ఎంవీఎస్ నాగిరెడ్డి
వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి ఆరోపణ
వరి, పత్తికి కేవలం రూ.50 మద్దతు ధర పెంచడం దారుణం
సాక్షి, విజయవాడ బ్యూరో: పాలకుల నిర్లక్ష్యంతో రాష్ట్రంలో ఈ ఏడాది వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆరోపించారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవాల్సిన సర్కారు అలక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. సక్రమంగా రుణాలు ఇవ్వకపోవటం, మాఫీకాక పోవటం, అధిక వడ్డీరేట్లు, బ్యాంకు డిఫాల్టర్‌గా మారటం, రుణాలు రెన్యువల్‌కాక రైతులు సంక్షోభంలో చిక్కుకున్నారని చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో వర్షపాతంలేక కరువు కరాళ నృత్యం చేస్తుంటే ఉత్తరాంధ్రను తుపాను కుదిపేసిందన్నారు. దైన్యంలో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికి పరిమితమైందని మండిపడ్డారు.
సీఎం నియోజకవర్గంలో సర్వే చేయించుకోండి
రుణమాఫీతో రైతులు పండుగ చేసుకుంటున్నారని చెబుతున్న చంద్రబాబు ఆయన సొంత నియోజకవర్గంలో ఎంత మంది రైతులు రుణాలు తీసుకున్నారు, వారికి ఎంత రుణం మాఫీ అయిందో సర్వే చేయిస్తే వాస్తవాలు తెలుస్తాయని నాగిరెడ్డి హితవు పలికారు. రుణాలు కట్టొద్దని చెప్పిన చంద్రబాబు తీరు వల్ల రైతులు బీమా పొందే అర్హతను కూడా కోల్పోయి అధిక వడ్డీలు చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. గతేడాది బ్యాంకుల ద్వారా రూ.49,774 కోట్లు రుణాలు ఇవ్వగా, ఈ ఏడాది రూ.57 వేల కోట్లు రుణప్రణాళికను రూపొందించి కేవలం రూ.7,263 కోట్లు మాత్రమే ఇచ్చారని నాగిరెడ్డి చెప్పారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారిన పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ఈ ఏడాది వేరుశెనగ మినహా అన్ని పంటలు సాగు తగ్గడం ఆందోళన కల్గిస్తున్న అంశమని నాగిరెడ్డి పేర్కొన్నారు. వరి పది శాతం, చిరు ధాన్యాలు 42 శాతం, పప్పు ధాన్యాలు 32 శాతం, నూనె గింజలు 33 శాతం సాగు తగ్గిందని వివరించారు. ఇంత సంక్షోభంలోను వరి, పత్తికి కేవలం రూ.50 మాత్రమే మద్దతు ధర పెంచటం దారుణమన్నారు. లెవీని 75 నుంచి 25 శాతానికి కుదించడంతో ధాన్యం ధరపై ప్రభావం పడిందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ పాల్గొన్నారు.