అంగన్‌వాడీల కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
Published Fri, Nov 27 2015 1:46 PM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
హైదరాబాద్: వేతన పెంపుపై ప్రభుత్వ హామీలు నమ్మేదీ లేదని, జీఓ జారీ చేసేంత వరకు ఉద్యమం ఆపేదిలేదంటూ అంగన్ వాడీలు శుక్రవారం చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. పెంచిన జీతాలను సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలని అంగన్ వాడీలు ముట్టడి కార్యక్రమం తలపెట్టారు. ఈ సందర్భంగా పలు జిల్లాలలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులకు , అంగన్ వాడీలకు మధ్య తోపులాటలు, వాగ్వాదాలు తలెత్తాయి. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.
అనంతపురం: అనంతపురం జిల్లాలో అంగన్ వాడీలు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. పెంచిన జీతాలకు సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేసి దాని ప్రకారం జీతాలు అందించాలని డిమాండ్ చేస్తూ వారు చేసిన కార్యక్రమంలో పోలీసులకు అంగన్ వాడీలకు మధ్య తోపులాట జరిగింది. శుక్రవారం ఉదయం నుంచే అనంత కలెక్టరేట్ ఎదుటకు చేరిన వేలాది కార్యకర్తలు గేట్లు తోసుకొని కలెక్టర్ కార్యాలయం లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీంతో భారీగా మొహరించిన పోలీసులకు అంగన్‌వాడీలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి.
కాకినాడ : అంగన్‌వాడీలు తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ, హెల్ఫర్స్ యూనియర్స్ శుక్రవారం కలెక్టరేట్ ను ముట్టడించారు. గేట్లు ఎక్కి కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు అంగన్‌వాడీలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
Advertisement
Advertisement