స్థానిక సంస్థల
ఎమ్మెల్సీ ఎన్నికలకు
షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
జూలై 3న పోలింగ్,
7న లెక్కింపు
టీడీపీలో ‘స్థానిక’ గుబులు
ఉత్సాహంతో వైఎస్సార్‌సీపీ
సాక్షి ప్రతినిధి, విజయనగరం: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోరుకు తెరలేచింది. జిల్లాలో మారుతున్న రాజకీయ పరిణామాలతో టీడీపీ నేతలకు టెన్షన్ పట్టుకుంది. మరోవైపు వైఎస్సార్ సీపీ ఉత్సాహంతో ఉంది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైఎస్సార్‌సీపీలో చేరనుండటంతో కాంగ్రెస్ స్థానిక సంస్థల ఓట్లు ఆ పార్టీకి మళ్లే అవకాశాలెక్కువగా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. జూలై 3వ తేదీన పోలింగ్, 7వ తేదీన లెక్కింపు జరగనుంది. ఈమేరకు ఈనెల 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. 16వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 17న పరిశీలన, 19న ఉపసంహరణ కార్యక్రమాలు జరగనున్నాయి.
పార్టీ బలబలాలివి
స్థానిక సంస్థల ఓట్లు జిల్లాలో 712 ఉన్నాయి. ఇవి కాకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కో ఆప్షన్ సభ్యుల ఓట్లు అదనం కానున్నాయి. స్థానిక సంస్థల( ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు) పరంగా చూస్తే టీడీపీకి 400, వైఎస్సార్‌సీపీకి 220, కాంగ్రెస్‌కు 63, ఇతరులు 28, బీజేపీకి ఒక స్థానం ఉన్నాయి.
టీడీపీలో తీవ్ర పోటీ
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. శోభా హైమావతి, ద్వారపురెడ్డి జగదీష్, ఐవీపీ రాజు, గద్దే బాబూరావు, తూముల భాస్కరరావు, తెంటు లక్ష్ముంనాయుడు, భంజ్‌దేవ్, లగుడు సింహాద్రి, తెంటు లక్ష్ముంనాయుడు, కె.త్రిమూర్తుల రాజు, డాక్టర్ వీఎస్ ప్రసాద్, సిటీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు తదితరులు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. ఇప్పటికే ఎవరికి వారు ప్రయత్నాల్లో ఉన్నారు. వీరంతా ఎమ్మెల్యేల కోటాలోనూ, గవర్నర్ కోటాలోనూ ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. అయితే, వాటిలో సానుకూలత లేకపోవడంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆ పార్టీ ఇప్పటికే తయారు చేసిన ప్రతిపాదిత జాబితాలో ఎవరికీ తెలియని నెల్లిమర్ల సత్యం పేరు ఉంది.
ఈయనెవరో ఆ పార్టీ నేతలే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. దాదాపు నేతలంతా ఆయన అడ్రస్సు తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. 20 ఏళ్ల క్రితంలో నెల్లిమర్ల మండలంలో ఉండేవారని, గతంలో వారి సంబంధీకులు రాజకీయాల్లో ఉండేవారని, భోగాపురంలో వం దల ఎకరాల భూములున్నాయని, ప్రస్తుతం మం త్రి నారాయణ వ్యవహారాలు చూసుకుంటున్నార ని రకరకాలుగా ఆరాతీసి క్లారిటీ తీసుకుంటున్నా రు. అంతేకాకుండా ఆయనకు రాకపోవచ్చని, మ రో పేరును ప్రతిపాదించొచ్చని భావిస్తున్నారు. దీంతో ఎవరికి వారు ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి వస్తుందోనన్న గుబులు పట్టుకుంది. మారనున్న బలాలు: ఇదిలా ఉండగా, జిల్లాలో మారుగుతున్న రాజకీయ పరిణామాలతో టీడీపీ నేతలకు టెన్షన్ పట్టుకుంది.
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైఎస్సార్‌సీపీలో చేరనుండటంతో బలబలాలు మారుతున్నాయి. కాంగ్రెస్ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన వారంతా వైఎస్సార్‌సీపీలో చేరే అవకాశం ఉంది. అలాగే, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లి గెలిచిన వారు కూడా బొత్సతో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. వారంతా తిరిగి బొత్స వెంట వస్తే టీడీపీ బలం తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడిదే టీడీపీలో కలవరం సృష్టిస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారంతా మనసు మార్చుకుంటే తమకు ఇబ్బంది వస్తుందేమోనని భయపడుతున్నారు.వైఎస్సార్‌సీపీలో ఉత్సాహం: మారుతున్న రాజకీయ పరిణామాల్లో వైఎస్సార్‌సీపీలో ఉత్సాహం కనిపిస్తోంది. బలం పెరిగే పరిస్థితులు కనబడటంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకుంది.
మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా
Published Wed, Jun 3 2015 12:19 AM | Last Updated on Wed, Aug 29 2018 6:29 PM
Advertisement
Advertisement