 19 దేశాలు, యూరోపియన్ యూనియన్‌తో కూడిన జీ20 తాజా ఆఫ్రికన్ యూనియన్ చేరికతో వచ్చే 2024లో బ్రెజిల్ సదస్సు నాటికి జీ21గా పలకరించనుంది. ఆ పై ఏడాది దక్షిణాఫ్రికాలో సమావేశం కానుంది. భారత్ అధ్యక్షతన సాధించిన పురోగతిని ముందుకు తీసుకువెళ్ళడానికే కాదు, అంతర్జాతీయంగా జీ20 ప్రాసంగికతను నిలపడానికీ ఆ రెండు సదస్సులూ కీలకం. ఇప్పటికైతే, ఇండొనేసియా, జర్మనీల కన్నా అనేక రెట్ల ఖర్చుతో ఢిల్లీ సదస్సు జరిగిందని ఆరోపణలు వస్తున్నప్పటికీ, ‘విశ్వగురువు’ ప్రచారం మరింత ఊపందుకున్నందుకు సంబరపడాలి. -
జర్నలిస్టు రచయిత
ప్రపంచంలోని గొప్ప రచయితల్లో కొంతమంది వృత్తిరీత్యా జర్నలిస్టులుగా పనిచేశారు. ఒక రచయిత జర్నలిస్టు అయితే తన రోజువారీ ‘స్టోరీ’లకు కథనబలాన్ని ఇవ్వగలడు. కానీ తమలోని రచయితనూ, జర్నలిస్టునూ వేరుగా ఉంచుకోవడానికే చాలామంది ప్రయత్నించారు. అనివార్యంగా ఆ రెండు పాత్రలూ కలిసిపోయే సందర్భాలు రావొచ్చు. అయితే, పూర్తి స్పృహతో తనలోని రచయితతో జర్నలిస్టును మేళవించినవాడు ట్రూమన్ కపోటి. ఆ మేళన ఫలితంగా నాన్–ఫిక్షన్ నవల ఉద్భవించింది. సాహిత్యానికి ఒక కొత్త ప్రక్రియను ‘పరిచయం’ చేసిన ట్రూమన్ కపోటి (30 సెప్టెంబర్ 1924 – 25 ఆగస్ట్ 1984) శతజయంతి సంవత్సరానికి ప్రారంభం ఇది. యూఎస్‌లోని లూసియానా రాష్ట్రంలో జన్మించిన ట్రూమన్ కపోటీ ఐదేళ్లప్పుడే బడికి నిఘంటువు మోసుకెళ్లేవాడు. ఎనిమిదేళ్ల వయసులోనే రచయిత అవుతాననుకున్నాడు. చాలామందికి జీవితం సగం ముగిసేదాకా తమకు ఏం కావాలో తెలీదు. కానీ తాను ఆ కోవలోకి చెందని ప్రత్యేక జీవినని కపోటికి తెలుసు. ‘ద న్యూయార్కర్’ సహా ఇతర పత్రికలకు పనిచేస్తూనే, కథలు రాశాడు. ఇరవైల్లోకి వచ్చేనాటికే ఆయన సెలబ్రిటీ. ‘ఆధునిక సాహిత్యపు ఆశాదీపం’ అని మెచ్చుకున్నాడు సోమర్సెట్ మామ్. ‘బ్రేక్‌ఫాస్ట్ ఎట్ టిఫనీస్’ (1958) నవలికతో కపోటి పేరు మార్మోగిపోయింది. రోజూ కనబడే చంద్రుడు కొన్నాళ్లుగా వార్తల్లో ఉన్నాడు. 1959లో రష్యా చంద్రుడి మీద దిగింది. అదే ఏడాది అమెరికాలో పెరోల్లో ఉన్న ఇద్దరు నేరస్థులు కాన్సాస్‌లోని ఒక ధనిక రైతును దోచుకోవడానికి పథకం వేశారు. ఇంట్లోకి ప్రవేశించి, యజమాని, ఆయన భార్య, వాళ్ల ఇద్దరు కౌమార కూతుళ్లను బంధించారు. తీరా నగదు రూపంలో ఏమీ దొరకదు. కేవలం సాక్ష్యంగా మిగిలిపోతారని నలుగురినీ హత్య చేశారు. అది అమెరికాలో పెను సంచలనం సృష్టించిన నేరవార్తల్లో ఒకటి. దాని ఆధారంగా ఆరేళ్ల పరిశోధన అనంతరం ‘ఇన్ కోల్డ్ బ్లడ్’ (1965) రాశాడు కపోటి. దీనికి వాడిన కథనాత్మక పాత్రికేయ టెక్నిక్‌ను ‘నాన్ఫిక్షన్ నవల’ అన్నాడు. జర్నలిజం, కథనం కలిసి కొత్త కళారూపానికి దారి తీయగలదని భావించాడు. సృష్టించే సామర్థ్యం ఉన్నప్పుడు, వాస్తవ కథనం కోసం శ్రమ పడటం దేనికి అన్న వైఖరి కొందరు రచయితల్లో ఉంటుంది. సీరియస్ రచయితల కళాత్మక స్థాయికి జర్నలిజం తగనిది అన్న అభిప్రాయమూ ఉండకపోదు. ఇదంతా కాదన్నా, ఒక మనిషి వ్యక్తిత్వాన్ని వడగట్టి రచనలోకి తేవడం అంటే చాలా రకాలుగా సిద్ధపడాలి. ‘బ్రేక్‌ఫాస్ట్ ఎట్ టిఫనీస్’ తన క్యారెక్టర్‌నే పెట్టి రాశాడని ఒకావిడ 8 లక్షల డాలర్లకు తెచ్చిన (విఫల) దావాను ఎదుర్కొన్న చేదు అనుభవం అప్పటికే కపోటికి ఉంది. పైగా, ఎంత నిజజీవిత కథనానికైనా ఊహాశక్తి లేకపోతే ప్రాణం పోయలేము. ‘లిటెరరీ ఫొటోగ్రాఫర్’లా సూక్ష్మాంశాలను మనసులోకి ఎక్కించుకోవాలి. ‘హ్యూమన్ టేప్ రికార్డర్’లా మారాలి. మరి విషయ సేకరణ ఎట్లా? తలుపులు తట్టడం సరే, వాళ్ల మనసులను మీటడం ఎలా? కపోటి ముందు ఆ ప్రాంతానికి వెళ్లి, అక్కడ కొన్నాళ్లు ఉన్నాడు. ఒక ఇంటర్వ్యూలా మాట్లాడితే అసౌకర్యం కాబట్టి, టేప్ రికార్డర్లు ఉపయోగించలేదు. వెళ్లేముందు ఒక సాధన చేశాడు: స్నేహితుడు ఓ పుస్తకంలోని పేజీలను చదివి వినిపిస్తాడు. దాన్ని కపోటి విని, తిరిగి రాసేవాడు. ‘దాదాపు 95 శాతం కచ్చితత్వం’ సాధించాడు. ఇన్ని చేసినా వార్తా కథనాలకు కాలం చెల్లిపోయే ప్రమాదం ఎక్కువ. వాస్తవ ఘటన ఒక తార్కిక ముగింపునకు వస్తే తప్ప రచనను ముగించలేం. ఈ సందర్భంలో తార్కిక ముగింపు అంటే, నేరస్థుల ఉరిశిక్ష అమలు కావడమే. రచయిత ఆ క్షణం కోసం ఎదురుచూడాలి. ‘ఇది హింస,’ అంటాడు కపోటి. ఆఖరికి 6,000 పేజీల నోట్సుతో– హంతకులు, బాధితులు, గ్రామీణ సమాజపు మనుషులు– మూడు కోణాల్లో చిత్రించిన 340 పేజీల ‘ఇన్ కోల్డ్ బ్లడ్’ తక్షణ బెస్ట్ సెల్లర్‌గా, కపోటి అత్యుత్తమ రచనగా సాహిత్య చరిత్రలో నిలిచిపోయింది. నాన్–ఫిక్షన్ నవల అనే ప్రక్రియను తాను పరిచయం చేయడం అనడం కంటే, అప్పటికే ఉన్నదాన్ని తాను అత్యున్నత స్థితికి తీసుకెళ్లానని మాత్రమే అనేవాడు కపోటి. చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవడంతో, బంధువుల ఇంట్లో పెరిగాడు కపోటి. ఎప్పుడూ వ్యాకులతతో ఉండేవాడు. ఆయన ఒంటరితనంలో స్నేహపు సెలయేరు పొరుగున ఉండే హార్పర్ లీ. అనంతర కాలంలో ‘టు కిల్ ఎ మాకింగ్‌బర్డ్’ నవలా రచయిత్రి. అందులోని ‘డిల్’ పాత్రను ఆమె కపోటి నమూనాగా తీర్చిదిద్దారు. కపోటి రచన ‘అదర్ వాయిసెస్, అదర్ రూమ్స్’లో ఇడాబెల్ పాత్రకు లీ ప్రేరణగా నిలిచారు. వారి బాల్య స్నేహం చివరిదాకా కొనసాగింది. ‘ఇన్ కోల్డ్ బ్లడ్’ క్షేత్రస్థాయి పరిశోధనలో లీ సహాయం చేశారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలు సాధించడంలో. హోమోసెక్సువల్ అని ప్రకటించుకున్న కపోటి, దాని తాలూకు తిరస్కరణను ఎదుర్కొన్నాడు. ఆ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. తన జీవితాన్ని పునర్నిర్మించుకునే అవకాశమే ఉంటే, వ్యాకులత లేకుండా చూసుకుంటానన్నాడు. ‘ఒక కథను ఎంత సహజంగా చెప్పవచ్చో ఆ రూపాన్ని రచయిత కనుక్కున్నాడనేదానికి పరీక్ష ఏమిటంటే– ఆ కథ చదివాక, నువ్వు దాన్ని ఇంకోలా ఊహించగలుగుతున్నావా లేక అది నీ ఊహను నెమ్మదించేలా చేసి, అదే సంపూర్ణమూ, అంతిమమూ అనిపిస్తోందా? ఒక నారింజ ఫలాన్ని ప్రకృతి సరిగ్గా ఎలా చేసిందో అలా’ అన్నాడు కపోటి. సాహిత్య జీవితం గురించి సరేగానీ, అరవై ఏళ్లు నిండకుండానే కన్నుమూసిన కపోటి జీవితం సంపూర్ణ ఫలమేనా అంటే చెప్పడం కష్టం! -
ఎన్నెన్ని పాపాల్... ఎన్నెన్ని శాపాల్!
చేసిన పాపాలు శాపాలై వెంటాడతాయంటారు. ఎన్నెన్ని శాపాలు మనల్ని వెంటాడుతున్నాయో లెక్కవేసి చూశారా బాబుగారూ ఎప్పుడైనా? ఎన్టీ రామారావు గుర్తున్నారా? ఎలా మరిచిపోగలరు? ఈమధ్యనే పురందేశ్వరి కుటుంబంతో కుదిరిన రాజీకి గుర్తుగా సహకుటుంబస్య ఓ చెల్లని బిళ్లను ఆవిష్కరించారు గదా! ఆయనకు మీరూ, మీ సహ నిందితుడైన పత్రికాధిపతి జాయింటుగా చేసిన నమ్మకద్రోహం గుర్తున్నదా? పొడి చిన వెన్నుపోటు జ్ఞాపకమున్నదా? ఆయన చేసిన ఆర్తనాదాలు, పెట్టిన శాపనార్థాలు జ్ఞాపకమున్నాయా? ఆలస్యమైనా సరే ఏ జన్మలో చేసిన పాపపుణ్యాల ఆవర్జా ఖాతాలను ఆ జన్మలోనే ముగించాలి. ఇది మీ సహనిందితునికి కూడా వర్తిస్తుంది. వంగవీటి మోహనరంగారావు గుర్తున్నారా? కోస్తాంధ్ర నడిగడ్డ మీద ఆయన పొందిన ప్రజాదరణ ఎప్పుడైనా జ్ఞాపకమొస్తున్నదా? అది మీకు కంటగింపుగా మారడం నిజం కాదా? హరిరామజోగయ్యను అడగండి చెబుతారు. మల్లెల బాబ్జీ కూడా తెలుసు కదా! డేర్ డెవిల్ జర్నలిస్ట్ పింగళి దశరథరామ్ గుర్తే కదా! ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరావు తెలిసినవాడే కదా! ఇటువంటి వారి ఆత్మలు కూడా ఎవరినో శపించాయనీ, ఆ శాపాలు లక్ష్యసాధన కోసం ఈ గాలిలో తిరుగుతూనే ఉన్నాయని ఆంధ్ర ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. తొలివిడత తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిత్వ కాలంలో వ్యవసాయం దండగ అనేది బాబు ఫిలాసఫీ. అందుకు అనుగుణమైన విధానాలు అవలంబించిన ఫలితంగా తెలుగు నాట పంటపొలాలన్నీ మృత్యు బీళ్లుగా మారిన సంగతి ఆయన కూడా మరిచిపోయి ఉండరు. ఆ కాలంలో వేలాదిమంది రైతులు ఉరితాళ్లకు వేలాడారు. మరికొన్ని వేలమంది పురుగుల మందును ఆశ్రయించారు. వారి కుటుంబాలు ఎంత క్షోభించాయో, ఎంత రోదించాయో, ఎంత శపించాయో ఆయనకెట్లా తెలుస్తుంది? తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చేయలేదు. రైతు ఉద్యమాన్ని రక్తసిక్తం చేసిన బషీర్‌బాగ్ దారుణం గుర్తున్నదా బాబూ! మీ సర్కార్ తుపాకుల గర్జనకు నేలకొరిగిన రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వాముల కుటుంబాలనడగండి, మిమ్మల్ని ఏమని దీవిస్తారో? క్షతగాత్రులైన డజన్లకొద్దీ యువతీ యువకులను అడగండి, వారు ఎలుగెత్తి మిమ్మల్ని ఏమని సంబోధిస్తారో! మీ ప్రభుత్వం చేసిన కాల్దరి కాల్పుల అమానుషత్వానికి రైతులు చేసిన హాహాకారం మీ చెవుల్లో ప్రతిధ్వనించడం లేదా? నాగరికతకే మాయని మచ్చను తెచ్చిన ఉదంతం కాల్‌మనీ సెక్స్ రాకెట్. మహిళలకు అప్పులిచ్చి సమయానికి చెల్లించని వారిపై లైంగిక దాడులకు పాల్పడిన కీచకస్వామ్యానికి కర్తకర్మ క్రియలైన దుర్మార్గులను శిక్షించడానికి బదులు వారికి మీరు వీరతాళ్లు వేసి సత్కరించారు. బాధిత కుటుంబాలు శపించకుండా ఎట్లా ఉంటాయి. నయీమ్ అనే