పిఠాపురంలో టెలిఫోన్ ఎక్సే్ఛంజ్‌లో కాలిపోయిన ఇంటర్‌నెట్ పరికరాలు
తూర్పుగోదావరి, పిఠాపురం: పిఠాపురంలోని బీఎస్‌ఎన్‌ఎల్ టెలిఫోన్ ఎక్సే్ఛంజ్ కార్యాలయంలో మంగళవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో టెక్నికల్ టెర్మినల్ కాలి బూడిదైంది. ఇంటర్ నెట్ కేబుల్స్ ఇతర పరికరాలు కాలిపోవడంతో సుమారు రూ.రెండు కోట్లకు పైగా ఆస్తినష్టం సంభవించింది. నియోజకవర్గంలో బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు అందించే ముఖ్య కార్యాలయంలో జరిగిన ఈ అగ్నిప్రమాదంతో ఇంటర్‌నెట్ సేవలు, సెల్‌వన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇంటర్ నెట్ సేవలు ఆగిపోవడంతో పిఠాపురం నియోజకవర్గంలో వివిధ బ్యాంకుల్లో లావాదేవీలు నిలిచి పోవడంతో ఇటు బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులతో పాటు బ్యాంకు ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఎక్సే్ఛంజ్ పరిధిలో ఉన్న సుమారు పది వేల సెల్‌వన్ కనెక్షన్లు, వెయ్యికి పైగా ఇంటర్‌నెట్ కనెక్షన్లు ఆగిపోయాయి. సుమారు నాలుగు గంటల అనంతరం బీఎస్‌ఎన్‌ఎల్ సేవలను తాత్కాలికంగా పునరుద్ధరించడంతో వినియోగదారులు ఊపిరిపీల్చుకున్నారు. పిఠాపురం పట్టణంతో పాటు, గొల్లప్రోలు, కొత్తపల్లి, పిఠాపురం మండలాల్లో సెల్‌ఫోన్లు మూగబోవడంతో వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టెలికం ఏడీఈ గౌరీ శంకర్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వినియోగదారులకు ఇబ్బంది లేకుండా సేవల పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నామని విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల కార్యాలయంలో ఏసీలు కాలిపోయి తద్వారా కేబుల్స్ పరికరాలు కాలిపోయినట్టు ఆయన తెలిపారు.
ఫైర్ సేఫ్టీ ఏమైనట్టు?
సాధారణంగా టెలిఫోన్ ఎక్సే్ఛంజ్‌లో రూ.కోట్ల విలువైనవి పరికరాలు ఉన్నా ఫైర్‌సేఫ్టీకి ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో ఫైర్ జరిగిన వెంటనే వాటిని అదుపు చేసే ప్రయత్నం చేయక కార్యాలయంలోని అన్నీ కాలిబూడిదయ్యాయని స్థానికులు చెబుతున్నారు.
ఆ సమయంలో ఎవరూ లేరా?
ప్రమాద సమయంలో కార్యాలయంలో ఎవరూ లేరని ఉదయం మామూలు సమయానికి డ్యూటీలకు వచ్చిన సిబ్బంది తలుపులు తీసి చూడగా ప్రమాదం జరిగినట్టు తెలిసిందని స్థానికులు చెబుతున్నారు. 24 గంటలూ పనిచేయాల్సిన కార్యాలయంలో ఏ ఒక్కరూ లేకుండా తాళాలు వేసి వెళ్లిపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment