తాడేపల్లి రూరల్ : కృష్ణానది నీటి మట్టం 12 అడుగులు ఉండాల్సి ఉండగా, ఒక్కసారిగా 8 అడుగులకు తగ్గిపోయింది. అసలే ఎండాకాలం ఆపై రబీ పంట కాలం కావడంతో రైతులు సైతం ఆందోళన చెందుతున్నారు. నదిలో నీరు మరింత తగ్గితే పరిస్థితి ఏంటని భ యాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా నీటి మట్టం తగ్గడంతో రబీ రైతులు ఆలోచనలో పడిపోయారు. ఇప్పటికే మొక్కజొన్న పంటకు ఒక తడి అందించగా, పంట కొంత ఊరట చెందింది. మరో తడి తగిలితే గానీ, పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. 12 అడుగుల నీటి మట్టంతో నిశ్చలంగా ఉండాల్సిన కృష్ణమ్మ తగ్గిపోవడంతో, విద్యుత్ సరఫరాకు సంబంధించి వీటీపీఎస్ సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
గుంటూరు,విజయవాడ నగరపాలక సంస్థలకు సైతం ఇక్కడి నుంచే నీటి సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం గుంటూరు చానల్ పరిధిలోని 27 గ్రామాలతో పాటు ఒక మున్సిపాలిటీ, ఇతర ప్రాంతాలకు సైతం నీరు నిలిచిపోయింది. పూర్తి స్థాయిలో నీరు అందితేనే మంచినీరు సక్రమంగా దొరకడం లేదు. ఇక ఎండా కాలం కృష్ణానదిలో నిల్వ తగ్గుతుంటే ఆ ప్రాంతాలు చుక్కనీటికి కూడా దిక్కులు చూడాల్సిన పరిస్థితి. ఇదిలావుంటే, కొండవీటి వాగుకు బ్యాక్ వాటర్ ప్రతి సంవత్సరం తాడికొండ వరకు వెళుతోంది. ఈ ఏడాది ఉండవల్లి బ్రిడ్జి వరకే పరిమితమైంది. దీంతో ఆ ప్రాంతంలోని కూరగాయల సాగు,పూలతోటలకు ఇబ్బంది ఏర్పడుతోంది.ఇదిలా ఉంటే బకింగ్‌హామ్ కాలువ (మద్రాస్ కాలువ) అనుసంధానంగా ఉండే కాలువలన్నీ అడుగంటాయి. దీంతో రబీ రైతులు నష్ట పోయే ప్రమాదం లేకపోలేదు.
కళ తగ్గిన కృష్ణమ్మ
Published Wed, Mar 18 2015 4:25 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement