లక్ష్మీప్రియను హతమార్చింది మేనమామే..
*ఐదేళ్ల చిన్నారి హత్య
*తిరుచానూరులో విషాదం
*పోలీస్‌స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన
అభం శుభం తెలియని ఆ చిన్నారి పాలిట మామే కాలయముడయ్యాడు. మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకుని కానరాని లోకాలకు పంపాడు. కర్కశంగా నీళ్లలో ముంచేసి ప్రాణాలు తీసేశాడు. ఈ ఘటన సోమవారం తిరుచానూరులో కలకలాన్ని సృష్టించింది. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. బంధువుల రోదనలు మిన్నంటాయి. బంగారంలాంటి బిడ్డ ప్రాణాలు తీసిన రాక్షసుడ్ని చంపేయాలంటూ ఆందోళనకు దిగారు..
తిరుచానూరు: ఐదేళ్ల చిన్నారి లక్ష్మీప్రియను వరుసకు మేనమామ హత్య చేయడం తిరుచానూరులో విషాదం నెలకొంది. తిరుచానూరు ఈతమాకుల వీధిలో నివాసముంటున్న పెంచల్‌రెడ్డి, మల్లీశ్వరి దంపతులకు లక్ష్మీప్రియ(5) ఒక్కటే కుమార్తె. స్థానిక వైష్ణవి విద్యాలయంలో యూకేజీ చదువుతోంది. ప్రతి రోజులానే సోమవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో స్కూల్ వ్యానులో నుంచి లక్ష్మీప్రియతో పాటు ఇద్దరు పిల్లలు ఇంటి సమీపంలోని రేణిగుంట రోడ్డులో దిగారు.
అదే సమయంలో అక్కడున్న ఓ వ్యక్తి అమ్మ భజనగుడివీధిలోని పెద్దమ్మ ఇంట్లో ఉందని చెప్పి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. ఆ విషయాన్ని అక్కడున్న వారు మల్లీశ్వరికి చెప్పారు. పాపను తీసుకెళ్లిన వ్యక్తి దాదాపు నలభై ఏళ్ల వయసు కలిగి, నల్లగా, పొట్టిగా ఉన్నాడని, ఎరుపు రంగు టీషర్టు ధరించి ఉన్నాడని పాపతో పాటు బస్సు దిగిన లక్ష్మీప్రియ అక్క కొడుకులు జయసూర్య, యోగానంద తెలిపారు.
దీంతో పాపానాయుడుపేటలోని వరుసకు అన్న అయిన శ్రీనివాసులురెడ్డే పాపను తీసుకెళ్లాడని మల్లీశ్వరి తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హుటాహుటిన ఈస్ట్ డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, సీఐ సురేంద్రనాయుడు, ఎస్‌ఐలు మల్లేష్‌యాదవ్, చిరంజీవి, చిన్నారులు జయసూర్య, యోగానందను వెంటబెట్టుకుని పాపానాయుడుపేటకు వెళ్లారు. మార్గమధ్యంలో వికృతమాలకు వెళ్లేదారి వద్ద శ్రీనివాసులు రెడ్డి కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్ట్ వెనుక వికృతమాల గ్రామానికి వెళ్లే రోడ్డులో ఉన్న నీటి గుంతలో పాపను ముంచి హత్య చేసి, గుంత తీసి పూడ్చిపెట్టినట్టు అతను అంగీకరించాడు. అప్పటికే చీకటి కావడంతో మంగళవారం ఉదయం రెవెన్యూ అధికారుల సమక్షంలో చిన్నారి మృతదేహాన్ని వెలికి తీయనున్నారు.
పోలీస్‌స్టేషన్ వద్ద బంధువుల ఆందోళన
సోమవారం రాత్రి లక్ష్మీప్రియ హత్య వార్త వెలుగు చూడ్డంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున తిరుచానూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితుడుని చంపేయాలని డిమాండ్ చేశారు. లేదా నిందితుడి కాళ్లు చేతులు తీసేయాలని, మరొకరు ఇలాంటి దారుణానికి పాల్పడకుండా ఉంటారని చెప్పారు. నిందితుడిని తమకు అప్పగించాల్సిందే అని పట్టుబట్టారు. డీఎస్పీ సర్ది చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తానని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు.
డబ్బు తగాదాలే హత్యకు కారణం..?
చిన్నారి హత్య వెనుక గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గతంలో లక్ష్మీప్రియ నాన్న పెంచల్‌రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి కొంత నగదు అప్పుగా ఇచ్చాడు.