సాక్షి, కడప: రాయలసీమలో 2.88 లక్షల హెక్టార్లలో వరి సాగవుతోంది. ఏటా 46.24 లక్షల క్వింటాళ్ల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. గ త రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది పెట్టుబడి వ్యయం ఎకరానికి 5-6 వేల రూపాయల వరకూ పెరిగింది. ఖరీఫ్‌లో ఎకరానికి సగటున దిగుబడి 20 క్వింటాళ్లుగా వ్యవసాయాధికారులు లెక్కిస్తారు. ఈ మేరకు పెరిగిన మద్దతుతో ఎకరానికి 26, 200 రూపాయలు వస్తుంది. ప్రస్తుతం పెట్టుబడి ఎకరాకు రూ.20 వేల వరకూ ఖర్చవుతోంది. ఈ లెక్కన ఎకరానికి సగటున 6 వేల రూపాయలు రైతులకు లాభం వస్తోంది. ఇదంతా పంటబాగా పండితేనే. నష్టమొచ్చినా, దిగుబడి తగ్గినా రైతుకు మిగిలేది నష్టమే.
ప్చ్..ఏం లాభమొస్తాదో..
ప్రస్తుతం ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో వరిసాగుపై రైతులు ఆసక్తి చూపారు. గతేడాది వర్షాభావం వల్ల పంట లేకపోవడంతో ఈ ఏడాది వరికి మంచి ధర ఉంటుందని రైతులు ఆశగా ఉన్నారు. అయితే ప్రస్తుతం సీమలో కొత్త ధాన్యం పుట్టి(8బస్తాలు) 9,500 రూపాయలకు మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు.
ప్రస్తుతం దోమపోటు విపరీతంగా ఉండటంతో ఒకవేళ పంట బాగా పండితే ఎకరాకు 3 పుట్ల ధాన్యం వస్తోంది. ఈ లెక్కన 28,500 రూపాయలు రైతులకు అందుతోంది. పెట్టుబడి పోను రైతుకు రూ. 8 వేల వరకు మిగులుతోంది. అయితే చాలాచోట్ల పంట ఆశాజనకంగా లేదు. దీంతో ప్రస్తుతం ఉన్న గిట్టుబాటుతో నష్టం వచ్చే అవకాశమే ఎక్కువ.
రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులు బుట్టదాఖలు
క్వింటాలు ధాన్యానికి 2,811 రూపాయలు చెల్లించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. అయితే 1345 రూపాయలు ఏ గ్రేడ్ ధర నిర్ణయించడం కంటితుడుపు చర్య. దీన్నిబట్టే రైతుల సంక్షేమంపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదనేది స్పష్టమవుతోంది. పైగా రాష్ట్రం నుంచి పదిమందికిపైగా కేంద్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరి ఉత్పత్తిలో దేశంలోనే మన రాష్ట్రం రెండోస్థానంలో ఉంది. అయినప్పటికీ మంత్రులు రైతుకు అండగా నిలిచి ‘మద్దతు’ ఇప్పించలేకపోయారు.
ఏం గిట్టుబాటో..!
Published Tue, Nov 5 2013 4:02 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement