పవన్ కల్యాణ్ బీజేపీతో కలిశారు. ఈ సహ ప్రయాణం ఎక్కడిదాకా వెళుతుంది? సహజీవనంగా ఉంటుందా లేక శాశ్వత దాంపత్యానుబంధంగా మారుతుందా? అంటే బీజేపీతో పొత్తు ఉంటుందా లేక బీజేపీలో విలీనం అవుతుందా అనేదే తేలాలి. పొత్తుతో మొదలై విలీనంగా వికసిస్తుంది అని కూడా అంటున్నారు. బీజేపీతో సంబంధం పెట్టుకోవాలా లేక మరే పార్టీతో అయినా సంబంధం పెట్టుకోవాలా అనే అంశంలో పవన్ కల్యాణ్‌కు రాజకీయ పార్టీ నాయకుడిగా కచ్చితంగా హక్కుంది. అన్న కాంగ్రెస్‌లో కలిపినట్లు, తమ్ముడు బీజేపీలో కలిపినా అది పవన్ ఇష్టం. కాదనలేం. కానీ మనకు ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కల్యాణ్ మనకు ఎప్పుడూ నేర్పింది ఏంటంటే ప్రశ్నించడమే. పవన్ కల్యాణ్‌ను అభిమానించేవారు కూడా ఆయన్ని ప్రశ్నించాలి. మీరు పవనిజాన్ని విశ్వసిస్తే, పవనిజాన్ని ఆచరించాలనుకుంటే.. బీజేపీతో కలుస్తున్న పవన్ కల్యాణ్ తాజా ఎపిసోడ్‌ను ప్రశ్నించాల్సిందే.
1. పవన్ కల్యాణ్‌కూ నరేంద్రమోదీ మధ్యకానీ, జనసేనకూ, బీజేపీ మధ్య కానీ ఉన్న సైద్ధాంతిక అనుబంధం ఏంటి? ఇప్పుడు ఎలా కలుస్తున్నారు? 2014లో టీడీపీ, బీజేపీతో కలిసి పవన్ కల్యాణ్ ప్రయాణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాక, ఏదో ఒక కేంద్రప్రభుత్వం సహాయం లేకుండా ఏపీ అభివృద్ధి కాలేదు కనుక, ఆ నిర్దిష్ట పరిస్థితిలోనే తాను టీడీపీ, బీజేపీలతో కలిశానని పవన్ పదే పదే చెప్పారు. బీజేపీ సైద్ధాంతిక భావనలకు, పవన్ ఆలోచనలకు ఎక్కడా పొంతన లేదని మనకు తెలుసు. మరి అలాంటి పవన్ ఇప్పుడెలా కలుస్తున్నారు?
(చదవండి : ‘హోదా’ వదిలేశా సాంబా!)
2. ప్రత్యేక హోదాపైన పవన్ పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ప్రత్యేక ప్యాకేజీ పాచిపోయిన లడ్డూలు అన్నారు. ఇప్పుడు తాజా లడ్డూలు ఇవ్వలేదు, పాచిపోయిన లడ్డూ కూడా ఇవ్వలేదు. విభజన అనంతర ఏపీకి కేంద్రం ప్రకటించిన ఏ హామీ కూడా అమలు కాకున్నప్పటికీ ఇప్పుడు బీజేపీతో ఎందుకు కలిశారు? ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీతో ఎందుకు కలిశారు?
3. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీ కలయికతో కలిగే లాభం ఏంటి? రెండు రాజకీయ పార్టీల కలయిక ఆ రాజకీయ నాయకుల వ్యక్తిగత ప్రయోజనాలకోసం ఎప్పుడూ ఉండకూడదు. ఆ కలయిక వల్ల ఆక్కడి ప్రజలకు ఏదైనా మేలు జరిగేలా ఉండాలి. ఇప్పుడు మీరు బీజేపీతో కలవడం వల్ల ఏపీ ప్రజలకు నిర్దిష్టంగా దక్కేదేంటి?
4. జనసేన గురించి మీరు ఏం చెప్పారు? 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం కోసం వచ్చాం అన్నారు. రేప్పొద్దున దొరికే పదవుల కోసం కాదు అని చెప్పారు. మరి ఐదారేళ్లలో ఇన్ని రాజకీయ పల్టీలు ఎందుకు కొడుతున్నారు? 2014లో బీజేపీతో కలిశారు. 2019లో బీజేపీతో పోరాడారు. వామపక్షాలతో కలిశారు. ఇప్పుడు మళ్లీ బీజేపీతో కలుస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కోసం వచ్చిన ఒక పార్టీకి ఇన్ని పల్టీలు కొట్టాల్సిన అవసరం ఏమిటి?
5. 2019 మేలో మీరు బీజేపీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. ఇప్పుడు 2020 జనవరి. ఏడు నెలల్లోనే బీజేపీతో కలుస్తున్నారు. అప్పటికీ, ఇప్పటికీ ఈ ఏడు నెలల్లో రాజకీయ వాతావరణంలో ఏ మార్పు వచ్చింది? ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ కొత్తగా ఏం చేసింది?
6. టీడీపీ, బీజేపీ, జనసేన ఒక్కటేనని వైఎస్సార్‌సీపీ గత ఎన్నికల సమయంలో ప్రజలకు పదే పదే చెప్పింది. బీజేపీతో నాకు సంబంధం ఏమిటి అని మీరు అప్పట్లో తీవ్రంగా ఖండించారు. కానీ ఇవ్వాళ వ్యవహారం చూస్తుంటే మూడు పార్టీలు మళ్లీ కలవడానికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా బీజేపీలో పవన్ కల్యాణ్ కలిశారు. ఇక కలవాల్సింది టీడీపీ మాత్రమే. ఇటీవల అమరావతి సమస్యపై బీజేపీని సమర్థించడానికి టీడీపీ నేతలు తంటాలు పడుతున్నారు. మరి ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ చేసిన విమర్శలు నిజం అవుతున్నాయి కదా? విడివిడిగా ఉన్నారు కానీ అంతర్గతంగా ఈ మూడు పార్టీలు కలిసే ఉన్నాయని వైఎస్సార్ సీపీ అప్పట్లోనే తేల్చి చెప్పేసింది. ఆ ఆరోపణకు మీరు ఇప్పుడు బలం చేకూర్చడం లేదా? దీనిపై మీ సమాధానం ఏంటి?
7. భవిష్యత్‌లో మీరు జనసేన పార్టీనే బీజేపీలో విలీనం చేస్తారు అని మాటలు వినిపిస్తున్నాయి. మీ అన్న చిరంజీవి కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసినట్టుగా.. జనసేనను బీజేపీలో కలపను అని ఇప్పటికైనా మీరు మాటివ్వగలరా? బీజేపీ వాళ్లు ఖర్చులు భరించి వేదికలు ఏర్పాటు చేస్తే మీరు వచ్చి ఉపన్యాసాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారా?
8. ఇలా ఒకసారి టీడీపీతో.. ఒకసారి బీజేపీతో, మళ్లీ ఇప్పుడు బీజేపీతో కలవడం వల్ల మీపై ఒక అభాండం వేస్తున్నారు. ప్యాకేజీలు తీసుకొని మీరు మారుతుంటారు అని అంటున్నారు? మీరు అనుసరించే రాజకీయ వ్యూహాలు, వాటి వెనుక ఉన్న హేతుబద్ధమైన కారణాలను ప్రజలకు చెప్పకపోవడం వల్ల పవన్ కల్యాణ్ ప్యాకేజీలు తీసుకుని పనిచేస్తారు అని మీ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతుంది కదా. మీపై వస్తున్న ఇలాంటి ఆరోపణలను మీ అభిమానులు, ప్రజలు ఎలా వ్యతిరేకించాలి? ఇది ప్రాథమిక ప్రశ్న.
9. రాజధానే ప్రాతిపదిక అయితే మీరు ప్రత్యేకంగా బీజేపీతోనే కలవాల్సిన అవసరం లేదు. అన్ని రాజకీయ పార్టీలతో పాటు కలిసి పనిచేస్తూ, పోరాడుతూనే మీ విడి వ్యక్తిత్వాన్ని నిలుపుకోవచ్చు. జేఏసీలో కూడా భాగమై పని చేయవచ్చు. ఎందుకు అలా చేయలేదు?
10. అమరావతి విషయంలో బీజేపీ మీకు ఏమైనా హామీ ఇచ్చిందా? ప్రత్యేక హోదా మీద ఏమైనా హామీ తీసుకున్నారా? ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ అగ్రనాయకత్వాన్ని కూడా కలవడానికి సిద్ధపడని పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు కలుస్తున్నట్లు? కలవడంలో ప్రాతిపదిక ఏంటి? అమరావతి నుంచి రాజధానిని తరలించబోమని మీకు బీజేపీ నాయకులు ఏదైనా హామీ ఇచ్చారా? నిష్పాక్షికంగా విషయాలను చూసేవారు ప్రశ్నించాలని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పారు మరి. కాబట్టే నేను నేరుగా ఆయన్నే ఇలా ప్రశ్నిస్తున్నా.
(చదవండి : అలా చెప్పడానికి పవన్‌కు సిగ్గుండాలి : పేర్ని నాని)
ప్రొఫెసర్ నాగేశ్వర్
వ్యాసకర్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment