కొడవలూరు మండలంలోని నార్త్‌రాజుపాళెం నివాసి పోలిశెట్టి పద్మమ్మ కుమార్తె హారికకు చదువంటే ప్రాణం. ఇటీవల పదో తరగతిలో పదికి 8.3 పాయింట్లు సాధించింది. భవిష్యత్‌పై ఎన్నో కలలు కంటూ ఇంటర్‌లో చేరాలని భావించింది. భర్త చనిపోయి కుటుంబం గడవడమే కష్టమైన పద్మమ్మకూ కూతురిని చదివించాలనే ఆశ ఉన్నా ఆర్థికలేమి అడ్డంకిగా మారింది. ‘అమ్మా నిన్ను చదివించాలనే కోరిక నాకూ ఉంది.
కాని చదువంటే మాటలు కాదు..డబ్బుతో పని. మనదగ్గర డబ్బులేకుండా నిన్ను ఎలా చదివించాలి’ అని తన నిస్సహాయతను వ్యక్తం చేసింది అమ్మ పద్మమ్మ. చదువులేని జీవితం వృథా అని కాబోలు ఆ బిడ్డ సైదాపురం మండలం చాగణంలో మేనత్తగారి ఇంట్లో బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది.
సైదాపురం, న్యూస్‌లైన్: కొడవలూరు మండలంలోని నార్త్‌రాజుపాళెం నివాసి పోలిశెట్టి పద్మ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. కొంతకాలం కిందట పద్మమ్మ భర్త చనిపోయారు. పద్మమ్మకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె హారిక రాజుపాళెం లో చదివి ఇటీవల పదో తరగతి 8.3 పాయింట్లు సాధించింది. ‘అమ్మా నేను ఇంటర్‌లో చేరుతా. పెద్ద చదువులు చదువుకుంటా’ అని తల్లిని ప్రాథేయపడింది హారిక.
‘నాన్న చనిపోయాడు కదమ్మా. నీవు చదువుకునేందుకు మన దగ్గర డబ్బులేదు. ఇక చదువు మా నేయి’ అని బాధను దిగమింగుకుని బిడ్డకు తల్లి సర్ది చెప్పింది. చదువును ప్రాణంగా ప్రేమించే హారిక మనసును తల్లి మాటలు మార్చలేకపోయాయి. సైదాపురం మండలంలోని చాగణంలో ఉన్న మేనత్త రాజేశ్వరమ్మ దగ్గరికి వెళుతున్నానని చెప్పి సోమవారం అమ్మకు వీడ్కోలు చెప్పింది. మేనత్తగారింటికి వచ్చిన హారిక దిగులుగానే ఉండింది. అనుక్షణం తానిక చదువుకు దూరంగా ఉండాలనే ఆలోచన హృదయాన్ని కలచివేసింది.
చదువులేని బతుకు ఎందుకని జీవితంపై విరక్తితో మంగళవారం రాత్రి మేనత్త ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న హారికను రాపూరు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. నెల్లూరులో చికిత్స పొందుతూ బుధవారం ఆ చదువుల బిడ్డ తుదిశ్వాస విడిచింది. ఎస్‌ఐ సందీప్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం పూర్తి చేయించి బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
అమ్మా వెళుతున్నా..
అమ్మా వెళుతున్నా అంటూ హారిక తన తల్లితో అన్న చివరిమాటలు. శవమై బిడ్డ ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబం ఆర్థిక పరిస్థితే హారిక మృతికి కారణమని గ్రామస్తులు తెలిపారు.
చదువులేని బతుకు వద్దమ్మా..
Published Thu, May 29 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM
Advertisement