రుణమాఫీ గురించి తెలిసినా జాప్యమెందుకు?
రుణమాఫీ అమలులో సాధ్యాసాధ్యాల గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా పూర్తిగా తెలుసని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన ఈ అంశంపై ఎన్నికల కమిషన్కు లేఖ కూడా రాశారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు మాత్రం రుణమాఫీ అమలుపై ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. బడ్జెట్ కేటాయింపులు సరిగా లేకపోతే తాము కచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైఎస్ జగన్ చెప్పారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పేరుతో తమ పార్టీ ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు రాజకీయాల్లోకి రాకముందు ఆయనకున్న ఆస్తి ఎంత, ఇప్పుడున్న ఆస్తి ఎంతని నిలదీశారు.
రాష్ట్రంలో స్పాన్సర్డ్ మర్డర్లు జరుగుతున్నాయని, అయినా ఈ విషయంలో పోలీసులు మాత్రం ప్రేక్ష పాత్ర వహిస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక గత మూడు నెలల్లో వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన11మందిని అతి కిరాతకంగా చంపారని, దీనిపై పోలీసులు కేసులు కూడా నమోదు చేయడంలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా విఫలమయ్యిందని, ఇలాంటి అత్యంత ముఖ్యమైన అంశంపై తాము వాయిదా తీర్మానం ఇస్తే చర్చకు అనుమతించక పోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.