Editorial
-
పార్లమెంట్ ‘ప్రత్యేక’ రహస్యం
ప్రత్యేకం అంటేనే సాధారణమైన దానికి భిన్నమైనది, వేరైనది అని నిఘంటవుల అర్థం. మాటలోనే ఉన్నట్టుగా ఈ నెల 18 నుంచి 22 దాకా జరగనున్న పార్లమెంట్ ఉభయసభల ప్రత్యేక సమావేశాలు అనేక రకాలుగా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. వర్షాకాల సమావేశాలు ముగిసి, 3 వారాలైన కాక ముందే ప్రభుత్వం మళ్ళీ ప్రత్యేక భేటీ ప్రకటన చేయడం ఒక ప్రత్యేకతైతే... హఠాత్తుగా ఈ భేటీ ఎందుకు జరుపుతున్నదీ అజెండా చెప్పకపోవడం మరో ప్రత్యేకత. ఉమ్మడి పౌరస్మృతి, ‘ఒకే దేశం – ఒకేసారి ఎన్నికల’ చట్టం, దేశం పేరును ‘ఇండియా’ నుంచి ‘భారత్’గా మార్చడం, మహిళా రిజర్వేషన్లు... ఇలా పలు ఊహాగానాలు వినిపిస్తున్నా పాలకపక్షం నోరు మెదపక ప్రతిపక్షాలను ఊహల్లో, అనుమానాల్లో పెట్టడం మరింత ప్రత్యేకత. ఇది అన్యాయమని విపక్షాలు ఆక్రోశిస్తున్నాయి. ఆగస్ట్ 31నే ప్రత్యేక భేటీ ప్రకటన చేసిన ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష నేత తాజాగా లేఖ రాసినా, రాజకీయాలు చేస్తున్నారంటోంది. వెరసి ప్రత్యేక భేటీ దేనికనే ఉత్కంఠ పెరుగుతోంది. గతంలో 2019 ఆగస్ట్‌లో వర్షాకాల సమావేశాల్లో అజెండాలో లేకుండానే హఠాత్తుగా ఆర్టికల్ 370 రద్దును సభలో తెర మీదకు తెచ్చి, ప్రతిపక్షాల చేష్టలుడిగేలా చేసిన చరిత మోదీ సర్కార్‌ది. మరి ఈ సారి ఎలాంటి రాజకీయ గూగ్లీ విసిరి, వచ్చే 2024 ఎన్నికలకు కొత్త కథనంతో ముందుకు వస్తారన్నది ఆసక్తి రేపుతోంది. సహజంగానే విపక్షాల్లో ఆందోళన పెంచుతోంది. ప్రత్యేక సమావేశా లనే మాటే రాజ్యాంగ నిబంధనల్లో లేదు గనక, వాటి అజెండా ఏమిటన్నది ముందుగా చెప్పాలన్న రూలూ కనిపించదు. కానీ, గతంలో పార్లమెంట్ ప్రత్యేక భేటీని ప్రకటించినప్పుడల్లా ఆ రోజునే సమావేశాల అజెండానూ ప్రకటించడం ప్రభుత్వాలు పాటిస్తూ వస్తున్న సంప్రదాయం. ఇప్పుడు దాన్ని కూడా పాలకపక్షం తుంగలో తొక్కుతోందన్నది ప్రధాన ఆరోపణ. ఇలా జరగడం ఇదే తొలిసారని రాజ్యాంగ నిపుణులూ నిర్ధరించారు. అయితే, సమస్త పార్లమెంటరీ సంప్రదాయా లకూ తిలోదకాలిస్తున్న పాలకులు గద్దె మీదకు వస్తున్న కాలంలో విచారపడి ఉపయోగం లేదు. ప్రత్యేక సమావేశాల్ని నిర్వహించే అధికారం ప్రభుత్వానికి లేదని ఎవరూ అనలేరు, అనరు. కానీ, ప్రజాస్వామ్య దేశంలో అందుకు అనుసరిస్తున్న విధానం మీదే రచ్చ. నిజానికి, నిర్ణీత తేదీల్లోనే పార్లమెంట్ సమావేశం కావాలంటూ మన దేశంలో కచ్చితమైన పార్లమెంటరీ క్యాలెండరంటూ ఏమీ లేదు. ఏటా 12 నెలల వ్యవధిలో కనీసం రెండుసార్లు పార్లమెంట్ భేటీ కావాలి. జనవరి చివర్నించి మే వరకు బడ్జెట్ సమావేశాలు, జూలై నుంచి ఆగస్ట్ దాకా వర్షాకాల భేటీ, నవంబర్ – డిసెంబర్లలో శీతకాల సమావేశాలంటూ ఏటా 3 సమావేశాలన్నది చిరకాల సంప్రదాయం. అయితే, తొలి రెండు దశాబ్దాల పార్లమెంట్ చరిత్రలో లోక్‌సభ ఏటా సగటున 120 రోజుల పైచిలుకు సమావేశమైతే, గత దశాబ్ద కాలంలో అది 70 రోజులకు పడిపోవడం విషాదం. సాధారణ సమావేశాల సంగతే అలా ఉంటే, అసాధారణ భేటీతో ఒరిగేదేంటో చెప్పలేం. ప్రశ్నోత్తరాల సమయం, ప్రైవేట్ సభ్యుల చర్చ లాంటివి లేని ఈ భేటీ మే 28న మోదీ ప్రారంభించిన కొత్త పార్లమెంట్ భవనంలో జరగనుందట. చారిత్రక సంఘటనలు, మైలురాళ్ళ జ్ఞాపకార్థం భారత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగడం కొత్తేమీ కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడూ, ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమ స్వర్ణోత్సవం (1992), భారత స్వాతంత్య్ర రజతోత్సవం (1972), స్వర్ణోత్సవం (1997) వేళ అర్ధ రాత్రి భేటీలు జరిగాయి. ఒక చట్టం చేయడానికంటూ ప్రత్యేక సమావేశం జరిగింది మాత్రం 2017 లోనే! అదీ మోదీ హయాంలోనే! నాటి సర్కార్ ఉభయ సభల అర్ధరాత్రి భేటీలో జీఎస్టీ తెచ్చింది. మళ్ళీ ఇప్పుడు అజెండా వెల్లడించకుండా బుల్డోజర్ ధోరణిలో పార్లమెంట్ ప్రత్యేక భేటీ జరపాల నుకోవడమే రచ్చకు దారి తీస్తోంది. అజెండాను ప్రతిపక్షాలకు చెప్పడం ప్రోటోకాలన్నది పక్కన పెడితే, చివరకు అధికారపక్ష నేతలకూ అజెండా అస్పష్టం, దేవరహస్యంగానే మిగలడం విడ్డూరం. ప్రజాస్వామ్యంలో పాలకులు సర్వంసహా చక్రవర్తులు కాదని గుర్తించాలి. అలా ప్రవర్తించడాన్ని ప్రజలూ హర్షించరని గ్రహించాలి. అదే సమయంలో ‘వీటిపై చర్చించండి’ అంటూ నిన్న గాక మొన్న వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావించిన అంశాలపైనే లేఖలో రాయడమూ కాంగ్రెస్ తదితర విపక్షాల మేధాశూన్యతకు అద్దం పడుతోంది. ప్రభుత్వం ఎలాంటి అంశాన్ని తెరపైకి తెచ్చినా, దాన్ని సమర్థంగా చర్చించగల సన్నద్ధత లేకుంటే అది ప్రతిపక్షాల అసమర్థతే. మొన్నటి అవిశ్వాస తీర్మానంపై చర్చలోనూ విపక్షాల్లో ఆ బలహీనత బయటపడిందన్నది నిష్ఠురసత్యం. అయితే, శాసన నిర్మాణంలో అధికార, విపక్షాలు సమన్వయంతో సాగితేనే ప్రజాస్వామ్య రథం సజావుగా సాగుతుంది. ఒకరిపై మరొకరు అపనమ్మకంతో, అన్నిటికీ అనుమానంతో ఉంటే అది ఎన్నటికీ ప్రజాస్వామ్యానికి మేలు చేయదు. ఆ వాస్తవాన్ని ఇరుపక్షాలూ గౌరవించాలి. ఇప్పటికే ప్రస్తుత 17వ లోక్‌సభ చరిత్రలో మునుపెన్నడూ లేనట్టు అతి తక్కువ రోజులు సమావేశమై, అధిక భాగం వాయిదాలకే పరిమితమైన అపకీర్తిని మూటగట్టుకుంది. ఈ ప్రత్యేక సమావేశాలు అయినా అందుకు మినహాయింపు కావాలని ఆశిద్దాం. అత్యాశ అనుకున్నా అది అభిలషణీయమే. అదే జరిగితే ఇవి అక్షరాలా ‘ప్రత్యేక సమావేశాలు’గా గుర్తుండిపోతాయి. అయితే అందుకు రహస్య అజెండాలు, దాపరికాలు మాత్రం ఉపకరించవు. ఈ లోక్‌సభకు ఇవే ఆఖరి సమావేశాలు కావచ్చని కూడా ఊహాగానాలు వినిపిస్తున్న వేళ... కనీసం ఇప్పుడైనా అధికార, విపక్షాల్లో ఉన్న పార్టీలు ఆపాటి హుందాతనం చూపుతాయా అన్నది ప్రధానమైన పశ్న. -
నిజం చెబితే నేరమా?
విద్వేషాగ్నిని రెచ్చగొట్టి, విధ్వంసానికి పాల్పడి, మహిళల్ని నగ్నంగా ఊరేగించిన వారిపై కేసులు పెట్టి, ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి పాలకులకు వారాలు, నెలలు పడుతుంది. కానీ, నిజ నిర్ధారణ కమిటీలో భాగంగా వాస్తవ స్థితిని బాహ్య ప్రపంచానికి వెల్లడించి, తప్పులను ఎత్తిచూపిన పత్రికా ప్రముఖులపై కేసులు పెట్టడమైతే మాత్రం తక్షణమే జరిగిపోతుంది. ఘనత వహించిన మన మణిపుర్ పాలకుల తీరు ఇది. కేసులు మీద పడ్డ జర్నలిస్టులు చివరకు దేశ అత్యున్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తే కానీ బుధవారం తాత్కాలిక రక్షణ, సాంత్వన లభించని పరిస్థితి. ఒక్కమాటలో తెచ్చిన సమాచారం వినకుండా, ఆ సమాచారం తెచ్చిన దూతను పాలకులు కొట్టడమంటే ఇదే! ఈశాన్య రాష్ట్రంలోని ఘర్షణలపై మీడియాలో వార్తల నివేదన ఎలా ఉందన్న అంశంపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా నిజనిర్ధారణ సంఘం శనివారం వెలువరించిన నివేదిక ఇంత రచ్చకు దారి తీసింది. సదరు నివేదిక పక్షపాత వైఖరితో, తప్పుదోవ పట్టించేలా ఉందని ఆరోపిస్తూ, ఓ సోషల్ మీడియా ఉద్యమకారుడు కేసు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసు పెట్టడంతో నిజనిర్ధారణ సంఘంలోని ముగ్గురు సభ్యుల పైన, అలాగే ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడిపైన ఒకటికి రెండు ఎఫ్.ఐ.ఆర్.లు దాఖలయ్యాయి. గత నాలుగు నెలల్లో మణిపూర్‌లో పరిస్థితిపైన నోరు విప్పి మాట్లాడడానికి తీరిక లేని ఆ రాష్ట్ర సీఎంకు ఈ విషయంపై మాత్రం విలేఖరులందరినీ కూర్చోబెట్టుకొని మనసులో మాట పంచుకొనే తీరిక, ఓపిక వచ్చాయి. ఎడిటర్స్ గిల్డ్‌ను తీవ్రస్వరంతో హెచ్చరించే సాహసమూ చేశారు. నిజానికి, మెజారిటీ వర్గమైన మైతేయ్‌లకూ, మైనారిటీలైన కుకీ–చిన్‌లకూ మధ్య ఘర్షణలో మణిపుర్ మీడియా ‘మెయితీల మీడియా’గా మారి పక్షపాత వైఖరితో ప్రవర్తిస్తోందని క్షేత్రస్థాయిలో పర్యటించి ఎడిటర్స్ గిల్డ్ అందించిన నిజనిర్ధారణ సంఘం తన నివేదికలో పేర్కొంది. ఆ మేరకు భారత ఆర్మీకి చెందిన 3వ కోర్ దళం కేంద్రకార్యాలయం సహా వివిధ వర్గాల నుంచి ఫిర్యాదు లొచ్చాయనీ గిల్డ్ తెలిపింది. ఇంటర్నెట్పై నిషేధంతో మణిపుర్ నుంచి వార్తల నివేదన కష్టమైందని అభిప్రాయపడింది. మీడియా ఫేక్‌న్యూస్ అందిస్తూ, తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నట్టు కనీసం 10 సందర్భాల్లో తమ ఫ్యాక్ట్–చెకింగ్ బృందం తేల్చినట్టు వెల్లడించింది. మణిపూర్ సర్కార్ మాత్రం ఈ నివేదిక అవాస్తవమనీ, ప్రాయోజితమనీ, వండి వడ్డించినదనీ ఆరోపిస్తోంది. తగల బడుతున్న ఓ భవనాన్ని కుకీల గృహంగా పేర్కొన్నారనీ, నిజానికది ఓ అటవీ అధికారి ఆఫీసనీ, నివేదిక మొత్తం ‘కుకీ తీవ్రవాదుల’ ప్రాయోజితమనేది గిల్డ్‌పై దాఖలైన ఫిర్యాదు. ఫోటో ఎడిటింగ్‌లో ఆ పొరపాటు జరిగిందని గిల్డ్ విచారం వ్యక్తం చేసి, వివరణ ఇచ్చినా కేసులు ఆగలేదు. మరి, మే 3 నుంచి నాలుగు నెలల పైగా రాష్ట్రం తగలబడుతూ, కనీసం 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి, వేలమంది నిరాశ్రయులైనా నిమ్మకు నీరెత్తిన నీరో చక్రవర్తిని తలపిస్తున్న పాల కులపై ఎన్ని కేసులు పెట్టాలి? విధి నిర్వహణలో, శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైనా సరే నైతిక బాధ్యత వహించక కుర్చీ పట్టుకు వేళ్ళాడుతున్న సీఎంను ఏమనాలి? అందరినీ సమభావంతో చూడాల్సిన సదరు వ్యక్తే తాను ఒక వర్గానికి ప్రతినిధి అన్నట్టు నిర్లజ్జగా వ్యవహరించడాన్ని ఎలా సమర్థించాలి? ఇళ్ళు, స్కూళ్ళు, చర్చీలు తగలబడుతూ ఘర్షణలు రేగుతున్నా అంతా ప్రశాంతంగా ఉందనీ, సాధారణ పరిస్థితులు తిరిగొస్తున్నాయనీ అసత్యాలు చెబుతుంటే సిసలైన జర్నలిస్టులు ఏం చేయాలి? ఎప్పుడైనా, ఎక్కడైనా ఏకపక్షంగా వార్తలు రాస్తూ, వాస్తవాలను వక్రీకరించడం ఘోరం, నేరం. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన పత్రికారంగంలో అలాంటి పగుళ్ళు పెరిగితే, ప్రజాస్వామ్య సౌధం కుప్పకూలుతుంది. అస్సామ్ రైఫిల్స్‌పై నిరంతర దుష్ప్రచారం అందుకు చిరు ఉదాహరణ. ఘర్షణలకు సరిగ్గా రెండు నెలల ముందే కుకీ వేర్పాటువాద బృందాలతో కాల్పుల విరమణ ఒప్పందం లాంటి త్రైపాక్షిక ‘చర్యల సస్పెన్షన్’ ఒప్పందం నుంచి బీజేపీ రాష్ట్ర సర్కార్ ఎందుకు ఉపసంహరించుకుందన్నది దేవరహస్యం. ఇలాంటి వాస్తవాల్ని గిల్డ్ నివేదిక ఎత్తిచూపితే, కేసులు వేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యం? కానీ, ప్రజాస్వామ్యంలో ఆరు నెలలకు ఒకసారైనా అసెంబ్లీ సమావేశం కావాలన్న రాజ్యాంగ నిబంధనను ఉల్లంఘిస్తే తిప్పలొస్తాయని పాలకులు తంటాలు పడ్డారు. రాష్ట్రం తగలబడుతున్నా భేటీ కాని సభ గత నెలాఖరులో ఒక్కరోజే అదీ 11 నిమిషాలే సమావేశమైంది. ఎడిటర్స్ గిల్డ్ వెలువరించిన నివేదికలో అవాస్తవాలు ఉంటే ప్రభుత్వం ఆ మాటే స్పష్టం చేయవచ్చు. అసలు నిజాలేమిటో బహిరంగంగా వివరించి, ఎడిటర్ల బృందం తప్పని నిరూపించనూ వచ్చు. అంతేకానీ, క్షేత్రస్థాయి పర్యటనతో వాస్తవాల్ని బయటపెట్టేందుకు ప్రయత్నిస్తే ‘మరిన్ని ఘర్షణల్ని ప్రోత్సహిస్తున్నార’నడం సమర్థనీయం కాదు. మీడియా పనితీరుకు పరిమితం కాక, ఘర్షణలకు కారణాల్నీ గిల్డ్ పరిశీలించడమేమిటని ప్రశ్నించడమూ అర్థరహితం. పైపెచ్చు, అదే నేరమన్నట్టు క్రిమినల్ ఛార్జీలు నమోదు చేయడం ఏ రకంగానూ సరికాదు. ఈ వైఖరి అప్రజాస్వామికం, తర్కరహితమే కాదు, అక్షరాలా అధికార దుర్వినియోగం! మణిపుర్ సర్కార్ ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. ఎడిటర్స్ గిల్డ్ ప్రతినిధులపై కేసును ఉపసంహరించుకోవాలి. ముదిరిన జాతి విద్వేషాల్ని తగ్గించడమెలాగన్న దానిపై దృష్టి పెట్టాలి. ఆ అసలు సమస్యను వదిలేసి, కొసరు కథను పట్టుకొని వేళ్ళాడడం ప్రజలకూ, ప్రజాస్వామానికీ ఏ విధంగానూ మేలు చేయదు. కానీ, మన పాలకులు ఇవన్నీ చెవికెక్కించుకొనే స్థితిలో ఉన్నారా అన్నది బేతాళ ప్రశ్న. -
ఆదిత్య హృదయం
రెండు వారాల్లో రెండు ప్రయోగాలు! ఒకటి చంద్రుడి పైకి... మరొకటి సూర్యుడి గురించి! భారత శాస్త్రవేత్తలు మన అంతరిక్ష ఆకాంక్షలను మరింత ఉన్నత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఆగస్ట్ 23న చంద్రయాన్–3 ప్రయోగంతో ఇప్పటిదాకా పరిశోధనల్లో అసూర్యంపశ్యగా మిగిలిపోయిన చంద్రుడి దక్షిణ ధ్రువప్రాంతంపైకి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఉపగ్రహాన్ని పంపడం, రోబోటిక్ ల్యాండర్ విక్రమ్– రోవర్ ప్రజ్ఞాన్లు చంద్రునిపై సుతిమెత్తగా దిగడం, వాటిలో పరికరాలు పంపు తున్న అపూర్వడేటా దేశ కీర్తిప్రతిష్ఠల్ని పెంచాయి. ఆ విజయ పరంపర సాగుతుండగానే, భూమికి అతి సమీప నక్షత్రం సూర్యుడి అధ్యయనానికి భారత్ తొలిసారి ఉపగ్రహాన్ని పంపడం విశేషం. చంద్రయాన్–3తో పోలిస్తే, ‘ఆదిత్య– ఎల్1’ ప్రయోగంలో నాటకీయత తక్కువే. కానీ, సెప్టెంబర్ 2న సక్సెసైన ఈ సౌరశోధనా ఉపగ్రహ ప్రయోగం మరో 4 నెలల్లో కీలకమైన భౌమ– సౌర లాగ్రేంజ్ పాయింట్1 (ఎల్1)కు సురక్షితంగా చేరగలిగితే, ఎన్నో సౌర రహస్యాలు బయటకొస్తాయి. ఇప్పటికే చంద్రునిపై ఆక్సిజన్ జాడ సహా అనేకం కనుగొని, చంద్ర మండలం ఊహిస్తున్న దాని కన్నా ఎక్కువగానే ఆవాసయోగ్యమని మనం తేల్చాం. రేపటి శోధనలో ఆదిత్య హృదయం ఏం వెల్లడిస్తుందో ఆసక్తికరమే. దేశంలోని మరో ఆరు సంస్థల భాగస్వామ్యంతో ఇస్రో చేస్తున్న ఈ రోదసీ గవేషణతో సౌర వర్తన, అంతరిక్ష వాతావరణం, వైపరీత్యాల నుంచి మన అంతరిక్ష ఆస్తుల సంరక్షణ వగైరాలపై లోతైన అవగాహన కలగవచ్చు. అంతరిక్ష పరిశోధనలో అంతకంతకూ భారత్ ముంద డుగులు వేస్తున్నదనడానికి ఇది మరో కొండగుర్తు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’, అలాగే యూరోపియన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఈసా’లు సూర్యుడి గురించి ఇప్పటికే 20కి పైగా శాస్త్రీయ అంతరిక్ష ప్రయోగాలు జరిపాయి. అమెరికా, యూకేల సాయంతో జపాన్ సైతం తన పరిశోధక ఉపగ్రహాన్ని 2006లో ప్రయోగించింది. అయితే, మన ఇస్రో మాత్రం ‘చంద్రయాన్’ లాగానే ఈ సూర్య మండల గవేషణలోనూ తన వైన ప్రత్యేక ఆవిష్కరణలు చేయాలని నడుం బిగించింది. ముఖ్యంగా సూర్య గోళానికి వెలుపల విస్తరించి ఉండే కాంతివలయమూ, సౌర వాతావరణానికి పైభాగమైన (కరోనా); సూర్యునిలో భాగమైన వెలుగులు విరజిమ్మే ప్రకాశమండలం (ఫోటోస్పియర్); ఆ చుట్టూ వ్యాపించే, సౌర వాతా వరణానికి దిగువ ప్రాంతమైన వర్ణమండలం (క్రోమోస్పియర్); సౌర పవనాలు – వీటన్నిటిపైనా దృష్టి సారించాలని రంగంలోకి దిగింది. ‘ఆదిత్య ఎల్1’లోని శాస్త్రీయ పరికరాల ద్వారా సౌర విద్యు దయస్కాంత క్షేత్రాలనూ, వెలువడే కణ ఉద్గారాలనూ లెక్కించాలని ప్రణాళిక వేసుకుంది. తద్వారా సూర్యుడి ప్రవర్తన గురించి కొత్త అంశాలను వెలికి తీసుకురావాలనేది ప్రధాన లక్ష్యం. చంద్రయాన్ ద్వారా చంద్రుడు, వెంటనే ఆదిత్య–ఎల్1 ద్వారా సూర్యుడు, ఆ వెంటనే శుక్రుడు, అటు పైన మానవ సహిత వ్యోమనౌకతో అంతరిక్ష యానమైన ‘గగన్‌యాన్’... ఇలా వరుసగా అనేక బృహత్ యజ్ఞాలను ఇస్రో చేపడుతోంది. బుధుడి తర్వాత మనకు అత్యంత సమీపంలో ఉన్న శుక్ర గ్రహపు మేళనాన్నీ, అక్కడి వాతావరణాన్నీ అధ్యయనం చేయడం ఒక ప్రాజెక్ట్ ఆలోచనైతే, ముగ్గురు భారత వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపి, మళ్ళీ వారిని సురక్షితంగా భూమి మీదకు తీసుకు రావడం మరో ప్రాజెక్ట్ లక్ష్యం. ఇప్పటి వరకు ప్రపంచంలో 3 దేశాలు (అమెరికా, రష్యా, చైనా) మాత్రమే ఇలా మనుషుల్ని అంతరిక్షంలోకి పంపాయన్నది గమనార్హం. ఈ ప్రాజెక్టులన్నిటిలో ఇస్రో ఎంచుకున్న మార్గం ఒక్కటే – వీలైనంత తక్కువ ఖర్చులో ఉన్నత సాంకేతిక నవకల్పన! తాజా సౌరశోధననే చూస్తే– భూమి నుంచి 15 కోట్ల కి.మీ.ల దూరంలో సూర్యుడుంటాడు. మన ఆదిత్య–ఎల్1 వెళ్ళేది అందులో 15 లక్షల కి.మీ.ల దూరమే. అంటే, భూమి కన్నా ఒక్క శాతం మాత్రమే సూర్యునికి దగ్గరగా వెళుతుంది. అయితేనేం, సూర్య, భూమి రెంటి గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉండి, అందుకు తగ్గట్టు వ్యోమనౌక తిరిగేందుకు కావాల్సిన కేంద్రోన్ముఖ బలాన్నిఅందించే పరివేష కక్ష్య (హేలో ఆర్బిట్)లోని కీలకమైన లాగ్రేంజ్ పాయింట్1 (ఎల్1)లో ఈ ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. దీనివల్ల ఎక్కువగా ఇంధనం ఖర్చు కాకుండానే మన ఉపగ్రహం సౌర మండలాన్ని నిరంతరాయంగా పరిశీలించవచ్చు. భూమి నుంచి 9.9 కోట్ల కి.మీ.ల దగ్గరున్నప్పుడు కుజుడి అధ్యయనానికి గతంలో మంగళ్యాన్ చేసిన మన అనుభవమూ ఆదిత్యకు పనికొచ్చింది. ఎల్1 వైపు సాగుతున్న ప్రయాణంలో ఆదిత్య ఉపగ్రహ కక్ష్యను ఇప్పటికి రెండుసార్లు విజయవంతంగా పెంచగలిగాం. సెప్టెంబర్ 10న మూడోసారి కక్ష్య పెంపు ఉండనుంది. వెరసి, ప్రయోగం నాటి నుంచి 125 రోజులకు, అంటే సుమారు నాలుగు నెలలకు పరివేష కక్ష్యలో ఎల్1 వద్ద మన ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టే ప్రక్రియ పూర్తవుతుంది. వచ్చే అయిదేళ్ళ పాటు ఈ ఉపగ్రహం సూర్యుడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి, పంపనుంది. అంతా బాగుంటే, ఆ తర్వాత కూడా మరో పదేళ్ళ పైగానే అది పనిచేసే అవకాశం కూడా ఉందట. జ్ఞానమే సమున్నత అధికారమైన ఆధునిక సమాజంలో, దానిపై ఆధారపడ్డ ఆర్థిక వ్యవస్థలో అగ్రరాజ్యాలతో మనం దీటుగా నిలబడేందుకు అంతకు మించి ఇంకేం కావాలి! అనేక దేశాల వల్ల కాని సూర్యచంద్ర శోధనను మనం సాధించ గలగడం మన శాస్త్రవేత్తల నిర్విరామ కృషికి నిదర్శనమే! 2020 నుంచి ప్రైవేటీకరణ బాట పట్టిన భారత అంతరిక్ష విధానంతో, 360 బిలియన్ డాలర్ల ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో గణనీయ మైన వాటా దక్కించుకోవడానికీ ఇలాంటి శోధనలు, విజయసాధనలు మరింత అవసరమే! -
గైర్హాజరీ సందేశం!
అనుకున్నదే అయింది. రానున్న ‘జీ20’ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అసాధారణ రీతిలో హాజరు కాకపోవచ్చంటూ కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలు నిజమయ్యాయి. చైనా ప్రధాని లీ కియాంగ్ ఆ సదస్సుకు హాజరవుతారంటూ ఆ దేశ విదేశాంగ శాఖ సోమవారం మధ్యాహ్నం ప్రకటించింది. అధ్యక్ష, ప్రధానులిద్దరూ ఏకకాలంలో విదేశాల్లో ఉండడం, అందులోనూ ఒకే కార్యక్రమంలో ఉండడమనేది చైనా ఎన్నడూ చేయని పని గనక ‘జీ20’కి షీ గైర్హాజరు ఖాయమని తేటతెల్లమైంది. వెరసి, ‘జీ–20’ అధ్యక్ష హోదాలో భారత్ ఈ నెల 9, 10 తేదీల్లో ఆతిథ్యమిస్తున్న 18వ వార్షిక శిఖరాగ్ర సదస్సు ఇప్పుడు కొత్త కారణంతో వార్తల్లో నిలిచింది. ఇంట ఆర్థికవ్యవస్థలో ఇక్కట్లు, బయట అమెరికా – భారత్‌లతో క్షీణసంబంధాలు, పొరుగుదేశాలతో కొనితెచ్చుకున్న తగాదాల మధ్య చైనా అధినేత కావాలనే మొహం చాటేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆహ్వానించినప్పుడు వెళ్ళడానికి కొన్ని కారణాలుంటే, వెళ్ళాల్సి ఉన్నా వెళ్ళకపోవడానికి అంతకు మించే కారణాలుంటాయి. చైనా అధినేత గైర్హాజరు కథా అంతే! భారత్‌తో చైనా ద్వైపాక్షిక సంబంధాలు నానాటికీ దిగజారుతున్నాయి. లద్దాఖ్‌లో మూడేళ్ళ క్రితం సైనికుల కొట్లాట నుంచి ఇదే ధోరణి. సరిహద్దుకు ఇరువైపులా మోహరించిన సైన్యం ఉద్రిక్తతలకు అద్దంపడుతోంది. వాణిజ్యంపై విభేదాలు ఉండనే ఉన్నాయి. బద్ధశత్రువైన అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలను భారత్ పెంచు కోవడంతో డ్రాగన్‌కి పుండు మీద కారం రాసినట్టుంది. చైనాను వెనక్కినెట్టి అత్యధిక ప్రపంచ జనాభా గల దేశంగా భారత్ ఇప్పటికే ముందుకొచ్చింది. సాంకేతిక విజ్ఞానం, అంతరిక్ష శోధన, ప్రపంచ వాణిజ్యంలో పోటాపోటీ సరేసరి. ఇవి చాలదన్నట్టు ప్రామాణిక దేశపటమంటూ భారత భూభాగాల్ని కలిపేసుకున్న వక్రీకరించిన మ్యాప్‌ను చైనా తాజాగా విడుదల చేసి కొత్త రచ్చ రేపింది. చైనా అధినేత మొహం చాటేయడానికి ఇలా చాలా కారణాలే! ఈ తాజా పరిణామం చైనా – భారత సంబంధాల మెరుగుదలకు తోడ్పడదు. మరోపక్క అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో షీ సంభాషించే అవకాశం తప్పిపోతోంది. నిజానికి, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సహా పలువురు ఈ మధ్య బీజింగ్‌కు సందర్శనలు జరిపారు. అయినప్పటికీ అగ్రదేశాలైన అమెరికా, చైనాల మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంత క్షీణించి ఉన్నాయి. గత నవంబర్‌లో ఇండొ నేషియాలోని బాలిలో జరిగిన గత ‘జీ20’ తర్వాత షీ, బైడెన్లు కలసి మాట్లాడుకున్నది లేదు. ఇప్పుడు మళ్ళీ కలసి, సంబంధాలను సరిదిద్దుకొనే అవకాశాన్ని చైనా చేతులారా జారవిడుస్తోంది. బైడెన్ సైతం ఈ పరిణామంతో నిరాశకు లోనయ్యాననడం గమనార్హం. షీ ఒక్క ‘జీ20’నే కాదు, జకార్తాలో జరగనున్న ఏషియాన్ (వాయవ్య ఆసియా దేశాల సంఘం), ఈస్ట్ ఏషియా సదస్సులూ ఎగ్గొడుతున్నారు. వాటికీ చైనా ప్రధానే హాజరు కానున్నారు. 2008 నుంచి ఇప్పటి వరకు మొత్తం 16 సార్లు భౌతికంగానూ, ఒకసారి వర్చ్యువల్‌గానూ (సౌదీ అరేబియా– 2020) జీ20 సదస్సులు జరిగాయి. వాటిలో మొదటి మూడు మినహా 2010 నుంచి ఇప్పటి వరకు ఏ ఇతర సదస్సులోనూ అన్ని దేశాల అధినేతలూ పాల్గొన్న దాఖలా లేదు. అయితే, చైనా అధినేత మాత్రం ఏ జీ20 సదస్సుకూ ఇప్పటి దాకా గైర్హాజరవలేదు. కరోనా ఆంక్షలున్న రెండేళ్ళూ వర్చ్యువల్‌గానైనా హాజరయ్యారు. గత నెల దక్షిణాఫ్రికాలో ప్రధాన వర్ధమాన ఆర్థిక వ్యవస్థల బృందమైన ‘బ్రిక్స్’ సదస్సు జరిగినప్పుడూ షీ వచ్చారు. మరి, ఇప్పుడు మాత్రం తన బదులు ప్రధానిని పంపుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తన బదులు విదేశాంగ మంత్రినిపంపుతున్నట్టు ఇప్పటికే చెప్పేశారు. అధ్యక్షుడి గైర్హాజరుకు కారణాలు చైనా బయటకు చెప్పక పోయినా, ఇదంతా సహజమేనన్నట్టు భారత అధికార వర్గాలు చిత్రిస్తున్నా... విషయం మాత్రం అసాధారణమే. షీ రాజనీతి పట్ల సందేహాలు రేపుతున్నాయి. మావో తర్వాత మరే ఇతర చైనా నేతకూ లేనంతటి అధికారం షీ సొంతం. ప్రాదేశిక ప్రయో జనాల పేరు చెప్పి, తైవాన్, దక్షిణ చైనా సముద్రం సహా అన్నీ చైనావేనంటూ ఆయన అంతకంతకూ దూకుడు చూపుతున్నారు. సహజంగానే పాకిస్తాన్ లాంటి ఒకట్రెండు దేశాల్ని మినహాయిస్తే, పొరుగున మిత్రుల కన్నా ఎక్కువగా శత్రువుల్ని చేసుకున్నారు. నిజానికి, జీ20 దేశాలంటే ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బృందం. ఇంత కీలకమైనా సరే, దీని కన్నా తమ చైనా ఆధిపత్యం ఉన్న ‘బ్రిక్స్’ వగైరాల వైపే షీ మొగ్గుతున్నారనుకోవచ్చు. ఇటీవల ఆయన ప్రయాణించినదల్లా సౌదీ అరేబియా, రష్యా, సౌతాఫ్రికా లాంటి స్నేహపూర్వక స్వాగతం లభించే దేశాలకే అని విశ్లేషించవచ్చు. అటు అమెరికా, ఇటు భారత్‌లతో ఉద్రిక్తతలు తగ్గించడమూ తన షరతుల ప్రకారమే జరగాలని చూస్తున్నారనుకోవచ్చు. డ్రాగన్ బుసలు కొడుతున్నందునే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన భద్రతా కూటమి ‘క్వాడ్’లో భారత్ చేరిందని గమనించాలి. ఇక, బైడెన్‌తో ఇప్పుడు భేటీ తప్పిందంటే మళ్ళీ నవంబర్‌లో శాన్ఫ్రాన్సిస్కోలో ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు దాకా వారు కలిసే ఛాన్స్ లేదు. ప్రస్తుత చైనా వైఖరి చూస్తుంటే, అప్పుడైనా షీ హాజరవుతారన్న గ్యారెంటీ లేదు. జీ20లోనూ దేశాధి నేతలు చేయాల్సిన సమష్టి ప్రకటనకు గండికొట్టి, భారత పాలకుల విశ్వగురు ప్రచారాన్ని దెబ్బ తీశారనుకోవచ్చు. ప్రధానిని పంపుతున్నా, సదస్సులోని నిర్ణయాలకు చైనా కట్టుబడేలా చూసేందుకు సదరు వ్యక్తికి ఏపాటి అధికారం ఉంటుందో చెప్పలేం. వెరసి, షీ గైర్హాజరీ సందేశం సుదీర్ఘమైనదే! -
అభిమాన సంపన్నులు
విద్యావంతులైన వాళ్లు ఎవరైనా జీవితాంతం తమ గురువులను స్మరించుకుంటారు. మన దేశంలో గురుశిష్య పరంపర వేదకాలం నుంచి ఉంది. పాశ్చాత్య నాగరికతల్లో కూడా క్రీస్తుపూర్వం నుంచే గురుశిష్య పరంపర కొనసాగేది. విద్య నేర్పించే గురువులే లేకుంటే, ఈ ప్రపంచం ఇంకా అజ్ఞానాంధకార యుగంలోనే మిగిలి ఉండేదేమో! గురువులు లేని లోకాన్ని ఊహించుకోలేం. గురువులు ఊరకే పాఠాలను వల్లెవేయించడమే కాదు, భావితరాలను జ్ఞానసంపన్నులుగా తీర్చిదిద్దుతారు. పరోక్షంగా సమాజాన్ని మెరుగుపరుస్తారు. బడిలో చేరిన పిల్లల మీద తల్లిదండ్రుల కంటే గురువుల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో గురువుల మీద అమితమైన గురి ఉంటుంది. ‘ఎలా ఆలోచించాలో తెలిసిన వాళ్లకు అధ్యాపకుల అవసరం లేదు’ అని మహాత్మాగాంధీ అన్నారు. అయితే, అమాయకపు బాల్యావస్థలో ఆలోచనను పదునెక్కించే గురువులు అత్యవసరం. జీవితాన్ని ప్రభావితం చేసే మానవ సంబంధాల్లో గురుశిష్య సంబంధం ప్రత్యేకమైనది. లోకంలో ఎందరో ఉత్తమ గురువులు, వారు తీర్చిదిద్దిన ఉత్తమ శిష్యులు ఉన్నారు. వారందరూ గతించిపోయినా, వారి చరిత్రను జనాలు చర్వితచర్వణంగా ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు. మన పురాణాల్లోనూ గురుశిష్యుల కథలు కొల్లలుగా కనిపిస్తాయి. పురాణాల్లో దేవతలకు బృహస్పతి, రాక్షసులకు శుక్రాచార్యుడు గురువులుగా వాసికెక్కారు. అవతార పురుషులైన రామ లక్ష్మణులకు విశ్వామిత్రుడు, బలరామకృష్ణులకు సాందీపని మహర్షి గురువులుగా ఉండేవారు. పురాణ గురువుల్లో మిగిలినవారిదంతా ఒక ఎత్తు అయితే, ప్రహ్లాదుడికి పాఠాలు చెప్పిన చండా మార్కుల వారిది మరో ఎత్తు. దండోపాయాన్ని సాధనంగా ఎంచుకున్న తొలిగురువు బహుశా ఆయనే! చండామార్క వారసులైన గురువులు అక్కడక్కడా తారసపడుతుంటారు. మనుషుల్లో ఉండే వైవిధ్య వైరుద్ధ్యాలు గురుశిష్యుల్లోనూ కనిపిస్తాయి. గురువులందరూ ఉత్తములేనని, శిష్యులందరూ ఆణిముత్యాలేనని చెప్పలేం. గురువుల్లో ఔదార్యమూ, ఉదాత్తతలతో పాటే స్వార్థ సంకుచిత లక్షణాలూ కనిపిస్తాయి. గురువులు కూడా మానవ మాత్రులే! ఏకలవ్యుడి బొటన వేలును గురుదక్షిణగా కోరిన ద్రోణుడు మనకు తెలుసు. గురువుకే పంగనామాలు పెట్టిన ఆషాఢభూతి కూడా మనకు తెలుసు. గురజాడవారి ‘కన్యాశుల్కం’లోని గిరీశం ఆషాఢభూతికి ఏమీ తీసిపోయే రకం కాదు. కాకుంటే, అతగాడు గురుత్వం వెలగబెట్టాడు. గిరీశం శిష్యరికంలో వెంక టేశానికి చుట్ట కాల్చడం పట్టుబడిందే గాని, చదువు ఒంటబట్టలేదు. అయితే, మన దేశంలో వివిధ రంగాల్లో రాణించిన గురువులు, గురువులకు గర్వకారణంగా నిలిచిన శిష్యులు ఎందరో ఉన్నారు. సాహితీరంగంలో తమదైన ముద్రవేసిన గురుశిష్యులు కొందరు ఇప్పటికీ ప్రస్తావనల్లోకి వస్తుంటారు. అటువంటి గురుశిష్యుల్లో మొదటగా చెప్పుకోవల సిన వారు – తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, ఆయన శిష్యుడు విశ్వనాథ సత్యనారాయణ. వారిద్దరూ అరుదైన గురుశిష్యులు. పాండితీ ప్రాభవంలోను, కవన శైలిలోనూ ఇద్దరూ ఇద్దరే! చెళ్లపిళ్లవారి గురించి విశ్వనాథ ఒక చమత్కార పద్యం చెప్పారు. అది: ‘అల నన్నయకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం డలఘుస్వాదు... బ్రాహ్మీమయమూర్తి శిష్యు డైనా డన్నట్టి దావ్యోమపే శలచాంద్రీ మృదుకీర్తి చెళ్లపిళవంశస్వామి కున్నట్లుగన్’. నన్నయకు, తిక్కనకు తన వంటి శిష్యులెవరూ లేరని, తన గురువైన చెళ్లపిళ్ల వారికే ఆ వైభోగం, కీర్తి దక్కాయని సగర్వంగా చెప్పుకున్నారు విశ్వనాథ. అధ్యాపక వృత్తిలో కొనసాగిన విశ్వనాథకు ఎందరో ప్రత్యక్ష శిష్యులే కాకుండా, మరెందరో పరోక్ష శిష్యులూ ఉన్నారు. విశ్వనాథను శ్రీశ్రీ ‘కవికుల గురువు’గా ప్రస్తుతించడమే కాదు, ‘తెలుగువాళ్ల గోల్డు నిబ్బు’గా అభివర్ణించారు. ఒకానొక సందర్భంలో ‘నా వంటి కవి మరో వెయ్యేళ్ల వరకు పుట్టడు’ అని విశ్వనాథ అన్నారు. దీనికి ప్రతిస్పందనగా శ్రీశ్రీ ‘నిజమే! వారు పుట్టి వెయ్యేళ్లయింది’ అని వ్యాఖ్యానించడం ఒక వైచిత్రి. తొలినాళ్లలో శ్రీశ్రీపై విశ్వనాథ ప్రభావం ఉండేది. తర్వాతికాలంలో అబ్బూరి రామకృష్ణారావు శ్రీశ్రీపై ఎనలేని ప్రభావం చూపారు. అబ్బూరి వద్ద శ్రీశ్రీ నేరుగా తరగతిలో పాఠాలు నేర్చుకోకపోయినా, వారిద్దరిదీ గురుశిష్య సంబంధమే! సాహితీ లోకంలో మెరికల్లాంటి శిష్యులను తయారుచేసిన మరో గురువు పుట్టపర్తి నారాయణాచార్యులు. రాచమల్లు రామచంద్రారెడ్డి, నరాల రామారెడ్డి వంటి ఉద్దండులు ఆయన శిష్యులే! ఇక భద్రిరాజు కృష్ణమూర్తి భాషాశాస్త్ర ఆచార్యులుగా సుప్రసిద్ధులు. బూదరాజు రాధాకృష్ణ, చేకూరి రామారావు, తూమాటి దొణప్ప వంటి శిష్యులను ఆయన తీర్చిదిద్దారు. ఎందరో గురువులు ఉన్నా, శిష్యుల మనసుల్లో చెరగని ముద్రవేసే వారు కొందరే ఉంటారు. అలాంటి వారే ఉత్తమ గురువులుగా చరిత్రలో గుర్తుండిపోతారు. మన దేశానికి రెండో రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యాపకుడిగా ఎందరో శిష్యులను తయారు చేశారు. ఆయన మైసూరు విశ్వవిద్యాలయం నుంచి కలకత్తా విశ్వవిద్యాలయానికి వెళ్లేటప్పుడు ఆయనను గుర్రపు బండిలో కూర్చోబెట్టి శిష్యులే స్వయంగా బండిని లాక్కుంటూ వెళ్లి మరీ మైసూరు రైల్వేస్టేషన్లో సాగనంపారు. అదీ రాధాకృష్ణన్ ఘనత! రేపు రాధాకృష్ణన్ పుట్టినరోజు. మనకు ఉపాధ్యాయ దినోత్సవం. గురువుల ఘనతకు శిష్యుల అభిమానమే గీటురాయి! జీతంరాళ్ల కంటే శిష్యుల అభిమాన ధనమే అసలైన సిరిసంపదలుగా తలచే గురువులు ఉంటారు. అలాంటి వాళ్లే ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెస్తారు. -
కాళ్ల బేరం ఖరీదెంత?
‘నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకే గోవిందా’ అంటారు. అది ఎగిరే రాబందుల గురించి మాత్రమే. వేలాది మందిని పీడించి పిప్పిచేసిన పెత్తందారీ రాబందుల సంగతి కాదు. లక్షలాది మంది మూలుగల్ని పీల్చేసిన రాజకీయ రాబందుల విషయం కాదు. ఈ రాబందులకు ఒక్క గాలివాన చాలదు. ఇంకో ప్రచండ మారుతం కావాలి. ఝంఝానిలం పరివ్యాప్తం కావాలి. దావానలమై దహించాలి. కానీ, మొదటి గాలివాన లోంచే రానున్న ముప్పును ఆఘ్రాణించే నేర్పు వీటి నాసికలకున్నది. ఆ గ్రహింపు రాగానే వాటి రెక్కల పొగరు తాత్కాలికంగా ముడుచుకుపోతుంది. నక్క వినయాలు ఒంటబడతాయి. నంగినంగి మాట్లాడే కుటిలత్వం, వంగివంగి ప్రణమిల్లే అతి వినయం అలవాటవుతాయి. ఆతడనేక స్కాములయందు ఆరియు తేరిన వృద్ధ రాజకీయ వృకోదరుడు. మొదటి తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిత్వంలోనే అవి నీతి కేసులపై 20 స్టేలు తెచ్చుకోగలిగిన తాంత్రికుడు. రెండో దఫా ఐదేళ్ల పాలనలో మరో డజన్ స్కాములకు వ్యూహకర్త. ఈసారి లెక్క లక్షల కోట్లలో! ఎందుకో మంత్రం పారట్లేదేమో నన్న అనుమానం మొదలైంది. ముప్పు ముంచుకొస్తున్నదని ముక్కుపుటాలు హెచ్చరిస్తున్నవి. గుండె లోతుల్లోంచి తీతువు కూత వినిపిస్తున్నది. ఎక్కడో ఒక జంబూకం ఊళ వేస్తున్నది. సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త వేగంగా స్పందించారు. ఎక్కడె క్కడో తీగలు కలిపారు. ఫలితంగా సమీప బంధువుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి లభించింది. ఆమె సహకారంతో మరోసారి ఢిల్లీ ‘పవర్’ హౌస్‌లో పాదం మోపారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎదుట వంగివంగి విన్నపాలు చేసుకున్నారు. తన కంటే ఎంతో చిన్నదైన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎదుట చేతులు కట్టుకొని నిలుచున్నారు.. క్లాస్ టీచర్ ఎదుట పనిష్ మెంట్ కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్ మాదిరిగా! ఆదాయ పన్ను (ఐటీ) విభాగం ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉంటుందన్న విషయం తెలిసిందే! ఇటీవల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు చంద్రబాబుకు ఒక నోటీసు ఇచ్చారు. దీనిపై ఒక వార్త ‘హిందూస్థాన్ టైమ్స్’లో వచ్చింది. మరుసటి రోజున ‘దక్కన్ క్రానికల్’లో నోటీస్ కాపీతో సహా మరింత వివరంగా వార్త అచ్చయ్యింది. అయినా చంద్రబాబు నుంచి గానీ, ఆయన పార్టీ నుంచి గానీ ఎలాంటి స్పందనా లేదు. యెల్లో మీడియా కూడా నిశ్శబ్దాన్ని పాటిస్తున్నది. ఎందుకంటే బుకాయించడానికి ఇక్కడ ఆస్కారం లేదు. చడీచప్పుడు లేకుండా స్టే తెచ్చుకోవాలి. స్టేలు తెచ్చుకోవడంలో చంద్రబాబుది గిన్నిస్ రికార్డు. మొన్నటి నోటీసు కంటే ముందే ఐటీ శాఖ చంద్రబాబుకు ఇంకో నోటీసు ఇచ్చింది. రెండింటి సారాంశం ఒక్కటే. అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణం కోసం కాంట్రాక్టులు పొందిన ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు అందుకు ముడుపుల కింద చెల్లించిన రూ.118 కోట్లు వివిధ మార్గాల ద్వారా చంద్రబాబుకు చేరాయి. ఈ ఆదాయాన్ని చంద్రబాబు వెల్లడించలేదు. ఐటీ శాఖ వారు ముంబయ్‌లో మనోజ్ వాసు దేవ్ పార్ధసాని అసోసియేట్స్ సంస్థలో సోదా చేసినప్పుడు వారికి అనుకోకుండా చంద్రబాబు తీగ దొరికింది. ఆనవాయితీ ప్రకారం వారు చంద్రబాబుకు నోటీసు పంపించారు. తనకు ముడుపులు వచ్చాయా, లేదా అనే విషయాల జోలికి వెళ్లకుండా టెక్నికల్ అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు ఐటీ శాఖకు సమాధానం ఇచ్చారు. తనకు నోటీసు ఇచ్చిన అధికారి పరిధి లోకి తాను రాననే దబాయింపు తప్ప కేసు మెరిట్ జోలికి చంద్రబాబు వెళ్లలేదు. చంద్రబాబు తన మీద వచ్చిన అన్ని రకాల కేసుల్లోనూ ఇటువంటి టెక్నికల్ పాయింట్లను వాడు కోవడం, వ్యవస్థలను లిటిగేషన్లతో ప్రభావితం చేయడం వంటి పద్ధతుల ద్వారానే స్టేలు పొందుతూ వచ్చారు, అయితే ఈ కేసులో బాబు అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ఐటీ శాఖ రెండో నోటీసు ఇచ్చింది. ఈ 118 కోట్ల రూపాయల ముడుపులు అనేవి టిప్ ఆఫ్ ది ఐస్‌బర్గ్ మాత్రమే. వేరే కేసులో సోదాలు జరుపుతుండగా యథాలాపంగా దొరికింది మాత్రమే. దీనిమీద మరికొంత ముందుకెళ్లిన ఐటీ అధికారులకు విస్తుపోయే ఆధారాలు లభించినట్లు సమాచారం. అమరావతి తాత్కాలిక భవనాల నిర్మాణంలోనే బాబు అందుకున్న ముడుపులు వేల కోట్లలో ఉన్నాయట! వీటికి సంబంధించిన ఆధారాలన్నీ అధికారులు సేకరించారు. నోటీసులకు సంబంధించిన 118 కోట్ల రూపాయలను వెల్లడించనందుకు గాను అంతకు రెట్టింపు మొత్తాన్ని పెనాల్టీగా చెల్లించాలి. పన్నెండు శాతం వడ్డీ అదనం. ఆదాయం పన్ను శాఖ నోటీసులను గౌరవించి చంద్రబాబు ఆ పెనాల్టీని చెల్లిస్తే ముఖ్యమంత్రిగా ఉండి లంచాలను తీసుకున్నట్టు అంగీకరించినట్టే! అలా అంగీకరించినట్టయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8ఏ ప్రకారం అధికార పదవులకు అనర్హుడవుతాడు. దాంతోపాటు ఐపీసీ సెక్షన్ 409ని కూడా ప్రయోగించవచ్చు. నేరపూరిత విశ్వాస ఘాతుకానికి గాను పదేళ్ల వరకు జైలుశిక్ష ఉంటుంది. అవినీతి నిరోధక చట్టం కింద పదేళ్ల జైలు, జరిమానా వేయవచ్చు. మనీలాండరింగ్ చట్టాన్ని కూడా ప్రయోగించవచ్చు. ఈ లంచాల్లో భాగంగానే ఆయన జూబ్లీ హిల్స్ ఇంటిని నిర్మించినట్టు రుజువైతే బినామీ చట్టం కింద ఆ ఇంటి మార్కెట్ విలువలో 25 శాతం జరిమానా విధించవచ్చు. నోటీసులకు స్పందించకపోతే కూడా జైలుశిక్షకు ఆస్కారము న్నది. కనుక ముందుకు వెళ్లలేడు, వెనక్కు వెళ్లలేడు. ఇప్పుడాయ నకు కావలసింది స్టే! చంద్రబాబు, ఆయన గురువు రామోజీల తిరుమంత్రం స్టే! సాంకేతిక కారణాలు చూపి దబాయించడం రామోజీకి పెన్నుతో పెట్టిన విద్య. దాన్ని ఆయన వెన్నతో పెట్టి చంద్రబాబుకు నేర్పించారు. ఆయన ఈ కళలో పరిపూర్ణత సంపాదించి వ్యవస్థలను నియంత్రించగలగడం దాకా ఎదిగారు. తాజాగా చిట్‌ఫండ్స్ కేసులోనూ రామోజీది ఇదే వరస! చిట్‌ఫండ్స్ చట్టాన్ని రామోజీ దారుణంగా ఉల్లంఘించారని ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం ఆధారాలను చూపిస్తున్నది. రామోజీ మాత్రం చట్టాన్ని ఉల్లంఘించానని గానీ, ఉల్లంఘించలేదని గానీ చెప్పరు. ఎవరూ ఫిర్యాదు చేయందే కేసెట్లా పెడతారని వాదిస్తారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోతే చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించవచ్చనేది గురుశిష్యుల సిద్ధాంతం. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను ప్రలోభపెడుతూ చంద్రబాబు అడ్డంగా బుక్కయిన సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనతో బేరమాడుతూ చంద్రబాబు మనిషి రేవంత్‌రెడ్డి ఉన్నారు. అక్కడ డబ్బుల బ్యాగ్ చేతులు మారిన వీడియో ఉన్నది. చంద్రబాబును ఎమ్మెల్యేతో మాట్లాడించడం కోసం రేవంత్‌రెడ్డి ఫోన్ కలిపిన దృశ్యం ఉన్నది. ‘మావాళ్లు బ్రీఫ్డ్ మీ’ అన్న బాబు కంఠస్వరం వినిపించింది. అంత చక్కటి ఇంగ్లిష్ ఈ దేశంలో బాబు తప్ప ఇంకెవ్వరూ మాట్లాడలేరని కేటీఆర్ ఇచ్చిన సర్టిఫికెట్ కూడా ఉన్నది. అయినా సరే అసలు విషయాన్ని వదిలేసి ‘నా ఫోన్‌ను ఎట్లా ట్యాప్ చేస్తార’న్న బాబు దబాయింపు కూడా జ్ఞాపకం ఉన్నది. ఇదే పద్ధతిలో ఇప్పటిదాకా ఆయన ఇరవై స్టేలు తెచ్చు కున్నారు. ఆయన అవినీతి మీద ఆధారాలతో సహా లక్ష్మీపార్వతి రెండుసార్లు వేసిన కేసుల్లో రెండు స్టేలు. ఐఎమ్జీ భారత్ అనే ఠికానా లేని కంపెనీకి అత్యంత ఖరీదైన ప్రాంతంలో 850 ఎకరాలు కేటాయించిన కేసులో స్టే. ఏలేరు కేసులో అడ్డంగా దొరికిపోయి కూడా తెచ్చుకున్న స్టే. ఇంకా మద్యం ముడుపుల కేసు – వగైరాలు ఈ స్టేల జాబితాలో ఉన్నాయి. ఇప్పుడెందుకో తాజా ఐటీ కేసు కొంచెం భిన్నంగా తోస్తున్నది. ఈ నోటీసుల వ్యవహారం బయటకు రాకుండా, ఐటీ అధికారులు ఇంకా ముందుకు వెళ్లకుండా చేసేందుకు బాబు చేసిన ప్రయత్నాలు ఇప్పటివరకైతే ఫలితాలనివ్వలేదు. ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఇటువంటి ఐటీ నోటీసులు మరికొన్ని రావచ్చు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఇటువంటిదే! ఈ పేరుతో ప్రభుత్వ ఖజానా నుంచి విడుదల చేసిన 371 కోట్ల రూపాయలు వివిధ మార్గాల ద్వారా ప్రయాణం చేసి బాబు గారింటికి చేరుకున్నాయి. ఇక్కడ స్కిల్లూ లేదు, డెవలప్‌మెంటూ లేదు. ఇప్పటికే ఈడీ రంగప్రవేశం చేసి నలుగురిని అరెస్టు చేసింది. రాజధాని కుంభకోణాన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్’ అంటున్నారు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి పురాణంగా ఈ స్కామ్ చరిత్ర పుటల కెక్కబోతున్నది. ల్యాండ్ పూలింగ్, ఇన్సైడర్ ట్రేడింగ్, పూలింగ్ పరిధి నుంచి తప్పించినందుకు క్విడ్ ప్రో కో ప్యాలెస్, అసైన్డ్ కుంభకోణం, సింగపూర్ కన్సా ర్టియం... ఇలా అనేక ఉప కుంభకోణాలతో కూడిన భారీ స్కామ్ ఇది. ఈ కేసుల్లోనే ఇరుక్కున్న సింగపూర్ మంత్రి, బాబు మిత్రుడు ఈశ్వరన్ ఇప్పటికే అరెస్టయ్యాడు. ఇంకో డజన్ స్కామ్‌లు విచారణ కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. ఐటీ కేసు ముందుకు కదలడమంటే కేసుల తేనెతుట్టెను కదిలించినట్టే! కనుక అదిక్కడ ఆగాలి. స్టే మంత్రం ఫలించాలి. అందుకోసం ఏ నిర్ణయం తీసుకోవడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఆంతరంగిక సమాచారం. ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీని ఎవరూ తిట్టనన్ని తిట్లు తిట్టిన బాబు ఆ తర్వాత ఎవరూ పొగడని స్థాయిలో పొగుడుతున్న వైనాన్ని జనం గమనిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్డీఏలో చేరిపోయి బీజేపీ – జనసేనల తోడ్పాటుతో అధికారంలోకి రాగలిగితే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని బాబు భావిస్తున్నట్టు విని కిడి. బీజేపీ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థతో కేంద్రం చేయించిన సర్వేలో జగన్మోహన్రెడ్డికి 53 శాతం ఓటర్ల మద్దతు ఉన్నట్టు వెల్లడైంది. ఈ పరిస్థితుల్లో బాబు అవినీతి భారాన్ని మోయడం కంటే జనసేన – బీజేపీ కూటమిగా ఏర్పడితే 2029 ఎన్నికల నాటికి ప్రధాన ప్రత్యర్థి కూటమిగా అవతరించవచ్చని దాని ఆలోచనగా చెబుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఏ స్థాయికి తగ్గయినా సరే కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ – జనసేనలకు కలిపి 75 అసెంబ్లీ సీట్లు, 12 లోక్‌సభ సీట్లను తాజాగా ప్రతిపాదించారట. పార్టీలోని విశ్వస నీయ వర్గాల ద్వారా ఇంకా ఆసక్తికరమైన సమాచారం వినిపిస్తున్నది. ఆయన ఎంత నిస్పృహలో ఉన్నారంటే, ‘తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇస్తే, పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కూడా వెనకాడకపోవచ్చ’ని చెబుతున్నారు. ఇటువంటి దయనీయ స్థితి ఏర్పడితే దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకొని ఉన్న శ్రేణులు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
Jamili Elections: ‘జమిలి’ సర్వరోగ నివారిణా?
జమిలి ఎన్నికలపై చర్చ సద్దుమణిగిందని అనుకున్నప్పుడల్లా అది మళ్లీ మళ్లీ రాజుకోవటం ఏడెనిమిదేళ్లుగా రివాజైంది. కానీ ఈసారి ఉన్నట్టుండి అందుకు సంబంధించి తొలి అడుగుపడింది. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కమిటీ విధివిధానాలు, అందులో ఉండే నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సేవున్నా ఇండియా కూటమి సమావేశాల్లో తీరిక లేకుండా వున్న విపక్షాలకు ఇది ఊహించని పరిణామం. పార్లమెంటుకూ, అసెంబ్లీలకూ ఏకకాలంలో ఎన్నికలు జరగాలనీ, అందువల్ల ఎంతో ప్రజాధనం ఆదా అవుతుందనీ ఆ విధానాన్ని సమర్థిస్తున్నవారు చెబుతున్నారు. అంతేకాదు, తరచు ఎన్నికలవల్ల అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతున్నదని కూడా వారి వాదన. కానీ ఈ రకమైన వాదనలను కొట్టి పారేస్తున్నవారు కూడా గణనీయంగానే ఉన్నారు. అభివృద్ధి పనులకు ఎక్కడ ఆటంకం ఏర్పడిందో చూపాలని సవాలు చేస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలోనో, మరే అత్యవసర సందర్భాల్లోనో ప్రభుత్వాలను ఎన్నికల సంఘం నిరోధించిన దాఖలాలు లేవు. కాకపోతే ఓటర్లను ప్రలోభపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందటానికి ఉద్దేశించే పథకాలను మాత్రం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ప్రకటించకుండా ఆపుతున్నారు. అందువల్ల జనం నష్టపోయారని చెప్పడానికి ఎటువంటి దాఖలాలూ లేవు. దేశంలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీల ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాలను కూడా ఈ చట్రంలోకి తీసుకు రావటమే కేంద్రం ఉద్దేశం. ‘ఒకే దేశం–ఒకే ఎన్నికలు’ అన్న నినాదం కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచీ వినిపిస్తోంది. అంతక్రితం 2003లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఈ విషయంలో కొంత ప్రయత్నం చేశారు. అప్పటి కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీతో ఆయన చర్చించారు. కానీ ఎందుకనో తదుపరి చర్యలేమీ లేవు. జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలోని లా కమిషన్ సమర్పించిన 170వ నివేదిక సైతం చట్టసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇంకా వెనక్కు వెళ్తే 1983లో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈమాటే చెప్పింది. అయితే రాజ్యాంగ సవరణ, ప్రజాప్రాతినిధ్య చట్టం సవరణ, చట్టసభల నియమనిబంధనల సవరణ వగైరాలు చేయకుండా జమిలి ఎన్నికలు సాధ్యంకాదని 2018లో జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని లా కమిషన్ తన ముసాయిదా నివేదికలో అభిప్రాయపడింది. ఒక ఏడాది వేర్వేరు నెలల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలన్నిటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం ఉత్తమమని సూచించింది. దేశంలో జమిలి ఎన్నికలు 1952 నుంచి 1967 వరకూ జరిగాయి. కానీ దానికి తూట్లు పొడిచింది కేంద్రంలోని పాలకులే. అప్పటి నెహ్రూ సర్కారు 1959 జూలైలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలోని తొలి కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని 356వ అధికరణ ప్రయోగించి బర్తరఫ్ చేసింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని చక్కదిద్దేవరకూ ఆ అధికరణ దశాబ్దాలపాటు దుర్వినియోగం చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించే ధోరణి వెర్రితలలు వేసి ప్రభుత్వాలు కుప్పకూలాయి. అసెంబ్లీలు రద్దయ్యాయి. ఈ కారణాలన్నిటివల్లా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలది తలోదారీ అయింది. పాలక పార్టీలను చీల్చటం, చీలికవర్గంతో కొత్త ప్రభుత్వాలను ప్రతిష్టించటం రివాజైంది. తరచు ఎన్నికల వల్ల ఖజానాకు తడిసిమోపెడు ఖర్చు అవుతున్నదన్నది వాస్తవం. దీనికితోడు రాజమార్గాల్లో, దొంగదారుల్లో ఎన్నికల జాతరకు వచ్చిపడే వేల కోట్ల రూపాయలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయి. ఉదాహరణకు 2009 సార్వత్రిక ఎన్నికలకు ఖజానాకు రూ.1,115 కోట్లు ఖర్చ యితే, 2014 నాటికి ఇది రూ.3,870 కోట్లకు పడగలెత్తింది. ఇదంతా సర్కారుకయ్యే వ్యయం. పార్టీలూ, అభ్యర్థులూ చేసే ఖర్చు ఇందుకు ఎన్నో రెట్లు ఎక్కువుంటుంది. కానీ రోగం ఒకటైతే మందు మరొకటన్నట్టు ఈ సమస్యలకు జమిలి ఎన్నికలే పరిష్కారమని పాలకులు చేస్తున్న వాదన సరికాదు. ఎన్నికల్లో ధనప్రభావం అరికట్టడానికి ఎన్నికల సంస్కరణలు అవసరం. ఎన్నికల విశ్వసనీయత పెంచటానికి దొంగ ఓట్లను అరికట్టడం అవసరం. అలవిమాలిన వాగ్దానాలతో ప్రజలను ఆకర్షించి, అధికారంలోకొచ్చాక వంచించే పార్టీలపై చర్యలు తీసుకోవటం అవసరం. కానీ జరిగిందేమిటి? అసలే పార్టీలు వెచ్చించే కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడిదో తెలిసే అవకాశంలేని ప్రస్తుత పరిస్థితిని మరింత జటిలం చేసేలా ఎన్నికల బాండ్ల విధానానికి తెరలేపారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్ని కలు’ గొప్ప ఆదర్శంగా కనిపించవచ్చు. చూడదల్చుకున్నవారికి ఇందులో జాతీయతా భావన కూడా దర్శనమీయొచ్చు. కానీ ఎన్నికల ప్రక్షాళనకు ఇది దోహదపడేదెంత? ఇంతకూ జమిలి ఎన్నికల విధానం అమలు చేయటం మొదలెట్టాక రాష్ట్రాల్లో గడువుకు ముందే అసెంబ్లీలు రద్దు చేయాల్సివస్తే ఏం చేస్తారు? 90వ దశకంలో మాదిరే కేంద్రంలోనే అస్థిరత ఏర్పడి లోక్‌సభ రద్దు చేయాల్సివస్తే మార్గం ఏమిటి? ఇవన్నీ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఎటూ పరిశీలిస్తుంది. ఇక రెండు చట్టసభలకూ ముడివేయటంవల్ల ఫెడరలిజం దెబ్బతింటుందనేవారూ... జాతీయ అంశాల ప్రాముఖ్యత పెరిగి స్థానిక అవసరాలు, ఆకాంక్షలు మరుగునపడతాయనేవారూ ఉన్నారు. అయితే 2019లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీల ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు వెలువడిన ఫలితాలు గమనిస్తే ఇది అర్ధసత్యమే అనిపిస్తుంది. ఏదేమైనా జమిలి ఎన్నికల విధానంపై విస్తృతమైన చర్చకు చోటిచ్చి, అందులో వ్యక్తమయ్యే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి అడుగులు వేయాలి. తొందరపాటు పనికిరాదు. ఇది కూడా చదవండి: Arunachal Pradesh: మ్యాపులతో మడతపేచీ -
Arunachal Pradesh: మ్యాపులతో మడతపేచీ
నోటితో మాట్లాడుతూ, నొసటితో వెక్కిరించడమంటే ఇదే. భారత్‌తో స్నేహసంబంధాలకు కట్టుబడి ఉన్నట్టు తీయటి కబుర్లు చెప్పే చైనా తన వక్రబుద్ధిని మరోసారి వెల్లడించుకుంది. సోమవారం నాడు సరికొత్త అధికారిక ‘ప్రామాణిక పటం’– 2023 విడుదల చేస్తూ, అందులో భారత్‌లోని పలు ప్రాంతాల్ని తమ దేశంలో భాగమన్నట్టు చూపింది. భారత ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్‌చిన్‌లను తన భూభాగాలంటోంది. మొత్తం తైవాన్, వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని కూడా ఈ కొత్త జాతీయ పటంలో తమ అంతర్భాగమనేందుకు చైనా తెగించింది. దాదాపు పొరుగు దేశాలన్నిటికీ కోపం తెప్పించడమే కాక, మరోసారి కయ్యానికి కాలు దువ్వింది. పైపెచ్చు, అంతా సవ్యంగానే ఉన్నదన్నట్టు ‘‘జాతీయ సరిహద్దులను గీయడంలో చైనాతో పాటు వివిధ దేశాలు ఉపయోగించే పద్ధతి ఆధారంగా’’నే ఈ పటాన్ని రూపొందించినట్టు డ్రాగన్ ప్రకటించుకోవడం విచిత్రం. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ ఖండిస్తుంటే, బీజింగ్ మాత్రం మ్యాప్‌ల విడుదల నిత్య కృత్యమేననీ, దీనిపై అతి చేయద్దనీ విషయతీవ్రతను తక్కువ చేసి చెబుతుండడం మరీ విడ్డూరం. చెప్పేదొకటి చేసేదొకటి జిత్తులమారి చైనా నిత్యకృత్యం. అందుకే, ఈ వ్యవహారాన్ని భారత్ తీవ్రంగా తీసుకోక తప్పదు. వారం క్రితం జొహాన్నెస్‌బర్గ్‌లో ‘బ్రిక్స్’ సదస్సు జరిగినప్పుడు భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు సమావేశమై సంభాషించుకున్నారు. సరిహద్దుల వద్ద పరిస్థితిని చక్కదిద్ది, సత్సంబంధాలకు కృషి చేయాలని చర్చించుకున్నారు. మరోపక్క ఈ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగే ‘జీ–20’ శిఖరాగ్ర సదస్సుకూ చైనా అధినేత హాజరు కావాల్సి ఉంది. సరిగ్గా ఈ సమయంలో ఉరుము లేని పిడుగులా డ్రాగన్ దేశ సరిహద్దులు ఈ ‘వక్రీకరించిన’ పటంతో బాంబు పేల్చింది. గమనిస్తే మన ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెడుతూ, మునుపటి పటంలోనూ చైనా ఇదే తెంపరితనం చూపింది. ఆ దేశ పశ్చిమ హద్దుల్లో ఉన్న ప్రాంతాలను తనవిగా చెప్పుకొంది. అక్సాయ్‌చిన్ 1950–60ల నుంచి మన కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో భాగం. 1962 యుద్ధంలో చైనా దాన్ని ఆక్రమించుకుంది. అరుణాచల్నేమో దశాబ్దాలుగా తమ దక్షిణ టిబెట్లోది అంటోంది. ఆ రెండూ భారత అంతర్భాగాలని మన ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా, తన మూర్ఖవాదన కొనసాగిస్తోంది. పటంలోని అంశాలు అంతర్జాతీయ అంగీకృత సరిహద్దులను పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌ను ‘జంగ్నాన్’ (దక్షిణ టిబెట్) అని పిలుస్తూ, అది తమదేననడం బీజింగ్ సిగ్గు మాలినతనం. చరిత్ర చూస్తే టిబెట్‌కూ, బ్రిటీషు ఇండియాకు మధ్య 1914లో సిమ్లా సమావేశం జరిగింది. అప్పుడే సరిహద్దుగా మెక్‌మోహన్ రేఖను అంగీకరించాయి. చైనా చేస్తున్న ప్రకటనలు, చూపుతున్న పటం ఆ అంగీకరించిన సరిహద్దు రేఖ చట్టబద్ధతను ఉల్లంఘించడమే! అలాగే, ద్వీప దేశమైన తైవాన్ ఏడాదిపైగా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నా, పట్టువదలని బీజింగ్ ‘వన్ చైనా విధానం’ అంటూ దాన్ని తమ పటంలో చూపడం దురహంకారం. ఇక, పసిఫిక్, హిందూ మహాసముద్రాలకు ప్రధాన నౌకాయాన అనుసంధానమైన దక్షిణ చైనా సముద్ర ప్రాంతం సైనిక, వాణిజ్యపరంగా అతి కీలకం. వివాదాస్పద ద్వీపాలతో సహా ఈ ప్రాంతమంతా చైనా తమ పటంలో కలిపేసుకుంటోంది. ఈ ప్రాంతంలో డ్రాగన్ సామ్రాజ్యవాద విస్తరణ వైఖరిని ఫిలిప్పీన్స్, వియత్నామ్, మలేసియా, జపాన్ తదితర దేశాలు పదే పదే ఎత్తిచూపుతున్నాయి. అయినా అది తన తీరు మార్చుకోలేదు. భౌతికంగా తన అధీనంలో లేకున్నా ఈ ప్రాంతాలు తనవేననడం చిరకాలంగా చైనా చూపుతున్న మొండివైఖరే. తాజా పటం జారీ వల్ల దానికి కొత్తగా కలిసొచ్చేదేమీ లేదు. పైగా, మిగతా ప్రపంచపు సహాయం, సానుభూతి కూడా దక్కవు. అయినా సరే, డ్రాగన్ తన దురహంకారాన్ని చాటుకోవడం గమనార్హం. ఒక్కమాటలో చైనా అధినేత షీ జిన్‌పింగ్ సామ్రాజ్యవాద విస్తరణ వైఖరికి ఈ కొత్త మ్యాప్ ప్రతీక. అధికారిక జాతీయ పటాల జారీ చైనాలో దాదాపు ఏటా జరిగే తంతు అయినా... భారత్ వరకు తీసుకుంటే చంద్రయాన్–3 విజయం, రానున్న జీ–20 సదస్సు నేపథ్యంలో ఇప్పుడీ పటాన్ని ఎందుకు విడుదల చేసినట్టు? ఇరుదేశాల మధ్య ఇలాంటి సరిహద్దు వివాదాలే గతంలోనూ సైనిక ప్రతిష్టంభనకు దారితీశాయి. 2017లో తలెత్తిన డోక్లామ్ సంక్షోభం, 2020లో గల్వాన్ లోయలో సైనిక ఘర్షణలే తాజా ఉదాహరణలు. దీంతో దౌత్య సంబంధాలూ దెబ్బతింటున్నాయి. బలగాల్ని వెనక్కి పిలిచి, ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించుకోవాల్సిన వేళ ఇలాంటి తప్పుడు పటం సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు ఏ రకంగానూ దోహదపడదు. ఇప్పటికే లద్దాఖ్‌లోని కొంత భాగాన్ని చైనా ఆక్రమించేసుకుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. వివిధ విదేశీ సర్వేలు, ఉపగ్రహ ఛాయాచిత్రాలు సైతం భారత సరిహద్దులో చైనా వివాదాస్పద నిర్మాణాల్ని ధ్రువీకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అనుమానాలు పోగొట్టేలా మన పాలకులు వాస్తవాలను వెల్లడించాలి. నమ్మడానికి వీల్లేని పొరుగుదేశంతో నిక్కచ్చిగానే వ్యవహరించాలి. సార్వభౌమాధికారం, సమగ్రతల్లో రాజీ లేదని మాటల్లో కన్నా చేతల్లో చూపాలి. జీ–20 అధ్యక్షతతో విశ్వగురువులయ్యామని సంబరపడేకన్నా, అంతర్గత ఘర్షణలున్న అన్ని పక్షాలనూ అర్థవంతమైన సమగ్ర చర్చలతో ఒక తాటిపైకి తేవడమే అసలు విజయమని గ్రహించాలి. చైనాతో సంభాషణకు అన్ని మార్గాల్నీ అన్వేషిస్తూనే, మనకున్న ఆందోళనల్ని కుండబద్దలు కొట్టాలి. అవకాశాన్ని బట్టి అందుకు రానున్న జీ–20ను సైతం వేదికగా చేసుకోవాలి. దౌత్య, వాణిజ్య సంబంధాల మెరుగు దలకు సరిహద్దుల్లో సామరస్య వాతావరణం కీలకమని మరోసారి అందరికీ తలకెక్కేలా చూడాలి. -
ఆత్మహత్యలు కాదు... హత్యలే!
ఒకరూ, ఇద్దరూ కాదు... ఈ ఏడాది ఇప్పటి వరకు 24 మంది. అదీ మొన్న ఆదివారం ఒక్కరోజే నాలుగు గంటల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు. దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్, మెడికల్ విద్యాసంస్థల్లో ప్రవేశపరీక్షలకు కోచింగ్ ఇచ్చే కర్మాగారంగా పేరొందిన రాజస్థాన్‌లోని కోటాలో ఆత్మహత్యల మరణమృదంగం ఆగకుండా మోగుతోంది. గత ఏడాది ఇదే పట్నంలో 15 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటే, ఈ ఏడాది ఇప్పటికి ఎనిమిది నెలల్లోనే అంతకు మించి అమాయకులు బలవన్మరణానికి దిగారు. గత ఎనిమిదేళ్ళలో అత్యధిక ఆత్మహత్యల సంఖ్య ఇదే. సంక్షోభ తీవ్రతను ఇది ప్రతిబింబిస్తోంది. రెండు నెలల పాటు ఈ కోచింగ్ కేంద్రాల్లో పరీక్షలను నిలిపివేస్తూ స్థానిక పాలనా యంత్రాంగం ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉన్నత చదువులు చదివి, జీవితంలో ఉజ్జ్వలంగా ఎదగాల్సిన భావి పౌరులు పరీక్షల అతి ఒత్తిడితో ఆయువు తీసుకుంటున్న విషాదం మరోసారి అందరినీ ఆత్మపరిశీలనకు పురిగొల్పుతోంది. కోటాలో ఆత్మహత్యలు ఇవాళ కొత్త కావు. కోచింగ్‌లతో పాటు ఒత్తిడి తట్టుకోలేని విద్యార్థుల బలవన్మరణాలకూ ఈ పట్నం కొన్నేళ్ళుగా పేరుబడింది. అక్కడన్నీ వారాంతపు సెలవైనా లేకుండా రోజుకు 14 నుంచి 18 గంటల పాటు పిండి రుబ్బినట్టు పాఠాలు రుబ్బించే విద్యార్థి కర్మాగారాలే! వాటిలో పిల్లలు అనుభవించే మానసిక చిత్రవధ వర్ణనాతీతం. కఠినమైన పాఠ్యప్రణాళికను పూర్తి చేయాలనే ఒత్తిడి, నిద్ర లేని రాత్రులు, నిరంతరం అంచనా పరీక్షలు, ఎక్కడ లేని పోటీ, వైఫల్య భయం, వీటన్నిటికీ తోడు తల్లితండ్రులకూ – ఇంటికీ దూరంగా ఒంటరి జీవితం... ఇవన్నీ పసి మనసుల్ని ప్రాణాలు తీసుకొనేంతగా ప్రేరేపిస్తున్నాయి. పిల్లలపై మానసిక ఒత్తిడి, విద్యావిధానంలోని లోపాల గురించి దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది. కోటా మాత్రం అవేవీ పట్టకుండా ఏటేటా ఫలితాలందిస్తూనే ఉంది. వెరసి, ఇవాళ్టికీ ఈ కోచింగ్ కర్మాగారానికి తమ పిల్లలతో తల్లితండ్రులు పోటెత్తుతున్నారు. ఏటా 2.5 లక్షల మంది విద్యార్థులు వస్తుంటారు. అగ్రశ్రేణి టీచర్‌కు సంవత్సరానికి కోటి రూపాయల జీతమిచ్చే అక్కడ కోచింగ్ రూ. 5 వేల కోట్ల వార్షిక వ్యాపారం. సమాజంలో యువతరం ఆకాంక్షలు నిరంతరం పెరుగుతున్నాయి. ఆర్థికవ్యవస్థలో అవకాశా లేమో అంతకంతకూ తగ్గుతున్నాయి. అదే ఇవాళ పెను ప్రజారోగ్య సమస్యగా తయారైంది. కోటా లోని పరిణామాలు అందుకు ప్రతీక. వికాసాన్ని కల్పించాల్సిన విద్యను వ్యాపారంగా మార్చడంతో తలెత్తిన సంక్షోభానికి పరాకాష్ఠ. ర్యాంకులే ధ్యేయంగా ప్రైవేట్ విద్యా వ్యాపారులు సృష్టించిన ఈ తరహా సంక్షోభం తెలుగు రాష్ట్రాల్లోనూ గతంలో మనం చూసినదే. దీనికి ఏ ఒక్కరో కాదు...అందరం బాధ్యులమే. సృజనాత్మక కళల పట్ల ఆసక్తి ఉంది మొర్రో అంటున్నా శాస్త్ర సాంకేతిక విద్య వైపు పిల్లల్ని నెట్టడం, తాము కాలేకపోయిన ఇంజనీరో – డాక్టరో తమ పిల్లలు కావాలనుకోవడం, తోటి వారితో పోలికల మూర్ఖత్వం... ఇవన్నీ మన తప్పిదాలే! కోటాలోనే కాదు, దేశవ్యాప్తంగా అన్నిచోట్లా పరిస్థితిదే! నేషనల్ క్రైమ్‌రికార్డ్స్ బ్యూరో 2021 నివేదిక ప్రకారం దేశంలో విద్యార్థుల ఆత్మ హత్యలు 4.5 శాతం పెరిగాయి. ఆ దుష్కీర్తిలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు ముందున్నాయి. అయిదేళ్ళుగా ఇవి పెరుగుతున్నాయనీ నివేదిక స్పష్టం చేసింది. ఇది తాజా ప్రమాద ఘంటిక. కోటాలో ఎక్కువమంది విద్యార్థులు డిప్రెషన్‌తో బాధపడుతున్నారని 2018లో టాటా ఇన్స్టి ట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నివేదిక వెల్లడించింది. తాజా సర్వే ప్రకారం అక్కడ ప్రతి 10 మందిలో నలుగురు మానసిక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నవారే. కోచింగ్ సంస్థల్ని నియంత్రిస్తూ రాష్ట్ర సర్కార్ ఓ బిల్లును ప్రతిపాదించినా, ఇంకా అమలులోకి రాలేదు. వారానికో రోజు ఒక పూట చదువు, మరోపూట వినోదమనే పద్ధతి పాటించాలనీ, పక్షానికోసారి పిల్లల మానసిక ఆరోగ్య పరీ క్షలు నిర్వహించాలనీ రాజస్థాన్ ప్రభుత్వ తాజా ప్రతిపాదన. గదుల్లో సీలింగ్ ఫ్యాన్ల బదులు గోడలకు బిగించే ఫ్యాన్లు పెట్టాలని 2021లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వారు చెప్పారట! ఈసారేమో స్ప్రింగులు, సెన్సార్‌తో కూడిన సీలింగ్ ఫ్యాన్లు పెడితే ఆత్మహత్యా యత్నం చేసినా సరే ఉరి బిగుసుకోదంటూ స్థానిక పాలనా యంత్రాంగం వింత ఆలోచన చేసింది. మేడపై నుంచి కిందకు దూకకుండా వలలు, జాలీలు కట్టడం లాంటి తెలివితేటలూ హాస్టళ్ళు చూపుతున్నాయి. ఇవేవీ సమ స్యకు శాశ్వత పరిష్కారం కావు. పైగా తమపై నిత్యం నిఘా ఉందంటూ పిల్లల మనసుపై అదనపు ఒత్తిడి. నిజానికి సామాజిక, ఆర్థిక వాస్తవాలకు తగ్గట్టు పిల్లల్ని సిద్ధం చేస్తూ, అండగా నిలిచే విద్యా వ్యవస్థ అవసరం. అసలు సమస్యను వదిలేసి తాత్కాలిక ఉపశమనాల్ని ఆశ్రయిస్తే ఉపయోగం లేదు. పరీక్షల్లో తక్కువ మార్కులొచ్చాయనీ, నలుగురిలో తలెత్తుకోలేమనీ, ఇంట్లో బాధపడతారనీ... ఆయువు తీసుకోవాలనుకోవడం పిల్లల్లో మనం నూరిపోస్తున్న తప్పుడు విలువలకు తార్కాణం. పిల్లలు అన్నిటా అద్భుతంగా రాణించాలనే విజేత స్వభావపు వ్యసనం నుంచి మనం బయటపడాలి. పిల్లలు, తల్లితండ్రులు, అధ్యాపకులు, విద్యాసంస్థలు, విధాన నిర్ణేతలు – అందరూ కలసి ఇకనైనా సంక్షోభ పరిష్కారానికి అత్యవసర చర్యలు చేపట్టాలి. పసిపిల్లల ప్రాణాలు తీస్తున్న ఈ అగ్రశ్రేణి ప్రవేశపరీక్షల విధానంపై సమగ్ర దృష్టి సారించాలి. ఇరుకిరుకు గదుల్లో పిల్లల్ని కుక్కి, కోళ్ళఫారమ్ లలో కోడిపిల్లల్లాగా పిల్లల్ని చదివించడం, పెంచడం ఏ సమాజానికీ ఆరోగ్యం కాదు. అందుకే ఇవి ఆత్మహత్యలు కాదు... సమాజం సామూహికంగా చేస్తున్న హత్యలు. ఈ జాతీయ సంక్షోభంపై ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరవకుంటే, ఆ పసిహృదయాల ఉసురు తగులుతుంది. -
చేజేతులా తలవంపులు!
విశ్వవేదికపై భారతదేశానికి కీర్తి, పతకాలు తెచ్చిపెట్టిన ఒక క్రీడ... ఇప్పుడు అంతర్జాతీయంగా నలుగురిలో నగుబాటుకు కారణంగా మారిందంటే తప్పెవరిది? గడచిన నాలుగు ఒలిపింక్స్‌లోనూ వరుసగా మన దేశానికి పతకాలు సాధించి పెట్టిన రెజ్లింగ్‌లో ఆటగాళ్ళు ఇప్పుడు కనీసం భారత జాతీయ పతాకం నీడన అధికారికంగా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే వీలు లేకుండా పోయిందంటే ఆ పాపం ఎవరిది? మన అగ్రశ్రేణి రెజ్లర్లు ఈ ఏడాది మొదట్లో వీధికెక్కి, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లు్యఎఫ్‌ఐ) అప్పటి అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై ఆరోపణలు చేసినప్పటి నుంచి గత ఎనిమిది నెలల్లో రోజుకో వివాదం మన రెజ్లింగ్‌ను చుట్టుముడుతూనే ఉంది. ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణలతో సతమతమవుతున్న భారత సమాఖ్యను అంతర్జాతీయ రెజ్లింగ్ పర్యవేక్షక సంఘం ‘యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్’ (యుడబ్లు్యడబ్లు్య) తాజాగా సస్పెండ్ చేసింది. నిర్ణీత గడువు లోగా ఎన్నికలు జరపనందుకు పడ్డ ఈ సస్పెన్షన్ వేటు మన రెజ్లింగ్ భవితపై నీలినీడలు పరిచింది. ఈ సస్పెన్షన్ మరీ ఊహించనిదేమీ కాదు. కొన్ని నెలలుగా అంతర్జాతీయ రెజ్లింగ్ సంఘం పదే పదే హెచ్చరిస్తూనే ఉంది. వివాదాల్లో కూరుకుపోయిన భారత రెజ్లింగ్ సమాఖ్యను చక్కదిద్దుకోవా ల్సిందిగా మన క్రీడాయంత్రాంగ పెద్దలను అభ్యర్థిస్తూనే ఉంది. దోవకు రాకుంటే సస్పెన్షన్ వేటు వేయక తప్పదని జూన్‌లో హెచ్చరించింది. జూలైలోనూ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. భారత రెజ్లింగ్ సమాఖ్యలో అంతర్గత వర్గ పోరాటాలు సాగు తూనే ఉన్నాయి. మరోపక్క సమాఖ్య ఎన్నికల్ని వివిధ కోర్టులు నిలిపివేశాయి. చివరకు సహనం నశించిన అంతర్జాతీయ సంఘం అన్నంత పనీ చేసింది. భారత రెజ్లింగ్ సమాఖ్యపై వేటు వేసింది. సమస్యను ఆదిలోనే పరిష్కరించని మన క్రీడా అధికారుల అసమర్థత ఇక్కడి దాకా తెచ్చింది. ఈ సస్పెన్షన్ వల్ల ఆటగాళ్ళపై వ్యక్తిగతంగా ప్రభావమేమీ ఉండకపోవచ్చు. కానీ, దేశానికి మాత్రం తీరని తలవంపులు. ఎలాగంటే, ఈ సెప్టెంబర్ 16 నుంచి బెల్గ్రేడ్లో జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మన రెజ్లర్లు తటస్థ అథ్లెట్లుగానే పోటీలో పాల్గొనాల్సిన పరిస్థితి. ఇలా మన కుస్తీయోధులు అన్ని రకాల పోటీల్లో పాల్గొనవచ్చు. పతకాలు సాధించవచ్చు. కానీ, జాతీయ పతాకం ధరించడానికి లేదు. సాక్షాత్తూ బంగారు పతకం సాధించి, పోడియమ్పై నిలబడినప్పటికీ ప్రాంగణంలో మన జాతీయ గీతాన్ని వినిపించరు. వారి ప్రతిభా ప్రదర్శన, గెలిచే పతకాలు... ఇలా ఏవీ భారతదేశపు లెక్కలోకి రావు. అదీ ఈ సస్పెన్షన్‌తో దాపురించే దుఃస్థితి. ఒకవేళ ఇంత జరుగుతున్నా సరే ఇప్పుడిప్పుడే ఎన్నికలు నిర్వహించకుంటే, దరిమిలా సస్పెన్షన్‌ను ఎత్తివేయ కుంటే... అప్పుడిక మన భారత రెజ్లర్లు రానున్న ఒలింపిక్స్ సహా ఏ అంతర్జాతీయ పోటీలోనూ దేశం తరఫున పోటీ చేసే వీలుండదు. ఇది దేశ ప్రతిష్ఠకే మాయని మచ్చ. ఇందుకు నిందించాల్సింది మన భారత రెజ్లింగ్ సమాఖ్యను, మన పాలకులనే! లైంగికంగా వేధించినట్టు సాక్ష్యాధారాలు లభించినప్పటికీ, దేశానికి పతకాల పంట పండించిన రెజ్లర్లు న్యాయం కోసం రోడ్డున పడి ధర్నాలు చేసినప్పటికీ ఇవాళ్టికీ మన ఏలికలకు చీమ కుట్టినట్టయినా లేదు. సమాఖ్య మాజీ అధ్యక్షుడు, పాలక బీజేపీ పార్లమెంట్ సభ్యుడైన బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవ డానికి ఇప్పటికీ మన పాలకులకు చేతులు రావడం లేదు. పేరుకు పదవిలో నుంచి పక్కకు తప్పు కున్నప్పటికీ, తన వారినే మళ్ళీ పీఠంపై కూర్చోబెట్టి కథ నడిపించాలని చూస్తున్న నిందితుడిని అడ్డుకొనేందుకు మన ప్రభుత్వాలకు మనస్కరించడం లేదు. బాధిత రెజ్లర్లకూ, చక్రం తిప్పాలని చూస్తున్న బడాచోర్లకూ మధ్య చిక్కుకున్నది కేవలం రెజ్లింగ్ కాదు... దేశ పరువు ప్రతిష్ఠలు! లైంగిక ఆరోపణల వ్యవహారంతో ఇప్పటికే దేశం పరువు పోగా, తాజా సస్పెన్షన్‌తో తలకొట్టేసినట్టయింది. రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన క్రీడా సంఘాలు గనక రాజకీయ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకుంటే ఇలాగే ఉంటుంది. ఆటలు, ఆటగాళ్ళ ప్రయోజాల పరిరక్షణ వెనక్కి పోయి, క్రీడలతో సంబంధం లేని అంశాలు ముందుకు వస్తాయి. దేశంలోని అనేక ఇతర క్రీడా సంఘాల్లోనూ ఇదే జరిగింది. సమయానికి ఎన్నికలు జరపలేదంటూ నిరుడు ప్రపంచ ఫుట్‌బాల్ పర్యవేక్షక సంఘం ‘ఫిఫా’ మనదేశ ఫుట్‌బాల్ సమాఖ్యను సస్పెండ్ చేసింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, హాకీ ఫెడరేషన్లు సైతం ఈ కారణాలతోనే మన సంఘాల్ని నిషేధిస్తామని హెచ్చరించాయి. క్రీడా నియమావళిని పాటించట్లేదంటూ సాక్షాత్తూ భారత సర్కారే 2020 జూన్‌లో 54 జాతీయ క్రీడా సమాఖ్యల గుర్తింపును ఉపసంహరించింది. నియమాల ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ ఢిల్లీ హైకోర్ట్ గత ఏడాది దాదాపు పాతిక క్రీడాసంఘాలకు అక్షింతలు వేసింది. అయినా పరిస్థితి మారలేదు. రాజకీయాలకు బలవుతున్న సంఘాల్లో ఒకటిగా మన రెజ్లింగ్ సైతం నిలిచింది. విచిత్రంగా కొందరు ప్రస్తుత పరిస్థితికి ఆటగాళ్ళను తప్పుబడుతున్నారు. లైంగిక వేధింపుల అంశాన్ని బయటకు చెప్పడమే వారి నేరమన్నట్టుగా, వారిని ‘ధర్నా జీవులు’ అంటూ బ్రిజ్‌భూషణ్ నిస్సిగ్గుగా బురద జల్లుతున్నారు. ఇకనైనా పాలకులు, క్రీడా అధికారులు కళ్ళు తెరవాలి. దీర్ఘ కాలం సస్పెన్షన్ కొనసాగితే అంతర్జాతీయ పోటీలకు ఆహ్వానాలు తగ్గుతాయి. ప్రపంచ సంఘం నుంచి ఆర్థిక సహకారమూ తగ్గుతుంది. ఆటగాళ్ళ కెరీర్ దెబ్బ తింటుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, సంక్షోభ పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలి. అలాకాక ప్రభుత్వం ఇప్పటికీ మౌనం వీడకపోతే కష్టమే! దేశప్రతిష్ఠ కన్నా దేశంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే ముఖ్యమని భావిస్తే అది మహా పాపమే! -
మన బంగారు కొండ
భారత క్రీడాభిమానులకు ఇది హృదయం ఉప్పొంగే క్షణం. అథ్లెటిక్స్‌లోనూ మన ఆటగాళ్ళు విశ్వ విజేతలుగా నిలుస్తున్న అపురూప సందర్భం. నిన్నటి దాకా ఒలింపిక్ ఛాంపియన్ మాత్రమే అయిన ఓ క్రీడా దిగ్గజం ఇవాళ ప్రపంచ ఛాంపియన్ కూడా అయిన అపూర్వ ఘట్టం. బుడాపెస్ట్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో పురుషుల జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించడం ద్వారా భారత అథ్లెట్ నీరజ్ చోప్రా ఆదివారం నాడు అక్షరాలా చరిత్ర సృష్టించారు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. దేశం గర్వపడేలా చేశారు. ఆదివారం నాడు రెండో ప్రయత్నంలో గరిష్ఠంగా 88.17 మీటర్ల దూరం ఈటెను విసిరి, నీరజ్ సాధించిన ఈ స్వర్ణపతకం ఇక భారత క్రీడాచరిత్రలో సువర్ణాక్షర లిఖితం. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ఊరిలోని నీరజ్ ఇంట్లో ఆయన తండ్రి, బంధుమిత్రులు ఒక్కచోట కూడిన ఉత్కంఠగా చూసిన ఈ విజయఘట్టం వారికే కాదు... యావద్భారతావనికి కూడా ఉద్విగ్నభరితమైనది. ఆర్మీలో సుబేదార్ అయిన పాతికేళ్ళ నీరజ్ చోప్రా మాటల్లోనే చెప్పాలంటే, ఒలింపిక్స్ కన్నా వరల్డ్ ఛాంపియన్షిప్స్ కఠినమైనది. ఒలింపిక్స్ ప్రత్యేక మైనది అయితే, వరల్డ్ ఛాంపియన్ అనేది అతి పెద్ద కిరీటం. పోటీ పరంగా చూసినా, అథ్లెట్లు అవిశ్రాంత సాధన చేసి వచ్చే వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఎప్పుడూ కాస్తంత ఎక్కువ కఠినమే. అలాంటి వేదికపై స్వర్ణసాధనతో నీరజ్ ‘భారతదేశంలో ఆల్‌టైమ్ అతి గొప్ప అథ్లెట్’గా అవతరించారు. మొహమాటంగా ఆ పిలుపును పక్కనపెడుతూ, ఆయన వినయంగా వ్యవహరిస్తున్నప్పటికీ అది వాస్తవమే. అటు ఒలింపిక్స్ స్వర్ణం, ఇటు తాజా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ స్వర్ణం – రెండూ సాధించిన ఏకైక భారత అథ్లెట్ ఈ సైనికుడే. మధ్యతరగతి నుంచి వచ్చిన నీరజ్ ఈ స్థాయికి చేరడానికి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. మోచేతికి గాయం కావడంతో 2019లో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. అలా అప్పట్లో దోహాలో ప్రపంచ ఛాంపియన్షిప్స్కు హాజరు కాలేకపోయారు. తర్వాత రెట్టించిన ఉత్సాహంతో వచ్చి, 2020 జనవరిలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఆలస్యంగా ఆ మరుసటేడు జరిగిన ఆ ఒలింపిక్స్‌లో ఏకంగా స్వర్ణం సాధించారు. మన దిగ్గజ అథ్లెట్లైన మిల్ఖాసింగ్, పీటీ ఉషకు సైతం అందని ఆ స్వర్ణకీర్తిని అందుకున్నారు. అలా రెండేళ్ళ క్రితం 2021 ఆగస్ట్‌లో జరిగిన టోక్యో ఒలింపిక్స్– 2020లో స్వర్ణసాధన నాటి నుంచి అందరి దృష్టీ నీరజ్‌పై ఉంది. ఇప్పుడీ ప్రపంచ ఛాంపియన్ షిప్స్‌లోనూ బంగారు పతకం తెచ్చి, అథ్లెటిక్స్‌లో మన దేశానికి పతకాలు పండించే బంగారు కొండ అయ్యారు. సౌత్ ఏషియన్ గేమ్స్ (2016), ఏషియన్ ఛాంపియన్షిప్స్ (2017), కామన్వెల్త్ గేమ్స్ (2018), ఏషియన్ గేమ్స్ (2018), ఒలింపిక్స్ (2020), డైమండ్ లీగ్ (2022), ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్స్... ఇలా నీరజ్ సాధించిన స్వర్ణాలే అందుకు సాక్ష్యం. మొత్తం ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ చరిత్రలో భారత్‌కు ఇది మూడో పతకం. ఇంతకు మునుపు జరిగిన 18 ఛాంపియన్‌షిప్‌లలో మన దేశానికి వచ్చినవి రెండు పతకాలే. ఆ రెండింటిలో కూడా ఒకటి నిరుటి ఛాంపియన్‌షిప్స్‌లో నీరజ్ చోప్రా సాధించిన రజతమే. అంతకు ముందెప్పుడో 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ బాబీ జార్జ్ కాంస్యం గెలిచారు. అప్పుడలా విశ్వవేదికపై మొదలైన మన పతకాల లెక్క ఇప్పుడు మూడుకు చేరడం ఒక రకంగా ఆనందమే అయినా, మరోరకంగా ఇన్నేళ్ళకు గానీ ఆ స్థాయికి చేరకపోవడం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశం. ప్రపంచ స్థాయికి చేరేలా మన ఆటగాళ్ళను ప్రోత్సహించేందుకు మనం చేయవలసినంత చేస్తున్నామా అన్నది ఆలోచించాల్సిన విషయం. అయితే, ఒకప్పుడు అంతర్జాతీయ యవనికపై భారతీయ క్రీడ అంటే హాకీ. తర్వాత క్రికెట్, ఆ పైన చెస్, బ్యాడ్మింటన్, టెన్నిస్, రెజ్లింగ్ వగైరాల్లోనూ మన ప్రతిభకు తక్కువ లేదని నిరూపిత మవుతూ వచ్చింది. నిజానికి, జావెలిన్ త్రోలో సైతం ఒకప్పుడు విశ్వవేదికపై మనం ఎక్కడ ఉన్నామో కూడా ఎవరికీ తెలీదు. కానీ, ఇప్పుడు ఏకంగా ముందు వరుసలో నిలిచాం. అందులోనూ తాజా పోటీలో కిశోర్ జెనా, డీపీ మను అనే మరో ఇద్దరు భారతీయ జావెలిన్ త్రో వీరులు కూడా ఉండడం, వారిద్దరు 5వ, 6వ స్థానాల్లో నిలవడం... ఇవన్నీ మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. భవిష్యత్తు పట్ల ఆశలు రేపుతున్నాయి. ఆ ఆశలు నెరవేరడానికి నీరజ్ అన్నట్టు మన దగ్గర కూడా కీలకమైన మోండో ట్రాక్స్ వగైరాలను అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) సిద్ధం చేయడం అవసరం. చెక్ రిపబ్లిక్కు చెందిన దిగ్గజ అథ్లెట్ జెలెజ్నీ 98.48 మీటర్ల దూరం ఈటె విసిరి, ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. మూడుసార్లు ఒలింపిక్స్‌లో, మరో 3 సార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకాలు గెలిచారు. అతనే తనకు స్ఫూర్తి అని చెప్పే నీరజ్ ఆ స్థాయికి చేరడానికి చేయాల్సిన శ్రమ, సాగించాల్సిన ప్రయాణం ఇంకా చాలానే ఉంది. ఆ ప్రయాణానికి మన ప్రభుత్వాలు, క్రీడా సంస్థలు అందించాల్సిన సహకారమూ అపారమే. నీరజ్ ఒలింపిక్స్ సాధన తర్వాత హరియాణాలోని పానిపట్ సహా అనేక గ్రామాల్లో పిల్లల్లో, ఇళ్ళల్లో క్రీడల పట్ల ఆసక్తి కొన్ని పదుల రెట్లు పెరిగింది. గుంపులుగా వచ్చి, ఆటలాడుతున్న ఆ భావి భారత ఆశాకిరణాలకు మైదానాలు, ఆస్పత్రుల లాంటి కనీస వసతులు కల్పించడం ప్రభుత్వ కర్తవ్యం. ఆ దిశగా కృషి చేస్తే, మరింత మంది నీరజ్‌లు ఈ గడ్డపై నుంచి వస్తారనడంలో సందేహం లేదు. -
కాసింత కపటం
‘నిజాన్ని పోలిన అబద్ధమాడి డబ్బు సంపాదించాలి’ అంటాడు ‘కన్యాశుల్కం’లో రామప్ప పంతులు. అందుకు ‘నమ్మినచోట మోసం, నమ్మని చోట లౌక్యం’ ప్రదర్శించాలంటాడు. కన్యాశుల్కం మలికూర్పు 1909లో జరిగింది కనుక రచనాకాలం ఇదమిత్థంగా తెలియకపోయినా ఇందులోని పాత్రలన్నీ 1880– 1910 కాలం నాటివి. అంటే నాటి మనుషుల జీవనాన్ని తెలిపేవి. వారు పాటించిన విలువలు, తొక్కగల పాతాళాలు, చూపిన చిత్తవృత్తులు, చేసిన టక్కుటమారాలు, హీనత్వాలు, అల్పత్వాలు... ఇవి తెలియాలంటే కన్యాశుల్కానికి మించిన ఆనవాలు లేదు. వందేళ్ల కాలం తర్వాత కూడా గురజాడ, ఆయన రచించిన ‘కన్యాశుల్కం’ వర్తమాన విలువను కలిగి ఉండటానికి నాటకంలో గురజాడ ఎంచుకున్న సాంఘిక సమస్య గాంభీర్యం ఎంత మాత్రం కారణం కాదు. సాంఘిక సంస్కరణ కూడా కాదు. పసిపిల్లలను వృద్ధులకిచ్చి పెళ్లి చేయడం, వితంతువుల పెళ్ళిళ్లు నిరాకరించడం, వేశ్యావృత్తి ప్రబలంగా ఉండటం... వీటి నిరసనగా గురజాడ కన్యాశుల్కాన్ని రాసినా కేవలం ఈ కారణం చేతనైతే నాటకం అవసరం ఏ పదేళ్లకో తీరిపోయి కనుమరుగైపోయేది. కన్యాశుల్కం బతికి ఉన్నదీ... ఇక మీదటా బతికి ఉండేదీ... అది కేవలం మనుషుల నిజ ప్రవర్తనల విశ్వరూపం చూపడం వల్లే! అగ్నిహోత్రావధాన్లకు మెరకపొలం ఉంది. భార్య వెంకమ్మ పసుపూ కుంకాలతో తెచ్చిన పొలమూ ఉంది. ఇరుగింటి గోడ, పొరుగింటి గోడ తనదేనని దబాయించి కలుపుకుంటున్నాడు. పెద్ద కూతురు బుచ్చమ్మను పదిహేను వందలకు అమ్మి, ఆమె విధవగా మారగా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. బుచ్చమ్మ (చనిపోయిన) మొగుడి భూముల్లో వాటా కోసం దావా కూడా తెచ్చాడు. ఇన్ని ఉన్నా బంగారం లాంటి, పసిమొగ్గ వంటి చిన్నకూతురు సుబ్బిని పద్దెనిమిది వందలకు అమ్మడానికి సిద్ధమయ్యాడు– అరవై దాటిన, కాటికి కాళ్లుజాపుకున్న లుబ్ధావధాన్లకు! కొడుకు వెంకటేశం పెళ్లి జరగాలంటే చంటిదాన్ని అమ్మాల్సిందేనట. ఈ కాఠిన్యం, కపటత్వం ఎంత వెలపరం! ఇక కపటుల వరుస చూడండి. డబ్బుపై యావ తప్ప వేరే ఏ లిటిగేషన్ ఎరగని ముసలి లుబ్ధావధాన్లను పెళ్లికి ఎగదోసి, అతగాడు పిల్లకు పుస్తె గట్టి ఇంటికి తెచ్చుకుంటే గనక తన ఇలాకా చేసుకుందామని ఆరాటçపడుతుంటాడు ఉమనైజర్ రామప్పపంతులు. అప్పటికే అతడు లుబ్ధావధాన్ల పెద్ద కూతురు మీనాక్షిని లొంగదీసుకున్నాడు. మధురవాణిని ఉంచుకున్నాడు. చాలక అన్నెం పున్నెం ఎరగని పసిపిల్లను కబళించేందుకు లుబ్ధావధాన్ల హితం పలుకుతుంటాడు. గిరీశం ఇంతకన్నా దిగదుడుపు. స్త్రీలపై పడి బతుకుతాడు. పూటకూళ్లమ్మను ఉంచుకుని, ఆమె సరుకుల కోసం దాచుకున్న 20 రూపాయలను కాజేసి మధురవాణికిచ్చి ఆమెను ఉంచుకుంటాడు. సరైన పెద్దమనిషి దొరికితే ‘మధురవాణి లాంటి ఇరవై మందిని సపై్ల చేస్తానంటా’డు. బుచ్చమ్మ మీద కన్నేసి, విడో మేరేజీ పేరుతో ఆమెను నగానట్రాతో ఉడాయించుకు పోవాలని చూస్తాడు. గిరీశానికి ఇంగ్లిష్ వచ్చు. శ్రమ రాదు. చదువు ఉంది. నీతి లేదు. మేనకోడలైన సుబ్బిని కాపాడటానికి రంగంలో దిగిన కరటక శాస్త్రికి ఎన్ని సదుద్దేశాలున్నా అతడు మధురవాణికి పాత గిరాకీ. ‘ఎవరూ లభ్యం కాకపోతే నేను యాంటీ నాచే’ అంటాడు. ఇక ఆవు నైయ్యెనా ఇస్తాగానీ ఖూనీ కేసులో చిక్కుకున్న లుబ్ధావధాన్ల తరఫున సాక్ష్యం చెప్పననే పొలిశెట్టి, లేని దెయ్యాలను సీసాలో బంధించే గవరయ్య, హరిద్వార్‌లో మఠం కడతానని చిల్లర చందాలతో సాయంత్రాలు సారా కొట్లో గడిపే బైరాగి, కేసుంది అనగానే ఎంతొస్తది అనే కానిస్టేబు, చదవక తండ్రిని మోసం చేసే వెంకటేశం... కపటులు. మనుషులు బతకాలి. బతకడం ముఖ్యమే. అందుకై కాస్తో కూస్తో కపటత్వం అవసరం కావచ్చుగాని అందులోనే సోయి మరిచి కొట్టుకుపోవడమా? తెల్లారి లేస్తే కుత్సితాలు చేస్తూ, ఎదుటి వారి నెత్తిన చేయి పెడ్తూ, ఇతరుల కీడు కోరుతూ, బాగా గడుస్తూ ఉన్నా అత్యాశకొద్దీ విలువలు కాలరాస్తూ, పై అంతస్తుకు చేరేందుకు అయినవారిని కాలదంతూ, కేసులూ కోర్టులని తిరుగుతూ... ఆ కాలం మనుషులను తలుచుకుని గురజాడ– సౌజన్యారావు పంతులు రూపంలో కాసింత చింతిస్తూ ‘చెడ్డలో కూడా మంచి ఉండదా’ అంటాడు. ‘ఉన్నవారు వీరే. వీరిలో మంచి వెతికి సర్దుకుపోక తప్పదు’ అనే అర్థంలో! కాని నేటి రోజులు చూస్తుంటే ఆనాటి కపటులంతా మహానుభావులు అనిపించక మానదు. నేటి మనుషులకు కిందా మీదా పడి బతకడం రావడం లేదు. కపట జీవన సౌందర్యం తెలియడం లేదు. అసలు అంత ఓర్పు లేదు. చెడి బతికినా, బతికి చెడినా... బతకడం ముఖ్యం అనుకోవడం లేదు. చంపు లేదా చావు... అని క్షణాల్లో క్రూరత్వానికి తెగబడుతున్నారు. గురజాడ నేడు ‘కన్యాశుల్కం’ రాస్తే బుచ్చమ్మ, వెంకమ్మ కలిసి అగ్నిహోత్రావధాన్లకు విషం పెడతారు. లుబ్ధావధాన్ల పీక నొక్కి మీనాక్షి ఆస్తిపత్రాలతో పారిపోతుంది. చీటికి మాటికి తార్చి బతుకుతున్నాడని గిరీశం నిద్రలో ఉండగా మధురవాణి ఖూనీ చేస్తుంది. రామప్ప పంతులు ‘పోక్సో’ కింద అరెస్ట్ అవుతాడు. వెంకటేశం డ్రగ్స్ కేసులో పట్టుబడతాడు. దారుణం అనిపించవచ్చుగాని పేర్లను మారిస్తే ఇవాళ్టి వార్తలు ఇవే! ఆగస్టు – ‘కన్యాశుల్కం’ మొదటిసారి ప్రదర్శించిన మాసం. సినిమాగా రిలీజైన మాసం. మనుషులు పరిహాసం ఆడదగ్గ అల్పత్వాలతోనే జీవించాలని, ఈసడించుకునే స్థాయి కపటత్వంతోనే బతకాలని, భీతి కలిగించే రాక్షస మనస్తత్వాలకు ఎన్నటికీ చేరకూడదని కోరుకునేందుకు ఈ మాసం కంటే మించిన శుభతిథి ఏముంది – నెలాఖరైనా? -
అందిన ‘మామ’ అందరివాడా?
అంతర్జాతీయ యవనికపై మన జాతీయ పతాకం సమున్నతంగా రెపరెపలాడిన దృశ్యం. భరతమాత ముద్దుబిడ్డల హృదయాలు ఎందుకు ఉప్పొంగవు? ఆబాల గోపాలం ఆనంద తరంగిణిలో ఎందుకు ఓలలాడదు? ఉరుము ఉరిమితేనే, మెరుపు మెరిస్తేనే, ఆకసాన హరివిల్లు విరిస్తేనే బాల్యం మురిసి పోతుందట! అవన్నీ తనకోసమేనని గంతులేస్తుందట! ఊహలు ఊరడం మొదలైన తొలిరోజు నుంచీ బాల్యానికి కథలు చెప్పే పుస్తకం చందమామ. కలలకు రెక్కలు తొడిగే నేస్తం చంద మామ. అలాంటి చందమామ మన చేతికందిన దృశ్యం పిల్లల్ని పరవశింపజేయకుండా ఉంటుందా? ఆ పారవశ్యం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనిపించింది. పిల్లలకూ, పెద్దలకూ ఎన్నెన్నో సైన్స్ పాఠాలను నేర్పింది. ఓ పిడికెడు మందికి కామర్స్ పాఠాలు, బిజినెస్ పాఠాలు కూడా నేర్పి ఉండవచ్చు. అయినా ఆ శుభదినాన్ని (ఆగస్టు 23) ‘జాతీయ స్పేస్ డే’గానే ప్రధాని ప్రకటించారు. చంద్రగోళాన్ని క్షేమంగా తాకిన నాలుగు దేశాల్లో ఇప్పుడు భారత్ ఒకటి. అంటే అంతరిక్ష విజ్ఞానంలో తొలి నాలుగు స్థానాల్లో మనకు చోటు దక్కింది. అందులో క్లిష్టమైన దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని ఎంచుకొని దిగిన తొలి దేశంగా మన దేశం రికార్డులకెక్కింది. ఘన రూపంలో అపార జల నిక్షేపాలు, ఖనిజ సంపద ఈ ప్రాంతంలో ఉన్నాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భూగోళం పుట్టిన తొలిరోజుల్లో అంగారకుడి పరిమాణంలో ఉండే పదార్థం ఒకటి దాన్ని ఢీకొట్టిందట! ఫలి తంగా కొన్ని భూశకలాలు భూమి నుంచి వేరుపడి ఆ తర్వాత ఒకచోటకు చేరి చందమామగా ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బహుశా అందుకే భూమాతకు తోబుట్టువుగా భావించి మనం మేన మామగా పిలుచుకుంటున్నామేమో! ఇక్కడ జరిగే పరిశోధనల ఫలితంగా తొలిరోజుల నాటి భూగర్భ రహస్యాలపై అధ్యయనం చేయవచ్చు. ప్రాథమికంగా భూభౌతిక పదార్థమే గనుక, నీళ్లు కూడా ఉన్నాయని చెబుతున్నారు కనుక మానవ ఆవాస యోగ్యమైన పరిస్థితులు సృష్టించడం కష్టం కాదనే భావన ఏర్పడింది. దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగడం సవాళ్లతో కూడుకున్నది కనుకనే గతంలో అమెరికా, రష్యా, చైనా దేశాలు ఈక్వెటార్ ప్రాంతంలోనే దిగాయి. అంతరిక్ష రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న రష్యా మన చంద్రయాన్–3 కంటే రెండు రోజుల ముందు ఇక్కడ దిగడానికి విఫలయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ కూడా ఇటువంటి ప్రయత్నంలో విఫలమైంది. నాలుగేళ్ల కింద మన చంద్రయాన్–2 ప్రయత్నం చివరి క్షణాల్లో విఫలం కావడం ఈ విజయానికి గుణపాఠంగా ఉపయోగప డింది. ఇక దక్షిణ ధ్రువంపై కాలూనడానికి ప్రపంచంలోని మిగిలిన అంతరిక్ష సంస్థలు కూడా పోటీపడతాయి. 2025లో ఆర్టెమిస్ అనే వ్యోమనౌకను అమెరికా ప్రయోగించబోతున్నది. ఇద్దరు మనుషుల్ని కూడా ఈ ప్రయోగం ద్వారా అమెరికా దించబోతున్నది. వారు ఒకటి రెండు వారాలపాటు అక్కడ గడుపుతారు. తాత్కాలిక స్థావరాన్ని కూడా ఏర్పాటు చేయ బోతున్నారు. పోర్చుగీసు నావికుడైన వాస్కోడాగామా ఐరోపా నుంచి భారత్‌కు సముద్ర మార్గాన్ని కనుగొన్నాడని మనకు తెలుసు. ఫలితంగా పోర్చుగీసు వారు అప్పటికి సుసంపన్న దేశంగా ఉన్న భారత్ నుంచి సుగంధ ద్రవ్యాలను కారుచౌకగా తరలించుకొని వెళ్లి వ్యాపారాల్లో బాగా లాభపడ్డారు. కామ ధేనువు లాంటి ఇండియాకు మార్గం తెలిసింది కనుక ఐరోపాలో అంతకంటే బలవంతుడైన బ్రిటిష్‌వాడు ప్రవేశించాడు. పోర్చు గీసు వారిని తరిమేసి కామధేనువు మూలుగల్ని పీల్చిపారేశాడు. తాజా కథ కూడా దాదాపు ఇలాంటిదే కావచ్చేమో! అంతరిక్ష విజ్ఞానం శాస్త్ర జిజ్ఞాస దశను దాటి వాణిజ్య దశలోకి ప్రవేశించింది. అంతరిక్ష ప్రయోగాలు చేయగలిగే దేశాలకు ఇప్పుడు చేతినిండా ‘ఆర్డర్లు’. కమ్యూనికేషన్లు తదితర అవసరాల కోసం అన్ని దేశాలూ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించుకోవాలి. కొన్ని ప్రైవేట్ సంస్థలకు కూడా అటువంటి అవసరాలున్నాయి. ఇవి ఒన్‌టైమ్ ఆర్డర్లు మాత్రమే కాదు,నిరంతరం ఉండేవి. అంతరిక్ష ప్రయోగాల నైపుణ్యం ఉన్న దేశాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో చౌకగా పనిచేసి పెట్టే దేశం భారత్. ఫలితంగా భారత అంతరిక్ష మార్కెట్ రూ.70 వేల కోట్లకు చేరుకున్నది. ఇంకో పదిహేనేళ్లలో ఈ మార్కెట్ మూడున్నర లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఇప్పుడు చంద్రయాన్–3 విజయంతో భారతదేశ సామర్థ్యం పట్ల నమ్మకం పెరిగింది. అతి తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను ప్రయోగించగలిగే దేశం భారత్ మాత్రమే! భారత ఆధునిక అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ ఇస్రోలో మొదటి నుంచి పొదుపును ఒక అలవాటుగా తీర్చిదిద్దారని చెబుతారు. అందుబాటులో ఉన్న వనరులను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడంతోపాటు, పూర్తి స్వదేశీ పరికరాలనే ఇస్రో ఉపయోగిస్తున్నది. ప్రపంచంలోని మిగిలిన స్పేస్ సెంటర్లలో పనిచేసే వారితో పోలిస్తే మన ఇస్రో సిబ్బంది జీతాలు చాలా తక్కువ. మన దేశంలో ఐటీ ఉద్యోగులతో పోల్చినా కూడా బాగా తక్కువే. ప్రయోగం విజయవంతమైన సమయంలో టీవీ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వారిని దేశ ప్రజలందరూ గమనించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబీకుల్లాగానే వారి ఆహార్యం కనిపించింది. జీతాల్లో, జీవితాల్లోనే వారు మధ్య తరగతి. విజ్ఞానంలో, అంకితభావంలో, దేశభక్తిలో వారు అత్యున్నత తరగతికి చెందినవారని పదేపదే నిరూపితమవుతూ వస్తున్నది. రాంచీలో ఉన్న హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ (హెచ్ఈసీ) వాళ్లు చంద్రయాన్ కోసం రాకెట్ లాంచ్ ప్యాడ్‌ను తయారుచేసి ఇచ్చారు. ఇది కూడా ప్రభుత్వరంగ సంస్థే. బహుశా ప్రైవేటీకరణ లిస్టులో ఉందేమో! ఇక్కడ ఇంజనీర్లకూ, ఉద్యోగులకూ 17 నెలలుగా జీతాలు లేవు. అయినా సరే దేశంకోసం చేసే పనిని దైవకార్యంగా భావించి ఉద్యోగులు జీతాలపై పట్టుబట్టకుండా ఇచ్చిన కాంట్రాక్టును గడువు లోపల పూర్తిచేసి పెట్టారు. సాధారణ ఉద్యోగులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తల త్యాగం పెట్టుబడిగా ఇప్పుడు భారత్ లక్షలకోట్ల మార్కెట్‌కు వల వేసింది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు ఇప్పుడు భారత అంతరిక్ష మార్కెట్ విధానం. ‘ఆదిపురుష్’ సినిమా కంటే తక్కువ ఖర్చుతో చంద్రయాన్–3 అనేది నినాదం! లక్షల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే కొత్త మార్కెట్ ఇది. న్యూ ఎకానమీ. కొత్త ఆర్థిక రంగానికి ద్వారాలు తెరిచినప్పుడు పరమ పవిత్రమైన పెట్టుబడిదారీ వ్యవస్థ సంప్రదాయాల ప్రకారం ముందుగా ప్రైవేట్ రంగం కుడికాలు మోపి లోపలికి ప్రవేశించాలి. అందుకు అనుగుణంగా మన అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. సాంకేతిక నైపుణ్య అభివృద్ధికీ, పరిశోధనలకూ ఇస్రోను పరిమితం చేస్తారు కాబోలు! ఉపగ్రహాలు ప్రయోగించడం, ముందుముందు అంతరిక్ష, చంద్రగ్రహ టూరిజం అభివృద్ధి చెందితే వ్యోమ నౌకలను ప్రైవేట్ ట్రావెల్స్ పేరుతో నడపడం వంటివన్నీ ప్రైవేట్ చేతికి వెళ్తాయి. ఆవు శిరస్సు భాగం ప్రభుత్వ నిర్వహణలో ఉంటుంది. దానికి గడ్డి వేయాల్సిన బాధ్యత ప్రభు త్వానిది. పొదుగు భాగం ప్రైవేట్‌కు వెళ్తుంది. పాలు పిండుకునే కర్తవ్యం వారిది. ముందుముందు ఈ రంగంలో భారీ పెట్టుబడుల అవసరం ఉంటుంది కనుక ప్రైవేట్‌రంగం ప్రవేశించక తప్పదని ప్రభుత్వం వాదన. ఇందుకు వారు ‘నాసా’ను మార్గ దర్శిగా ఎంచుకున్నారు. భూగర్భంలోని ఖనిజాలు, చమురు–వాయువులు, భూమ్మీద కొండలు గుట్టలు, అడవులు, ఆకాశయానాలతో సహా అన్నిటా ఇప్పటికే ప్రైవేటు రంగం ప్రవేశించింది. స్పేస్ టెక్నాలజీ సృష్టించిన న్యూ ఎకానమీని కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించాలా? మౌలిక రంగాల్లో , సంక్షేమ రంగాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నది కదా! దీనికి డబ్బెక్కడి నుంచి రావాలి? మనం కట్టే పన్నులేనా? సాధారణ ప్రజలు పన్నులు కట్టాలి... బడాబాబులు బ్యాంకులు లూటీ చేయాలా? ఇదెక్కడి న్యాయం? ఇటువంటి సందేహాలు సగటు కుటుంబరావులకు సహజంగా కలుగుతుంటాయి. వారికి ఆర్థిక సూత్రాలు, వాటి లోతుపాతులు అర్థంకావు. అర్థం కాదు కాబట్టే దాన్ని ఆర్థిక శాస్త్రం అన్నారు. ప్రభుత్వాలకూ, పెట్టుబడులకూ సరిగ్గా అర్థమవుతాయి. లాభాలు ఏ రంగంలో వచ్చినా సరే దేశ జీడీపీ పెరుగుతుంది. అది పెరుగుతున్నకొద్దీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తలసరి ఆదాయాలు పెరుగుతాయి, తలసరి విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఇటువంటి లెక్క లేవో చెబుతారు. కార్మికులు, ఉద్యోగులు, శాస్త్రవేత్తలు, శ్రామికులు, కష్టాలు, కన్నీళ్లు, దోపిడీ, పీడన, బ్యాంకుల లూటీ, ఎర్రజెండాలు, ధర్నా చౌకులు... వగైరా పదజాలాన్ని కాస్సేపు పక్కనబెడదాం. చంద్రయాన్–3 ప్రయోగ విజయం న్యూ ఎకానమీ వృద్ధికి తోడ్పడు తుందనేది నిర్వివాదాంశం. ఈ విజయం ఆర్థిక రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. జీ–20 అధ్యక్ష హోదాలో ఉన్న సమయంలోనే వచ్చిన అవకాశం. దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తుంది. ఆర్థికరంగం, శాస్త్ర విజ్ఞాన రంగం, రక్షణ పాటవం... ఈ మూడు రంగాల్లో ఏ దేశం ఆధిపత్యం వహిస్తుందో అదే అగ్రరాజ్యం. ఈ మూడు రంగాల్లో కూడా ఇంచుమించు టాప్–5 లోకి భారత్ ప్రవేశించిన సూచనలు కనిపిస్తున్నాయి. మరో మూడు నాలుగేళ్లలో టాప్ త్రీలోకి చేరుతామని ప్రధాని చెబుతున్నారు. అందుకు చంద్రయాన్ విజయం లాంటివి ఉపకరి స్తాయి. అందుకే కాబోలు ఈ ప్రయోగం మీద ప్రధాని ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ‘బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొంటున్నప్పటికీ నా మనసంతా ఇక్కడే ఉంద’ని ఇస్రో శ్రేణులతో సంతోషాన్ని పంచుకున్నారు. ఇండియాకు వచ్చిన తర్వాత స్వయంగా ఇస్రో కేంద్రానికి వెళ్లి సిబ్బందిని అభినందించారు. ల్యాండర్ దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’గా నామకరణం చేశారు. ప్రయోగాల ముందు పూజలు, దేవుళ్ల పేరుతో నామ కరణాలు వగైరాల పట్ల అభ్యంతరం చెబుతున్నవారు కూడా తక్కువేమీ కాదు. మూఢ నమ్మకాలు సైన్స్ పురోగతికి ప్రతిబంధకాలే. కానీ మూఢ నమ్మకాలు వేరు, విశ్వాసాలు వేరు. ఈ సృష్టికి కారణమేమిటి? అనే ప్రశ్నకు సైన్స్ ఇప్పటికీ సంతృప్తికరమైన సమాధానాన్ని ఇవ్వలేదు. సైన్స్ ఆ సమాధానం చెప్పనంతవరకూ ఎవరి విశ్వాసం వారికుంటుంది. ఆ విశ్వాసాల మేరకు ప్రార్థనలూ, పూజలూ ఉంటాయి. కాకపోతే రాజ్యాంగబద్ధంగా మనది సెక్యులర్ దేశం కనుక ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎటువంటి పూజా విధానాలను అనుసరించాలి అనే అంశంపై ఆమోదయోగ్యమైన మార్గదర్శకాలు అవసరం. అంతరిక్షంతోపాటు సమస్త విజ్ఞానమంతా వేదాల్లోనే ఉన్నదని హిందూ చరిత్రకారులు ఢంకా భజాయిస్తారు. ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయట’ అంటూ వారిని కొందరు వేళాకోళం చేస్తుంటారు. వేళాకోళం చేయవలసిన అవసరమయితే కనిపించడం లేదు. రుగ్వేద కాలం నాటికే మనకు అంతరిక్ష పరిజ్ఞానం ఉన్నది. ఈ విశ్వం అనంతమైనదని, ఎక్కడ మొదలైందో, ఎక్కడ అంత మవుతుందో తెలియదని ఖగోళ శాస్త్రం చెబుతున్నది. ఆది మధ్యాంత రహితమని వేదం కూడా చెప్పింది. విశ్వం ఆవిర్భవించడానికి కారణంగా బిగ్‌బ్యాంగ్ థియరీని శాస్త్రవేత్తలు ప్రతి పాదించారు. ఇది ఇరవయ్యో శతాబ్దం ప్రథమార్ధం నాటి సంగతి. అంతకంటే సుమారు నాలుగు వేల ఏళ్లకు పూర్వం రుగ్వేదంలోని నాసదీయ సూక్తం కూడా దాదాపు ఇదే ప్రతి పాదన చేసింది. ‘హిరణ్యగర్భం’లో సంభవించిన బ్రహ్మాండ విస్ఫోటనం వల్ల నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఈ సూక్తం చెబుతున్నది. రుగ్వేద కాలం నాటికి అంతరిక్ష పరిజ్ఞానం ఉన్నదనే మాట కేవలం హిందూ చరిత్రకారులు మాత్రమే చెప్పడం లేదు. హేతువాది, బౌద్ధ మతావలంబి, కమ్యూనిస్టు ఆలోచనాపరుడైన మహాపండితుడు రాహుల్ సాంకృత్యాయన్ కూడా తన ‘రుగ్వేద ఆర్యులు’ పుస్తకంలో ఈ సంగతి నిర్ధారించారు. విశ్వం మీద ప్రసిద్ధ రచనలు చేసిన కార్ల్ సేగన్ అభిప్రాయం ప్రకారం ఆధ్యాత్మికతకూ, సైన్స్కూ వైరుద్ధ్యం లేదు. పైగా ఆధ్యాత్మిక ఆలోచనలకు సైన్స్ గొప్ప ప్రేరణ కూడా! మనకు దృగ్గోచరమైన జగత్తులో సూర్యుడు ప్రసరించే కోటానుకోట్ల కిరణాల్లో ఒక కిరణం వెదజల్లే అనంతకోటి ధూళి రేణువుల్లో ఒకదాన్ని చూడండి. అదే మన ఇల్లు. అక్కడే మన చరిత్ర. మన సంస్కృతి. అక్కడే రాజులూ–రాజ్యాలు, నాగరికత నిర్మాతలు – విధ్వంసకులు, ప్రేమలు – పగలు, తల్లీదండ్రీ, ఆనందాలు – ఉద్వేగాలు, కష్టాలు–కన్నీళ్లు, మతాలు–ప్రార్థ నలు, నీతులు చెప్పే పంతుళ్లు – అవినీతి గోతులు తీసే నాయకులు, సూపర్ స్టార్లు – సుప్రీమ్ లీడర్లు, సాధువులు – పాపులు... అన్నీ.. అందరూ అక్కడే ఆ ధూళి రేణువుపైనే అంటాడు. సూర్యకాంతిలోని ఓ ధూళి రేణువంత భూగోళంలో ఉన్న మనం ఈ అనంత విశ్వాసాన్ని ఎప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి! మహా అయితే ఇంకో వందేళ్లకో, రెండొందల ఏళ్లకో మనం ఈ భూమిని ఖాళీ చేయవలసిందే! ఆ తర్వాత ఇంకెంతమాత్రం భూగోళం ఆవాసయోగ్యం కాదని స్టీఫెన్ హాకింగ్ చేసిన హెచ్చరిక పదేపదే చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. అంతగా ధ్వంసం చేశారు భూదేవిని! ‘సముద్రవసనే దేవీ, పర్వతస్తన మండలే, విష్ణుపత్నీ నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే’ అని పూజించిన భూమిని కొందరు స్వార్థం కోసం పీల్చి పిప్పిచేశారు. దురాశతో, కక్కుర్తితో, కండూతితో నిస్సారంగా మార్చారు. అందువల్ల మరో గ్రహాన్వేషణ తప్పదట! మరో గ్రహంలో తలదాచుకోకపోతే మానవజాతి అంతరించిపోక తప్పదట. అదిగో అందుకోసం కూడా ఈ చంద్రయానం తప్పనిసరి. ఇది మొదటి అడుగు. చందమామపై నివాసంతోపాటు దాన్ని అంతరిక్ష గేట్వేగా ఉపయోగించుకొని అంగారక గ్రహానికి (మార్స్) వలస పోవాలని ప్రయత్నాలు ప్రారంభమవుతున్నాయి. ఈ ‘స్పేసి’ నేని ట్రావెల్స్ ప్రభుత్వరంగంలో కాక ప్రైవేట్‌రంగంలో ఉండబోతున్నది కనుక ప్రయాణం చేయగలిగినవాడు కోటీశ్వరుడై ఉండాలి. యుగాంతంపై తీసిన ‘2012’ సినిమా గుర్తుకొస్తున్నది. సౌరతాపం వల్ల భూకేంద్రకం వేడెక్కి సము ద్రాలు ఉప్పొంగుతాయని హెచ్చరికలు వస్తాయి. కొన్ని దేశాలు కలిసి బలిష్ఠమైన పడవల్లాంటి ఆశ్రయాలను హిమాలయాలపై నెలకొల్పుతాయి. వీటిలో 40 లక్షల మందే పడతారు. వారంతా ఖరీదైన టిక్కెట్లు కొనుక్కొని ప్రాణాలు కాపాడుకుంటారు. మిగిలిన 700 కోట్ల జనాభా మునిగిపోతుంది. ‘టైటానిక్’ సినిమా కూడా అంతే కదా! పడవ మునగబోతున్నది, లైఫ్ బోట్లలో 700 మందే పడతారు. పెద్దటిక్కెట్లు కొన్నవారిని క్షేమంగా లైఫ్ బోట్లలో తరలిస్తారు. పేద టిక్కెట్ల బ్యాచ్ 1,500 మంది జలసమాధి అవుతారు. భూ విధ్వంసానికి ఎవరైతే కారకులయ్యాలో వారే స్పేస్ ట్రావెల్స్ టిక్కెట్లు కొనుక్కొని బతికి బయటపడవచ్చు... కొనలేని వారి పరిస్థితి? ‘మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు’ అంటూ శ్రీశ్రీ శ్రామిక లోకానికి పిలుపు నిచ్చారు. ఇంకో వందేళ్లకు సంపన్నులందరూ తోసుకుంటూ దూసుకుంటూ మరో ప్రపంచానికి వెళ్తారు కాబోలు! చంద మామా నువ్వు అందరివాడివా? కొందరివాడివా? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ప్రిగోజిన్ ఉత్థాన పతనాలు!
కిరాయి సైన్యం అధిపతి యెవ్‌గనీ ప్రిగోజిన్ బుధవారం విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడని రెండు రోజుల తర్వాత రష్యా అధికారికంగా ధ్రువీకరించింది. రెండు నెలల క్రితం తిరుగుబాటు ప్రకటించి మాస్కోవైపు శతఘ్నులతో దూసుకెళ్లిన ప్రిగోజిన్ అధ్యక్షుడు పుతిన్ మినహా ఇతర ఉన్నత స్థాయి నాయకగణంపై విమర్శలు గుప్పిస్తూ వచ్చాడు. కానీ ఉన్నట్టుండి జూన్ 23న నేరుగా తన కిరాయి సైనికులతో మాస్కో దిశగా దండయాత్రకు తరలివెళ్లి అందరినీ ఆశ్చర్య పరిచాడు. బహుశా పుతిన్ మినహా మిగిలినవారిపైనే తాను ఆగ్రహిస్తున్నట్టు నమ్మించ గలుగుతున్నానని ప్రిగోజిన్ భ్రమపడి వుండొచ్చు. ఈ అలజడి పుతిన్‌ను భయోత్పాతంలో ముంచిందనీ, ఆయన అజ్ఞాతానికి పోయారనీ ప్రచారం జరిగింది. ఆ మర్నాడు మీడియాతో మాట్లాడిన పుతిన్, ప్రిగోజిన్‌ను ‘నమ్మక ద్రోహి’గా అభివర్ణించారు. ఇలా ప్రకటించటం మరణ శాసనమేనని అప్పట్లో చాలామంది జోస్యం చెప్పారు. రష్యాలో లేదా విదేశాల్లో ఉంటూ విమర్శలు గుప్పించే రాజకీయ ప్రత్యర్థులు కావొచ్చు, దేశ రహస్యాలను వేరే దేశాలకు విక్రయించినవారు కావొచ్చు పుతిన్ దృష్టిలో నమ్మక ద్రోహులే. ఆ హిట్ లిస్ట్‌లోని వారిలో తప్పనిసరై ఒకరిద్దరిని జైల్లో పడేశారు తప్ప ఇంతవరకూ ఎవరినీ ప్రాణాలతో వదల్లేదు. ఇతరేతర అంశాలైతే వేరుగానీ, నమ్మక ద్రోహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోనని గతంలో పుతిన్ చేసిన ప్రకటనను ప్రిగోజిన్ వ్యవహారంలో కొందరు గుర్తుచేశారు. నిజానికి బెలారస్ మధ్యవర్తిత్వంతో ప్రిగోజిన్ శాంతించారని, అతనికీ, ప్రభుత్వానికీ అంగీకారం కుదిరిందని ప్రకటన వచ్చినప్పుడు ప్రిగోజిన్‌కు రోజులు దగ్గరపడినట్టేనని చాలామంది అనుకున్నారు. అదే సమయంలో పుతిన్ అతన్ని క్షమిస్తారన్న విశ్లేషణలూ వచ్చాయి. ఎందుకంటే ఉక్రెయిన్‌పై ఏడాదిన్నర క్రితం దురాక్రమణ యుద్ధం మొదలెట్టాక రష్యా చేజిక్కించుకున్న పెద్ద నగరం బఖ్మూత్. వేరే నగరాలు చిక్కినట్టే చిక్కి చేజారగా, బఖ్మూత్ మాత్రం ఇంకా రష్యా నియంత్రణలోనే ఉంది. ఈ విజయం నిస్సందేహంగా ప్రిగోజిన్దే.అందుకే అతన్ని మళ్లీ తన దారికి తెచ్చుకుని ఉక్రెయన్ను ముప్పుతిప్పలు పెట్టడానికి పుతిన్ వినియోగించుకుంటారని భావించారు. కానీ ప్రిగోజిన్ తలరాతను పుతిన్ అప్పటికే వేరే రాశారు. తన 23 యేళ్ల ఏలుబడిలో పుతిన్ కఠినాత్ముడన్న పేరు తెచ్చుకోవటానికే మొగ్గుచూపారు. కానీ ప్రిగోజిన్ విషయంలో దాన్నంతటినీ తాత్కాలికంగానైనా దిగమింగి అతను క్షేమంగా వెళ్లిపోవటానికి అంగీకరించి, ఆ ఇమేజ్ను పోగొట్టుకున్నారు. చివరకు క్రెమ్లిన్‌లో అతని కిరాయి సైన్యంతో సమావేశమైనప్పుడు అందులో ప్రిగోజిన్ సైతం పాల్గొనటానికి పుతిన్ అనుమతించారు. ఈ ఆధునిక కాలంలో కూడా రాజ్యాలు తమ మనుగడ కోసం కిరాయి సైన్యాలపై ఆధారపడటం వింతగానే ఉంటుంది. అమెరికాలో పోలీసు విధులు కాంట్రాక్టులకు ఇచ్చే అలవాటున్నా సైన్యం విషయంలో ఆ విధానం పెట్టుకోలేదు. ఆఫ్రికా ఖండంలో ప్రస్తుతం అనేక దేశాలు ప్రిగోజిన్ సేవ లను వాడుకుంటున్నాయి. వాస్తవానికి పాశ్చాత్య దేశాల మీడియా చాన్నాళ్లుగా ప్రిగోజిన్ గురించి కథనాలు వెలువరిస్తున్నా ఆ సైన్యం ఉనికిని పుతిన్ ధ్రువీకరించలేదు. ఆఫ్రికా ఖండ దేశాల్లో అతని సైనికుల ఆగడాలపై అనేకానేక కథనాలు వచ్చాయి. ఆఖరికి ఉక్రెయిన్ దురాక్రమణ యుద్ధ సమయంలోనూ కిరాయి సేనల ఉనికిని రష్యా అధికారికంగా అంగీకరించలేదు. తమ చట్టాలు ప్రైవేటు సైనిక కంపెనీలను అంగీకరించబోవన్నదే పుతిన్ చెబుతూవచ్చిన జవాబు. కానీ జూన్ 23 నాటి తిరుగుబాటు ఈ వ్యవహారాన్ని బజారున పడేసింది. మాస్కోలో మాఫియా తరహా రాజ్యం నడు స్తోందన్న పాశ్చాత్య మీడియా ప్రచారానికి బలం చేకూర్చింది. రెండు దశాబ్దాలపైగా పుతిన్ అటు వంటి రాజ్యాన్నే నడుపుతున్నారనడానికి ఆయన వ్యతిరేకుల అనుమానాస్పద మరణాలను చాలామంది ఉటంకిస్తుంటారు. పుతిన్ అవినీతిపై కథనాలు రాస్తున్న మహిళా జర్నలిస్టు అనా పొలిటికోవ్స్కియాను 2006లో కాల్చిచంపారు. ఫెడరల్ సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తూ 2006లో బ్రిటన్ పరారైన అలెగ్జాండర్ లిత్వినెంకో లండన్‌లోని దుకాణంలో రేడియో ధార్మిక పదార్థం కలిసిన టీ తాగి మరణించారు. పుతిన్ అధికారానికి రావటానికి తోడ్పడిన బోరిస్ బెరిజోవ్స్కీ ఆయన ఆగ్రహానికి గురై బ్రిటన్ వెళ్లిపోయినా 2013లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. 2015లో బోరిస్ నెమ్ట్స్నోవ్ అనే భౌతిక శాస్త్రవేత్తను క్రెమ్లిన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఒకప్పుడు పుతిన్‌కు సన్నిహితంగా మెలిగి తర్వాత అతనికి బద్ధ వ్యతిరేకి అయిన అలెక్సీ నవాల్ని సైతం 2020లో ఒక రేడియో ధార్మిక పదార్థం బారినపడ్డారు. ఆయన చచ్చి బతికాడనుకుంటే ఇప్పుడు నిరవధికంగా జైల్లో మగ్గుతున్నాడు. చట్టసభలూ, ఇతర వ్యవస్థలూ సజావుగా పనిచేస్తున్నట్టు కనబడే రాజ్యాల్లో నియంతలు బయల్దేరి వాటిని భ్రష్టుపట్టించటం, అధికారంలో శాశ్వతంగా కొనసాగేట్టు చూసుకోవటం కొత్తేమీ కాదు. కానీ పుతిన్ తీరే వేరు. రాజ్య వ్యవస్థలకు సమాంతరంగా చట్టాలతో సంబంధం లేకుండా పటిష్టమైన సొంత వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని వాటిద్వారా వ్యతిరేకులను అణచివేసే విధానం ఆయనది. ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఒకప్పుడు జర్మనీ నియంత హిట్లర్‌ను మట్టికరిపించే క్రమంలో 87 లక్షల మంది సైనికులతో సహా దాదాపు 2 కోట్ల 70 లక్షలమంది ప్రాణాలు పోగొట్టు కున్న దేశానికి ఈ పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించివుండరు. ఏదేమైనా ప్రిగోజిన్ ఉత్థాన పతనాలు వర్తమాన ప్రపంచ దుఃస్థితికి అద్దం పడతాయి. -
బ్రిక్స్‌కు కొత్త బలం!
కాలం అందరికీ... వ్యక్తులకైనా, సంస్థలకైనా అన్నీ నేర్పుతుంది. పదిహేనేళ్ల క్రితం అప్పట్లో ఆర్థికంగా జవసత్వాలు పుంజుకుంటున్న బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలతో బ్రిక్‌గా ఏర్పడిన సహకార కూటమి అనంతరకాలంలో దక్షిణాఫ్రికాను కూడా కలుపుకొని బ్రిక్స్‌గా రూపాంతరం చెందింది. జోహన్నెస్‌బర్గ్‌లో మూడు రోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు గురువారం ముగిసే సమయానికి మరో ఆరు దేశాలకు– సౌదీ అరేబియా, యూఏఈ, అర్జెంటీనా, ఇథియోపియా, ఇరాన్, ఈజిప్టులకు ఈ సారి సభ్యత్వం లభించింది. ఈ దేశాల భాగస్వామ్యం వచ్చే జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. ఇకపై దీన్ని బ్రిక్స్–11గా వ్యవహరిస్తారు. ఆరంభంలో ఆ కూటమి వైపు పెద్దగా దృష్టి సారించని దేశాలు అందులో భాగస్వాములై ఎదగాలని ఇప్పుడు తహతహలాడటం అనివార్య పరిణామం. కరోనా మహమ్మారితో, ఉక్రెయిన్ యుద్ధంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థలకు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు విధానాలు ఇబ్బందికరంగానే ఉంటున్నాయి. మరోపక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై పశ్చి మార్ధ గోళ దేశాల ఆధిపత్యాన్ని, ముఖ్యంగా అమెరికా పెత్తనాన్ని బలహీన పరచాలని చూస్తున్న రష్యా, చైనాలకు ఈ పరిణామం సహజంగానే బలాన్నిస్తోంది. అయితే ఉక్రెయిన్ దురాక్రమణ యుద్ధంలో పీకల్లోతు కూరుకుపోయి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అభిశంసనకు గురయిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కాలేని నిస్సహాయస్థితిలో పడ్డారు. ఆ కోర్టులో దక్షిణాఫ్రికా సభ్యదేశంగా ఉండటం వల్ల అది పుతిన్‌పై జారీచేసిన అరెస్టు వారెంట్‌ను అమలుపరచక తప్పదు. నిజంగా దక్షిణాఫ్రికా ఆ పని చేస్తుందా లేదా అన్న సంగతి అటుంచితే ఈ స్థితిలో హాజరు కావటం పుతిన్‌కే అవమానకరమవుతుంది. దాంతో ఆయన శిఖరాగ్ర సదస్సును ద్దేశించి వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. అయితే ఇప్పటికిప్పుడు బ్రిక్స్ దేశాలు అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగరేసే స్థితి లేదు. మన దేశం, బ్రెజిల్ అమె రికాకూ, ఇతర పాశ్చాత్య దేశా లకూ సన్నిహితంగా ఉంటున్నాయి. ఆ మాటకొస్తే చైనా సైతం వివిధ అంశాల్లో అమెరికాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, దానితో బాహాటంగా ఘర్షణకు దిగాలనుకోవటం లేదు. రణరంగంలో నిలిచిన రష్యా ఒక్కటే ఇందుకు మినహాయింపు. సదస్సు ప్రారంభంలోనే ఈ ధోరణి కనబడింది. బ్రిక్స్ దేశాధినేతల్లో ఇతరులు సమానత్వం ఆధారంగా అంతర్జాతీయ సంబంధాలుండాలని మాట్లా డితే... పుతిన్ మాత్రం ఏ రకమైన పెత్తందారీ పోకడలకైనా తాము బద్ధ విరోధులమని కుండ బద్దలు కొట్టారు. తన శత్రువులు నయా వలసవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని కూడా ఆరోపించారు. పనిలో పనిగా ఉక్రెయిన్‌లో వర్తమాన సంక్షోభానికి పాశ్చాత్య దేశాల పెత్తందారీతనమే కారణమన్నారు. కూటమి విస్తరణ, దాని అమరిక ఎప్పుడూ ఒకేలా ఉండదు. సాధారణ పరిస్థితుల్లో ఉన్న కూటమి సంక్షోభాలు చుట్టుముట్టినప్పుడు చెల్లాచెదురు కావొచ్చు. కొత్త దేశాలొచ్చి అందులో చేరవచ్చు కూడా. తన ప్రయోజనాలకు అనుగుణంగా బ్రిక్స్ విస్తరణ ఉండాలని చైనా ఏడాదిగా ప్రయత్నిస్తోంది. మన దేశం కూడా ఆ దిశగానే అడుగులు వేసింది. నిరుడు బీజింగ్‌లో జరిగిన సదస్సులోనే విస్తరణపై ఆలోచన బయల్దేరింది. సభ్యత్వానికి అర్హతలు, కూటమిలో చేరాక ఆ దేశాలు అనుసరించాల్సిన విధానాలు వగైరాలకు ఈ ఏడాదికాలంలో తుది రూపం ఇచ్చారు. పెద్ద ఆర్థిక వ్యవస్థలు, మెరుగైన వృద్ధి రేటు ఉండేవాటినే సభ్యదేశాలుగా చేర్చుకోవాలని బ్రిక్స్ మూలవిరాట్టు లైన అయిదు దేశాలూ ఏకాభిప్రాయానికొచ్చాయి. అలాగే ఇకపై కూడా అయిదు దేశాలూ ఏకాభి ప్రాయానికొస్తే తప్ప ఏ దేశానికీ సభ్యత్వం ఇవ్వరాదన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనకు అంగీకారం లభించింది. బహుళత్వం, సుస్థిర, శాంతియుత అభివృద్ధి, పరస్పర సహకారంతో ఎదుగుదల, సంస్థాగత అభివృద్ధి, బ్రిక్స్ దేశాల ప్రజానీకం మధ్య సంబంధాలు నెలకొల్పటం వగైరాల సాధనకు కృషి చేయాలన్న జోహన్నెస్‌బర్గ్ డిక్లరేషన్ సంకల్పం నెరవేరే దిశగా అడుగులు పడితే సంస్థ భవిష్యత్తులో మరింత బలపడుతుంది. ఎప్పటిలాగే ఘర్షణల విషయం వచ్చేసరికి డిక్లరేషన్ ఆచితూచి వ్యవహరించిందనాలి. నిర్మాణాత్మక చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చి ఊరుకుంది. అంతేతప్ప ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించలేదు. బ్రిక్స్ స్వభావరీత్యా స్వేచ్ఛా వాణిజ్య కూటమి వంటిది కాదు. దేశాల మధ్య సమన్వయం సాధించి, పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఎదగాలన్నది ఈ కూటమి ప్రధాన ధ్యేయం. బ్రిక్స్ కరెన్సీ అంటూ ప్రత్యేకించి లేకపోయినా ఆయా దేశాల కరెన్సీలు బలపడేందుకు అవసరమైన సాయాన్ని అందించటం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది. ఈసారి శిఖరాగ్ర సదస్సులో ఉమ్మడి కరెన్సీ గురించిన ఆలోచన చేస్తారని వినబడినా అదేం జరగలేదు. అయితే 2015లో కూటమి ఏర్పాటు చేసిన న్యూ డెవెలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) సమర్థవంతంగానే పనిచేస్తోంది. కూటమిలో కొంత వెనకబడిన దేశాలకు ఈ సంస్థ ద్వారానే సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పటికైతే బ్రిక్స్‌లో చేరడానికి దక్షిణార్ధ గోళ దేశాల ఉత్సాహాన్ని సంపన్న దేశాలు ఒక హెచ్చరికగా పరిగణించక తప్పదు. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా పుంజుకుంటున్న దేశాల ఆకాంక్షలను గుర్తించి తగినవిధంగా వ్యవహరించకుంటే బ్రిక్స్ మాత్రమే కాదు... భవిష్యత్తులో మరిన్ని కూటములు ఉనికిలోకొస్తాయి. ఒకటైతే నిజం – ఆవిర్భవించి పదిహేనేళ్లయినా బ్రిక్స్ సంస్థాగత స్వభావాన్ని సంతరించుకోలేదు. ఆ దేశాలమధ్య పరస్పర ఐక్యతగానీ, ఉమ్మడి లక్ష్యాలుగానీ లేవు. ఆ లోపాన్ని సవరించుకుంటే బ్రిక్స్ మరింత పటిష్టవంతమైన కూటమిగా రూపుదిద్దుకోవటం ఖాయం. -
మహోన్నత ఘట్టం
కోట్లాదిమంది భారతీయులు ఊపిరి బిగపట్టి ఎదురుచూసిన ఒక అపురూపమైన, మహోన్నతమైన ఘట్టం అంతరిక్షంలో ఆవిష్కృతమైంది. సహస్రాబ్దాలుగా విశ్వ మానవాళికి కనువిందు చేస్తున్న చందమామపై పరిశోధనల కోసం మన శాస్త్రవేత్తలు ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్ బుధవారం అఖండ విజయం సాధించింది. ఎవరికీ లొంగిరాని చంద్రుడి తలంపైనున్న దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని పరిశోధనల కోసం ఎంచుకుని, విక్రమ్ ల్యాండర్‌ను అక్కడే దించితీరాలన్న లక్ష్యంతో పనిచేసిన మన శాస్త్రవేత్తల సాహస ప్రయత్నం సాకారం కావడం ప్రపంచ దేశాలను అబ్బురపరి చింది. దేశం సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. విక్రమ్ ల్యాండర్ సరిగ్గా అనుకున్నచోటే, అనుకున్న సమయానికే సురక్షితంగా కాలూనడం అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనల పరంపరను కీలక మలుపు తిప్పే ఒక అసాధారణ విన్యాసం. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు ఇదొక చారిత్రక ఘట్టం. దీని వెనక వందలాదిమంది శాస్త్రవేత్తల నాలుగేళ్ల నిరంతర కృషి, దృఢసంకల్పమూ పెనవేసుకుని ఉన్నాయి. ముఖ్యంగా గత 41 రోజులుగా అన్ని విభాగాలకు చెందిన శాస్త్రవేత్తలూ పరస్పర సమన్వయంతో రాత్రింబగళ్లు పనిచేస్తూ చంద్రయాన్ గమనాన్ని కళ్లల్లో వత్తులు వేసుకుని చూశారు. రెప్పవాల్చని నిఘాతో ఎప్పటికప్పుడు దాన్ని నిశితంగా గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుతో ముడిపడిన శాస్త్ర, సాంకేతిక సిబ్బంది అందరూ చంద్రయాన్నే శ్వాసించారు. మరే వ్యాపకమూ లేదన్నట్టు ఈ ప్రాజెక్టుపైనే తమ సర్వశక్తులూ కేంద్రీకరించారు. మన శాస్త్రవేత్తల ప్రయోగాల్లో వైఫల్యాల శాతం అతి తక్కువ. చంద్రయాన్–2 ప్రాజెక్టులో పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి గురుత్వాకర్షణ వేగాన్ని అధిగమించలేక విఫలమైందన్న మాటేగానీ, దాంతోపాటు పంపిన ఆర్బిటర్ ఇంకా పనిచేస్తూ ప్రస్తుత ప్రాజెక్టుకు అవసరమైన డేటాను అందించింది. గత నెల 14న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్–3 వ్యోమనౌక కక్ష్యను శాస్త్రవేత్తలు దశలవారీ పెంచుతూ రాగా, ఈనెల 1న భూ కక్ష్యను దాటుకుని చంద్రుడి కక్ష్య దిశగా అది దూసుకెళ్లింది. మరో నాలుగురోజులకు చంద్రుడి కక్ష్యలో చేరగా, ఆనాటినుంచీ దాని కక్ష్యను తగ్గించుకుంటూ వచ్చారు. ల్యాండర్‌ను కిందకు దించే ప్రక్రియను కొనసాగించాలా లేదా అన్నది కేవలం కొన్ని గంటలముందు నిర్ణయించవలసివుంటుంది. అప్పుడు కూడా అంతా సవ్యంగానే సాగుతున్నదని నిర్ధారించుకుని సరిగ్గా ముందనుకున్నట్టే సాయంత్రం 5.45కి ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలంపైకి మళ్లించే దశకు శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. ఏ దశలోనూ చంద్రయాన్ –3కి అవాంతరాలు ఎదురుకాకపోవటం, చివరకు శాస్త్రవేత్తలు సైతం అత్యంత కష్టసాధ్యమైనదని భావించిన చివరి 17 నిమిషాలూ అంచనాలకు అనుగుణంగా ముగియటం అనితర సాధ్యమైన ప్రక్రియ. ల్యాండింగ్ సమయంలో ఏ వ్యవస్థ విఫలమైనా ఆ వెంటనే మరో వ్యవస్థ దాన్ని నెర వేర్చేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వివిధ దేశాలు చంద్రుడిపైకి ఇంతవరకూ మొత్తం 18 వ్యోమనౌకలు పంపగా, అందులో 40 శాతం విఫలమయ్యాయి. 1959 జనవరిలో పూర్వపు సోవియెట్ యూనియన్ తొలి వ్యోమనౌకను పంపింది. 1976 తర్వాత... అంటే 47 ఏళ్ల తర్వాత ఇన్నాళ్లకు జరిపిన రెండో లూనా–25 ప్రయోగంఆ దేశాన్ని తీవ్రంగా నిరాశ పరిచింది. ఈనెల 19న తమ వ్యోమనౌక విఫలమైందని ఆ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆ మరునాడు ప్రకటించింది. అంతరిక్ష రంగంలో కాకలు తీరిన సంస్థే విఫలమైందంటే ఇలాంటి ప్రాజెక్టుల్లో ఎన్ని సంక్లిష్టతలు ఇమిడివుంటాయో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి మన చంద్రయాన్–2 ప్రాజెక్టుకు సహకరించడానికి అప్పట్లో రష్యా ముందుకొచ్చింది. 2011–12 మధ్య జరగాల్సిన ఆ ప్రయోగానికి రాకెట్, ఆర్బిటర్ మనం సమకూర్చుకోవటానికి, ల్యాండర్, రోవర్లను రష్యా అందించటానికి అవగాహన కుదిరింది. తీరా ఆ రెండూ వేరే ప్రయోగాల్లో విఫలం కావటం, రష్యా రూపొందించిన కొత్త డిజైన్లు మన రాకెట్‌కు అనువుగాలేని కారణంగా వాటిని సొంతంగానే రూపొందించుకోవాలని ఇస్రో నిర్ణయించింది. అందువల్లే 2019కి గానీ చంద్ర యాన్–2 సాధ్యపడలేదు. అందులో ఎదురైన వైఫల్యాల నుంచి గుణపాఠం తీసుకోబట్టే తాజా విజయం చేతికందింది. చంద్రుడిపై అతి శీతల ప్రాంతమైన దక్షిణ ధ్రువంలో ఇంతవరకూ ఏ దేశమూ తలపెట్టని అరుదైన ప్రయోగాలు ప్రజ్ఞాన్ రోవర్ నిర్వహిస్తుంది. చంద్రుడిపై ఉన్న మట్టిని, అక్కడి శిలలను సేకరించి మౌలిక, రసాయన సమ్మేళనాల డేటాను ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలకు పంపుతుంటుంది. ఉపరితలంపై ఉన్న మట్టిలోని అయాన్లనూ, ఎలక్ట్రాన్లనూ, వాటి సాంద్రతనూ మదింపు వేస్తుంది. వాటిల్లో కాలానుగుణంగా వచ్చిన మార్పులను పసిగడుతుంది. ఉపరితలంపై ఉన్న ఉష్ణోగ్రతనూ, అక్కడ వచ్చే కంపనాలనూ అంచనా వేస్తుంది. ఈ ప్రయోగాలన్నీ అది ఒక చాంద్రదినం (మనకు 14 రోజుల కాలం)లో పూర్తిచేయాల్సివుంటుంది. ఆ తర్వాత దాని జీవనయానం ముగుస్తుంది. సాంకేతికంగా ఎన్నో సంక్లిష్టలతో నిండివున్న ఈ ప్రయోగానికి సిద్ధపడటం, వేరే దేశాలతో పోలిస్తే దాన్ని అత్యంత చౌకగా (ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 600 కోట్లు) పూర్తి చేయటం మన శాస్త్రవేత్తల సమర్థతను తెలియజేస్తుంది. అణ్వస్త్ర దేశంగా, అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ప్రతిష్టను చంద్రయాన్–3 ఘన విజయం మరింత పెంచింది. ఇది మరిన్ని ప్రయోగాలకు దోహద పడి మొత్తంగా మానవాళి జ్ఞానాన్ని మరింత సునిశితం చేయగలదని ఆశించాలి. -
మణిపుర్ గవర్నర్ మౌనమేల?
ఇంటి దీపమని ముద్దాడితే మీసాలు తెగకాల్చిందని సామెత. మణిపుర్లో కల్లోలం జాడలు కనబడి నప్పుడు అక్కడున్నది ‘డబుల్ ఇంజన్’ సర్కారే కదా అని ఉపేక్షించిన కేంద్ర ప్రభుత్వానికి తదుపరి కర్తవ్యం బోధపడటం లేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. సోమవారం ప్రారంభం కావాల్సిన మణిపుర్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల గురించి 24 గంటలు గడిచినా అతీగతీ లేకపోవటం దాన్నే సూచిస్తోంది. ఆగస్టు మూడోవారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని గత నెల 27న కేబినెట్ భేటీ తర్వాత ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ ప్రకటించారు. అందుకు సంబంధించిన సిఫార్సును ఈనెల 4న లాంఛనంగా గవర్నర్ అనసూయ ఊకే ఆమోదానికి పంపారు. అసెంబ్లీ ప్రోరోగ్ అయింది గనుక నిబంధనల ప్రకారం పక్షం రోజుల ముందు అసెంబ్లీ సమావేశాలపై రాజ్‌భవన్ నుంచి నోటిఫికేషన్ వెలువడాలి. కానీ ఆశ్చర్యకరంగా అలాంటిదేమీ జరగలేదు. హింసాకాండ మొదలై నాలుగు నెలలు గడిచినా ఇంతవరకూ రాష్ట్రంలో ప్రశాంతత ఏర్పడలేదన్నద వాస్తవం. హత్యాకాండలో 160 మందికి పైగా మరణించగా వందలాది మంది పౌరులు గాయ పడ్డారు. బాధితులు ఇప్పటికీ సహాయ శిబిరాల్లో తలదాచుకునే పరిస్థితులే ఉన్నాయి. భద్రతా బల గాలు సోదాలు నిర్వహిస్తూ పోలీస్ స్టేషన్ల నుంచి అపహరించిన మారణాయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకుంటున్నాయి. వివిధ నేరాలతో సంబంధమున్నదని భావిస్తున్న దాదాపు 1,500 మందిని అరెస్టు చేశారు. అయినా చెదురుమదురుగా ఎక్కడో ఒకచోట హింసాత్మక ఘటనలు జరుగు తూనే ఉన్నాయి. మరోపక్క కొండ ప్రాంతాలకు నిత్యావసర సరుకులు సరఫరా కాకుండా ప్రత్యర్థి మైతేయి తెగ అడ్డుకుంటున్నదని ఆరోపిస్తూ ఇంఫాల్–అస్సాంలోని సిల్చార్‌ల మధ్య ఉన్న 37వనంబర్ జాతీయ రహదారిని కుకీలు దిగ్బంధించారు. ఇంఫాల్–నాగాలాండ్‌లోని దిమాపూర్ మధ్య గల రెండో నంబర్ జాతీయ రహదారిపై సైతం ఉద్యమకారుల దిగ్బంధంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. భద్రతా బలగాలు రంగంలోకి దిగినా పరిస్థితి ఇంకా పూర్తిగా మెరుగుపడలేదని మీడియా కథనాలు చెబుతున్నాయి. సమస్యల వలయం నుంచి మణిపుర్ ఇంకా బయటపడలేదన్నది నిజం. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే భద్రతా కారణాల రీత్యా తాము హాజరుకావటం అసాధ్యమని వివిధ పార్టీల్లోని కుకీ తెగ శాసనసభ్యులు పదిమంది గవర్నర్‌కు విడివిడిగా వినతిపత్రాలు పంపిన మాట కూడా వాస్తవం. ఇందులో ఇద్దరు సభ్యులున్న అధికార కూటమి భాగస్వామ్య పార్టీ కుకీ పీపుల్స్ అలయెన్స్ కూడా ఉంది. నాగా తెగకు చెందిన మరో పదిమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావొద్దని మణిపుర్‌లోని యునైటెడ్ నాగా కౌన్సిల్ (యూఎన్సీ) కోరడాన్ని విస్మరించలేం. అంతేకాదు, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి రాష్ట్ర సమగ్రత పరిరక్షణకు తీర్మానం చేయాలని మైతేయిలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మణిపుర్ సమగ్రత సమన్వయ కమిటీ (కొకోమీ) గత జూలైలో జరిపిన ర్యాలీలో మాండ్ చేయటం కూడా వాస్తవమే. అలాగని కేబినెట్ సిఫార్సుపై గవర్నర్ మౌనం వహించటం సరికాదు. రాష్ట్రంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఉనికిలో ఉంది. 60 మంది సభ్యులుండే అసెంబ్లీలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌కు ఇప్పటికైతే మెజారిటీ ఉంది. ఆయనకు మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ఎమ్మెల్యేలు ఎవరూ ప్రకటించలేదు. అసెంబ్లీ కూడా రద్దు కాలేదు. మణిపుర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గత మార్చిలో జరిగాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా వర్షా కాల సమావేశాలు నిర్వహించాల్సివుంది. అంటే వచ్చే నెల 2లోగా అసెంబ్లీ సమావేశం కావాలి. అటువంటప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయకపోతే అది రాజ్యాంగ సంక్షోభానికి దారితీయదా? గవర్నర్ విధి నిర్వహణ మంత్రివర్గం సలహాలకు లోబడివుంటుందని రాజ్యాంగంలోని 163వ అధి కరణ చెబుతోంది. అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ లేదా దాని ప్రోరోగ్, అసెంబ్లీ రద్దు అధికా రాలు గవర్నర్‌కు ఉంటాయని 174వ అధికరణ వివరిస్తోంది. అయితే మంత్రివర్గాన్ని సంప్రదించి మాత్రమే ఈ అధికారాలను వినియోగించాల్సి వుంటుందని హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2016లో తీర్పునిచ్చింది. మణిపుర్లో రాజ్యాంగసంక్షోభం ఏర్పడిందని గవర్నర్ భావించివుండొచ్చు. ప్రభుత్వానికి తగిన మెజారిటీ లేదని అనుకొని వుండొచ్చు. అదేమిటో ప్రకటించి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌కు లేదా? అంతా సవ్యంగా ఉందనుకుంటే సమావేశాల నోటిఫికేషన్ విడుదలకు అభ్యంతరం దేనికి? సమస్యలున్నప్పుడే ప్రజలెన్నుకున్న సభల ప్రాధాన్యత పెరుగుతుంది. చుట్టుముట్టిన ఉద్రిక్త పరిస్థితులను ఉపశమింపజేయడానికి అనుసరించాల్సిన మార్గాలపై చర్చిస్తే, సభ్యుల అభిప్రా యాలు పరిగణనలోకి తీసుకుని నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందిస్తే, ఏకగ్రీవ తీర్మానం ద్వారా ప్రజానీకానికి భరోసా ఇవ్వగలిగితే దాని ప్రభావం ఎంతో ఉంటుంది. అందుకు భిన్నంగా గవర్నర్ వ్యవహరించటం రాజ్యాంగ విరుద్ధం మాత్రమే కాదు, రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసే చర్య కూడా. చిత్రమేమంటే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సిద్దార్థ్ మృదుల్‌ను నియమించాలన్న జూలై 5 నాటి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు ఫైలును మణిపుర్ సర్కార్ ఆమోదానికి కేంద్రం పంపింది. అదేమైందో తెలియదు. మణిపుర్లో సర్కారు ఉంటే అది సక్రమంగా పని చేస్తున్నదో లేదో తేల్చవలసిన బాధ్యత కేంద్రంపై ఉంది. నిరవధిక అనిశ్చితి మణిపుర్‌ను మరింత సంక్షోభంలోకి నెడుతుందని అందరూ గుర్తించాలి. -
సమర సన్నాహాలు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎట్టకేలకు ప్రతిపక్ష పార్టీ సొంత గూటిలో సర్దుబాట్లతో సమరానికి సన్నద్ధమవుతున్నట్టుంది. పది నెలల నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆదివారం నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన తీరు చూస్తే అదే అనిపిస్తుంది. నిరుడు జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే ఆచితూచి వ్యవహరిస్తూ, ఇన్నాళ్ళకు పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ’ (సీడబ్ల్యూసీ)ని పునర్వ్యవస్థీకరించారు. సరికొత్త సీడబ్ల్యూసీపై గాంధీ కుటుంబ ముద్ర సుస్పష్టం. అయితే, ఒకపక్క విశ్వాసపాత్రులైన పాత కాపుల్ని కదిలించకుండానే, మరోపక్క కొత్త వారికీ, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేవారికీ, వివిధ సామాజిక వర్గాలకూ స్థానం కల్పించారు. ఇలా పార్టీలో నవనవోత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నించడం స్వాగతనీయం. సోనియా కుటుంబానికి వీరవిధేయుడైనప్పటికీ, కేవలం డూడూబసవన్నలా ఖర్గే ఉండిపోలేదు. కొత్త కార్యవర్గంలో గాంధీ శిబిరం వారితో పాటు తన సొంత శిబిరం వారికీ చోటిచ్చారు. వివిధ సామాజిక వర్గాలకు చోటిస్తూ సమ తూకం సాధించడంతో ఈ కొత్త కార్యవర్గం రానున్న ఎన్నికల టీమ్ అని అర్థమవుతోంది. సోనియా అధ్యక్ష కాలంలోని 2020 సెప్టెంబర్ తర్వాత సీడబ్ల్యూసీ ప్రక్షాళన మళ్ళీ జరగడం ఇప్పుడే! అనేక విడతల చర్చల తర్వాత కొత్త కమిటీ కొలువు తీరింది. 39 మంది శాశ్వత సభ్యులు, 18 మంది శాశ్వత ఆహ్వానితులు, 14 మంది రాష్ట్ర ఇన్–ఛార్జ్‌లు, నలుగురు సంస్థాగత ఇన్–ఛార్జ్‌లు, మరో 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు – ఇలా మొత్తం 84 మంది సభ్యులతో మునుపెన్నడూ లేనంతటి అతి పెద్ద సీడబ్ల్యూసీ ఇది. పాత, కొత్తల మేలు కలయికగా ఏర్పాటైన వర్కింగ్ కమిటీలో ప్రజా స్వామ్య స్ఫూర్తిని పెంచడం హర్షణీయం. రాజస్థాన్‌లో సొంత పార్టీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి 2020లో పార్టీ రాష్ట్ర అధ్యక్షపదవి, ఉప ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్న సచిన్ పైలట్‌కు కార్యవర్గంలో స్థానమివ్వడం, అలాగే నిరుడు పార్టీ అంతర్గత ఎన్నికల్లో అధ్యక్ష పీఠానికి ఖర్గేతో పోటీపడిన శశి థరూర్‌కు సైతం చోటివ్వడం ఆశ్చర్యకరమే. అలాగే, పార్టీకి సోనియా నాయకత్వాన్ని ప్రశ్నించిన జి–23 బృందంలోని అసమ్మతి నేతల్లో భాగమైన ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్‌లను సైతం కొత్త సభ్యులుగా తీసుకోవడం గమనార్హం. ఇది అవసరమైన రాజకీయ చాణక్యమే. విభిన్న స్వరాలు వినిపించేవారిని సైతం విధాన నిర్ణయాలు తీసుకొనే వేదికలో భాగస్వాముల్ని చేయడం అంతర్గత ప్రజాస్వామ్యానికి సూచిక. 138 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర గల ఒక పార్టీ సమకాలీన చైతన్యశీల ప్రస్థానానికీ, పురోగతికీ దీర్ఘకాలంలో అది కీలకం కూడా! ముఖ్యంగా ఈ ఏడాది చివరి కల్లా మిజోరమ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలున్న వేళ ఆ ప్రాంతాలకూ ప్రాముఖ్యం, ప్రాతినిధ్యం ఇస్తూ ఈ పునర్వ్యవస్థీకరణ సాగడం గమనార్హం. ఎన్నికలున్న రాజస్థాన్‌లో అసమ్మతి నేత సచిన్ పైలట్‌కూ, అలాగే ఛత్తీస్‌గఢ్‌లో బలమైన ఫ్యాక్షన్ నాయకుడూ, ఓబీసీ అయిన మంత్రి తామ్రధ్వజ్ సాహూకూ పార్టీ అత్యున్నత వేదికలో చోటివ్వడం తక్షణ ప్రయోజ నాలకు తప్పక పనికొస్తుంది. అలా చూస్తే, ఆలస్యమైనా ఖర్గే ఆలోచించి పావులు కదిపారనుకోవాలి. గత కమిటీలో ఒక్క ఓబీసీయే ఉంటే, ఈసారి ఆరుగురికి స్థానం దక్కడం, 9 మంది ఎస్సీలకూ, ఒక గిరిజన నేతకూ సీటివ్వడం... ఉదయ్‌పూర్ డిక్లరేషన్కూ, సామాజిక న్యాయానికీ కట్టుబడి ఉన్నామనే భావన కలిగించడానికీ కాంగ్రెస్‌కు ఉపకరిస్తుంది. అయితే, 15 మంది స్త్రీలకు స్థానం కల్పించినా, మహిళా సాధికారత మంత్రం పఠిస్తున్న పార్టీ ఈ సంఖ్యను మరింత పెంచుకోవడం అవసరం. నిజానికి, సీడబ్ల్యూసీలో 50 ఏళ్ళ లోపు వారు 50 శాతమైనా ఉండాలన్నది లక్ష్యమని కాంగ్రెస్ కొంతకాలంగా చెబుతోంది. గత ఏడాది మేలో ఉదయ్‌పూర్‌లో జరిగిన చింతన్ శిబిర్‌లో, ఈ ఏడాది ఫిబ్రవరిలో రాయ్‌పూర్‌లో సాగిన పార్టీ ప్లీనరీలో ఆ మేరకు సంకల్పం కూడా చెప్పుకుంది. తాజా పునర్వ్యవస్థీకరణ ఆ లక్ష్యాన్ని చేరుకోలేదు. అయితే, పవన్ ఖేరా, సుప్రియా శ్రీనతే లాంటి యువ నాయకత్వాన్ని సైతం ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చడం పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించే ప్రయత్నంగా భావించవచ్చు. సీడబ్ల్యూసీలో శాశ్వత సభ్యుల సంఖ్యను 23 నుంచి 35కు పెంచుతామని రాయ్‌పూర్ ప్లీనరీలో చెప్పిన పెద్దలు ఆ అవధిని మరింత పెంచి, 39 మంది శాశ్వత సభ్యులను తీసుకోవడమూ అనేక రాజకీయ అనివార్యతలకు అద్దం పడుతోంది. సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరపకుండా, ఖర్గేయే నామినేట్ చేస్తారని నిర్ణయించిన పార్టీ ఇప్పటికి ఈ ఘట్టాన్ని పూర్తి చేసింది. వెరసి, కొత్త కార్యవర్గం కూర్పు కొంత సృజనాత్మక ధోరణిలో, మరికొంత రాజీ మార్గంలో పయనించిందని చెప్పక తప్పదు. శశిథరూర్ పేర్కొన్నట్టు, సిద్ధాంతాలకు కట్టుబడిన కార్యకర్తలే ఏ పార్టీకైనా జీవనాడి. వారితో నిండిన పార్టీలు, కార్యవర్గాలే ప్రజాకాంక్షలను నెరవేర్చడంలో ముందడుగు వేయగలవు. సీడబ్ల్యూసీ కూర్పులో ఆ సంగతి ఖర్గే బాగానే గ్రహించారు. కానీ, సవాళ్ళు ముగిసిపోలేదు. అద్వానీ తర్వాత స్వతంత్ర భారతావనిలో ఏకకాలంలో ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా, లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతి పక్ష నేతగా ఉన్న 81 ఏళ్ళ ఖర్గే ఎన్నికల బరిలోనూ కాంగ్రెస్‌ను తీరానికి చేర్చాలి. ఆ మధ్య దాకా నీరసించిన పార్టీ నిరుడు హిమాచల్‌లో, ఈ ఏడాది కర్ణాటకలో దక్కిన విజయాలతో తెరిపిన పడింది. ఆ విజయ పరంపరను కొనసాగించాలంటే అభ్యర్థుల ఎంపిక, ప్రచారవ్యూహాలు,‘ఇండియా’ కూటమిలో ఇతర ప్రతిపక్షాలతో సంప్రతింపులు – ఇలా ఖర్గే చేతి నిండా పని ఉంది. సోనియా కుటుంబంతో సమన్వయం చేసుకుంటూనే ఆ పనిని ఆయన ఎంత సమర్థంగా నిర్వహిస్తారో చూడాలి. ఒక్కమాటలో అసలు ఆట ఇప్పుడే మొదలైంది! -
కాలం కార్ఖానా
కాలం ఒక కార్ఖానా. మనం నేల మీద పడిన క్షణం నుంచి కాలం కార్ఖానాలో మన కోసం ఉత్పత్తి మొదలైపోతుంది. ఆ ఉత్పత్తులలో మనకు కావలసిన రకరకాల ఆహార్యాలు, ఆలోచనలు, రుచులు, అభిరుచులు, అలవాట్లే కాదు; వాటిని నియంత్రించే హద్దులూ ఏర్పడిపోతాయి. పుట్టిన మరుక్షణం నుంచి కాలం మనకు తెలియకుండానే మనతో కలసి నడుస్తుంది, మనల్ని నడుపుతుంది. కానీ మనం ఆ సంగతి గుర్తించం, మనల్ని మనమే నడుపుకుంటున్నామనుకుంటాం. అంతా మన ప్రయోజకత్వమేననుకుని విర్రవీగుతాం. కాలాన్ని కేలండర్‌గా మార్చి గోడకూ; గడి యారంగా మార్చి మణికట్టుకూ బంధించామనుకుంటాం. కానీ గుప్పిట్లో నీళ్ళు వేళ్ళ సందుల్లోంచి జారిపోయినట్టుగా కాలం కూడా ఏ బంధనాలకూ లొంగకుండా జారుకుంటూనే ఉంటుందన్న వాస్తవం మన తెలివిని నిరంతరం వెక్కిరిస్తూనే ఉంటుంది. కాలంలో ఒకానొకనాడు మనిషి నగ్నత్వాన్నే ఒంటికి చుట్టుకున్నాడు. తర్వాత తర్వాత ఒళ్ళంతా వస్త్రంతో కప్పుకోవడమే సంస్కారంగా, నాగరికతగా మారింది. మొన్నటికి మొన్న, తగినంత తిండికీ, చాలినంత ఆచ్ఛాదనకూ నోచుకోని ఈ దేశంలోని కోట్లాది నిరుపేదల బతుకు టద్దంగా మారుతూ మోకాళ్ళు దాటని అంగవస్త్రాన్ని మొలకు చుట్టుకోవడం ఆదర్శం కాదు, అవసరమనుకున్నాడు మహాత్మా గాంధీ. ఆ తర్వాత స్త్రీ పురుష వస్త్రధారణ అనేకానేక మార్పుల మలుపులు తిరుగుతూ ఒంటినిండా కప్పుకోవడమనేది ‘అనాగరికం’గా మారి గాంధీగారి అంగవస్త్రంలా మోకాళ్ళు దాటని షార్ట్స్ ధరించడం అతి నవీనమైన పోకడగా మారింది. కాలం చేసే చిత్రాలు అలా ఉంటాయి. అది మన పట్టు తప్పించుకుంటూ ముందుకే కాదు, వెనక్కీ, పక్కలకీ కూడా పరుగులెడుతూ మనతో ఆడుకోగలదు. కాలం అఖండంగా ఉంటూనే నిన్న, నేడు, రేపు రూపంలో ఖండితంగానూ ఉంటుంది. కానీ మన ఊహాపోహలకు, జీవనగమనానికి మేకులు దిగేసి వర్తమానమనే కట్టుకొయ్యకు బంధించి ఉంచుతుంది. కవి ఎంత క్రాంతదర్శి అయినా ఆ మేకుబందీ నుంచి పూర్తిగా తప్పుకోలేడు. రేపటి కాలంలో పోస్ట్ మ్యాన్ ఆరోవేలుగా మారబోతున్నాడని తెలిసి ఉంటే దేవరకొండ బాలగంగాధర తిలక్ ప్రసిద్ధ కవిత ‘తపాలా బంట్రోతు’ ఏ రూపం దిద్దుకొని ఉండేదో! ‘దేశాంతరగతుడైన ప్రియుడి వార్త’ మొబైల్ రూపంలో అరచేతి దూరంలో ఉన్న ఈ రోజున, ఏ అమ్మాయీ ‘పద్దెని మిదేళ్ళ పడుచుదనాన్ని భద్రంగా దాచి పళ్లెరంలో పెట్టి ప్రాణనాథుడి కందించా’లనే ఆశతో, ‘చూపులు తుమ్మెద బారులు కట్టి’ పోస్ట్ మ్యాన్ కోసం ఎదురుచూడాల్సిన అవసరమే లేదు. చిరునవ్వుతోనే కబురు లేదని చెప్పి వెళ్లిపోతున్న తపాలా బంట్రోతు వెనుక ఆ కళ్ళు ‘విచ్చిన రెండు కల్హార సరస్సులు’ కావలసిన అవసరమూ లేదు. అలాగని ప్రియుడి వార్త కోసం పడుచు దనం పడే ఆరాటం కాలభేదాలకు అతీతంగా నిత్యనూతనమూ అవుతుంది కనుక ఒక అపురూప భావస్పందన కలిగించే కవితగా అది భవిష్యత్తులోకి తన అస్తిత్వాన్ని పొడిగించుకుంటూనే ఉంటుంది. మరోపక్క గతకాలపు చరిత్ర శకలంగానూ మారుతుంది. గతంపై మసక తెర కప్పి మాయ చేయడం కాల స్వభావాలలో ఒకటి. మన పాదముద్రలు గతంలోకి వ్యాపించి ఉన్నాయన్న ఎరుక తప్పి, మన నడక వర్తమానంలోనే మొదలైందని అపోహ పడతాం. నేడు మన కళ్ళముందు ఉన్నవే నిత్యాసత్యాలు కావనీ, మొదటి నుంచీ ఈ ప్రపంచం ఇలాగే లేదనీ కొంత తెలిసినా కొంత తెలియనట్టే భ్రమావలయంలో గడుపుతూ ఉంటాం. ఎన్నో రకాల నియంతృత్వాలను దాటి ప్రజాస్వామ్యంలోకి వచ్చామనీ, అది కూడా ఇంకా ప్రయోగ దశలోనే ఉంది తప్ప పూర్తిగా పాదుకోలేదనీ, నేటి మన అనేకానేక సమస్యలు, సంక్షోభాల మూలాలు గతంలో ఉన్నాయనీ, వాటి పరిష్కారాల వెతుకులాటలో వందలు, వేల సంవత్సరాల గతంలోకి మన చూపుల నిడివి పెంచుకోవాలనే ఊహ రాకుండా మన బుద్ధికి కాలం దడి కడుతుంది. వర్తమానాన్ని ఒక మత్తుమందులా అలవాటు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వాఙ్మయ పరిణామ క్రమాన్నే కనుక చూస్తే, క్రతు సంబంధమైన తంతు నుంచి మూకాభినయమూ, దాని నుంచి నాట్యమూ, నాట్యం నుంచి నాటకమూ ఎలా అభివృద్ధి చెందాయో; క్రతు సందర్భ గానం నుంచే పాట పుట్టి కావ్యస్థాయికి ఎలా పెరిగిందో; అనేకమంది అజ్ఞాతకర్తలు కలిగిన మౌఖిక సంప్రదాయం నుంచి, ఏక కర్తృకమైన లేఖన సంప్రదాయానికి వాఙ్మయం ఎలా పరివర్తన చెందిందో చెప్పే ఆసక్తికరమైన అధ్యయనాలు ఈరోజున అందు బాటులో ఉన్నాయి. అయినాసరే, నాట్యం, నాటకం, పాట, పద్యం, వచనపద్యం, గద్యం, కథ, నవల వంటి వివిధ ప్రక్రియలను పరస్పర సంబంధం లేని భిన్న రూపాలుగా విడదీసి చూడడాన్ని కాలం మనకు అలవాటు చేసింది. మౌఖిక సంప్రదాయానికి, అనేక కర్తృకానికి చెందినవాటిని కూడా లిఖిత సంప్రదాయం నుంచీ, ఒక్కరే రచించారన్న భావన నుంచీ చూడడం కూడా కాలం మప్పిన అలవాటే. కాలం పోయే చిత్రగతులు మనిషిని మొదటినుంచీ తికమకపెడుతూ ఆలోచనకు లోనుచేస్తూనే ఉన్నాయి. మహాభారత కథకుడు కాలానికి చెప్పిన భాష్యంలో అసాధారణమైన లోచూపు కనిపించి ఆశ్చర్యచకితం చేస్తుంది. భూత, భవిష్యత్, వర్తమానాలకు చెందిన అన్ని భావాలూ కాలనిర్మితాలేనంటాడు. భావాలు మనిషివే కనుక మనిషీ కాలనిర్మితుడే నన్నమాట. కాలం గురించిన తెలివిడితోనే దాని మాయాజాలం నుంచి ఏ కొంచెమైనా తప్పించుకోగలం. -
చంద్రస్వామి తాయెత్తు విజన్!
తర్కంతో కొట్టలేనప్పుడు తాయెత్తుల మహిమను చూపాలి. పేదలు, బాధితులు, దగాపడిన తమ్ముళ్ల కంటిపాపల్లో కాంతి కిరణం మెరిసినప్పుడల్లా పెత్తందారీ హేతువులోంచి ఓ బేతాళుడు నిద్రలేస్తాడు. ఓం హ్రీం అంటూ ఆవులిస్తాడు. నయా పెత్తందారీవర్గపు ఉంపుడు సిద్ధాంతకర్త నారా చంద్రబాబు నాయుడులోంచి తాజా తేనెపూత విజన్తోపాటు ఓ బేతాళుడు కూడా బయటికొచ్చాడు. మహిళా లోకంపై మంత్ర ప్రయోగం మొదలుపెట్టాడు. ఆడబిడ్డలందరికీ ఆయన మంత్రించిన రాఖీలు ఇస్తాడట! వాటిని 45 రోజులు పూజగదిలో పెట్టుకొని దేవుణ్ణి ప్రార్థిస్తూ చంద్రబాబును తలుచుకోవాలట! అనంతరంచేతికి కట్టుకోవాలి. అప్పుడు వారికి అష్టసిరులు ఒనగూరు తాయట! మంత్రదండం సాయంతో నారా చంద్రస్వామి ఈ రకంగా మహిళా సాధికారత సాధిస్తారన్న మాట.. నిత్యానంద స్వామి కైలాసాన్ని సృష్టించినట్టు! ఆగస్టు పదిహేనో తేదీనాడు చంద్రబాబు ‘విజన్– 2047’ పేరుతో విశాఖపట్టణంలో ఒక కాగితాల కట్టను విడుదల చేశారు. దాన్ని తన ఆలోచనగా చెప్పుకున్నారు. మామూలుగా పంద్రాగస్టు కార్యక్రమాలను కవర్ చేసేటప్పుడు తొలి ప్రాధా న్యాన్ని ప్రధానమంత్రికిస్తూ అదే స్థాయిలో రెండో ప్రాధాన్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికివ్వడం ప్రాంతీయ మీడియాలో ఒక సంప్రదాయం. ఆంధ్రప్రదేశ్ యెల్లో మీడియా మాత్రం ముఖ్య మంత్రిని పక్కకునెట్టి చంద్రబాబు విజన్ డాక్యుమెంట్‌కు అగ్ర స్థానాన్ని ఇచ్చింది. ఇంతకూ ఇందులో ఏమంది? 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు నిండు తాయి. అప్పటికి దేశం ఎలా ఉండాలి అనే ఆలోచనతో ఏడాది కింద కేంద్ర ప్రభుత్వం ‘విజన్ – 2047’ను రూపొందించింది. ఆ ఏడాది కిందటి ఆలోచనలోంచి ఓ పిడికెడు మాదాకబళాన్ని తీసుకొచ్చి కొంచెం వెచ్చచేసి బాబు వడ్డించారు. పోనీ దాన్ని రాష్ట్రానికి వర్తింపజేస్తూ అనుసృజన చేసినా బాగుండేది. కానీ, ‘దేశ్ కీ నేతా’ హోదాకు ఇంచు కూడా తగ్గేందుకు బాబు సిద్ధ పడలేదు. బహుశా ‘రాజ్య్ (రాష్ట్ర) కీ నేతా’ హోదా మరోసారి దక్కే అవకాశం లేదని గట్టిగా నమ్మారేమో! ఇంకో పాతికేళ్లలో దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చడం తన లక్ష్యమని చెప్పుకున్నారు. ఏ హోదాతోనో చెప్పలేదు. ‘ఆప్ కౌన్ హై’ అని అడిగే అవసరం ఎవరికీ లేదు. తనకు యాభై అయిదేళ్లు నిండకముందే నాలుగు శతాబ్దాల పైచిలుకు వయసుతో హైదరాబాద్‌ను సృష్టించిన వ్యక్తికి ఏదైనా సాధ్యమేనని సరిపెట్టుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోలార్ పవర్, రోబోటిక్స్ వగైరా తాజా పదజాలాన్ని ఆయన విజన్‌లో విరివిగా ఉపయోగించారు. అబ్బో మా బాబుగారికి చాలా విషయాలు తెలుసునని అనుయాయులు మురిసిపోవడానికి తప్ప సామా జిక చింతన ఏ కోశానా అందులో లేదు. ఇంటర్లో బైపీసీ చదివితే ఉత్తమ ఇంజనీర్లుగా ఎదగవచ్చనే ఒక గొప్ప ఉప దేశాన్ని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు అనుగ్రహించారు. ప్రధాని నరేంద్రమోదీ చెబుతున్న విజన్‌కు తాను కూడా ఇలా కోరస్ పాడితే ఆయన మెప్పు పొందవచ్చన్న తహతహ ఒక కారణం కావచ్చు. తనను గొప్ప విజనరీగా భజన చేస్తున్న యెల్లో మీడియాలో ఆత్మవిశ్వాసం నింపడం మరో కారణం కావచ్చు. ఈ రెండు అవసరాల కోసం చంద్రబాబు పంద్రాగస్టు సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. అంతే తప్ప దాని మీద ఆయనకు పెద్దగా విశ్వాసం లేదు. ఎందుకంటే తన మొదటి విజన్ (2020) ఆర్థికంగా తనకు లబ్ధి చేకూర్చినా, రాజకీయంగా చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఇక తెలుగు సమాజానికైతే ఆ విజన్ సృష్టించిన విధ్వంసం మరిచిపోలేని ఒక మహా విషాదం. చంద్రబాబు తన ‘విజన్–2020’ సారాంశంతో ఒక సిద్ధాంత గ్రంథాన్ని ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రచురించారు. తెలుగులో దాని పేరు ‘మనసులో మాట’. దాని పేరును బట్టే ఆ పుస్తకంలోని అభిప్రాయాలు చంద్రబాబుకు స్వాభావికమైన విగా, ఆయన నమ్మకాలుగా భావించాలి. ఉచిత పథకాలను ఈ పుస్తకంలో ఈసడించుకున్నారు. ఉచిత విద్యుత్‌ను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. ప్రతిపక్షాలు బుద్ధిగా మసలుకోవాలని (అప్పు డాయన అధికారంలో ఉన్నారు), ప్రభుత్వాన్ని గుడ్డిగా వ్యతిరే కించకూడదని సుద్దులు చెప్పారు. ఉద్యోగాలు పర్మనెంటయితే వారికి బాధ్యత ఉండదని, అందువల్ల కాంట్రాక్టు పద్ధతిలోనే ఉద్యోగాలు భర్తీ చేయాలని అభిప్రాయపడ్డారు. ఆ పద్ధతికి శ్రీకారం కూడా చుట్టారు. విద్య, వైద్యం ఏదీ ఉచితంగా అందుబాటులో ఉంచకూడదని గట్టిగా వాదించారు. ఆస్పత్రుల్లో సర్వీసు ఛార్జీల వసూలు ప్రారంభించారు. పేదవాడికి జ్వరం వచ్చినా డబ్బులు చెల్లించనిదే మందుబిళ్ల కూడా దొరకని దుర్మార్గ పరిస్థితి ఏర్పడింది. సర్కారు బడులను పాడుబెట్టి చదువు‘కొనలేని’ ఒక తరాన్ని మొత్తం విద్యకు దూరం చేశారు. మధ్యతరగతి ప్రజలు సైతం చదువుల ఖర్చులు భరించలేక అప్పుల ఊబిలోకి దిగబడిపోయారు. వ్యవసాయం దండగ అనే సిద్ధాంతాన్ని వంటబట్టించుకొని రైతాంగంలో అదే అభిప్రాయం వ్యాప్తి చెందేలా చేశారు. రైతు కూలీలు భూబంధం నుంచి బయటపడితేనే సంపన్నుల పనులకు చౌకగా శ్రమశక్తి లభిస్తుందన్న ఉద్దేశంతో ఈ కుట్రకు పాల్పడ్డారు. ఆయన కోరుకున్న ట్టుగానే లక్షలాది రైతు కూలీలు పొలం బంధాన్ని తెంచు కున్నారు. పొట్టకూటి కోసం వలస బాటలు పట్టారు. రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో కూలీ తల్లులు చంటిబిడ్డల నోటికి పాలపీకలు పెట్టిన కల్లు సీసాలను అందించారు. కల్లు మత్తులో ఆ బిడ్డ నిద్రపోయి తల్లి కోసం ఏడ్వదని వారు అలా తల పోసేవారు. మాటలకందని ఆ మహాదైన్యం అప్పుడు ఎక్కడ చూసినా కనిపించేది. వలసబాట పట్టకుండా మొండికేసి వ్యవసాయం చేసిన వారు బాబు విధానాల ఫలితంగా అప్పుల పాలై ఆత్మహత్యలను ఆశ్రయించడం మొదలుపెట్టారు. బిడ్డలు వలసపోగా మిగిలిన అవ్వాతాతలు అంబలి కేంద్రాల దగ్గర బారులు తీరి నిలబడిన దృశ్యాలు ఇప్పటికీ గుర్తే! ఈ దుఃస్థితికే ప్రజా వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న ‘పల్లె కన్నీరు పెడుతుందో’ అనే పాటలో అద్దంపట్టిన సంగతి తెలిసిందే. ఈ కన్నీటికి కారణం చంద్రబాబు విజన్. ఆ కన్నీటిపై ఐటీ పన్నీరు చల్లి ‘ఇదీ చంద్రబాబు విజన్’ అని ఆయన అనుకూలవర్గం ఇప్పటికీ ప్రచారం చేస్తున్నది. తాను ప్రైవేట్ రంగంలో ఇంజనీరింగ్ కళాశాలలను ప్రారంభించడం వల్లనే ఐటీ నిపుణులు పెరిగారని ఆయన ఇప్పటికీ చెప్పుకుంటారు. కానీ అంతకంటే ఐదేళ్లు ముందుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను ప్రకటిస్తే వాటికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులతో కలిసి ఉద్యమాలు నడిపిన వ్యక్తి చంద్రబాబు. హైటెక్ సిటీ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రణాళిక సిద్ధమైందని చంద్రబాబే స్వయంగా ‘మనసులో మాట’ పుస్తకంలో రాసుకున్నారు. రెడీగా ఉన్న ప్రణాళికను అమలు చేయడంలో ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం ఆయన ఆలస్యం చేశారు. ఇదీ జరిగిన వాస్తవం. ఈ వాస్తవాలను యెల్లో మీడియా మసిపూసి మారేడుకాయలు చేసింది. ఒక సామాజిక విధ్వంస కుడికి విజనరీ ముసుగువేసి చరిత్రలో నిలబెట్టింది. ఇది చరిత్రలో జరిగిన ఒక ద్రోహం. బాబు విజన్‌తో కన్నీరు పెట్టిన పల్లెసీమలు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మళ్లీ చిగురించడం మొదలైంది. రైతు మళ్లీ నాగలి పట్టాడు. వైద్యం పేదలకు చేరువైంది. జన సంక్షేమ విజన్‌కు ప్రాధాన్యం లభించింది. పదేళ్లు అధికారానికి దూరమైన చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ – పవన్ పొత్తులతో వెంట్రుకవాసి విజయాన్ని సాధించగలిగాడు. ఈ గెలుపు కోసం తన మనసులోని మాటను దాచిపెట్టాడు. సంక్షేమ ఎజెండాను ఎత్తుకోవడమే కాదు అలవిగాని హామీలతో తన ఎన్నికల మేని ఫెస్టోను నింపేశారు. గెలిచిన తర్వాత రాజధాని పేరుతో భూదోపిడీకి, పోలవరాన్ని ఏటీఎమ్‌గా వాడేందుకు పరిమిత మయ్యారు. అదిగో అల్లదిగో అంటూ రాజధాని గ్రాఫిక్స్‌ను ప్రచారంలో పెడితే, ‘ఇది కదా విజన్’ అంటూ యెల్లో మీడియా పరవశించిపోయింది. కానీ ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎటువంటి తడ బాటూ, శషభిషలూ లేని స్పష్టమైన పేదల అనుకూల ఎజెండాను తలకెత్తుకున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీల పురోగతి కోసం, అన్ని వర్గాల్లోని మహిళల సాధికారత కోసం, పరిపాలనలో పారదర్శకత కోసం, అధికార వికేంద్రీ కరణ కోసం ఒక ఉద్యమాన్నే ఈ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకోసం అడ్డువస్తున్న పెత్తందారీ వ్యవస్థపై జగన్ ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటించింది. వ్యవస్థలోని అన్ని పార్శా్వల్లో ఈ పెత్తందారీ వ్యవస్థ ఊడలు దించి బలోపేతమై ఉన్నది. ఇంతవరకూ దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఆ వ్యవస్థపై బహిరంగ యుద్ధాన్ని ప్రకటించడానికి సాహసించలేదు. పెత్తందారీ వ్యవస్థతో తలపడటం, ఓడించడం ద్వారానే పేదల విముక్తి సాధ్యమని నమ్మిన జగన్ ప్రభుత్వం అందుకు బరిగీసి నిలబడి ఉన్నది. పెత్తందారీ వ్యవస్థ తన సహస్ర బాహువులతో జగన్ ప్రభుత్వంపై విషం చల్లుతున్నది. దశకంఠాలతో ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నది. తమ ఎన్నికల మేనిఫెస్టోను గడప గడపకూ పంపిణీ చేస్తూ తాము ఎన్ని హామీలను నెరవేర్చామో పరిశీలించి పరిపాలనకు మార్కులు వేయాలని ప్రజలను కోరుతున్న ఏకైక ప్రభుత్వం జగన్ సర్కార్. ఎన్నికల మేనిఫెస్టోను కనబడకుండా మాయం చేసి, వెబ్సైట్లోంచి కూడా తొలగించిన తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ? మేనిఫెస్టోకు పటంకట్టి ఊరేగిస్తూ ‘మేం చేయని పనేమిటో చెప్పండ’ని పిలుపునిస్తున్న జగన్ ప్రభుత్వం ఎక్కడ? ప్రజాక్షేత్రంలో ద్వంద్వ యుద్ధానికి తలపడటం సాధ్య మయ్యే పనేనా? కాదు కనుకనే మాయోపాయాలు, దుష్ప్రచారాలు, కుతంత్రాలు వేయి పడగలెత్తి బుసకొడుతున్నాయి. బాబుకు వేసిన విజనరీ ముసుగు జారిపోకుండా మొన్న ప్రకటించిన ఎంగిలి విజన్ ఒక పడగ. తాయెత్తు మహిమలు ప్రచారం చేయడం, మూఢనమ్మకాలను వ్యాపింపజేయడం ఇంకో పడగ. భారత రాజ్యాంగం 51వ అధికరణం ప్రకారం ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందింపజేయడం పౌరుల ప్రా«థమిక విధి. అందుకు విరుద్ధంగా ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడే మూఢ నమ్మకాలను రెచ్చగొట్టడం రాజ్యాంగ ద్రోహమవుతుంది. పైగా వాటికి ఆయన రాఖీలని పేరు పెట్టారు. మంత్రించి ఇచ్చేవి తాయెత్తులవుతాయి గానీ రాఖీలెట్లా అవు తాయి? అయినా తమ సాధికారతకు కట్టుబడిన వాళ్లకు, తమకు రక్షణగా నిలబడిన వాళ్లకు మహిళలే స్వయంగా రక్షాబంధనాలు కడతారు తప్ప మంత్రగాళ్లకు కాదు గదా! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ప్రశంసనీయమైన ప్రయత్నం
‘అక్కడ అనాథల ఆక్రందన. అక్కడ అసహాయుల ఆర్తనాదం. అక్కడ పేదల కన్నీటి జాలు. అదే సుమా కోర్టు....’ సుప్రసిద్ధ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి అరవై రెండేళ్లనాటి ‘న్యాయం’ కథలో గుండెల్ని పిండే వాక్యాలివి. ఈ అనాథల్లో, ఈ అసహాయుల్లో, ఈ నిరుపేదల్లో మహిళలకు మరిన్ని కష్టాలు! ఆలస్యంగానైనా మన సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయంలో ప్రశంసనీయమైన పని చేసింది. న్యాయస్థానాల్లో సాగే వాదప్రతివాదాల్లో, విచారణల్లో, తీర్పుల్లో మహిళలకు సంబంధించి దశాబ్దాలుగా ఎంతో అలవోకగా వాడుతున్న పదాలను ఇకపై ఉపయోగించడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఆ పదాలకు ప్రత్యామ్నాయంగా ఏయే పదాలను ఉపయోగించాలో వివరిస్తూ బుధవారం ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. వ్యవస్థలన్నీ ఎక్కడినుంచో ఊడిపడవు. సమాజంలో ఉండే అసమానతలు, వివక్ష, ఆధిపత్య ధోరణులు వంటి సమస్త అవలక్షణాలూ వ్యవస్థల్లో కూడా ప్రతిఫలిస్తుంటాయి. న్యాయస్థానాల్లో ఈ పెడధోరణులు ఉండరాదని విశ్వసించి, అందుకోసం కృషి చేసిన న్యాయమూర్తులు లేకపోలేదు. కానీ వ్యక్తులుగా కృషి చేయటం వేరు, వ్యవస్థే తనంత తాను సరిదిద్దుకునేందుకు పూనుకోవడం వేరు. వృత్తి ఉద్యోగాలరీత్యా సరేగానీ... పౌరుల్లో అత్యధికులు కేసుల్లో ఇరుక్కొని కోర్టు మెట్లెక్కాలనీ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలనీ కోరుకోరు. మహిళల్లో ఈ విముఖత మరింత ఎక్కువ. ఇతరచోట్ల కంటే అక్కడ లింగ వివక్ష అధికం కావటమే ఇందుకు కారణం. మరీ ముఖ్యంగా కింది కోర్టుల్లో మహిళల పట్ల ఉపయోగించే భాష, సంబోధనలు అమాన వీయంగా ఉంటాయి. పర్యవసానంగా న్యాయం కోసం వెళ్లేవారికి అవమానాలే మిగులుతున్నాయి. మన రాజ్యాంగం అన్ని అంశాల్లో సమానత్వాన్ని ప్రబోధించింది. లింగ, వర్ణ, జాతి, కుల, మతాలను ఆధారం చేసుకుని వివక్ష ప్రదర్శించరాదని నిర్దేశించింది. ఇందుకు రాజ్యాంగ పీఠిక మాత్రమే కాదు... 14, 15, 16 అధికరణలతోపాటు 325 అధికరణం కూడా సాక్ష్యాలు. ఆదేశిక సూత్రాల్లో సైతం లింగ సమానతను సాధించటానికి ప్రభుత్వాలు పాటుపడాలన్న ఆకాంక్ష వ్యక్తమైంది. లింగ వివక్షకు తావులేకుండా పౌరులందరికీ పనిచేసే హక్కు కల్పించడంతోపాటు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 39(డి), 41 అధికరణలు నిర్దేశించాయి. కానీ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా ఇవి విరగడ కాలేదు. మహిళల విషయంలో ఎలాంటి దురాచారాలు, పెడ ధోరణులు అలుముకుని ఉన్నాయో మన రాజ్యాంగ నిర్మాతలకు సంపూర్ణ అవగాహన ఉంది. అందుకే వాటిని రూపుమాపటానికి పూనుకొన్నారు. దానికి అనుగుణంగా కాలక్రమంలో ప్రభు త్వాలు చాలా చట్టాలు తీసుకొచ్చాయి. కానీ దురదృష్టమేమంటే అమలు చేసే వ్యవస్థలు సైతం పితృస్వామిక భావజాలంలో కూరుకుపోవటంతో సమానత్వం అసాధ్యమవుతోంది. తమ ముందున్న కేసులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తీర్పు చెప్పవలసిన న్యాయమూర్తులు సైతం విచారణ క్రమంలో కావొచ్చు, తీర్పుల్లో కావొచ్చు... మహిళలకు సంబంధించి సమాజంలో ఉన్న పెడ ధోర ణులను ప్రతిబింబించే పదాలను వాడుతుంటారు. ఒక్కోసారి వాంఛనీయం కాని వైఖరిని ప్రదర్శి స్తుంటారు. ఉద్దేశపూర్వకం అయినా కాకపోయినా, వాటివల్ల మౌలికంగా న్యాయం తారుమారు కాకపోయినా... మన రాజ్యాంగం నిర్దేశించిన విలువలకు, విధానాలకు ఆ వైఖరి, ఆ పదాల వాడకం విరుద్ధమైనవి. ఈ విషయంలో రెండో మాటకు తావులేదు. వ్యభిచారం కేసుల్లో, వివాహేతర సంబంధంలో ఉన్న పురుషులకు ప్రత్యేక పదాలు లేవు. కానీ స్త్రీ విషయంలో అలా కాదు... వేశ్య, వ్యభిచారిణి, ఉంపుడు కత్తె, కాముకి అనే అర్థాలు వచ్చే రకరకాల పదాలు ఇంగ్లిష్‌లో ఉన్నాయి. కేసుల విచారణ సమయంలో న్యాయవాదులు, న్యాయమూర్తులు వీటిని యధేచ్ఛగా ఉపయోగిస్తున్నారు. అంతేకాదు... రెచ్చగొట్టే దుస్తులు, పెళ్లికాకుండానే తల్లయిన యువతి వంటివి వాడుతున్నారు. 2012 డిసెంబర్లో దేశ రాజధాని నగరంలో కదిలే బస్సులో ఒక యువతిపై మూకుమ్మడి అత్యాచారం జరిగాక కఠినమైన నిర్భయ చట్టం అమల్లోకి వచ్చింది. అత్యంత అమానవీయమైన, దుర్మార్గమైన ఆ ఉదంతం తర్వాత సమాజపు ఆలోచనల్లో పూర్తి మార్పు వస్తుందనీ, మహిళల పట్ల చిన్నచూపు చూసే ధోరణులు తగ్గుతాయనీ అనేకులు ఆశించారు. కానీ సమాజం మాట అటుంచి న్యాయస్థానాల ఆలోచనా ధోరణే పెద్దగా మారలేదు. ఒక అత్యాచారం కేసులో నేరగాడిని నిర్దోషిగా పరిగణిస్తూ యువతులు శారీరక సుఖాలను ఆశించి తమంత తాము పురుషులతో వెళ్లడానికి సిద్ధపడి ఆ తర్వాత నిందపడుతుందన్న భయంతో కిడ్నాప్, అత్యాచారం కథలల్లుతున్నారని ఒక న్యాయమూర్తి 2013లో వ్యాఖ్యానించారు. సమాజంలో ఇలాంటి ధోరణి పెరుగుతున్నదని ఆయన ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి 2020లో కర్ణాటక హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది! అత్యాచారానికి గురైన యువతి ఆ వెంటనే నిద్రపోయి, మరునాడు కేసు పెట్టిందనీ, కనుక ఆమె ఫిర్యాదులో నిజాయితీ లేదనీ తేల్చారు. నిరంతర చలనశీలత సమాజ మౌలిక లక్షణం. మారుతున్న కాలానికి అనుగుణంగా భాష మారాలి. ప్రవర్తన, వైఖరి సంస్కారవంతం కావాలి. అది న్యాయస్థానాల నుంచే ప్రారంభం కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ భావించటం ప్రశంసనీయం. 19వ శతాబ్దం నాటి చట్టాలను మారుస్తూ ఈమధ్యే మూడు కొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టిన కేంద్రం కూడా ఈ కోణంలో వాటిని పునఃసమీక్షించుకుని లింగ వివక్ష ధోరణులున్న నిబంధనలను సవరించుకుంటే మంచిది. -
ఇది సరైన ఔషధమేనా?
జనరిక్ ఔషధాల వినియోగాన్ని మెరుగ్గా అమలు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. ఖరీదైన కంపెనీ మందుల బదులు చౌకగా లభించే జనరిక్ ఔషధాలనే తప్పక రాయాలంటూ వైద్యులకు ఆదేశాలిచ్చింది. వైద్యం ఖరీదవుతున్న వేళ సామాన్యులకు సాంత్వననిచ్చే ఆదేశాలు స్వాగతించాల్సినవే. ఈ విషయంలో ఎన్ఎంసీ మార్గదర్శకాలివ్వడం ఇదేమీ తొలిసారి కాదు. మునుపెప్పుడో ఇచ్చినా, వాటి అమలు అంతంత మాత్రమైంది. అందుకే, ఈసారి ఆదేశాలు పాటించకుంటే జరిమానాలు విధిస్తామంటూ హెచ్చరించింది. ఇక్కడే తకరారు వచ్చింది. ఇది ‘పట్టాలు లేకుండా రైళ్ళు నడపడం లాంటిది’ అంటూ దేశంలోని వైద్యులకు అతి పెద్ద సంఘమైన భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) తప్పుపడుతోంది. ఈ విధాన నిర్ణయాలు తీసుకొనే ముందే జనరిక్ మందుల్ని ప్రోత్సహించి, నాణ్యమైనవి దొరికేలా చేయాల్సింది. అది చేయకుండా జరిమానా నిబంధనలు పెట్టడం ఏ మాత్రం సబబన్నది ఐఎంఏ వాదన. వెరసి, వృత్తి నిర్వహణకు సంబంధించి ఆగస్ట్ మొదట్లో అమలులోకి వచ్చిన కొత్త మార్గదర్శకాలపై చర్చ జరుగుతోంది. ఈ నిబంధనల ప్రకారం డాక్టర్లు ఇకపై మోతాదులో స్వల్పతేడా సైతం దుష్పరిణామాలకు దారి తీసే మందుల విషయంలో తప్ప, మిగతావన్నీ జనరిక్ మందులే సిఫార్సు చేయాలి. ఫలానా బ్రాండే వాడాలనకూడదు. తత్సమాన జనరిక్ ఔషధం పేరు రాయాలి. నిర్ణీత మోతాదులో, అనుమతించిన కాంబినేషన్లలోనే ఆచితూచి మందులు రాయాలి. స్పష్టంగా, అర్థమయ్యేలా, ఇంకా వీలుంటే ఇంగ్లీషులో పెద్ద బడి అక్షరాల్లో మందుల చీటీ రాయాలి. అర్థం కాని కోడిగీతల్లో రాస్తే గందరగోళ పడ్డ రోగులు పొరపాటుగా వేరే మందులు తీసుకొనే ప్రమాదం ఉందనేది అంతరార్థం. అలాగే రోగి పరిస్థితి, చికిత్స, ఫలితం లాంటివి డాక్టర్లు ట్విట్టర్ వగైరాల్లో చర్చించరాదంటూ రోగుల హక్కులు కాపాడేలా 11 అంశాలతో సోషల్ మీడియా మార్గదర్శకాలూ ఇచ్చింది. ఇవన్నీ మంచి మాటలే. బ్రాండెడ్ మందులతో పోలిస్తే, జనరిక్ ఔషధాలు సగటున 30 నుంచి 80 శాతం చౌకని ఓ లెక్క. అందువల్ల ఆ మేరకు ఆరోగ్యరక్షణ ఖర్చులు తగ్గుతాయి. సహజంగానే సామాన్యులకు అది పెద్ద ఊరట. అదే సమయంలో, డాక్టర్ల వాదన ఏమిటంటే – మిగిలే లాభం తక్కువ గనక అన్ని ఫార్మ సీలూ అన్నిరకాల జనరిక్ మందులనూ నిల్వ చేయవు. డాక్టర్ రాసిచ్చిన మందు లేనప్పుడు నిర్ణయం షాపువాడి చేతిలోకి వస్తుంది. అప్పుడు నాణ్యతతో సంబంధం లేకుండా, ఎక్కువ లాభం మిగిలే మందులను అంగట్లో అంటగట్టే ప్రమాదం ఉంది. అంతేకాక, వైద్యులు తమ అనుభవం కొద్దీ రోగికి సరిపోయే మందు రాయడానికి వీలు లేకుండా పోతుందనీ, కంపెనీలను బట్టి జనరిక్ ఔషధాల నాణ్యతలోనూ తేడాలు తప్పవు గనక చికిత్స సమర్థంగా సాగదనీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో నాణ్యతా ప్రమాణాల నియంత్రణ అంతంత మాత్రమే. కాబట్టి ఈ ఆందోళనను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. నాణ్యతకు హామీ లేకపోతే, మందుల్ని వాడినా ప్రయోజనం ఉండదన్నది నిష్ఠురసత్యం. ఈ రకమైన చికిత్స, ఔషధ వినియోగంతో వ్యాధి తగ్గకుంటే రోగికి నష్టం, డాక్టర్ పేరుకూ దెబ్బ. ఇన్ని లోతుపాతులున్న అంశంపై నిర్ణయాలు ప్రకటించే ముందు సంబంధిత వర్గాలన్నిటితో సమగ్రంగా చర్చించడం తప్పక అవసరం. అదేమీ లేకుండా మార్గదర్శకా లను నోటిఫై చేశారని వైద్యవర్గాల ఆరోపణ. నిజానికి, దేశంలోని జనరిక్ ఔషధాల నాణ్యత విషయంలో చేయాల్సింది చాలా ఉంది. అది డాక్టర్లు, మందుల ఉత్పత్తిదార్లు, పాలకులు – అంతా అంగీకరించే మాటే. తయారయ్యే మందుల్లో అన్ని బ్యాచ్‌లకూ ప్రభుత్వం నాణ్యతా పరీక్ష చేయడం ఆచరణ సాధ్యం కాదు. కేవలం 0.1 శాతం మందులకే పరీక్షలు జరుగుతున్నాయట. గత మూడేళ్ళ కాలంలో జనరిక్, బ్రాండెడ్ జనరిక్, బ్రాండెడ్ మందులన్నిటికీ జరిపిన పరీక్షల్లో దాదాపు 3 శాతం ప్రమాణాల మేరకు నాణ్యంగా లేవని సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మందుల తయారీలో నిర్దుష్టమైన విధానాల్ని అనుసరించడమే నాణ్యతను సాధించ డానికి మూల మంత్రం. పాలకులు అందుకు కట్టుదిట్టమైన విధివిధానాలు పెట్టాలి. ఆ మాటకొస్తే కొన్నేళ్ళ క్రితం దాకా జనరిక్స్ తయారీ సంస్థలకు కొన్ని టెస్ట్‌లు తప్పనిసరి కాదు. బ్రాండెడ్ మందులకు సమానంగా జనరిక్ మందు స్పందిస్తున్నట్టు నిర్ధరించే బయో–ఈక్వలెన్స్ పరీక్ష కానీ, నిర్ణీత వాతావరణ పరిస్థితుల్లో ఔషధ నాణ్యత ఏ మేరకు మారుతుందో చూసే స్టెబిలిటీ అధ్యయనాలు కానీ జరపకుండానే బండి నడిచింది. ఇప్పుడవి తప్పనిసరి చేశారు. కానీ, అవేవీ జరగకుండానే బయటకొచ్చిన జనరిక్స్ చాలానే ఇప్పటికీ విపణిలో ఉన్నట్టు ఔషధరంగ నిపుణులు అంగీకరిస్తున్నారు. అందుకే, ఇప్పటికైనా నిబంధనల అమలును వాయిదా వేసి, అన్ని వర్గాలతో కేంద్ర ప్రభుత్వం విస్తృత స్థాయి సంప్రతింపులు జరపాలన్నది వైద్య సంఘం డిమాండ్. వైద్యవృత్తికి సంబంధించి నియంత్రణాధికారాలున్న ఎన్ఎంసీ ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. వైద్యులు నిరంతరం తమ వృత్తినైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్న మార్గదర్శకం ఆచరణలో ఏ మేరకు సాధ్యమో ఆలోచించాలి. పర్యవేక్షించే విధానమేమిటో చెప్పాలి. అన్నిటి కన్నా ముందు బ్రాండెడ్‌కు దీటుగా జనరిక్ ఔషధాలు పనిచేస్తాయనే భరోసా ప్రజల్లో కల్పించాలి. షాపుల్లో ఈ రకం ఔషధాలన్నీ పెద్దయెత్తున నిల్వ ఉండేలా, జన్ ఔషధీ కేంద్రాలు ఊరి నలుమూలలా నెలకొనేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ఆ పని చేయకుండా మార్గదర్శకాలు, జరిమానాలంటూ హడావిడి చేస్తే ఏం లాభం? పుండు ఒకచోట ఉంటే, మందు మరొకచోట రాసినట్టే! -
అభివృద్ధి అనకొండ!
విపరీతమైన వానలు, దాంతో వరదలు, విలయం. బీభత్సం ముగిసిందని అనుకొనే లోగానే నెల రోజుల్లో రెండోసారి హిమాచల్‌ప్రదేశ్‌పై ప్రకృతి పంజా విసిరింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు, విరిగిపడుతున్న కొండచరియలు, పేకముక్కల్లా కూలుతున్న భవనాలు, నేలవాలుతున్న భారీ వృక్షాలు, కోసుకుపోయిన రోడ్లు, వంతెనలు, శిథిలాల్లో చిక్కుకున్న ప్రాణాలతో పర్వత ప్రాంత రాష్ట్రం అతలాకుతలమైంది. పెరుగుతున్న గంగమ్మ వరదలో ఉత్తరాఖండ్ ఉసూరుమంటోంది. ప్రమాదకర స్థాయిలో సాగుతున్న యమున మళ్ళీ ఢిల్లీ సహా పలు ప్రాంతాల్ని భయపెడుతోంది. జూన్ ద్వితీ యార్ధం నుంచి జూలై చివరి వరకు వానలు, వరదలు ఒక్క హిమాచల్‌లోనే 150 మందిని బలిగొని, రూ. 10 వేల కోట్ల పైగా నష్టం కలిగిస్తే, తాజా విలయం ఇప్పటికే 60 మందిని పొట్టబెట్టుకొంది. హిమాలయాలు, దేశ కోస్తా ప్రాంతాలపై వాతావరణ పర్యవసానాలు గట్టి దెబ్బ కొట్టనున్నాయని ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్’ (ఐపీసీసీ) 6వ నివేదిక పేర్కొంది. హిమాలయాల్లో సగటు ఉష్ణోగ్రత మిగతా దేశంతో పోలిస్తే వేగంగా పెరుగుతోంది. ఈ వర్షాకాలం అసాధారణ రీతిలో కురుస్తున్న వర్షాలు అందుకు తగ్గట్టే ఉన్నాయి. స్వల్పవ్యవధిలో భారీ వర్షం కురిపించే మేఘపతనం, ఆకస్మిక వరదలకు వాతావరణ మార్పులు కొంత కారణమే. అయితే, మనసును కుది పేసే ఈ బీభత్సానికి మతి లేని అతి అభివృద్ధికి దిగిన మానవ తప్పిదాలే ప్రధాన హేతువు. పుడమి తల్లిని పట్టించుకోకుండా కొండల్ని తొలిచి, శిథిలావశేషాల్ని నదుల్లో పడేసి, ఇష్టారాజ్యంగా సాగిన అక్రమ గనుల తవ్వకాలు, సహజమైన నదీ ప్రవాహాల్ని నిరోధించిన నిర్మాణాలు, అశాస్త్రీయంగా చేపట్టిన భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లు కలిసి హిమాచల్ మెడకు ఉరితాళ్ళయ్యాయి. హిమాలయాల్లో వరదలు, విరిగిపడే కొండచరియలు కొత్త కాదు. అందులోనూ హిమాచల్‌లోని మొత్తం 12 జిల్లాల్లో కొండచరియల పతనం తరచూ తప్పదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎప్పుడో తేల్చింది. అంత సున్నితమైన ఈ హిమాలయ పర్వతశ్రేణుల్లో ప్రగతి పేరుతో పాలకులు చేతులారా ప్రకృతి విధ్వంసం చేశారు. ఫలితంగా కొన్నేళ్ళుగా ఏటవాలు ప్రాంతాలు మరింత అస్థిర మయ్యాయి. కేవలం 2020 నుంచి 2022 మధ్య కొండచరియల పతనాల సంఖ్య ఆరు రెట్లు పెరిగిందని డేటా. ఈ పర్వతసానువుల్లో గత పదేళ్ళలో ఇష్టారాజ్యంగా రోడ్లు విస్తరించారు. ఏకంగా 69 నేషనల్ హైవే ప్రాజెక్ట్‌లకు ఆమోదం తెలిపారు. నాలుగు లేన్ల హైవేలు వాటిలో అయిదున్నాయి. హిమా లయాల్లో ఇప్పటికే 168 జల విద్యుత్కేంద్రాలుంటే, 2030 నాటికి 1088 కేంద్రాలు రానుండడం శోచనీయం. పర్యావరణాన్ని పట్టించుకోని ఈ అంధ ఆర్థికాభివృద్ధి మంత్రం ఇక్కడికి తెచ్చింది. పద్ధతీ పాడూ లేకుండా కొండల తవ్వకాలు, మతి లేకుండా రోడ్ల నిర్మాణం, నిర్మాణ వ్యర్థాలను ఏమి చెయ్యాలనే ఆలోచనైనా లేకపోవడంపై హిమాచల్ హైకోర్ట్ నిరుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గమనిస్తే – దాదాపు ప్రతి వర్షాకాలం ఉత్తరాదిలో అస్సామ్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్ లాంటి రాష్ట్రాలు వానలు, వరదలతో అతలాకుతలమవుతున్నాయి. గతంతో పోలిస్తే వరదల సంఖ్య, ఆస్తి, ప్రాణనష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వరదల నివారణకు సమర్థమైన ప్రణాళిక లోపిస్తోంది. ఈ తప్పు కూడా పాలకులదే తప్ప ప్రకృతిది కాదు. మన దేశంలో 4 కోట్ల హెక్టార్లకు పైగా ప్రాంతం, అంటే దేశ భూభాగంలో దాదాపు 12 శాతానికి వరదల ముప్పుందని లెక్క. భూకంపాల లాంటి ప్రకృతి వైపరీత్యాలతో పోలిస్తే వరదల్ని ముందే అంచనా వేయడం, అడ్డుకోవడం చేయదగిన పనే. కానీ ప్రభుత్వాలు ఆ పనీ చేయట్లేదు. అనేక రాష్ట్రాల్లో వరద ముంపు నకు ఇష్టారాజ్యంగా అడవుల నరికివేత, నదీ పరివాహక ప్రాంతాల్లోని వృక్షచ్ఛాయల విధ్వంసం, పేరుకున్న పూడికలతో నదికి నీటిని నిల్వచేసే సామర్థ్యం తగ్గిపోవడం... ఇలా అనేక కారణాలు. దానికి తోడు నదీ తలాలు, నదీ మైదానాల ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. డ్యామ్‌ల వరద గేట్ల నిర్వహణలో సమన్వయ లోపాలు సరేసరి. ఈ స్వయంకృతాలన్నీ శాపాలవుతున్నాయి. విచిత్రం ఏమిటంటే – వరద పరిస్థితుల్లో సత్వర చర్యలు పర్యవేక్షించేందుకు దేశంలో ఒకే విభాగమంటూ ఏదీ లేకపోవడం! ఆ మాటకొస్తే, వరదల నిర్వహణకు మన రాజ్యాంగంలో నిర్ణీత ఏర్పాటేదీ లేదు. వాతావరణ శాఖ వర్షసూచనలు చెబితే, వరద ముప్పు సూచనలు చెప్పే బాధ్యత కేంద్ర జల సంఘానిది. వరద ముంపునకు గురయ్యాక సహాయ, పునరావాస చర్యలు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో ప్రకృతి వైపరీత్యాల సహాయ సంస్థలున్నాయి. బాధితుల పునరావాసం, దెబ్బతిన్న ప్రాథమిక వసతుల పునరుద్ధరణ బాధ్యత స్థానిక సంస్థలది. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయం కీలకం. ఇంకా విడ్డూరం – నీరు, సాగునీటి పారుదల, తదితర అంశాలన్నీ రాష్ట్ర జాబితాలోవే కానీ, వరదల్లో సహాయ బాధ్యతల నిర్వహణ మాత్రం కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలు వేటిలోనూ లేకపోవడం! పదే పదే వరదల ముప్పు తలెత్తుతున్న వేళ ఈ కీలక అంశాలపై కేంద్ర పెద్దలు తక్షణం సమగ్రంగా దృష్టి పెట్టాలి. 1970లలో నెలకొల్పిన ‘వరదలపై జాతీయ కమిషన్’ తరహాలో వరదల సమస్యలపై ఆచరణాత్మక వ్యూహాన్ని సూచించేలా ఉన్నత స్థాయి నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఇకనైనా వరదలపై అన్ని విభాగాలనూ సమన్వయ పరిచే సమగ్ర విధానం అత్యవసరం. అదే సమయంలో సున్నితమైన పర్యావరణాన్ని గౌరవించాలి. లేకపోతే తలెత్తే దుష్పరిణామాలకు హిమాలయ బీభత్సం ప్రతీక. మరి, ఈ మాటైనా హిమాలయాల మాట చెవికెక్కించుకుంటారా? -
ప్రక్షాళన అవసరమే కానీ...
ఎప్పుడో 19వ శతాబ్దంలో తొలిసారిగా చట్టంగా రూపుదాల్చిన భారత నేరసంహితను సమూలంగా మార్చేందుకు ఒక అడుగు ముందుకు పడింది. భారత క్రిమినల్ న్యాయ వ్యవస్థను మారుస్తూ,కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 11న లోక్‌సభలో మూడు కొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) –1860 స్థానంలో ‘భారతీయ న్యాయ సంహిత’, తొలిసారిగా 1898లో చట్టమై ఆనక కొద్దిగా మార్పులు జరిగిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) – 1973 బదులు ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ – 1872 స్థానంలో ‘భారతీయ సాక్ష్య బిల్లు’ రానున్నాయి. మధ్యలో కొద్ది మినహా గణనీయమైన మార్పులేమీ చేయని భారత సర్కార్ 160 ఏళ్ళ పైచిలుకు క్రితం బ్రిటీషు వారి చట్టాలను సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మార్చాలను కోవడం సహేతుకమే. అయితే, కొత్త బిల్లుల్ని తీసుకొచ్చే ముందు న్యాయనిపుణులతో, ప్రతిపక్షా లతో ఎంత లోతుగా చర్చించారు? ఇది ప్రశ్నార్థకం. ఈ పరిస్థితుల్లో 3 బిల్లుల్నీ సమీక్షించి, సిఫా ర్సులు చేయడానికి ప్రభుత్వం వాటిని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపడం స్వాగతనీయం. బిల్లుల్లోని అంశాలపై ప్రజలతో సంప్రతింపులు జరిపి, సిఫార్సులు చేసేందుకు కరోనా కాలంలో 2020 మేలో ప్రభుత్వం నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ సంప్రతింపుల ప్రక్రియ విధి విధా నాలు అయోమయమే. వచ్చిన అభ్యర్థనల్ని పరిశీలించి, విశ్లేషించడానికి సదరు నిపుణుల సంఘం ఏ పద్ధతిని అనుసరించిందీ తెలీదు. ఆ నిపుణుల సంఘం ప్రభుత్వానికి ఇచ్చిన సిఫార్సుల్ని ప్రజాక్షేత్రంలో పెట్టనేలేదు. వచ్చిన సిఫార్సులకూ, ప్రభుత్వం బిల్లుల్లో పెట్టిన అంశాలకూ పొంతన ఉండివుండ దని కూడా నిపుణుల మాట. ఇన్ని లోపాలున్నాయి గనకే కొత్త బిల్లుల సామర్థ్యం సందేహాస్పాదం. బ్రిటీషు పాలనా అవశేషాలను తొలగించడమే ధ్యేయమంటూ మోదీ సర్కార్ చెబుతున్న మాట లకూ, కొత్త చట్టాల్లో నిజంగా ఉన్న అంశాలకూ మధ్య ఎంత పొంతన ఉందో చెప్పలేం. క్రిమినల్ న్యాయ వ్యవస్థకు ఈ ప్రక్షాళన సర్వరోగ నివారణి అంటున్నా అదీ అనుమానమే. ఎందుకంటే, పాత చట్టాల్లోని అనేక అంశాలు యథాతథంగా ఈ కొత్త బిల్లుల్లోనూ చోటుచేసుకున్నాయి. కొన్ని మార్పులు ప్రతిపాదించారు కానీ, అవి వ్యవస్థలోని సంక్షోభంపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో చెప్పలేం. పైపెచ్చు, కొత్త బిల్లులు ప్రతిపాదించిన కొన్ని మార్పులు ఆందోళన రేపుతున్నాయి. పాత రాజద్రోహ చట్టాన్ని తొలగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి, సామాజిక కార్య కర్తలు, జర్నలిస్టులపై తరచూ దుర్వినియోగమవుతున్న ఈ చట్టానికి గత ఏడాది మేలోనే సుప్రీమ్ కోర్ట్ అడ్డుకట్ట వేసి, సమీక్షను పెండింగ్‌లో పెట్టింది. లా కమిషన్ మాత్రం ఐపీసీలో రాజద్రోహానికి సంబంధించిన ‘సెక్షన్ 124ఏ’ను కొనసాగించాలనీ, శిక్షను పెంచాలనీ రెండునెలల క్రితం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ సెక్షన్‌ను తొలగించాలని సర్కార్ నిర్ణయించడం ఆశ్చర్యమే. లార్డ్ మెకాలే 1837లో రూపకల్పన చేయగా, 1862లో అమలులోకి వచ్చిన ఐపీసీలో రాజద్రోహ చట్టం లేదు. 1870లో దాన్ని చేర్చి, స్వాతంత్య్ర సమరాన్ని అణిచేసేందుకు విస్తృతంగా వినియోగించారు. 1898లో పరిధిని విస్తరించారు. స్వాతంత్య్రం వచ్చాకా ఈ చట్టం కొనసాగుతూ వచ్చింది. దాని రాజ్యాంగబద్ధతపై కోర్టులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. కొత్త బిల్లులో రాజద్రోహమనే పేరు తొలగించినా, సార్వభౌమాధికారానికి హానికారక చర్యలు శిక్షార్హమంటూ కొత్త మాట తగిలించారు. ఏ చర్యలు ఈ నేరమనేది స్పష్టత లేనందున పోలీసుల ఇష్టారాజ్యపు అరెస్ట్‌లకు అధికారం దఖలు పడుతోంది. అలాగే, ఇప్పటి దాకా ఐపీసీలో లేని వ్యవస్థీకృత నేరం, తీవ్రవాద నేరాలు, మూకదాడి లాంటివీ కొత్తగా చేర్చారు. వివాదాస్పద ‘ఉపా’ చట్టం నుంచి తీసుకున్నవీ ఇందులో ఉండడం విషాదం. అలాగే, సీఆర్పీసీ కింద అరెస్టయిన వ్యక్తిని గరిష్ఠంగా 15 రోజులే పోలీస్ కస్టడీలో ఉంచవచ్చు. కొత్త చట్టంలో చేసిన నేరాన్ని బట్టి 60 నుంచి 90 రోజుల దాకా కస్టడీని పొడిగించవచ్చు. ఇదీ దుర్విని యోగమయ్యే ముప్పుంది. అయితే ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఎఫ్ఐఆర్ నమోదు అవకాశమివ్వడం, పోలీసు సోదా – స్వాధీనాల వేళ తప్పనిసరి వీడియో రికార్డింగ్ లాంటివి బాధితుల హక్కుల్ని కాపాడతాయి. ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాల్ని వినియోగిస్తూ, ఫోరెన్సిక్స్‌కు పెద్ద పీట వేయడం బాగానే ఉన్నా, ఆ సాక్ష్యాల సేకరణ, విశ్లేషణ, వాటిని కోర్టుల్లో వినియోగించే తీరుపై స్పష్టత లేదు. విచారణతోనే జైళ్ళలో మగ్గుతున్న జనం, క్రిక్కిరిసిన జైళ్ళ లాంటి దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దిశగా ఆలోచించ లేదు. బెయిల్ నిర్ణయంలో చేపట్టాల్సిన సంస్కరణల్ని పట్టించుకోలేదు. ప్రస్తుతం మన కోర్టుల్లో 4.7 కోట్లపైగా కేసులు పెండింగ్‌లో ఉంటే, మూడింట రెండొంతులు క్రిమినల్ కేసులే. క్రిమినల్ న్యాయవ్యవస్థలో సంస్కరణలపై జస్టిస్ మలిమత్ కమిటీ తన నివేదికను సమర్పించి రెండు దశాబ్దాలు దాటింది. 2007లో మాధవ్ మీనన్ కమిటీ సహా అనేకం వచ్చాయి. చివరకిప్పుడు రథం కదిలింది. కానీ, ఇంగ్లీష్ పేర్లు తీసేసి సంస్కృత, హిందీ పేర్లు పెట్టి, కొత్త సీసాలో పాత సారా నింపితే లాభం లేదు. దశాబ్దాల తర్వాతి ఈ ప్రయత్నమూ చిత్తశుద్ధి లోపించి, అసంతృప్తినే మిగిలిస్తే అంతకన్నా అన్యాయం లేదు. కొత్త చట్టాలకు సర్కార్ మరింత కసరత్తు చేయాలి. పార్లమెంట్లో క్షుణ్ణంగా చర్చించాలి. నేరన్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరమే కానీ, వట్టి చట్టాలు మారిస్తే సరిపోదు. వ్యవస్థకూ, పౌరులకూ మధ్య బంధంలో మార్పు తేవాలి. అప్పుడే వలసవాద వాసనలు వదులుతాయి. అలాకాక ఎన్నేళ్ళయినా పాత పాలకులనే నిందించడం అసమంజసం. అది ఇన్నేళ్ళ సొంత తప్పుల్ని కాలమనే తివాచీ కిందకు నెట్టేసే విఫలయత్నమే! -
తటస్థతకు తిలోదకాలు
పోసేవాడు ఒకందుకు పోస్తే... తాగేవాడు మరొకందుకు తాగాడని మోటు సామెత. ఎన్నికల కమిషనర్లు, ప్రత్యేకించి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నియామకంపై కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 10న రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు వ్యవహారం అచ్చం ఆ సామెతనే గుర్తు చేస్తోంది. ఎన్నికల కమిషనర్ల నియామకంపై పాలనావ్యవస్థ ఉడుంపట్టును సడలించేలా గత మార్చిలో సుప్రీమ్ కోర్డ్ రాజ్యాంగ ధర్మాసనం ఒక ఉద్దేశంలో తీర్పు చెబితే, అయిదునెలల్లో కేంద్రం ఏకంగా ఆ తీర్పు స్ఫూర్తికే విరుద్ధమైన బిల్లుతో ముందుకొచ్చింది. ఎంపిక ప్రక్రియ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని తప్పించింది. తటస్థంగా ఉండాల్సిన ఎంపిక కమిటీని అధికారపక్షం తన అదుపాజ్ఞల్లో ఉంచుకొనేలా తెగబడింది. పార్టీ, ప్రభుత్వాలకతీతంగా నడవాల్సిన ఎన్నికల సంఘ స్వతంత్రతను దెబ్బతీస్తోంది. భారత ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపీ), కేంద్ర క్యాబినెట్ మంత్రితో కూడిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఇకపై సీఈసీని నియమిస్తుందని ప్రభుత్వం బిల్లులో ప్రతిపాదించింది. ఇప్పటి దాకా కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు సీఈసీని రాష్ట్రపతి నియమిస్తున్నారు. తాజాగా ప్రతిపక్ష నేతను కూడా చేర్చి, విస్తృత ప్రాతినిధ్యంతో ప్యానెల్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన మామూలుగా నైతే స్వాగతించాలి. కానీ, ఇక్కడే తిరకాసుంది. సీఈసీ సహా ఎన్నికల కమిషనర్ల ఎంపికపై ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసే వరకు, సదరు ఎంపిక కమిటీలో సీజేఐకి కూడా చోటిచ్చి, ఈ ప్రక్రియను మరింత ప్రజాస్వామ్యయుతం చేయాలని మార్చి 2న అయిదుగురు సభ్యుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. సహజంగానే ఇది మింగుడుపడని సర్కార్ ఆగమేఘాలపై బిల్లు తెచ్చేసింది. ఆ బిల్లులో సీజేఐకి బదులుగా కేంద్ర మంత్రికి చోటిచ్చింది. మంత్రులంటే ప్రధాని గీచిన గీత దాటలేరు. వెరసి, ఎంపిక కమిటీలో పేరుకు ప్రతిపక్ష నేత ఉన్నా మొత్తం ముగ్గురిలో ఇద్దరు సభ్యులు పాలక పక్షీయులే గనక మెజారిటీ ఎటు మొగ్గుతుందో వేరుగా చెప్పనక్కర లేదు. పార్లమెంట్ చేసిన చట్టాలకు అనుగుణంగా ఎన్నికల కమిషనర్ నియామకం జరగాలని భారత రాజ్యాంగ పరిషత్ చర్చలు పేర్కొన్న మాట నిజమే. దాన్ని ఆసరాగా చేసుకొనే సుప్రీమ్ సైతం ప్రభుత్వం చట్టం చేసే వరకు ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐతో కూడిన ఎంపిక సంఘమంటూ అయిదు నెలల క్రితం తాత్కాలిక ప్రతిపాదన తన తీర్పులో చెప్పింది. తీరా ఇప్పుడు ప్రభుత్వం చట్టం చేస్తోంది కానీ పరోక్షంగా అధికార పక్షం చేతిలోకే అంతా తెచ్చి, రాజ్యాంగబద్ధ సంస్థ స్వతంత్రతను పణంగా పెట్టింది. ఇదీ అసలు సమస్య. అలాగే, ఎంపిక సంఘం తనదైన సొంత ప్రక్రియను ఎంచుకోవచ్చట. ఆ సంఘం ముందు ఉంచాల్సిన తొలి జాబితాను క్యాబినెట్ సెక్రటరీ సారథ్యంలోని సెర్చ్ కమిటీ సిద్ధం చేస్తుందట. వెరసి, ప్రతిపక్ష నేత వట్టి ఉత్సవ విగ్రహమవుతారు. ఆయన అభిప్రాయం అరణ్యఘోషగా మిగులుతుంది. కొద్దినెలల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లోనూ, సరిగ్గా మరో 9 నెలల్లో లోక్‌సభకూ ఎన్నికలు జరగాల్సి ఉండగా కేంద్రం ఈ బిల్లు ద్వారా ఎన్నికల సంఘంపై పూర్తిగా పట్టు బిగించాలన్నది పాలకుల తాపత్రయమనిపిస్తోంది. ప్రభుత్వ ప్రమేయం లేకుండా నడవాల్సిన వ్యవస్థకు పెద్ద తలకాయలెవరో అధికారంలో ఉన్నవారే నిర్ణయించడం ఎన్నికల ప్రజాస్వామ్యపు ప్రాథమిక లక్ష్యానికే విఘాతం. ఆ మాటకొస్తే దేశంలో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించే ఎన్నికల సంఘం, కమిషనర్ల నియామకం పారదర్శకంగా లేదని కొన్నేళ్ళుగా వింటున్నదే. వారిపై ప్రభుత్వం పరోక్షంగా స్వారీ చేస్తున్నదన్న ఆరోపణలూ ఉన్నాయి. 2021 నవంబర్‌లో న్యాయశాఖ ఆదేశాల మేరకు సీఈసీ, ఎన్నికల కమిషనర్లు ఉమ్మడి ఓటర్ల జాబితాపై చర్చించడానికి ప్రధానమంత్రి కార్యాలయంతో సమావేశానికి వెళ్ళడం దుమారం రేపింది. ఇది ఎన్నికల సంఘం అధికారం, స్వతంత్రతను తగ్గించడమేనని రాజ్యాంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. పాలకవ్యవస్థ జోక్యం నుంచి ఎన్నికల సంఘాన్ని కాపాడాలన్న సదుద్దేశంతో సుప్రీమ్ తీర్పునిస్తే అంతా సంతోషించారు. తీరా కొత్త బిల్లుతో ఎన్నికల సంఘం ఇక అధికారి కంగానే పాలకుల గూటి చిలకగా మారిపోనుంది. ఎన్నికలు కురుక్షేత్ర సమరంగా మారిన వర్తమాన పరిస్థితుల్లో ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఉందని సంబంధిత పక్షాలన్నిటికీ నమ్మకం కలగడం ముఖ్యం. పాలకులేమో చట్టం తెచ్చి మరీ ఆ నమ్మకానికి చరమగీతం పలుకుతున్నారు. ఎన్నికల సంస్కరణలపై ఏర్పాటైన దినేశ్ గోస్వామి కమిటీ 1990లోనే ఎన్నికల సంఘపు స్వతంత్రతను కాపాడే మార్గాలతో కొన్ని సిఫార్సులు చేసింది. న్యాయ సంఘం 2015 నాటి తన 255వ నివేదికలో ఆ కమిటీ ప్రతిపాదనకు మార్పులు చేస్తూ, ఎంపిక కమిటీలో ప్రధానికి చోటుకల్పించింది. సీజేఐకీ అందులో స్థానం ఉంటే అధికార, ప్రతిపక్షాలు వేటికీ మొగ్గు లేకుండా తటస్థత నెలకొనేది. కొత్త బిల్లుతో ఆ తటస్థత నిర్వీర్యమైంది. ఇది గ్రహించి ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియకు కావలిసంస్థ స్వతంత్రతను కాపాడుకోవాలి. రాజ్యాంగ రూపకల్పన వేళ అంబేడ్కర్ సైతం పాలనా వ్యవస్థ జోక్యానికి దూరంగా ఎన్నికల సంఘం ఉండాలన్నారు. సీఈసీ ఎంపిక ప్రక్రియ నుంచి సీజేఐని తప్పించకుండా ఉంటేనే అది సాధ్యం. కాదూ కూడదనుకుంటే, ప్రత్యామ్నాయంగా ఎంపిక కమిటీ నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా ఉండాలనే షరతు పెట్టాలి. తద్వారా ప్రతిపక్ష నేత మాటకు విలువ ఉంటుంది. ఎన్నికల సంఘం సమగ్రతను కాపాడినట్టూ అవుతుంది. మార్గం ఏదైనా, ఎన్నికల సంఘం నియామకాల ప్రక్రియను అపహాస్యం చేస్తున్న ఈ కొత్త బిల్లుపై తక్షణ సమీక్ష అవసరం. ప్రభుత్వం పునరాలోచించి, ఆ పని చేస్తేనే స్వతంత్ర భారతావనికి శోభ! ప్రజాస్వామ్యానికి రక్ష!!