ఆంధ్రా ప్యారిస్‌కు అవార్డు
Published Fri, Jan 31 2014 12:02 AM | Last Updated on Sat, Aug 18 2018 4:35 PM
తెనాలిరూరల్, న్యూస్‌లైన్ :వినూత్న పారిశుద్ధ్య విధానంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తెనాలి పురపాలక సంఘం ఇప్పుడు అంతర్జాతీయ అవనిలో తన ప్రత్యేకతను చాటుకుంది. ఘన వ్యర్ధ పదార్థాల నిర్వహణపై గత మూడు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో గుంటూరు రీజియన్ నుంచి పాల్గొన్న ఏకైక పురపాలక సంఘమైన తెనాలి వ్యర్ధాల నిర్వహణలో రెండో ఉత్తమ పురపాలక సంఘంగా నిలిచింది. ఆయా పురపాలక సంఘాల జనాభా, వ్యర్ధాల నిర్వహణ తీరును పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేసిన పురపాలక సంఘాల్లో తెనాలి రెండో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.
పది లక్షలు దాటిన జనాభా ఉన్న పురపాలక సంఘాల్లో పూనె మొదటి స్థానం దక్కించుకోగా, విశాఖపట్నం రెండో స్థానంలో నిలిచింది. నాలుగు లక్షల నుంచి 10 లక్షల లోపు జనాభా ఉన్న కేటగిరిలో వరంగల్ మొదటి స్థానం దక్కించుకుంది. లక్ష నుంచి నాలుగు లక్షలలోపు జనాభా ఉన్న కేటగిరీలో రాష్ట్ట్ర్రానికి చెందిన గుంతకల్ పురపాలక సంఘం ప్రథమ స్థానంలో నిలువగా తెనాలి రెండో ఉత్తమ పురపాలక సంఘంగా నిలిచింది. రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, పుర పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మానుగుంట మహీధరరెడ్డి, పురపరిపాలన శాఖ డెరైక్టర్ బి. జనార్ధనరెడ్డి, అడిషనల్ డెరైక్టర్ బి.రమేష్‌బాబు చేతుల మీదుగా గురువారం సాయంత్రం జరిగిన ముగింపు సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బి. బాలస్వామి అవార్డును అందుకున్నారు.
Advertisement
Advertisement