జిల్లాలో తీవ్ర అనావృష్టి
జిల్లాలో తీవ్ర అనావృష్టి
Published Sun, Aug 21 2016 8:56 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
కురవాల్సినవర్షం 451 మి.మీ...
కురిసిందేమో 387 మి.మీ
మచిలీపట్నం :
జిల్లాను అనావృష్టి వేధిస్తోంది. ఆగస్టు నెలలో ఇబ్బడిముబ్బడిగా కురవాల్సిన వర్షం ముఖం చాటేసింది. దీంతో వాననే నమ్ముకుని విత్తనాలు చల్లిన రైతులకు కష్టకాలం దాపురించింది. కళ్లెదుటే నారుమడులు, వెదజల్లే పద్ధతి ద్వారా వరినాట్లు వేసిన పొలాలు ఎండిపోతుంటే రైతన్నలు చేష్టలుడిగి చూడాల్సి వస్తోంది. జిల్లాలో జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు 451.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు కురిసింది 387.6 మిల్లీమీటర్లు. ఈ వర్షం అంతా జూన్, జూలై నెలల్లో నమోదైంది. ఆగస్టు నెలలో వర్షపాతం అతి తక్కువ నమోదు కావటంతో వరి, ఇతర పంటలు ఎండిపోతున్నాయి. కాలువల ద్వారా నీర అంతంత మాత్రంగానే వస్తోంది. 60శాతం వర్షాధారంగా, 40 శాతం భూములు కాలువల నీటిపై ఆధారపడ్డాయి. కృష్ణాడెల్టాలోని భూములు బీడును తలపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఖరీఫ్ పంట సాగు చేయాలా, వద్దా అనే మీమాంసలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
Advertisement