- వైఎస్సార్ సీపీ జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థి తాతినేని పద్మావతి
- గుడ్లవల్లేరు, ఉయ్యూరు, కలిదిండి మండలాల్లో ప్రచారం
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిని తాతినేని పద్మావతి అన్నారు. రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు జరిగే గుడివాడ రెవెన్యూ డివి జన్లలోని గుడ్లవల్లేరు మండలం పెంజండ్ర, ఉయ్యూరు మండలం కాటూరు, కలిదిండి మండలం పెదలంక, మూలలంక, భాస్కరరావుపేట తదితర గ్రామాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, పార్టీ నాయకులతో కలిసి పద్మావతి బుధవారం ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నెలకు రూ.100 మాత్రమే విద్యుత్ బిల్లు వసూలు చేస్తామన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని, రైతులను ఆదుకునేందుకు స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తామని వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు తప్పక అమలవుతాయని పేర్కొన్నారు.
గుడ్లవల్లేరు మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు అల్లూరి శిరీష, బి.శ్రీసంధ్య, ఉయ్యూరులో మండలంలో పార్టీ పెనమలూరు నియోజకవర్గ కన్వీనర్ పడమట సురేష్‌బాబు, జెడ్పీటీసీ అభ్యర్థి వల్లే శ్రీనివాసరావు, కలిదిండి మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థి మోకా లక్ష్మి పాల్గొన్నారు. కైకలూరులో జెడ్పీటీసీ అభ్యర్థి మీగడ చంద్రావతి, నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కైకలూరులో ర్యాలీ నిర్వహించి ఓట్లు అభ్యర్థిం చారు. ముదినేపల్లిలో జెడ్పీటీసీ అభ్యర్థి మోతుకూరి స్వర్ణలక్ష్మి, మండవల్లి జెడ్పీటీసీ అభ్యర్థి ఎం.నాంచారమ్మ, పార్టీ నాయకులు పలువురు ప్రచారం నిర్వహించారు.
ఆగిరిపల్లిలో తోట చంద్రశేఖర్ ప్రచారం
ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కన్వీనరు తోట చంద్రశేఖర్ ఆగిరిపల్లిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త మేకా ప్రతాప్‌అప్పారావు అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్నారు. గంపలగూడెం మండలంలో తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త రక్షణనిధి ప్రచారం నిర్వహించారు.
రెడ్డిగూడెం మండలంలో కోనేరు ప్రచారం
మండలంలోని నాగులూరు, తాడిగూడెం, బూరుగగూడెం, రంగాపురం, రెడ్డిగూడెం, అన్నేరావుపేట, సీతారామపురం, మద్దులపర్వ, శ్రీరామపురం,ముచ్చనపల్లి గ్రామాల్లో వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరుఫున పార్టీ విజ యవాడ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ కోనేరు రాజేంద్రప్రసాద్ బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఈ గ్రామాల్లో మోటారుసైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 1600 కిలో మీటర్ల పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజల కష్టాలను తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, పూర్తిస్థాయిలో అమలు చేశారని గుర్తుచేశారు. ఆ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయగల సమర్థుడు జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని అన్నారు. పార్టీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ మాట్లాడుతూ అతి త్వరలో రాష్ట్రంలో రాజన్న రాజ్యం వస్తుందని, పేదల కష్టాలు తీరుతాయని అన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి ఎంపీటీసీ, జెట్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోనేరు, జోగి కోరారు.