కరీంనగర్, న్యూస్‌లైన్ : తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పేందుకే జాగృతి ఆధ్వర్యంలో ఏడు సంవత్సరాలుగా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. మంగళవారం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన బంగారు బతుకమ్మ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
జాగృతి జిల్లా కన్వీనర్ బాలసంకుల అనంతరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రపంచంలో ఎక్కడా లేవని, బతుకమ్మ, దసరా, దీపావళి, పీరీల పండుగ, హోలి లాంటి పండుగల్లో ఇంటిల్లిపాది ఆడపడుచులంతా పాల్గొని చేసుకునే సంస్కృతీ తెలంగాణదని అన్నారు. సీమాంధ్రలో ఒక్క సంక్రాంతి పండుగను మాత్రమే ఘనంగా నిర్వహించుకుంటారని, పండుగల ప్రాముఖ్యత వారికి తెలియదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగాక సంస్కృతీ సాంప్రదాయలకు పెద్దపీట వేసేలా రాష్ట్ర పునర్నిర్మాణంలో జాగృతి ప్రముఖపాత్ర పోషిస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి నల్లికుట్లోడని, సీమాంధ్రలో జరిగే ఉద్యమం ఆయన సృష్టించిందేనని మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి వెల్లడించడం సీఎం ఎంతటి ప్రమాదకారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎన్టీఆర్ హయాంలో తెలంగాణలోని భూములు అమ్మి ఢిల్లీలో ఏపీ భవన్‌ను నిర్మించారని, తెలంగాణ ఆస్తులనమ్మి నిర్మించిన ఆ తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా చంద్రబాబు దీక్షకు పూనడం అనైతికమని, వెంటనే ఏపీ భవన్ ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు.
బంగారు బతుకమ్మ వేడుకల విజయవంతానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేసిన కృషి అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ జి.వివేక్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు రవీందర్‌సింగ్, తెలంగాణ జాగృతి ప్రోగ్రాం కమిటీ రాష్ట్ర కన్వీనర్ తానిపర్తి తిరుపతిరావు, జిల్లా అధికారప్రతినిధి జాడి శ్రీనివాస్, యువజన, విద్యార్థి, మహిళా, ఆరోగ్య విభాగాల కన్వీనర్లు వంగల శ్రీనివాస్, పసుల చరణ్, శ్రీనివాస్‌కర్ణ, జవ్వాజి విమల, బుక్‌క్లబ్ రాష్ట్ర కన్వీనర్ నంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతిని చాటేందుకే..
Published Wed, Oct 9 2013 3:58 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement
Advertisement