మెట్రో రైలు వస్తే ఈజీ జర్నీ
బందరురోడ్డు, ఏలూరురోడ్డు కారిడార్లు24
మెట్రో స్టేషన్లు, ఐదు నిమిషాలకొక రైలు
డీపీఆర్ సిద్ధంచేసిన డీఎంఆర్‌సీ
విజయవాడ బ్యూరో : మెట్రో రైలు అందుబాటులోకి వస్తే పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి నిడమానూరుకు కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. బస్టాండ్ నుంచి పెనమలూరు వెళ్లేందుకూ అంతే సమయం పడుతుంది. 40 కిలోమీటర్ల సగటు, 75 కిలోమీటర్ల అత్యధిక వేగంతో నగరంలో మెట్రో రైళ్లు నడిచేలా డిజైన్లు తయారుచేశారు. డీఎంఆర్‌సీ (ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్న డీపీఆర్ (సవివర నివేదిక)లో ఈ వివరాలను పొందుపరిచారు. ఏలూరు, బందరురోడ్డు కారిడార్లలో కిలోమీటరుకు ఒకటి చొప్పున ఏర్పాటుచేయనున్న 24 మెట్రో స్టేషన్లలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక రైలు వచ్చేలా ప్రణాళిక రూపొందించారు. రోడ్డుకు 14 నుంచి 17 మీటర్ల ఎత్తులో ఉండే కారిడార్ స్టేషన్లకు చేరుకునేందుకు లిఫ్టు, ఎస్కలేటర్, స్టెయిర్‌కేస్‌లను ఏర్పాటుచేస్తారు.
బోగీల్లో అత్యాధునిక సదుపాయాలు
మెట్రో రైలు బోగీల్లో అత్యాధునిక సదుపాయాలు ఉంటాయి. ఏసీ, సౌకర్యవంతమైన సీట్లు ఏర్పాటు చేస్తారు. స్టేషన్ రాగానే తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. రాబోయే స్టేషన్ ఎంత దూరంలో ఉంది, దగ్గరకు వచ్చిందా, లేదా అనే విషయాలను నిరంతరం ఆడియో ద్వారా ప్రయాణికులు వినే సౌకర్యం ఉంటుంది. స్టేషన్ రాగానే బోగి లోపల ఏర్పాటుచేసిన వీడియోలో ఆవరణ అంతా కనిపిస్తుంది. డ్రైవర్ లేకుండా నడిచే ఈ రైళ్లు కమ్యూనికేషన్ వ్యవస్థ ఆధారంగా వాటంతట అవే పనిచేస్తాయి. కారిడార్ మధ్యలో ఎవరైనా వచ్చినా రైలు ఆగిపోతోంది. అడ్డు తొలగగానే మళ్లీ రైలు ముందుకెళుతుంది.
బస్టాండ్‌లో ఆపరేషన్ యూనిట్
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో పండిట్ నెహ్రూ బస్టేషన్ అత్యంత కీలకం కానుంది. ఇక్కడ మెట్రో కారిడార్‌లో భాగంగానే ఐదంతస్తుల అత్యాధునిక భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. బస్టాండ్ సమీపంలోనే తాత్కాలికంగా బహుళ అంతస్తుల పార్కింగ్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తారు. రైల్వేస్టేషన్ వద్ద రెండు మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. అక్కడి నుంచి బీసెంట్‌రోడ్డు వయా అలంకార్ సెంటర్ మీదుగా ఏలూరురోడ్డు వరకు కారిడార్ సాగుతుంది. డీఎంఆర్‌సీ సెప్టెంబర్‌లో డీపీఆర్ రూపకల్పన ప్రారంభించింది. విజయవాడలో 25 మంది డీపీఆర్ కోసం నిరంతరం పనిచేశారు. టోపోగ్రఫీ, ట్రాఫిక్, పర్యావరణ, జియోగ్రాఫిక్ సర్వేల ద్వారా మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన సమస్త సమాచారాన్ని తెలుసుకున్నారు. అనుకున్న గడువులోపే డీపీఆర్‌ను ప్రభుత్వానికి సమర్పించేందుకు డీఎంఆర్‌సీ సిద్ధమైంది.
బస్టాండ్ టూ నిడమానూరు 20 నిమిషాల్లోనే..!
Published Tue, Mar 31 2015 12:34 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
Advertisement
Advertisement