అసెంబ్లీని వెంటనే రద్దు చేయండి
హైదరాబాద్ : సహచర మంత్రుల ఆమోదం లేని బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టే అర్హత మంత్రి ఆనం రాంనారాయణరెడ్డికి లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. సభ వాయిదా అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అసెంబ్లీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక బడ్జెట్ పెట్టుకుంటామని ఈటెల పేర్కొన్నారు. తెలంగాణ పాలించే హక్కు ఈ సభకు లేదని ఆయన అన్నారు. సీఎం సీమాంధ్ర పక్షపాతి అని ఆయనకు రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదన్నారు.
సీమాంధ్ర పక్షపాతులైన కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబునాయుడు అడుగు జాడల్లో స్పీకర్ నడుస్తున్నారని మండిపడ్డారు. తాము నిరసన తెలుపుతామన్నా...స్పీకర్ తమకు అవకాశం ఇవ్వలేదన్నారు. సభకు రాకుండా తెలంగాణను అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు ఎక్కడెక్కడో తిరుగుతున్నారని ఈటెల ధ్వజమెత్తారు. బీఏసీలో కూడా తమ నిరసన కొనసాగుతుందని ఆయన తెలిపారు.