నడిపిస్తున్నది కాంగ్రెస్ హైకమాండే...
Published Sat, Aug 10 2013 1:51 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
మూడున్నరేళ్లుగా తెలంగాణ అంశాన్ని నాన్చుతూ ఈ మధ్య కాలంలో రాష్ట్రం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో కూడా ప్రేక్షక పాత్ర పోషించిన కాంగ్రెస్ అధిష్టానం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నది మొదలు ఇందులో వైఎస్ పేరును టార్గెట్ చేస్తూ పదే పదే ప్రస్తావించింది. గడచిన రెండు సాధారణ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ కాంగ్రెస్‌కు అధికారం రావటానికి కారణమైన వైఎస్‌ను ఆయన మరణించిన కొద్ది రోజుల నుంచే అధికార పార్టీ టార్గెట్ చేస్తూ వస్తోంది. గత మూడున్నరేళ్లుగా తెలంగాణ అంశంపై ఎన్నో నాటకాలాడుతూ వచ్చిన కాంగ్రెస్ చివరకు ఆ విషయంలోనూ వైఎస్ పేరునే తెరమీదకు తేవటం వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందన్న విషయం కాంగ్రెస్, టీడీపీ నేతలందరికీ తెలిసిన విషయమే.
తెలంగాణకు అనుకూలంగా ఆ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 41 మంది సంతకాలతో కూడిన లేఖపై వైఎస్ సంతకం చేశారంటూ.. తెలంగాణకు ఆయనే కారణమన్నట్లు సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న రోజు దిగ్విజయ్ చెప్పారు. సీడబ్ల్యూసీ భేటీ జరగటానికి ముందు చంద్రబాబు ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడారని హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది. అంతకుముందే సీఎం కిరణ్ ఢిల్లీ వెళ్లి కోర్ కమిటీ ముందు హాజరుకావటం, సోనియాగాంధీని కలుసుకోవటం జరిగింది. అప్పటి నుంచి ఏ రోజూ పల్లెత్తు మాట మాట్లాడని ఈ నాయకులు.. సీమాంధ్ర ప్రజల్లో ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావటం, అక్కడ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటంతో హైకమాండ్ ఆదేశానుసారం వైఎస్‌ను టార్గెట్ చేస్తూ కొత్త పల్లవి అందుకున్నారు. వీరితో పాటు ఆ రెండు పార్టీల్లోని వందిమాగధులు సైతం అదే మాట అందుకున్నారు.
వైఎస్ వల్ల తెలంగాణ రాలేదని, తెలంగాణకు ఆయనకు ఏ సంబంధం లేదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో పాటు పలువురు ఎంపీలు, సీనియర్ నాయకులు చెప్పారు. వైఎస్ వల్లే తెలంగాణ వస్తుందని ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు అంగీకరించటం లేదు. అదే సమయంలో వైఎస్ వల్లే ఇదంతా జరిగిందని సీమాంధ్రలో విస్తృతంగా ప్రచారం చేయాలంటూ గత పది రోజులుగా తెరవెనుక ఉండి చంద్రబాబు పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీలు మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ వైఎస్‌ను తెరపైకి తెస్తున్నారు. ఇలా విభజన నిర్ణయానికి ప్రత్యక్ష, పరోక్ష సాక్షులుగా ఉన్న కిరణ్, చంద్రబాబులు ఇప్పుడు ఒకవైపు వైఎస్‌ను టార్గెట్ చేస్తూ.. మరోవైపు సమస్యలు పరిష్కరించకుండా విభజన ఏమిటంటూ మాట్లాడటం ద్వారా.. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో ప్రజలను గందరగోళంలో పడేసి వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న రాజకీయ ఎత్తుగడతో ముందుకు పోతున్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతోంది.
Advertisement
Advertisement