రాక్షసుడికి ప్రాణప్రతిష్ఠ చేసి, గిట్టని వారి మీదకు, ఉద్యమకారుల మీదకు అతడి ముఠాను ఉసిగొల్పిందెవరు? మనకేమీ సంబంధం లేదా బాబు గారూ? కానీ అతని బాధితులైన వందలాది కుటుంబాల వారు ఇప్పటికీ నయీమ్‌తోపాటు మిమ్మల్ని కూడా స్మరించుకుంటున్నారు. మీ అమానుష పాలనలోని కొన్ని మచ్చుతునకలు మాత్రమే ఇవి. ఇక అవినీతి కథలు కోకొల్లలు. వచ్చిన ప్రతి అవినీతి కథనూ వెంటనే కంచికి పంపడంలో బాబు ప్రావీణ్యం సాధించారు. కానీ ఇప్పుడు కంచి హౌస్‌ఫుల్. ఎప్పటికప్పుడు కథల పంచనామా జరిగి తీరవలసిందే! ఇప్పుడు బాబును అరెస్టు చేసిన కేసులో తాను దొంగతనం చేసినట్టు ఆయనకు తెలుసు. అన్ని ఆధారాలతో సహా దొరికి పోయానని కూడా తెలుసు. కానీ అలవాటు ప్రకారం ఆయన బుకాయింపులనే ఆశ్రయించారు. అవినీతికి సంబంధించిన ఆరోపణలను ఎదుర్కోవడంలో ఆయనకు ఒక విజయవంత మైన వ్యూహం ఉన్నది. యెల్లో మీడియా సహకారంతో ఒళ్లంతా నోరు చేసుకొని అదిలించడం, బెదిరించడం మొదటిదశ. ఆరోపణలు చేసినవారు విజయవంతంగా ఈ దశను దాట గలిగితే తనకున్న వ్యవస్థల నియంత్రణా నైపుణ్యాన్ని వెలికి తీస్తారు. న్యాయస్థానాల్లోనూ, దర్యాప్తు సంస్థల్లోనూ కేసు కదలకుండా ఉండేందుకు స్టే భిక్షను యాచిస్తారు. ఈ విధంగా సాఫీగా సాగిపోతున్న ఆయన అవినీతి జీవనయాత్రకు సడన్‌గా ఒక పెద్ద కుదుపు. వాములు మింగే స్వామికి గడ్డిపోచ ఫలహారం అంటారు. మన స్కాములు మింగే స్వామికి రెండు ఫలహారం గడ్డిపోచలే గొంతుకు అడ్డంపడి బండారం బయటపెట్టాయి. అలా బయట పెట్టింది కూడా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలేనన్న విషయం ఇక్కడ గమనించాలి. ఒక స్కామ్‌ను ఇన్‌కమ్‌ట్యాక్స్ వారు పట్టు కున్నారు. ముంబైలో మనోజ్ వాసుదేవ పార్థసాని అసోసియేట్స్ సంస్థలో వారు వేరే కేసులో సోదాలు చేస్తుండగా ఈ తీగ దొరికింది. అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణం కాంట్రాక్టును దక్కిచుకున్న షాపూర్జీ పల్లోంజి సంస్థకూ, ముఖ్యమంత్రికీ మధ్య ఈ పార్థసానిది బ్రోకరేజీ పాత్ర. అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి 600 కోట్ల కాంట్రాక్టును ఇచ్చినందుకు గాను 119 కోట్ల రూపాయలను ముడుపులుగా షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేర్చినట్టు ఐటీ వారికి పక్కా ఆధారాలు దొరికాయి. దాంతో వారు బాబుకు నోటీసులు పంపించారు. ఈ కేసులో కూడా బాబు స్పష్టమైన సమాధానం చెప్పకుండా బుకాయించడాన్ని చూస్తూనే ఉన్నాం. కానీ, కేసు నుంచి బయటపడటం బాబుకు సాధ్యం కాకపోవచ్చు. చంద్రబాబు అరెస్టయిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పట్టపగటి నిలువు దోపిడీతో సమానం. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉపాధి కోసం శిక్షణ ఇవ్వాలని సంకల్పిస్తున్నట్టు ఒక జీవోను విడుదల చేశారు. ఇందుకోసం జర్మనీకి చెందిన సీమెన్స్ అనే మల్టీనేషనల్ సంస్థతో రాష్ట్ర విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకున్నట్టు జీవోలో పేర్కొన్నారు. కానీ జీవోలో చెప్పిన దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) అనే కొత్త సంస్థను విద్యాశాఖకు బదులుగా రంగంలోకి దించారు. సీమెన్స్, ఎస్డీసీ, డిజైన్ టెక్ అనే సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరినట్టు ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం 3,300 కోట్ల రూపాయల విలువైన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు 90 శాతం నిధులు గ్రాంట్–ఇన్–ఎయిడ్‌గా సీమెన్స్ అందజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పదిశాతం సమకూరిస్తే చాలు. ఒక ప్రైవేట్ సంస్థ మన దగ్గర స్కిల్ డెవలప్మెంట్ కోసం మూడు వేల కోట్లు ఉదారంగా ఇవ్వడమేమిటని ఆశ్చర్యపోవద్దు. స్కామ్లంటేనే ఇలాంటి అనేక ఆశ్చర్యాలుంటాయి. సీమెన్స్ నుంచి ఒక్క పైసా విడుదల కాకుండానే రాష్ట్ర ప్రభుత్వం డిజైన్‌టెక్ కంపెనీకి తన వాటా పది శాతంతోపాటు జీఎస్టీ కలిపి రూ.371 కోట్లను విడుదల చేసింది. అయితే ఈ ఫైలుపై సంతకం చేయడానికి నాటి ఛీఫ్ సెక్రెటరీ ఐవైఆర్ కృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి పీవీ రమేశ్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒప్పందం ప్రకారం సీమెన్స్ నుంచి నిధులు విడుదలైతే, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను నిష్పత్తి ప్రకారం విడుదల చేయాలి. ఇది ఆనవాయితీ. కానీ ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్‌చేసి విడుదల చేయాలని చెప్పడంతో సీఎస్ ఆ విషయాన్ని స్పష్టంగా ఫైల్‌పై పేర్కొని విడుదల చేశారు. ఇంత కంటే స్పష్టమైన ఆధారం ఏముంటుంది? సీమెన్స్‌తో ఒప్పందం ఒక డ్రామా అని రుజువైంది. సీమెన్స్ తరఫున ఇండియా విభాగం హెడ్‌ను రంగంలోకి దించి బాబు కథ నడిపించారు. విషయం అసలు కంపెనీకి తెలియగానే ఇండియా హెడ్ రాజీ నామా చేశారు. ఈ ఒప్పందంతో తమ సంస్థకు సంబంధం లేదని సీమెన్స్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం డిజైన్‌టెక్ సంస్థకు విడుదల చేసిన నిధుల్లో రూ.241 కోట్లు చంద్రబాబు సృష్టించిన షెల్ కంపెనీల ద్వారా సింగపూర్, దుబాయ్‌లలోని ఖాతాలకు బదిలీ చేశారు. అవి హవాలా మార్గంలో ముంబైకి చేరాయి. ఆ క్యాష్‌ను యోగేశ్ గుప్తా తీసుకుని మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందజేశారు. మనోజ్ హైదరాబాద్‌కు తెచ్చి చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అప్పగించారు. పెండ్యాల శ్రీనివాస్ జూబిలీహిల్స్ ప్యాలెస్‌కు చేర్చారు. ఐటీ కుంభకోణంలో కూడా మనకు అచ్చంగా ఇవే పేర్లు కనిపించాయి. ఐటీ నోటీసుల విషయం మీడియా ద్వారా బహిర్గతం కాగానే మనోజ్ దుబాయికి, శ్రీనివాస్ అమెరికాకు పారిపోయినట్టు సమా చారం. యోగేశ్ గుప్తా అడ్రస్ లేడు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం చంద్రబాబు అధికారంలో ఉండగానే వెలుగు చూసింది. డిజైన్‌టెక్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం 371 కోట్ల రూపాయలను చెల్లించడం కోసం పుణేలో వుండే షెల్ కంపెనీల నుంచి నకిలీ ఇన్వాయిస్లను తెప్పించింది. ఈ కుంభకోణం 2015లో జరిగింది. 2018లో పుణే షెల్ కంపెనీలపై జీఎస్టీ అధికారులు జరిపిన సోదాల్లో మన నకిలీ ఇన్వాయిస్ల భాగోతం బయటపడింది. ఈ సమాచారాన్ని రాష్ట్ర ఏసీబీకి జీఎస్టీ ఆధికారులు చేరవేశారు. ఏసీబీ కూడా ఈ విష యాన్ని అప్పటి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. కానీ సీఎం మౌనాన్ని అర్థం చేసుకున్న ఏసీబీ ఈ కేసులో ముందుకు వెళ్లలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌ను వెలుగులోకి తెచ్చాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగి కొన్ని అరెస్టులు చేసింది. 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి అనుమతి నిరాకరిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్న ఘటన పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ‘నన్ను అరెస్టు చేస్తారట. ప్రజలంతా నా చుట్టూ రక్షణగా నిలబడా’లంటూ అప్పట్లో బహిరంగ సభల్లో చంద్రబాబు విజ్ఞప్తులు చేయడం కూడా తెలిసిందే. అప్పుడు రాష్ట్రంలో చంద్రబాబే ముఖ్యమంత్రి. అప్పుడున్న ఆరోపణల కొనసాగింపే ఈ రోజున జరిగిన పరిణామం. దీనికి రాజకీయ రంగు పులిమి జగన్ ప్రభుత్వ కక్షసాధింపుగా కొందరు వ్యాఖ్యానించడాన్ని విజ్ఞతా రాహిత్యంగానే భావించాలి. రాజధాని తాత్కాలిక భవనాల నిర్మాణం, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాల్లో మాత్రమే కాదు... ఫైబర్ నెట్లో కూడా చంద్రబాబు దొరికిన దొంగ! మరో అరడజన్ స్కాముల్లో కచ్చితంగా దొరకనున్న నిందితుడు!! అందుకే ఆయన్ను అరెస్టు భయం వెన్నాడుతున్నది. ఢిల్లీ పెద్దల మద్దతు కోసం ఏడాది కాలంగా బాబు చేస్తున్న ప్రయత్నాలు కూడా అందుకే! ఎన్టీఆర్ కూతురే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా ఉన్నందున అవసరమైతే ఆ సాకుతో తన పార్టీని విలీనం చేస్తానన్నంత దాకా చంద్రబాబు వెళ్లినట్టు సమాచారం. ఈ బిస్కట్తోనే దగ్గుబాటి కుటుంబాన్ని ఆయన దారిలోకి తెచ్చుకున్నట్టు వినికిడి. చంద్రబాబు మాటలు నమ్మి ఎన్నిసార్లు మోసపోయినా మళ్లీ మళ్లీ సరికొత్తగా మోసపోవడమే దగ్గుబాటి కుటుంబం ప్రత్యేకత కాబోలు. ఢిల్లీ రాయబారం సీన్ పండ లేదమో! మొన్నటికి మొన్న కూడా బహిరంగ సభల్లో ‘నన్ను అరెస్టు చేస్తారట తమ్ముళ్లూ’... అంటూ మొరపెట్టుకున్నారు. ‘నేను నిప్పులా బతికినవాడిని. నన్నెవరూ తాకలేర’ని బీరాలు పోవడం కూడా చూశాము. నిప్పు కథలూ, పప్పు కథలూ నెమ్మదిగా క్లైమాక్స్‌కు చేరుకుంటున్నాయి. ఈ కేసులో చంద్రబాబు, అచ్చెన్నాయుడులతోపాటు లోకేశ్ పాత్రపై కూడా దర్యాప్తు అధికారులు కీలక సాక్ష్యాలు సేకరించారు. ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్మెంట్ కుంభకోణాల్లో కూడా లోకేశ్ పాత్ర సందేహాలకు అతీతంగా రుజువైనట్టు విశ్వసనీయ సమాచారం. నేడో రేపో చినబాబు అరెస్టు కూడా తప్పకపోవచ్చు! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
సంపన్న దేశాల కర్తవ్యం
నేటి నుంచి ప్రారంభం కాబోయే రెండు రోజుల జీ–20 శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ సర్వసన్నద్ధమైంది. ఈ చరిత్రాత్మక సమావేశాలకు వివిధ దేశాధినేతలతోపాటు తరలివచ్చే వారి మంత్రులు, ఉన్నతాధికార గణం, వేలాదిమంది సిబ్బందితో దేశ రాజధాని నగరం సందడిగా మారింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తదితరులు ఢిల్లీ చేరుకున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 85 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలు జీ–20లో సభ్యదేశాలుగా ఉన్నాయి. భారత్‌కు అధ్యక్ష హోదా వంతులవారీగా వచ్చిందే కావొచ్చుగానీ, వచ్చిన సమయం అత్యంత కీలకమైనది. కరోనా మహమ్మారి పర్యవసానంగా ప్రపంచం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అంతో ఇంతో కోలుకుంటుండగా ఉక్రెయిన్‌లో రష్యా మొదలెట్టిన దురాక్రమణ యుద్ధం మరింత కుంగదీసింది. పైకి రష్యా, ఉక్రెయిన్ల మధ్య పోరుగా కనబడుతున్నా అక్కడ వాస్తవంగా తలపడుతున్నది అమెరికా, రష్యాలే. ఇటు అమెరికా–చైనాల మధ్య తీవ్ర వైరుధ్యాలు న్నాయి. చైనాకూ మనకూ మధ్య ఉన్న సమస్యలు సరేసరి. సరిహద్దుల్లో ఏదో సాకుతో గిల్లికజ్జాలకు దిగటం, కొత్త మ్యాప్‌లు ముద్రిస్తూ కవ్వించాలని చూడటం చైనాకు రివాజైంది. ఈ సమస్యలేవీ జీ–20లో ప్రస్తావనకు రాకున్నా, ఎజెండాలో ఈ అంశాలే లేకున్నా, వాటి నీలినీడలు శిఖరాగ్ర సదస్సుపై పడకతప్పదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ సమావేశాలకు హాజరు కాబోరని ఆ దేశం ప్రకటించింది. ఉక్రెయిన్ విషయంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్ నేపథ్యమే ఇందుకు కారణం. ఇక అమెరికాతోపాటు మనపైనున్న కంటగింపు పర్యవసానంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ముఖం చాటేశారు. ఆయన బదులు పెద్దగా అధికారాలు లేని ప్రధాని లీ కియాంగ్‌ను ఆ దేశం పంపుతోంది. ప్రపంచ ఆర్థిక, ద్రవ్య సంబంధ అంశాలతోపాటు మారిన కాలానికి అనుగుణమైన నియంత్రణ వ్యవస్థలను అమల్లోకి తీసుకురావటం, వాతావరణ సమస్యలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలు, కార్పొరేట్ దిగ్గజ సంస్థలపై విధించే పన్నులు, బహువిధ అభివృద్ధి బ్యాంకులను వర్తమాన అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దటం వంటి అంశాలు జీ–20లో ప్రధానంగా చర్చకు రాబోతున్నాయి. వీటన్నిటిపైనా ఎంతవరకూ ఏకాభిప్రాయం కుదురుతుందో, శిఖరాగ్ర సమావేశాల అనంతరం సంయుక్త ప్రకటన వెలువడేందుకు ఏమాత్రం అవకాశం ఉంటుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ‘ఒకే భూమి – ఒకే కుటుంబం – ఒకే భవిష్యత్తు’ మకుటంతో నిర్వహిస్తున్న ఈ శిఖరాగ్ర సదస్సు విజయ వంతమైతే ఆ కీర్తిప్రతిష్ఠలు మనకే దక్కుతాయి. అయితే దేశాలు చీలికలు పేలికలుగా విడిపోయిన వర్తమాన యుగంలో అదెంతవరకూ సాధ్యమో చెప్పలేం. మారిన అంతర్జాతీయ పరిస్థితులు ఐక్యరాజ్యసమితి మొదలుకొని డబ్ల్యూహెచ్ఓ, డబ్ల్యూటీవో వరకూ అనేకానేక వేదికలపై ప్రతిబింబిస్తున్నప్పుడు జీ–20 వాటికి భిన్నంగా ఉండాలనుకోవటం అత్యాశే కావొచ్చు. కానీ సామరస్యత కోసం ప్రయత్నించటం కొనసాగాలి. రష్యా, చైనా ఒక పక్క– అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి సంపన్న దేశాలు మరో పక్క మోహరించివున్న ప్రస్తుత వాతావరణంలో పేద దేశాల స్వరాన్ని గట్టిగా వినిపించాల్సిన చారిత్రక అవసరం ఎంతో ఉంది. ధనిక, బీద దేశాలకు సభ్యత్వం ఉండి, వాటిమధ్య సంభాషణలు సాగే అతి తక్కువ అంతర్జాతీయ వేదికల్లో జీ–20 ఒకటి. అగ్ర దేశాల పంచాయతీకే ఈ సంస్థ పరిమితమైతే పేద దేశాల సమస్యలకు చోటుండదు. పేద దేశాల సమస్యలు సాధారణమైనవి కాదు. ఇన్నేళ్లూ అభివృద్ధి పేరుతో, లాభార్జనే ధ్యేయంగా ధనిక దేశాలు విచ్చలవిడిగా వినియోగించిన శిలాజ ఇంధనాల కారణంగా వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరిగి భూగోళం వేడెక్కింది. ఇందువల్ల దక్షిణార్ధ గోళంలో ఉన్న పేద దేశాలకే అధిక నష్టం సంభవిస్తోంది. వచ్చే నవంబర్ నెలాఖరులో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యాన దుబాయ్‌లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సీఓపీ) సదస్సు జరగబోతోంది. పర్యావరణ సమస్యలన్నీ అక్కడే చర్చించవచ్చునని ధనిక దేశాలు తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు. దీన్ని సాగనీయకూడదు. 2021లో రోమ్‌లో జీ–20 శిఖరాగ్ర సదస్సు జరిగినప్పుడు ‘అర్థవంతమైన చర్యల ద్వారా భూగోళానికి ముప్పు కలగకుండా చూస్తామనీ, విదేశాల్లోని బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కర్మాగారాలకు ఆర్థిక సాయం అందకుండా చూస్తామ’నీ ధనిక దేశాలు హామీ ఇచ్చాయి. ఈ వాగ్దానంలో ధనిక దేశాల్లోని కర్మాగారాల ఊసు లేదు. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి రికార్డు స్థాయికి చేరింది. వర్తమాన సంవత్సరంలో ఈ రంగంలో పెట్టు బడులు ఎన్నడూ లేనంతగా 15,000 కోట్ల డాలర్లకు చేరుకున్నాయని అంచనా. అంటే రోమ్‌లో చేసిన బాసలకు విలువే లేదన్న మాట. దీనిపై ప్రస్తుత సదస్సులో నిలదీయాలి. జీ–20 సభ్యత్వంలోనూ ఎన్నో తిరకాసులున్నాయి. నూతన ఆర్థిక శక్తిగా ఎదగటం మాట అటుంచి, కనీసం 20 ఉన్నత స్థాయి ఆర్థిక వ్యవస్థల్లో కూడా ఒకటిగా లేని అర్జెంటీనాకు సంస్థలో సభ్యత్వం ఉంది. పోర్చుగల్, ఈజిప్టు వంటి దేశాలకు చోటులేదు. ఒక సంస్థగా చెప్పుకోదగిన విజయాలు ఎందుకు సాధించలేదో, అందుకు అడ్డుపడుతున్నవేమిటో జీ–20 ఆత్మవిమర్శ చేసుకోవాలి. భవిష్యత్తరాలకు సురక్షితమైన భూగోళాన్ని అప్పగించాలంటే సంపన్న దేశాలుగా తాము చేయాల్సిందేమిటో అమెరికా, రష్యా, చైనా తదితర దేశాలు ఆలోచించాలి. అంతర్జాతీయ సంబంధాలు ఛిద్రమైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తలకిందులయ్యే ప్రమాదం ఉంటుందని గుర్తెరిగి ధనిక దేశాలు బాధ్యతగా మెలగాలి.