దిక్కుమాలిన రాజకీయ నైజం | Chandrababu political game with Ts govt on krishna water | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 23 2017 2:59 AM | Last Updated on Sat, Jul 28 2018 3:41 PM

Chandrababu political game with Ts govt on krishna water - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరించే నీతి మాలిన రాజకీయాలకు ఇదో పరాకాష్ట. పత్రికలు పత్రికల పని చేస్తాయి. ప్రతిపక్ష నాయకుడి పనిని ప్రతిపక్ష నాయకుడు చేస్తారు. ప్రతికల్లో రాసిన అంశాన్ని చిలువలు పలువలు చేసి, ఇదంతా ప్రతిపక్ష నేతే చేయిస్తున్నారంటూ అభాండాలు వేసి.. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దుర్భిక్ష రాయలసీమకు కృష్ణా జలాలను తరలించలేని తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో.. పత్రికల తెలంగాణ ఎడిషన్‌లలో ప్రచురితమైన అంశాలను ప్రతిపక్ష నేతకు ముడిపెట్టడం చంద్రబాబు విలువల్లేని రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జలాలను తరలిస్తోందని తెలంగాణ సర్కార్‌ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసిన అంశాన్ని ఒక్క ‘సాక్షి’నే కాదు తెలంగాణలోని అన్ని పత్రికలూ ప్రచురించాయి. బోర్డుకు ఫిర్యాదు చేశాక కూడా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి జలాలను ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ మళ్లిస్తోందంటూ తెలంగాణ నీటి పారుదల శాఖ చేసిన ఆరోపణలను తెలంగాణ ఎడిషన్‌లో పత్రికలు ప్రచురించాయి. తెలంగాణ రాష్ట్రంతో ముడిపడిన అంశాలను ఆయా పత్రికలు అక్కడి ఎడిషన్‌లలో ప్రచురించడం సాధారణం.

జర్నలిజం పట్ల కనీస అవగాహన ఉన్న వారందరికీ ఈ విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు ఈ విషయాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని భావించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయ లబ్ధే పరమావధిగా ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య చిచ్చుపెట్టిన తన నైజాన్ని అధికారంలోకి వచ్చాక కూడా ఆయన మరోసారి చాటుకున్నారు. తాను రాష్ట్రానికి నీటిని విడుదల చేస్తుంటే ప్రతిపక్షం అడ్డుపడుతోందని.. ప్రతిపక్షం పత్రిక ఆంధ్రప్రదేశ్‌ జలచౌర్యం చేస్తోందంటూ తెలంగాణ ఎడిషన్‌లలో ప్రచురిస్తోందంటూ బోడిగుండుకూ మోకాలికి ముడేస్తూ తప్పుడు రాజకీయానికి తెరతీశారు. కృష్ణా వరద జలాలు జూరాల ప్రాజెక్టుకు చేరిన వెంటనే తెలంగాణ సర్కార్‌ కోయిల్‌సాగర్, బీమా, నెట్టెంపాడు ఎత్తపోతల, జూరాల ప్రాజెక్టు కాలువల ద్వారా ఎడాపెడా మళ్లిస్తున్నా చంద్రబాబు పల్లెత్తు మాట మాట్లాడే సాహసం చేసిన దాఖలాలు లేవు. కనీసం తెలంగాణ ప్రభుత్వంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసిన పాపాన కూడా పోలేదు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద జలాలు చేరాక పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా అరకొరగా నీటిని విడుదల చేయడం.. ఆ వెంటనే తెలంగాణ సర్కార్‌ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడం.. దాన్ని సాకుగా చూపి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి నీటి విడుదలను ఆంధ్రప్రదేశ్‌ సర్కారు ఆపడం చకచకా జరిగిపోయింది.

జనం నవ్వుకోరా..
తెలంగాణ ప్రభుత్వానికి భయపడి, కుమ్మక్కయ్యి సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రయోజనాలను కాలరాస్తూ చేస్తోన్న రాజకీయ విన్యాసాలను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్‌ చేతిలో అడ్డంగా దొరికిన చంద్రబాబు.. ఆ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా తాకట్టు పెట్టారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రతిపక్ష నేతకు ముడిపెడుతూ విమర్శలు చేయడం చంద్రబాబు విలువల్లేని రాజకీయాలకు పరాకాష్టగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. నిత్యం చంద్రబాబు పల్లకిని మోసే పత్రికలూ తెలంగాణ రాష్ట్ర ఎడిషన్‌లలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలను ప్రచురించాయి. అదే అంశాన్ని ‘సాక్షి’తో పాటూ ఇతర పత్రికలూ ప్రచురించాయి. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోకుండా ప్రతిపక్షనేతకు లింకు పెట్టి మాట్లాడటం చంద్రబాబుకే చెల్లింది.

ఆది నుంచి ఇదే తీరు
దివంగత సీఎం మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి   పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచే పనులను చేపట్టడాన్ని అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కోడెల శివప్రసాదరావు తదితరులు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంపును నిరసిస్తూ అప్పట్లో పాదయాత్రలు చేశారు. అధికారంలోకి వచ్చాక కూడా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణ పనుల్లో మిగిలిపోయిన రూ.45 కోట్ల విలువైన పనులు పూర్తి కాకుండా ఇప్పటికీ మోకాలడ్డుతూ దుర్భిక్ష రాయలసీమపై కక్ష సాధిస్తున్నారు.  

సీమ నోట్లో మట్టి కొట్టిందెవరు?
శ్రీశైలం జలాశయం సమగ్ర ప్రాజెక్టు నివేదికలోనే ఆ జలాశయం కనీస నీటిమట్టం 854 అడుగులుగా నిర్ణయించారు. కనీస మట్టం మేరకు జలాశయంలో నీరు నిల్వ ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లందుతాయి. కానీ.. 1996లో కనీస నీటి మట్టాన్ని 834 అడుగులకు తగ్గిస్తూ అప్పట్లో అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. 1996 నుంచి 2003 వరకూ ఏ ఒక్క ఏడాది కూడా 834 అడుగుల మేర కూడా నీటిని నిల్వ చేయలేదు. 790 అడుగుల దిగువ వరకు కూడా నీటిని తోడేసి.. రాయలసీమ నోట్లో మట్టి కొట్టారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక శ్రీశైలం జలాశయం కనీస నీటి మట్టాన్ని 854 అడుగులకు పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేలా నిబంధనలు రూపొందించారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 874 అడుగులకు చేరిన తర్వాత కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేయవచ్చు. కానీ.. గత మూడేళ్లుగా 854 అడుగుల నుంచే విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ చంద్రబాబు రాయలసీమ నోట్లో మట్టి కొడుతున్నారు. ఈ ఏడాదీ శ్రీశైలం జలాశయంలో 848 అడుగుల నీటి మట్టం వద్దే విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించడం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement